జీవన రమణీయం-34

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం’ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]జమండ్రి గురించి అమ్మ చాలా చెప్పేది. వాళ్ళ చిన్నతనం అంతా దానవాయిపేటలో గడిచింది. వాళ్ళ పిన్ని కూతురు మా చంద్రభాను పిన్ని, కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాలకి వైస్ ప్రిన్సిపాల్‌గా చేసేటప్పుడు జయప్రద లలితకుమారి పేరుతో అక్కడ చదువుకుందిట.

నేను చిన్నప్పుడో సారి అమ్మానాన్నలతో కలిసి, ట్రెయిన్‌లో మా పెద్దత్తయ్య కూతురు పెళ్ళికి రాజమండ్రి వెళ్ళాను. అప్పుడు విపరీతమైన నీటి ఎద్దడి. ఒక బకెట్ నీళ్ళిచ్చి – ఒళ్ళు పేలిపోతున్న ఎండాకాలంలో – ‘దీంట్లోనే మీ ముగ్గురూ స్నానం చెయ్యండి’ అంది పిన్ని! ఆ జ్ఞాపకం నా మనసులో వుండిపోయి, ఇంకెప్పుడూ రాజమండ్రి వెళ్ళలేదు!

కానీ, షూటింగ్‍కి రాజమండ్రి వెళ్ళినప్పుడు… ఆ పరిసరాలు అత్యంత సుందరంగా కనిపించాయి.. వీరేశలింగం పంతులు గారూ వాళ్ళూ తిరిగిన వూర్లు కదా అని మహదానందంగా అనిపించింది… ముఖ్యంగా కడియంలో పూలూ, తునిలో తమలపాకులూ, తాటాకు విసనకర్రలు, కర్పూరం దండలూ, తాటి ముంజెలూ అన్నీ ఎంతో మనోహరంగా తోచాయి.

మేము షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చేసే టైమ్‌కల్లా ‘అనూహ్య’ షూటింగ్ స్టార్ట్ అవుతోంది, స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టమన్నారు. ఇది నా లైఫ్‌కి ఇంకొక టర్నింగ్ పాయింట్… ఆనాడు అనుకోలేదు ఈటీవీతో ఆ అనుబంధం ఇప్పటిదాకా సాగుతుందని.

డైరక్టర్ గిరిధర్ గారూ, ప్రసాద్ గారూ మొదటిసారి కారు పంపించారు. ఈటీవీ ఆఫీసుకు ఎదురుగా రోడ్డుకి అవతల ఉన్న సీ సీ.. అంటే సెంట్రల్ కోర్ట్ ఎపార్ట్‌మెంట్స్‌లో మా సిట్టింగ్స్ జరిగేవి. హోటల్ గదుల్లా, చుట్టూ గదులు వుండి మధ్యలో పొడవాటి హాల్లో డైనింగ్ టేబుల్ వుండేది. భోజనాల వేళకి అన్ని సీరియల్స్ తాలూకూ డైరక్టర్స్, రైటర్స్ అక్కడ చేరేవాళ్ళం! ‘విధి’ సీరియల్ డైరక్ట్ చేసే అనిల్ కుమార్ గారూ, ఆయన రైటర్ నడిమింటి నరసింగారావు గారూ, ‘బంగారు బొమ్మ’ రాసే కొమ్మనాపల్లి గారూ, పుచ్ఛా రామకృష్ణా… చాలామంది కలిసేవారు! హాస్య సంభాషణలతో, ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవాళ్లం. ఆ రోజులలో కె.వీ.ఎస్.ఆర్.కే. ప్రసాద్ గారు కూడా మాతో కలిసి మెలసి వుండేవాళ్ళు!

శిల్పా చక్రవర్తి అప్పుడు రైల్వే జునియర్ కాలేజ్ నుంచి వచ్చిన చిన్న పిల్ల. ఆమె ఏంకరింగ్ చేస్తుంటే చూసి, హీరోయిన్‍గా పెట్టారు ‘అనూహ్య’కి. హీరో సమీర్. ఇంక అందులో ముఖ్యమైన పాత్ర జయంతిగారు. ఆ లెవెల్ లేకపోతే అమ్మమ్మ పాత్రకి ఒప్పుకోనన్నారు గిరిధర్ గారు!

నా అదృష్టం ఏంటంటే, నా నవలలు కొని సినిమాలు, సీరియల్స్ తీసిన డైరక్టర్లు అందరు వాటిని నాకన్నా ఎక్కువగా ప్రేమించేవారు. జయంతి అమ్మమ్మ అయితే కూతురు ఎవరు? అనూహ్య తల్లి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్… అని వెదికి వెదికి ఋష్యేంద్రమణి గారి మనుమరాలు భవాని గారిని పెట్టారు!

రామోజీ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలు చేసి మొదలుపెట్టారు. నేను అమ్మని తీసుకుని వెళ్ళాను. బెంగాలీ బిల్డింగులో టైటిల్ సాంగ్ రాయించి, ప్రమీలా మాస్టర్ గారితో ఆ పాటకి కొరియోగ్రఫీ చేయించి, వారం రోజులు పాటని షూట్ చేశారు.

“అయ్యో రామా… అనూహ్య మనసే చినబోయింది” అని మొదలవుతుందా పాట.

శిల్పా చక్రవర్తి మొదటి రోజున వచ్చి దణ్ణం పెట్టింది. ఆనాటి నుండీ ఈనాటి వరకూ ఆ అమ్మాయితో నా అనుబంధం అలాగే వుంది. వాళ్ళమ్మ గౌరికీ నాకూ మంచి స్నేహం. బెంగాలీ పిల్ల అయినా తెలుగు మాట్లాడి తనే స్వయంగా డబ్బింగ్ చెప్తాననేది. మొన్న మొన్న వందేళ్ళ తెలుగు సినిమా పండగకి కూడా, “మేడం, లిస్ట్‌లో మీ పేరు చూసి చాలా సంతోషించాను… కానీ మీరు లీమెరీడియన్‌లో వుండిపోయారు, మేము వేరే హోటల్… చూడండి… రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పేడప్పుడు పెద్దల గురించి నాలుగు వాక్యాలు చెప్పండి… వారి స్థాయికి తగ్గకుండా ఆహ్వానించాలి కదా… పైగా పెద్దవాళ్ళనీ, పాతవాళ్ళనీ నేను గుర్తుపట్టను…” అని అడిగి రాయించుకుంది. ఆ డెడికేషన్ వల్లే, సుమా, శిల్పా లాంటి పరభాషా ఏంకర్లు భాష మీద పట్టుసాధించి, మన తెలుగు పిల్లలకి గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు! ఇప్పుడొచ్చే అందరి భాషా తగలబడిపోయిందనుకోండీ…

శిల్పా నాన్నగారు చక్రవర్తి, రామోజీరావుగారిలాగే వుండేవారనీ, మా కెమేరామాన్ మీర్ గారూ, గిరిధర్ గారూ ఆయన్ని ‘ప్రొడ్యూసర్ సాబ్’ అని పిలిచేవారు. సమీర్ కుడా మీర్ గారితో గిరిధర్ గారితో కలిస్తే ఇంక అల్లరికి అయిపూ అంతూ వుండేది కాదు! షూటింగ్ అంతా అల్లరితో, సాగిపోయేది.

జయంతి గారొచ్చారని తెలిసి, నేను షూటింగ్ లొకేషన్‌కి వెళ్తూ అమ్మని తీసుకెళ్ళాను! ఆవిడతో ఒక్కసారి మాట్లాడితేనే ఆవిడ ప్రేమ అర్థం అవుతుంది. వ్యక్తిగా ఆవిడ హృదయం నవనీతం. అక్కడ పనిచేసేవాళ్ళకి, మెస్ వాళ్ళకి అందరికీ ఆవిడ వెళ్ళేడప్పుడు బట్టలు కొనిపెట్టి వెళ్ళారు. ముఖ్యంగా ఒక అవ్వ చెప్పులు లేకుండా నడుస్తూంటే, తన చెప్పుల జతల్లోంచి ఒక జత తెప్పించి ఇవ్వడం నేను జన్మలో మరిచిపోలేను. మానవత్వం అంటే అదీ! ‘లాలస’ అనే కథ రచన మాసపత్రికకి ఆవిడ గురించి రాసాను.

….ఆ కథ చదివి కె.వి. రమణాచారి గారు నాకు ఫోన్ చేసి “చాలా బాగా రాసావు రమణీ… ఎవరి గురించి?” అని అడిగారు. చంద్రబోస్ ఫోన్ చేసి, “చాలా మంచి డైలాగ్ రాసారు అమ్మ గురించి… అద్భుతం” అని మెచ్చుకున్నాడు.

“మీ అమ్మమ్మ ఇలాగే వుండేవారా? ఇలాగే మాట్లాడేవారా?” అని జయంతిగారు నవ్వుతూ నన్ను అడిగేవారు.

రేడియో జాకీగా 40 గంటల రికార్డు సాధించిన శేఖర్ బాషా, ఉత్తేజ్, రాగిణీ, శైలజా, శ్రీ గౌరీ, శ్రీవల్లీ, మధుమణీతోబాటు ‘బొంగరం మావయ్య’గా మా ఉప్పులూరి సుబ్బరాయశర్మ మావయ్య కూడా ఓ వేషం వేసాడు. ముఖ్యంగా పెద్ద వేషం మిశ్రోగారు వేసారు. ఆయనతో మాట్లాడుతూ ఉంటే కాలం తెలిసేది కాదు. ఆయనకి నాటక రచనలో వున్న అనుభవం దృష్ట్యా కొన్ని మెలకువలు అడిగి తెలుసుకునేదాన్ని.

సీ సీ లో అంతా భోజనాలు చేసేవాళ్లం అని చెప్పాగా. నడిమింటి నర్సింగరావు గారు భోజనాల టైమ్‌కే వచ్చేవారు, కానీ భోజనం ముందు కూర్చుని అప్పడం వెయ్యకపోతే, వడ్డించే బోయ్‌తో పెద్ద పేచీ పెట్టుకునేవారు. నేను ఇంటి నుండి మాగాయా, ఆవకాయా, గుత్తివంకాయా లాంటివి తీసుకెళ్ళేదాన్ని. అనిల్ కుమార్ గారి శ్రీమతి మలయాళీ, సువర్చల గారు. ఆవిడ మంచి మంచి కూరలు చేసి పంపేవారు! కానీ ఈటీవీ పక్కనుండే శాంతి టిఫిన్స్ నుండి మేం తెప్పించుకున్న ‘లెమన్ రైస్’, ‘టొమేటా రైస్’లని నేను ఎప్పటికీ మరచిపోలేను! అంత రుచిగా వుండేవి. అలాగే ఈవెనింగ్ స్నాక్స్. మిరపకాయ బజ్జీ లేకుండా మా సిట్టింగ్స్ అయ్యేవి కావు!

షూటింగ్‌లలో పెట్టే కేటరింగ్ ఎప్పుడోకాని బావుండకపోవడం అనేది జరగదు! అందరికీ తెలీదు కానీ, మాకు అంటే.. డైరక్టర్, రైటర్, కెమెరామాన్, హీరో, హీరోయిన్, ఇంకా ముఖ్యలకి మాత్రం సెపరేట్‌గా టేబుల్ వేసి, ఒక ప్లేట్‌లో ఆవకాయా, గోంగూరా, కందిపొడీ, కారంపొడీ, పచ్చిమిరపకాయా, ఉల్లిపాయా లాంటివి పెడ్తారు. విధిగా అప్పడాలూ, గోల్డ్ ఫింగర్స్ లాంటివి. ఇంక కూరలు కూడా కంపల్సరీ. ఆకుకూరా, ఒక ఫ్రై, ఇంకో మసాలా కూరా, మామూలూ కూరా, ముద్ద పప్పూ, నెయ్యీ, కలగలుపు పప్పూ, సాంబారు, రసం, మజ్జిగ పులుసూ (వాళ్ళ ఉద్దేశంలో మన మెంతిమజ్జిగ, విత్ పచ్చి ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చీ ముక్కలు), పచ్చి పులుసూ, గెడ్ద పెరుగూ… ఇదీ మెనూ!  వెళ్ళగానే బ్రేక్‌ఫాస్ట్ పూరీ, ఇడ్లీ, వడా, పొంగల్, సెట్ దోశా… అసలు ఆ పొంగల్ అలవాటు పడిన వాడెవడూ ఇండస్ట్రీ విడిచి వెళ్ళలేడు అంటే అతిశయోక్తి కాదు! అసలు మా మెస్ వాడు చేసే పచ్చడి ఈ కాయగూరతో చేస్తాడో ఎవరం చెప్పలేం… అది బెండకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, బీరకాయ కానీ దోసకాయ కానీ కావచ్చు. కాని అదే రుచి! కాకరకాయ ఫ్రై మాత్రం మా మెస్ వాళ్ళు చేసినంత రుచిగా ఎవరూ చెయ్యలేరని నేను ఘంటాపథంగా చెప్పగలను… ఏమిటీ ఈవిడ భోజనం గురించి ఇంత రాస్తోందీ అనుకుంటున్నారా? ఉప్పు తిన్న విశ్వాసం… ఈ రోజుకి.. 98 నుండీ మొదలై 20 ఏళ్ళ పాటు ఆ తిండే తిన్నాను మరి!

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here