జీవితమంటే..

7
9

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘జీవితమంటే..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]ఫీస్ లో తన చైర్‌లో కూర్చున్నాడు శివాజీ.

తనకు రాబోయే మొదటి శాలరీ ఏ విధంగా ఖర్చు చేయాలా ఆలోచిస్తున్నాడు అతడు. మొదట తల్లిదండ్రులకు బట్టలు కొనాలనుకున్నాడు. అలాగే అమ్మ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు రింగ్ కొనాలనుకున్నాడు. ఇలా పరిపరి విధాలుగా సాగుతున్నాయి అతడి ఆలోచనలు.

ఉద్యోగం సాధించడానికి అతడు పడిన పడిన కష్టాలు సైతం గుర్తొస్తున్నాయి. తొలి సంపాదన ఏనాడు మరువలేనిది. జాగ్రత్తగా ఖర్చు చేసి అమ్మానాన్నల మన్ననలు పొందాలనుకున్నాడు. వాళ్ళు పడిన కష్టానికి తగిన ఫలం తన అభివృద్ధి అనుకున్నాడు.

అవును చెల్లికి కూడా ఓ మంచి డ్రెస్ కొనాలని లెక్కలు వేసుకున్నాడు.

మిగిలిన డబ్బులు అకౌంట్‌లో ఉంచి పొదుపుగా ఖర్చు చేస్తూ.. ఆర్థికంగా నాన్నకి తోడుగా వుండాలను కున్నాడు. తన తండ్రి చేసేది ప్రైవేట్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగం. ఉన్నంతలోనే పిల్లల్ని చక్కగా చదివిస్తున్నాడు. చెల్లి డిగ్రీ ఇంకో యేడాదైతే పూర్తవుతుంది.

అతడలా ఆలోచనల్లో ఉండగా..

మేనేజర్ గారు వెళుతున్నట్లుగా అనిపించి కంప్యూటర్ స్క్రీన్‌లో తల దూర్చి పనిలో నిమగ్నమయ్యాడు.

టీ విరామంలో ఓ ప్రక్కగా కూర్చున్నాడు.

ఎప్పుడూ అయితే ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడే వాడు. ఆ రోజెందుకో ఉద్వేగంగా ఉంది. తను జాబ్ సాధించడానికి పడిన కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి..

“ఇక్కడ ఏ జాబ్ ఖాళీ లేదయ్యా. మా విలువైన సమయాన్ని వృథా చేయొద్దు..” మొహం పైనే గేట్ వేసిన ఆఫీస్ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

“మాక్కావలసిన వ్యక్తి కేవలం ఇంటర్మీడియట్ చదివితే చాలు. అంతే కానీ ఇలా డిగ్రీ 90% సాధించిన వాళ్ళు అక్కరలేదు..” నిర్మొహమాటంగా చెబుతుంటే నీరసంగా ఆ ఆఫీస్ మెట్లు దిగాడు.

“అవును.. మాకు ఎక్స్‌పీరియన్స్ వున్న వాళ్ళు కావాలని పేపర్ ప్రకటన ఇచ్చాం కదా? మరి ఇలా వాకిన్ ఇంటర్వ్యూకి రావచ్చా? ఏమయ్య అసలు యాడ్ సరిగ్గా చూసావా లేదా?” రిసెప్షన్ లోనే తన అప్లికేషన్ రిజక్ట్ అయితే మౌనంగా వెనుదిరిగాడు.

“బాబు! జాబ్ జాబ్ అంటూ.. మాకు పదే పదే కాల్ చేయవద్దు. ఇంటర్వ్యూ బాగా జరిగింది. నీలాగా నలుగురిని సెలక్ట్ చేశాము. అందుకు అవసమైన పర్సన్ ఒక్కరే! సో.. రెండు రోజుల్లో మీకు కాల్ వస్తుంది. మీరు సెలెక్ట్ అయినట్లయితే!”

కొద్ది క్షణాలు ఆగి.. “నీ సమస్య అర్థమయ్యిది. కాల్ రానట్లయితే యు ఆర్ నాట్ సెలెక్టెడ్!” నవ్వుతూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

వారం రోజు కాదు కదా పది రోజులైనా కాల్ రాలేదు. నీరసంగా అనిపించింది అతనికి.

తండ్రి పిలుస్తుంటే తండ్రి ఎదురుగా నిలబడ్డాడు..

“చిన్నా! నాకు తెలిసిన ఓ పెద్దాయన ఉన్నాడు.. ఆయన్నేమైనా నీకు జాబ్ చూపమని అడిగేదా? ఆయన మనకి సాయం చేస్తారన్న నమ్మకం నాకుంది.”

“లేదు నాన్నా!ఎంత కష్టమైనా పర్లేదు. నేనే జాబ్ సాధిస్తాను. డిగ్రీ చదువు కున్న నా క్వాలిఫికేషన్‌కి తప్పకుండా ఉద్యోగం వస్తుంది.”

“ఇంకా ఎంతకాలం.. ఇప్పటికే నాలుగు నెలలవుతోంది. నువ్విలా కాలయాపన చేస్తుంటే.. నీరజ డిగ్రీ కూడా పూర్తవుతుంది.”

శివాజీ మనసు చివుక్కుమంది. ఎదురుగా వున్నది తండ్రే కదా అనుకుని మనసుకి సర్ది చెప్పుకున్నాడు.

ఆ రోజు రాత్రి..

“ఒరేయ్ చిన్నా! నేనో మాట చెబుతాను గుర్తుంచుకో. నేడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం రేపు నీ భవిష్యత్‌కి చక్కని బాటలు వేస్తుంది. ఓటములు, అవమానాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా.. భవిష్యత్తు మీద ఆశతో జీవించాలి. నువ్వు తప్పకుండా జీవితంలో పైకొస్తావు. ఆశ మనం ఏ స్థితిలో వున్న నిలబెట్టే చైతన్యం! నిరాశ మనం విజయాల బాటలో ఉన్న అధఃపాతాళానికి చేర్చే అగాధం! శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులతో నీకు అంతా మంచే జరుగుతుంది. చిన్ని చిన్ని అపజయాలను తట్టుకున్నావనుకో.. రేపటి ఘన విజయాలు నీకోసం నిరీక్షిస్తాయి. అమ్మ మాట గుర్తుపెట్టుకో!”

తన తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపించింది ఆ సమయంలో అతనికి!

ఓ చల్లని చిరుగాలి అతడిని తాకుతూ వెళ్ళింది. ఆ స్పర్శ మేఘన తాలూకు జ్ఞాపకంలా.. అద్భుతంగా వుంది.

ఎప్పుడు వచ్చి ఆఫీస్‌లో తన చైర్‌లో కూర్చున్నాడో కానీ.. ఆగకుండా అతని టేబుల్ పై వున్న ల్యాండ్ లైన్ ఫోన్ మ్రోగుతుంది. ఈ లోకం లోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి వాళ్ళు చెప్పిన మాట విని.. ఒక్కసారిగా నీరసం ఆవహించగా.. సీట్ లోకి జాగిలపడ్డాడు.

‘అలా జరగకపోతే బాగుండు.. అర్రే..’ అనుకుంటూ వేగంగా మెట్లు దిగి తన బైక్ దగ్గరకు వచ్చాడు.

తన బైక్ ఇప్పుడు కేవలం పది కిలోమీటర్లు సైతం ప్రయాణించలేదు. ట్యాంక్ నిల్ అన్నట్లుగా చూపిస్తున్న నిడిల్ వైపు చూస్తూ తల దించుకుని ‘షిట్..’ అనుకున్నాడు నిస్సహాయంగా!

కొద్ది క్షణాలు మైండ్ పని చేయలేదు. వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చింది. తాను తప్పు చేస్తున్నట్లు అర్థమై.. వేగంగా ఫస్ట్ ఫ్లోర్ మెట్లు ఎక్కాడు. ఆఫీసర్ గారి క్యాబిన్ లోకి వెళ్ళాడు.

సీరియస్@గా పని చేసుకుంటున్న ఆయనని.. “సార్..” అంటూ పిలిచాడు.

ఆయన ప్రసన్నంగా నవ్వుతూ చూస్తూ.. “యెస్..” అన్నాడు.

సార్.. అదీ.. అంటూ, తన ప్రాబ్లం గబగబా చెప్పేశాడు.

“ఓ మై గాడ్ అలాగా! వెంటనే బయలుదేరు” అన్నాడు శ్రీరాంసాగర్ సార్!

“సార్!.. ఓ చిన్న రిక్వెస్ట్.. ఓ రెండు వేలు అర్జెంట్‌గా కావాలి సార్! సాయంత్రం శాలరీ రాగానే రేపు మార్నింగ్ మీ బాకీ మీకు ఇచ్చేస్తాను” అడగలేక అడిగాడు .

సాగర్ సార్ వెంటనే తన పర్స్ తీసి ఐదు వందల నోట్లు నాలుగు ఇచ్చి.. “త్వరగా వెళ్ళు..” అంటూ హడావుడి చేశాడు.

“వన్ మినిట్!” అంటూ బాస్ పిలుస్తుంటే..

“ఆ!”

“అన్ని వర్క్స్ అప్డేట్ ఉన్నాయా!? లేకుంటే చెప్పు నేను చెక్ చేస్తాను. ఈ రోజు మంత్ ఎండింగ్ కదా?”

“సార్! అన్ని వర్క్స్ కంప్లీట్ చేశాను. సాయంత్రం రిపోర్ట్స్ పంపడమే ఆలస్యం”

“ఓ నైస్.. జాగ్రత్త”

వేగంగా బైక్ వైపు కదిలాడు శివాజీ.

***

తన తండ్రికి గంటన్నర క్రితం యాక్సిడెంట్ అయినట్లు తెలుసుకుని వార్డ్ వైపు పరిగెత్తాడు ఆత్రుతగా. అక్కడ తన తండ్రి కనిపించలేదు. ఐసియులో వున్నాడని రిసెప్షన్‌లో చెబుతుంటే అటుగా వెళ్ళబోతుంటే.. ఐసియు లోకి అతడిని అనుమతించలేదు.

ప్రక్కకు తిరిగితే కన్నీటి పర్యంతమైన తల్లిని చూసి.. అతని కళ్ళలో నీళ్ళు నిలిచాయి.

“అమ్మా! నాన్న కేమయింది?” అడిగాడు.

“ఉదయం పది గంటలప్పుడు స్కూల్‌కి వెళుతుంటే మీ నాన్నగారి స్కూటర్‌ని లారీ గుద్దింది రా. అదృష్టం కొద్దీ.. ఈయన ఎగిరి లారీకి దూరంగా, రోడ్డుకి ఆవలగా పడ్డారంట. తలకు తీవ్రగాయమయిందట. ఆపరేషన్ చేయాలన్నారు. నా దగ్గర ఓ ఐదువేలుంటే పే చేశాను. ముప్పై వేల వరకు ఖర్చవుతుందన్నారు.”

తల్లి చెబుతున్న మాటలు వింటుంటే.. ఓ వ్యక్తి అతని దగ్గరకు వచ్చాడు..

“సార్! మీరు చంద్రశేఖర్ గారి అబ్బాయేనా?”

“అవును”

“మిమ్మల్ని డాక్టర్ గారు వెంటనే రమ్మన్నారు.. అదిగో అటు వెళ్ళండి” అంటూ దారి చూపాడు. హడావుడిగా అటుగా నడిచారు.. తల్లీకొడుకులు!

“సార్! సాయంత్రం నాకు జీతం వస్తుంది. రాగానే హాస్పిటల్ బిల్ పే చేస్తాను. మీరు వెంటనే ఆపరేషన్ ప్రారంభించండి.” అన్నాడు.

తల్లి కొడుకు ఇద్దరు ఐసియు దగ్గరకు వచ్చారు. అప్పటికే అక్కడికి వచ్చి నిలబడిన నీరజని ఓదార్చ డం వాళ్ళ వల్ల కాలేదు. అతి కష్టం మీద నీరజని ఓదార్చారు వాళ్ళు. తన తండ్రి ఆరోగ్యంగా తిరిగిరావాలని మనస్సులో భగవంతుడ్ని ప్రార్థించింది నీరజ.

ఆపరేషన్ జరిగిన రెండు గంటల తరువాత వాళ్ళని ఐసియుకి అనుమతించారు.

తండ్రి క్షేమంగా తిరిగి రావడం.. కొద్దిగా కళ్ళు తెరిచి వాళ్ళ వైపు చూడడం.. ఆనందం కలిగింది.

అప్పుడే వచ్చిన శాలరీ బ్యాంకు నుండి డ్రా చేసి హాస్పిటల్ బిల్ కట్టాడు. మిగిలిన కొద్ది అమౌంట్ మరుసటి రోజు కడతానని చెప్పాడు. వాళ్ళు రేపు డిశ్చార్జ్ చేస్తామంటుంటే.. ‘అలాగే’ అన్నట్లుగా తలూపాడు.

***

మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే బాస్ సీరియస్‌గా ఉండడం గమనించాడు.

“మీ నాన్నగారికి ఎలా వుంది?” అడుగుతున్న ఆయనతో “ప్రస్తుతం పర్లేదు సార్!” అన్నాడు.

“సార్! మీకు ఇవ్వవలసిన రెండు వేలు ఇవిగో..” అన్నాడు.

“వచ్చేనెల ఇద్దువుగాని లే!” అన్నాడు శ్రీరాం సాగర్ గారు.

“సార్! అదీ..”

“ఆఫీస్ లెక్కల్లో నీకు అమౌంట్ ఇచిన్నట్లు రాస్తాను.. ఇలాంటి చిన్న అమౌంట్ మేనేజ్ చేయవచ్చు లే!” అన్నాడు.

“అలాగే సార్..” అన్నాడు శివాజీ.

“ఓ సారి నా క్యాబిన్ లోకి వస్తావా?”

అది తుఫాను ముందు ప్రశాంతత అని ఆ సమయంలో అర్థమవలేదు. తర్వాత అర్థమయ్యింది.

“శివాజీ! నేను పదే పదే చెబుతుంటాను. ఎప్పుడు ఆఫీస్లో పని వాయిదా వేయవద్దని. కొత్తగా జాబ్‌లో చేరావని సహిస్తున్నాను.. ఇన్నాళ్ళు. కానీ నీ తీరు మారలేదు. వర్క్ మొత్తం పుర్తి చేశాను అన్నావు. కానీ చాలా వర్క్స్ పెండింగ్‌లో వున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. జీవితంలో ఎదగాలంటే క్రమశిక్షణ, పట్టుదల, అన్న మాటకు కట్టుబడి ఉండడం.. వంటి ఉత్తమ లక్షణాలు ఉండాలి. నిన్న సాయంత్రం ఏడున్నర వరకు మేము నలుగురం ఉండి నీ పనులు పూర్తి చేశాము. అదేమంటే ఇప్పుడే చేస్తాను సార్ అంటావు. నీ పద్ధతి మార్చుకో.. ఇక వెళ్ళ వచ్చు .”

సీరియస్‌గా చెబుతున్న ఆయన వైపు చూస్తూ.. తప్పు చేసినట్లుగా తలొంచుకుని.. “సారీ సార్! మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటాను.. ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.”

“ప్రయత్నం కాదు.. చేయాలంతే!” అన్నాడు హూంకరిస్తూ..

అలాగే అన్నట్లుగా తలుపుతూ.. ఏదో గుర్తొచ్చి.. “అలాగే సార్” అన్నాడు వినయంగా శివాజీ.

***

కాఫీ షాప్‌లో కూర్చున్నారు మేఘన, శివాజీ. టేబుల్‌కి చెరోవైపు కూర్చున్నారు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. రేపటి అందమైన భవిష్యత్‌ని కలగంటున్నాయి మేఘన నయనాలు.

“సర్! ఆర్డర్..” అంటూ బేరర్ అడుగుతుంటే.. మేఘన చెప్పిన ఐటమ్స్ ఆర్డర్ చేశాడు.

ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. తన లక్ష్యాలు మేఘనకి చెప్పాడు శివాజీ. అతడు చెబుతున్న మాటలు శ్రద్ధగా వింటూ.. చిరునవ్వు నవ్వుతోంది మేఘన. అప్పుడప్పుడు నవ్వుతున్న తనవైపు ఇష్టంగా చూస్తున్నాడు శివాజీ. ఓ అరగంట తరువాత సాయం సంధ్య వేళ అవుతున్నప్పుడు భారమైన హృదయాలతో ఇళ్ళకు బయలుదేరారు.

‘నేస్తమా! నా ప్రాణ బంధమా.. ఏనాటి అనుబంధమే మనల్ని ఈనాడు ఒక్కటి చేసింది. నీ సమక్షం, నీ సాన్నిహిత్యం, నీ అనురాగం.. నా హృదయంలో ఆనందపారవశ్యాలను కలగజేస్తుంటే.. ఎన్నో విజయాలు సాధిస్తాను. నా నిన్ను అందుకోడానికి, చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ.. ఉన్నతుడిగా ఎదుగుతాను’ మనస్సులో అనుకుంటున్నాడు శివాజీ.

మేఘన చిరుదరహాసాలు అతని హృదయాన్ని ప్రతిక్షణం సమ్మోహితుడ్ని చేస్తుంటే.. ‘నా లోకం,నా జీవితం, నా సమస్తం నువ్వే మేఘనా’ అనుకున్నాడు.

“మరి నేను బయలుదేరుతున్నాను..” అంటూ వస్తున్న బస్ ఎక్కడానికి ముందుకు కదిలింది.

కళ్ళతో సైగ చేశాడు క్షణం ఆగమంటూ.. చేయి ముందుకు చాపాడు.

అతని చేయి అందుకుని “సరే మరి..” అంటూ వస్తున్న బస్ ఎక్కేసింది.

“ఉంటాను..” అన్నాడు.. అక్కడే ఆగిపోతూ..

ప్రేమ మనసుల్ని కలిపే పవిత్రబంధం!

ప్రేమ హృదయాల నిండా మ్రోగే మధు మంత్రం!

ప్రేమ నీకు నేను తోడున్నాను నేస్తం అని పలికే ప్రియభావన!

***

రెండు రోజుల తర్వాత సాయంత్రం ఆరున్నరప్పుడు.. అమ్మ ఎవరితోనో మాట్లాడడం గమనించాడు శివాజీ. ఇంటికి వచ్చిన శివాజీ వైపు అతను కోపంగా చూడటం అతనికి విస్మయాన్ని కలిగించింది. తను రాగానే అతను వేగంగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోతున్నాడు. బయటకి తొంగి చూస్తుంటే.. కారు దుమ్ము లేపుకుంటూ వెళుతుంది.

“ఎవరు లక్ష్మీ వచ్చింది?” ప్రశ్నిస్తున్న భర్తతో..

“ఆ! అదంతా తీరిగ్గా చెబుతాను లెండి.. మీరు ఆ పుస్తకమేదో చదువుతున్నారు కదా అది అవ్వనివ్వండి” అంది. వరండాలో నుండి ఇంట్లోకి వెళ్ళారు తల్లీ కొడుకులు.

ఆయన చేతిలో వున్న మహాప్రస్థానం పుస్తకం అందంగా కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ.

శివాజీ వాళ్ళ నాన్నకి సాహిత్యం అంటే ఇష్టం! అందులోను శ్రీశ్రీ గారి రచనలంటే మరీ ఇష్టం. విప్లవ సాహిత్యాన్ని సైతం చదువుతుంటారు. అలాగని ఆయనేమి కమ్యునిస్ట్ కాదు. ప్రైవేట్ స్కూల్ టీచర్.

రాత్రి తండ్రి,నీరజ నిద్రపోయాక.. తల్లి కొడుకులు ముచ్చట్లలో పడ్డారు.

“రేయ్ శివాజీ! నువ్వు ఎవరైనా అమ్మాయితో స్నేహం గాని చేస్తున్నావా?”

“అవును అమ్మా! స్నేహం కాదు.. ప్రేమిస్తున్నాను.”

“అమ్మాయి పేరేంట్రా?”

“మేఘన”

“అదా సంగతి.. సాయంత్రం మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కదా.. ఆయనకు మనకు కాస్త దూరపు బంధుత్వం ఉంది. ఆర్థికంగా బాగా వున్నవాళ్ళు..”

“నువ్వేమంటున్నావు అమ్మ!”

“అదే పాయింట్‌కి వస్తున్నా. నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన. మా అమ్మాయి జోలికి రావద్దని, మీ పిల్లాడిని హద్దుల్లో వుంచుకోమని, డబ్బున్న వాళ్ళకి ఎరేసి ఎదగాలనుకోవడం తప్పని.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. మా వాడు మాకు చెప్పకుండా ఏ పని చేయడు” అని ఆ పెద్దాయనకి నచ్చజెప్పి పంపాను.”

“మరి ఈ సంగతి నాన్నకి చెప్పావా?”

“ఆయనకు నేను ఎలాగోలా ఈ సంగతి చెబుతాలే కాని, ఆ పెద్దోళ్ళతో మనకెందుకొచ్చిన గొడవరా?”

“అది కాదమ్మా!”

“నువ్వు ఇంకేమి మాట్లాడవద్దు.. నా మాట విను. మనకు తగిన సంబంధం కాదది.. అంతే!”

మౌనంగా ఉండిపోయాడు శివాజీ. అతని మది కలవరం చెందుతుంది. రాత్రంతా నిద్ర పట్టలేదు.

‘మేఘన లేకుండా తను జీవించగలడా?’ ప్రశ్నించుకున్నాడు పదేపదే.

‘ఇటీవలే ఓ పెళ్ళిలో పరిచయమైన ఒక అమ్మాయి మీదే తనకింత ప్రేమభావను కలిగాయంటే.. ఇరవై రెండు సంవత్సరాలనుండి తామే లోకంగా జీవిస్తున్న అమ్మకి నాపై ఎంత ప్రేమ ఉండాలి?’ ఆలోచనలో సతమతమవుతుండగా.. సివిల్స్ పరీక్షల ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చాయి. తను ఫైల్ అయ్యాడు.

మెయిన్స్‌ క్వాలిఫై అవలేకపోయాడు. అందుకు కారణం తన ప్రయత్న లోపమే గ్రహించినా ఇప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితి.

***

తనని కలవడానికి అప్పుడప్పుడు కాల్ చేస్తున్న మేఘన కాల్‌ని లిఫ్ట్ చేయడం లేదు శివాజీ.

ఓ రోజు ఆఫీస్ దగ్గరికి వస్తే ఇష్టం లేనట్లుగా మాట్లాడి పంపాడు.

“JR గ్రూప్ ఎం.డి గారి అమ్మాయి నీ కోసం వచ్చిందేంటి?” అడుగుతున్న కొలీగ్‌కి సమాధానం చెప్పకుండా మాట దాటేశాడు.

***

ఆరోజు శివాజీ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో సాంబశివరావు బాబాయి ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన బాబాయ్‌తో సంతోషంగా మాట్లాడాడు శివాజీ.

“అన్నయ్యా! ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర స్థాయిలో మీరు పేరు తెచ్చుకుని నిన్న హైదరాబాద్ వెళ్ళి అవార్డు తీసుకు రావడం మా అందరికి గర్వకారణం. ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం, బట్టలు కుట్టించడం, వాళ్ల అవసరాలు కనిపెట్టుకుంటూ వాళ్ళు జీవితంలో పైకొచ్చేలా కృషి చేసిన మీ అభ్యుదయం ఆదర్శవంతం. నేడు మీ శిష్యులు ఉత్తమమైన, ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఇదంతా మీ చలవే అని చెప్పడం నిజంగా ఘనమైన విషయం..” ఆపకుండా మాట్లాడుతున్న సాంబయ్య బాబాయ్ మాటలకి అడ్డు వచ్చాడు చంద్రశేఖర్.

“నేను చేసిన సాయం కంటే వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ కృషి ప్రశంసనీయం. ఇంతకాలమైనా నన్ను గుర్తుంచుకుని గౌరవిస్తున్నారంటే అది వాళ్ళ విజ్ఞత. ఆ వినయం, విధేయతా వాళ్ళు నేడు ఆ స్థాయిలో ఉండడానికి కారణం. విద్యాశాఖ మంత్రే నా శిష్యుడవడం భగవంతుని అనుగ్రహం. మీరనుకున్నంత గొప్పవాడిని కాదు నేను. నా విద్యార్థులందరినీ నా సొంత బిడ్డల్లా ఆదరించాను అంతే”

సాంబయ్య బాబాయి, నాన్న మాట్లాడుతుంటే ఆసక్తిగా వింటున్నాడు.

నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాన్నని. ఎలాంటి స్థితిలోనైనా నిర్మలంగా ఉండే స్వభావం నాన్న సొంతం! సమాజం, తన విద్యార్థులు, సాహిత్యం గురించి నాన్న ఆలోచించినంతగా.. ఆర్థిక విషయాలపై శ్రద్ధ వేసుకోలేదేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.

***

పది నెలల తర్వాత..

“నాన్న త్వరలో జరగబోతున్న సివిల్స్‌కి నేను సరిగ్గా ప్రిపేర్ కావాలంటే జాబ్ చేస్తూ చదవడం కష్టం. అందుకే జాబ్ రెండు నెలలు మానుకుని నా సమయాన్నంతా చదువు పైనే కేటాయిస్తాను. ఏమంటారు?”

“అది కాదు చిన్నా! త్వరలో నీరజ వివాహం పెట్టుకుని నువ్వు జాబ్ చేయకుండా ఇంటిపట్టున వుంటే ఎలా? చెల్లి పెళ్ళికి ఎంత డబ్బులు ఖర్చవుతాయో తెలిసే మాట్లాడుతున్నావా?”

తనేం చెప్పినా తండ్రి వినడని తెలిసి తల్లికి తన సమస్య వివరించ బోయాడు.

“మీ నాన్న మాటే ఫైనల్..” అంటున్న తల్లి వైపు కోపంగా చూస్తూ.. ఇద్దరి పై అలిగాడు.

వాళ్ళతో పలకకుండా తన పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చదువుకోసాగాడు. జీవితం ఏ ఒక్కరికీ వడ్డించిన విస్తరి కాదు. మనమే కష్టపడాలి. ఫలితాలు భగవంతుడి ప్రసాదాలు. ఏదైనా అలసట ఎరుగని ప్రయత్నం, లక్ష్యం దిశగా ప్రయాణం ముఖ్యం.

***

ఆఫీస్ నుండి ఇంటికి హడావుడిగా వచ్చిన శివాజీ.. తన ఇంటి వద్ద జరుగుతున్న తతంగాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. తను చూస్తున్న దాన్ని నమ్మలేకపోతున్నాడు. మనసంతా ఆందోళనకు గురవుతుంటే.. “నాన్నా..?” అంటూ తండ్రిని పిలిచాడు.

ఇంటి బయట చైర్‌లో నిస్సహాయంగా, విచారవదనంతో కూర్చున్న తండ్రి వైపు చూస్తున్నాడు.

కాస్త దూరంలో నిలబడిన నీరజ, అమ్మ కళ్లనిండా నిలిచిన కన్నీళ్లని చూశాక అతనికి దుఃఖం ఆగలేదు. అతి కష్టం మీద వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు.

అప్పుడు సమయం రెండు గంటలు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా వున్న సమయం.

తన తండ్రి ష్యూరిటీగా వున్న వాళ్ళు ఎవరో సకాలంలో అప్పుకట్టలేదట. అందుకే బ్యాంక్ వాళ్ళు తమ ఇంటిని జప్తు చేస్తున్నారన్నది సందర్భం. అపాత్ర సాయం చేసినట్లుగా తలొంచుకున్న తండ్రి. తండ్రి మాటకి ఎదురు చెప్పలేని తల్లి. ఓ పది రోజుల్లో చెల్లి పెళ్ళి. తల పట్టుకుని కూర్చున్నాడు శివాజీ.

కొద్ది సమయం తర్వాత బ్యాంక్ వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళు అతడి మాటల్ని పట్టించుకోలేదు.

ఆ సమయంలో జరిగిందో అద్భుతం. కార్ వచ్చి నిలబడింది అక్కడ.

కార్ దిగుతున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది అతనికి. ఆయన ఎవరో కాదు.. జె.ఆర్. గ్రూప్ ఎండి జనార్దన్ రావు గారు. నేరుగా చంద్రశేఖర్ గారి దగ్గరకి వచ్చాడతను.

“అప్పు ఎగ్గొట్టింది ఎవరు?” ప్రశ్నించాడు.

సమాధానం చెప్పలేక చెప్పాడతను.

వాళ్ళిద్దరి దగ్గరికి కదిలాడు శివాజీ.

జనార్దన్ రావు గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. వాళ్ళు వస్తూనే.. చంద్రశేఖర్ గారి కాళ్ళు పట్టుకున్నారు. తప్పయింది మన్నించమంటూ వేడుకున్నారు. తమని బెదిరిస్తున్న జె.ఆర్ గ్రూప్ ఎండిని బతిమిలాడుకున్నారు. మరో నెల రోజుల్లో అప్పు పూర్తిగా కట్టిస్తామని బ్యాంక్ వాళ్లకి ప్రదేయపడుతూ చెప్పడమే కాకుండా.. బాండ్ పేపర్ పై వ్రాసి ఇచ్చారు.

సంతృప్తి చెందిన బ్యాంకు వాళ్ళు తన ప్రయత్నాన్ని విరమించుకుని.. చంద్రశేఖర్ గారికి ‘సారీ’ చెప్పి వెళ్ళారు.

సాయంత్రం అందరూ వరండాలో కూర్చున్నారు. కాఫీ కలుపుకుని వచ్చింది లక్ష్మి .

“ఇరవై యేళ్ళ క్రితం మీ నాన్న దగ్గరికి ఒక అవసరానికి వచ్చాను అబ్బాయ్. మా ఆవిడ పురుటి నొప్పులు పడుతూ హాస్పిటల్‌లో అడ్మిట్ అయివుంది. బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. అప్పటో నేను ఆటో నడిపేవాడిని. వెంటనే మీ నాన్న గుర్తొచ్చారు. నా కష్టం చెప్పాను. దూరపు బందుత్వమే అయినా నన్ను ఆప్యాయంగా పలకరించి.. ఆ సంవత్సరం వచ్చిన పంటనంతా ఒకేసారి అమ్మేసి వచ్చిన డబ్బు నా చేతుల్లో పెట్టారు. ఆ డబ్బుతో నా అవసరం గడిచింది. ఓ సంవత్సరం వరకు అప్పు తీర్చలేకపోయాను. నిజానికి ఆ రోజు మీ నాన్న సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు. ఈ మాట వాస్తవం. దాదాపు సంవత్సరం తరువాత మీ నాన్న నాకిచ్చిన డబ్బులో సగం మాత్రం ఇవ్వగలిగాను. మిగిలిన సగం ఇవ్వబోతే నువ్వే కష్టాల్లో వున్నావు. తరువాతెప్పుడైనా తీరుద్దువుగానీలే అన్నారు. ఆ తర్వాత నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను.

పుణ్యమూర్తి అయిన మీ నాన్న గారి వ్యక్తిత్వం ముందు నేను చిన్న వాడినే. కానీ లోకంలో కొందరుంటారు చేసిన సాయాన్ని మర్చిపోతారు, మర్చిపోవడమే కాదు.. మనం ఎవరో అన్నట్టు ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళ చేతుల్లో మీ నాన్న మోసపోయారు నేడు. మనం అంటాము మోసపోయాడని.. కానీ అది ఆయన మంచితనం. కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఇలాంటి వాళ్ళు సమాజంలో వున్నంత వరకు భగవంతుడి ప్రతిరూపాలై వెలుగొందుతారు ది గ్రేట్ చంద్రశేఖర్ రావు గారి లాగా..” నమస్కరిస్తూ అతను అంటున్న మాటలు శివాజీ, లక్ష్మీ, నీరజ హృదయాల నిండా ఆనందాన్ని నింపాయి.

***

నీరజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్ళిలో ఎదురైన మేఘన “సివిల్స్ రాస్తున్నావు కదా.. తప్పకుండా ర్యాంక్ సాధించాలి. ఆల్ ది బెస్ట్. లవ్ యూ డియర్” అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది.

అ యేడాది జరిగిన సివిల్స్‌లో అతడు మెయిన్స్‌కి అర్హత సాధించడమే కాదు.. డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయ్యాడు శివాజీ.

“ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు సివిల్స్‌కి అర్హత సాధించాడు” పేపర్‌లో హెడ్డింగ్స్‌తో వార్త వచ్చింది.

‘కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్న నాడే విజయాలను చేరుకోగలిగే అర్హత పొందుతామ’ని స్ఫూర్తిగా నిలిచిన శివాజీ కథ నేటి సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here