జీవన రమణీయం-41

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఎం[/dropcap]తలేసి వాళ్ళకైనా పేరాశ పుడ్తే పశువులౌతారు! ఓనాడు మా రెండో వాడి పుట్టినరోజు నాడు మాకు మా వదినగారి అన్నగారి కూతురు ఆరేళ్లది పోయినట్టు ఫోన్ వచ్చింది.

హుటాహుటీన అందరం బయల్దేరాం. అమ్మ తన మెడలో గొలుసు తీసి బుట్టలో వున్న పర్స్‌లో వేసి, ఏడుస్తూ వచ్చింది.

అమ్మ రిటైరయ్యాకా ఓ చంద్రహారం చేయించుకుంది. ఆవిడకి ఎప్పుడూ అప్పటిదాకా బంగారం మీద మోజు కలగనే లేదు. ఆ చంద్రహారమే ఆ రోజు తీసి పర్స్‌లో వేసి, ఆ పర్స్ బుట్టలో వేసి బయల్దేరింది. సరే.. పరామర్శ అయింది… ఏడ్చాం… అందరం తిరిగి వచ్చాం. రాత్రి అమ్మ పర్స్ తీసి చూస్తే చంద్రహారం లేదు. అమ్మ పాపం “నా కష్టార్జితమే” అని బాగా ఏడ్చింది! మా సుశీల కూడా పక్కనే వుండి “మీ బంధువుల్లో ఆవిడ తీసుంటుందీ… ఈవిడ తీసుకుంటుందీ” అంటూ ఎన్నో అనుమానాలు రేకెత్తించింది. నేను “మన సొమ్మైతే ఎక్కడికీ పోదమ్మా” అని ఓదార్చి మా ఇంటికొచ్చేసాను. ఇది డిసెంబరు 27న మా క్రిష్ణ పుట్టినరోజు నాడు జరిగింది.

తరువాత మా మేనల్లుడి పెళ్ళి కుదిరింది. అంటే  మావారి అక్క కొడుకు. రాం గోపాల్ అని అతనే మా ఛార్టర్‍డ్ ఎకౌంటెంట్ ఇప్పటికీ. తల్లి లేని పిల్లాడు, నేనూ మా ఆయన పీటల మీద కూర్చోవాలి. మా అత్తగారు వున్నారు అప్పటికి. ఫస్ట్ తారీఖు నాడు మా ఇంట్లో పెళ్ళి మాటలు అవుతున్నాయి.

అమ్మ కంగారుగా వచ్చి, “ఓసారి ఇలా రా” అని నన్ను పిలిచి, “చంద్రహారం సుశీలే కాజేసిందే” అంది.

అప్పటిదాకా మా అమ్మ సుశీలకి చీర కొనకుండా నాకు కొనేది కాదు! కన్నకూతుర్లా చూసేది! నేను షాక్ అయిపోయాను.

జరిగిన కథ అమ్మ ఇలా చెప్పింది. హారం పోయి నాలుగు రోజులయిందిగా, అమ్మకి ఆఖరి జీతం వచ్చింది. అమ్మ లెక్క పెట్టి, నాలుగు వేలు ఇంటద్దె ఇవ్వడానికి ఇంటావిడ ఇంట్లోకి వెళ్ళింది. ఇచ్చి తిరిగొచ్చి చూస్తే సుశీల అంట్లు తోముతోంది. పర్స్‌లో ఇంకో నాలుగు వేలు వుండాలి… రెండు వేలే వున్నాయి… అప్పుడే లెక్కపెట్టి వుండడం చేత అమ్మకి అనుమానం కలిగింది. “సుశీలా… పర్స్‌లో నాలుగు వేలుండాలి. రెండే వున్నాయి… ఎలా పోయాయి?” అందిట గట్టిగా. అది వెంటనే గొంతు పెంచి, “చంద్రహారం పోయినప్పటి నుండీ నీకు మతి మతిలో లేదు. కూర్చో.. మంచినీళ్ళు తాగు… నే చూస్తా… ఎక్కడ పారేసుకున్నావో…” అని అటూ ఇటూ వెదికినట్లు చేసి, “ఇదిగో ఇక్కడ పారేసుకున్నావ్…” అని దేవుడి పీట కింద నుండి తీసి చూపించిందట!

అమ్మకి దొంగ ఎవరో తెలిసిపోయింది. అయినా ఏమీ అనకుండా భయపడ్తూనే నాకొచ్చి చెప్పింది, “మా సుశీల అలాంటిది కాదమ్మా…. ఇల్లంతా అప్పజెప్పి వెళ్తానూ” అని అంటానని.

కాని నా బుర్ర చురుగ్గా పనిచేసింది. ఆ రోజు పొద్దుటే, “రేపు పనికిరాను. జనరల్ బజార్‍కి పోయి మా అమ్మాయికి పట్టగొలుసులు తేవాల” అంది. అది గుర్తొచ్చి, “అమ్మా దాన్ని ఏమీ అనకు… నాతో రా” అని అప్పటికప్పుడే ఓ స్క్రీన్ ప్లే మనసులో రాసుకునీ, ఫ్రిజ్ లోంచి ఓ నిమ్మకాయ తీసుకునీ, “నా వెంట రా..” అన్నాను.

మా కాలనీలో చివరకి ఓ రేకుల ఇంట్లో వుంటారు సుశీలా, మొగుడూ, ముగ్గురు పిల్లలూనూ.

మేం వెళ్ళేసరికీ దడిలో స్నానం చేస్తోంది. బయటకి వెళ్ళడానికి తయ్యారు అవుతోందన్నమాట.

“సుశీలా” అని పిలిస్తే, స్నానం చేస్తోందని వాళ్ళ పిల్ల చెప్పింది.

మేం అది స్నానం చేసొచ్చేసరికీ, మంచం మీద నిమ్మకాయ పెట్టాం. అది ఆదరాబాదరగా చీర చుట్టబెట్టుకుని వచ్చి, “ఏంటమ్మా ఇలా వచ్చారు?” అంది.

నేను నిమ్మకాయ చూపిస్తూ, “ఇది చూసావా? మొగడంపల్లి బాబా పంపించారు మంత్రించి. నాకు తెలిసిన అందరిళ్ళలో పెట్టమన్నారు. నిజంగా అమ్మ చంద్రహారం దొంగతనం చేసినవాళ్ళు రక్తం కక్కుకుని చచ్చిపోతారట!” అన్నాను.

“అయ్యో… అయ్యో… తియ్… నా మీద అనుమానమా?” కంగారుగా అది నిమ్మకాయ తోసి పారేస్తూ అరిచింది.

“అందరిళ్ళలోనూ పెడ్తున్నా… మా బంధువుల ఇళ్ళలో కూడా” అన్నాను.

ఆ తరువాత నేను అమ్మతో “ఏమీ కంగారు పడకు… నువ్వింటికెళ్ళు… అదే తెచ్చి ఇస్తుంది” అని చెప్పి, మా ఇంటి కెళ్ళిపోయాను.

కాసేపటికే అది ఏడుస్తూ, వెక్కిళ్ళు పెడ్తూ మా అమ్మ దగ్గరకి వెళ్ళి “ఎంత అపవాదు వేసింది నీ బిడ్డ? నేను దొంగనా? నా బిడ్డలూ, నా మొగుడూ రక్తం కక్కుకు చస్తారంటుందా?… నా కాళ్ళూ చేతులూ ఆడడం లేదు… నన్ను దీవించు… నా బిడ్డలు బాగుండాలని అను… నీ నోటితో అను!’ అని అమ్మ కాళ్ళ మీద పడి, “మంచి నీళ్ళు… మంచి నీళ్ళు” అని ఒగరుస్తుంటే… అమ్మ మంచినీళ్ళు ఇస్తూ దాన్ని ఓరకంట గమనిస్తునే వుందట. లేచి, మంచం మీద దుప్పటి తీసి, పరుపు గోళ్ళతో చింపి, జాకెట్టులోంచి గొలుసు తీసి, ఆ చిరుగులో వేసేసి, అమ్మ మంచినీళ్ళు తెచ్చేసరికీ… “అసలు సరిగ్గా చూసావా? నీ పరుపులో ఏవైనా పడిందేమో…” అని దుప్పటి ఎత్తి, పరుపు తడిమి… “ఇదిగో…ఇదిగో… ఇక్కడే వుంది… అనవసరంగా నన్ను అనుమానించావ్… నీ బిడ్డకు చెప్పు!” అని శోకాలు పెట్టిందట.

అమ్మ ‘దెబ్బకి దెయ్యం వదిలింది’ అనుకుని దాన్నీ, చంద్రహారాన్నీ తీసుకుని మా ఇంటికొచ్చింది. అది ఏ బొగ్గుల సంచీలో వేసి దాచిందో కానీ నల్లగా మసిబారిపోయింది. ఇంకాసేపు వుంటే దాన్ని జనరల్ బజార్‍కు తీసుకెళ్ళి అమ్మేసేదే! బాబా ఈ విధంగా తన మహత్యం చూపించారు అనిపించింది. అప్పటికి ఊరుకుని, రెండోనాడు ప్రొద్దుటే అది మా ఇంటికొస్తుంటే, నేను గేట్ మూసి, “ఇంక చాలు… ఇంటిని నీ చేతిలో కళ్ళు మూసుకుని నాలుగేళ్ళు పెట్టాను… నిశ్చింతగా వున్నాను… కానీ నీ మనసులోకి దురాశ అనే దెయ్యం ప్రవేశించి ఈ దొంగతనం చేసావ్… ఇంక ఎన్నడూ గేట్ దాటి రాకు… నీ మొహం నాకు చూపించకు” అన్నాను.

‘నేను అలాంటిదాన్ని కాదు… నీకు కృతజ్ఞత లేదు’ లాంటి మాటలు, అరిచి, తిట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను దాని మోహం చూడలేదు! మొగడంపల్లి బాబా అందుకు పనికొచ్చారు.

అమ్మది కష్టార్జితం…. అందుకే దొరికిందని నేను విశ్వసిస్తాను. ‘నీది కానిది ఎన్నడూ నీకు దక్కదు’. ఇది నిజం! మన కష్ట ఫలమే మనకు మిగుల్తుంది!

ప్రతి సినిమా స్టార్‌తో సుశీల ఫోటో తీయించుకునేది. ప్రతి షూటింగ్‌కీ నాతో పాటు వచ్చేది. ఇంట్లో మనిషిలా వుండేది. ఆ తర్వాత ఎన్నడూ నేను ఏ పనిమనిషినీ నమ్మి ఇల్లు అప్పజెప్పలేదు!

అమ్మ “ఎంత బాగా నాటకం ఆడి, దానంతట అది చంద్రహారం వెనక్కి ఇచ్చేట్లు చేసావే?” అని తెగ ఆశ్చర్యపోయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here