జీవన రమణీయం-61

0
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ము[/dropcap]హూర్తం అయిన మరునాటి నుండీ నల్లేరు మీద బండిలా ఏం సాగలేదు మధుమాసం కథ! సురేష్ బాబు రోజూ ఓసారి పిలిచి స్క్రిప్ట్ చెప్పమనీ, మార్పులూ చెయ్యమని అడుగుతూ, ‘బ్లాక్ బోర్డ్’ మీద చాక్ పీస్‌తో, హీరో గోల్…. టార్గెట్,… ప్లాట్ పాయింట్… క్లైమాక్స్… అని రాసి నా చేత మళ్ళీ మళ్ళీ చెప్పిస్తూనే వుండేవారు. నాయుడుగారు మాత్రం నవలని ఏ మాత్రం మార్చడానికి ఒప్పుకునేవారు కాదు! ఒక సింహంలా ఆయన నా వెనుక వుండేవారు. పిల్లలకి గౌరవం, విలువా ఇచ్చేవారు కానీ, తన నిర్ణయం అమలు చేసేవారు!

మలేషియాకి బట్టలు సర్దుకుని బయలుదేరాను. మధుమాసం సినిమా మొదలుపెట్టినప్పటి నుండీ ఏదో ఒక ఫంక్షన్ చేస్తుండేవారు నాయుడుగారు. ఎన్ని పట్టుచీరలున్నా సరిపోయేవి కావు! అప్పటికింకా ఇన్ని కొనేదాన్ని కాదు… కానీ నా ఫొటోలూ, చీరలూ ఒకావిడ తెగ ఫాలో అయి మెచ్చుకుంటూ వుండేదిట. ఆవిడే కౌముది సబ్ ఎడిటర్ కాంతి కిరణ్ పాతూరి… ఇప్పటి నా ప్రియమిత్రురాలు. అప్పుడు నాకు ఆవిడ పరిచయం లేదు!

ఆడియో ఫంక్షన్‍కి నేను చాలా సామాన్యంగా వుండే ప్రింటెడ్ జార్జెట్ చీర కట్టుకుని వెళ్ళడం చూసి చంద్రసిద్ధార్థ “అదేవిటీ? ఇంత పెద్ద పెద్ద వాళ్ళొచ్చే ఫంక్షన్. ఇలా వచ్చేరేంటీ?” అన్నాడు. నాకేం తెలీదు, ఆడియో ఫంక్షన్‌కి నన్ను స్టేజ్ మీదకి పిలిచి కూర్చోబెడ్తారనీ, మైక్ చేతికిచ్చి మాట్లాడమంటారనీ… మొదటిసారి ముహుర్తం అయ్యాకా ప్రెస్ మీట్‌లో మైక్‌లో బాగా మాట్లాడానుట….

ప్రతి ఫంక్షన్‌లో నా చేతికి మైక్ ఇచ్చి సినిమా గురించి మాట్లాడమనేవారు నాయుడుగారు. ఆయన నాతో, “నువ్వే చీర కట్టుకున్నా, రచయిత్రిగా నీ గ్రేస్ నీదే!” అని వూరడించారు.

మలేషియాకి వెళ్ళడానికి ఫ్లయిట్ ఎక్కాకా నా పక్కన ప్రేమ, ఇంకో పక్కన చంద్రసిద్ధార్థ కూర్చున్నారు. ఆ అమ్మాయి చాలా కలుపుగోలు పిల్ల. వచ్చీ రాని తెలుగులో ‘మేడం’ అంటూ, ‘చంద్రు గారూ’ అంటూ మాతో తెగ జోక్స్ వేసేది. చాలా అల్లరిగా సాగింది ప్రయాణం.

ప్రేమ, మంజు, పార్వతి మెల్టన్‌లతో రచయిత్రి

అసలు మలేషియాలో హోటల్స్ మెడ ఎత్తి పైకి చూసి, చూసి నాకు మెడ నొప్పొచ్చింది! అలా ఏ నూట యాభై అంతస్తులో మా రూమ్ వుంది. మేం డెస్టినీ అనే హోటల్‌లో వున్నాం. ప్రేమా నేను ఒక రూమ్‌లో వున్నాం. ప్రేమ చిన్న పిల్లాడ్ని వదిలిపెట్టి వచ్చింది. ‘ఖుషి’కి కూడా వర్క్ చేసింది. పవన్ కళ్యాణ్ స్టెప్పుల గురించి చెప్పేది. అల్లరెక్కువ చేసేది. మేము జతగా వుండేవాళ్ళం!

నాయుడు గారు సాయంత్రం, స్నేహనీ, సుమంత్‌ని, చంద్రసిద్ధార్థనీ తీసుకుని బయట వేరే చోట డిన్నర్‌కి వెళ్తు నన్నూ రమ్మని కబురు పంపారు. ప్రేమని వదిలి వెళ్ళలేక, వాళ్ళు ప్రేమని పిలువరు కాబట్టి, తలనెప్పిగా వుందని అబద్ధం చెప్పి మానేసాను.

సినిమాల్లో భోజనాల దగ్గరా, అక్కడా ఈ వర్గీకరణలూ, అసమానతలూ చాలా వుంటాయి. ఆ అమ్మాయిని నేను నా ఫ్రెండ్‌గానే చూసాను. చాలా రోజులు టచ్‌లో వుంది. తర్వాత డాన్స్ డైరక్టర్ అయి ‘ఢీ’ ప్రోగ్రామ్‌కి కూడా వచ్చింది జడ్జిగా. కళామాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చాలా సినిమాలు చేసింది.

నాయుడుగారు నా కోసం ప్రత్యేక శ్రద్ధతో వెజిటేరియన్ ఫుడ్ తెప్పించేవారు. సుమంత్ మాత్రం “ఇక్కడికొచ్చినా వంకాయా, సొరకాయా ఏం తింటాం మావయ్యా? వానపాములో, కప్పలో తిందాం రా” అనేవాడు నాయుడుగారితో. వెళ్ళిన మరునాడు ఆరు గంటలకల్లా ప్రేమ ఎప్పుడు లేచిందో తయ్యారయి వెళ్ళిపోయింది. నా రూమ్‌కి నాయుడుగారు ఫోన్ చేసి, “భయపడకు… వదిలేసి వెళ్ళాం అని… మధ్యాహ్నం లొకేషన్‌కి కారు పంపిస్తాను” అన్నారు.

ఆయన ఆరు అంటే ఐదుకే రెడీ అయి వెళ్ళిపోతారు. నేనేం భయపడలేదు. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళి, ఇంగ్లీషు బ్రేక్‌ఫాస్ట్‌ చేసి, ఇడ్లీ దోశా, మనం తినేటట్లు వుండవు, పుష్కలంగా ఫ్రూట్ జ్యూస్ తాగి, రూమ్ కొచ్చి, చక్కగా తయ్యారయి, బయటపడి ఒకే రూట్‌లో పేవ్‌మెంట్ మీద నడుస్తూ వెళ్ళి షాపింగ్ చేసేదాన్ని!

ఆలీబాబా నలభై దొంగలు కథలో గుహలో నిధులూ నిక్షేపాలూ లాగా గుట్టల్లా చాక్లెట్స్ పోసిన షాప్స్, కెమేరాలూ మొదలైన ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్స్ చాలా వున్నాయి. అన్నయ్య పిల్లలకీ, మా పిల్లలకీ ఐపాడ్స్ కొన్నాను. మలేషియాలో ఎక్కడ చూసినా అందమైన పూలతోటలు. ఎంత చూసినా తనివి తీరదు. చాలా అందమైన దేశం.

మధ్యాహ్నం లొకేషన్‌కి కార్ వస్తే, వెళ్ళాను. అక్కడే భోజనం. “ప్రామిస్ చేస్తూ వున్నా”  పాట షూట్ చేస్తున్నారు. పువ్వులు కట్టిన రిక్షాలు చూసాను. ఎన్నో ఫొటోలు మా కంపెనీ ఫొటోగ్రాఫర్ తీసాడు. అప్పుడు నా దగ్గర కెమెరా లేదు. టచ్ ఫోన్ కూడా లేదు. సుమంత్‍ని అడిగి, అతనికి చూపించి ఒక కెమెరా కొనుక్కున్నాను మరునాడు.

నాలుగు రోజులు షూటింగ్‌లో ‘రమణీ గారూ’ అంటూ వెనుక నుండొచ్చి నా కళ్ళు మూస్తూ, బస్‌లో స్టెప్‌లెయ్యమని ఫోర్స్ చేస్తూ స్నేహ చాలా దగ్గరైంది!

 

నాలుగు రోజులు గడిచాకా, ‘లంకావీ’ అనే ద్వీపానికి స్టీమర్ మీద వెళ్లాం. “మేం షూటింగ్ నిమిత్తం వెళ్తున్నాం” అని డైరక్టర్ అక్కడ టికెట్స్ ఇచ్చే అమ్మాయికి చెప్తే, నన్ను చూపించి, “మీ హీరోయినా?” అని అడిగిందని, డైరక్టర్ కుర్రాళ్ళందరికీ చెప్పి ఆట పట్టించాడు.

“ఔను… పదేళ్ళ ముందు కనిపించి వుంటే హీరోయిన్ అయ్యేది” అన్నారు నాయుడుగారు.

అందరూ షూటింగ్‌లో బిజీగా వున్నప్పుడు నాయుడుగారు పాత తరం సినిమా ఆర్టిస్టుల గురించీ, డైరక్టర్ల గురించీ నాతో చెప్తుండేవారు. నేనో టోపీ పన్నెండు రింగెట్స్‌కి కొని ఆయనకి ప్రెజెంట్ చేసాను. 2007లో 1 రింగెట్ ఇండియన్ కరెన్సీలో 16 రూపాయలకి సమానం. అది ఆయన పెట్టుకుంటే, సుమంత్ పెద్దగా నవ్వాడు. “మావయ్యా, అది లేడీస్‌ది” అన్నాడు. నేను మళ్ళీ వెళ్ళి జెంట్స్‌ది కొని తెచ్చాను. షూటింగ్ అయినన్నాళ్ళూ ఆయన అదే పెట్టుకున్నారు. షాపింగ్‌కి మా అందరికీ 100 డాలర్లు ఇచ్చారు నాయుడుగారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here