జీవన రమణీయం-40

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

ఎప్పుడు ఎవరేం అవుతారో మనం చెప్పలేం! ‘అనగనగా ఓ అమ్మాయి’ అనే సినిమాకి నేనే పేరు పెట్టి, స్క్రీన్ ప్లేలో పాలు పంచుకునేదాన్ని అని చెప్పానుగా… అప్పట్లో సామవేదం షణ్ముఖశర్మ గారు శ్రీదేవి మూవీస్ ఆఫీస్ కొచ్చేవారు. “స్వాతి చినుకా… సందె తళుకా నచ్చే నాజూకా… సాహో చందమామ తునకా… రావే కౌగిలింటి దాకా…” అనే పాట రాశారు. శ్రీకాంత్, పూనమ్‌ల మీద దృశ్యీకరించారు దాన్ని! అప్పట్లో అనుకోలేదు ఆయన ఇంత ఆధ్యాత్మికవేత్త అవుతారని!

అలాగే… నేను ‘అనూహ్య’ సీరియల్ రాస్తున్నప్పుడే, ఈటీవీకి ఓ టెలీఫిల్మ్ కావల్సొచ్చి, మా డైరక్టర్ గిరిధర్ గారు “నేను మాచిరాజు కామేశ్వర్రావు అనే రైటర్ షార్ట్ స్టోరీ ఒకటి చదివాను ‘నైజం’ అని. దాన్ని మీరు స్క్రీన్ ప్లే రాసి, డైలాగ్స్ కూడా ఇస్తే టెలీఫిల్మ్ చేద్దాం” అని ఆ కథ నా చేతికిచ్చారు.

ఈ మాచిరాజు కామేశ్వర్రావు గారి పేరు నేను చిన్నప్పటి నుండీ చందమామల్లో చూస్తూనే వున్నాను రచయితగా. నా పెళ్ళి అయి ఆనంద్‌బాగ్‌లో వెంకటస్వామి గారి ఇంట్లో అద్దెకున్నప్పుడు, మా వెనుక వీధిలో వుండేవారాయాన. ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం అనుకుంటా. వాళ్ళావిడ మా ఇంటావిడ నరసమ్మగారి దగ్గర జాకెట్లు కుట్టించుకోడానికి వచ్చేది! వాళ్ళ తమ్ముడు మురళి డాక్టర్. మా బావగారి ఇంట్లో ప్రాక్టీసు పెట్టాడు. మధుమీనన్ అనే డాక్టర్‌దా ఇల్లు. ఆయన దుబాయ్ వెళ్ళిపోతే ఈ అబ్బాయి ప్రాక్టీస్ పెట్టాడక్కడ. నాకు పొడుగ్గా వుండే మాచిరాజు కామేశ్వర్రావు గారితో పరిచయం అవలేదు కానీ చూడడం ఆనందంగా వుండేది.

అసలు విషయం మాచిరాజు కామేశ్వర్రావుగారు కాదు! ఆయన రాసిన కథలో ఓ కారెక్టర్ వుంది. మేదకుడూ, మొరటువాడూ,  బండవాడూ అన్నమాట!

గిరిధర్ గారు బాగా ఆలోచించి అప్పట్లో ‘విధి’ సీరియల్ డైరక్ట్ చేస్తున్న అనిల్ కుమార్ గారిని ఏక్ట్ చేయమన్నారు. ఆయనకి కుదరక, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే, కనబడినప్పుడల్లా వేషం అడిగే ఓ కుర్రాడు గుర్తొచ్చి, ఈ మేదకుడూ బండవాడూ పోర్షన్‌కి వెంటనే పిలిచి వేషం ఇచ్చారు. అతనెవరో కాదు, ‘బండ్ల గణేష్’! ఇప్పుడింత పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నామా?

రోజుకి ఐదు వందలిచ్చారేమో, ఆ రెండు రోజులకీనూ!

మా ఫ్రెండ్ సుమిత్ర, నేను కె.ఎస్. రామారావు గారి సీరియల్స్‌కి పని చేసే రోజుల్లోనే, ‘భార్యా గుణవతీ శత్రు’లో నటించడమే గాక ఎడిటర్‍గా కూడా అక్కడ పనిచేసేది! అప్పట్లో తను ఏదో టూర్‌కి యూరప్ వెళ్తే, ఆ టూర్‌లో మంజీత్ అనే ఫ్రెండ్ – తన భర్త రైటర్ అనీ, ప్రస్తుతం ఏవో స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ ఖాళీగా వున్నాడనీ, డైరక్షన్ ఛాన్స్ ఎప్పుడొస్తుందోననీ చెప్తూ వుండేదట!

ఆ అబ్బాయే రాజూ హిరానీ! తర్వాత మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, 3 ఇడియట్స్, పి.కె., సంజూ లాంటి సినిమాలు డైరక్ట్ చేసి తిరుగులేని డైరక్టర్ అనిపించుకున్నాడు!

నా దగ్గర అసిస్టెంట్‍లుగా చేరిన కుర్రాళ్ళు అనిల్ రావిపూడి, వెంకటేష్ కుడుములా, ఇప్పుడు హిట్ డైరక్టర్స్ అయిపోయారు.

ఎప్పుడు ఎవరి స్టార్ తిరుగుతుందో, ఎవరు తారాపథానికి చేరుకుంటారో చెప్పలేం! ముఖ్యంగా ఈ చిత్రసీమలో. ఆర్.టి.సి.లో ఎన్.టి.ఎమ్. అంటే నాన్ టెక్నికల్ మేస్త్రీగా అప్పట్లో టెంపరరీ వేకెన్సీలు వుండేవి. అలా ఎన్.టి.ఎమ్.గా మా అమ్మ దగ్గర పనిచేసే ఓ వ్యక్తి సడెన్‌గా, పై నుండి కిందకి అంగారఖా వేసుకుని పెద్ద సంఖ్యా శాస్త్రజ్ఞుడిగా, దైవజ్ఞశర్మ పేరుతో కనిపిస్తే మా అమ్మ షాక్ తింది. కొంత కాలం ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా స్టేజ్ మీద ఈ వ్యక్తి తప్పక కనిపించేవాడు. సంపాదన కూడా హెచ్చుగానే వుండేది!

చిన్నప్పుడు చిల్లర  ప్రభాకర శర్మ అనే తెలుగు పండిట్ వుండేవాడు, మా ఎం.బి. హైస్కూల్‍లో. అది మిషనరీ హైస్కూల్. అయినా పెద్ద తెలుగు పండిట్ ప్రభాకర శర్మగారూ, చిన్న తెలుగు పండిట్  నూకల సీతారామశాస్త్రి గారూ, ప్రభాకర శర్మ గారి భార్య కుసుమకుమారి గారు మాకు మంచి తెలుగు చెప్పేవారు! కట్ చేస్తే… ఘటకేసర్‌లో ఓ ఆశ్రమంలో ‘సత్యానంద బాబా’గా ఈ చిల్లర  ప్రభాకర శర్మగారు నాకోసారి కనిపించారు. నేను అప్పుడే ‘ముక్తి’ అనే మూడు వారాల పెద్ద కథ జ్యోతికి రాసాను.

ఈ బాబా గారు ఒక్కరే వెళ్ళి అక్కడ అవతారం ఎత్తలేదు! పక్కన వుండే కార్మిక విద్యాలయంలోని టీచర్‌ని కూడా ‘మాతాజీ’ని చేసి, ఆవిడతో బాటుగా వెళ్ళిపోయి, పెళ్ళాం పిల్లలని వదిలేసి బాబా అవతారం దాల్చాడు!

వెంటనే భక్తులు, ఎకరాలకెకరాలు ఇచ్చేవాళ్ళూ తయ్యారు! ఇంకో స్వామీజీ పూర్వాశ్రమం కూడా నాకు తెలుసు. నేను ‘మయూరి’లో ‘ఆ ఒక్కటీ అడిగేసేయ్’ రాసేడప్పుడు అక్కడ శర్మాజీ అనే సబ్ ఎడిటర్ వుండేవాడు. సీరియల్ భాగం కోసం మా ఇంటికొచ్చేవాడు.  అప్పుడు ఈ మయూరి వారపత్రిక ఆఫీస్ ఆబిడ్స్‌లో వుండేది. భీం రెడ్డి దానికి ప్రొప్రయిటర్.

చిక్కడపల్లిలో ఓ అద్దె ఇంట్లో నివసించే శర్మాజీకి టీచర్‍గా పనిచేస్తున్న భార్యా, చిన్న పిల్లవాడూ వుండేవారు. మా ఏరియాలో ఓ స్థలం కొంటే, పాపం వాళ్ళు మోసం చేసారనీ, ఆ డబ్బులు వెనక్కిస్తారేమోనని చాలా కాలం తిరిగేవాడు… కొన్నాళ్ళకి సన్యసించి స్వామీజీ అయిపోయానని నాకు ఫోన్ చేసి చెప్పాడు.

మల్లాది గారి ద్వారా అతని ఆశ్రమం, అందుకు సంబంధింత ఆస్తులూ కూడా పెరిగాయని విన్నాను. వీళ్ళంతా కోటీశ్వరులిప్పుడు.

ఎలాగూ బాబాల గురించి చెప్తున్నా కాబట్టి మా ఇంట్లో జరిగిన ఓ వ్యవహారం కూడా మీకు చెప్పాలి. మా బామ్మకి హరనాథ్ బాబా భక్తి ఎక్కువ. సోనాముఖీ కూడా వెళ్ళొచ్చింది. అప్పట్లో ముమ్మరంగా నల్లకుంట ఏరియాలో భజనలు కూడా చేసేవారు. మా నాన్నకి ‘హరి’ అన్న పేరు అందుకే పెట్టుకుందావిడ. మాటకి ముందు ‘కుసుమహర’ అనడం కూడా మా నాన్నతో బాటు ఆవిడ సంతానం అందరికీ నేర్పిందావిడ.

మా తరం దాకా ఆ భక్తి రాలేదు. కొంత కాలం సత్యసాయి భజనలకి నేను వెళ్ళేదాన్ని,  పిల్లల చిన్నతనంలో. తర్వాత ఆ ఇంటి యజమాని నాతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఆ భజనలకి వెళ్ళడం మానేసాను.

మావారు జహీరాబాద్‌లో వుద్యోగం చేసారని చెప్పాను కదా! ఆ జహీరాబాద్‌కి వెల్తుంటే దారి పొడవునా ఏవో ఆశ్రమాలు కనిపిస్తాయి. అలాంటిదే ‘మొగడంపల్లి బాబా’ ఆశ్రమం.

నేను మావారు బుక్ చేసిన గెస్ట్ హౌస్‌లో మూడు రోజులున్నాను పిల్లలతో. అక్కడ కాపురం వున్న మహీంద్రా ఎంప్లాయీస్ భార్యలు నాకు పరిచయం అయి, నేను రచయిత్రినని తెలిసి, మురిసి నన్ను “మొగడంపల్లి వెళ్దాం రండి… అక్కడ ఓ వందో రెండొందలో ఏళ్ళున్న బాబా వున్నారు. వేడి వేడి కుతకుతలాడే అన్నం చేత్తో కలిపేస్తారు తెలుసా?” అని నన్ను తీసుకెళ్ళారు.

బాబా ఆశ్రమం బాగానే వుంది. బాబా అచ్చం షిర్డీ బాబా ఆహార్యంలోనే వున్నారు. కాని వయసు అంత కనిపించలేదు! ఓ మోస్తరుగా ముప్ఫైలలో కనిపించారు. నాతో బాగా మాట్లాడారు. అప్పుడు నా పిల్లల్ని చూసేదని చెప్పాగా… మా ఇంట్లో పనిమనిషి సుశీల కూడా నాతో వుంది. ఆయన మహత్యాలన్నీ వాళ్ళు చెప్తుంటే అదీ విని, చెంపలేసుకుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here