అమ్మను ప్రతిబింబించిన కవిత్వగానం

1
9

‘జీవితం పేరు’  పుస్తక సమీక్ష

[dropcap]క[/dropcap]వులు సాధారణంగా ప్రకృతి రామణీయకతను దర్శించి ఆనందంతో పరవశించి దాని గొప్పతనం గురించి కవితలల్లుతారు. అలా తమ అనుభూతిని ఆకర్షణీయంగా చెప్పి, అటువంటి రసాత్మక దృష్టి లేనివారికి కూడా ఆ రుచి నేర్పి తమతో కలుపుకుని తీసుకువెళతారు. దానితో పాటు కవులు మరొక ముఖ్య బాధ్యత వహిస్తారు. సమాజంలో ఉన్న సమస్యల్ని చూసి సున్నిత హృదయంతో స్పందించి వాటికి తగిన సునిశిత పరిష్కారాల్ని, తోటివారి వెన్ను తట్టి స్నేహపూర్వకంగా ఒక టీచర్‌లా చెప్పడానికి ప్రయత్నిస్తారు. వృత్తిరీత్యా హిందీ ఉపాధ్యాయురాలైన కవయిత్రి ప్రస్తుతం సంఘం ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితుల దృష్ట్యా, పూర్తిగా సమస్యల పైనే దృష్టి కేంద్రీకరించారు. సమాజం మొత్తాన్ని సమ్యక్ దృష్టితో అవలోకించి దీనులు, బలహీనులు, అశక్తులు ఎదుర్కొంటున్న పీడనను ఎప్పటికప్పుడు కవితల ద్వారా వివరిస్తూ ప్రతి బాధాకరమైన అంశాన్నీ విపులంగా చర్చించారు.

అపురూపమైన అమ్మ ఔన్నత్యాన్ని గురించి చెబుతూ మొదలైన ఈ సంపుటిలో, ఈ భూమిపై సమస్త ప్రాణికోటికి అమ్మ ఎలా ఆలంబనగా నిలబడిందో ‘ఔషధం’ కవిత ద్వారా చెప్పారు. ‘నీవు లేని ఈ వేళ’ అంటూ ఓ చక్కని కవితలో వరమిచ్చే దేవతలా అమ్మ బిడ్డల్ని గుండెల్లో పొదువుకుని, తాను తినీ తినకా తన వెచ్చని పొత్తిళ్ళలో బ్రతికినంతకాలం సాకి ఆపై ఒక త్యాగపు జ్ఞాపకంగా ఎలా నిలిచిందో అద్భుతంగా చెప్పారు. ఈ ప్రపంచం ఇలా నిలబడడానికి ఆధార భూతమైన స్త్రీని ఒక ‘మమతల నది’గా వర్ణించారు.

ఈనాటి బిజీ ప్రపంచంలో కొందరు ఉద్యోగాల ఒత్తిడితో, మరి కొందరు స్వార్థ చింతనతో, లేక ఇతర కారణాలతో ఉండడం వల్ల రెండు తరాల వెనుక వృద్ధులకున్న భద్రత నేటికాలంలో లేదు. ఒక ప్రేమ పూరిత పలకరింపుకు మొహం వాచిన వృద్ధుల్ని నిర్లక్ష్యం చేయవద్దంటూ వారి అనుభవం గులాబీ అత్తరు వంటిదని, వారు అనుభవాలు పండిన సిద్ధులని వాటిని తెలుసుకుని యువత వృద్ధిని పొందాలని ‘వృద్ధులు’ అనే కవితలో చెప్పారు. తమ సంతానం చుట్టూ అల్లుకున్న మమతల తీవెలని వాళ్ళు తుంచి వెళ్ళిపోయిన నాడు, మౌనంగా కుమిలిపోయే తల్లితండ్రుల దైన్యాన్ని ‘అమ్మవో, నాన్నవో’ అంటూ హృద్యంగా రాసి కంట తడిపెట్టించారు. ఈ సమస్య నిత్యం మనం చూస్తున్నదే.

పరమత అసహనం, స్త్రీలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు మొదలైన నేటి కాలపు వెతలన్నిటినీ గుదిగుచ్చి అందరినీ ఆయా దుర్మార్గాలపై దృష్టి సారించమని చెప్పింది ఈ కవితల హారం. వెర్రిప్రేమల వెంటబడి బాధ్యత మరిచి సుఖాల వేటలో, నేల విడిచి సాము చేస్తున్న యువతరాన్ని పదునైన కవితా వాక్యాలతో మేల్కొలిపారు. టీనేజీ ప్రేమలో పడి, ఎదిగీ ఎదగని మనసులతో అది విఫలమైతే ప్రాణాలు తీసుకోవడమో, యాసిడ్‌లతో, బ్లేళ్లతో ప్రాణాలు తియ్యడమో చేస్తున్న యువతను హెచ్చరించారు.

పుట్టినప్పటినుండీ అడుగడుగునా ఓర్పుగా జీవనం సాగిస్తూ వచ్చిన స్త్రీ సహనాన్ని గుర్తుచేసి శ్లాఘిస్తూనే, ఆమె అస్తిత్వం ఉండేలా ఆత్మగౌరవంతో బతకాలని ఇచ్చిన చక్కని సందేశం ‘ఆత్మ సాక్ష్యం’ కవితలో ఉంది. భూమ్మీద మనిషి పదికాలాలు పచ్చగా బ్రతకడానికాధారమైన ఆకుపచ్చని ప్రకృతిని సంరక్షించుకోకుంటే వాతావరణ సమతుల్యం దెబ్బతిని మన మనుగడకి ఏర్పడబోయే ముప్పు గురించి ‘వెరపు’ కవితలో చెప్పారు. ఇక శ్రమ తగ్గించుకోవడం కోసం, తాత్కాలిక సౌఖ్యం కోసం చేస్తున్న తప్పు మట్టిలో కలవని ‘ప్లాస్టిక్’ వాడకం. ఇది తగ్గించమని మనందరికీ కూడా చెప్పారు.

లోకం లోని కుళ్ళు చూసి చూసి ముల్లుగా ‘నేను మారిపోయాను’ అంటూ ఓ కవితలో అనడం వెనక ఎంతో ఆవేదన ఉంది. అలా లేకపోతే పువ్వులాంటి మనసుతో క్షణ క్షణం ముళ్లబారిన పడవలసి వస్తుందన్నది వాస్తవం. అక్రమ సంపాదన అలవాటు చేసుకుని చట్టం చేతిలో చిక్కిన వ్యక్తి, తన ‘దుర్గతి’కి దుఃఖిస్తూ ఇంట్లోని వారు హెచ్చరించలేదని వగచిన కవిత ఎందరికో కనువిప్పు. పసిపాపలపై వికృత పంజా విసిరే రాక్షసుల్ని ఉరి తియ్యాలని బాధగా ఒక కవిత రాసారు. ఆడపిల్లల పాలిట కాలయములవుతున్న యువకుల తల్లులే చట్టాల కన్నా శక్తివంతమైన కఠిన శిక్షణను ఒక చికిత్సగా ఇంట్లోనే ఇవ్వాలంటారు. ఎంత అద్భుతమైన సూచన! ఎందుకంటే బైట క్రూరత్వం చూపుతున్న ప్రతి మగాడూ ఒక అమ్మ ఒడిలో ఒదిగి పెరిగిన బిడ్డడే కదా.ఈ కవిత వెనుక ఎంతటి వ్యధ ఉందో మనకు తెలుసు.

సహృదయ స్నేహం, సహకారం కలిసి విలసిల్లే ‘శాంతి సదనం’ అయిన ‘రమజాన్’ గురించి కోమలంగా వివరించారు. కరోనా శత్రువుపై సాగుతున్న ‘కరాళ యుద్ధం’లో ప్రతి మనిషీ ఒక సైనికుడై పోరాడాలని ప్రేమగా చెప్పారు. ఇంతటి ఘర్షణ మధ్య తన సుకుమార సంగీత హృదయం దాచుకోలేక, తెలుగు ప్రజల తెలుగు భాషా వీణ తీగెల్ని మధురంగా స్పృశించారు కవయిత్రి.

పాలుగారే పసిపాపలకు ఆరోగ్యకర స్పర్శ, విషస్పర్శల మధ్య తేడాను గుర్తించడం నేర్పమన్నారు. కఠినంగా అనిపించినా ఎంతో విలువైన సలహా. మట్టితో మమేకమైన అన్నదాతల ‘దుఃఖగాధ’కు, సానుభూతితో స్పందించి ఆర్ద్రతతో ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు. ఒకప్పుడు జై కిసాన్ అని గౌరవంతో నినదించిన మనదేశంలోని నేటి రైతు దుస్థితిని అందరమూ చూస్తున్నదే. చివరగా భారతదేశం సర్వమత సామరస్యంతో ‘అఖండ దీపమై’ వెలగాలని కోరుకున్నారు. ఆఖరుగా తనతో స్నేహించిన ‘చెలిమి చిరునామా’ను ఆప్యాయంగా తలచుకున్నారీ స్నేహశీలి.

ప్రస్తుతం లోకం ఎదుర్కొంటున్నఅనేక చిక్కు ప్రశ్నలకు పరివేదన చెందిన కాశింబి గారు తనవైన సమాధానాలను తల్లి హృదయంతో ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కవితలన్నీ విలువైనవే. కవయిత్రిగా నిబద్ధత, వ్యక్తీకరణలో నిజాయితీ,ఆవేదనలో ఆర్తి ఈ కవిత్వం నిండా ప్రస్ఫుటంగా కనబడతాయి. పోయెట్రీ ప్రేమతో చదివే ప్రతి పఠితకూ కావలసింది అదే కాబట్టి ,ఈ పుస్తకాన్ని మిత్రులు కొనుక్కుని చదువుతారని ఆశిస్తున్నాను.

***

జీవితం పేరు (కవితా సంపుటి)

రచన: శ్రీమతి ఎస్.కాశింబి

పేజీలు: 104, వెల: ₹ 100

ప్రతులకు:

Flat No.101,Vaishnavi Orchids,

1st Line, Vijayapuri Colony

JKC College Road, GUNTUR – 522 006

Cell No. 9052216044

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here