జీవన రమణీయం-70

2
6

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]త[/dropcap]ర్వాత అరవింద్ గారికి ఫోన్ చేస్తే, పాస్‌పోర్ట్ కౌంటర్‍లోకి తీసేసుకుంటే వీసా వచ్చేసినట్టే అని చెప్పారు. నేను మొదటగా శరవణభవన్‌కి వెళ్ళి మినీ మీల్ తిన్నాను. ఆ రుచి ఇంకా గుర్తుంది. చిన్న కటోరీలో పులిహోరా, సాంబారన్నం, బిరియానీ, దద్ధోజనం, వెజిటబుల్ కర్రీ, నిమ్మకాయ ముక్కా, పాపడ్, పరవాన్నం… ఎంత బాగుందో! కొద్ది కొద్దిగా క్వాంటిటీస్… ఒక మనిషికి సరిపడేంత!

అక్కడి నుండి లాండ్ వ్యు అనే బుక్ షాప్‌కి వెళ్ళి కొన్ని పుస్తకాలు అశ్విన్‍కీ, కృష్ణకాంత్‌కీ కొన్నాను. కొన్ని స్వీట్స్, పళ్ళూ కొని సాయికృష్ణ (‘బాబాయ్ హోటల్‌’లో హీరో) వాళ్ళ అమ్మానాన్నగారి దగ్గరకు వెళ్ళాను. అక్కడితో మహాలింగంనీ, అరవింద్ గారి కారునీ వదిలి పెట్టేసాను. ఇప్పుడతను లేడు. డ్రైవర్‌గా రిటైరయి పెన్షన్ తీసుకుంటున్నాడుట!

అంకుల్, ఆంటీ టి.నగర్‌లో వున్నారు. బ్రహ్మాండమైన అపార్ట్‌మెంట్ కొన్నాడు సాయి. అప్పుడు తను ముంబైలో వుండేవాడు. పొవైలో తనకి అర్జెంటుగా ఓ అపార్ట్‌మెంట్ అవసరమైతే, నేను అరవింద్ గారిని అడిగి సాయికి కొన్నాళ్ళు ఇప్పించాను. ఆయనకి సాయి రెంట్ పే చేస్తానంటే, ఏమీ అఖ్ఖర్లేదు అన్నారు. కానీ సాయికృష్ణ, అల్లు అరవింద్ గారి స్వంత అపార్ట్‌మెంట్‌లో వుంటున్నాడు అనేసరికి చాలామంది వచ్చి ఆయనతో చెప్పి వేషాలు ఇప్పించమనేవారుట! సాయి నాతో చెప్పి నవ్వేవాడు!…

అసలు కొన్ని కొన్ని రికమండేషన్సూ, ఇన్‌ఫ్లూయెన్స్‌లు వాడడాలూ నేను క్షణికంగా అనుకుని చేసేస్తుంటాను, కాని ముందు కొంచెం కూడా, ఇది చెయ్యగలనా? అడగచ్చా? అని ఆలోచించను. అవి అవతల వాళ్ళకి చాలా వుపయోగకరంగా అయిపోతూ వుంటాయి. నేను చాలా సాయం చేస్తున్నాను అన్న భావం నాకు ఎన్నడూ రాలేదు. …అతనికి ఇబ్బంది వుండకూడదు… నా ఫ్రెండ్ అన్న భావన మాత్రమే! మా సాయి ఆ కృతజ్ఞత నా పట్ల ఆ తరువాత చాలా రకాలుగా చూపించాడు పాపం!

వాళ్ళ అమ్మానాన్నా కూడా నాతో ఎంతో ప్రేమగా వుంటారు. నన్ను తమ పెద్ద కూతురనుకుంటారు. సాయికి ఒక చెల్లెలు బీనా. ఆమెకో కొడుకు యష్. వాళ్ళు కూడా నన్ను చూడడానికి వచ్చారు. బీనా డి.ఎ.వి. స్కూల్లో టీచర్.

ఆంటీ అంకుల్ ‘భోం చేసి వచ్చానం’టే నొచ్చుకున్నారు. నేను సాయంత్రం ఫ్లయిట్‌కే హైదరాబాద్ వచ్చేసాను.

ఇంక అప్పుడు అమెరికా వెళ్ళడానికి నిజమైన తయ్యారీ చేసుకున్నాను.

గొల్లపూడి గారి అబ్బాయి రామకృష్ణగారికి నా ప్రయాణం ప్లాన్ పంపాను. మొదట బోస్టన్‌లో మా అక్క కూతురు శేషు దగ్గరకీ, అక్కడ 8 రోజులుండి, తానాకి న్యూజెర్సీ దగ్గరున్న నెవార్క్‌కీ, అక్కడ చిట్టెన్‌రాజు గారూ, గొల్లపూడి గారూ కలుస్తారు కాబట్టి వాళ్ళతో కలిసి హ్యూస్టన్, అక్కడి నుండి డల్లాస్, ఆ తరువాత కాలిఫోర్నియాలో డుబ్లిన్‌లో వుండే కిరణ్ ప్రభ గారింటికీ అని.

అప్పట్లో రాయల్ ఫ్లయిట్స్ అని ఎయిర్‌వేస్‌లో, ఎక్కువ ఖరీదు పెట్టి, ఆమ్‌స్టర్‌డామ్‌లో మారేట్టు ఫ్లయిట్ బుక్ చేశాడు గణేష్. జూన్ 26న బయల్దేరాలి. ఆగస్టు 8 న తిరిగి రావాలి. ఈ మధ్యలో నా ప్రయాణాలన్నీ రామకృష్ణగారు అతి చక్కగా ప్లాన్ చేసి టికెట్స్ బుక్ చేసి, “డబ్బులు గాంధీనగర్‌లో వున్న మా అత్తగారూ, మావగారూకి ఇవ్వండి… వాళ్ళకి మీ రచనలూ, మీరూ తెలుసు! ఆనందపడ్తారు” అన్నారు.

ఆయన చెప్పినట్లుగానే నేను వాళ్ళ అత్తగారూ, మామగారిని గాంధీనగర్‌లో వాళ్ళింట్లో కలిసి డబ్బులిచ్చాను. నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా మాట్లాడారు.

నేను చెప్పిన అన్ని ప్రయాణాలకీ కలిపి కేవలం 35వేలు అయింది. VUSA Ticket మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తే కనిపించలేదు! అన్ని ఫ్లయిట్స్‌లో గొల్లపూడి గారూ, ఆయన భార్య శివాని గార్ల పక్కనే సీట్! ఎంత సౌకర్యంగా బుక్ చేసారో, భోజనం వివరాలతో సహా… చెప్పలేను.

చిట్టెన్‌రాజు గారికి వీసా వచ్చిందని చెప్పగానే, “మరి ఆలస్యం ఎందుకూ? పెట్టీ అదీ సర్దుకో!” అన్నారు. తెలిసిన వాళ్ళంతా, “మా అబ్బాయి వుండే వూరికెళ్తే చెప్పు, వాడికి పచ్చళ్ళు పంపాలి, వడియాలు పంపాలి” అన్నారు. అప్పటికింకా ‘గరుడవేగ’ లాంటివి వేగం అందుకోలేదు. ఫెడెక్స్ తెలిసినా చాలా ఖరీదు అన్న భావన!

అమ్మని పిల్లల దగ్గర వుండమన్నాను. మా పెద్దమ్మగారుండేవారు, దుర్గాసావిత్రి అని. ఆవిడ మాత్రం “నిన్ను తీసుకెళ్ళకుండా మీ అమ్మాయి అమెరికా ఎందుకే వెళ్ళడం?… తీసుకెళ్ళచ్చుగా!” అంది.

మా అమ్మ “అది వెళ్తేనే నాకు ఆనందం” అంది.

అప్పట్లో అమ్మకి ఓపికుంది. కానీ నాకే ఎక్కడుండాలో, ఏం చెయ్యాలో తెలీదు! మొదటిసారి… చాలా భయంగా కూడా వుంది! అందుకే అసలా విషయం ఆలోచించలేదు.

ఇంక యూ.ఎస్.కి వెళ్తున్నాను కాబట్టి కొంత షాపింగ్ చేసాను. చలికాలం కాబట్టి, స్వెట్టర్లూ అవీ కొనలేదు కానీ, చిట్టెన్‌రాజు గారింటికీ, కిరణ్‌ ప్రభ గారి ఇంటికీ వెళ్తాను కాబట్టీ గిరిజ గారికి, కాంతి గారికి; డల్లాస్‌లో మా బావ నాగేశ్వరరావు ఇంటికీ వెళ్తాను కాబట్టీ, వాళ్ళావిడ సత్యకీ పట్టుచీరలు కొన్నాను. ఇంకా మా వదిన కూతురు శిరీషకీ, మా బాబు మావయ్య కోడలు అనితకీ ఇలా కొంతమందికీ గిఫ్ట్‌లు కొన్నాను. నేను న్యూజెర్సీ వస్తున్నానని తెలిసి, మా ఫ్రెండ్ లలిత తన చెల్లెలు గిరిజ దగ్గరకి వెళ్ళమంది. అప్పట్లో మా సాయి బాబాయ్ మరదలు కూతురు మానస కూడా కాలిఫోర్నియాలో వుంది. నేను ఎవరినీ వదిలిపెట్టదలచుకోలేదు!

ఒక పెద్ద సూట్‌కేసూ, ఒక చిన్న సూట్‌కేసుతో ప్రయాణానికి సిద్ధం అయ్యాను. అందులో పెద్ద సూట్‌కేస్ ఎరుపు రంగుది… ఆ సూట్‌కేస్‌కి పెద్ద కథ అయింది తర్వాత, అది గుర్తుపెట్టుకోవాలి.

అశ్విన్‌కి ఏ యూనివర్సిటీ నుండీ సీట్ ఇస్తున్నట్టు ఆఫర్ రాకపోవడానికి కారణం ఈ ‘విస్సూ కన్సల్టెన్సీ’ అని నాకు బోస్టన్ వెళ్ళేదాకా తెలీనేలేదు!

కృష్ణ ఇంకా ఇంజనీరింగ్ చేస్తున్నాడు. పిల్లల్నీ ఆయనన్నీ ఐదు వారాల పాటు వదిలి వెళ్ళడం నా జీవితంలో మొదటిసారి. చాలా బెంగగా అనిపించింది. 2008 జూన్ 24న మా లక్ష్మక్క పెద్ద కూతురు అరుణకాంతికి కొడుకు పుట్టాడు. నేను హాస్పిటల్‌కి అమ్మతో వెళ్ళి చూసాను. ఆ మరునాడే నా అమెరికా ప్రయాణం. లక్ష్మక్క చిన్న కూతురు శేషు దగ్గరికే మొదట వెళ్తున్నాను. మా శేష శైలజ తను బిటెక్ చేసేటప్పుడే సెంథిల్ అనే అబ్బాయిని ప్రేమించి లవ్ మేరేజ్ చేసుకుంది. అతనితో నాకు పెద్ద పరిచయం లేదు! కొత్త వాళ్ళ ఇంట్లో ఎనిమిది రోజులు ఎలా వుంటానో అని ఫీల్ అయ్యాను. మా శేషు నాకు చాలా క్లోజ్.. నేను ఎత్తుకుని పెంచిన పిల్ల. అది నాకు ప్రాబ్లెమ్ లేదు, అతనితో ఎలా మాట్లాడాలో అని  కాస్త సంకోచపడ్డాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here