జీవన రమణీయం-75

0
7

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]మేం[/dropcap] గుండ్రంగా వున్న ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాం. స్టేజ్ మీద పాటలు అవుతూనే వున్నాయి. ఇక్కడ అంతా డ్రింక్ చేయడం ప్రారంభించారు.

ఆకలి వేసి, మేం బయటకు వెళ్ళి భోజనం క్యూలలో నిలబడ్డాం. పేపర్ ప్లేట్లలో మనకి రాని భాషలో మాట్లాడ్తూ మెక్సికన్‌లూ, ఆఫ్రికన్‌లూ – వరుసగా వున్న టేబుల్స్  మీద మామిడిపప్పూ, వంకాయ కూరా, పులిహోరా, గారెలూ, చక్కెర పొంగలీ లాంటి బోలెడు అయిటమ్స్ ఖాళీ అయినప్పుడల్లా నింపుతూ పోతున్నారు. అమెరికాలో తెలుగు భోజనానికి నాకెక్కడా లోటు రాలేదు.

నేను హోటల్‌ రూమ్‌కి వచ్చి, గిరిజకి అంటే మా లలిత చెల్లెలికి ఫోన్ చేసాను. ఎంతో ఆనందపడి, మరునాడు పొద్దుటే వచ్చి కన్వెన్‍షన్ హాల్ దగ్గర కలుస్తానంది. ఇది నెవార్క్, తను న్యూ జెర్సీలో ఉంటుంది. ఉద్యోగం న్యూ యార్క్‌లో. రోజూ రైల్లో వెళ్తుంది. మంచి సింగర్ కూడా!

గొల్లపూడి గారి సూట్‌కేస్ హ్యాండిల్ ఒకటి విరిగిపోయింది. దాంతో ఆయన ఎవరో ఫ్రెండ్ కూతురుకి ఫోన్ చేసి పిలిపించారు. ఆవిడ పేరు మల్లాది వసంత. చాలా బావుంది ఆవిడ. సూట్‌కేస్ మోసుకుంటూ వచ్చింది. ఎంతైనా ఆయన తెలివైన వారు! చాలా సేపు కబుర్లు చెప్పుకుని, మరునాడు ఏడు గంటలకల్ల రెడీ అయి కన్వెన్‍షన్ హాలుకి వెళ్ళాలనీ, తెలుగు లిటరరీ చైర్ ఫోన్ చేసాడనీ చెప్పుకుని, గొల్లపూడి గారి ‘అమ్మ కడుపు చల్లగా’ ఆవిష్కరణ వుంటుందని మాట్లాడుకుని వెళ్ళి పడుకున్నాం.

చాలానే పట్టుచీరలు తీసుకెళ్ళాను. ఆ రోజు ఆకుపచ్చ పట్టుచీర కట్టుకున్నాను. నా ఫౌండేషన్ క్రీమ్ వింధామ్ హోటల్‌లో మర్చిపోయి వచ్చాను. నా కళ్ళు మాధవి అనే అమ్మాయి కనిపిస్తే తెచ్చి పెట్టమని చెప్దాం అని వెతుకుతూనే వున్నాయి.

చివరికి హాల్లో ఆ అమ్మాయి కనిపించింది. వరండా మీద వస్తున్న ప్రముఖులనీ, సినిమా తారలనీ, వనితా టీవీ కోసం ఇంటర్వ్యూలు చేస్తోంది. నన్ను చూడగానే గుర్తుపట్టి, “బలభద్రపాత్రుని రమణిగారు కదూ? మీరు నా రూమ్‌మేట్ కావలసినవారు… కొంతలో తప్పిపోయారు…” అంది. నేను వెంటనే ఆమె నెంబరు తీసుకుని “నా ఫౌండేషన్ క్రీమ్ తెచ్చి పెట్టమ్మా మధ్యాహ్నం వచ్చినప్పుడూ…” అన్నాను. ‘సరే’ అంది.

36 డాలర్లు పెట్టి కొన్నాను. డాలరు 54 రూపాయలు అప్పుడు మరి! మేం ఇడ్లీ, దోశా, ఉప్మా, వడలు, కాఫీలు, టీలతో పాటు అమర్చిన రూమ్‌లోకి వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆడిటోరియంలోకి వెళ్ళాం. చిట్టెన్‌రాజు గారి అధ్యక్షతన గొల్లపూడి గారి ‘అమ్మ కడుపు చల్లగా’ పుస్తకం ఆవిష్కరించబడింది. ఆ సభలో సడెన్‌గా ఈటీవీ సుమన్‌గారూ, ఆయన భార్య విజయగారూ కనిపించారు. సుమన్‌గారికి స్కిన్ కాన్సర్ వచ్చిందనీ, అమెరికాలో వైద్యానికి వెళ్ళారనీ, వాళ్ళూ వీళ్ళూ చెప్పుకుంటుంటే విన్నాను కానీ, ఆయనకి కాన్సర్ వచ్చాకా కలవలేదు. ఆయన రాసిన ‘శ్రీహరి స్వరాలు’ క్యాసెట్లు కూడా అక్కడే ఆవిష్కరించారు. నేను విజయగారి పక్కకెళ్ళి కూర్చుని పలకరించాను. ఆవిడ గుర్తు పట్టి పలకరించారు. ఆ స్టేజ్ మీద కూడా ఆయన “ఈ క్యాసెట్టు నా ప్రియమిత్రుడు ప్రభాకర్‌కి అంకితం ఇస్తున్నాను” అని చెప్పడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది! విజయగారు నిర్భావంగా చూస్తున్నారు. ఆయన స్పీచ్ తర్వాత మా సభ కంటిన్యూ అయింది. వాళ్ళు వెళ్ళిపోయారు.

వంగూరి చిట్టెన్‌రాజు గారు అంత హాస్యంగా మాట్లాడ్తారనీ, బోలెడు హాస్యనాటకాలు రాసి, అమెరికా అంతటా ప్రదర్శించారనీ, ఆయన పేరు చెప్పుకుని ఎంతో మంది అవి ఆడ్తున్నారనీ నాకప్పుడే తెల్సింది! నేను రచనలో హాస్యకథలే చదివాను ఆయనవి అప్పటిదాకా! అందుకే నన్ను మాట్లాడమన్నప్పుడు “ఈయన నాటకాలు రాయడు అనుకున్నా… అంటే నాటకం రాయరు కథలే రాస్తారు అనుకున్నా” అని మాట్లాడితే అందరూ చాలా నవ్వారు. నేను కూడా బాగానే మాట్లాడ్తానని చిట్టెన్‍రాజుగారొచ్చి పొగిడాకా తెలిసింది! పాపం బోలెడు డాలర్లు పోసి ఇంత దూరం తీసుకొచ్చారా… నేను బాగా మాట్లాడకపొతే ఎలాగూ? అప్పుడే రాళ్ళబండి కవితా ప్రసాద్ గారినీ, జంపాల చౌదరిగారినీ, ఇంకా చాలామందిని ఆ సభలో చూసాను.

మా సాహిత్య సభలు ఫెళ్ళున నవ్వులతో చాలా బాగా జరిగాయి. మిగతా కార్యక్రమాలూ, రికార్డింగ్ డాన్సుల వైపు మేం వెళ్ళలేదు. పద్మనాభరావు గారూ, శోభగారూ వచ్చారు. గొల్లపూడి గారి కొలీగ్ ఆయన అప్పట్లో ఆలిండియా రేడియోలో. శోభగారు ఎంత బావుంటారో! అప్పుడు పరిచయం అయిన ఆవిడా ఇప్పటికీ నాతో, ఎంతో స్నేహంగా వుంటారు. వీళ్ళు నాకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు. నేను చాలా గౌరవించేదాన్ని. రాళ్ళబండి గారి అవధానం మెయిన్ హాల్‌లో జరిగింది. ఎంతటి ప్రతిభా? ఏం వాక్చాతుర్యం? ఆయన నాకు బాగా తెలిసాకా, ఎక్కువ కాలం వుండలేదు ఈ లోకంలో…

 

లంచ్ టైమ్‌కి గిరిజ “నేనొచ్చా రమణీ! బయట నిలబడ్డాను” అని ఫోన్ చేసింది. నేనెళ్ళి చెయ్యి పట్టుకుని లాక్కొస్తుంటే, గేట్ దగ్గర పహిల్వాన్‌ల లాంటి వాళ్ళు కాకుండా మా నల్ల సూట్ల పెద్ద మనుషులు చేతికి బేండ్ చూపించమని ఆపారు. “మా చెల్లెలు… ప్లీజ్ వదిలెయ్యండి” అని నేను రిక్వెస్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి, ప్లేట్ చేతికిచ్చి భోజనం వడ్డిస్తుంటే, “రమణీ… బోలెడు డాలర్లు పోసి టికెట్ కొనాలి… ఇలా తీసుకొచ్చేసావేమిటీ?” అంది.

“నాతో మా అమ్మో… మా ఆయనో వస్తే రానిచ్చేవారు కారా? అందరూ భార్యల్ని తీసుకొచ్చారుగా?” అన్నాను. గిరిజ నవ్వింది.

గొల్లపూడి గారిని “రేపొచ్చి నేను కార్లో మీకు ఊరు చూపిస్తా” అనగానే, “ఇంత అందమైన ఆడ డ్రయివరా?” అన్నారు.

గిరిజ వాళ్ళని కూడా భోజనానికి పిలిచింది కానీ, వాళ్ళు ఇంకెవరో ఇంటికి వెళ్తామంటే నైట్‌కి నన్ను డిన్నర్‌కి పిలిచింది.

“ప్రసాద్ వచ్చి రింగ్ ఇవ్వగానే క్రిందకి దిగు… తీసుకొస్తాడు” అని చెప్పింది. ప్రసాద్ అంటే తన భర్త.

కానీ ఓ విషయం జరిగింది అప్పుడే…

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here