జీవన రమణీయం-29

1
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ’ రెగ్యులర్‌గా చూసేదాన్ని. అసలు అమితాబ్ బచ్చన్‌కి ఎంత ఫ్యాన్‍ని అంటే, “నేను పోయేముందు అమితాబ్ సినిమానే చూస్తూ పోతానండీ” అని మా ఆయనతో ఓసారి చెప్పాను. ఆ అమితాబ్ పిచ్చి ‘దో అవుర్ దో పాంచ్’ నుండీ ఇంటర్మీడియట్‌లో చెలులు జ్యోత్స్నా, సంగీతాలు బాగా ఎక్కించారు నాకు!

అలా ఆ ప్రోగ్రామ్ చూస్తూ లేచి హవాయి చెప్పులు వేసుకుందాం అంటే కాలు రాలేదు. అసలు పాదం పైకి ఎత్తడానికి రాలేదు. నేను అలాగే తిమ్మిరి ఎక్కిందేమో అనుకుంటూ, తలుపు దాకా కాలు ఈడ్చుకుంటూ వెళ్ళి – తలుపు గెడని కాలివేలితో నెట్టడం అలవాటు – అలా చేద్దాం అంతే, అస్సలు రాలేదు! నేను బాత్ రూమ్‌కి వెళ్తే వంగలేకపోయాను… అప్పుడే మా రామూ అన్నయ్యకి ఫోన్ చేసి పరిస్థితి చెప్తే, అంతా విని, “రేపోసారి ఆర్థోపిడీషియన్‌కి చూపించుకుని, నా దగ్గరకి రా… ప్రభాకర్‌కి రమ్మని ఫోన్ చెయ్యి” అన్నాడు. ఆ చివరి మాటకు నాకు  కొద్దిగా సీరియస్ అని అర్థం అయింది. డాక్టర్ శ్యామ్ సుందర్ తన ఆనంద్‌బాగ్ క్లినిక్‌లో టెస్ట్ చేసి ఎమ్.ఆర్.ఐ. తీయించమనీ, ‘మెడికల్ రీఇంబర్స్‌మెంట్ వుందా?’ అనీ అడిగారు. అప్పట్లో ఐదు వేలు చాలా పెద్ద మొత్తం! నేను మా అయనకీ విషయం ఫోన్‌లో చెప్తే, పాపం కంగారుగా జహీరాబాదు నుంచి వచ్చేశారు. “కంగారు పడకు… రామూతో మాట్లాడాను” అన్నారు.  నా కాలు స్పైనల్ కార్డ్ డిసార్డర్ వల్ల పార్షియల్ పెరాల్సిస్‌తో పడిపోవడం మేటర్ అన్నమాట. అయితే విచిత్రం ఏవిటంటే, రచన వాళ్ళు నా కథని సంకలనంలో వేసి, సభ చేస్తుంటే, ఈ కాలు ఈడుస్తూ నేనా సభకి వెళ్ళీ స్టేజ్ ఎక్కలేక అవస్థ పడ్తూ కూడా పురస్కారం అందుకోవడం… ఇప్పటికీ నాకు జోక్‌గా, కొందరికి ఫూలిష్‌గా వుంటుంది! ఆ మరునాడే ఎమ్.ఆర్.ఐ. రిపోర్టు వచ్చింది డా. నాయక్ దగ్గరికి తీసుకెళ్ళాడు రామూ అన్నయ్య.

డాక్టరుగారు నన్ను పేషంట్‌గా చూసి ఆశ్చర్యపోయారు. తరువాత ఎమ్.ఆర్.ఐ. రిపోర్ట్స్ చూసి, “అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి… అందరికీ టో ఫింగర్ మాత్రమే పడిపోతుంది… మీకు కంప్లీట్ లెఫ్ట్ ఫుట్ డ్రాప్ అవడంతో బాటు ఆంకిల్ కూడా డ్రాప్ అయింది” అన్నారు.

“సెంకడ్ సజెషన్ తీసుకుందామా, ఇంకెవరి దగ్గరైనా” అని మావారు అంటే నేనొద్దన్నాను. “అన్నయ్యా, నాయక్ గారు వున్నారు. వాళ్ళు చెప్పాకా ఆగడం ఎందుకు? అన్నాను.

సైకిల్ తొక్కుతున్నట్లు కాలు ఎత్తి వేసేదాన్ని. ఒక్కోసారి చేత్తో ఎత్తి పాదం ముందు కెయ్యాల్సొచ్చేది!

అప్పుడు నా పిల్లలు పెద్దవాడు తొమ్మిదిలో, చిన్నవాడు ఏడులో వున్నారు.

కామినేని ఆస్పత్రిలో డా. నాయక్ గారు శనివారం రిపోర్ట్ వస్తే, సోమవారం నాడు ఆపరేషన్ చేసేశారు. ఆపరేషన్ థియేటర్‌లో వాళ్ళు మంచి పాటలు పెట్టుకుని సరదాగా జోక్‌లు వేసుకుంటూ, అనస్థటిస్ట్ అయిన మా అన్నయ్య నా చెయ్యి పట్టుకుని ధైర్యం చెప్తుండగా, సరదాగా నవ్వుతూ… ‘వన్… టూ… త్రీ…’ అంటుండగా స్పృహ కోల్పోయా!

మళ్ళీ కళ్ళు తెరిచేసరికీ నవ్వుతూ మా అన్నయ్య కనిపించాడు. నేను ఐ.సి.యు.లో వున్నాను.

డాక్టర్ నాయక్ మా వారిని తీసుకొచ్చి చూపించారు. తరువాత డాక్టరు గారు ఎంతో ఆత్మీయంగా, “ఈ సంఘటనంతా నవలలో రాయాలి… మా లాంటి పాఠకుల కోసం… నా అభిమాన రచయిత్రికి సర్జరీ చేయాల్సొస్తుందని అస్సలు అనుకోలేదు!” అంటూ నాకు నోట్లో ఇడ్లీ పెట్టి తినిపించారు!

జరిగేవీ, జరిగినదంతా థ్రిల్‌గా తీసుకోవడం తప్పించి మళ్ళీ కాలు వస్తుందో రాదో లాంటి భయాలుండేవి కావు. అజ్ఞానం ఆనందదాయకం కదా!

నేను ఆస్పత్రిలో వుండగా ఇంకో రచయిత్రి వచ్చి చూసింది. ఆవిడ “మీరింక వీల్ ఛైర్‌కే అంకితం కదా… ఇంక నవలలు రాయలేరుగా? ఎందుకూ పనికిరారుగా?” అంది. నేను మనుషుల స్వభావానికి తెల్లబోయాను.

ఏడు రోజులున్నాను కామినేని ఆస్పత్రిలో. డాక్టరు గారు చాలా బాగా చూసుకున్నారు. ఆ స్నేహం ఈనాటి వరకూ నిలిచే వుంది.

సాహిత్య చర్చలతో ఆయన చేసిన చెకప్‍లూ, ట్రీట్‌మెంట్ నాకెంతో ఆనందాన్నిచ్చేది. ఈ సమయంలో నా ఫ్రెండ్, డైరక్టర్ శివనాగేశ్వరరావు నాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. సహజంగా హాస్య చక్రవర్తి కాబట్టీ, అప్పటికే మనీ, సిసింద్రీ, వన్స్‌మోర్, నాయనమ్మ… లాంటి చాలా హాస్య సినిమాలు తీసాడు కాబట్టీ, నాతో పరిచయం, నా హాస్య గుణం నచ్చి చేసుకుని మంచి మిత్రుడయ్యాడు. నేను డిస్‍చార్జ్ అయినప్పుడు కూడా తన కార్లోనే నెమ్మదిగా, కుదుపు లేకుండా నన్ను ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టాడు.

మా ఆయన నేను పడుకునే రాసుకునే విధంగా శ్లాంటింగ్‌గా వుండే ఒక టేబుల్ నా కడుపు మీద పెట్టి రాసుకునేట్లు చేయించారు. బెడ్ రెస్ట్ త్రీ మంత్స్ అన్నారు. పక్క మీదుండగానే నేను ‘ఆలింగనం’, ‘హద్దులున్నాయి జాగ్రత్త’ నవలలు రాశాను.

శివలెంక కృష్ణప్రసాద్ గారనే ప్రొడ్యూసర్ నాకప్పటికే పరిచయం. వీరేంద్రనాథ్ గారిని తన సినిమాకి పని చెయ్యమంటే, ఆయన ‘నా శిష్యురాలు రాస్తుంది’ అని నా ఎడ్రస్ ఇచ్చి నా దగ్గరికి పంపించారు. అప్పుడు ఆయన ‘ఊయల’ సినిమా కృష్ణారెడ్డిగారితో తీస్తున్నారు.

అప్పటికే ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ లాంటి మంచి సినిమాలు తీశారు. నన్ను “మనం నాగార్జున గారితో సినిమా చేస్తున్నాం…. మణిశంకర్ అనే ఆయన డైరక్టర్” అని తీసుకెళ్ళి మణిశంకర్‌కి పరిచయం చేశారు.

ఈటీవి సుమన్‌గారూ, దర్శకుడు మీర్ గారితో రచయిత్రి

మణిశంకర్ గారు ‘తెనాలి రామ’ లాంటి టీ.వీ. సీరియల్స్ ద్వారా నాకు తెలుసు. చాలా సిట్టింగ్స్ చేశాం. నా రైటింగ్ స్టైల్ ఆయనకి నచ్చింది. నా జీవితంలో నేను గుర్తుంచుకోదగ్గ రెండు గొప్ప సంఘటనలు శివలెంక కృష్ణప్రసాద్ గారి వల్ల కలిగాయి…

ఒకటి నాగార్జున ఇంటికెళ్ళి కథ చెప్పడం. అప్పట్లో మేం ‘కిండర్ గార్టెన్ కాప్’ అనే సినిమా ఆధారంగా తెలుగులో తీద్దాం అని కథ చేశాం.

అక్కినేని నాగేశ్వరరావుగారితో రచయిత్రి

అమల మాకు స్వయంగా జ్యూస్ చేసి ఇచ్చింది. నాగార్జున ఇంట్లో మెత్తని పిల్లి పిల్ల లాంటి ఎల్లో కార్పెట్లు, సోఫాలు నాకు ఎంత నచ్చాయో… తర్వాత నాగేశ్వరరావు గారితో ఆ విషయాలు చెపాను. “నువ్వు ఇంకా చిన్నపిల్లవే!” అని నా తల మీద తట్టారు.

నాగార్జున అప్పుడు బాగానే స్పందించాడు. తరువాత ఈక్వేషన్స్ కుదరలేదు!

తరువాత గొప్ప సంఘటన, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారికి గ్రీన్ పార్క్ హోటల్‌లో కథ చెప్పమని కృష్ణప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం.

నా దగ్గరున్న మంచి చీరల్లో ఒక పాటూరి పట్టుచీర కట్టుకుని, తెలిసిన వాళ్ళందరికీ ‘నేను  బాలూ గారికి కథ చెప్పడానికి వెళ్తున్నాను అహో!’ అని బాకా వూది, 16 నెంబరు బస్సు ఎక్కి స్టేషన్‌లో దిగి, మళ్ళీ 10 ఎక్కి గ్రీన్ పార్క్ హోటల్‍కి వెళ్ళి, ఆయన రూం దగ్గరకెళ్ళి బెల్ ప్రెస్ చేస్తే విఠల్ గారు తలుపు తీశారు.

“నేను బలభద్రపాత్రుని….” అంటూ ఉండగానే బాలూ గారు వెనకనుండి “రావమ్మా రా… మీ కోసమే వెయింటింగ్ ఇక్కడ భవదీయుడు… మా కృష్ణ చాలా చెప్పాడు మీ గురించి…” అన్నారు.

ఆ తరువాత నేను కలలో నడిచినట్లు నడిచాను. ఆయున తన ఆంగరంగిక రూమ్‌లో కూర్చోపెట్టి, బయట ‘do not disturb’ బోర్డు పెట్టి సీరియస్‌గా బాలుడిలా చేతులు కట్టుకుని కూర్చుని కథ విన్నారు. నాకు ‘One fine day’ screen play పుస్తకం తన సంతకంతో అందించారు. ‘బలభద్రపాత్రుని రమణి అనే ప్రఖ్యాత రచయిత్రికి, మీ బాలూ’ అని ఆటోగ్రాఫ్ పెట్టడం నా జీవితంలో మరపురాని సంఘటన. ఇప్పుడు నాకు ఎదురుపడినా అదే ప్రేమతో, ఆదరంతో “బలభద్రపాత్రుని వారూ… ఎలా వున్నారు?” అని పలకరిస్తారు! నా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఇలాంటి మహానుభావుల్ని నా కెరియర్ ఆరంభంలోనే కలిసి మాట్లాడ్డం జరిగింది! అసలు జీవితంలో ఒక్కసారైనా కలుస్తామా అనుకునే లాంటి వాళ్ళు, నాతో కూర్చుని తీరుబడిగా చర్చలు జరపడం నా అనుభవంలో అనేకసార్లు జరిగాయి.

కృష్ణప్రసాద్ గారు చంద్రమోహన్ గారి స్వంత అక్క కొడుకు. బాలూ గారికి దూరపు మేనల్లుడు, విశ్వనాథ్ గారికి కూడా!

ఇదంతా నా సర్జరీ ముందు జరిగిన కథ! కొన్ని కారణాల వల్ల ఆ డైరక్టర్‌తో కృష్ణ ప్రసాద్ గారికి కుదరలేదు. ఇప్పుడు జెంటిల్‍మన్, సమ్మోహనం తీసిన ప్రొడ్యూసర్ ఈయన.

వందేళ్ళ తెలుగు సినిమా కార్యక్రమం సందర్భంగా – గొల్లపూడి గారు, రావి కొండలరావు గారు, కె. విశ్వనాథ్ గారు, గణేశ్ పాత్రో గారు, వడ్డేపల్లి కృష్ణగారు, మురారి గారు, సత్యానంద్ గారితో రచయిత్రి

ఇలాగే వందేళ్ళ తెలుగు సినిమా కెళ్ళినప్పుడు నేను సాహితీ చర్చలు జరిపిన ప్రముఖులు ఎవరో తలచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. గొల్లపూడి గారు, రావి కొండలరావు గారు, కె. విశ్వనాథ్ గారు, గణేశ్ పాత్రో గారు, సాయినాథ్ తోటపల్లి గారు, సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్… వారితో లాబీలో కూర్చుని లీమెరిడియన్ హోటల్ గదుల్లోకి పోకుండా ‘లాబీయింగ్’ చేశాం అని సత్యానంద్ గారు చమత్కరించారు!

మొదటి నుండీ నాకు కాస్త వయసు ఎక్కువ వారితో స్నేహాలు ఎక్కువ!

నా కాలు (ఆపరేషన్) లామినేక్టమీ తర్వాత అంత ఆషామాషీగాగా ఏం రాలేదు. మూడు నెలలు కరెంట్ పెట్టించుకోవలసి వచ్చింది!

డాక్టర్ నాయక్ గారితో ఆ స్నేహం, అనుబంధం ఈనాటికీ కొనసాగుతూ, నా బంధువులకీ, స్నేహితులకీ, కోడి రామకృష్ణ గారికీ, అల్లు అరవింద్ గారికీ కూడా నేనే పట్టుపట్టి డాక్టర్ నాయక్ గారి దగ్గరే ట్రీట్‌మెంట్ ఇప్పించాను.

ఆయనలో చమత్కారం, హాస్య రసస్ఫోరకమైన సంభాషణలూ ఎవరికైనా కాసేపు మాట్లాడితే రోగం తగ్గిస్తాయి అనిపిస్తుంది. నా మిత్రుడు, డైరక్టర్ శివనాగేశ్వరావుకి కూడా మంచి మిత్రులయ్యారు తర్వాత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here