జీవన రమణీయం-59

0
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మ[/dropcap]రునాడు ఉదయం తొమ్మిదింటికి బయలుదేరి కార్లో స్టూడియోకొచ్చాను. నాయుడు గారు వచ్చి, మనతో మాట్లాడరు. మొదట అక్కడున్న వెంకటేశ్వరస్వామి పాదాలకి పూలు వేసి, దణ్ణం పెట్టుకుంటారు. ఆ తరువాత తన కుడి చేతి చూపుడువేలుకున్న వెంకటేశ్వరస్వామి వుంగరాన్ని కళ్ళకి అద్దుకుని, పని కుర్రాడితో “రేయ్… టీ తేరా” అని అప్పుడు మనని పలకరిస్తారు.

“ఏంటి రమణమ్మా? మొహం చిన్నపోయింది?” అనో “ఏంటివాళ మొహం వెలిగిపోతుంది?” అనో ఒక్క చూపుతో ఎదుటివారి మూడ్ కనిపెట్టి మాట్లాడ్తారు.

ఆ వేలికున్న వెంకటేశ్వరస్వామి వుంగరం ఆయన సెంటిమెంట్! ఒకసారి విమాన ప్రమాదంలో మన ఇండస్ట్రీలో అతిరథ మహారథులు అందరు కూడా వుండడం మీకు తెలిసిందే కదా! ఆ ప్రమాదం అప్పుడు, విమానం కుదుపులతో అటూ ఇటూ పడిపోతుంటే, అంతా పెద్దగా ఏడ్పులూ, పెడబొబ్బలూ పెడ్తుంటే, ఈయన “ఏం కాదు… మనని సేఫ్‌గా చేరుస్తారు. అందరికీ చాలినన్ని పారాచ్యూట్స్ కూడా వుంటాయి…” అని చెబుతున్న వారల్లా, పెద్ద కుదుపుకి కింద పడి, అక్కడున్న కుర్చీ పట్టుకుని, తన చేతివైపు చూసుకుంటే వుంగరం లేదుట! అంతే… ‘నా వెంకటేశ్వరుడు’ అని గగ్గోలుగా పెద్ద శోకం మొదలుపెట్టారట. చుట్టూ వున్న వాళ్ళు ‘ఇదేమిటి ఇంతమందికి ధైర్యం చెప్పి ఇలా ఏడుస్తున్నారు?’ అని అనుకున్నారట. ఇంతలో ఎవరో “ఇదిగోండి మీ ఉంగరం… క్రింద దొరికింది” అని తీసిచ్చారట. నాతో ఆ విషయం చెప్తూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు… అంత అపురూపం ఆయనాకా వుంగరం! వాళ్ళ నాన్నగారంటే ఆయనకి ప్రాణం. ఈయనకి 14 ఏళ్ళ వయసులో వినోభాభావేగారి పిలుపుతో వుత్తేజితులై “నా భూములన్నీ పేదోళ్ళకి రాసేస్తా” అని అనేక ఎకరాలు రాసిచ్చేసారట… ఆ తండ్రి ఏమీ అనలేదట. కాలేజీలో చదువుకునేటప్పుడు, గాంధీగారి ఆదర్శాలు విని ప్రభావితం అయి, హరిజనవాడల్లో వీధులన్నీ వూడ్చేవారుట స్నేహితులతో. వాళ్ళ నాన్నగారు “ఇదేమిట్రా… వాళ్ళు వచ్చి మన వీధులూ, ఇళ్ళూ తుడిస్తే, మీరెళ్ళి వాళ్ళ వీధులు వూడుస్తారు… ఆ పనేదో మన పెరట్లోనే చెయ్యండి… పనాళ్ళని తీసేయచ్చు” అని నవ్వేవారట.

పుట్టగానే తల్లిని కోల్పోయిన ‘నాయుడమ్మ’ అనే రామానాయుడిగారికి తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకుంటే, ఆ మారుటి తల్లే దైవ స్వరూపం! ఆవిడకి పుట్టిన సంతానమే తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ. అపరిమితపు ప్రేమ వాళ్ళ మీద!

మళ్ళీ నా కథలోకి వస్తే, నాయుడుగారు నన్నూ చంద్ర సిద్ధార్థనీ అన్నపూర్ణ స్టూడియోస్‌కి సుమంత్‌కి కథ చెప్పడానికి పంపించారు.

మొదట మనం కలవాల్సింది సుమంత్ చెల్లి సుప్రియని. “యాండీ… ఎలా వున్నారూ?” అని చాలా ప్రేమగా, చనువుగా పలకరిస్తారావిడ. కాసేపటికి సుమంత్ వచ్చాడు. “తాత చెప్పారు మీరు వస్తారని” అని నాతో అన్నాడు. “మావయ్య విన్నారా? ఆయనకి నచ్చిందా?” అని చంద్ర సిద్ధార్థని అడిగాడు. ఆయన మావయ్య అన్నది రామానాయుడుగారిని. ఎండుకంటే సుమంత్ తండ్రి సురేంద్రగారికి స్వంత అక్క రాజేశ్వరిగారు, నాయుడిగారి భార్య. అందుకే నాయుడుగారు మావయ్య. ‘సురేష్ బావా, వెంకటేష్ బావా’ అని వారి పిల్లల్ని సంబోధిస్తారు సుమంత్, సుప్రియా.

వాళ్ళు అతిథి మర్యాదలు చేసాకా, నేను కథ మొత్తం చెప్పాను. సుమంత్ శ్రద్ధగా విన్నాడు. కొన్ని సందేహాలు తన కారక్టరైజేషన్ గురించి అడిగాడు. కొన్ని సవరణలు సూచించాడు. మొత్తానికి బాగా నచ్చిందని చెప్పాడు.

ఇది ఈ సినిమా పర్వంలో ముఖ్యమైన ఘట్టం. హీరో కుదిరాడు. నాయుడుగారికి ఇంక హడావిడి… ‘రేపే మొత్తం సినిమా తీసేద్దాం’ అన్నంత తొందరుండేది ఆయనకి. అందుకే మూడు వందల పై చిలుకు సినిమాలు తీసి, భారతీయ భాషలన్నింట్లోనూ సినిమాలు తీసి పద్మ భూషణ్, దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు, ఎన్నో డాక్టరేట్లు పొందారు. ప్రతి సినిమా తన మొదటి సినిమాగానే భావిస్తూ, తన మొదటి సినిమా ‘రాముడు భీముడు’ గుర్తుకి తెచ్చుకునేవారు. గొప్పవాళ్ళు అవడం అంత తేలిక కాదు!

సుమంత్‌ని అధికారికంగా పిలిచి మాట్లాడారు. ఈ సంగతులన్నీ వెంకటేష్‌కి తెలుస్తునే వున్నాయి. నన్ను ఓసారి ప్రివ్యూ థియేటర్‌లో కలిసి “నాన్నకి తొందర… ఏక్చువల్లీ చేద్దాం అనుకున్నా… బట్ ఆల్ ది బెస్ట్” అన్నారు.

సురేష్ బాబు కూడా విధి లేక ఒప్పేసుకున్నారు. ఇంక హీరోయిన్స్ సెలెక్షన్, అప్పుడున్న అందరినీ అనుకుని, నేను ‘స్నేహ బావుంటుంది’ అన్నండుకు, “సరే… రాజా, స్నేహని మాట్లాడు” అన్నారు. స్నేహ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు అనగానే ఒప్పుకుంది. అలా హంసవాహినిగా స్నేహ, సంజయ్‌గా సుమంత్ కుదిరారు. ‘మాయ’ కేరెక్టర్‌కి ఆర్టిస్ట్ దొరకడం అంత సులభం కాలేదు! నాయుడు గారూ, చంద్ర సిద్ధార్థా కలిసి ముంబై కూడా వెళ్ళి సెలెక్షన్స్ చేసారు.

చందూ చెప్పాడు, నాయుడు గారు ముంబై వచ్చారనగానే, అనిల్ కపూర్, రాఖీ, రేఖా, డింపుల్ కపాడియా, కాజోల్, అజయ్ దేవగన్ ఆయనని చూడ్డానికొచ్చారట. రాఖీ స్వయంగా వంట చేసి తెచ్చిందట. అసలంత గొప్పాయన నాతో ఎంతో నిరాడంబరంగా, ఆత్మీయంగా మాట్లాడ్తూ అస్తమానం ఫోన్లు చేస్తూ పదకొండేళ్ళ కాలం నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా వున్నారంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది. నా పూర్వజన్మ సుకృతం అనిపిస్తుంది. నాగేశ్వరరావుగారు లాండ్‌లైన్‌కి ఫోన్ చేసినా మా వారూ, పిల్లలూ, ‘మీ బోయ్‌ ఫ్రెండ్’ అని ఆటపట్టించేవారు అప్పట్లో.

నాయుడుగారు మాత్రం సెల్‌కే ఫోన్ చేసేవారు. తియ్యడం ఆలస్యం అయినా, ఓ వేళ తియ్యకపోయినా చిరమర్లాడేవారు! రాత్రి ఎనిమిది తర్వాత చేసేవారు కాదు. అత్యవసరమైతే “సారీ అమ్మా ఈ టైమ్‌లో చేస్తున్నందుకు” అనేవారు.

నాయుడుగారు మద్రాసు వెళ్ళి సినిమాలు తీస్తానన్నప్పుడు, ఆయన తండ్రి ‘మందూ, సిగరెట్టూ, పేకాటా’ లాంటి వాటి జోలికి పోనని, చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేయించుకున్నారట. ఆ మాట వల్ల ఆయన ఎప్పుడూ వాటి జోలికి పోలేదని చాలా సార్లు చెప్పారు.

మేం మాయ కేరెక్టర్‌కి అప్పట్లో ప్రియమణినీ అనుకున్నాం, మంజరీ ఫడ్‌నిస్‌నీ ఆడిషన్ చేసాం. కానీ చివరికి పార్వతీ మెల్టన్ మా అందరికీ నచ్చింది. ఆమె మోహన్ బాబు కుమారుడు విష్ణు పక్కన అప్పుడు ఏక్ట్ చేస్తోంది. ఆ పాటలు తెప్పించుకు చూసారు నాయుడుగారు. ఆ పాత్రలో ‘ఏటిట్యూడ్‌’తో కూడిన ‘గ్రేస్’ వుండాలి. అది ఈమెలో వుంది అని నేను చెప్పాను. హంస కేరెక్టర్ సాత్వికమైన, అమాయక పాత్ర. దానికి స్నేహ కరెక్ట్. ఇంక మిగతా కేస్టింగ్ మొదలుపెట్టాం. ‘పద్మవ్యూహం’ సీరియల్లో కొన్ని వందల ఎపిసోడ్స్ ఆమె మీద రాయడం వల్ల నాకు మా అస్మిత అంటే ఇష్టం! అస్మితని పిలిపించి, స్నేహ ఫ్రెండ్ కేరెక్టర్‌కి అని పరిచయం చేసాను. ఆయన కాదనలేదు. పరుచూరి గోపాలకృష్ణ గారి అల్లుడు వరుణ్, పాటలు పాడ్తూ, మా ‘పద్మవ్యూహం’లో నేను క్రియేట్ చేసిన నారాయణ పాత్రలో బతికేస్తున్న చలపతిరాజుకీ, సమీర్, మిమిక్రీ చేసే ఫణిమాధవ్‌కీ… ఇలా నాకు తెలిసిన వాళ్ళందరికీ కేరక్టర్స్ ఇస్తుంటే, మా దర్శకుడు చందూ ఎప్పుడూ ఏం అనలేదు!

నాయుడుగారి పెరమనెంట్ ఆర్టిస్ట్‌లు చలపతిరావుగారూ, కవితా, గిరిబాబూ, శివపార్వతీ, దీపాంజలీ, అనితా, జయలక్ష్మీ, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డీ, ఎల్.బి.శ్రీరామ్, శివారెడ్డీ, ఏవిఎస్, రజితా, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం… ఇలా! ఈ కామెడీ ట్రాక్ విషయంగా నాకూ డైరక్టర్‌కీ గొడవైంది!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here