జీవన రమణీయం-96

0
10

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]రా[/dropcap]యలుగారి లాంటి వాళ్ళని ఒక్కసారి కలిస్తే చాలు! ఇంక జీవితాంతం మర్చిపోలేం… నేనూ సుమిత్రా రినైజాన్స్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళేసరికీ రాయలుగారూ, వారి శ్రీమతి యశోధర గారూ, కూతురు కుసుమ్, అల్లుడు ఫెర్నాండో అనే బ్రెజిలియన్ అక్కడున్నారు.

నన్ను చూసి, “మీరేనా బలభద్రపాత్రుని రమణిగారు, రైటర్” అని తనని తాను పరిచయం చేసుకుంటూ ముందుకొచ్చారు రాయలుగారు. ఇంకా విచిత్రం ఆయనతో బాటు ఇంకో బ్రెజిల్ జంటని కూడా “మా ఫ్రెండ్స్… ఇండియా చూపిద్దామని తెచ్చాను” అన్నారు. ఈయనతో ఇండియా చూడ్దానికొచ్చేసారు అంటే ఎన్నేళ్ళ స్నేహమో అనుకున్నాను. వాళ్ళ అమ్మాయి కుసుమ్ చెప్పింది “మేం వచ్చే ముందు రోజు ముందు ఈయన నాన్నకి లిఫ్ట్‌లో పరిచయం అయ్యారుట… మాతో బాటు తీసుకొచ్చేసారు” అని. దటీజ్ రాయలుగారు!

గోవిందరాజు కృష్ణరాయలు గారనే ఈయన మన అబ్దుల్ కలామ్‌తో కూడా డిఆర్‌డిఓ‌లో పని చేసిన సైంటిస్ట్. ఈయన చేత తాళి కట్టించుకున్న యశోధర గారు, ఈయన్ని నమ్మి, ఓ పసిపిల్లని భుజాన వేసుకునీ, ఇంకో బిడ్దని కడుపులో మోస్తూ, “బ్రెజిల్ వెళ్ళిపోదాం, నాకు అక్కడ వుద్యోగం వచ్చింది” అంటే ఆయన వెనకాల వెళ్ళిపోయింది. కడుపులో వున్న బిడ్ద ఆడో మగో తెలీక కుసుమ్ అని పేరు పెట్టారుట. మొదటి పిల్లకి గుజరాతీ అబ్బాయితో పెళ్ళి అయి యూ.ఎస్.లో వుందిట. రెండో అమ్మాయి కుసుమ్ బ్రెజిల్ లోనే ఏదో పేటెంట్ రిజిస్టర్ చేసి, అక్కడ వుద్యోగం చేస్తూ, తనతోబాటు వుద్యోగం చేస్తున్న ఫెర్నాండో అనే ఈ బ్రెజిల్ అబ్బాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుందిట. అప్పుడు గర్భవతిగా వున్న ఈ అమ్మాయికి మొదట కరీనా, తర్వాత ఇంకో పాపా పుట్టారు. సాయి అన్నట్టు, నిజంగానే రాయలుగారి కబుర్లలో పడిపోయి మేం అసలు బొంబాయి దేనికొచ్చామో మర్చిపోయాం. ఆ కబుర్లన్నీ కూడా నేను కౌముదిలో సాయికృష్ణ పెళ్ళి గురించి రాస్తూ విపులంగా రాసాను. ఆయన్ బ్రెజిల్‌నీ, అమెజాన్ ఫారెస్టులనీ, ఏయిరోనాటిక్స్ మీద ఆధారపడ్డ బ్రెజిల్ దేశపు మేప్ షేప్‌నీ, వారి వాహనాలలో ఫ్యూయెల్‌గా వాడే చెరుకు రసాన్నీ, ఆ వాహనాలు వదిలే చుక్క వల్ల రోడ్ల మీద అరికట్టబడే పొల్యూషన్‌నీ అన్నింటినీ ఎంతో విపులంగా వర్ణించారు! ఈయనని గ్వాలియర్‌కి చెందిన ఇంకో ఏయిరోనాటికల్ సైంటిస్ట్ డాక్టర్ కనే గారు అనే ఎనభైయేళ్ళాయన దత్తు తీసుకున్నారట… ఆయన బాగోగులూ, భోజన సదుపాయాలూ రాయలుగారే చూసుకునేవారుట. ఈయన ముఖ్యంగా స్పెషలైజ్ చేసిన అంశం ‘చెత్త’! ఆ చెత్త భారతదేశంలో పెద్ద పెట్టున ఉత్పత్తి చేస్తాం కదా, దానిలో నుండి కరెంట్ జనరేట్ చెయ్యాలని ప్లాంట్ పెట్టారు. దానిని ఈయన తమ్ముడికి అప్పజెప్పారు. ఈయన బ్రెయిన్‌లో నిమిషానికో ప్రాజెక్టు పుడ్తుంది. అందులో భక్త కన్నప్పా ప్రాజెక్టు ఒకటి. అంటే, మన దేశంలో ఆరు నిమిషాల కొకరు గుడ్డివారైపొతున్నారట, ఈయన సర్వే ప్రకారం. అందుకే కళ్ళు దానం చెయ్యండని క్యాంపైన్ పెద్ద పెట్టున మొదలుపెట్టి, చిలుకూరు, తిరుపతీ, శ్రీశైలం మొదలైన దేవస్థానాలలో ఈ కరపత్రాలు పంచిపెట్టడం… తర్వాతది ఒక రైతు కాశీ దగ్గర పల్లెలో ఏదో ఎరువు కనిపెట్టి, దాని పేటెంట్ రిజిస్టర్ చెయ్యడం, అదీ కాక ఆ విషయం పేపర్లో ప్రకటించాడు. అది ఓ మూల చిన్న అక్షరాలతో ప్రచురింపబడి, మన రాయలు గారిని ఆకర్షించింది. ఈ పెళ్ళి కొస్తూ, లిఫ్ట్‌లో పరిచయమైన దంపతులను తీసుకురావడం వెనుక కథ ఇదీ! ఆ లిఫ్ట్‌లో పరిచయం అయినాయన విత్తనాల పరిశోధకులు! ఈ రైతును కలవాలి ఈ పెళ్ళి అనంతరం వీళ్ళు… అదీ ఆయన ప్రోగ్రాం. అసలు మా సాయికృష్ణకి ఈ రాయలుగారు ఎలా పరిచయం? అని అడిగితే… సాయికృష్ణ చెన్నైలో ‘ముడివి ఉంగళ్ కయ్యిల్’ అనే ప్రోగ్రాం చేసాడు. అంటే పరిష్కారం మీ చేతిలోనే అని అర్థం. ఆ ప్రోగ్రాంకి మూలం ఈ బ్రెజిల్ టీవీ షోట. టీవీలో ఒక కథ చూపించి, రెండు పరిష్కారాలు చెప్తారు.  ‘ఎ’ కానీ ‘బి’ కానీ మనం సెల్ ఫోన్‍లలో మెసేజ్ ఇవ్వాలి. దాన్ని పట్టి గెలిచిన వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా బహుమతులుంటాయి. అప్పట్లో సెల్‌ఫోన్ ఇలా చిత్తు కాయితం అంత చౌక కాదు! కాల్ నాలుగు రూపాయలు… ఎస్.ఎమ్.ఎస్. రెండు రూపాయలు! అందువల్ల ఆ షో పెద్దగా హిట్ కాలేదు. కానీ బ్రెజిల్ వెళ్ళినప్పుడు ఈ పని మీద, సాయికృష్ణకి రాయలుగారు తగిలారు సాయి బాస్ వెంకట్రావు గారి ద్వారా. అంతే కాదు, ఆయన ఇద్దరు ఆడపిల్లలనీ సాయికృష్ణ పెట్టిన కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో చేర్పించి, కంప్యూటర్స్ నేర్పించమని సాయితో పంపించేసారు కూడా! ఈ టీ.వీ. ప్రోగ్రాం ఉమా పద్మనాభన్ లాంటి ఏంకర్‌తో, మన ఒకప్పటి హీరోయిన్ మంజులా విజయ్‌కుమార్ ఇంట్లో చాలా గ్రాండ్‌గా బోలెడు ఖర్చు పెట్టి తీసి, సాయి  దెబ్బతిన్నాడు. మంజుల సాయిని కొడుకుల అభిమానించేవారు. ఆవిడ పిల్లలలో ప్రీతీ, శ్రీదేవీ హీరోయిన్లుగా కూడ ఏక్ట్ చేసారు. ఆ రుక్మిణి సినిమాలో సాయికృష్ణ విలన్ రోల్ కూడా ప్లే చేసాడు. వాళ్ళు ‘సాయన్నా’ అని పిలుస్తారు. ఈ పెళ్ళి కొచ్చారు. అంతే కాక, జాతర, ఐ లవ్ యూ లో చిరంజీవితో వేసిన సువర్ణ, తర్వాత సుజాతా విజయ్‍కుమార్ అయి తమిళ టీ.వీ. ప్రొడ్యూసర్‌గా మారారు. ఆవిడా, శ్రీప్రియా (ఒకప్పటి చిలకమ్మ చెప్పిందీ, వయసు పిలిచిందీ హీరోయిన్. ఇప్పుడు దృశ్యం, ఘటన లాంటి సినిమా దర్శకురాలు) ఆవిడా వచ్చింది. ఇంకో అబ్బాయి ‘పిన్ని’ సీరియల్‌లో, రాధిక కొడుకుగా, విలన్‌గా ఏక్ట్ చేసిన విజయ్ ఆదిరాజు… అతనూ వినీత్ అనే ప్రేమదేశం హీరో అతనూ… ఇలా చాలామంది సాయికృష్ణ పెళ్ళికొచ్చి ఇదే హోటల్‌లో దిగారు. కానీ రాయలుగారికి మేం ఎటాచ్ అయ్యాం. ఇంత పెద్ద సైంటిస్ట్‌కీ సెల్‌ఫోన్‌లో ఎస్.ఎమ్.ఎస్ చూడ్డం మేమే నేర్పించాల్సొచ్చింది. అవన్నీ నేను కౌముదిలో వివరంగా రాసాను.

సాయంత్రం సాయికృష్ణా, మయూరీల మెహందీ ఫంక్షన్. మేం రాయలుగారితో కబుర్లలో పడి సాయంత్రం నాలుగింటికి బయలుదేరలేక, మరిచిపోయి, తెలివి తెచ్చుకుని, ఆరుగంటలకి బయల్దేరాము. వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయింది. అది ఆడపిల్ల వారి తరఫు ఫంక్షన్. చిన్న హోటల్‍లో చేసారు. అందరం మెహందీ పెట్టించుకున్నాం. అప్పటికింకా మనకి మెహందీ, సంగీత్‌లు కొత్త! వాళ్ళంతా మ్యూజిక్ పెట్టుకుని, పెద్దా చిన్నా వయసూ తారతమ్యం లేకుండా డాన్స్‌లు చేస్తుంటే ఆశ్చర్యంగా చూసాం. ఫోటోలు కూడా కౌముది లింక్‌లో చూడవచ్చు. మేం భోజనం చేస్తూ ఎంజాయ్ చేసాం.

సాయి అమ్మానాన్నలకి నేను పెద్ద కూతురితో సమానం. వాళ్ళ ఆప్యాయత మాటల్లో చెప్పలేనిది!

మేం మొత్తం ఐదు రోజులున్నాం బొంబాయిలో. సాయిని పెళ్ళికొడుకుని చేయడం, సంగీత్, పెళ్ళీ అన్నీ అయ్యేదాక వున్నాం. పెళ్ళికి కె.ఎస్. రామారావు గారు కూడా వచ్చారు. ఆయన సాయికృష్ణని స్వంత కొడుకులాగా చూస్తారు. అసలు శ్రీకృష్ణ అన్న అతని స్వంత పేరుని మార్చి సాయికృష్ణ అని పేరు పెట్టిందీ ఆయనే!

***

రాయల గారి గురించి కౌముదిలో రాసిన ఆర్టికల్ ఈ లింక్‍లో:

http://koumudi.net/Monthly/2011/january/jan_2011_kAlamdATanikaburlu.pdf

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here