జీవన రమణీయం-54

2
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]మానాయుడు గారు అల్లు అరవింద్‌గారికి ఫోన్ ట్రై చేస్తున్నారు. నేను ఎదురుగా వున్నాను. కాస్త దూరంలో మేనేజర్ రాజా నిలబడి వున్నాడు. అరవింద్ గారు ఎన్ని రింగ్‌లయినా తియ్యలేదు. కట్ అయింది. రెండోసారి కూడా చూసాకా, నాయుడు గారు “రమణీ… నీ ఫోన్ నుండి చెయ్యి…” అన్నారు.

‘అయ్యో భగవంతుడా’ అనుకున్నాను. అరవింద్ గారికి ఇంకా నాతో బాగా చనువు లేదు! నేను చేస్తే ‘అమ్మాయి అనవసరంగా చెయ్యదు పాపం’ అని తీస్తారేమో, తీస్తే ఈ పెద్దాయన ఏమనుకుంటారో అని భయపడ్తూనే చేసాను. నా ఫోన్ రెండు రింగులకే ఆయన టక్కున తీసి, “ఏవండీ… ఏవిటీ విశేషాలు, పొద్దుటే గుర్తొచ్చానూ?” అని సరదాగా ఏదో మాట్లాడబోయారు. “నా ఎదురుగా రామానాయుడు గారున్నారు… మీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నారు” అన్నాను కంగారుగా. “చచ్చాం… మీటింగ్‌లో వుండి ఆయన ఫోన్ తియ్యలేదు… మీరు పెట్టేయండి…” అని అరవింద్ గారు వెంటనే నాయుడు గారికి ఫోన్ చేసారు.

కానీ జరగాల్సిన డామేజ్ జరిగేపోయింది. నాయుడు గారికి తన ఫోన్ తియ్యలేదు, నా ఫోన్ తీసారని కోపం వచ్చింది. రామానాయుడు గారు “ఏవయ్యా అరవింద్, మా ఫోన్లు మీరు తియ్యరుగా?” అని హాస్యంగానే అని, తనకి నేను రాసిన నవల ‘నీకూ నాకూ మధ్య’ నచ్చింది కాబట్టి రైట్స్ కావాలని అడిగారు. ఆయన దానికి, “నేను నచ్చి కొనుకున్నాను. కానీ సమయం పట్టేట్లు వుంది… మీరు వెంటనే తీసే మాట అయితే మీకు ఇచ్చేస్తాను” అన్నారు.

రామానాయుడు గారు “సరే! ఆ అమ్మాయికి మీరిచ్చిన ఎడ్వాన్స్ 50,000/- మీకు పంపిస్తాను… రైట్స్ ఇవ్వండి… మీ నాన్నకీ నాకూ చాలా స్నేహం… మందులిచ్చేవాడు…” అని రెండు జోక్స్ చెప్పి పెట్టేసారు.

నాతో “చూసావా? నీ ఫోన్ తీసాడు…” అని ఒక రకంగా నవ్వారు.

ఆ తర్వాత ఈయన అరవింద్ గారి గీతా ఆర్ట్స్ పేరిట చెక్ ఇవ్వడం, ఆయన రైట్స్ ఇవ్వడం చకచకా జరిగిపోయి, సినిమా నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి.

అరవింద్ గారి గురించి వచ్చింది కాబట్టి, ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ‘పద్మవ్యూహం’ సీరియల్ నుంచి మా అందరికీ ఉద్వాసన చెప్పి ఈటీవీలో ఓ వ్యక్తి పుణ్యం కట్టుకున్నప్పుడే, అసిస్టెంట్ డైరక్టర్‌గా చేసే రవికాంత్ అనే కుర్రాడ్ని కూడా తీసేసారు. అతనికి నాతో కొద్దిగా చనువు. మా దగ్గర చేసే అసిస్టెంట్ డైరక్టర్స్ అందరికీ నేనంటే కొంచెం ఎక్కువ అభిమానమే ఉండేది. ఈ రవి కుటుంబ పరిస్థితులు ఏం బాలేవు. పల్లెటూరి నుండి వచ్చాడు. తల్లికి సుస్తీగా వుంది. తండ్రికి వ్యాపారంలో కలిసి రాలేదు. పొట్ట చేత పట్టుకుని తనూ, తమ్ముడూ సినిమా రంగం మీదున్న ఇంట్రెస్ట్ కొద్దీ ఈ సిటీకొచ్చి, తను డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో, తమ్ముడు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్స్‌గా చేరారు. అదే సమయంలో ఇతని పెద్దమ్మ కూతురికి డెలివరీ అయి, కవల పిల్లలు పుట్టి, చాలా రక్తం పోయి, అదీ రేర్ గ్రూప్ ఏబీ పాజిటివ్, వివేకానంద హాస్పిటల్‌లో పెట్టారు. ప్రాణానికే ప్రమాదం అన్నారు. ఆ సమయంలో ఇతనికి తినడానికి తిండి లేదు. హైదరాబాదులో వున్నాడని ఇతని రూమ్ కొచ్చారు ఆ అమ్మాయి భర్తా, తల్లీ, తమ్ముడూ. రవి నా దగ్గరకొచ్చి ‘ఏదైనా పని ఇప్పించ’మని రిక్వెస్ట్ చేసాడు.

నేను ముందుగా అరవింద్ గారికి ఫోన్ చేసి కేస్ అంతా చెప్పి, “మీ బ్లడ్ బ్యాంక్ నుండి ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి… ఇప్పటికే వారం రోజులయింది…. వాళ్ళు ఆ హస్పిటల్ బిల్ కూడా భరించే స్థితిలో లేరు, పైగా ఈ రవికాంత్‌కి పని కావాలి” అని చెప్పాను.

ఆయన “మొదట ఆ అమ్మాయి క్రిటికల్ కండీషన్‌లో వుంది కాబట్టి, మా ఎడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణారావు గారికీ, ఆ బ్లడ్ బ్యాంక్ పనులు నిర్వహిస్తున్న స్వామి నాయుడికీ తగిన సహాయం చేయమని చెప్తాను… బిల్ విషయం కూడా వర్రీ అవకండీ… తర్వాత ఆ కుర్రాడ్ని మా ఆఫీస్‌కి రమ్మనండి” అన్నారు.

అన్నమాట ప్రకారం, బ్లడ్ బ్యాంక్ నుండి రవీ వాళ్ళ స్వప్నక్కకి బ్లడ్ ఇప్పించడమే కాక, ఆ తడిసి మోపెడయిన బిల్ కూడా వాళ్ళ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ని పంపించి వివేకానంద హాస్పిటల్‌లో క్లియర్ చేయించారు. అసలు వాళ్ళ బంధువులకి రవికున్న ఇన్‌ఫ్లూయన్స్‌కి షాక్! ‘మనవాడికి ఇంత పలుకుబడి వుందా?’ అని. రవి మాత్రం నాకు కన్నీళ్ళతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

“నీకు పని కూడా ఇవ్వమని చెప్పాను. రేపు ఆఫీస్‌కి వెళ్ళు” అన్నాను.

రవి అరవింద్ గారిని కలుస్తున్నానని చచ్చేంత భయంతో ఆఫీస్‍కి వెళ్ళాడుట. ఆయనని కలవడం ఇండస్ట్రీలో ఎవరికైనా భయమే!

నేను రామానాయుడు గారైనా, అక్కినేని నాగేశ్వరరావు గారైనా, అల్లు అరవింద్ గారైనా మొదట్లోనే స్నేహం ఏర్పరుచుకుని చనువుగా మాట్లాడ్డం, వెళ్ళడం చేసేదాన్ని. నన్నూ, వాళ్ళు ఫ్రెండ్‌లా చూసేవారు. నేను వీళ్ళెవరికీ ఒక్కసారి కూడా పాద నమస్కారాలు చెయ్యలేదు, నేను గురువుగా స్వీకరించిన ఒకరిద్దరు సీనియర్ డైరక్టర్స్, రచయితలకి తప్ప!

రవి వెళ్ళగానే ఆయన, “ఏం చదివావు?” అని అడిగి, “బిఎస్‌సి కంప్యూటర్స్” అనగానే, కంప్యూటర్ దగ్గరకి తీసుకెళ్ళి ఓపెన్ చెయ్యమని కొన్ని ప్రశ్నలు అడిగారట. ఆయన టెక్నాలజీని ఇష్టపడ్తారు. 1986 నుండీ కంప్యూటర్ వాడ్తున్నారు. అప్పటికి నేనైతే నిరక్షరకుక్షిని ఆ విషయంలో. తరువాత ఆయన నా మెసేజ్ గుర్తుకు తెచ్చుకున్నారట! ‘ఇతను చాలా ఆర్థిక కష్టాలలో వున్నాడు… వెంటనే ఏదైనా సాయం చెయ్యండి’ అని రాసాను.

దాంతో ఓ కెమేరానీ, కెమేరామేన్‌నీ ఇచ్చి రవిని రహస్యంగా ఓ సర్వే చేసుకుని రమ్మని పంపారు. అప్పుడే చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయదలచుకుని ఆ విషయం అరవింద్ గారితో సమాలోచనలు చేస్తున్న తరుణం. రవికి ముందుగా 5,000/- ఇచ్చి, ఇంట్లో ఇచ్చి వెళ్ళమన్నారు. అతని భోజన సదుపాయాలకి మేనేజర్ ఏర్పాటు చేస్తాడు.

కానీ ఇదంతా ఓ పదిహేను రోజుల పని! తర్వాత మళ్ళీ జరుగుబడి కావాలిగా! అందుకే, రాగానే నేను మళ్ళీ “అతను అసిస్టెంట్ డైరక్టర్… బాగా పని తెలిసినవాడు. టీ.వీ. సీరియల్స్‌లో నలిగిన ఎక్స్‌పీరియన్స్. అతన్ని సినిమాకి పంపించండి” అని పోరాను.

అసలు నా గురించి, నా కెరీర్ గురించీ ఇలా ఎవరినైనా పోరి వుంటే, ఎక్కడ వుండేదాన్నో! అదో అమాయకత్వం, ఎంతసేపు ఎవరికో వుద్యోగాలు వేయించీ, వైద్య సాయాలు, ఆర్థిక సాయాలూ చేయించీ ఆనందపడడంతోనే సరిపోయింది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here