జీవన రమణీయం-66

1
5

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మ[/dropcap]ధుమాసం రిలీజ్ అయినప్పుడు నాన్న కూడా వున్నారు. ఫిబ్రవరిలో ఇది రిలీజ్ అయితే ఆయన అక్టోబరులో పోయారు. ఒక ఆనందం వెనుక విషాదం ఇస్తాడు దేవుడు పువ్వూ ముల్లులా!

మా డైరక్టర్ చంద్రసిద్ధార్థ దగ్గర కృష్ణ నాయక్ అని ఒక డ్రైవర్ వుంటాడు. ఇప్పటికీ వున్నాడు. అతను డ్రైవింగ్ తప్ప అన్నీ చేస్తాడు. వాళ్ళ తండా వాళ్ళందరినీ తీసుకెల్ళి, రేపు రిలీజ్ అనగా శాంతి థియేటర్‌లో రంగు కాయితాలూ, డైరక్టర్ కట్ అవుట్స్ అన్నీ పెట్టించాడు.

నా పేరు ఎడ్వర్టైజ్‌మెంట్స్‌లోనూ, బోర్డ్‌ల మీదా, టీ.వీ.లో చూసి అమ్మ చాలా ఆనందించింది. ఆ రోజు థియేటర్‌కి మా క్రూ అంతా, అమ్మతో సహా వెళ్ళి చూసాం! ఇదే ఆనవాయితీ ఏ సినిమాకైనా కూడాను! నాయుడు గారు సినిమా ప్రివ్యూ వేయించలేదు. దాంతో సహజంగానే ఇండస్ట్రీ పెద్దలంతా కూడా థియేటర్‌కే వచ్చి చూసారు.

ఫస్ట్ హాఫ్ అవుతూనే, వివిధ థియేటర్ల నుండీ చందూకి ‘సూపర్ హిట్’ అని మెసేజెస్ వచ్చాయి. సెకండ్ హాఫ్ అయ్యేసరికి ‘హిట్’ అని మాత్రం మెసేజెస్ వచ్చాయి. అందుకు కామెడీ ట్రాకే కారణం అని చందూ ఇప్పటికీ బ్లేమ్ చేస్తాడు!

ఇంటర్వెల్‌లో నేను ఉత్సుకత పట్టలేక బాత్రూమ్‌ల దగ్గర లేడీస్‌ని ‘సినిమా ఎలా వుందీ?’ అని అడిగితే, ‘మంచి ఫ్యామిలీ సినిమా. చాలా బావుంది’ అని చెప్పారు. నేను చాలా హేపీ అయిపోయాను.

నాయుడుగారు ముందు రోజు భార్య రాజేశ్వరి గారితో కలసి తిరుపతి వెళ్ళి ఫస్ట్ కాపీ పెట్టి పూజ చేయించి వచ్చారు. అది ఆయనకి సెంటిమెంట్.

ఫిబ్రవరిలో రిలీజ్ అయితే ఫిబ్రవరి 14న వేలెంటైన్స్ డే. జంటలతో యువతీ యువకులు వస్తే లక్కీ డిప్ ద్వారా బహుమతులిస్తాం! అని ప్రకటించారు. రామానాయుడు స్టూడియో చూడాలనే సరదాతో వచ్చారు. స్నేహ చెన్నై వెళ్ళిపోయింది. పార్వతీ మెల్టన్, సుమంత్, నేనూ, చంద్రసిద్ధార్థ, నాయుడుగారూ స్టేజి మీద కూర్చుని ఆ వేలంటైన్స్‌తో గడిపి, ప్రైజులిచ్చాం.

సినిమా రిలీజ్ అయినప్పటి నుండీ చాలా పండగలు చేసారు. సక్సెస్ మీట్స్, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ అన్నీ. నేను ‘రేపల్లెలో రాధ’కీ వెళ్ళాను. ‘మధుమాసం’కీ వెళ్ళాను. జెమినీ, ఈటీవీ, మా టీవీ అన్నింటికీ.

స్నేహ నా గురించి డెక్కన్ క్రానికల్‌లోఒక ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పింది. ఇంకో సారి జెమినీ టీ.వీ.కి వెళ్తే, వెనుక నుండి వచ్చి ‘కళ్ళు మూసింది’. చాలా ప్రేమగా మాట్లాడేది.

పార్వతీ మెల్టన్ అయితే, మా యింటికి వచ్చింది. నా పిల్లలూ, నేనూ, తనూ కలిసి సినిమాలు కూడా చూసేవాళ్ళం! చాలా అల్లరి చేసేది.

మా అశ్విన్ ఆర్కిటెక్చర్ థర్డ్ ఇయర్‌లో, మా చిన్నవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్‍లో వున్నారు మధుమాసం రిలీజ్‌కి. ఈ సినిమా నిర్మాణంలో వున్నప్పుడే మా అత్తగారి సంవత్సరీకాలు వచ్చాయి. పార్వతీ మెల్టన్ ఇంటికొచ్చి, మాతో నేల మీద కూర్చుని భోజనం చేసింది. చాలా సింపుల్‌గా వుండేది.

మధుమాసం చాలా స్లోగా పికప్ అయింది. నాయుడుగారితో కలిసీ, ఫ్రెండ్స్‌తో కలిసీ సినిమా రిలీజ్ అయ్యాకా ఎన్నిసార్లు చూసానో లెఖ్ఖ లేదు.

నాకు చాలా ఆనందం కలిగించిన విషయం, మా కస్తూరిబా గాంధీ కాలేజి ప్రిన్సిపాల్ విద్యారాణిగారితో సహా, మా లెక్చరర్లకి ప్రివ్యూ వేయించడం! అలా నాకు మాత్రమే ప్రివ్యూ వేయించడం నాయుడిగారి గొప్పతనం! రాగసప్తస్వరంలో నేను ఏక్టివ్‌గా వుండేదాన్ని కాబట్టి, ఆ సభ్యుల్ని కూడా పిలిచాను. మా లెక్చరర్లు మైక్‌లో ‘మా రమణి మాకు గర్వకారణం, మంచి నీట్‍గా వుండే కథ రాసింది’ అని నన్ను పొగిడి మాట్లాడారు.

మా అత్తయ్యని నాయుడిగారికి పరిచయం చేస్తే, “మేనత్తా? మీ ఆయన తల్లా?” అని అడిగారు. మా అత్తయ్య ఇప్పటికీ “రామానాయుడు గారు అని చెప్పి మురిసిపోతుంది. ఇప్పుడు 86 ఏళ్ళు ఆవిడకి. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు మధుమాసం సినిమాతో.

సిఎస్‌ఐ ఆర్కిటెక్చర్ కాలేజీలో మా అశ్విన్‌ని మూడో ఏడు దాకా బాగా రేగింగ్ చేసారు సీనియర్స్. పిల్లాడు ఇంటికొచ్చేదాకా నాకు చాలా బెంగగా వుండేది. అలాంటిది, కాలేజీలో ఒక సీనియర్ ‘వాళ్ళ అమ్మగారు రైటర్… మధుమాసం సినిమా ఆవిడే రాసారుట’ అని మిగతా పిల్లలకి చెప్పగానే వీడిని ర్యాగింగ్ చెయ్యడం మానేసారుట! వాడు ఇంటికొచ్చి ఆ విషయం చెప్తే నాకెంతో సంతోషం వేసింది. ‘చదువుకోండి…. 99% రావాలి’ అని నేనెప్పుడూ చెప్పలేదు పిల్లలకి. ‘మీకెంత సేపు చదవాలని వుంటే అంత సేపు చదవండి’ అని చెప్పేదాన్ని! మొదట నుండీ క్లాసురూములలో కూర్చుని నిర్బంధంగా వినే చదువు మీద నాకు గొప్ప అభిప్రాయం లేదు! చలం గారు అన్నట్టు “ఈ క్లాసురూమ్‌లోని మేజా బల్లలు… పూర్వజన్మ వాసనలతో వసంతం రాగానే చిగురిస్తాయేమో!” అనిపించేది. నేనూ రెగ్యులర్‌గా స్కూల్‍కి వెళ్ళి స్టూడియస్‌గా చదివేదాన్ని కాదు! ఎంత సేపూ ఎంటర్‌టైన్‌మెంట్ మీదే వుండేది నా ధ్యాస! అందుకే మా పిల్లలు కథలు రాసేవారు. అప్పుడే షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసేవారు. మా చిన్నాడు కృష్ణకాంత్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు. ‘వాక్స్‌ పాప్’లో మెంబర్‌గా వుండేవాడు. కాలేజ్ మేగజైన్ ‘వాక్స్ పాపులి’ ఎడిట్ చేసేవాడు. కె.కె. అంటే చాలా ఫేమస్‌గా వుండేవాడు! పిల్లలు ఎటువంటి జట్టీలూ పట్టీలూ ఇంటి మీదకి తెచ్చేవారు కారు! మా ఆయన జహీరాబాద్‍లో వుద్యోగం, నేను ఒంటరిగా పిల్లలతో వుండేదాన్ని. కానీ పిల్లలు ఎటువంటీ టెన్షన్స్ నాకు పెట్టేవారు కాదు! అందువల్ల కూడా నేను రచనా రంగంలో, ఇటు టీవీ, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాను. కానీ నా ఆరోగ్యం చాలా పాడైపోయింది. రాత్రుళ్ళు చాలా సేపు మేల్కొనడం, నిద్రలేమి, సరిగ్గా టైమ్‌కి తినకపోవడంతో బీ.పీ. వచ్చింది.

అక్కినేని నాగేశ్వరరావు గారు – ప్రమోషన్‌లో భాగంగా మాటీవీ వాళ్ళు వెళ్ళి ఆయన బైట్స్ తీసుకోడానికి వెళ్తే ‘రమణీ ప్రభాకర్ మంచి రచయిత్రి. నాకు బాగా తెలుసు’ అని మొత్తం నా గురించే మాట్లాడారుట. మా మేనేజర్ రాజా వచ్చి చెప్తే ‘నా అంత అదృష్టవంతురాలు లేదు’ అనుకున్నాను. ఆయన ఏ చిన్న సందర్భం వచ్చినా, రాగసప్తస్వరం ప్రోగ్రాం అయినా, నేను అక్కడ వుంటే నా పేరు చెప్పడం మరిచిపోయేవారు కాదు. అది నా భాగ్యం.

మా నాయుడు గారు ప్రతి రోజూ కలెక్షన్ గురించి నాకు చెప్తుండేవారు. సినిమా అయిపోయినా కూడా “నువ్వు ఇవాళ రావడం లేదా? ఫలానా వాళ్ళ కోసం షో వేస్తున్నాను… రా!” అని పిలుస్తుండేవారు. తప్పకుండా వెళ్తుండేదాన్ని.

“ఇంకో కథ రెడీ చెయ్యి” అని కూడా అంటుండేవారు. నాచేత బోయిన సుబ్బారావు గారికీ, ముప్పలనేని శివగారికీ, ముత్యాల సుబ్బయ్యగారికీ కూడా కథలు చెప్పించారు. కానీ మధుమాసం షూటింగ్ టైమ్‌లో నేను చెప్పిన ‘అందరి బంధువయా’ కథని చంద్రసిద్ధార్థ మర్చిపోలేదు. ఆ కథ తరువాత సినిమాగా తియ్యాలని నిర్ణయించుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here