నిజజీవితానికి నిలువుటద్దం – ‘జీవన సౌరభం’ నవల

2
15

[యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన ‘జీవన సౌరభం’ అనే నవలను విశ్లేషిస్తున్నారు శ్రీ గోనుగుంట మురళీకృష్ణ.]

[dropcap]య[/dropcap]ద్దనపూడి సులోచనారాణి నవలలు అమ్మాయిలని కలల లోకంలో విహరింపజేస్తాయని అందరూ అంటారు. ఇది కొంతవరకే నిజం. ఆమె రచనా వ్యాసంగం మొదలు పెట్టిన మొదట్లో, కధానాయకుడు ఆరడుగుల అందగాడు, ఐశ్వర్యవంతుడు, పొడవాటి కారులో వచ్చి హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ వర్ణనలు రాబోయే భర్త గురించి పెళ్ళికాని అమ్మాయిలని కలలు కనేటట్లు చేస్తాయి. రచయిత్రి నడివయసులో రాసిన రచనలలో జీవితం అంటే ప్రేమ, మమత, మానవత్వం అని ప్రబోధిస్తున్నట్లుగా ఉంటాయి. మనసు కలసిన మనిషితో జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో తెలియజేస్తాయి. కానీ సులోచనారాణి రచనా వ్యాసంగం ముగించే సమయంలో చివరలో వచ్చిన కొన్ని నవలలను పరిశీలిస్తే జీవితం పట్ల స్పష్టమైన అవగాహన, రచనలో పరిణతి, జీవితానుభవం స్పష్టంగా కనిపిస్తాయి. “నిజమే! పద్దెనిమిదేళ్ళ వయసులో వచ్చిన ఊహలు యాభైఏళ్ల వయసులో రావు కదా!” అనిపిస్తుంది ఆ కథలు చదువుతూ ఉంటే. ఆ పాత్రలు, ఆ కథలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘జీవన సౌరభం’ నవల.

రచయిత్రి పరిచయం:

యద్దనపూడి సులోచనారాణి నవలలు అన్నీ పాపులర్ అయినాయి కాబట్టి అవి అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఆమె వ్యక్తిగత వివరాలు చాలామందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఆమె పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది చాల తక్కువ. అందులో కూడా సాహితీపరమైన విషయాలు తప్ప పర్సనల్ విషయాలు గురించి చెప్పింది తక్కువ. అందువల్ల ఆమె రచనల గురించి తప్ప, ఆమె గురించి పాఠకులకు పరిచయం తక్కువ.

సులోచనారాణి స్వస్థలం కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని కాజ గ్రామం. రచయిత్రి గోవిందరాజు సీతాదేవి ఆమెకి స్వయానా అక్క. పదవతరగతి వరకే చదువుకున్నారు. తర్వాత పెళ్లి అయి హైదరాబాద్ వెళ్ళిపోయారు. మారుమూల పల్లెటూరి నుంచీ ఒక్కసారిగా సిటీలోకి రావటం వలన ఆమె ప్రతి నవలలోనూ హైదరాబాద్, సికిందరాబాద్‌ల వర్ణనలు కనిపిస్తాయి. సులోచనారాణి మొదటి కథ 1956లో రాసిన ‘చిత్ర నళినీయం’, మొదటి నవల ‘సెక్రటరీ’. చివరి నవల ‘అభిజాత’. ఆమె మొత్తం సుమారు 55 నవలలు, 33 కథలు రాసారు. అందులో జీవన తరంగాలు, మీనా, రాధాకృష్ణ వంటి పదమూడు నవలలు సినిమాలుగా; ఆగమనం, ఈ తరంకథ వంటివి టి.వి. సీరియల్స్‌గా తీశారు. ఇవి గాక ఆత్మగౌరవం, మనుషులు మమతలు, అమ్మా నాన్నా, శభాష్ బేబీ, నీరాజనం వంటి ఏడెనిమిది సినిమాలకు కథలను సమకూర్చారు. ఆమె 2018 లో కన్నుమూశారు.

‘జీవన సౌరభం’నవల క్లుప్తంగా:

భరద్వాజ, భానుమతి దంపతులకి ముగ్గురు కూతుళ్ళు, సౌందర్య, సంగీత, సంయుక్త. కళ్ళుచెదిరే అందం సౌందర్యది. మధురమైన గానం సంగీత స్వంతం. అక్కలకి ఉన్న ప్రత్యేకతలు ఏవీలేవు సంయుక్తకి. ఆమెకి తెలిసినదల్లా కలల్లో విహరించకుండా వాస్తవంలో జీవించటం, కష్టపడి పనిచేయటం. భార్యాపిల్లల కోరికలు తీర్చటానికి ఎక్కువెక్కువ డబ్బుఇస్తూ అప్పులపాలు అవుతాడు భరద్వాజ. అప్పులవాళ్ళ ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మిగిలిన ఆస్తి, ఇల్లు అప్పులవాళ్ళు స్వాధీనం చేసుకుంటారు.

ఎక్కడికి వెళ్ళాలో తోచక బాధపడుతున్న భానుమతి కుటుంబాన్ని దూరపు బంధువు విమలమ్మ ఆదుకుంటుంది. తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అందుకు ఒకే ఒక్క కారణం, అప్పుడెప్పుడో తన కొడుకు చదువుకునే రోజుల్లో పరీక్ష ఫీజు కట్టలేక పోతే భరద్వాజ కట్టాడన్న కృతజ్ఞత. ఇల్లంతా వాళ్ళకి అప్పగించి, తల్లీకొడుకులు ఇంటి వెనకవైపు షెడ్‌లో ఉంటూ ఉంటారు. “నా పాతచీరెలు ఇస్తే ప్రసాదంలా తీసుకునే మనిషి ఇంట్లో ఉండవలసివచ్చింది” అని అనుక్షణం ఆమెని అసహ్యించుకుంటూ, చనిపోయిన భరద్వాజని తిట్టిపోస్తూ, ఎప్పుడూ ఏడుస్తూ ఉండే తల్లిని, అక్కలని చూస్తుంటే రానురాను చిరాకు కలగసాగింది సంయుక్తకి. ‘భర్తపోయిన దుఃఖంలో ఏదో అంటున్నదిలే! అనుకుని విమలమ్మ పట్టించుకోవటం లేదు గానీ ఆమెకి విసుగెత్తి ఇంట్లో నుంచీ వెళ్లి పోమ్మంటే తమ బ్రతుకులు నిజంగా రోడ్డున పడతాయి. ఇదొక రెడ్ సిగ్నల్! దీన్ని దాటి రాకూడదు’ అనిపించేది సంయుక్తకి.

అందుకే సాధ్యమైనంత వరకూ ఇంటిపనుల్లో సాయం చేస్తూ ఉండేది. విమలమ్మ కొడుకు వసంత్ జర్నలిస్ట్. అతడు పనిచేసే పేపర్ ప్రొప్రైటర్ సహదేవవర్మకి ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. అందులో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీ ఉందంటే చేయటానికి ఒప్పుకుంది సంయుక్త. జీతం తక్కువే! అయితేనేం, ఈ పరిస్థితుల్లో నాది అనే సంపాదన ఎంతో కొంత ఉండటం మేలు అనుకుని జాయిన్ అయ్యేరోజు తల్లికి చెప్పటానికి వచ్చింది. “మన ఇంట్లో పెంచే కుక్కలకి అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడతాము. ఇంత దరిద్రపు ఆలోచన నీకు చెప్పింది ఎవరు? తక్షణం మానేసేయి” అన్నది భానుమతి దర్పంగా.

“నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావమ్మా! మనకి స్వర్గసౌఖ్యాలు ఇచ్చే డాడీ పోయారు. ఆయనతో పాటే డబ్బు కూడా పోయింది. గతం మనకి ఒక స్మృతి మాత్రమే! నిజం చెప్పాలంటే ఈనాడు విమలత్తయ్య కన్నా దీనస్థితిలో ఉన్నాం. ఇన్నాళ్ళూ పేదవాళ్ళని ఆమెని అసహ్యించుకున్నాం. పేదరికం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది కదా! ఇకనైనా ఎవ్వరినీ ఏమీ అనకుండా ఉంటే మంచిది” అన్నది.

“నీ లెక్చర్లు వినలేక చస్తున్నా. మీ నాన్న తర్వాత నువ్వు తయారయ్యావు నా ప్రాణానికి” భానుమతి చిరాకుపడింది. ఎవరు ఎన్ని అనుకున్నా ఉద్యోగంలో జాయిన్ అవటానికే నిశ్చయించుకుంది సంయుక్త. ఆ హోటల్‌లో ప్రతినెలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ నెలలో సంగీత గాత్రకచేరీ ఏర్పాటు చేసింది సంయుక్త. ఆ కచేరీకి సౌందర్య కూడా వచ్చింది. అక్కలని ఇలా మళ్ళీ బయట ప్రపంచంలోకి తీసుకురాగలిగినందుకు ఆనందించింది సంయుక్త. సౌందర్య అందం చూసి సహదేవవర్మ ముగ్దుడు అయ్యాడు. అతనికి అరవై ఏళ్ళ వయసు. తన అందానికి లోబడినవాళ్ళని చిటికెన వేలుతో తిప్పినట్లు ఆడించగలదు సౌందర్య. నెలరోజులు తిరక్కముందే సహదేవవర్మ, సౌందర్య రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వెంటనే సౌందర్య చేసిన మొట్టమొదటి పని సంయుక్తని ఉద్యోగంలో నుంచీ పీకేయటం, తన చెల్లెలు రిసెప్షనిస్ట్‌గా తన హోటల్ లోనే పనిచేయటం అవమానం అని.

క్రుంగిపోయి కూర్చున్న సంయుక్తని ఓదార్చి తన పేపర్ లోనే జర్నలిస్ట్‌గా చేసే అవకాశం కల్పించాడు వసంత్. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సంగీత స్వరం ఒక బంగారు గని అని అర్ధం అయింది చక్రపాణికి. ఆమెను వివాహం చేసుకున్నాడు చక్రపాణి. సంగీతకి కచేరీలు పెరిగాయి. డబ్బు సంపాదన పెరిగింది. సహదేవవర్మ డబ్బు చూసి పెళ్లి చేసుకుంది గానీ అతడితో దాంపత్యం అసంతృప్తి గానే ఉంది సౌందర్యకి. అతడి సెక్రటరీ భాస్కర్‌ని చూస్తుంటే “మగవాడంటే ఇలా ఉండాలి” అనిపించసాగింది. ఇద్దరికీ సంబంధం ఏర్పడింది. ఆ సంగతి తెలిసినా వాళ్ళిద్దర్నీ కంట్రోల్ చేయలేకపోతున్నాడు సహదేవవర్మ. మరోవైపు సంగీత గర్భవతి అయింది. పిల్లలు పుడితే కచేరీలకి అడ్డం అని అబార్షన్ చేయించాడు చక్రపాణి. పిల్లల కోసం దిగులుపడుతూ పాటలు సరిగ్గా పాడలేకపోతున్నది సంగీత. ఆదాయం తగ్గిపోయేసరికి ఆమె నుంచీ విడిపోవటానికి నిశ్చయించుకున్నాడు.

సౌందర్య భాస్కర్ మోజుతో సహదేవవర్మని హత్య చేయించిందనే వార్త ఊరంతా భగ్గుమన్నది. పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసారు. ఒక పక్క సంగీత విడాకుల కేసు, మరోపక్క సౌందర్య హత్యకేసు. భానుమతి ఇప్పుడు పరువుకోసం పాకులాడటం లేదు. సహాయం చేయమని తెలిసిన వాళ్ళందరినీ అడుగుతున్నది. ఎవరూ చేయూత ఇవ్వలేదు. భర్త ఉన్నప్పుడు వాళ్లకి ఎన్ని విధాల సాయం చేసిందో గుర్తుచేసి, చెడామడా తిట్టిపోసింది భానుమతి. ‘ఆవిడకి ఆవేశం వస్తే అంతే!’ అనుకుని బంధువులందరూ వెలివేసినట్లు చేశారు.

చక్రపాణికి, సంగీతకి విడాకులు మంజూరు అయ్యాయి. సౌందర్య భాస్కర్ సాయంతో సహదేవవర్మని హత్య చేయించిందని కోర్ట్ నిర్ణయించి ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు లాక్కువెళుతుంటే “మమ్మీ! మమ్మీ!” అని చేతులు చాస్తూ గుండెలు పగిలేలా ఏడ్చింది సౌందర్య. భానుమతి కోర్ట్ హాలు లోనే స్పృహతప్పి పడిపోయింది. సంయుక్త తల్లిని ఇంటికి తీసుకువచ్చింది. “సంయూ! ఇదంతా నా తప్పే! మిమ్మల్ని గారాబంగా పెంచాను. డబ్బులేని వాళ్ళు పురుగులతో సమానం అన్నట్లు నేర్పాను. మీ భవిష్యత్ గురించి ఆలోచించకుండా పరువు ప్రతిష్ఠ అంటూ ఎండమావుల వెంట పరుగెత్తాను. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఏది మంచి, ఏది చెడు అనే వివేకం నేర్పాలి. అది చేయలేకపోయాను. మీ బ్రతుకులు ఇలా అవటానికి నేనే కారణం” అంటూ ఏడ్చేసింది భానుమతి.

“ఎందుకు మమ్మీ అంత బాధ పడతావు? తల్లిదండ్రులు నేర్పకపోయినా ప్రతి మనిషికీ భగవంతుడు ఇచ్చిన తెలివి అనేది ఉందిగా! అదేమయింది? డబ్బుకి కక్కుర్తిపడే గుణం ఉన్నవారికి ఇలాంటి అవస్థ తప్పదు” అన్నది సంయుక్త. ఆ రాత్రి భానుమతికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. తెల్లవారేసరికి ప్రాణమే పోయింది, ఏడుస్తున్న సంగీతని దగ్గరకు తీసుకుంది సంయుక్త.

సంగీతకి ధైర్యం చెప్పి మళ్ళీ కచేరీలు ఇచ్చేటట్లు చేసింది సంయుక్త. ఆ సందడిలో బాధ మర్చిపోయి కోలుకోసాగింది సంగీత. మళ్ళీ డబ్బు పెరగసాగింది. ఆమె పేరుతో బ్యాంక్‌లో వేసింది. సౌందర్య కూతురు ఆరేళ్ళ పాప ఆలనాపాలనా కూడా తనే చూసుకోసాగింది సంయుక్త. వసంత్‌కి సంయుక్తకి జర్నలిస్ట్‌లుగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. సౌందర్య జైలునుంచీ విడుదల అయింది. సౌందర్యకి భ్రమలు అన్నీ తొలగిపోయి, వాస్తవం బోధపడి పశ్చాత్తాపం కలిగింది. పిల్లలందరూ పెద్దయ్యారు. సౌందర్య ఇప్పుడు పిల్లకోసమే బ్రతుకుతూ ఉంది.

ఇదీ క్లుప్తంగా కథ! ఈ కథలో హీరోయిన్ సౌందర్య వర్ణనలూ లేవు, హీరోకి పడవలాంటి కారూ లేదు. పాఠకులని ఊహాలోకాల్లో విహరింపజేసే అంశాలు ఏమీలేవు. డబ్బు చూసుకుని అహంకరించే భానుమతి లాంటివారు, అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించలేక బలి అయ్యే భరద్వాజ లాంటివారు, టాలెంట్ ఉన్నా మానసిక స్థైర్యం లేని సంగీత లాంటివారు, డబ్బుకోసం కక్కుర్తి పడే సౌందర్య వంటివారు, రిటైర్ అయ్యే వయసులో వ్యామోహాలకి గురిఅయ్యే సహదేవవర్మ వంటివారు, అవకాశం వస్తే చేసిన మేలు మర్చిపోయి స్వార్ధంగా ప్రవర్తించే చక్రపాణి వంటివారు, ఇల్లు ఇరుకైనా మనసు ఇరుకులేని విమలమ్మ వంటి సహృదయులు, భార్యకి ప్రోత్సాహం ఇస్తూ ఆమె అభివృద్ధికి తోడ్పడే వసంత్ లాంటి భర్తలు.. ఇవన్నీ నిత్యం మనం చూసే సజీవపాత్రలు. అందచందాలు లేకపోయినా మనోధైర్యంతో కష్టాలని ఎదుర్కొని తోడబుట్టిన వారికి ఆసరాగా నిలబడగలిగిన సంయుక్త లాంటివారు అరుదైనా అసాధ్యం మాత్రం కాదు..

ఈ నవల చదువుతున్నంత సేపూ ఆయా పాత్రలు, సన్నివేశాలు కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. చదవటం పూర్తి అయిన తర్వాత నిండు జీవితాలని దగ్గర నుంచీ చూసిన అనుభూతి కలుగుతుంది.

***

జీవన సౌరభం (నవల)
రచన: యద్దనపూడి సులోచనారాణి
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 200
వెల: ₹60/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Jeevana-Saurabham-YaddanaPoodi-Sulochana-Rani/dp/9386212242

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here