జీవన రమణీయం-184

0
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]”హా[/dropcap] మాజీ” అన్నారు. ఆవిడ్ని అడిగి కేసు పూర్వాపరాలు అన్నీ కాయితం మీద రాసుకుని వెళ్ళారు. అయినా చాలా ఏళ్ళే పట్టింది. ఆ శీరా సత్యనారాయణ ఎక్కడున్నాడో కాని, అమ్మమ్మ ఆ దిగులుతో మంచం పట్టింది. కృంగి కృశించిపోయింది. పెరాల్సిస్ వచ్చింది గుంతకల్ వెళ్ళినప్పుడు. అక్కడ రెండో పెద్దమ్మ కొడుకు హనుమంతు అన్నయ్య రైల్వేలో ఉద్యోగం వచ్చి వెళ్తే, వాడికి వంట చేసి పెట్టడానికి వెళ్ళింది. ఆవిడ డ్యూటీ అది. వాణక్కకి ఆర్‌టిసిలో వుద్యోగం వచ్చి విజయవాడ వెళ్తే, అక్క పెళ్ళి కాని పిల్ల, తనతో బాటు వెళ్ళి, అయ్యంకి వెంకట రమణయ్య గారి ఇంట్లో అద్దెకుండి, దాన్ని చూసుకునేది! ఈ అయ్యంకి వెంకట రమణయ్య గారు తాతయ్యకి ఫ్రెండ్! జైలర్ – పిచ్చివాడు అని తాతయ్యని కడలూర్ మెంటల్ జైల్‍లో పెడ్తే, ఆ జైల్లోనే ‘Essays on Human Life’ అనే పుస్తకం రాసి, కోర్టులో ఆ జైలర్ మీద పరువు నష్టం దావా వేసి గెలిచారు. అప్పుడు ఆ జైలర్‌కి 1200 రూపాయలు పరువు నష్టం జరిమానా పడితే, అవి తాతయ్యకి ఇప్పించారు. వాటితో అయ్యంకి వెంకట రమణయ్య గారి ప్రెస్‍లో ఆ పుస్తకం ‘Essays on Human Life’ అచ్చు వేయించారు! వెంకట రమణయ్య గారు ‘సరస్వతీ సామ్రాజ్యం’ అనే పత్రిక నడిపేవారు అప్పట్లో. ఆ అయ్యంకి వెంకట రమణయ్య గారి దగ్గరకి వెళ్ళి అమ్మమ్మ “మనవరాలితో వచ్చాను, ఇల్లు కావాలి” అంటే, అప్పటికప్పుడు రెండు గదులు ఖాళీ చేయించి అద్దెకిచ్చారు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను. అప్పటికే ఆయన చాలా వృద్ధులయిపోయారు. సత్యవతి అనే ఆవిడా, ఆవిడ కూతురు శేషూ ఆయన్ని చూసుకునేవారు.

అయ్యంకి వెంకట రమణయ్య గారు
రచయిత్రి చిన్నప్పుడు

ఆ తరువాత మా డాక్టర్ అన్నయ్య రాముకి కొన్ని రోజులు వండి పెట్టింది. సరే, మా పెళ్ళి అయ్యాకా, నా దగ్గర చాలా కాలం వుంది. నా ఇద్దరు పిల్లలూ ఆవిడ దగ్గర పెరిగారు. 1992లో మొత్తానికి మా అన్నయ్య చాలా కష్టపడ్డాకా, ఇల్లు అమ్మమ్మ కొచ్చింది. కొన్నాళ్ళు మా అమ్మా, అమ్మమ్మా, మా రెండవ పెద్దమ్మ కూతురు విజ్జక్క కొడుకు శ్రీధర్ – ఆ కల్పనా టాకీస్ వెనకాల ఇంట్లో, ఆవిడ తృప్తి తీరా, ఆవిడ్ని పెట్టుకుని కొన్నాళ్ళు వున్నారు, పోతుకూచి సాంబశివరావు గారి ఇంటి పక్కన. సాహితీ ప్రియులకి – ఆయన రచయిత అనీ, లాయర్ అనీ, పాలిటిక్స్‌లో కూడా ఒకటి రెండు సార్లు ‘రెండాకుల’ గుర్తుతో పోటీ చేసారనీ నేను చెప్పనవసరం లేదు.

అమ్మమ్మ వృద్ధురాలు అవడం వలన ఆ ఇల్లు అమ్మి, ముగ్గురు కూతుళ్ళకీ సరిసమానంగా డబ్బు పంచేసింది! త్యాగధనురాలూ, నిస్వార్థపరురాలూ ఆవిడ. తనింకా బ్రతికే వున్నా, ఒక్క రూపాయి కూడా తనకి వుంచుకోలేదు. మా పెద్దమ్మలిద్దరికీ ముగ్గురేసి కూతుళ్ళు అవడం వలన ఆ లక్షా పంచి ఇచ్చారు అక్కలకీ, నాకు మొత్తం 75 వేలు ఇచ్చారు! అన్నయ్య చాలా కష్టపడ్డాడు, మిగతా పెద్దమ్మ కొడుకులు పట్టించుకోకపోయినా, అందుకే వాడికో పాతికవేలు ఇచ్చింది అమ్మమ్మ.

రచయిత్రి పెద్ద పెద్దమ్మ దుర్గా సావిత్రీదేవితో రచయిత్రి కజిన్స్

ఆ డబ్బుతో మేం కాకతీయ నగర్, నేరేడ్‍మెట్ దగ్గరున్న కాలనీకొచ్చి, నారాయణ రావు గారూ, వ్యాఘ్రేశ్వరరావు గారు అనే వాళ్ళు ఫ్లాట్స్ వేసి అమ్ముతుంటే 325 గజాలు కొన్నాం. అప్పుడు గజం 150 రూపాయలు. ఇప్పుడు ఎన్ని వేలు పలుకుతుందో గజం చెప్పలేను… 45వేల రూపాయల పైనే పలుకుతుందట!

మేం నర్సిమ్మారెడ్డి నగర్‍లో వున్న ఇంటికి వాళ్ళీద్దరూ వస్తే, న్యూస్ పేపర్‍లో డబ్బులు పొట్లం కట్టి ఇస్తూ… “ఇది అమ్మమ్మ కష్టార్జితం… ఏమీ అన్యాయం జరగదు కదండీ?” అని అడిగాను. అప్పటికే లింక్ డాక్యుమెంట్స్ అడగాలి తెలీక కీసర దగ్గర మేం 300 గజాలు, అమ్మ 300 గజాలు కొంటే అవి, ఓనర్ వేరే వాడికి కూడా అమ్మి, అవి కబ్జా అయిపోయాయి. నారాయణ రావు గారు నవ్వి “మా అమ్మాయి లాంటి దానివి, కాలనీలో కొచ్చి ఇల్లు కట్టుకుని చల్లగా వుంటావు. ఏమీ వివాదాలు లేని ల్యాండ్” అని చెప్పారు.

రచయిత్రి కజిన్స్ – శాంతి, ఉమ, పెద్దక్క లక్ష్మి

అట్లాగే ఆయన నోటి చలవ వల్ల, ఓ ఇల్లు రెండిళ్ళు అయి, మా పిల్లలు ఆ కాలనీలో ఆడుకుంటూ పెరిగి, ప్రయోజకులు అయి, మేం ఎన్నో శుభకార్యాలు ఈ ఇంట్లో చేశాం. కానీ, అమ్మమ్మ మాత్రం ఇంటికి క్యూరింగ్ చేసేది. మేస్త్రీ దగ్గర పిల్లలకి మధ్యాహ్నం టీ పెట్టి ఇచ్చేది! వాళ్ళ కోసం ఏదో ఒక పచ్చడి చేసేది! మేస్త్రీల భార్యలు అన్నం పెట్టి, చాలీచాలని చారు నీళ్ళో, కూరో వేసి పంపించేవారు! వాళ్ళకి సరిపోయేది కాదు పాపం. నేను స్కూల్ టీచర్‍గా పని చేస్తే మా పిల్లల్ని చూసుకొంది. ఇంక చాలా పెద్దది అయిపోయాకా, ఈ ఊరు చివర కాలనీలో నేనూ, అమ్మా, ఇద్దరం ఆడవాళ్ళమే… మా ఆయన జహీరాబాద్‌లో వుండేవారు వుద్యోగ రీత్యా. ఈ అడవిలో వైద్య సహాయం లేదని, నేనే కొత్తపేట దగ్గర హుడా కాంప్లెక్స్‌లో వున్న మా అన్నయ్య దగ్గరకి అమ్మమ్మనీ, అమ్మనీ పంపేసాను. కానీ అదే నేను చేసిన ఘోరాపరాధం! నా దగ్గర వుంటే ఇంకా కొన్నాళ్ళు, ‘ఇది నా డబ్బుతో కొన్న స్థలం… నాది’ అనే భావనతో ఆవిడ ఆర్యోగంగా వుండేదేమో! అమ్మమ్మ పోయాకా, ఆ గిల్టీనెస్ నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే వుంటుంది! రాత్రుళ్ళు అమ్మమ్మ ఇంట్లో తిరుగుతున్నట్లు కలలొస్తాయి. పెద్దవాళ్ళని నాలా జారవిడుచుకోకండి… పోతే మళ్ళీ రారు! వాళ్ళు వుంటేనే ఇంటికి నిండుదనం… శుభం… శాంతీ!

ఇప్పుడు కూడా అమ్మ అన్నయ్య దగ్గరా, నా దగ్గరా వుంటూ వుంటుంది. మధ్య మధ్యలో షిర్డీ వెళ్ళిపోయి నెలలు నెలలు బాబా సేవ చేసుకుంటూ, వండుకు తింటూ వుంటుంది! మా అత్తగారూ మావగారూ ఇద్దరూ మా ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. ఆడపడుచూ మా దగ్గరే వుంటారు. మా వారికి అక్క. అమ్మా, మా ఆడబిడ్డా ఇద్దరూ కలిసినప్పుడు చెప్పుకునే కబుర్లూ, ముచ్చట్లూ నేను కౌముదిలో ‘కాలం దాటని కబుర్లు’లో రాస్తుంటాను. ఇంటికి పెద్దవాళ్ళుంటే అదో సందడి! పూచిక పుల్ల పోనివ్వరు మా ఆడబిడ్డ… అన్నీ దానం చేసి నిశ్చింతగా వుంటుంది మా అమ్మ. కానీ ఇద్దరికీ మంచి స్నేహం. ఆవిడా అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తుంది! ఇద్దరూ టీవీలో ‘మేరే సాయీ’ చూస్తూ, బాబా పూజలు చేసుకుంటూ ఆనందంగా వుంటారు.

అమ్మకీ అమ్మమ్మ పోలికొచ్చింది. రెండవ పెద్దమ్మ వున్నప్పుడు, ఆవిడ ఒకత్తీ వుంది, అనారోగ్యం అని, అక్కడ వుండి అక్కకి వండిపెట్టేది. నాకు ఆపరేషన్‌లు జరిగినప్పుడు, నాకు చేసి పెట్టింది. కోవిడ్ కాలంలో 2020 మొత్తం నా భర్త అనారోగ్యంతో వుంటే, మాతో బాటు వుండి ఆయనకీ చేసింది. ఇప్పుడు మా ఆడబిడ్డకి ఆపరేషన్ అంటే వచ్చి ఆవిడకీ చేస్తోంది… ఇప్పుడు అమ్మ వయసు 82 సంవత్సరాలు! ఎవరికి ఆపదొచ్చినా, సాయం అవసరమైనా, ‘నేనున్నాను’ అంటూ వెళ్ళిపోతుంది. ఇప్పటికీ వంట అద్భుతంగా చేస్తుంది. ఆవిడ కోసం షిర్డీ గుడిలో పని చేసే సెక్యూరిటీ గార్డులూ, మహిళలూ, పురుషులూ కూడా “మాజీ దివాలీ సే మందిర్ ఖోల్‌రే… ఆప్ ఆయీయే” అంటూ ఫోన్లు చేస్తున్నారు. కొందరు ఎడ్రస్ వెతుక్కుంటూ వచ్చి చూసి వెళ్ళారు కూడా! నా స్నేహితులు కూడా షిర్డీలో అమ్మ వున్నప్పుడు చూసి వచ్చారు! నీహారికా కన్నన్ అనే ఫ్యాషన్ డిజైనర్ నన్ను ‘అమ్మా’ అని పిలుస్తుంది! తను వెళ్ళి అమ్మ గురించి అతుల్ అనే సెక్యూరిటీ గార్డు అని ఎంక్వైరీ చేసి, ఈవిడ నెంబర్ చెప్పి డయల్ చెయ్యమనగానే, అతను డయల్ చేస్తే, అతని ఫోన్‍లో ‘మేరే అమ్మా’ అని సేవ్ అయి వుందట! నాకు చెప్పి నీహారిక ఎంతో ఆశ్చర్యపోయింది! అలా వుంటుంది అమ్మతో అందరికీ ఆత్మీయత.

షిర్ఢీలో సెక్యూరిటీ గార్డ్ అతుల్, రచయిత్రి అమ్మ, నీహారిక

ఆవిడని అడవిలో వదిలేస్తే అక్కడున్న మనుషుల భాష నేర్చుకుని స్నేహం చేసేస్తుంది. ఇప్పటికీ మోడర్న్‌గా కొత్త విషయాలూ, కొత్త పద్ధతులూ ఇష్టపడ్తుంది. టెక్నాలజీ నేర్చుకుని వాట్సప్ చాటింగ్ చేస్తూ, యూట్యూబ్‌తో కాలక్షేపం చేస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here