జీవన రమణీయం-183

3
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

అతనో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్, పాకీజా సినిమాకి అతను పాస్‌లు ఇస్తేనే చూశాం. అతనికి రెండు ఇళ్ళు అనీ, పెద్ద పెళ్ళాం పిల్లల్ని ఇక్కడ పెట్టి, తను రెండవ భార్య దగ్గర వుంటాడనీ మాకు తెలీదు! చాలా పద్ధతిగా తెల్ల లాల్చీ వేసుకునొచ్చి మాట్లాడాడు! మా అన్నయ్యని కూడా హరిపురం కాలనీలో అద్దెకున్న టెనంట్ చాలా ఇబ్బంది పెట్టాడు, రెంట్ ఇయ్యకా, ఖాళీ చెయ్యకా… బిజినెస్ అన్నాడు. ఏం బిజినెస్? అని వాడు అడగలేదు, అతను చెప్పలేదు… తర్వాత తెలిసింది పాత కాయితాలూ, డబ్బా సీసాలు కొని అమ్మే రద్దీ బిజినెస్ అని… “ఎలా నమ్మావురా?” అని నేను మా అన్నయ్యని అడిగితే, “తెల్ల లాల్చీ, పైజమా వేసుకుని, బొట్టు పెట్టుకుని, పద్ధతిగా కనిపించాడు” అన్నాడు! మా అమ్మమ్మ ఇల్లు అద్దెకిచ్చినప్పుడు మా అన్నయ్యకే పదేళ్ళు! నాకు రెండేళ్ళు! మా ఇద్దరికీ ఎనిమిదేళ్ళ తేడా వయసులో. ఆ ఇంటి కోసం మా అన్నయ్య, పాతికేళ్ళు వచ్చాకా రౌడీలతో, గూండాలతో కూడా భేటీ పడాల్సి వచ్చింది! నాకు చిన్నప్పటి జ్ఞాపకాలలో, అమ్మమ్మ చెయ్యి పట్టుకుని, బస్ దిగి ప్రాగా టూల్స్ దగ్గర ఆ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళడం, ఆ ఇంటి ఇల్లాలు తలుపైనా తీయకుండా, మంచినీళ్ళు అయినా అడగకుండా, ఎవరో అడుక్కునే వాళ్ళొస్తే మాట్లాడినట్లు అమర్యాదగా మాట్లాడడం స్మృతిపథంలో వుంది. ‘ఇల్లు’ అనే కథ రాశాను. ఆ కథ వేసినప్పుడు ఆంధ్రప్రభకి ఎడిటర్‍గా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, సబ్ ఎడిటర్‍గా శ్రీరమణ గారూ వున్నారు. ఎంతో బావుందని కథని ప్రశంసించారు! ఎందుకంటే ఆ కథ నా అనుభవం కాబట్టి, బాగుంటుంది! నేను ఆ పదేళ్ళ వయసులో, వారికి మనసులో ఎన్నో పిల్ల శాపాలు పెట్టేదాన్ని! ప్రాగా టూల్స్ గ్రిల్స్ సందుల్లోంచి మందార పూల మొగ్గలు కోసుకురావడం, గోళీ సోడా తాగడం అమ్మమ్మతో నా అనుభవాలు!

అమ్మమ్మ ఇల్లు

అలాగే చార్మినార్ దగ్గర పూసలగల్లీలో వున్న పెన్షన్ ఆఫీస్‌కి కూడా నేను అమ్మమ్మతో, బస్ దిగి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని! నేను తొలి చూలు గర్భవతిగా వున్నప్పుడు కూడా ఆటోలో అమ్మమ్మని పెన్షన్ ఆఫీస్‍కు తీసుకెళ్ళాను! చిన్నప్పుడు ఆవిడ తీసికెళ్ళేది… పెద్దయ్యాకా నేను తీసుకెళ్ళేదాన్ని! అక్కడ గల్లీల్లో నడుస్తూ వుంటే, స్వీట్స్ మీద వేసే ముచ్చిత రేకులా సన్నగా వెండిని చితక్కొట్టి, పలుచని కాయితంలా చెయ్యడం చూసేదాన్ని. గాజుల మీద రాళ్ళు పొదగడం, చీరల మీద రంగులూ, బొమ్మలూ అద్దకం చూసేదాన్ని! అసంఖ్యాకమైన మాంసం దుకాణాల ముందుగా, అమ్మమ్మ నడుస్తూ వుంటే, నా మనసుకు బాధగా వుండేది! పెన్షన్ కొచ్చిన మిగతా వృద్ధులు డబ్బాలో రొట్టే, అన్నం తెచ్చుకుని తిని, అక్కడే తమ పేరు పిలిచేదాకా పడుకునేవారు! అమ్మమ్మ మడి అని కాదు గానీ, బయట ఏమీ తినేది కాదు! టీ కూడా తాగేది కాదు! ఆ క్లర్క్‌లలో ఒకరిద్దరు అమ్మమ్మతో “చాయ్ పీ లీజీయే అమ్మా” అని టీ పంపిస్తే, నన్ను తాగమనేది! అందరితో ప్రేమగా మాట్లాడేది!

ఆవిడ జీవితం ఒక మహా గ్రంథం… ఆవిడకి మడి ఏమిటి? భర్త చాగల్లులో హరిజనాశ్రమం పెట్టి, హరిజనులకు వండి వడ్డించమంటే అలాగే చేసింది! ఆదివాసీ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి, అతన్ని సంస్కరించే ప్రయత్నం చేస్తే అందుకూ సహకరించింది! పిల్లల్నీ తననీ భర్త చెట్టుకింద పెట్టి, ఇల్లు చూసొస్తానని వెళ్ళి అరెస్ట్ అయితే, ఆ పిల్లలని పెట్టుకుని అలాగే సంచార జీవితం గడిపింది! తండ్రి ఇచ్చిన ఆస్తీ, బంగారం దేశానికి అర్పించినా, సంతోషించిందే తప్ప అలిగి పోట్లాడలేదు! తల్లీ తండ్రీ తల మోదుకుని చెప్పారు… “వాడు వెళ్తే వెళ్ళాడు లక్నోకి పాదయాత్ర చేస్తూ… నువ్వు చంటి బిడ్డతో వెళ్ళొద్దు, దారిలో బోలెడు అడవులు… పక్కన ఎనిమిది మంది కుర్రాళ్లు… ఆడ తోడు లేదు…” అని! ఆమె సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంది. ఆ సీతమ్మ రాముడి వెంట అడవులకి వెళ్ళడానికి నారచీరలు ధరిస్తే, ఈవిడ ఆ పిన్న వయసులో ఖద్దరు కట్టి, ముక్కువీ, చెవులవీ, మెడలోవీ బంగారం వలిచి తల్లికిచ్చింది! మళ్ళీ ఎప్పుడూ పెట్టుకోలేదు! ఎన్ని అవస్థలు పడిందో ఆ అడవి మార్గాన, నడిచి చంటిబిడ్డతో వెళ్ళేడప్పుడు! స్త్రీలకి ఎన్నిఇబ్బందులుంటాయో, నేను చెప్పనక్కర లేదు! అవన్నీ గొప్ప సాహసాలుగా ఎంచి, అడవిలో బండ మీద చింతకాయలూ, వుప్పూ, మిరపకాయలూ నూరి, ‘సవారీ’ పచ్చడి చేసి, కుండలో అన్నం వండి, సాటి వాళ్ళ కడుపులు నింపిందా మహా తల్లి! తాతయ్య ఏ పదవీ ఆశించకుండా, స్వాతంత్ర్య సమరయోధుడిగా పోరాటం చేసినా, ఆ పాదయాత్రలో పాల్గొనవాళ్ళు ఎం.ఎల్.ఏ.లూ, మేయర్లూ అయి బాగుపడ్డారు! అందులో జీ. కోటయ్య గారు అనే ఎం.ఎల్.ఎ. గారు మా ఇంటికి వచ్చి “రమణమ్మ గారూ! ఎన్ని తిన్నా ఆ సవారీ పచ్చడి రుచి మరిచిపోలేకుండా వున్నానండీ” అన్నారు. అడవిలో చింతకాయ పచ్చడీ అన్నం అమృతమేగా! గరుకు నేల మీదైనా, మైళ్ళ మైళ్ళు నడిచాకా, నడుం వాలిస్తే, ఆ నేల హంస తూలికా తల్పమేగా! అవే సుఖాలు అనుకుంది. భర్త పక్కన నడుస్తుంటే స్వర్గం అనుకుంది! మొగుడు నగలు చేయించలేదనీ, సినిమాకి తీసుకువెళ్ళలేదని ఏడ్చి సాధించే ఆడవాళ్ళూ, అప్పుడూ వుండేవారు. ఇప్పటి వాళ్ళకి ఆవిడ అనుభవించిన జీవితంలో మాధుర్యం అర్థం కాదు కూడా! ఆవిడ ఆ నిమిషాన ఇంకా ఆంధ్రా దాటకముందే తండ్రి పంపిన పర్వతనేని పార్వతీశం గారితో, బిడ్డ నెత్తుకుని వెనక్కి వెళ్ళిపోయి వుంటే, ఈ కష్టాలన్నీ వుండేవి కావు! తహసీల్దారు ఆఫీస్‍లో పని చేస్తున్న తండ్రి దర్జాగా చూసుకునేవాడు. తనలాగే ఇంకో మేనత్త కొడుకు వడ్డాది శేషగిరిని పెళ్ళి చేసుకున్న తన చెల్లి సత్యవతి ఒంటెడు నగలతో, దానవాయిపేటలో పెద్ద ఇంట్లో వుండేది! తనూ బావనే పెళ్ళి చేసుకుంది, స్ఫురద్రూపీ, పెద్ద చదువులు చదివిన వాడూ, అని సూరంపూడి శ్రీహరిరావుని! కానీ ఆవిడ రాత ఈ విధంగా వుంది!

శ్రీమతి సూరంపూడి వెంకట రమణమ్మ

పెన్షన్ విషయంలో కాని, ఈ ఇంటి కేసు విషయంలో కానీ అమ్మమ్మ చాలా బాధలు పడింది. అప్పుడు కూడా నవ్వుతూ, “మీ తాత ఆత్మ అడ్డుపడుతోంది… ఆయనకీ పాడు గవర్నమెంట్ సొమ్ము ఇష్టం వుండదు” అనేది! నిజమేనేమో… ఈ ఇంటి కేసు మా తాతగారి ఫ్రెండ్, జైల్లో స్వాతంత్ర సమరయోధుడిగా కలిసి వున్న ముదిగొండ రాజలింగం గారు చూసేవారు! ఆయన సలహా మీదే అమ్మా, అమ్మమ్మా రాజ్‍భవన్‌కి ప్రెసిడెంట్ వరాహగిరి వెంకట గిరి వచ్చారని తెలిసి వెళ్ళి కలిసి వచ్చారు! గిరి గారు తాతయ్యకి ‘ఏరా’ అనుకునే ఫ్రెండ్‌ట! ఆ తర్వాత మా పెద్దమ్మ దుర్గా సావిత్రి, ఆవేశంలో తాతయ్య పోలికలు అచ్చు గుద్దించుకు పుట్టింది. ఆవిడే ఈ పాదయాత్రలో వీళ్ళ చంకలో వున్న చంటి బిడ్డ! ఆవిడ ఇందిరాగాంధీ గారికి, అమ్మమ్మ చేత తన స్వంత ఇంటిని, అద్దెకున్నవాడు కాజేస్తున్న వైనం, ఆడపిల్లలు తప్ప లేని తన నిరాధారత్వం తెలియజేస్తూ ఓ ఉత్తరం రాయించింది! చాలా రోజులు జవాబు కోసం ఎదురు చూసి చివరికి ఆశ వదులుకున్నారు, ప్రధానమంత్రి దాకా మన లేఖలు వెళ్తాయా అని! నేను ఇంటర్‍మీడియట్‌లో వుండగా ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి “ఇధర్ రమణమ్మా జీ కౌన్ హై? హమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సే ఆయే జీ!” అన్నారు. అమ్మమ్మ తిరగలిలో బియ్యం రవ్వ విసుర్తోంది. లేచి వాళ్ళని కూర్చోమని “ఇందిరాగాంధీ జీ బిజాయే ఆప్ కో?” అని అడిగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here