జీవన రమణీయం-35

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఉ[/dropcap]త్తేజ్ అప్పుడు పరిచయం. ఇప్పటికీ స్నేహం కొనసాగిస్తున్న మంచి మిత్రుడు. అతనికి సాహిత్యం అంటే ప్రాణం. ఇంట్లో పెద్ద లైబ్రరీ వుంది. అతను పూనుకుని, పల్లెటూర్లో పాఠాలు చెప్పుకుంటున్న మేనమామని తీసుకొచ్చి, తన ఇంట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో ఎంట్రీ ఇప్పించి ‘నేషనల్ ఎవార్డు’ తీసుకోవడానికి కారణం అయ్యాడు. సుద్దాల అశోక్ తేజకి స్వయానా అక్క కొడుకు ఉత్తేజ్.

నా నడుము నొప్పిని మాత్రం ఏ ఫిజియోథెరపీ, సర్జరీ తగ్గించలేకపోయాయి. నేను గంట కూర్చుంటే, ఇరవై నిముషాలు నడుం వాల్చాల్సిందే. అయినా పని పట్ల నాకున్న ఉత్సాహం, నాకు అన్ని బాధలని ఎదుర్కునే శక్తిని ఇస్తోంది. ‘అనూహ్య’ తర్వాత ‘ఆలింగనం’ రాసాను.

అదో పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది. ఆడపిల్లలందరూ చదవాల్సిన నవల. ఒక అమ్మాయి జీవితంలో ఎదురుపడిన రకరకాల మగాళ్ళని ‘ఉల్ఫ్, జాకాల్, లయన్, టైగర్’ అని కేటగిరైజ్ చేసి రాసిన నవల. కొంచెం బోల్డ్‌గా రాసానేమో ఆనాటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా! కానీ నాకైతే ‘ఆముక్త’ పాత్ర ఈనాటికీ ఫేవరెట్ పాత్ర. అలాంటి నవల ఇంకొకటి రాయలేను. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ వుంటాను. ఆ పాత్రలూ, శిల్పం, పాత్ర చిత్రణా, చాలా చక్కగా కుదిరాయి. ఎన్నో పాయింట్లు ప్రేమా, పెళ్ళీ, సంబంధాలూ గురించి చర్చించాయి అందులో.

‘రేపల్లెలో రాధ’ క్రూ ముంబయి, అమెరికాలలో షూటింగ్ చేసుకుని తిరిగి వచ్చారు. బ్రహ్మానందం ‘రాంబల్’ పాత్ర వేశారు. అది కథలో ముంబైలో తప్ప రాదు కాబట్టి నేను ఆయన్ని ఆ షూటింగ్‌లో కలవలేదు. తర్వాత చాలాసార్లు కలిసాను. ఆయన హాస్యపాత్ర లేసే కమేడియన్‌గానే కాదు, చక్కని పాఠాలు చెప్పే మాస్టారిగా, పోతన పద్యాలు చదివే సాహిత్యాభిమానిగా నాకు తెలుసు! దురదృష్టవశాత్తు మా నిర్మాత ఎం.ఆర్.వీ. ప్రసాద్ గారికీ, డైరక్టర్ శరత్ గారికీ సినీ నిర్మాణం చివర్లో ఎందుకో గేప్ ఏర్పడింది. అది మా కోడైరెక్టర్ సోమరాజునీ, నన్ను చాలా బాధించింది,ఇద్దరూ కావలసిన వ్యక్తులే అవడం వలన!

దిలీప్ తాడేశ్వర్ అనే మా హీరో ఇప్పటికీ నా ఫేస్‌బుక్‌లో, తెలుగు అర్థం కాకపోయినా, నా ఫోటోలకి ‘లైక్’లు పెడ్తూ మీకు కనిపిస్తాడు. చాలా అందమైన అబ్బాయి.

సినిమా ప్రమోషన్‌కి నన్ను పిలిచి ఛానెల్స్‌లో మాట్లాడించేవారు నిర్మాత గారు. సినిమా ఏడ్ వచ్చేటప్పుడు కూడా నా పేరు స్క్రోలింగ్‍లో ప్రముఖంగా వెళ్తూ కనిపించేది. కోటిగారు ‘జడగంటలే… శుభమంటూ… ‘, ‘ఓ పాతిక దాటని బ్రహ్మచారీ… (మా భువనచంద్ర గారు రాసినది)’, ‘రావే సామజవరగమనా…’, ‘ఓ ప్రేమా నా ప్రేమా’, ‘ఎంచక్కా వున్నావే’ లాంటి మంచి పాటలు స్వరబద్ధం చేసారు. స్క్రిప్ట్ విషయంలో కాని, పబ్లిసిటీ విషయంలో కాని ఒక రచయిత్రికి ఇవ్వవలసినంత ప్రాముఖ్యత ఇచ్చారు! అదో మధుర స్మృతిగా నిలిచిపోయింది నా మదిలో. అప్పుడు ఈటీవీ వాళ్ళకి ఇస్తే ప్రమోషన్, మిగతా ఛానెల్స్ వాళ్ళు వెయ్యం అన్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఈటీవీకే టెలికాస్ట్ రైట్స్ అమ్మేసారు. ఆ తరువాత 4,5 సార్లు వేసినా, ఈటీవీ వాళ్ళు పెద్దగా ఆ చిత్రాన్ని ఎక్కువసార్లు ప్రసారం చేయలేదు. సంక్రాంతి రోజున వెయ్యవలసిన మంచి పండగ లాంటి సినిమా అది. నాకు మంచి పేరొచ్చింది.

ఎమ్.ఎస్. రెడ్డిగారు సినిమా చూసి అరిశలు తీసుకుని మా ఇంటి ఎడ్రస్ తెలుసుకుని నేరుగా వచ్చి, “బాగా రాసావమ్మా… నాకూ ఒకటి ఇట్లాంటిది రాసివ్వు… కుటుంబ కథా చిత్రం” అన్నారు.

నట సార్వభౌమ సత్యనారాయణ గారు నేరేడ్‍మెట్‌లోని మా ఇంటికొచ్చి చాలాసేపు కూర్చుని కబుర్లు చెప్పి, తన నిర్మాణంలో సినిమా చేద్దాం అని చెప్పి వెళ్ళారు. అప్పుడు నా దగ్గర టచ్ స్క్రీన్, సెల్ ఫోన్‌లు లేక అలాంటి ఫోటోస్ లేవు.

‘రేపల్లెలో రాధ’ విజయోత్సవ సభకి అందరు నటీనటులతో బాటు, త్యాగరాజ గాన సభలో రాగ సప్తస్వరమ్ వాళ్ళు చేస్తే… గోపీనాథ్‌రెడ్డి ఐపిఎస్ తో బాటు బి.ఎన్.రెడ్డి గారూ, మా లెక్చరర్ సి.ఎన్.రావు గారు కూడా వచ్చారు. ఆయన దగ్గర నేను ఇంటర్‌మీడియట్‌లో చదువుకున్నానని తెలిసి ఆయన “ఈ అమ్మాయి నా శిష్యురాలు అని చెప్పుకోడానికి నేను చాలా సంతోషిస్తున్నాను… అంత మంది కథ రాసింది” అన్నారు.

                

ఆయన ‘ఊరుమ్మడి బతుకులు’, ‘ప్రాణం ఖరీదు’, ‘కమలమ్మ కమతం’ లాంటి సినిమాల రచయిత. ఆయన ఆ మాట అనడం నాకు గర్వకారణం. “తెర మీద నా పేరు పడేట్లు చేసాకే వస్తాను” అని మా గురువుగారితో ఓ ఘర్షణ పడి అన్న మాట నిజం అయ్యాకా, నేను మళ్ళీ వీరేంద్రనాథ్ గారి దగ్గరకు వెళ్ళి సినిమా చూడమని కోరాను. నిండు మనసుతో ఆయన “I am proud of you” అని సంతోషం వెలిబుచ్చారు!

ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసారు. మా ఇంట్లో ఫోన్ వచ్చాకా, దానికి ఎందరో ప్రముఖుల నుండి ఫోన్స్ రావడం మాకు అలవాటై పోయింది. నాగేశ్వరరావు గారు నన్ను ‘నంది ఎవార్డ్స్ జ్యూరీ’లో వేస్తున్నట్టు చెప్పారు. నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. అప్పటికింకా ఒక సినిమా, ఒక సీరియల్ మాత్రమే చేసాను. రాఘవేంద్రరావు గారి తర్వాత ఏ.ఎన్.ఆర్ కొంత కాలం ఎఫ్.డి.సి.కి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

2000 నంది అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు – ఏడిద రాజా, ఎం.వి.రఘు, త్రినాథ్, బీరం మస్తాన్‌రావు, ఆర్.ఆర్. శ్రీ (దూరదర్శన్ డైరక్టరు), లక్ష్మీ దేవదాస్ కనకాల, అంకిరెడ్డి గార్లతో రచయిత్రి.

మా జ్యూరీకి ఛైర్మన్ జంధ్యాల గారు. సభ్యులు నాతో బాటు, బీరం మస్తాన్ రావుగారూ, ఎడిటర్ అంకిరెడ్డిగారూ, లక్ష్మీదేవీ కనకాల గారూ, కెమెరామాన్ ఎం.వి. రఘు గారూ, ఏడిద రాజా, ఇంకో ఇద్దరు గుర్తు లేదు! కానీ నేను చాలా సరదాపడ్డాను జంధ్యాల గారు ఛైర్మన్ అంటే!

సరిగ్గా మీటింగ్ రోజున జంధ్యాలగారు మరణించినట్లు దుర్వార్త అంది విచారసాగరంలో మునిగిపోయాం. మా కమిటికీ ‘ఆర్.శ్రీ’ గారని దూరదర్శన్ డైరక్టర్ గారు ఛైర్మన్ అయ్యారు. 9/11 ఎటాక్స్ కూడా అప్పుడే జరిగాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here