జీవన రమణీయం-38

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నా[/dropcap]న్న  నేను జ్యూరీలో వుండడం గురించి చాలా ఆనందపడ్డారు అని చెప్తూ ఆయన గురించి రాసాను.

అంకిరెడ్డి గారు చాలా సీనియర్ ఎడిటర్. ఆయన కుమారుడు శేషారెడ్డి గారు కూడా ఎఫ్.డి.సి.లో అప్పుడు ఉన్నతాధికారిగా వుండేవారు. అంకిరెడ్డి గారు నా ‘లీడర్’ చదివాకా, నన్ను చాలా మెచ్చుకుని నాకు చాలా అభిమానిగా మారారు. ఆ జ్యూరీ అయిపోయాకా కూడా నా కథలు చదివి అప్పుడప్పుడూ ఫోన్స్ చేసేవారు. ఎంతో గొప్ప గొప్ప చిత్రాలకి ఎడిటర్‍గా పని చేసినాయన, ఆంధ్రభూమిలో నా ‘ఆమె’ కథ చదివి, “అమ్మా, ఎన్నో ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి  మా అమ్మని తలపించావు” అన్నారు.

జ్యూరీలో వుండగా ఓసారి మా అమ్మా, ఓసారి మా నాన్న నన్ను కలుసుకోడానికి వచ్చారు. అంకిరెడ్డి గారు అమ్మతో, “గొప్ప కూతుర్ని కన్న గొప్ప తల్లివమ్మా” అన్నారుట. అమ్మ ఈనాటికీ తలచుకుంటుంది!

బీరం మస్తాన్‌రావు గారిని అక్కడే కలిసాను. కానీ ఆయన తీసిన ‘బుర్రిపాలెం బుల్లోడు’ చిన్నప్పుడే చూశాను. ‘జీవితరంగం’ సినిమాలో ఆయన కోడైరెక్టర్ వేషంలో ఓసారి కనిపిస్తారు కూడా. ‘మస్తాన్‍రావ్’ అని హీరో పిలుస్తాడు. ఆయన భార్య నవీన లక్ష్మి. నా చిన్నతనంలో ఆర్.టి.సి. వాళ్ళు ‘శివరంజని’ అన్న నాటకం వేసినప్పుడు, మొదటిసారి ఆవిడని స్టేజ్ మీద చూశాను. ‘సినిమాల్లో వేస్తుందట’ అని అమ్మ గొప్పగా చెప్పింది.

అది మొదలు ‘అందరూ దొంగలే…’, కొన్ని జానపద చిత్రాలూ, సినిమాలో నవీన లక్ష్మి కనిపిస్తే చాలు ‘అమ్మ ఫ్రెండ్’ అని అని అరిచేవాళ్ళం. ఆవిడ ‘పిచ్చి’ నాటకంలో అద్భుతంగా నటించినందుకు గాను పిచ్చిలక్ష్మిగా పేరు తెచ్చుకున్నారు! ఆవిడ భర్త మస్తాన్‌రావుగారి కోసం వచ్చేవారు. అందర్నీ ప్రేమగా చూసే ఆ దంపతులకి పిల్లలు లేరు. ఆయన మంచి సమయస్ఫూర్తితో హాస్యంగా మాట్లాడేవారు. మా ‘అనూహ్య’ డైరక్టర్ గిరిధర్ గారికి ఆయన ఒకప్పుడు మంచి స్నేహితుడు కూడాను! ఇంకొకాయన బాపూగారి సినిమాలని మనకి అందంగా చూపించిన కెమెరామాన్ ఎమ్.వి. రఘు గారు. ఓసారి బీరం మస్తాన్‌రావుగారు భోజనాల దగ్గర “నెమలి మాంసం చాలా బాగుంటుంది” అంటే, రఘు గారు “నేను తిన్నాను… బాగా పీచులా వుంది” అన్నారు. మస్తాన్‌రావు గారు తడుముకోకుండా “అది వృద్ధ నెమలి లేవయ్యా… నేను దాని మనవరాలిని తిన్నాను” అన్నారు. మా చైర్మన్ ‘శ్రీ’ గారు “మీ ఇద్దరికీ ప్రభుత్వం పప్పుచారు అన్నం పెడ్తుంది జైల్లో.. నెమలిని వేటాడడం నేరం” అన్నారు.

పాపం సల్మాన్‌ఖాన్‌కి ఎప్పుడూ ‘లేడి’ వల్లే ప్రాబ్లెమ్స్‌ట… తెలుగులో అయినా, ఇంగ్లీషులోనైనా!

ఏడిద రాజా నేనూ సీరియల్స్ చూస్తూ జోక్స్ వేసుకునే వాళ్ళం! ఏడిద రాజా పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బానర్‍పై కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలను నిర్మించిన ఏడిద నాగేశ్వరరావు గారి రెండో అబ్బాయి. పెద్దవాళ్ళు మా ఆకతాయితనాన్ని అల్లరిగా తీసుకునేవాళ్ళు! వాళ్ళు మా కామెంట్స్‌కి నవ్వేసేవాళ్ళు! ఓ సీరియల్‌లో హీరోయిన్ కన్నా ఎప్పుడూ పనిమనిషే ఎక్కువగా కనిపిస్తోంది…

“డైరక్టర్‍కి పనిమనిషి మేనియా పాపం…” అన్నాడు రాజా.

మస్తాన్‌రావు గారు “ప్రొడ్యూసర్‌ కేనేమో?” అన్నారు.

నేను ఆ జోక్ ‘మధుమాసం’ సినిమాలో పెట్టాను.

ఎమ్.ఎస్. నారాయణ డైరక్టర్, జయప్రకాష్ రెడ్డి ప్రొడ్యూసర్. టీ.వీ. ఛానెల్‍లో క్రియేటివ్ హెడ్‌గా వున్న స్నేహకి సీరియల్ కోసం కథ చెప్పడానికి వస్తారు (ఆ నవల రాసే రోజుల్లో నేను మాటీవీకి క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వుద్యోగం చేసేదాన్ని).

ఎమ్.ఎస్. కథ చెప్తుంటే “హీరో… విదేశాల నుండి ఇంటికొస్తాడు…” అనగానే,

జయప్రకాష్ రెడ్డి “వెనకాల పనిమనిషి పేడ కలిపి జల్లదా వుంటది…. కురచ బట్టలేసుకుని” అంటాడు.

“హీరోయిన్ విషాదంగా ఏడుస్తుంటుంది…” అంటే, “వెనకాల పనిమనిషి ఇల్లు వుడుస్తా వుంటది.. కురచ బట్టలేసుకుని” అంటాడు.

మొత్తానికి ఏ సీన్‌లో అయినా పనిమనిషి తప్పదన్న మాట!

ఇలా మా బృందం చెప్పుకున్న సరదా కబుర్లు నా సినిమాల్లో, సీరియల్స్‌లో కామెడీ ట్రాక్స్‌గా మారేవి.

రోజుకో సీరియల్ లోని పదమూడు ఎపిసోడ్లు సాయంత్రం దాకా చూడాలన్న మాట. అప్పట్లో ఇప్పడొస్తున్నంత నాసిరకం సీరియల్స్ వచ్చేవి కావు! వాటినే మేం ఆట పట్టించేవాళ్ళం.

నేను సాయంత్రం వచ్చినా ‘అనూహ్య’ సీరియల్ రాసుకునేదాన్ని. అది వీక్లీ సీరియల్ కాబట్టి పెద్ద ప్రాబ్లం వుండేది కాదు! పైగా నేను ఎప్పుడూ ఫాస్ట్ రైటర్‌నే.

బీరం మస్తాన్‌రావు గారు ఓసారి నేను నాన్ వెజిటేరియన్స్ మీదున్న చిరాకుని చూపించానని, ‘అనూహ్య’ లో ఓ సీన్ చూసి తెగ నవ్వి చెప్పారు.

నిజానికి నేను ఆ భావంతో రాయలేదు. హీరోయిన్‌కి భర్త స్నేహితురాలూ, ఆమె తండ్రీ ఎర్రని జ్యూస్ తాగుతుంటే… అది రక్తంలా, వాళ్ళిద్దరూ మనుషుల్ని పీక్కుతినే రాక్షుసుల్లా, కొమ్ములూ, కోరలతో వూహించుకుంటుంది.

పదింటికి స్టార్ట్ చేస్తే వెంటనే టీ, రెండు ఉస్మానియా బిస్కెట్స్ ఇచ్చేవారు! నేను అదే మొదటిసారి ఉస్మానియా బిస్కట్స్ తినడం… చాలా ఎడిక్ట్ అయిపోయానా తర్వాత ఆ బిస్కెట్స్‌కి. మధ్యాహ్నం లంచ్. ఎంత బాగుండేదో… గోల్కొండ నుంచి తెప్పించేవారనుకుంట! చాలా సరదాగా జోక్స్ చెప్పుకుంటూ తినేవాళ్ళం!

మళ్ళీ మూడు గంటలకి టీ, ఉస్మానియా బిస్కెట్స్. మా ఛైర్మన్ శ్రీగారు కూడా సరదా మనిషి.

లక్ష్మీ దేవదాసు కనకాల గారు ప్రతి ఏక్టర్ డిక్షన్ గురించి కామెంట్ చేసేవారు! చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లు కూడా వారి ఏక్టింగ్ ఇన్‌స్టిట్యుట్‌ల నుండే వచ్చారు. ఆ రోజుల గురించే చెప్పేవారావిడ. అర్ధరాత్రి నాటకాల వాళ్ళు ఓ పన్నెండు మంది వచ్చినా, దేవదాస్ గారు, “లక్ష్మీ భోజనాలు పెట్టు” అనేవారట.

అప్పట్లో సుమ ఏంకరింగ్ మొదలుపెట్టి, బిజీ అవుతోంది. “ఈరోజు పనిమనిషి రాలేదు. కూతురూ, కోడలూ ఇద్దరూ షూటింగ్‍లకి వెళ్ళిపోయారు… నాకు తప్పదుగా… అంట్లు తోమి వంట చేసొచ్చేసరికి ఆలస్యం అయింది ఇవాళ..” అనేవారు ఎప్పుడైనా.

మా జ్యూరీ పీరియడ్‌లోనే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ రిలీజయింది. అందులో జూ.ఎన్.టి.ఆర్.తో బాటు రాజీవ్ కనకాల కూడా ముఖ్యపాత్ర వేసాడు. అది పెద్ద హిట్ అయ్యింది. దానికి మాటలు గంగోత్రి విశ్వనాథ్ రాసాడు. అతను దివాకర్ బాబు గారి బావమరిది!

రాఘవేంద్రరావు గారు ‘శాంతినివాసం’ తీసే రోజుల్లో రైటర్ కావాలంటే నేను వెళ్లాను. అక్కడ సినీమేక్స్ కట్టిస్తున్న రోజులవి. ఓ షెడ్‍లో పొడవాటి అబ్బాయి కూర్చుని “జనార్దన మహర్షి గారు చెప్పారండీ, రమణీగారొస్తారని. ఇదిగోండి ఈ కేసేట్‌లో నేను నా సొంత గొంతుతో చెప్పిన లైన్ ఆర్డర్ వుంది. మీరు మాటలు రాయాలి” అని, “మా నాన్నగారు కుడా రైటరేనండీ. విజయేంద్ర ప్రసాద్ గారు. నాకు మాత్రం డైరక్టర్ అవ్వాలనండీ…” అన్నాడు.

“విష్ యూ ఆల్ ది బెస్ట్ బాబూ!” అన్నాను. అతనే రాజమౌళి. నేను రాసిన డైలాగ్స్  కె.ఆర్.ఆర్. గారికి… అంటే రాఘవేంద్రరావుగారికి చాలా నచ్చాయట. ఆ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. నేను ‘దూరం’ అని ఆలోచించి ఆ సీరియల్ వదులుకున్నాను.

ఆ ప్లేస్‌లో గూడూరు విశ్వనాథ శాస్త్రి, తర్వాత ‘గంగోత్రి విశ్వనాథ శాస్త్రి’ అన్నారు, అతన్ని పెట్టుకుని, అతన్ని తనతో బాటు ‘స్టూడెంట్ నెంబర్ వన్’కి కూడా తీసుకెళ్ళాడు రాజమౌళి! నేను ‘డెస్టినీ’ని చాలా నమ్ముతాను! నన్ను చాలా సార్లు ‘నిచ్చెనలు’ ఎక్కించిందీ… ‘పాము’ చేత కరిపించిందీ అది… ఈ జీవిత వైకుంఠపాళిలో!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here