జీవన రమణీయం-185

0
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మా[/dropcap] తాతగారు సూరంపూడి శ్రీహరిరావు గారు మొండి మనిషి! ఆయన మనోనిబ్బరం గురించి, జైల్లో 40 రోజుల నిరాహార దీక్ష చేయడం గురించి, ఖాదీ బట్టతోనే, చొక్కాలు నిక్కర్లూ ఇవ్వాలని జైల్లో – ఇవన్నీ ‘లీడర్’ పుస్తకంలో రాసాను.

రాయని వుదంతాలు కోకొల్లలు. ఒకసారి మా అమ్మ చిన్నతనంలో, మా తాతగారూ, ఆయన తోడి అల్లుడు వడ్డాది శేషగిరిరావు గారూ – సుద్ద కొండలు చూపిద్దాం పిల్లలకి అని, చిన్న తాతగారి పిల్లలు మహాదేవ నియోగీ, చంద్రభాబూ, సావిత్రిలనీ, అమ్మనీ, మా శ్రీదేవి పెద్దమ్మనీ తీసుకుని కార్లో, డ్రైవరును పెట్టుకుని వెళ్ళారుట. తిరుగు ప్రయాణంలో చీకటి పడిపోయి, డ్రైవర్‍కి నిద్రొచ్చేసినా, వీళ్ళకి చెప్పకుండా అలాగే నడుపుతుండడంతో కన్ను అంటుకుని, దారి కనబడక, చెట్టుకి ఢీ కొట్టి, కారు లోయలోకి పడిపోయిందట! మేజర్ ఏక్సిడెంట్, డ్రైవర్ ఆన్‌ ది స్పాట్ పోయాడు. అందుకే కంట్రోల్ తప్పి లోయలో పడింది కారు. ఆ ఏక్సిడెంట్ గురించి చిన్నతనంలో నేను విని వున్నది రాస్తున్నాను. ఇంతకన్నా వివరంగా నాకు తెలీదు.

కార్లో ముందు కూర్చున్న మా తాతగారు విసిరేసినట్లు కింద పడిపోతే, ఆయన తొడ ఎముక బయటకి పొడుచుకు వచ్చేసిందట!

ఆయనకు స్పృహ తప్పుతుండగా – “పాపాయ్… చిన్నా.. బాబూ…” అంటూ పిల్లల కోసం అరిచారుట. వెనుక కూర్చున్న చిన్న తాతగారు, దూరంగానైనా సురక్షితంగా చెట్ల ఆకుల్లో, పొదల్లో పడిన పిల్లలని వెదికి తెచ్చి “అన్నయ్యా, పిల్లలు క్షేమం” అని చెప్పాకా, తృప్తిగా చూసి మా తాతగారు తొడ లోంచి బయటకు పొడుచుకు వచ్చిన ఎముకను ఒక్క గుద్దుతో లోపలికి పంపించి, స్పృహ తప్పి వెనక్కి వాలిపోయారుట!

చిన్న తాతగారు డ్రైవరు  మీదొక గుడ్డ కప్పి, అందరిలోకి చిన్నదైన చిన్నపిల్లని భుజాన వేసుకుని, మిగతా పిల్లలకి కథలు చెప్తూ, తొమ్మిది మైళ్ళు నడిపిస్తూ, ఇంటికి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి అయిందట.

ఇంటి తలుపు తట్టితే, అమ్మమ్మ తలుపు తీసి చూస్తే, నిలువెల్లా రక్తం కారుతూ, మరిది కనిపించేసరికి గుండె ఆగినంత పనైందిట! ఆయనకి కారు అద్దాలు, పగిలి, ఒళ్ళంతా గుచ్చుకు పోయాయిట! పిల్లలకీ దెబ్బలు తగిలి, చర్మం డోక్కుపోయి రక్తాలు కారుతున్నా, ఏడవడం లేదుట! అమ్మమ్మతో “వదినా, పిల్లలని తీస్కో… అన్నయ్య బాగానే వున్నాడు. క్షణంలో వస్తా!” అని చిన తాతయ్య వెనక్కి తిరిగి పరిగెత్తి, దగ్గరలోని పోలీస్ స్టేషన్‍కి వెళ్ళి ఏక్సిడెంట్ సంగతి చెప్పి, ఆంబులెన్స్ వెంటనే పంపించారని ధ్రువీకరించుకుని, ఇంటికి తిరిగివచ్చి చాప మీద బోర్లా పడిపోయారుట.

మా అమ్మమ్మ చెల్లెలు సత్యవతి, మా అమ్మ పేరూ అదే, అర్భకురాలూ, పిరికి మనిషి. ఆవిడ ఏడుస్తూ వుంటే, అమ్మమ్మ ఆయన షర్ట్ కత్తెరతో కత్తిరించి, గాజు పెంకులు వెలికి రాకపోతే, నోటితో తీసి, దూది స్పిరిట్‍లో ముంచి గాయాలు శుభ్రపరిచి పసుపు పెట్టిందట. ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్‌కి ఆస్పత్రికి పంపారుట! పిల్లలకి ఒళ్ళు శుభ్రం చేసి, అన్నాలు పెట్టి, నిద్ర పుచ్చి, అప్పుడు అమ్మమ్మ తాతగారి కోసం ఆస్పత్రికి వెళితే, మర్నాడు మధ్యాహ్నం గాని ఆయనకి స్పృహ రాలేదుట! అక్కడ డాక్టరూ, నర్సులూ, “ఎంత మొండి మనిషమ్మా! ఆ ఎముక అప్పుడు లోపలికి వెళ్ళకపోతే, తర్వాత చాలా కష్టం అయ్యేది” అన్నారుట. అంత ఘోరమైన ఏక్సిడెంట్‍లో కూడా నోరు లేని పిల్లలకు ఏమీ కాకపోవడం, తను నిత్యం చేసే రామజపం ఫలితమే అన్నారుట తాతయ్య. చిన తాతయ్య కూడా అంతే మొండి మనిషి! అంతంత ధైర్యాలుండేవి అప్పటి రోజుల్లో. ఇద్దరూ రోజూ వ్యాయాయం, యోగాసనాలు చేసేవారుట.

చిన్నప్పుడు బుగ్గ మీద వేలుతో రచయిత్రి

ఒక క్రమ పద్ధతైన జీవితం అప్పట్లో వుండేది అనుకుంటా. తెల్లవారు ఝాము నాలుగింటికో, ఐదింటికో లేవడం, కాలవకి వెళ్ళి స్నానాదికాలు చేసి, సూర్య నమస్కారాలు చేయడం, నడిచి ఇంటికి రావడం, ఇంట్లో స్నానం చేసినా, కొంత వ్యాయామం, ప్రాణాయామం, తప్పనిసరిగా పద్మాసనం వేసుకుని పూజ చేయడం, జపం చేయడం, ‘మెడిటేషన్’ అని ఇప్పటి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ విధిగా మన పూర్వీకులు అందరూ చేసే పనే అది! ఇక ఇంట్లో ఆడవాళ్ళ వ్యాయామం, తెల్లవారి పిల్లల్ల చద్దన్నాలతో మొదలయితే, మడి కట్టుకుని, లేదా శుచిగా పెద్దవాళ్ళ వంటా, మధ్యాహ్నాలు రవ్వలు విసురుకోవడం, పిండ్లు దంచుకోవడం, సరుకులు పురుగూ, పుట్రా, రాయీ, రవ్వా లేకుండా విసురు కోవడం, ఇల్లు శుభ్రపరుచుకోవడం, నలుగురూ ఇరుగుపొరుగు చేరినా, ఏ చింతకాయ పచ్చడి గింజ ఏరుకుంటునో, వత్తులు చేసుకుంటూనో, వడియాలు, అప్పడాలూ పెట్టుకుంటూనో మాట్లాడుకోవడం; ఎక్కడి కెళ్ళినా నడిచి వెళ్ళడం, పని అమ్మాయిలున్నా, బయట తుడవడం, నీళ్ళు తీసుకురావడం, అంట్లు తోమడం వరకే. ఇంట్లో కడుక్కోవడాలూ, తుడుచుకోవడాలూ వీళ్ళే! అసలు నేను 1947, 48లో మాటలు మాట్లాడ్తున్నాను అనుకోకండి. మా చిన్నతనంలో 1975, 76 వరకూ కూడా ఇళ్ళల్లో ఆడవాళ్ళకి పనులు ఇలాగే వుండేవి! మిక్సీలు, వెట్ గ్రైండర్లూ, నడుం వంగకుండా ఇల్లు తుడుచుకోడానికి మాప్‌లు, బట్టలు ఉతుక్కోడానికి వాషింగ్ మిషన్లూ వుండేవి కావు! ఇప్పుడు పిల్లలు రోబోటిక్ మాప్‌లు కొంటున్నారు. సెట్ చేసేస్తే, ఇల్లంతా తిరుగుతూ, వీళ్ళు ఆఫీసుల్లో వున్నా, అది ఇల్లు శుభ్రం చేసేస్తుందిట! నేను పెళ్ళి కాకముందు ‘మోడరన్ టైమ్స్’ అని చార్లీ చాప్లిన్ సినిమా చూసాను. అందులో ఎంప్లాయీస్ టైం కలిసి రావాలి, అప్పుడు లంచ్ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా, ఆ టైం కూడా ఆఫీస్ పని కోసమే వెచ్చిస్తారని ఆఫీసర్స్, ఒక ఫీడింగ్ మెషిన్ తెప్పిస్తారు. పాపం, చాప్లిన్ నోట్లో మొక్కజొన్న కండె పెడ్తే, అతను నోరు తెరిస్తే చాలు అది గిరగిరా తిరిగిపోతూ వుంటే, దాని వేగంతో పోటీ పడి నమల లేక చాలా అవస్థ పడ్తాడు! ఇంక ఆ మిషిన్ రావడం ఒక్కటే మిగిలింది. వంట చేసే మిషిన్స్ కూడా వచ్చేసాయిట! మనం సాంబార్ అని ఫీడ్ చేసి, ఇన్‌గ్రీడియంట్స్ టేబుల్ మీద పెడ్తే మిషిన్ సాంబార్ చేసేస్తుందట! ‘మోడరన్ టైమ్స్’ అప్పటి సమాజం మీద ఒక సెటైర్ అన్నమాట! చాప్లిన్ అప్పట్లోనే, ‘ది గ్రేట్ డిక్టేటర్’ లాంటి సెటైర్లు ధైర్యంగా చేసాడు. ‘నయా దౌర్’ అనే వైజయంతీ మాలా, దిలీప్ కుమార్ వేసిన సినిమాలో కూడా యంత్రీకరణ ద్వారా, మానవ స్థాయీ భావాలు దెబ్బతింటాయి, ఉపాధి అవకాశాలు తగ్గి కరువు వస్తుంది అని సినిమా తీసారు! ఇప్పటి పరిస్థితులు చూస్తే ఏం అనేవారో? 1936లో అసలు సినిమా అనే బొమ్మలు తెర మీద ఆడడం వల్ల, చాలా విపత్తులు వస్తాయి, మానవాళికి అది అనర్థం అన్న వ్యాసం కూడా వచ్చిందట! మా చిన్నతనంలో మా కుటుంబం, మా తాతగారి స్వాతంత్ర్య పోరాటం వలనా, దేశదిమ్మరితనం వల్లా  హైదరాబాదులో స్థిరపడడం వల్ల హిందీ సినిమాలు చూడడం, అమ్మా, అక్కలూ అంతా హిందీ పాటలు పాడడం ఎక్కువగా వుండేది!

మా రెండవ పెద్దమ్మ కొడుకు గౌతరాజు హనుమంతరావు అనబడే హనుమంతు అన్నయ్య వల్ల నేను ఇంగ్లీషు సినిమాలు నా ఏడవ తరగతి నుండే చూసాను. నాకు మా అన్నయ్య చూపించిన సినిమాలు ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’, ‘సైలెంట్ మూవీ’, ‘ది పింక్ పాంథర్ స్ట్రైక్స్ ఎగైన్’.

మా నాన్నగారు ఉద్యోగ రీత్యా తెలంగాణ రూరల్ ఏరియాస్‍లో వుండేవారు. రాగానే  నన్ను తీసుకెళ్ళి ఆబిడ్స్ తాజ్‍లో మసాల దోశా, బాసుందీ పెట్టించి, తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనే భాషా భేదాలు లేకుండా సినిమాలు చూపించేవారని ఆల్‌రెడీ చెప్పానుగా! మా అమ్మ కూడా పిల్లల కోడిలా, మా పెద్దమ్మ పిల్లల్నీ, నన్నూ, అన్నయ్యని ఆదివారం వస్తే సినిమాకి తీసుకెళ్ళి చూపించేది. ఇంకా అతి అనిపించే విషయం, మా పనిమనిషి శ్యామలమ్మతో నేను బాలాజీ టాకీస్‌లో సినిమాలకి వెళ్ళేదాన్ని. పావు కిలో పల్లీలు, అర్ధ రూపాయి టికెట్లూ, ఇద్దరికీ కలిపి రూపాయి. మార్నింగ్ షో సినిమా. గులేబకావళి కథ, పేదరాశి పెద్దమ్మ కథలు, జ్వాలాద్వీప రహస్యం, కీలుగుర్రం, పిడుగు రాముడు, ఇలా నాదో టేస్ట్ వుండేది!

రచయిత్రి తల్లిదండ్రులు

జానపదాలు, తర్వాత హనుమంతు అన్నయ్య వల్ల పౌరాణికాలు, అవీ ఒక ఆర్డర్‍లో చూపించేవాడు. మొదట శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణార్జున యుద్ధం, నర్తనశాల, మాయాబజార్, తర్వాత శ్రీకృష్ణావతారం… ఇలా చూస్తే అన్నగారు, ఎన్.టి.ఆర్. దయ వల్ల మహాభారతం, భాగవతం అన్నీ కవర్ అవుతాయి అని చూపెట్టేవాడు! చరిత్ర కూడా – అనార్కలీ, తెనాలి రామకృష్ణా, మహామంత్రి తిమ్మరుసూ, చాణక్య చంద్రగుప్తా చూసే తెలుసుకున్నాం.  అందుకే ఉపనందులూ, ఉప పాండవులూ, శ్రీకృష్ణుడి సంతతీ, ఉషా అనిరుద్ధుడూ, ప్రద్యుమ్నుడూ, పరీక్షిత్తూ, జనమేజయుడూ…. అందరి గురించీ చిన్నప్పుడే తెలుసు!

జానపదాల పిచ్చి ఎంతలా వుండేదంటే, అన్నగారి సింహబలుడూ, మాయా మశ్చీంద్రా, రాజపుత్ర రహస్యం, ఆ తర్వాత కూడా విఠలాచార్య తీసిన జగన్మోహిని, గంధర్వకన్యా వరకూ చూసాను! తర్వాత కూడా నిన్నటి బాహుబలి దాకా అడపదడపా వస్తూనే వుంటాయి. కానీ చిన్నప్పుడు మహాబలుడూ, సువర్ణసుందరీ ఇచ్చిన ‘థ్రిల్’ ఇవ్వలేదు! మనం వదిలేసినా, ఇంగ్లీషు వాడు ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’ అనీ, ‘గ్లేడియేటర్’ అనీ, ‘హారీ పాటర్’ అనీ వదలకుండా తీస్తునే వున్నారు! వాటిని వాళ్ళూ ఫాంటసీ మూవీస్ అంటారు, మనం జానపదాలని అద్భుతమైన సినిమాలు చూసాం! ‘చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయనీ నమ్మడానికి ఎంతో బావుందీ’ అనే పాట నాకెంతో ఇష్టం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here