జీవన రమణీయం-53

4
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ప[/dropcap]రుచూరి గోపాలకృష్ణ గారు ఓ సారి పిలిచి “రామానాయుడు గారు ఏదైనా లవ్ స్టోరీ వుంటే చెప్పమని అంటున్నారమ్మా… ఆ శేఖర్‌బాబుకి చెప్పినది చెప్తావా?” అన్నారు.

“కానీ… ఆ రైట్స్ అరవింద్ గారి దగ్గర వున్నాయి గురువుగారూ” అన్నాను.

“కథ అయితే చెప్పి చూడు… అరవింద్ గారు ఇప్పుడు పెద్ద సినిమాలు తీస్తున్నారుగా?” అన్నారు.

“సరే” అన్నాను.

పరుచూరి గారు రామానాయుడి గారి దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.

నాకైతే చాలా టెన్షన్‌గా వుంది ‘రామానాయుడు గారి సినిమాలన్నీ చిన్నప్పటి నుండీ చూసాను. ఆయన గురించి చాలా విన్నాను. భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు తీస్తున్న ఆయన. అప్పటికే మూడు వందల సినిమాలు నిర్మించిన మూవీ మొగల్ డాక్టర్ రామానాయుడు గారికి నేను కథ చెప్పడమా’ అని.

సురేష్ గెస్ట్ హౌస్‌లో ఒకటవ నెంబరు గదిలో నేను వెయిట్ చేస్తుండగా, నలుపు చొక్కాలో, ఆజానుబాహుడైన వ్యక్తి… “ఏమ్మా?” అంటూ గంభీరంగా లోపలికి వచ్చారు.

నేను అమాంతం లేచి నిలబడ్డాను. “కూర్చో… కూర్చో… గోపాలకృష్ణ చాలా చెప్పాడు ఈ కథ గురించి…” అన్నారు.

నేను నమస్కరించి, గొంతు సవరించుకొని, ‘నీకూ నాకూ మధ్య’ కథ అంతా చెప్పా. ఆయన శ్రద్ధగా విన్నారు. కథ చెప్పడం అయిపోయాకా నేను టెన్షన్‌గా ఆయన వైపు చూసాను.

కళ్ళు మూసుకున్నారు… నేను పయిట కొంగు మెలి పెడ్తూ, టెన్షన్‌గా చూస్తున్నాను.

ఆయన నా కథ మొదటి సీన్ నుండి చివరి సీన్ దాకా గడగడా తిరిగి అప్పచెప్పారు… నేను ఆశ్చర్యంగా వింటున్నాను. ఎంత జ్ఞాపకశక్తీ? అని.

కథ పూర్తయ్యాకా, “బాగుందమ్మా… మనం ఈ సినిమా చేస్తున్నాం” అన్నారు.

నేను షాక్ అయ్యాను. ఎన్నిసార్లు చెప్పాలో, ఎంతమందికి చెప్పాలో, ఇంత పెద్ద ప్రొడ్యూసర్‌కి నేను చెప్పేది నచ్చుతుందో లేదో అని లక్ష ఆలోచనలు చేసాను అప్పటిదాకా.

“సరే… రేపటి నుండీ నువ్వు ఇక్కడే కూర్చో… నేను సత్యానందానికి చెప్తా… ఓసారి వినమని…” అన్నారు. తర్వాత టీ తెప్పించి, తన చేతులతో ఇచ్చారు.

ఆ రోజు నన్ను ఆయన కలిసిన రోజు చాలా మంచి రోజు. 2006లో కలిసిన ఆ రోజు నుండీ ఫిబ్రవరి 15, 2015 వరకూ ఆయన నన్ను చూసి “రండి కవి గారు… టీ తాగండి” అని తన చేతులతో అలాగే టీ ఇచ్చారు.

“మంచి కథ చెప్పండి నరసరాజు గారూ, సినిమా తియ్యాలి ఎన్.టి.రామారావు గారితో” అని నేను అడిగాను. నరసరాజు గారు మద్రాస్ బీచ్‌కి తీసుకెళ్లి “నాయుడు గారూ, ఓ కథ అందరూ వద్దని వదిలేసారు… మరి మీకయినా నచ్చుతుందో లేదో అని ‘రాముడు భీముడు’ కథ చెప్పారు అమ్మా… ఇదే మాదిరి మొత్తం కథ తిరిగి అప్పచెప్పి, షేక్ హ్యాండ్ ఇచ్చి “మనం ఈ సినిమా చేస్తున్నాం” అన్నాను. ఆయన కూడా తెల్లబోయాడు… అంత ఫాస్ట్‌గా నిర్ణయం తీసుకున్నందుకు… నేను అంతే రమణీ! కథ వినగానే నాకు తెలుస్తుంది, నేను తీయాలో వద్దో. ఈ కథ వినగానే నచ్చింది. మనం చేస్తున్నాం… అంతే!” అన్నారు.

ఆ తరువాత అప్పట్లో మంచి పేరు తెచ్చుకున్న మంచి సినిమా ‘ఆ నలుగురు’ డైరెక్టర్ చంద్ర సిద్ధార్థని పిలిపించారు. అతను చాలా బెరుకుగా అనిపించాడు. రామానాయుడు గారి ముందు ఎవరైనా భయంగా, కాస్త బెరుకుగానే వుండేవారు. నేను మాత్రం గౌరవం ఇచ్చినా, జోక్స్ వేస్తూ చనువుగా మాట్లాడేదాన్ని! అప్పటికే అక్కినేని నాగేశ్వరావు గారు నన్ను ఆప్తురాలుగా చూసేవారు… నాకు దగ్గర వ్యక్తి!

ఈయన కూడా నేను జోక్ చేస్తూ వుంటే బాగా నవ్వేవారు. సత్యానంద్ గారికి నవల పంపించారు. ఆయన నవల చదివి వచ్చారు.

మొదటిసారి చూడగానే “నవల చదివాను అమ్మా… చాలా బావుంది. మిమ్మల్ని ఇదివరకు ఓసారి రైటర్స్ అసోసియేషన్‌లో చూశాను” అన్నారు సత్యానంద్ గారు. చంద్ర సిద్ధార్థ కూడా “లేడీ టెక్నిషియన్‌తో సినిమా చేయాలి అనుకున్నాను” అన్నాడు.

మేము ముగ్గురం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మంచి స్నేహితులుగా ఉన్నాం. కొన్ని ముహూర్తాలు అలాంటివి!

 

మేం ముగ్గురం కాకుండా, ఇంకో కాండిడేట్ మా సిట్టింగ్‌కి వచ్చేవాడు. అతని పేరు సుబ్బరాజు! చాలా కబుర్లు చెప్పేవాడు. సినిమా వాళ్ళ గురించి ఆయనకి తెలియని విషయాలు ఉండేవి కావు… మరీ ప్రైవేట్ విషయాలు కూడా చూసినట్లు చెప్తూండేవాడు. నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది ఆ భాష. కానీ రామానాయుడు గారు “రమణీ! ఇతని అన్న నాకు స్నేహితుడు… ఇతన్ని అందుకే రానిస్తున్నాను. మన ఈ సినిమా చూసి, తను స్వంతంగా సినిమా తీస్తాడుట” అన్నారు. అందుకే నేను భరించేదాన్ని ఆ కబుర్లు.

అతను తన గురించి ఓ విషయం చెప్తూ ఉండేవాడు. “ఏం చేస్తుంటారు?” ఎవరైనా అడిగితే, “నేను పుట్టాకా ఇప్పటిదాకా ఏ పని చెయ్యలేదండీ, నా కూతురు, అల్లుడు, కొడుకు, భార్య కూడా ఏ మాత్రం సిగ్గుపడకుండా ‘మా నాన్న ఏ పని చెయ్యడు’ అని చెప్పుకుంటారు” అని! అతనికి రెండు కోట్లు బ్యాంకులో ఉండేవిట. “ఆ ఇంట్రెస్ట్ చాలు బతకడానికి” అనేవాడు.

చూడడానికి చిన్న పాతికేళ్ల కుర్రాడిలా, బక్క పలచగా, పొట్టిగా వుండేవాడు. తరువాత సుభాష్ అని పేరు మార్చుకొని ఓ సినిమా డైరెక్షన్ మొదలుపెట్టి, సినిమా తియ్యలేక మధ్యలో మానేశాడనుకుంటా.

సత్యానంద్ గారికీ, చంద్ర సిద్ధార్థకీ సుబ్బరాజు కామెంట్స్, కబుర్లూ చాలా కాలక్షేపంగా ఉండేవి. బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించేవారు.

నేను గమనించింది ఏమిటంటే, అతనికి కొన్ని కొన్ని మాట్లాడకూడదని, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదని తెలీవు! మిర్రర్స్ విజయలక్ష్మిగారిని నేనెప్పుడూ చూడలేదు… కలవలేదు! ఇతనే రామానాయుడు గారి దగ్గర ఆవిడ పీఏగా చేస్తూ, తరువాత మిర్రర్స్ అనే ఆ బ్యూటీ పార్లర్ పెట్టిందని, ఆవిడ నాయుడు గారికి స్వయంగా జుట్టుకి కలర్ వేస్తుందని చెప్పాడు. ఈ కబుర్లు నాయుడు గారికి అంతగా రుచించేది కావు! ఆయన ముఖం చిట్లించినా ఇతనికి అర్థం కాక, రెచ్చిపోయి ఇంకా ముందుకెళ్లి “ఎల్.విజయలక్ష్మీ, రాజసులోచనా…” అంటూ రామానాయుడు గారిని విసిగించేవాడు.

రామానాయుడు స్టూడియో చూసిన వాళ్లకి ఎవరికైనా తెలుసు… ప్రవేశించగానే వినాయకుడి ప్రతిమ ఉంటుంది! దానికి దండం పెట్టుకుని వెళ్లేదాన్ని. ఆ పైకి వెళితే గుడి ఉండేది. రోజు నిత్య పూజ చేయడానికి ఒక పూజారి.

మధ్యలో రోడ్డులో వెళ్తే నాయుడు గారి ఆఫీస్. సూర్య అనే అమ్మాయి పి.ఎ., రాజా అని మేనేజర్. రమేష్ ఎకౌంటెంట్. రానా, అభిరామ్ అనే సురేష్ బాబు గారి పిల్లలు అక్కడికి వస్తూ పోతూ ఉండేవారు. ఇంకాస్త పైకి వెళ్తే ఎత్తు మీద వెంకటేష్ బాబు ఆఫీస్. అప్పుడు గోపి అనే అతను వెంకటేష్ గారి పిఏగా ఉండేవాడు.

దాని మీదకి ఇంకా ఎత్తు ఎక్కి వెళ్తే సురేష్ బాబు గారి ఆఫీస్. దాని పక్కనే గదులు… సిట్టింగ్ కోసం, ఎడిటింగ్ కోసం. ఆ వెనకాల డైరెక్షన్, ఏక్టింగ్ శిక్షణ ఇవ్వడానికి స్కూల్ కడుతున్నారు. ఎడిటింగ్ రూమ్ ఎదురుగా అంతా పార్క్. అందమైన తోట. అక్కడినుంచి మెట్లు దిగితే, కింద రికార్డింగ్ స్టూడియో, ఇంకా కిందకు దిగితే ప్రివ్యూ థియేటర్ వుంటుంది.

మనం వినాయకుడి ప్రతిమ దగ్గరికి పైకి వెళ్లకుండా, కింద రోడ్డులో వెళ్తే, అక్కడ డబ్బింగ్ స్టూడియోస్, స్విమ్మింగ్ పూల్, ఇంకా పైకి వెళ్తే చక్కని తోట. అక్కడ రామానాయుడు గారికి వచ్చిన షీల్డులూ, అవార్డులూ అన్నీ పెట్టిన మ్యూజియం లాంటి ఒక గది!

ఆ ప్రివ్యూ థియేటర్లో ఎన్నెన్నో సినిమాలు చూశాను, ఆయనతో పాటు కూర్చుని. రూమ్ పైన ఉన్న గదిలో ఎన్నోసార్లు రెస్ట్ తీసుకుని దాన్ని నా నడుము నొప్పి వల్ల. ఆరు సంవత్సరాలు ఆ స్టూడియో నాకు రెండో ఇల్లులా వుండేది. ఆయన నాకు గాడ్ ఫాదర్. ఆయన దగ్గర ఎంతో స్వతంత్రం.

సరే, అసలు సంగతికి వస్తే… ‘నీకు నాకు మధ్య’ నవల సినిమా తీయడానికి నాయుడు గారు నిర్ణయించుకున్నారు. కానీ రైట్స్ మాత్రం నా దగ్గర లేవు! అల్లు అరవింద్ గారి దగ్గర వున్నాయి. నాయుడు గారికి ఈ విషయం చెప్పగానే, “సరే… దాందేముందీ, అడిగేద్దాం…” అని ఫోన్ చేశారు… ఇక్కడ ఒక తమాషా జరిగింది… ఈ సంఘటనే నాయుడు గారు అరవింద్ గారిని ‘మధుమాసం’ వంద రోజుల పండగకి కూడా పిలువకుండా ఉండడానికి కారణం అయింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here