జీవన రమణీయం-2

    3
    7

    [box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

    అప్పలస్వామి గారింట్లో వుండగా చాలా తమాషా సంగతులు జరిగేవి. అక్కడ ఒక పిచ్చావిడ వుండేది. రోజూ ఇంటి ముందు తిరుగుతూ కనిపించేది. ఒక రోజు అమాంతం నా వెనకాల మా కిచెన్‌లో వుంది. గబుక్కున వెనక్కి తిరిగితే, గుచ్చి గుచ్చి చూస్తూ ఈవిడ! ఏం చెయ్యాలో తెలీక కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి. ఒకసారి ఇంటావిడ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి – “బొట్టు పెడితే వెళ్ళిపోతుందమ్మా” అని.  ఆవిడ మీద నుండే ధైర్యంగా కుంకుమ భరిణ అందుకుని బొట్టు పెట్టాను. గిరుకున్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ‘అమ్మయ్య’ అనుకున్నాను. ఆ రోజు శుక్రవారం. తర్వాత శ్రీ మహాలక్ష్మే వచ్చినట్టుగా ఫీల్ అయ్యాను.

    చిన్న చిన్న ఆనందాలకి పెద్దగా డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదనడానికి, మా పెళ్ళయిన ఆ తొలి రోజులే ఉదాహరణలు.

    ప్రియా, ప్రసాద్ పక్క వీధిలోనే ఆనంద స్వరూప్ అని ఒక ఆర్.టి.సి. డిపో మేనేజర్ గారింట్లో అద్దెకుండేవారు. అయినా ఒకరింట్లో ఒకళ్ళం నైట్ స్టేలు చేసేవాళ్ళం. కార్డ్స్ ఆడుకునేవాళ్ళం. కలిసి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. ఇంటి వెనకే రామచంద్ర థియేటర్. నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. మిరపకాయ బజ్జీలు కొనుక్కు తిని, నీళ్ళు తాగి పడుకునే వాళ్ళం. ఏం తిన్నా అరిగిపోయే వయసు.

    కాలేజి నుంచి నేనూ, ఉమా ఎక్కడెక్కడో థియేటర్లకి సినిమాలకి వెళ్ళేవాళ్ళం. తెలుగు, హిందీ లేకపోతే తమిళం, మలయాళం కూడా చూసేవాళ్ళం. ఓసారి ‘గడుసు పిండం’ట! రామచంద్రలో చూశాం. సుమన్ హీరో. ఎంత చెత్త సినిమానో. అప్పట్లో సినిమా ఒక్కటేగా ఎంటర్‌టైన్‌మెంట్. ఇంట్లో వుంటే రేడియో వినడం. రేడియోలో ఏ టైమ్‌కి ఏ ప్రోగ్రామ్ వస్తుందో కంఠతా వచ్చేసేది! మేం ఇంకా టీ.వీ, గ్యాస్ స్టౌ, ఫ్రిజ్ లాంటి ఆధునిక సౌకర్యాలేం సమకూర్చుకోలేదు అప్పటికి! కష్టపడి ఒక్కొక్కటీ కొనుక్కోవడం, సమకూర్చుకోడం… ఎంత బావుంటుందో!

    ప్యాసింజర్ బండిలో జనరల్ క్లాసులో ప్రయాణం చేసి, తర్వాత రిజర్వేషన్ సెకండ్ క్లాసులో ప్రయాణం చేసి, అప్పుడు మొదటిసారి ఫ్లయిట్ ఎక్కితే వుండే థ్రిల్… పుట్టగానే ఇప్పట్లా విమానాల్లో తిరుగుతున్న పిల్లలకి వుంటుందా?

    నాకు గ్యాస్ కనెక్షన్ ఇప్పించడానికి అమ్మ చాలా కష్టపడాల్సొచ్చింది. అమ్మ ఉద్యోగం చేస్తూ వుండడం వలన, కామధేనువులా ఆదుకునేది! ఇప్పటికీ అమ్మ కల్పవృక్షం నాకు!

    డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో కొచ్చాను. పైగా వేవిళ్ళు. అత్తగారిల్లు కొత్త ప్రదేశం! చాలా కష్టపడ్డాను. ఆచారం ఎక్కువా!

    మా అత్తగారు ఇల్లు అద్దంలా వుంచేవారు. ఆవిడ గుంటూరు జరీ చీరలు ఉతికి మడత పెడ్తే ఇస్త్రీ అవసరం వుండేది కాదు! వంట పొందిగ్గా, రుచిగా చేసేవారు. కాని చిక్కల్లా నా నుండీ అంతే నైపుణ్యం ఆశించేవారు! నాకేమో అన్నీ వచ్చు కానీ ఏదీ ఆవిడ ఆశించిన స్థాయిలో రాదు! నేను టీ పెట్టినా, వంట చేసినా, తర్వాత ఆ స్టౌ, పరిసరాలు పొందిగ్గా, శుభ్రంగా సర్దలేదని ఆవిడ సాధించేవారు. నేను బాత్‌రూమ్‌లో తలంటు పోసుకుని వచ్చేసేదాన్ని. అక్కడ కుంకుడు కాయ పిప్పీ, సున్నిపిండి అలాగే వుండేవి! ‘అవి నేను కడగలా’ అని నాతో అనకుండా, ఈయన్ని పిలిచి చూపించేవారావిడ!

    “నువ్వు చేసుకున్న పెళ్ళం, నేను తెచ్చిన కోడలు కాదు!” అని తెలిసేట్లు చేసేవారు. మా అయన “పని నేర్చుకో” అనేవారు. నేను ‘చేస్తున్నాగా’ అనేదాన్ని. ఆయన వివరించాలని చూస్తె గొడవయ్యేది.

    మావగారితో స్నేహం కుదిరింది. ఆయన సిటీ సెంట్రల్ లైబ్రరీ వాళ్ళు అమ్మేస్తుంటే, మొత్తం పుస్తకాలు సెకండ్‌హ్యాండ్‌లో కొనుక్కొచ్చారు. నేను ‘వేయి పడగలు’ కడుపుతో వున్నప్పుడే చదివాను. సాక్షి పానుగంటి వ్యాసాలు, శరత్ సాహిత్యం, అడవి బాపిరాజూ, వైతాళికులూ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రీ బట్టీ పట్టి సాహిత్యం మీద ఆసక్తి అలవర్చుకున్నాను.

    కాలేజీలో మా ‘ఉమ’కి స్పోర్ట్స్, నాకు లిటరేచర్, లైబ్రరీ. పెద్దగా క్లాసులకి వెళ్ళింది లేదు! అయినా ఎకనామిక్స్‌లో ఫస్ట్ వచ్చేదాన్ని! గిరిజా మేడం అలా చదువు చెప్పేవారు. ఇప్పుడలాంటి లెక్చరర్స్ వున్నారా అని అనుమానం! ఆవిడ తీరు మలయమారుతం.. పలుకు అమృతం. ఒకప్పుడు మా కాలనీలో వుండి వెళ్ళారుట. అమ్మ ‘కాఫిపొడి లక్ష్మీనారాయణ గారి అమ్మాయి’ అని చెప్పేవారు. మా అన్నయ్య ఫ్రెండ్ నానీ “గిరిజ ఇలా అంది… ఇలా చేసింది…” అని ఏకవచన సంబోధన చేస్తే నాకు తప్పుగా అనిపించేది.

    ఓసారి మా పిల్లలు పెద్దయ్యాక ఆవిడ దగ్గర నుండి ఫోన్ వస్తే, నేనిక్కడ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. మా పిల్లలు “మీ మేడంకి కనిపిస్తుందా?” అని వెక్కిరించారు. ఆ గౌరవం అలాంటింది! అందుకే ఇంకా తలచుకుంటున్నాం.

    ***

    గర్భవతిగా వున్నప్పుడు పడిన కష్టాల్లో తప్పకుండా చెప్పాల్సినవి సిటీబస్సులు! ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్‌లో 91 ఎక్కి మారేడ్‌పల్లి వెళ్ళాలి! ప్రతీరోజు ఆ బస్సు నిండు గర్భిణిలాగే వుండేది! కండక్టర్ గజఈతగాడిలా లోపలికి ఈదుకుంటూ వెళ్ళి ‘టికెట్… టికెట్’ అనేవాడు! అసలే గర్భిణిని! ఒంటికాలి మీద నిలబడి, ముందున్న రాడ్ కడుపులో గుచ్చుకుపోతుంటే, బ్యాగ్‌లోంచి పాస్ తీసి చూపించాలి! ఎంత కష్టమో ఓసారి ఆలోచించండి… నేనే కాదు… ఆఫీసులకి వెళ్ళేవాళ్ళలోనూ చాలామంది గర్భవతులుండేవారు… చంకల్లో బిడ్డలతో తల్లులు, కండక్టర్‌కి పర్స్ తెరిచి డబ్బులెలా ఇవ్వాలో తెలీక నిస్సహాయంగా చూసేవారు! ఆ దారుణమైన స్థితిలో ‘ఈవ్ టీజర్లు’ అమ్మాయిలనీ అక్కడా ఇక్కడా తగిలి, కావాలనే మీద పడే వెధవలు కొందరూ! డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినప్పుడల్లా చచ్చి బతికినంత పని! ఇలా రోజూ ప్రయాణం చేసి కాలేజీకి వెళ్ళాల్సొచ్చేది! ఎవరికీ ఆటోల్లో తిరిగేటంత ‘శక్తి’ వుండేది కాదు.

    కానీ అవన్నీ కష్టాలు అనుకునే వయసు కాదది!. ఇప్పుడు డ్రైవర్ రాకపోతే, ఊబర్‌లో వెళ్ళడానికి కూడా అసౌకర్యం అనిపిస్తోంది. ఏ.సీ. కంపార్ట్‌మెంట్‌లో రిజర్వేషన్ అయిన కూపేలో కూడా ‘అబ్బా! ఫ్లయిట్ ఎక్కల్సింది’ అనిపిస్తుంది. వెన్ను నొప్పి వల్ల ఫ్లయిట్ కూడా బిజినెస్ క్లాస్ తప్ప పనికిరావడం లేదు! సుఖమా నీకు అంతెక్కడా?

    కాలేజీలో నాదైన ప్రపంచంలో నేను సాహిత్యం చదువుకుంటూ, అర్థం కాకపోతే తెలుగు మేడం కిళాంబి జ్యోతిర్మయి గారి దగ్గరకి పరిగెడ్తూ అత్యంతానందంలో వుండేదాన్ని! నాకు కంపెనీగా మా ‘ఉమ’ ఓ నెల ముందే నెల తప్పింది! కాలేజీలో కొత్తగా సుబ్బారావు అనే కామర్స్ లెక్చరర్, అంత మంది ఆడ లెక్చరర్స్ మధ్యన ఉద్యోగంలో చేరాడు. అతను ఇన్విజిలేషన్‌కి వస్తే, మేం కడుపుతో వుండి పేపర్ అడగడానికి లేచి నిలబడ్డా తెగ ఇబ్బంది పడి, “మీరు లేవకండి ప్లీజ్!” అనేవాడు. ఇంక నాకూ ఉమకీ ఆట పట్టించడానికి అది మంచి ఛాన్స్! మేం పిలవగానే అతను పరిగెత్తుకు రావడం! ఆకతాయితనంగానే ఉండేది మాకు. ఏదీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకునేవాళ్ళం కాదు.

    ఇంట్లో అత్తగారు “కూర తాళింపూ… బట్ట జాడింపు” అంటారు. “నువ్వు బట్టలు ఆరేస్తే అన్నీ మడతలే… నువ్వు కాఫీ పెడ్తే పాలు ఎందుకు పొంగిపోతాయి?” అని సాధిస్తున్నా… మనో విహంగం ఎక్కడో మల్లాది గారి ‘అందమైన జీవితం’లోనో, వీరేంద్ర ‘ఆనందోబ్రహ్మ’లోనూ చిక్కుకునుండేది! అత్తగారు “ఇదిగో అరిశల పాకం చూడు… ఠంగు పాకం…” అనో, “లడ్డూకి ఇంత లేత పాకం చాలు…” అనో, “తొక్కుడు లడ్డూకి జంతిక వేయించి ఇలా మెత్తగా దంచి జల్లెడ పట్టాలి…” అని చెప్పినా బోర్‌గా వుండేది! కాని ఇప్పుడు ఆవిడ నేర్పకపోతే ఎవరు నేర్పేవారూ? కాపురాలు చెయ్యడం నేర్పడానికి కాలేజీలుండవు కదా! పెద్దవాళ్ళే పొదుపు నుండీ, పిల్లల పెంపకం వరకూ అన్నీ నేర్పేవారు అనిపిస్తుంది.

    మా అత్తగారు ప్రయత్నించినా నాకు నేర్పలేకపోయిన అంశం పొదుపూ… ఆర్థిక సంస్కరణలు! ఆవిడ దగ్గరకి ఇరుగుపొరుగులు అందరూ వచ్చి “పిన్నిగారూ ఈ రెండొందలు వుంచండి!” అని దాచుకునేవారు. ఆవిడ ఓ రెండేళ్ళకో ఎప్పుడో “రాజేశ్వరీ ఇదిగో… నీకు రెండు తులాల బంగారం కొన్నాను, నువ్వు దాచుకున్న డబ్బులతో. పండరి దగ్గరకి రా, నల్ల పూసల గొలుసు సెలెక్ట్ చేసుకొందువు గాని!” అంటే రాజేశ్వరి ముఖం విప్పారేది!

    మా అత్తగారికా దర్జా, ఆ దక్షతా ఆవిడ తండ్రి దగ్గర నుండొచ్చాయి. ఒకప్పుడు జమీందారు అంత ఆస్తిపాస్తులున్నవాడు! తల్లి పోయిన ఈ పిల్లని బావమరికి భార్యకి  పెంచమని అప్పగించాదు. ఆవిడ కన్నతల్లిని మరిపించి ఈవిడని పెంచింది! ఆస్తి కోసం ఆడిన నాటకాల వల్ల, ఆవిద స్వంత కొడుక్కి కాకుండా, ఆవిడ మరిది కొడుక్కి పిల్ల నివ్వాల్సివచ్చిందట! మా అత్తగారి తండ్రికి ఇది ఇష్టం లేదు. ఆ కాలంలో ఏవున్నా లేకపోయినా పంతాలూ, పట్టింపులూ చాలా ఎక్కువగా వుండేవి కదా! ఈ పిల్లకి బలవంతంగా ఇష్టం లేని పెళ్ళి చేశారని కోర్టులో వేశారుట! ఈ సుశీల అనే చిన్నపిల్ల, తనకి అత్తవారు నేర్పినట్టుగా ‘నా ఇష్టప్రకారమే ఈ పెళ్ళి చేసుకున్నాను’ అని చెప్పిందట! దాంతో ఆయన కోపించి ఆస్తంతా అనాథాశ్రమానికి రాశారు. పెంపుడు తల్లి ఇచ్చిన రెండెకరాలూ ఈవిడకి చాన్నాళ్ళుండేవిట! కానీ శ్రీమంతుడి బిడ్డ కదా, మాట పడకపోడం… ఆ దర్జా, వుండేవి! మనిషి చాలా అందమైనావిడ.

     (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here