జీవన రమణీయం-87

0
4

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]ఆ[/dropcap] తర్వాత నందన్ ఇంటికొచ్చి, వాళ్ళింకా కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు, నేనెళ్ళి పడుకున్నాను. తెల్లవారు ఝామున అంటే ఆరు గంటలకి లేచి ప్రయాణం అయ్యాం. ఆ అమ్మాయి అప్పుడే ఇడ్లీ, చట్లీ చేసి, కాఫీలు కూడా పెట్టేసింది!

అమెరికాలో ఆడవాళ్ళ పనితనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! అంత తీరువుగా అతిథుల్ని చూడడం, ఇల్లు సర్దుకోవడం, పనీ పాటలొచ్చి వుండడం, చాలా మటుకు ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కార్లో పిల్లల్ని స్కూళ్ళకి దింపడం, బజారు పనులన్నీ చేసుకోవడం… ఒకటేమిటి… దేనికీ ఎవరి మీదా ఆధారపడరు. చాతకాదు అనే మాట వుండదు.

నందన్ వాళ్ళకి వీడ్కోలిచ్చి కిరణ్ ప్రభ గారి పెద్ద కారెక్కి, నేనూ గొల్లపూడి గారూ, ఆంటీ వెనక కూర్చుంటే, కాంతి గారు ముందు కూర్చుని కొన్నిసార్లూ; గొల్లపూడి గారు ముందు కూర్చుంటే, కాంతి గారు మాతో వెనకాల కూర్చుని కొన్నిసార్లూ ప్రయాణం చేసేవాళ్ళం! వెనుక సీట్లో కూడా బెల్ట్ పెట్టుకోవడం అప్పటికింకా ఒక్క కాలిఫోర్నియాలోనే చూసాను! చాలా ఉతుకుష్టంగా వుండేది అలవాటు లేక. ఫీనిక్స్‌లో మా బావ కూతురు చంటిదాన్ని సెపరేట్‌గానే బేబీ సీట్ కట్టి కూర్చోపెట్టాలంటే, అది ఏడుస్తుంటే, ‘మాయదారి రూల్స్’ అని విసుక్కునేదాన్ని. కానీ అవి చాలా మంచి పద్ధతులని ఇప్పుడు అర్థమై, నేను కారెక్కగానే బెల్ట్ పెట్టుకుంటున్నాను.

ప్రయాణంలో అసలు తోచకపోవడం అనేది వుండేది కాదు! గొల్లపూడి గారి అనుభవాలు, ఏ టాపిక్ అడిగినా ఆయన చక్కగా విశదీకరించి చెప్పే తీరూ, మంచి ఇంటర్వ్యూయర్ కిరణ్ ప్రభ గారి ప్రశ్నలూ చాలా రంజుగా సాగేవి. నేనూ మాట్లాడేదాన్ని… అసలు నాకూ కిరణ్ ప్రభ గారికీ హైద్రాబాద్‌లో తెలీని వాళ్ళుండేవారు కాదంటే అతిశయోక్తి కాదు… అంత మంది తెలుసు… అనడం కంటే, మా జీవితాల్లో తారసపడని వ్యక్తులు అరుదు… అంటే అర్థవంతంగా వుంటుంది! కాంతి గారు ఇప్పటికీ, ‘మీకెంత మంది తెలుసండీ?’ అని ఆశ్చర్యపోతూ వుంటారు. ఆ తర్వాత ఇంకో నాలుగు రోజులు మేం కిరణ్ ప్రభా, కాంతి కిరణ్‌ల ఆతిథ్యం పొందాము.

మా రమ్మక్క… అంటే పెద్దమ్మ కూతురు ఆడబిడ్డ ఫ్రీమాంట్‌లో వుంటే, వాళ్ళింటికి కళ్యాణ్ అనే అబ్బాయి, అప్పుడు ‘ఇంకోసారి’ అనే సినిమా కిరణ్ ప్రభ గారి అబ్బాయి సుమన్‌ డైరెక్షన్‌లో తీస్తున్న ప్రొడ్యూసర్, ఆ అబ్బాయి వచ్చి నన్ను తన కార్‍లో తీసుకెళ్ళాడు. రమక్క అత్తగారు వున్నారు. ఆవిడ చాలా ప్రేమగా మాట్లాడారు.

వాళ్ళిల్లు చాలా పెద్దది, కానీ పురాతనమైన సామాన్లూ, న్యూస్ పేపర్లూ, పుస్తకాలూ ఎక్కడపడితే అక్కడ వుండడం వల్ల కూర్చోవడానికి ప్లేస్ లేకుండా వుంది. కానీ రమక్క ఆడబిడ్డ కౌసల్య కూడా చాలా మంచిది!

ఆ తరువాత మా సాయి బాబాయి మరదలు విజయ కూతురు మానస ఇంటికి వెళ్ళాం! మానసా, పవన్ వాళ్ళు ఢిల్లీ నుండి ఫ్రీమాంట్ వెళ్ళారు. వాళ్ళకో చిన్న పాప అవని! బహుశా నేను ఒక్కదాన్నే అనుకుంట వాళ్ళు అమెరికాలో వుండగా వెళ్ళి విజిట్ చేసిన చుట్టాన్ని. నేనొస్తున్నానని కొత్త కారు కొన్నారు వాళ్ళు ఆ రోజే! మానస బోలెదు వంటలు చేసింది. మా రామలక్ష్మి పిన్ని పోలికేమో అద్భుతంగా వంట చేస్తుంది. అవనికి చిన్నప్పుడు… అప్పుడూ చిన్నదే, ఏడాది వుంటుందేమో కానీ ఒక అలవాటుట… ఎవరిదైనా బొడ్డు కనిపిస్తే వేలు పెట్టడం… తన బొడ్దులో వేలు పెట్టి… గిరగిరా తిప్పుకోవడం! “దీనికిదేం అలవాటే?” అని నేను అంటే, “మా మావయ్యగారు – బొడ్డేదీ? నీ ముక్కేదీ… అని చూపించి అలవాటు చేసారక్కా” అంది. పసిపిల్లలకి పెద్దవాళ్ళు ఆటగా అలవాటు చేసినవి, పెద్దయ్యాక చెప్తే ఎంతో సిగ్గు పడ్తారు!

ఆ రాత్రి మానసా, నేనూ గదిలో వాళ్ళ మంచం మీద పడుకుంటే, పవన్ పాపని పెట్టుకుని హాల్లో పడుకున్నాడు. నేను మానసా రాత్రంతా మా బంధువుల గురించి బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత మా పిన్నికి అంటే మానస పెద్దమ్మ అయిన రామలక్ష్మి పిన్నికి ఫోన్ చేసి మానస “రమణక్కయ్య ఎంతో రిజర్వుడ్‌గా వుంటుంది అనుకున్నా… ఎన్ని కబుర్లు చెప్పిందో!” అని ఆశ్చర్యపోయిందంట. నెను పెద్దగా బంధువుల ఇళ్ళకీ, శుభకార్యాలకీ వెళ్ళేదాన్ని కాను. కానీ ఇలా అమెరికా వచ్చాకా, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో వెదుక్కుని వెళ్ళి వాళ్ళ ఇళ్ళల్లో వుండి వచ్చాను! అదో మధురానుభూతి! మర్నాడు పవన్ మానసా వచ్చి కొత్త కార్లో కాంతిగారింట్లో దింపి వెళ్ళారు. అవని అల్లరి వాళ్ళు చాలా ఎంజాయ్ చేసారు. మృత్యుంజయుడొచ్చి కాలిఫోర్నియా చూపిస్తా అన్నాడు మర్నాడు.

మృత్యుంజయుడు మిల్లిటాన్‌లో వుంటారు. ఆయన వుద్యోగం మాత్రం కాంతి గారింటి దగ్గర. ఆయన సుజనరంజని అనే పత్రికకి సంపాదకుడిగా కూడా వ్యవహరిస్తారు. సిలికాన్ ఆంధ్రా మనబడిలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు! స్నేహశీలి… వంగూరి సదస్సులో ‘భారతంలో ఎవరెవరు ఎలా మరణించారు’ అన్న అంశం చెప్పారని, నేను నా కాలమ్‌లో ‘ఎవరు ఎలా ఛస్తే మనకెందుకనుకోకుండా, మృత్యుంజయుడు చక్కగా వివరించారు…’ అని ఛలోక్తి విసిరాను. అప్పట్లో ఆయన బొద్దుగా వుండేవారు. ఇప్పుడు బాగా సన్నబడిపోయారు. వాళ్ళావిడ జయశీల గారిని ఆ ట్రిప్‍లో చూడలేదు!

మర్నాడు ఆయన లంచ్ టైంలో వచ్చి నన్ను తీసుకెళ్ళారు. మేం శాన్‌ఫ్రాన్సిస్కో సిటీకీ వెళ్ళాం. ఆయన మన లాంచ్ లాంటిది ఎక్కించి పియర్‌లో గోల్డెన్ బ్రిడ్జ్ వైపుకి తీసుకెళ్ళారు. “మీ వస్త్రధారణ కొద్దిగా మోడ్రన్‌గా వుండవలసింది, నా వుద్దేశం చీర కాకుండా” అన్నారు… ఆ గాలికి నేను కొంగు ఎగిరిపోయి ఇబ్బంది పడ్తుంటే! వాళ్ళది వరంగల్. పౌరోహిత్యం చేసేవారుట వారి తండ్రిగారు. కానీ గ్రాంథికంగా మాట్లాడ్తారు, ‘ప్రకృతి కడు రమణీయంగా వుంది’ లాంటిది. నేను బరిటో ఆయనతోనే మొదటిసారిగా మెక్సికన్ రెస్టారెంట్‌లో తిన్నాను. ఆయన నన్ను మెచ్చుకుంటూ, “మీలా కొత్త ఆహారం, కొత్త వ్యక్తులూ, కొత్త పరిసరాలూ అంటే భయపడని వారు అరుదు!” అన్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here