జీవన రమణీయం-39

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నసుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఇం[/dropcap]తకీ చెప్పేదేవిటంటే, ఆ జ్యూరీ పీరియడ్‌లోనే ‘స్టూడెంట్ నెంబర్ వన్’ హిట్ అయింది. లక్ష్మీ కనకాల గారు మాకు పార్టీ ఇచ్చారు!

ఆ స్నేహమే ఈనాటికీ రాజీవ్ కనకాలకీ, జూ.ఎన్.టి.ఆర్.కీ కొనసాగుతూ వుంది. సుమని ‘వదినా’ అంటాడు కూడా!

మేం అప్పట్లో ‘అంతరంగాలు’, ‘కళంకిత’… అన్నీ వీక్లీ సీరియల్సే చూసాం. డెయిలీలింకా ఊపు అందుకోలేదు. వీక్లీస్‍లో మంజులానాయుడు గారు తీసిన ‘ఆగమనం’ – రూపాదేవీ, శరత్‌బాబూ, దీక్షిత్ గార్ల సీరియల్ చాలా బావుండేది. అప్పట్లో వాణీనగర్‌లో, మల్కాజీగిరి దగ్గరున్న మంజులానాయుడూ, బిందూనాయుడూ గార్లు, మా బావగారింట్లో, వారి పక్కింట్లో ఆర్.కె.శాస్త్రి గారింట్లో కూడా షూటింగ్ చేశారట!

లక్ష్మీ దేవదాసు కనకాల గారు ఎన్నో కష్టాలు చూసినావిడ, మంచి మనిషి. రాజేంద్రప్రసాద్‌కి తను ఇడ్లీలోకి చేసే కొబ్బరి పాలు అంటే ఇష్టం అని చెప్పేవారు. కొబ్బరి రుబ్బి, పాలు తీసి, అందులో పోపు వేసి లైట్‌గా ఉప్పు కాని చక్కెర కానీ వేస్తే అది ఇడ్లీలోకి బావుంటుందట! మెంబర్స్‌కి కొంచెం వాల్యూలూ, అర్హతా వున్నాయా? అని చూసి జ్యూరీలో వేసేవారు అప్పట్లో!

కాని మేం జ్యూరీలో వున్నామని తెలియగానే, చాలామంది నటులూ, ప్రొడ్యూసర్లూ, డైరక్టర్లూ మా ఫోన్ నెంబరు తెలుసుకుని సిఫార్సు కోసం ఫోన్స్ చెయ్యడం నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది! జడ్జీలకు నచ్చి ఇవ్వాలి కానీ, ఇలా రికమెండేషన్‌తో నంది తెచ్చుకుంటే మాత్రం ఏం విలువా? అనేదాన్ని. మస్తాన్‌రావు గారిని ‘నాన్నగారూ’ అనమనేవారు. దానికి నాన్నగారు “నంది ఎలా వచ్చిందో పాపం ఆ మూగ ప్రాణి చెప్పలేదు కూడానూ…!” అనేవారు… ఆ మాటకొస్తే మనం దేవుడ్నే కటకటాల్లో పెట్టి తాళం వెయ్యమూ!

జ్యూరీలో ఒక రోజు మాత్రం నేను అర్జెంటుగా షూటింగ్‌కి వెళ్ళాల్సొచ్చి వెళ్ళలేదు. ఆ రోజున కేసెట్స్ ఇంటికిచ్చి చూసి రమ్మన్నారు. నేను చూసి వెళ్ళాను.

ఫైనల్ డే రోజున అంతా మా నోట్స్‌లు చూసి పాయింట్స్ చెప్పి, ఏ సీరియల్‍కి ఎందుకివ్వాలో చెప్పాలి. అందరం లైక్ మైండెడ్ వాళ్ళమే కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. అది సీల్ చేసి, ఎం.డి. గారు… అప్పట్లో పార్థసారథి గారు… ఆయనకి అందించాం. వెంటనే వెంట పెట్టుకుని వెళ్ళి ముఖ్యమంత్రి ఛాంబర్‌లో చంద్రబాబుగారికి అందజేయడం, ఆయన మమ్మల్ని అభినందించి ఫోటో తీయించుకోవడం; మళ్ళీ ఎఫ్.డి.సి.కి రాగానే ప్రెస్ మీట్. ప్రెస్ వాళ్ళు మేం తయారుచేసిన లిస్ట్ ఎం.డి. గారు చదువుతుంటే, బోలెడు ప్రశ్నలు వేశారు. టీ.వీ.లో స్క్రోలింగ్ కూడా న్యూస్ లైవ్‍లో… అంతా అలా వేగంగా, కనురెప్ప కొట్టే వ్యవధి లేకుండా, వెంట వెంటనే జరిగిపోయాయి.

అందర్నీ గోల్కొండ హోటల్‌లో బఫేకి తీసుకెళ్ళారు. అక్కడ చిత్రంగా మా ప్రొడ్యూసర్ ఎం.ఆర్.వి. ప్రసాద్, హీరో దిలీప్ కలిసారు. అంతా కలిసి మాటలు ఎక్కువా, భోజనం తక్కువా! అలా స్కూల్ పిల్లల్లా సరదాగా నెల రోజులు గడిచిపోయాయి. ముఖ్యంగా నాకు కారు పంపేవారు రోజూ! గవర్నమెంట్ వెహికల్ వచ్చి ఇంటి  ముందు ఆగడం చాలా ప్రిస్టీజియస్‌గా వుండేది. వెహికల్ తీసుకోని వాళ్ళకి ఎలవెన్స్ ఇచ్చేవారు.

మాకు ఏది తక్కువ కాకుండా పెళ్ళివారిలా చూశారు. అదో అనుభవం… ఆ తరువాత చాలాసార్లు జ్యూరీలో వేసినా, ఈ జ్యూరీని నేను మరిచిపోలేను.

తర్వాత అంకిరెడ్డి గారు పోయారని వారి అబ్బాయి ఓరోజు తెలియపరిచారు. చాలా బాధ కలిగింది. నిండు మనసూ, హుందాతనంతో ఖద్దరు బట్టల్లో వచ్చే పెద్ద మనిషి! ఆయన రూపం ఇప్పటికీ నాకు జ్ఞాపకం!

ఇటీవలే ఏడాది క్రిందట బీరం మస్తాన్‍రావుగారు పోయారు. నవీన లక్ష్మి గారే మొదట పోయారు. వాళ్ళ ఇంటికోసారి వెళ్ళాను. బేగంపేటలో శ్యామ్‍లాల్ ఎపార్ట్‌మెంట్‍లో వుండేవారు! ఆవిడ ఆయన్ని బావా అని పిలుస్తూ వుండేది.  ఆవిడ్ని ఆయన చిన్న పిల్లని చూసుకున్నట్లు చూసుకునేవారు!

ఆవిడ పోయాకా, చాలా ఏళ్ళు నేను మాట్లాడే సందర్భం రాలేదు. కానీ ‘యోగా’ క్లాసెస్ ఏవో పెట్టించమని ఫిల్మ్ నగర్ క్లబ్‌లో రామానాయుడి గారి దగ్గరకొచ్చారని ఆయన నాతో అన్నారు.

ఓసారి నవ్యలో కథ చదివి నాకు ఫోన్ చేసి “రమణీ… నేను మళ్ళీ వివాహం చేసుకున్నాను” అన్నారు. నేను చాలా విస్తుపోయాను!

“ఈవిడ నాకు నవీన లక్ష్మి కన్నా ముందు నుండీ తెలుసు… భర్త పోయాడు. ఒక కూతురికి విహాహం చేసేసింది. నేను స్వంత ఇల్లు కట్టాను. అందులో వున్నాం” అన్నారు.

“మంచిది నాన్నగారూ” అన్నాను.

తర్వాత ఓ ఏడాదికి బీరం మస్తాన్‌రావు గారు పోయారని ఎవరో చెప్పారు. ఆయనకు నా నివాళి.

సరే… లక్ష్మిదేవీ కనకాల గారు గత ఏడాదే సునాయాసంగా ప్రాణం విడిచారు. ఆవిడ కూతురు శ్రీలక్ష్మి కూడా నా సీరియల్ ‘అనూహ్య’లో నటించింది. ఆ అమ్మాయి వివాహం మేం జ్యూరీలో వున్నప్పుడే ‘పెద్ది రామారావు’ అని ‘ఋతురాగాలు’కి పనిచేసిన రచయితతో జరిగింది. లక్ష్మీదేవిగారితో పరిచయం మరువలేనిది. కష్టసుఖాల గురించి ఎంతో చెప్పేవారు. చివరికి పిల్లలు స్థిరపడి ఆనందమయమైన జీవితం గడిపారు! “రాజీవ్ మీ దగ్గరే వుంటాడా?” అని అందరూ అడుగుతూ వుంటే నాకు బాధేస్తుందమ్మా… ఒక్కడే కొడుకు… వాడు మమ్మల్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్తాడు?” అనేవారు నాతో. అందుకు కోడలు ‘సుమ’ని కూడా మెచ్చుకోవాలి. చివరిదాకా ఆవిడకి కూతురిలా మెసిలింది.

ఈ చిత్రసీమ నిజంగా విచిత్రసీమ. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాను వక్కంతం వంశీ, సుమా హీరో హీరోయిన్లుగా, దాసరి నిర్మించారు! ఇద్దరూ అందమైన వాళ్ళే. మంచి ఉచ్చారణతో ఆ అబ్బాయి ఈటీవీ వార్తలు కూడా చదివేవాడు! కానీ వాళ్ళకి వేరే రంగాల్లో పేరు రావాలని రాసి పెట్టి వుంది!

అతనీ వేళ స్టార్ రైటర్… ఏ పెద్ద హీరోకి కథ ఇచ్చినా సూపర్ హిట్. తనూ ‘నా పేరు సూర్య’తో డైరక్టర్ అయ్యాడు ఈ మధ్య!

సుమ ‘గీతాంజలి’ అని విదేశాలలో నిర్మించిన సీరియల్‍లో మొదట నటించింది. అందం, అభినయం, కళా వున్న ఆమె ఏంకర్‌గా స్థిరపడి నీరాజనాలు అందుకుంటోంది! ఎవరికి ఏం రాసి పెట్టి వుందో ఎవరికీ తెలీదు! ‘శాంతినివాసం’ ఎపిసోడ్ డైరక్టర్ రాజమౌళి ఈ రోజున బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిగాంచి మేటి దర్శకుడనిపించుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here