జీవన రమణీయం-78

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]బు[/dropcap]జ్జిబావా, సత్యా వాళ్ళిల్లు అప్పుడు చిన్న అపార్ట్‌మెంట్. తర్వాత పెద్ద ఇల్లు కొనుక్కున్నారు. నేను వచ్చానని, శారదత్తయ్య కూతురి కూతురు శిరీష, భర్త కుమార్ కూడా వచ్చారు. అందరం ఇరుక్కుని పడుకుని కబుర్లు చెప్పుకుంటూ కాలం సరదాగా గడిపాము. సత్య కూతురు మౌనిక శ్రావ్యంగా పాడ్తుంది. క్లాసికల్ సింగర్. టెంపుల్‌లో మౌనీ పాట ప్రోగ్రామ్ వుంటే వెళ్ళాం. అప్పుడే ఏదో హిందూ మేరేజ్ కూడా అక్కడ జరుగుతోంది. ప్రోగ్రామ్ తర్వాత భోజనాలు కూడా పెట్టారు.

   

నాగేశ్వరరావు బావని బుజ్జి అంటాం కదా! అతను అక్కడ లోకల్ రేడియో స్టేషన్‌ ‘ఫన్ ఏసియా’లో ఏంకర్‌గా కూడా చేసేవాడు. అతనూ, కే.సీ. చెరుకూరీ, ఉదయగిరి రాజేశ్వరీ (అత్తలూరి విజయలక్ష్మిగారి అమ్మాయి) చేసేవారు. అందులో నన్ను ఇంటర్వ్యూ చేస్తాం అన్నారు.

శిరీషా కుమార్ హ్యుస్టన్ నుండొస్తూ వస్తూ ఒక బూడిద గుమ్మడికాయ తెచ్చారు. శారదత్తయ్య మినప్పిండి రుబ్బి వాటిని మైక్రోవేవ్‌లో పెట్టి వేడి చేస్తోంది. నేను “అత్తయ్యా, నాకివ్వు… నా ఇంటర్వ్యూ అయ్యేవరకు ఆ రేడియో స్టేషన్‌ ఆవరణలో ఎండపెడ్తాను” అన్నాను. ఆ పూట పచ్చి వడియాలు వేయించి వేసింది అత్తయ్య, ఎంత రుచో చెప్పలేను!

రెండో రోజు రేడియో స్టేషన్‌కి వెళ్ళి కే.సీ. చెరుకూరి ఇంటర్వ్యూ చేస్తే మొత్తం జీవిత చరిత్ర చెప్పొచ్చాను.

x మార్క్ ఉన్నది కెనెడీ హత్యకు గురైన స్థలం

ఆ తర్వాత బావ డల్లాస్ అంతా చూపించాడు. కెనడీని చంపిన స్పాట్‌లో నిలబెట్టి ఫొటో తీస్తుంటే అటు నుండీ ఇటు నుండీ కార్లు వెళ్తున్నాయి రయ్యిమని. “కెనడీని చంపిన చోట ఓ సర్కిల్ గీసారు గుర్తుగా… ఇంకొక సర్కిల్ గీయాలొస్తొంది నేను పోయిన గుర్తుగా” అన్నాను. అత్తయ్య “వెర్రి మాటలు” అని కోప్పడింది. అమెరికాలో ఒక ఊరు చూస్తే చాలు, మిగతా అన్నీ చూసేసినట్లే. ఇంటి పెంకూ, రోడ్లూ పూలమొక్కలూ, చెట్లూ అన్నీ అంతే యూనిఫార్మ్‌గా వుంటాయి. వాల్‌మార్ట్స్‌కి వెళ్తే ఎటు రెస్ట్‌రూమ్స్ వుంటాయో, కిడ్స్ వేర్, లేడీస్ వేర్ ఎటు వుంటాయో గుర్తు పెట్టుకుంటే చాలు. మిగతా ఏ స్టేట్‌లో అయినా అలాగే వుంటాయి. అంగుళం అటూ ఇటూ కాదు! అంత డిసిప్లిన్, అంత శుభ్రతా, పబ్లిక్ టాయ్‌లెట్లలో సైతం చూసాకా, నేను ‘భూలోక దేవతలు’ అని రాసాను.

ఎం.వి.ఎల్. గారింట్లో గొల్లపూడి గారు వున్నారు ఆంటీతో. మమ్మల్ని అప్పటి ‘తానా’ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ గారు భోజనానికి పిలిచారు. నాతో బాటు మా సత్య కూడా వచ్చింది. “మీ ఇంట్లో తోటకూర వేసారా పెరట్లో” అని ఆయనతో జోక్ చేసాను. ఆయన ఆ తర్వాత బాగా మంచి స్నేహితులయ్యారు తర్వాత ట్రిప్‌లలో. అక్కడ వుద్యోగాలు చెయ్యని ఆడవాళ్ళు అరుదు! కాని ఇంటికి అతిథి అభ్యాగతులొస్తే ఎంత బాగా చూసుకుంటారో అని ఆశ్చర్యపోయాను. ఎన్ని రకాల వంటలు చేస్తారో. ఇప్పుడిప్పుడు హెల్పర్స్‌నీ, కేటరింగ్ వాళ్ళనీ పెట్టుకుంటున్నారు కానీ, అన్ని వంటలూ, అన్ని పనులూ గృహిణులు స్వయంగా చేసుకుంటారు. ఇంక మగాళ్ళయితే ఇళ్ళు కట్టుకోవడం, ప్లంబింగ్, కార్పెటర్ వర్క్స్ కూడా వాళ్ళే. ‘కాస్టికో’ నుండి అన్నీ కొని తెచ్చుకొని స్వయంగా చేసేసుకొంటారు. రిపేర్‌కి పిలిస్తే డబ్బు గంటకింత అని తీసుకొంటారట! అందుకే రిఫ్రిజిరేటర్స్, టీవీ సెట్లూ, సోఫాలూ కొత్తవి కొన్నా, పాతవి ‘ఎవరైనా తీసుకోవచ్చు’ అని లేబుల్ పెట్టి ఫ్రంట్ యార్డ్‌లో పెట్టేస్తే ఎవరో ఒకరు పట్టుకుపోతూంటారు! సెకండ్ సేల్‌లో ఒక్కోసారి ‘వాటర్ బాటిల్’ ఖరీదుకి కూడా డైనింగ్ టేబుల్స్, సోఫాలూ లాంటి వస్తు సామాగ్రి దొరికిపోతుందట 3, 5 డాలర్లకి. ఉడ్ చాలా చీప్. ఎందుకంటే అడవులు ఎక్కువ కదా! బోలెడు చెట్లు. మనం ఇక్కడికి మోసుకురాలేనివి అవే! తెచ్చుకునేవాళ్ళు బోలెడు ఖర్చు పెట్టి షిప్‌లో తీసుకురావచ్చు!

నేను అక్కడ వుండగానే బుజ్జీ, సత్యల మేరేజ్ డే వచ్చింది. ఫస్ట్ టైమ్ అమెరికన్ రెస్టారెంట్‌కి వెళ్ళాం. నాకు చాలా నచ్చింది. అది విశేషం కాదు, మా శారదత్తయ్య కూడా పిజ్జా, గార్లిక్ బ్రెడ్ తిని ఎంజాయ్ చెయ్యడం విశేషం. మా అత్తయ్యకిప్పుడు 84 ఏళ్ళు. ఇప్పటికీ తీసుకొస్తే ఆవిడ మా అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చి, ‘పానీ పూరీ’ తిని ఎంజాయ్ చేసింది. ఎంజాయ్ చేసే నేచర్, ఎడ్‍జస్ట్ అవడం ఆవిడ్ని చూసే నేర్చుకోవాలి. మా చిన్నవాడు పుట్టినప్పుడు ఆవిడ ఆరు రోజులు మదర్ థెరిసా హాస్పిటల్‌లో నాతో బాటే వుంది. పొద్దుటే స్నానం చేసి, చక్కగా జడవేసుకుని, నీట్‌గా తయ్యారయి, మా ఆయన కాఫీ తీసుకుని వచ్చేసరికి కనిపించేది. ఆయనా, ఆవిడా కబుర్లు చెప్పుకునేవారు! అంత డిసిప్లిన్డ్. అక్కడ నుండి సినిమాకి కూడా వెళ్ళాం. ఆ సినిమా ‘హాన్‌కాక్’. విల్ స్మిత్ నటించాడు. ఆ థియేటర్ పేరు టిన్సెల్ టౌన్… నాకు విచిత్రం అనిపించింది. ఒకసారి టికెట్ కొంటే ఏ స్క్రీన్‌లోకన్నా నడిచి వెళ్ళి సినిమా చూడచ్చు, ఎదుటి సీట్ మీద కాళ్ళు పెట్టుకోవచ్చు, ఒకవేళ ఖాళీగా వుంటే! ఇప్పుడంటే మల్టీప్లెక్స్ లొచ్చాయి కానీ అప్పుడు నాకూ కొత్తే అవి! ఇదంతా 2008 సంగతి కదా! ఎంతో మధురంగా అనిపించేది, చుట్టూ తెల్లవాళ్ళున్న ప్రదేశాలలో తిరుగుతుంటే. చూసి తీరాల్సినది అక్కడ పూలచెట్లూ, పసిపిల్లల అందాలు! శరవణా భవన్ కూడా ఒకసారి వెళ్ళాం. అబ్బో, సౌత్ ఇండియన్ ఫుడ్ గురించిన వెయిటింగ్ చూస్తే విసుగొచ్చింది. నాకు కొత్త ప్రదేశాలకి వెళ్తే అక్కడ ఫుడ్, అక్కడ ఆచార వ్యవహారాలు, చర్చ్‌లు చూడ్డం అవీ ఇంట్రస్ట్! మన ఫుడ్ మనకి ఎప్పుడూ దొరుకుతుందిగా! ఒకసారి ‘ఆట’ సినిమా షూటింగ్‌లో హీరో సిద్ధార్థ చెప్పాడు. ఎక్కడో ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ దగ్గర నిలబడితే, సౌత్ ఇండియన్స్ గుర్తుపట్టి పలకరించి “ఇంటికి రండి… పొంగల్ తినచ్చు” అని పిలుస్తారట! పొంగల్ కోసమే ప్యారిస్ వెళ్ళినట్టు. ఆ మాట పొగరుగా అనిపించవచ్చు కానీ, నిజమే కదా! మన గుత్తి వంకాయా, మామిడికాయ పప్పూ ఎప్పటికీ వుంటాయి కదా. వాటి కోసం అక్కడికి వెళ్ళం కదా… ఈ దోశ కోసం ఇంత వెయిటింగ్ ఏంటి అనిపించేది.

సత్య బ్యూటీషియన్ కాబట్టి నాకింకో సౌలభ్యం దొరికింది. పదిహేను రోజులుగా తిరుగుతున్నాను కాబట్టి, నాకు ఫేషియల్ ఇత్యాది చేసి పరాయి గడ్డ మిద నాకో మహోపకారం చేసింది. ఆ తర్వాత టాన్‌టెక్స్ వాళ్ళ సభ. ఇక్కడ నుండి తనతో వాళ్ళ ఊరు అయిన హ్యూస్టన్ తీసుకెళ్ళడానికి చిట్టెన్‌రాజుగారు కూడా వచ్చి వాళ్ళ బావమరిది ఇంట్లో డల్లాస్‌లో దిగారు. అసలు ఈ సభకీ మిగతా సభలకీ నేను వెళ్ళాకా, తను పిలిచిన మెయిన్ ‘ఆరవ వంగూరి ఫౌండేషన్ వార్షికోత్సవా’నికి రాడానికి అనుమతించడం చిట్టెన్‌రాజుగారి గొప్పతనం! మేము ఆ బ్యానర్ కట్టినప్పుడు ‘అరవ వంగూరి ఫౌండేషన్ వార్షికోత్సవం’ అని చదివి ఆటపట్టించాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here