జీవితమే ఒక నాటకమా?

0
11

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘జీవితమే ఒక నాటకమా?’ అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. [/box]

పాత్రలు :

స్వరూప – 26 సంవత్సరాలు

నాగావళి – 45 సంవత్సరాలు – స్వరూప అమ్మ

నందపాల్ – 28 సంవత్సరాలు – స్వరూప భర్త

నమ్రత – 45 సంవత్సరాలు – స్వరూప అత్త

బృహస్పతి – 50 సంవత్సరాలు – నమ్రత శ్రేయోభిలాషి

***

[dropcap]కొ[/dropcap]త్తగా పెళ్ళయిన జంట నందూ, స్వరూప. ఒంటరి కాపురం, ఆనందాల కోసం తాపత్రయపడే అమ్మాయి స్వరూప. ఆమె వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతోందో వింటే అంతా మీకే అర్థమయిపోతుంది. ఇలాంటి ఆలోచనలను మార్చాలన్నదే ఈ నాటిక మఖ్య ఉద్దేశం.

స్వరూప: (కోపంగా) అమ్మా!

నాగావళి: (మామూలుగా) ఏమిటే?

స్వరూప: (విసుగ్గా) ఇక నటించటం నా వల్ల కాదమ్మా.

నాగావళి: (నవ్వుతూ) సరే! జీవించు

స్వరూప: నీకు నవ్వులాటగా ఉందా ?

నాగావళి: ఓహో! అయితే సీరియస్ గానే మాట్లాడుతున్నావన్నమాట.

స్వరూప: అమ్మా! ఇది జోకు లేసుకునే సమయం కాదు.

నాగావళి: (భయపడుతున్నట్లు) అమ్మో!

స్వరూప: అంతవద్దు.

నాగావళి: ఎంత కావాలో అదీ నువ్వే చెప్పు.

స్వరూప: (విసుగ్గా) అమ్మా!

నాగావళి: తల్లీ! ఈ కుట్టటం కూడా ఆపేస్తున్నా! అలా నస పెట్టక అసలు విషయానికి రా.

స్వరూప: మా అత్తగారు మా ఇంటికి శాశ్వతంగా రాకుండా ఉండటానికి అర్జంట్‌గా నాకు ఒక ప్లాన్ చెప్పాలి.

నాగావళి: అదంత సులభం కాదు లేవే.

స్వరూప: ఏమో! అదంతా నాకు తెలియదు. అది ఇప్పుడే జరగాలి.

నాగావళి: కర్ర విరక్కూడదు. పాము చావాలి అంటే కాస్త కష్టమే. ఈ విషయమూ అంతే!

స్వరూప: అది తెలిసిందేలే. తెలియనిది ఏదైనా ఉంటే అది చెప్పు.

నాగావళి: ఈ సూదిలా రెండు మనసులను దగ్గర చెయ్యటం సులభం. కానీ బ్లేడులా మనం తెంచాలంటేనే కాస్త ఆలోచించాలి.

స్వరూప: నువ్వు ఆలోచించటమేమిటి? నీ మెదడులో బోలుడు ప్లానులు నిలువ ఉంటాయిగా. కాస్త బయటకు తియ్యి.

నాగావళి: తీస్తున్నా.

స్వరూప: పెళ్ళైన కొన్నాళ్ళకే నీకీ పీడ లేకుండా చేస్తానంటే ఒప్పుకున్నా. లేకుంటే అసలే పెళ్ళి చేసుకునే దాన్నే కాదు.

నాగావళి: అత్తలు లేని మొగుళ్ళు దొరకకే కదా అతన్ని నీకు అంటగట్టింది.

స్వరూప: అందుకే దూరంగా నిలబడి చోద్యం చూస్తున్నావే?

నాగావళి: కొత్తగా ఏమైంది అది చెప్పు.

స్వరూప: నాలుగు రోజులు సెలవు లిస్తే చాలు వాలిపోతుంది. చాకిరీ చెయ్యలేక ఛస్తున్నా.

నాగావళి: ఆవిడా చేస్తుంది కదే.

స్వరూప: ఆఁ! చేస్తుంది. ఆవిడ లేకపోతే కర్రీపాయింట్ నుంచీ కూరలు తెచ్చేసుకోవటమేగా. పనేముంటుంది?

నాగావళి: అంత దానికి ఇంత అలోచన ఎందుకే? వంకాయ కూర మీరు చేసినది మీ అబ్బాయికెంతో ఇష్టమండీ అను.

స్వరూప: ఆ! అలా అనగానే ఆవిడే వండి పెట్టేస్తుంది మరి.

నాగావళి: తల్లి ప్రేమ కదా! తప్పకుండా చేస్తుంది.

స్వరూప: అప్పుడు మీ అల్లుడు నందపాల్ గారు నా మీదకి తిట్ల దండకంతో బయలుదేరుతారు.

నాగావళి: ఏం కాదులేవే.

స్వరూప: ఉద్యోగం చేసి చేసి అలిసిపోయి వస్తుంది. మా అమ్మతో ఏ పనీ చేయించకు అని ముందే ఆర్డర్ వేసారుగా.

నాగావళి: చెప్పకుండా ఉంటే తెలియదని తప్పించుకోవడానికి ఉండేది. నందూ విషయంలో అదీ కుదరటం లేదు.

స్వరూప: అవునమ్మా. పెళ్ళికి ముందే షరతు పెట్టాడుగా. అమ్మను బాగా చూసుకోవాలని.

నాగావళి: అంతేనా! నీకు ఫిట్టింగ్ కూడా పెట్టాడు. మా అమ్మ ఎప్పుడైనా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని రావచ్చని కూడా!

స్వరూప: పెళ్ళియిన పదిరోజుల్లో వచ్చినా చూడాల్సిందేనని ఖచ్ఛితంగా చెప్పాడుగా.

నాగావళి: అన్నీ ఒప్పుకున్నాంగా.

స్వరూప: ఇప్పుడు కాదంటే విడాకులంటాడేమో!

నాగావళి: అంటే మాత్రం మీ అత్త ‘నమ్రత’ పడనివ్వదులే!

స్వరూప: ఏమో? ఎవరికి తెలుసు? ఎంత మంచి వాళ్ళయినా కోడళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి సూర్యకాంతాలే!

నాగావళి: ఆ విషయం నేను ఒప్పుకోనే.

స్వరూప: అయితే నువ్వు వచ్చి నాకు వండి పెట్టవే.

నాగావళి: వంటామెను పెట్టుకుంటే సరిపోతుందిగా.

స్వరూప: అదీ అయ్యింది. ఏదో చేసి పెట్టాలని చేసే పనిలో రుచి ఉండదని కమ్మగా అడ్డుపుల్ల పెట్టేసాడు మా ఆయన.

నాగావళి: దానికీ ఒప్పుకోవటం లేదా? ఎలానే? ఏదో మార్గం చూడొచ్చులే అనుకున్నానే.

స్వరూప: అలా అనుకునే నా కొంప ముంచావ్. ఎవరూ లేని వాడిని కట్టుకుంటే నాకీ బాధ ఉండకపోను.

నాగావళి: నీ బొంద. అలాంటి వాడిని చేసుకుంటే ప్రేమ దోమ ఏమీ ఉండదు.

స్వరూప: అన్నీ నువ్వే మాట్లాడేస్తావ్.

నాగావళి: అనురాగం, ఆత్మయత, ప్రేమ ఊరికే వచ్చేయ్యవు. అది పెరిగిన పెంపకంలోనే వస్తాయి.

స్వరూప: చెప్పవే! నాకు నీతులు చెప్పటంతోనే రోజులు గడిపేసెయ్.

నాగావళి: ఇప్పుడేగా చెప్పావ్. ఈ రాత్రికయినా టైమివ్వు. రేపు ఉదయానికి ఉపాయం చెప్పేస్తా.

స్వరూప: సరే! లేకుంటే నేనే నీ దగ్గరకు వచ్చేస్తా.

నాగావళి: అంత బెదిరింపు లెందుకులే. నేను మీ ఆయన్నీ, అత్తనూ కాదు.

స్వరూప: అది గుర్తుంచుకునే ఇంత మాట్లాడింది.

(తల్లీ కూతుళ్ళు ఇద్దరూ కలిసి నవ్వుకుంటారు)

***

(కాలింగ్ బెల్ శబ్దం) (తలుపు తీసిన శబ్దం)

నమ్రత: మీరా! బృహస్పతి గారూ! రండి! రండి! మీ రాకతో మా ఇల్లు పావనమయింది

బృహస్పతి: అంత మాటెందుకు లేమ్మా! కోడలు పుట్టింటి నుంచీ వచ్చిందా?

నమ్రత: వచ్చేసిందండీ. స్వరూపా! ఇటు రామ్మా! (లోపలి ఉన్న స్వరూపను పిలుస్తుంది)

స్వరూప: నమస్కారమండీ.

బృహస్పతి: సంతోషం తల్లీ ! అమ్మా, నాన్న అందరూ బాగున్నారామ్మా?

స్వరూప: అంతా కులాసేనండీ. మీరు అత్తయ్యతో మాట్లాడుతూ ఉండండి. నేను టిఫిన్ తెస్తాను.

బృహస్పతి: టిఫిన్ చేసే వచ్చాను. నువ్వు కూర్చోమ్మా!

స్వరూప: అలాగే నండీ

నమ్రత: ఆఫీసులో మాట్లాడుకోవటానికి సమయమే ఉండటం లేదు. సంగతులు ఏమిటి ?

బృహస్పతి: ఏముందమ్మా ఈ కాలం పిల్లలలో వేపకాయంత వెర్రి కనిపిస్తోంది.

నమ్రత: అదేంటండీ?

బృహస్పతి: చెబితే నవ్వుకుంటావమ్మా. మా ప్రబుద్ధుడు ఉన్నాడుగా. పెళ్ళయ్యాక మమ్మల్ని దూరం పెట్టాడు. తెలిసిందేగా.

నమ్రత: ఊ! చెప్పారుగా. అయినా పెళ్ళి రెండు కుటుంబాల మధ్య ఆప్యాయతలను పెంచాల్సింది పోయి ఇలా తయారవుతున్నారేమిటో?

బృహస్పతి: కోడలు స్నానాల గదిలో పడిందట. మంచం ఎక్కింది. అయిన వాళ్ళు మీరు కాక ఎవరు చూస్తారు అన్నట్లు మాట్లాడుతున్నాడమ్మా.

నమ్రత: కష్టంలో సుఖంలో పాలు పంచుకునే వాళ్ళనే కదా అయిన వాళ్ళు అంటారు.

బృహస్పతి: మన పిల్లలకు బాగోకపోతే మన మనసు ఊరుకుంటుందా? ఆఘమేఘాల మీద పరుగెట్టమూ. కానీ వాడికీ బుద్ధి రప్పించాలిగా.

నమ్రత: కొంప తీసి రామన్నారా?

బృహస్పతి: లేదు. అమ్మకు బాగోలేదురా. అమ్మను చూసుకోవడానికి నేను ఉండాలిగా అన్నాను.

నమ్రత: (ఆశ్చర్యంగా) ఆఁ: అలా అన్నారా?

బృహస్పతి: అవునమ్మా! రెండు రోజులు కష్టపడితే కానీ మన విలువ తెలియదుగా.

నమ్రత: పాపం కదండీ.

బృహస్పతి: మరి పిల్లలను పెంచటానికి, పనులు చేసి పెట్టటానికి పనికి వచ్చే పెద్ద వాళ్ళు ఆప్యాయతలు, అనురాగాలు పంచుకోవటానికి మాత్రం వద్దనుకుంటే అదెంత తప్పో వాళ్ళిద్దరికీ తెలియటం లేదు.

నమ్రత: అవునాఁ?

బృహస్పతి: అవునమ్మా. మనమే తెలిసేట్లు చేయాలి.

నమ్రత: మా నందూ తప్పపుట్టాడు కానీ… ఈ కాలం కుర్రాళ్ళు అందరూ అలాగే ఉంటున్నారు,

బృహస్పతి: సంసారంలో ఒకళ్ళది తప్పు ఉన్నా అది ఇద్దరికీ వర్తిస్తుంది. భార్య తప్పు చేస్తే భర్త చెప్పాలి. భర్త తప్పు చేస్తే భార్య సరిదిద్దాలి. అదే కదా దాంపత్యమంటే.

నమ్రత: వాళ్ళు బాగుండాలి. ఎంత చేస్తే ఇంత పెద్ద వాళ్ళవుతారు. వృద్ధాప్యంలో బిడ్డలు చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు?

బృహస్పతి: ఈ రోజు మేమిద్దరం వెళుతున్నాం. పంతాలూ, పుట్టింపులు పెట్టుకోవటానికి వాళ్ళలా ఆలోచనలు లేని వాళ్ళం కాదు కదా! వాళ్ళు చూడలేదని మేము, మేము చూడలేదని వాళ్ళూ అనుకుంటే ఇక బంధాలు ఎలా ముడిపడతాయి?

నమ్రత: ఎంతైనా కోడలు కూతురు లాంటిదే. మన అమ్మాయి తప్పు చేస్తే వదిలేస్తామా? మంచి దారిలో పెట్టకోమూ? అలాగే కోడలూనూ.

బృహస్పతి: నీలా ఎందరు అలా అనుకుంటారు? ముసలి వయసులో వాళ్ళ పంచన చేరక తప్పదు. చేయించకోనూ తప్పదు. కాస్త ఓపిక ఉన్నప్పుడే వాళ్ళకు సాయపడగలుగుతాం.

నమ్రత: (బాధగా) ఎంత చేసినా తల్లి తండ్రుల రుణం తీరేది కాదు. అది మళ్ళీ వాళ్ళు తమ పిల్లలను పెంచేటప్పుడే అర్థమవుతుంది. అన్నీ అనుభవంలో నేర్చుకోవాలంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి.

బృహస్పతి: ఎదుటి వారి అనుభవాలను పాఠాలుగా తీసుకోవాలని యువతరం ఎప్పుడు తెలుసుకుంటుందో?

నమ్రత: వాళ్ళు మన కంటే తెలివైన వాళ్ళు. మబ్బుల్లోకి చంద్రుడు వెళ్ళినట్లు అజ్ఞానంగా ప్రవర్తించే జ్ఞానవంతులు. ప్రేమ పంచితేనే పెరుగుతుందని తెలుసుకుంటారులెండి.

బృహస్పతి: అదే ఆశతో బ్రతుకుతున్నాం. కాకపోతే అవసరానికి నటనలు ఎక్కువైపోతున్నాయి. కని పెంచిన వాళ్ళ దగ్గర కూడా నటిస్తే ఇక జీవితం నాటకం అయిపోతుంది కదమ్మా!

నమ్రత: అవునండీ. దేన్నయినా భరించవచ్చు కానీ సహజత్వం లేని ప్రేమ, పెదాల మీద నుంచీ వచ్చే మాటలు భరించటం కష్టమే.

బృహస్పతి: వీళ్ళను చూస్తూంటే మనం కూడా నటించాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది.

నమ్రత: అంత భయపడకండి. అదే జరిగితే కలికాలం అంతమయిపోయినట్లే. ప్రేమలు లేని ఇల్లు శ్మశానంతో సమానం నా లెక్కలో.

బృహస్పతి: బాగా చెప్పావు తల్లీ. ఈ పూట మన మాటలన్నీ నా కొడుకు కోడలు కూడా విని ఉంటే బాగుండేది. వాళ్ళలో కాస్తన్నా మార్పు వచ్చేది.

నమ్రత: ప్రతి కథకూ ఒక ముగింపు ఉన్నట్లే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం తప్పక ఉంటుంది.

బృహస్పతి: ఏమో? నాకలా అనిపించటం లేదు.

నమ్రత: అలా నిరుత్సాహపడకండి. ఏ కష్టం వచ్చినా మేమే తీర్చుకోగలమనే ధీమా వాళ్ళనలా ఆడిస్తోంది. ఆ కష్టం ఎంత కష్టమో అర్థమయ్యాక వాళ్ళే దిగివస్తారు.

బృహస్పతి: ఏం దిగి వస్తారో? ఈ వయసులో మనల్ని ఆ ఏడుకొండలవాడిలా పైకి ఎక్కిస్తారో?

నమ్రత: బస్సులు వేసి నడక తప్పించారుగా. అలాగే మీ అబ్బాయి ఈ దెబ్బతో మళ్ళీ మామూలు మనిషి అవుతాడు చూడండి. నేను చెబుతున్నానుగా.

బృహస్పతి: మా ప్రయాణానికి వేళవుతోంది. సీత ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక నేను వెళ్ళి వస్తాను.

నమ్రత: అలాగే ఒక గ్లాసు నిమ్మరసం కలిపిన మజ్జిగ తెస్తాను. తాగి వెళ్తురుగానీ.

స్వరూప: నేను తెస్తానత్తయ్యా!

(‘వాళ్ళబ్బాయి సంగతేమో కానీ మా అత్తగారిని బాగా చూసుకోవాలని నాకు బుద్ధి వచ్చింది’ అనుకుంటుంది మనసులో స్వరూప)

 ***

స్వరూప: నందూ అత్తయ్య రాత్రికి బయలుదేరుతున్నారా?

నందూ: లేదు రూపా! ఈసారి అమ్మ మన దగ్గరకు రావటం లేదు. తన స్నేహితురాలు శాంత ఎప్పటినుంచో పిలుస్తోందట. వెళ్ళకపోతే బాధపడుతుందని అటు వెళ్తోంది.

స్వరూప: అవును నందూ! అత్తయ్య గారిది మంచి మనసు. అందుకే అందరూ ఆవిడ రావాలని కోరుకుంటారు.

నందూ: అవును. అమ్మ నాకు అదే నేర్పించింది. మనం ఎంత ఎక్కువ ప్రేమను ఎదుటి వారికి అందించగలిగితే అంత ఎక్కువ ఆనందాన్ని పొందుతామని.

స్వరూప: (నవ్వుతూ) ప్రేమించు – ప్రేమంచబడు అన్నట్లు అన్నమాట.

నందూ: రూపా! ఇదేదో సినిమా టైటిల్‌కి సరిపోయేట్లు ఉంది చూడు.

స్వరూప: అవునవును. అనుకోకుండా వచ్చేసింది.

నందూ: ఈ రోజు పని చాలా ఎక్కువగా ఉంది. బాగా అలిసిపోయాను. రిలాక్స్ అవటానికి వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు తినాలి. అమ్మ ఇలా అడగకుండానే చేసి పెట్టేది.

స్వరూప: మీ ఆవిడ తక్కువేం కాదు. ఇన్‌స్టంట్ కాఫీలా అయిదు నిముషాలలో తీసుకువస్తాను. పిండి అంతా కలిపే ఉంచాను, వెయ్యటమే.

నందూ: అబ్బో! నిజమే!

స్వరూప: (లోపలికి వెళ్తూనే) ఊఁ ఇంకా ఎన్నో అత్తయ్య దగ్గర నుంచీ నేర్చుకున్నాను.

నందూ: అవునా! క్షణంలో తయారయి వచ్చేస్తాను. నీకు సాయం చేయటానికి.

స్వరూప: మీరు తిని పెట్టండి. అదే మీరు నాకు చేసే సాయం.

నందూ: అంతే నంటావా?

(అహ్హహ్హ… ఇద్దరి నవ్వులూ వినిపించాలి)

***

నమ్రత: ఏరా? ఎలాగున్నారు?

నందూ: లోపలికి రామ్మా! ప్రయాణం బాగా జరిగిందా?

నమ్రత: పడుకుని వస్తే హాయిగానే ఉంది రా. స్లీపర్ బస్ బుక్ చేసావుగా.

నందూ: రైలులో రిజర్వేషన్ అప్పటికప్పుడు దొరకదు కదమ్మా!

నమ్రత: అవునులేరా, కోడలు లేదా?

నందూ: ప్రక్కింటి వాళ్ళు పిలిస్తే వెళ్ళింది. అత్తయ్య వస్తారు. నేనుంటానని గోల. ఫరవాలేదు వెళ్ళు. అమ్మ వస్తే నేను పిలుస్తానంటే కానీ వెళ్ళలేదు.

నమ్రత: అవునా!

నందూ: అవునమ్మా! ఇప్పుడు స్వరూప పేరుకు తగ్గట్లే మారిపోయిందమ్మా.

నమ్రత: పోనీలేరా. అంతా మంచే జరిగింది.

నందూ: అంతా నీ దయే కదమ్మా.

నమ్రత: ఛ! అంత పెద్ద పెద్ద మాటలెందుకురా?

నందూ: పెద్ద ప్రమాదం నుంచే తప్పించావు. ప్రేమించిన అమ్మాయిని వదిలెయ్యలేక, కన్నతల్లిని కాదనలేక అల్లాడి పోయేవాడ్ని.

నమ్రత: ఆఁ! మన మిద్దరం బాగానే ఉన్నాం. పాపం మధ్యలో బృహస్పతి గారే బలి అయిపోయారు.

నందూ: అదేంటమ్మా అలాగంటున్నావు?

నమ్రత: మరే మనమంటావు? వాళ్ళబ్బాయి శ్రీరామచంద్రుడు. ఆయన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు.

నందూ: అవునా.

నమ్రత: అవునురా. చెల్లెలి కూతుర్ని కొడుకుకు చేసుకున్నాడు. ఆ అమ్మాయికి అత్త మామలంటే ప్రాణం.

నందూ: మరి… అలా… ఎలా?

నమ్రత: కోడలి ఆలోచనలు పెడత్రోవ పడుతున్నాయని గ్రహించి అలా ఆయనతో నేనే మాట్లాడించాను. తప్పలేదురా.

నందూ: (నోట మాట రానట్లు) అమ్మా…!

నమ్రత: అవునురా! రూపకీ వాళ్ళమ్మకీ కాస్త స్వార్థం పాళ్ళెక్కువ. ‘నా’ అనేది ఎక్కువే. దాంట్లోచి ‘మనం’ లోకి దింపాలంటే ఇలా చెయ్యాల్సిందే అనిపించి చేసా.

నందూ: నువ్వెంత మంచిదానివమ్మా?

నమ్రత: స్వరూప కూడా మంచిదేరా.

నందూ: కాస్త నీ కన్నా తక్కువ.

నమ్రత: కొన్నాళ్ళకు నీ నోటితోనే నీ కంటే ఎక్కువే అనిపించే పూచీ నాది.

నందూ: అంత కంటే అదృష్టముంటుందమ్మా?

నమ్రత: ఇందులో ఇంకో ట్విస్టు ఉందిరోయ్.

నందూ: ఏమిటమ్మా?

నమ్రత: మనిద్దరి నిజమైన ప్రేమను అర్థం చేసుకుని తను మారి తన కూతురు కూడా మారాలని మీ అత్తగారు కూడా అనుకోవటం… !

నందూ: నిజమే?!

నమ్రత: మీ నాన్నగారు అర్ధంతరంగా గుండెపోటు తెచ్చుకుని నన్ను ఏకాకిని చేసేసారు. ఇక నాకు నువ్వు తప్ప ఎవరున్నారు?

నందూ: నిజమే కదమ్మా!

నమ్రత: అది ఆవిడ గ్రహించేలా అటు ఓ ‘సరస్వతి’ని పంపా మన బృహస్పతి గారిలా.

నందూ: నువ్వు సూపర్ అమ్మా!

నమ్రత: ఇది మనిద్దరి మధ్యే ఉండాలి. తర్వాత తెలిసినా పెద్ద భయమేమీ ఉండదనుకో. దీనితో మన జీవితాల్లో నాటకానికి తెరపడినట్లే!

నందూ: అలాగే అమ్మా!

నమ్రత: కోడల్ని పిలువు ఇంక.

నందూ: (గట్టిగా) రూపా! రూపా!

స్వరూప: వచ్చేసారా అత్తయ్యా! నేను వెళ్ళనంటే నందూనే పంపాడత్తయ్యా!

నందూ: నేనాఁ!

స్వరూప: ఏయ్! మాట మార్చకు.

నమ్రత: వాడు పంపాడని నాకు తెలుసుగా రూపా.

స్వరూప: మా అత్తయ్య బంగారం (ముగ్గురి నవ్వులూ వినిపించాలి)

సమాప్తం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here