జీవన రమణీయం-51

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]కె.[/dropcap]వి.రమణాచారి గారి పక్కన కూర్చున్న అల్లు అరవింద్ గారు నన్ను చూసి, ఆయనతో, “ఈవిడ నాకు తెలుసు కానీ పేరు గుర్తుకురావడం లేదండీ… ఎవరూ?” అన్నారట.

రమణాచారిగారికి నా కథలు అంటే చాలా ఇష్టం. పైగా ఆయన నేను నంది అవార్డ్స్ జ్యూరీలో వున్నప్పుడు కూడా చూసారు. ‘లాలస’ అనే కథ మరోటి చదివి గతంలో పోన్ కూడా చేసి అభినందించారు. కాబట్టి ఆయన “ఆవిడ బలభద్రపాత్రుని రమణి…” అని వూరుకోకుండా “అమ్మా… రమణీ…” అని కేకేసారు.

మనసు బాలేక నేను వినిపించుకోకుండా వెళ్తుంటే, పక్కనున్న వెంకటరమణ “అక్కయ్యా, రమణాచారిగారు నిన్నే పిలుస్తున్నారు” అన్నాడు.

నేను తప్పదని వెనక్కి వెళ్ళి చేతులు జోడించాను. “అమ్మా రమణీ, అరవింద్ గారు నీ పేరు అడిగితే పిలిచాను” అన్నారాయన.

నేను అరవింద్ గారికి చేతులు జోడించి “నేను మీకు జ్ఞాపకం లేనేమో కానీ మీరు నాకు జ్ఞాపకం వున్నారు” అన్నాను.

కె.వి.రమణాచారి గారు “భలే కథలు రాస్తుంది…” అని ఏవో చెప్తున్నారు… నేను గేట్ వైపు నడిచాను.

“రమణీగారు!” అని వినిపించింది. తిరిగి చూస్తే అరవింద్ గారు నా వెనుకే వస్తూ, “మాట్లాడదామంటే అలా వెళ్ళిపోతున్నారేమిటీ?” అన్నారు.

“నేనెప్పుడు ఫోన్ చేసినా మీ పిఎ, మీరు దేశంలో లేరనే చెప్తుంది సార్… ఇవాళ వున్నారా?” అన్నాను.

ఆయన పెద్దగా నవ్వారు… “ఏ నెంబరుకి ఫోన్ చేస్తున్నారూ? ఇదిగో నా నెంబర్… నా పర్సనల్ నెంబర్… దీనికి చెయ్యండి…” అని నెంబర్ ఇచ్చారు.

ఆ తరువాత ఎప్పుడో సడెన్‌గా ఓ రోజు “నాకు ఓ పుస్తకం కావాలండీ… పోలిష్ రైటర్ రాసాడు… అతని పేరు తెలియదు… పుస్తకం పేరు తెలీదు… కానీ కావాలి… మీరు గుర్తొచ్చారు… తెచ్చి పెట్టగలరా?” అని ఫోన్ చేసారు.

“నేను అరవింద్‌నండీ, బావున్నారా?” అని ఆయన మాట్లాడుతుంటే సాధారణంగా నేనే కాదు, ఎవరైనా చాలా ఆత్మీయంగా ఫీల్ అవుతారు.

ఆయన ఆషామాషీగా అడిగేసారు కానీ ఆ పుస్తకం కోసం నేను చాలా కష్టపడి, ప్రతి లైబ్రరీకి ఫోన్ చేసి, ఆ కథ క్లుప్తంగా చెప్పి, చివరికి వారం లోగానే వెతికి పట్టుకున్నాను!

‘మంచి పుస్తకం’ అనే వాళ్ళు ప్రచురించారు దాన్ని. రామసిద్ధాంతి అనే ఒకాయన దాని పేరు ‘విరాట్’ అని చెప్పి, అనువాదం చేసినాయన పేరు కూడా చెప్పారు.

నేను ఆ పుస్తకం తీసుకెళ్ళి ఆయనకు ఇచ్చాను. నాతో మాట్లాడుంటే.. “ఆడవాళ్ళలో ఇంత సెన్స్ ఆఫ్ హ్యుమర్ చాలా తక్కువండీ!” అన్న మాట ఆయన అన్నారు. తరువాత ఏదైనా పుస్తకం గురించి విని, అది చదివే సమయం లేక, నాకు పంపించడం, నేను చదివి క్లుప్తంగా ఆయనకి కథ చెప్పడం అలవాటయింది.

అది ‘అందరివాడు’ నిర్మాణ సమయం… మా అన్నయ్యకి ఇద్దరు మగపిల్లలు… రవిచంద్ర, శరత్‌చంద్ర, నాకిద్దరు మగపిల్లలు అశ్విన్, కృష్ణకాంత్. ఆయన ప్రివ్యూకి పిలిస్తే నేను నలుగురినీ తీసుకుని ప్రసాద్ ల్యాబ్స్‌కి ప్రివ్యూకి వెళ్ళాను.

ఆ రోజు ప్రింట్ రాలేదు! షో కాన్సిల్ అయింది. నేను ఫోన్ చేసి, “షో కాన్సిల్ అయిందా?” అంటే ఆయన, “పిల్లల్ని తీసుకొచ్చారు కదా! వాళ్ళు డిజప్పాయింట్ అవకుండా సాంగ్స్ వెయ్యమని చెప్తాను” అన్నారు. అంతే కాకుండా అయనొచ్చి, మాతో జాయిన్ అయి సరదాగా పాటలన్నీ చూపించారు.

పిల్లలు డిజప్పాయింట్ అవకూడదన్న మాట నాకెంతో నచ్చింది!

అల్లు అరవింద్ గారితో 2006 నుండీ స్నేహం మొదలై… ఇప్పటికీ నిరాటంకంగా సాగుతూనే వుంది.  ఆ తరువాత ఏ సినిమా అయినా ప్రివ్యుకి వెళ్ళడం అలవాటయిపోయింది. ఓసారి ఇలాగే పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రివ్యూ వేస్తున్నారు. పిల్లలకిష్టం అని అన్నయ్య పిల్లల్నీ, నా పిల్లల్నీ తీసుకొని వెళ్ళాను… వెనుక వరుసలో పవన్ కళ్యాణ్, రేణూ దేశాయి, వాళ్ళ అబ్బాయి, చిరంజీవి, వాళ్ళ ఆవిడా, పిల్లలూ, అరవింద్ గారి కుటుంబం అంతా వున్నారు. నేను మా చిన్న మేనల్లుడు శరత్‌చంద్ర తెరవంక కాకుండా, వెనక్కి తిరిగి చూస్తుండడం గమనించి అడిగాను, “ఏంట్రా వాళ్ళనే చూస్తూ కూర్చుంటావా?” అని.

దానికి వాడు “కాదత్తా… మనమూ ఓ రోజున ఇలా మన ఫ్యామిలీ కోసం ప్రత్యేకమైన షో వేయించుకునే స్థితికి రావాలి” అన్నాడు.

అప్పుడే ఇంటర్‌మీడియట్ పూర్తి చేసాడు వాడు… ఇప్పుడు ఫస్ట్ షో అనే సంస్థ పెట్టి, దాని అనుబంధ సంస్థగా చాయ్ బిస్కెట్ అని పెట్టి, బాగా పాపులర్ అయి చాయ్ బిస్కెట్ శరత్‌గా, అడవి శేష్‌ని హీరోగా పెట్టి మహేష్ బాబూ, నమ్రతా శిరోద్కర్‌లు పార్ట్‌నర్‌లుగా ‘మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్’ బయోపిక్ తీస్తున్నాడు ప్రొడ్యూసరై!

స్కూల్ టీచర్‌గా నెలకీ 500 రూపాయలు సంపాదించే నేను ఈ సినిమా రంగంలోకి పెద్ద పెద్ద కలలతో అడుగుపెట్టలేదు… కానీ నా తరువాత తరం పెద్ద పెద్ద కలలతో అడుగుపెట్టింది! నా దృష్టిలో అసలు కలలే కనకపోవడం… పైకి రావాలని… అతి పెద్ద నేరం!

అల్లు అరవింద్ అంత పెద్ద ప్రొడ్యూసర్ పరిచయం అయి ఇంటికి పిలవడం, వాళ్ళావిడకి పరిచయం చెయ్యడం, నాకు ఫోన్ చేసి మాట్లాడడం, మా వారితో పరిచయం చేసుకోడం ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు ఆయన నాకు ఒక్క అవకాశం కూడ ఇవ్వలేదు? నా ప్రయత్నలోపమా? లేక ఆయనకి సాయం చేసే ఆలోచన లేకపోవడమా?” అనే సందేహం నా దగ్గరి స్నేహితులైన ఉమా, సుమిత్రా, లలితా లతో సహా చాలామందికి వుంది!

నా ప్రయత్నలోపం ఏదీ లేదు! ఓసారి నేను కథ చెప్తానని కలిసి ‘నీకూ నాకు మధ్య’ అనే కథ చెప్పాను. శేఖర్ బాబు గారు అడ్వాన్స్ కూడా ఇచ్చాకా వాళ్ళ అబ్బాయి వేరే కథ తీయడం వల్ల ఆగిపోయిందిగా మరి… అందుకే వెళ్ళి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. వెంటనే రూ.50,000/- అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించారు!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here