శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారి ‘జీవన రమణీయం’ కాలమ్ – విశ్లేషణ

1
13

[అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా పక్షోత్సవాలలో భాగంగా సేవ – తెలుగు భాష, సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ వారు 09 మార్చి 2024 నాడు నిర్వహించిన ‘అక్షర తోరణం’ కార్యక్రమంలో ‘బలభద్రపాత్రుని రమణి సాహితీ రమణీయం’లో కొల్లూరి సోమ శంకర్ ‘జీవన రమణీయం’ కాలమ్‍పై చేసిన ప్రసంగ పాఠం ఇది.]

[dropcap]అం[/dropcap]దరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ అక్షర తోరణం సంస్థ నిర్వహిస్తున్న ‘మహిళా పక్షం’ కార్యక్రమంలో శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారి సాహిత్యం గురించి మాట్లాడే అవకాశం కల్పించిన భారతి గారికి, శోభ గారికి, సేవ బృందంలోని ఇతర సభ్యులకు నా కృతజ్ఞతలు.

శ్రీమతి బలభద్రపాత్రుని రమణి గారు ఎన్నో కథలు, నవలలు రాశారు. సినిమాలకు కథలందించారు, కొన్ని చిత్రాలకు సంభాషణలు అందించారు. టీవీ సీరియల్స్‌‌కి రాశారు. ప్రస్తుతం వెబ్ సీరిస్‍లకి కథలందిస్తున్నారు.

నా ప్రసంగం ప్రధానంగా వారు ‘సంచిక’లో రాసిన ‘జీవన రమణీయం’ అనే కాలమ్ ఆధారంగా వారి జీవితం, బాల్యం, చదువు, ఉద్యోగాలు, వివాహం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, రచయిత్రిగా ఎదగడం, సినీ రంగంలో వారి కృషి గురించి సాగుతుంది. అందునా ప్రస్తుత సందర్భంగా ‘మహిళా పక్షం’ కాబట్టి ఒక స్త్రీగా ఆమె ఎదుర్కున్న సమస్యలు, సాధించిన విజయాలను ప్రస్తావిస్తాను.

అయితే ఇవేవీ వారు సృజించిన కాల్పనిక రచనల్లో భాగం కావు, ఆవిడ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను స్వయంగా రాసుకున్నవే. ‘జీవన రమణీయం’ కాలమ్ ఒక రకంగా బలభద్రపాత్రుని రమణి గారి ఆత్మకథ లాంటిదే! కాబట్టి ఇందులో – కథల్లోనో, నవలల్లోనో మహిళా పాత్రలను ఉన్నతంగా తీర్చిదిద్ది, స్త్రీ ఔన్నత్యానికీ, సాధికారతకీ నిదర్శనంగా చూపించినట్లుగా ఉండదు. అలా చేయడం తప్పేమీ కాదు, ఒక రకంగా అదీ సమాజానికి ప్రేరణనివ్వడమే అవుతుంది. కానీ కాల్పనిక పాత్రలా కాకుండా నిజజీవితంలో తాను స్వయంగా ఎదుర్కున్న అనుభవాల దృష్ట్యా – బాలిక నుంచి యువతి, యువతి నుంచి వివాహిత, భార్య నుంచి తల్లి, తల్లిగా ఉంటూనే ఉద్యోగినిగా, అక్కడ్నించి రచయిత్రిగా మారే క్రమంలో రమణి గారి జీవితం స్త్రీలకే కాదు, మగవారికి కూడా ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

***

ఏ సందర్భంలోనైనా జీవితాన్ని నిబ్బరంగా జీవించాలంటే అందుకు పునాదులు బాల్యం నుంచే పడాలి. ఆ విషయంలో రమణి గారికి అమ్మమ్మ తాతయ్యల రూపంలో గొప్ప మార్గదర్శనం లభించింది. తాతగారు సూరంపూడి శ్రీహరిరావు గారు స్వాతంత్ర్య సమరయోధులు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైలు కెళ్ళిన దేశభక్తుడు, స్వాతంత్ర్యానంతరం – మన రాజకీయనేతలతో తలెత్తిన స్వార్థానికీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన ధీశాలి. ఆయన గురించి రమణిగారు ‘లీడర్’ అనే పుస్తకం రాశారు. మరిన్ని వివరాలు ఆ పుస్తకంలో చదవవచ్చు. శ్రీహరిరావు గారి హఠాన్మరణం తరువాత ఒంటరైన సూరంపూడి వెంకట రమణమ్మ గారు కుటుంబాన్ని నడిపిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆనాటి కుటుంబాలలో బహుసంతానం అన్న సంగతి మనకి తెలిసినదే. తన పిల్లలు, బంధువుల పిల్లలు ఎందరినో భేదభావాలు లేకుండా పెంచి పెద్ద చేసిన రమణమ్మ గారి జీవితాన్ని కూడా – ఈ కాలమ్‍లో ప్రస్తావించినట్లుగా శకలాలుగా కాకుండా, సంపూర్ణంగా గ్రంథస్థం చేయాల్సిన అవసరం ఉంది. నిస్సందేహంగా ప్రేరణాత్మక రచన అవుతుందది.

వెంకట రమణమ్మ గారి ధైర్యసాహసాలకి నిదర్శనంగా ఒక సంఘటనని ప్రస్తావిస్తాను. శ్రీహరిరావు గారు స్వాతంత్ర్య పోరాటంలో ఉండగా వి.వి.గిరి గారితో ఆత్మీయ స్నేహం ఉండేది. రమణమ్మ గారూ గిరి గారికి బాగా తెలుసు. శ్రీహరిరావు గారు మరణించాకా,  స్వతంత్ర యోధుడిగా వారికి రావల్సిన పెన్షన్ బకాయిల కోసం – హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి గిరి గారిని కలవడం, అప్పుడు రాజ్ భవన్‍లో జరిగిన సంఘటనలు – చదువుతుంటే – రమణమ్మ గారి ధైర్యమేమిటో తెలుస్తుంది. అలాగే మరో సందర్భంలో తనకెదురయిన ఓ సమస్య గురించి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధికి ఉత్తరం రాసి, ఆ సమస్యని పరిష్కారం దిశగా మళ్ళించడం ఆవిడ మనోనిబ్బరాన్ని తెలుపుతుంది.

ఇక రమణి గారి అమ్మగారు సత్యవతి గారూ తక్కువేమీ కాదు. ఆ కాలంలోనే ఆర్.టి.సి.లో ఉద్యోగం తెచ్చుకుని అటూ తల్లికీ, తోబుట్టువులకీ ఆసరాగా ఉండడమే కాకుండా, తరువాతి కాలంలో కూతురికీ అండగా నిలిచారు. ఎంతో మందికి ఉద్యోగాలిప్పించి ఎన్నో కుటుంబాలు నిలదొక్కుకునేందుకు ఆలంబన అయ్యారు.

ఇక రమణిగారి పెద్దమ్మలూ అంతే.. వారి నుంచి కూడా ఎన్నో అంశాలు నేర్చుకోవచ్చు.

రమణిగారి బాల్యం మామూలుగానే అందరి ఆడపిల్లలాగానే సాగుతుంది. తండ్రి వేరే ఊరిలో ఉద్యోగం కాబట్టి, తల్లీ, అమ్మమ్మలతోనే అనుబంధం ఎక్కువ. చిన్నతనంలో ఆటలు, అల్లర్లు, రేడియోలో బాలానందం కార్యక్రమంలో పాల్గొనడం, సంగీతం నేర్చుకోవడం.. అవన్నీ చక్కని బాల్యానుభూతులుగా మిగులుతాయి రమణి గారికి. ఇంటర్మీడియట్, డిగ్రీలకొచ్చేసరికి మిత్రులు, సాహిత్యం ప్రభావం ఎక్కువై మేధ వికసిస్తుంది. ఆ స్నేహాలు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు తల్లి విజయగారు రమణిగారికి ఆప్తమిత్రులు.

ఇంటర్మీడియట్ అయ్యాక సెలవల్లో టైప్ నేర్చుకున్నారు రమణి గారు. ఆ సమయంలో టైప్ ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకుల ద్వారా ఒక చిన్న కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం వస్తుంది. అక్కడి యజమాని రెండో కుమారుడితో ఎదురైన ఓ సమస్యని ఎంత చాకచక్యంగా పరిష్కరించుకున్నారో తెలిస్తే రమణి గారి ఆత్మవిశ్వాసం అర్థమవుతుంది.

అనంతరం ప్రభాకర్ గారితో వివాహం! వైవాహిక జీవితంలో పదనిసలు. అత్తగారిని అర్థం చేసుకోవడం! మొదటి కుమారుడు అశ్విన్‍కు జన్మనివ్వడంతో తల్లి పాత్ర! ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీలో అద్దెకున్న ఇంటి యజమాని భక్తి ముసుగులో వెధవ్వేషాలు వేయబోతే.. అతని పీచమణుస్తారు. ఇలాంటికి సమస్యలు ఆడవాళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యేవే.. కానీ జంకకుండా, అల్లరిపాలు కాకుండా, కామాంధుడికి గుణపాఠం చెప్తారు రమణిగారు.

అశ్విన్‍ను బడిలో వేసే క్రమంలో తానూ టీచర్‍గా మారి కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తారు. ఆనాటి కాన్వెంటులు, విద్యాబోధన, స్కూళ్ళ నిర్వహణలోని లొసుగుల గురించి చెప్తారు. ఉద్యోగం చేస్తూనే యండమూరి వీరేంద్రనాథ్ గారి దృష్టిలో పడటం, ఆయన చేసిన సూచనల ఆధారంగా రచయిత్రిగా నిలదొక్కుకోడం.. తొలి నవలలు పబ్లిష్ అవటం.. అప్పట్లోనే యండమూరి గారి సూచన మేరకు నవలలో/సినిమాలో ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు సినీరంగాన్ని ఎంచుకోవడం, సినీ రచయిత్రిగా ప్రస్థానం ప్రారంభం.

ఈలోపు రెండో కుమారుడు కృష్ణ జననం, అతని బాల్యం, అన్నదమ్ముల మధ్య బాండింగ్.. ఇవన్నీ ఆసక్తిగా ఉంటాయి. కృష్ణ ఒకసారి తప్పిపోతే తల్లిగా రమణి గారు పడిన ఆవేదనలో అందరూ మాతృమూర్తులు కనిపిస్తారు.

రమణిగారు రాసిన ‘మొగుడే రెండో ప్రియుడు’ అనే నవల హిట్ అయి, దాన్ని సినిమా హక్కులు కొన్న ఓ నిర్మాత వల్ల మోసపోవడం ఒక పాఠంగా మారి – తరువాతి కాలంలో సినీరంగంలో నిలదొక్కుకునేందుకు ఓ బాట వేసింది. సినీ రంగంలో పరుచూరి సోదరులు, అక్కినేని నాగేశ్వరరావుగారు, రామానాయుడు గారు, అల్లు అరవింద్ గారు, కె.ఎస్. రామారావు గారు, దర్శకులు చంద్ర సిద్ధార్థ, గీత రచయితలు సిరివెన్నెల గారు, భువన చంద్ర గారు వంటి వారితో రమణిగారికి ఎదురైన అనుభవాలు పాఠకులను ఆకట్టుకుంటాయి.

ముఖ్యంగా ‘రేపల్లెలో రాధ’ నవలని శరత్ గారి దర్శకత్వంలో సినిమా తీసే క్రమంలో షూటింగ్ సందర్భంగా గుమ్మడి గారు, కైకాల సత్యనారాయణ గారు, సుజాత గారు, రమాప్రభ గారితో మాట్లాడడం, తరువాతి రోజుల్లో వారిలో కొందరితో దగ్గరి స్నేహం ఏర్పడడం చూస్తాం.

‘మధుమాసం’ నవల కూడా సినిమాగా వచ్చింది. ఈ సినిమాలో స్నేహ, సుమంత్ పాత్రలను అద్భుతంగా మలిచారు రమణిగారు. అది చూడదగ్గ సినిమాగా నిలిచింది. రమణి గారు కథ అందించిన మరో మంచి సినిమా ‘అందరి బంధువయా’. ఈ సినిమా సంభాషణలు కూడా ఆవిడే రాశారు. సినిమా ఎంత బావుంటుందో, డైలాగ్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. “వారసత్వం అంటే రక్తం కాదు.. సుగుణాలు”; “నాకు తెలిసిన పూజల్లా పక్షికింత ధాన్యం, పశువుకింత గ్రాసం, మనిషికింత సాయం. ఇంతకన్నా మించిన పూజ ఏ మతం చెబుతుంది?” లాంటివి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Z5 కోసం మంచు లక్ష్మీప్రసన్న ప్రధాన పాత్ర పోషించిన మిసెస్. సుబ్బలక్ష్మి అనే సీరిస్‍కి కథ, సంభాషణలు అందించారు.

ఇక సెన్సార్ బోర్డు సభ్యురాలిగా రమణి గారి అనుభవాలు విశిష్టంగా ఉంటాయి. సినిమాల సెన్సార్ ఎలా జరుగుతుందో వివరంగా చెప్తారు రమణిగారు.

అయితే సినిమా రచయిత్రిగా, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఆవిడ సినిమా వాళ్ళతో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోకపోయినా, జనాల నుంచి, సినీ అవకాశాల కోసం వెంటబడే వారి నుంచి వేధింపులు ఎదుర్కున్నారు. నిందలు మోసారు. తట్టుకున్నారు. ఎవరికి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు.

హైదరాబాదులోని లలిత కళా తోరణంలో జరిగిన ఓ సినిమా వేడుక సందర్భంగా లేడీస్ టాయ్‍లెట్ వద్ద ఓ పోకీరి చేసిన పని, రమణిగారు ధైర్యంగా వాడిని పోలీసులకి పట్టివ్వడం వారి తెగువని చాటుతుంది.

రమణిగారికి ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మగౌరవమూ ముఖ్యమే. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట సినిమా అయినా/టీవీ అయినా అవకాశాలను వదులుకోడాని ఏ మాత్రం సందేహించలేదు. ఓ వెబ్ సిరీస్ కోసం తాను రాసిన స్క్రిప్ట్‌ని తెలుగు అంతగా రాని ఓ వ్యక్తి అవమానించడంతో, దాన్నుంచి తప్పుకున్నారు.

రచయిత్రిగా అమెరికాలో ఓ సదస్సులో పాల్గొనడం, అక్కడి తెలుగువాళ్ళతో పరిచయాలు, స్నేహాలు ఆసక్తిగా చదివిస్తాయి. అలా కిరణ్ ప్రభ దంఫతులతో కలిసిన స్నేహం – కౌముది పత్రికలో పదేళ్ళుకు పైగా సాగుతున్న ‘కాలమ్ దాటని కబుర్లు’ ఫీచర్‍కి నాంది పలికింది,

ఈ ఫీచర్ లోనూ రమణిగారు ఎన్నో కబుర్లు చెప్తారు. వాస్తవాలు చెప్తారు. అందరికీ పనికొచ్చే కొన్ని చక్కని సూచనలు చేస్తారు. అది ట్రాఫిక్ సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఆడవాళ్ళ సమస్యలు కావచ్చు, సోషల్ మీడియా వ్యసనం కావచ్చు.. ఉపయుక్తమైన శీర్షిక అది.

రమణిగారిది చక్కని శైలి. హాయిగా చదివిస్తుంది. ఆవిడ మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది ఆవిడ రచనలు చదువుతుంటే.

అత్యంత సరళంగా రాసి, చక్కని హాస్యం పండించి నవ్వులు పూయించగలరు. ఏదైనా సమస్యని ప్రస్తావిస్తున్నప్పుడు, దాని లోతుపాతులు వివరిస్తూ అంతే గంభీరంగా చెప్పగలరు. అవసరమైన చోట ప్రబంధాల రీతిలో ప్రకృతినో, నాయికనో వర్ణించగలరు.

ఆవిడ రచనల్లో చమక్కులు, చెణుకులూ రెండూ ఉంటాయి.

ఓ స్త్రీగా పురుషుడికి ఏ మాత్రం తక్కువ కాకుండా – ఎన్నుకున్న రంగంలో రాణించి, ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన రమణిగారు అభినందనీయులు.

‘మహిళ పక్షం’ కార్యక్రమం తరఫున రమణిగారి గురించి, వారి రచనల గురించి మాట్లాడే అవకాశం కల్పించినందుకు సేవ అక్షర తోరణం నిర్వాహకులకు మరోసారి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.

రమణిగారికి నమస్కారాలు.

సహ వక్తలకూ, సేవ – అక్షర తోరణం ఛానెల్ వీక్షకులకు నా అభినందనలు.

సెలవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here