జీవన రమణీయం-36

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మొ[/dropcap]దట సభ్యులందరికీ రిజిస్టర్ పోస్టులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి, ‘మిమ్మల్ని ఈ జ్యూరీలో ఒక జడ్జిగా నియమిస్తున్నాము. మీకు ఇష్టమేనా? ఇష్టమైతే ఎఫ్.డీ.సి.కి లేఖ ద్వారా తెలియజెయ్యండి’ అని రాస్తారు! దాన్ని చూసి మా స్నేహితురాళ్ళు లలితా, సుశీలా “పోతే పోయింది వెధవ ఉద్యోగం… నిన్ను తీసేసిన మన అనిల్ సార్‌కీ విషయం తెలియజేస్తాం” అని ఎంతో సంతోషపడ్డారు.

మా నాన్నగారు కూడా చాలా సంతోషపడ్డారు. ఆయన పేరు అంకరాజు ఆనందభూషణరావు. ఇంట్లో అందరూ హరి అని పిలిచేవారు. స్వతహాగా ఆయనకి ఏ కళలోనూ ప్రవేశం లేకపోయినా, ఆయనకి నాటకాలంటే చాలా ఇష్టం! పరుచూరి రఘుబాబు పరిషద్‌కి ఆయన ఒక్కరోజు కూడా మానకుండా, టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళి మరీ చూసేవారు! అలాంటి పరిషద్‌కి తర్వాత నేను ఐదేళ్ళు జడ్జిగా వ్యవహరించడం గర్వకారణం.

నా చిన్నతనంలో నాకు మా నాన్నగారిని అర్థం చేసుకునే ఆస్కారం లేకపోయింది. ఆయన ఉద్యోగ రీత్యా దూరంగా ఉండేవారు. అమ్మ బంధువులతో, వారి కష్టసుఖాలతో మునిగి తేలుతూ వుండేది. మమ్మల్ని నాన్న తను ఊరికొచ్చినప్పుడు మా బామ్మా, బాబాయిలు, అత్తల ఇళ్లకి తీసుకెళ్ళేవారు! వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసినా, అమ్మ అంటే అంత ఇష్టం ప్రదర్శించేవారు కాదు! అందుకు తగ్గట్టే అమ్మా ప్రవర్తించేది. కానీ, అమ్మ రిటైర్ అయ్యాకా, నా పెళ్ళి అవగానే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్న నాన్నతో కలిసి, నాకు దగ్గరగా ఇల్లు తీసుకుని వుంది. అప్పుడు నాన్న అభిరుచులూ, వ్యాపకాలూ గురించి నాకు కొన్ని తెలిసాయి! ఆయన మితభాషి! కానీ హాస్యం ఆయనలో వుంది.  అదే నాకూ వచ్చింది అనుకుంటా.

ఓసారి మా పిన్ని, బావగారొచ్చారని భోజనానికి… “బావగారూ… కందా, బంగాళదుంపలూ వున్నాయి… ఏం వండనూ?” అందట. అందుకు నాన్న “కంద తీసుకెళ్ళి పెరట్లో పాతిపెట్టమ్మా… బంగాళదుంపులు వేయించు” అన్నారట. ఇప్పటికీ మా పిన్ని చెప్తూ వుంటుంది. ఓసారి మా అత్త పిల్లల్లో ఒక అమ్మాయి ‘నీళ్ళు అడిగితే’, ఒళ్ళు విరుచుకొంటూ తెస్తుందని ఆయనకి కోపం. “దాంతో తిరగకు, తింగరితనం అంటుకుంటుంది” అన్నారు. ఎవరి మీదైనా కోపం వస్తే, ‘దాసు’ అనేవారు! మా అమ్మని ‘పిచ్చామ్’ అనేవారు.

అన్నయ్యతో కన్నా నాతో ఎక్కువ చనువుగా, ప్రేమగా వుండేవారు. ఆయనకి పాటలు పాడాలన్న సరదా వుందే కానీ, మా అమ్మలా సింగర్ కాదు కదా. అందుకే సినిమా పాటల పుస్తకాలన్నీ కొనుక్కొచ్చి పాటలు బట్టీ పట్టేవారు… నేను “అలా చదువుతావా?” అని వెక్కిరిస్తే, “స్వరం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు… ముందు పాట నోటికి రావాలిరా తల్లిగా!” అనేవారు.

స్నానం చేసొచ్చి తలుపు మీద టవల్ ఆరేస్తూ ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ అనేవారు! ఏదైనా పేపర్ కానీ, రూపాయలు కానీ జాగ్రత్తగా నాలుగు మడతలేసి జేబులో పెట్టుకుని ‘ప్యార్ కియా తో డర్నా క్యా’ అని దీర్ఘం తీసేవారు…. అప్పుడప్పుడు ఎవరి మీదనైనా కోపం వస్తే ‘జనక్ జనక్ పాయల్ బాజే’ అని కూడా కోపంగా కళ్ళు పెట్టి అనేవారు!

మా అక్కలూ, అన్నలూ అందరం చెప్పి నవ్వుకునేది మాత్రం “తలుపేసి రావాలీ… ఢాం… ఢుస్” అని మా అందరికీ నేర్పించేవారు! ఎవరైనా ఇంట్లోకి వస్తూ గేట్ వెయ్యడం మర్చిపోతే… ఈయన ఒక వాక్యం పొడుగ్గా సాగదీసి, చివరి అక్షరం అలా చాలా సేపు ఊపిరి బిగపట్టి అంటే దాన్ని పాట అనుకునేవారు! ఓసారి మా రెండవ బాబాయ్ కొడుకు, ఒక పెళ్లిలో ఈయన ఇడ్లీలోకి పచ్చడి బాగాలేదని… ‘పిచ్చామ్‍లందరు చేరి పచ్చడి చేసినచో…’ అని రాగం తీస్తుంటే, వాడ్ని ఎవరో పని మీద పిలిస్తే లేచి వెళ్ళిపోతుంటే, నాన్న “వీడికి సంగీతమంటే పడదా ఏమి?” అన్నారు… నాకు నవ్వుతో పొలమారింది. అమ్మ ఎంతెంత కచ్చేరీలు చేసి షీల్డ్స్ తెచ్చుకున్నా మా నాన్న సంగీతం మమ్మల్ని ఆనందపరిచినంత ఆనందపరచలేకపోయింది.

మనిషి వున్నప్పుడు విలువ తెలీదు! అలాగే ఒక వ్యక్తి అలా ప్రవర్తించాడు… అందువలన అతని కుటుంబం  బాధపడిందీ, లేక ఇతరులు గాయపడ్డారూ అని ఎవరైనా చిన్నతనంలో మనకి చెప్తు వుంటే, ఆ చెప్పేవాళ్ళు అనునిత్యం మన దగ్గరగా వుండే బంధువులైతే మనం తప్పక ప్రభావితం అవుతాము. నాన్న గురించి నేను అర్థం చేసుకోలేని వయసులో, ఆయన నా దగ్గరగా లేరు. వారూ వీరూ చెప్పేది విని, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నాయందు ఎంతో ప్రేమ పెంచుకున్న ఆయన్ని బాధ పెట్టే వుంటానేమో కూడా! కానీ ఆయనకి నేనంటే చివరి నిమిషం దాకా ఆపుకోలేనంత ప్రేమ! నేను అర్థం చేసుకునే వయసొచ్చి, ఆయనతో స్నేహం చేసే సమయానికి ఆయన లేరు!

‘లీడర్’ పుస్తకావిష్కరణ సభలో ముదిగొండ రాజలింగం గారు, రచయిత్రి తండ్రి, బాబాయిలు

“మా అమ్మాయి కథ పడింది”, “మా అమ్మాయి పుదీనా పచ్చడి ఎంత బాగా చేస్తుందో?”, “పూరీలు చేస్తే పిండితే అస్సలు నూనె రాదు” అంటూ, ఎప్పుడూ ఆయన చెల్లెళ్ళూ, తమ్ముళ్ళ పిల్లల దగ్గరకి వెళ్ళి నా గురించి అస్తమానం “మా అమ్మాయి… మా అమ్మాయి” అని ఓ రాజకుమార్తెని గురించి చెప్పినట్లు చెప్పేవారనీ, అప్పట్లో నా మీద తమకెంతో కోపంగా వుండేదని, తర్వాత మా వదినలూ, చెల్లెళ్ళూ చెప్పారు! మా నాన్నగారు గొప్ప తత్వవేత్త అని ఆయన పోయాకే నాకు తెలిసింది! ఎప్పుడూ దేవాలయాలకు వెళ్ళడం లేదా ఇళ్ళల్లో పూజలు జరిగేటప్పుడు చేతులు జోడించి నమస్కరించడం, భగవంతుడిని ప్రార్థించడం నేనెన్నడూ చూడలేదు!

“నాన్నా… ఎందుకు అందరు ముసలాళ్ళలా గుడికెళ్లవూ?” అని నేను అడిగితే, ఆయన జవాబు నాకు జ్ఞానోదయం కలిగించింది.

“నా కొడుకూ, కూతురూ బుద్ధిమంతులు. దేనికీ కొరత లేకుండా సుఖంగా వున్నారు. నా కోరికలు తీరిపోయాయి… I do not want to bother God with anything else…” అన్నారు.

నాకు ఆ తృప్తికి ఆశ్చర్యం వేసింది. భగవంతుడు ఒక కోరిక తీరిస్తే, ఇంకొకటి పిలకలేస్తుందే మనకీ… అలాంటిది ఈయనకి భగవంతుడిని అడిగే కోరికలే లేవా? మంచి సంసారం… అర్థం చేసుకోవాల్సిన వయసులో అర్థం చేసుకునే భార్యా, పిల్లలూ ఏవీ లేని ఆయన నోటంట ఆ మాట విని నా కళ్ళు తెరుచుకున్నాయి!

అమ్మ వెర్షన్ ప్రకారం మా చిన్నతనంలో మమ్మల్ని పెంచడంలో, తన కష్టసుఖాలలో ఆయన అతిథి పాత్రే పోషించారు… ఒంటి రెక్క మీద తను అన్ని కష్టాలూ, ఆర్థిక బాధ్యతలూ నెరవేర్చాల్సి వచ్చిందని కోపం! అందుకే అన్నారు… తల్లిదండ్రులను జడ్జ్ చెయ్యడం కన్నా కష్టతరమైన పని ఇంకోటి వుండదు! ఎందుకంటే ఇద్దరూ కూడా మనకి ఇష్టులే కనుక… కానీ పిల్లలు ఎక్కువగా తల్లుల కష్టాలకీ, వారి మాటలకే ఎక్కువ విలువిస్తారు. తల్లి పిల్లలని తన రెక్కలతో కప్పి జాగ్రత్తగా పెంచుతుంది… తండ్రి – తాబేలు పిల్లల్ని పెంచినట్లు – దూరం నుండి చూస్తూ వుంటాడు… అప్పటి రోజుల ప్రకారం చెప్తున్నాను! ఇద్దరికీ పిల్లల మీద సమానమైన ప్రేమే వుంటుంది… కానీ వ్యక్తపరచలేరు పురుషులు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here