జీవన రమణీయం-33

2
11

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

కడియం దాటుతుంటే పూలతోటలూ, పండ్ల తోటలు కనువిందు చేశాయి. అమ్మకి తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలన్నీ చూడాలనిపించింది. అమ్మమ్మ పుట్టిల్లు, కోటిపల్లి, రామచంద్రాపురం, ద్రాక్షారం అవీ చూడాలని అమ్మ కోరిక!

ఆ రోజు నేను షూటింగ్‌కి వెళ్లగానే రచయిత్రి గారొచ్చారని చాలా మర్యాదలు చేశారు. అమ్మకి చాలా గర్వంగా అనిపించింది! “కొబ్బరి నీళ్ళు కావాలా? కాఫీ కావాలా?” అంటూ డైరక్టరు గారు మానిటర్ చూస్తుంటే పక్కనే నాకు కుర్చీ వేశారు. రమాప్రభ గారు తన బ్లౌజులు తనే కుట్టుకునేవారు. ఆవిడ చెయ్యి ఆడుతున్నంత సేపు నోరూ ఆడేది! ఇప్పటి తరం హీరోయిన్స్‌ని ఏదో ఒకటి అంటూనే వుండేవారు. సుజాతగారు ఎవరితో మాట్లాడేవారు కాదు! రిజర్వ్‌డ్.

చలపతిరావు గారు ‘రేపల్లెలో రాధ’ నవల చదువుతూ నా దగ్గరకొచ్చి, తన పాత్ర ప్రకాశం గురించి, భార్య శాంత పాత్ర గురించీ చాలా డిస్కస్ చేశారు!

చక్రపాణిగారు దేవదాసు సినిమా తీసేడప్పుడు సెట్లో అందరి దగ్గరా కలిపి 9 కాపీలు నవల వుంచేవారట. అలాగే శరత్ గారు కూడా నవలలు తెప్పించి అందరికీ ఇచ్చారు.

గుమ్మడిగారు నా నడుముకి ‘లంబార్డ్ బెల్ట్’ చూసి, సర్జరీ అయిందని తెలిసి, “అయ్యో… కూర్చోకమ్మా… కాసేపు నడుం వాల్చు…” అని ఆయనకి తెప్పించిన మడత మంచం నాకు ఆఫర్ చేశారు.

బాంబే నుండొచ్చిన గుజరాతీ పిల్లాడు మా దిలీప్ (హీరో) ఎవరూ పెద్దగా ఇంగ్లీషూ, హిందీ మాట్లాడేవాళ్ళు లేక తిరణాలలో తప్పిపోయిన పిల్లాడిలా కనిపించాడు. నన్ను చూడగానే అతనికి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. కృష్ణతో ఆడుతూ, ఇంగ్లీషు హిందీలలో మాట్లాడ్తుండేవాడు.

షూటింగ్ జరిగే ఆ ఇల్లు ఒక డాక్టరు గారిది. వంటావిడ తప్ప ఎవరు కనబడేవారు కాదు. పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు.

సత్యనారాయణ గారిని చూసి మా కృష్ణ చాలా సంతోషపడేవాడు! ఆయన్ని ‘ప్రేమ్‌నగర్’లో చూసి “నాగేశ్వరరావు తాగుతాడు… ఈయనే ఈ సినిమాలో హీరో” అనేవాడు. అదే ఆయనతో చెప్తే నవ్వారు. ఓ ఉయ్యాలుండేది. అందులో ఆయనతో కూర్చుని ఊగేదాన్ని. నడుం నొప్పి అనిపిస్తే కాసేపు పడుకుని వచ్చేదాన్ని.

మెస్ వంటాయన చాలా లావుగా వుండేవాడు…. అంటే ఇద్దరు సత్యనారాయణగార్లు కలిసినంత! పెద్ద బాన బొజ్జ… చిన్న ఇనపస్టూల్ మీద కూర్చునేవాడు. సత్యనారాయణగారు ఆయనకి భోజనంలోకి రకరకాల మాంసాహారం కాంబినేషన్‌లు అడిగేవారు. గుమ్మడికాయా మేకమాంసం; చింతచిగురూ రొయ్యలూ ఇలాగన్న మాట! మా అమ్మ వాళ్ళు మాంసాహారం తింటే ఇబ్బంది పడేది.

రెండో రోజు నేను అమ్మ కోరిక ప్రసాద్ గారితో చెప్పి, “తను టాక్సీలో వెళ్ళి వాళ్ళు పుట్టిన ఊరు చూచివస్తుంది లెండి” అంటే, “అదేమిటీ, మీరు టాక్సీలో వెళ్ళడం…” అని తన ఏ.సీ.కార్లో అమ్మని రామచంద్రాపురం, ద్రాక్షారం అవీ పంపించారు.

నేనూ, మా కృష్ణా షూటింగ్ స్పాట్‌లోనే వున్నాం. ఆ రోజు ఝాన్సీ కూడా వచ్చి జాయిన్ అయింది ‘తిలక’ వేషానికి. ఆ అమ్మాయి కూడా ‘రేపల్లెలో రాధ’ నవల చదివే వచ్చింది.

ఇంక హీరోయిన్ చాలా చిన్న పిల్ల, మంచి డాన్సర్. భాష రాక అవస్త పడేది. కానీ టేకులు ఎక్కువగా బాగానే చేసేది!

మొదటి రోజు గుమ్మడిగారిల్లు… హీరో వెళ్ళి పెదనాన్నని చూడ్డం… ఆ తరువాత రోజు లేగదూడతో రాధా, చైల్ట్ ఆర్టిస్టూ, గుమ్మడి గారూ, హీరో సీన్… సత్యనారాయణ గారూ, సుజాత గార్ల సీన్స్, సుధాకర్, ఎమ్.ఎస్. నారాయణగార్ల హాస్య సీన్స్, లాస్ట్ డే కృష్ణ శ్రీ కూడా వచ్చింది.

రమాప్రభ పప్పు రుబ్బుతూ, “నీ పేరేంటీ?” అంటే

“నాకలక్ష్మి” అని పప్పు తీసుకుని నాకుతుంది.

“నాకింది చాలు, నాలిక లోపల పెట్టు” అంటుంది రమాప్రభ.

మాటలు రాసిన మరధూరి రాజా లేట్‌గా వచ్చారు. నేను ‘అన్నయ్యా’ అని పిలిచేదాన్ని. వస్తూ వస్తూ సూర్యదేవర రామమోహనరావు గార్ని కూడా తీసుకుని వచ్చారు. అందరం సరదాగా జామకాయలు, తంపటేసిన పల్లీలు తింటూ ఆరుబయట నులక మంచాల మీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం.

భోజనాలప్పుడు నల్లటి చట్టిలో కమ్మగా తోడు పెట్టిన పెరుగు వేసేవారు.

అమ్మ తను పుట్టిన వూరు, కోటిపల్లి, రామచంద్రాపురం వెళ్ళి, తను పుట్టిన ఇల్లు గుర్తు పట్టడమే కాకుండా, అందరినీ పలకరించి, ఫలనా శ్రీహరిరావు, రమణమ్మ గార్ల కూతుర్ని అని కబుర్లు చెప్పి, ద్రాక్షారం సహా చుట్టుపక్కల వున్న పుణ్యక్షేత్రాలన్నీ చూసి వచ్చింది. “మా అమ్మాయి ఈ సినిమా రైటర్” అని కనబడిన వాళ్ళందరికీ చెప్పేది!

ప్రొడ్యూసర్ సాయంత్రం కాకినాడ వెళ్ళి, అత్తగారింట్లో వుండి, పొద్దుటే షూటింగ్‍కి వచ్చేవారు. నేనూ, అమ్మా – గుమ్మడిగారూ, సత్యనారాయణగార్లతో ఎక్కువ సమయం కబుర్లు చెప్పేవాళ్ళం… చిన్నప్పటి నుంచీ చూసిన వాళ్ళ సినిమాల గురించీ, పాతవాళ్ళ గురించీ వింటుంటే ప్రాణం లేచి వచ్చేది!

సరస్వతమ్మ గారు సత్యనారాయణగారి తల్లి వేషం వేశారు. ఆవిడది భానుమతి గొంతులాంటి గొంతు. బాగా పాడేవారు.

చివరకి సత్యనారాయణగారు కూడా “ఏమ్మా, ఈ సుబ్బారాయుడు నువ్వు ప్రాణం పోసిన సుబ్బారాయుడిలా వున్నాడా?” అని అడిగేవారు.

గుమ్మడి గారైతే “నా నిజ జీవితానికి దగ్గరగా వుందమ్మా ఈ సీతారామయ్య పాత్ర… పిల్లలు పెద్దయి వెళ్ళిపోయారు. భార్య లేదు, వానప్రస్థం…” అనేవారు. ఆయనకి పెరాల్సిస్ వచ్చినప్పుడు ‘ఆయనకి ఇద్దరు’ సినిమాలో ఆయనకి నూతన్‌ప్రసాద్ డబ్బింగ్ చెప్తే ప్రేక్షకులకి నచ్చలేదు! పుట్టినప్పటి నుండీ విన్న గుమ్మడిగారి వాయిస్ మనందరికి బాగా తెలుసు కదా! అందుకే ఈ సినిమాకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ఇదే ఆయన నటించిన చివరి సినిమా కావడం నా భాగ్యం. నా జన్మ తరించింది ఈ మహానుభావులంతా నా పాత్రల్లో నటించడం వలన.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here