జీవితమొక పయనం-1

2
12

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

(గమనిక: ఈ నవలలోని పాత్రలు, సంభాషణలు, సంఘటనలు కేవలం కల్పితం. ఎవరినీ, దేనినీ ఉద్దేశించి రాసినది కాదు. – రచయిత)

1. ప్రారంభం

[dropcap]ఉ[/dropcap]దయం పదిగంటలు కావస్తోంది.

బయట ఎండ అంత తీవ్రంగా లేదు. గాలి మంద్రంగా వీస్తోంది.

ఎదురుగా వున్న కానుగ చెట్టు కొమ్మపై నుండి ఒక కాకి వుండుండి కావుమంటోంది.

ఆ రోజు పశువుల షెడ్లో పనులన్నీ పర్యవేక్షించి, మిగిలిన పనులు పనివాళ్లకు అప్పగించి అర్దగంట క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు రాఘవయ్య. స్నానం, టిఫిన్‌ పూర్తిచేసి ఈజీచెయిర్లో వెనక్కు వాలి ఆ రోజుటి దినపత్రిక చదువుతున్నాడు.

ఇంతలో.. బయట ఎవరో గోలగోలగా మాట్లాడుకుంటూంటే గబగబ వంటింట్లో నుండి బయటికెళ్లింది అతని భార్య నీరజ.

అతనూ లేచి వెళ్లాలనుకున్నాడు. ఎటూ భార్య వెళ్లింది కనుక విషయం తెలుసుకొస్తుందిలే అనుకుని మౌనంగా మళ్లీ పత్రిక చదవడంలో లీనమైపొయ్యాడు.

కానీ.. రాన్రానూ బయటి మాటలు పెద్దవి కావటంతో పాటు, ఎవరో స్త్రీ ఏడుస్తున్న శబ్దం కూడా వినిపించటంతో పత్రికను పక్కన పెట్టి గుమ్మం దగ్గరకెళ్లి నిలబడ్డాడు.

ఆ వీథిలోని చాలామంది రామనాథం ఇంటి ముందు గుమిగూడి వున్నారు. కొందరు రామనాథాన్ని ఓదారుస్తున్నారు. కొందరు ఆడవాళ్లు రామనాథం భార్య కన్నీళ్లను తుడుస్తున్నారు. ఇంతకీ వాళ్లింట్లో ఎవరికి ఏమైందో తెలీటం లేదు.

ఒకళ్లిద్దరు.. ‘వెంటనే రామనాథాన్ని పోలీస్‌ స్టేషన్‌కెళ్లి రిపోర్ట్‌ ఇవ్వమ’ని సలహా ఇస్తున్నారు.

అంటే వాళ్లింట్లో దొంగతనం జరిగి ఉంటుందని వూహించాడు రాఘవయ్య. విషయం తెలిసి పోవటంతో ఇక ఆ విషయంపై పెద్దగా ఆసక్తిలేకపోవటంతో లోపలికొచ్చి మళ్లీ ఈజీచెయిర్లో కూర్చుని పత్రికను చేతిలోకి తీసుకున్నాడు.

కొంతసేపయ్యాక నీరజ ఇంట్లోపలికి రావటం గమనించాడు.

రావటం రావటం ఆమె నేరుగా భర్త దగ్గరికొచ్చి, ‘‘సుధీర్‌ లేడూ, రామనాథంవాళ్ల అబ్బాయి! వాడు ఇల్లొదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడట. పాపం, వాళ్లమ్మ ఎంతగా కుమిలి కుమిలి ఏడుస్తోందనీ. ఎంతైనా కన్నపేగు కదా?’’ అంది తనూ విచారంగా.

‘‘ఎందుకెళ్లిపోయాడట?’’ అడిగాడు రాఘవయ్య.

‘‘ఏమో, ఏమీ తెలియటం లేదు. ఏం పాడుపని చేశాడో ఏమో? బిడ్డల్ని కనుక్కుంటాం కానీ, వాళ్లు చేసే చెడ్డపనుల వల్ల కన్నవాళ్లకు ఎంతటి అవమానం? నలుగురిలోనూ నవ్వులపాలు కావటం, తలెత్తుకు తిరగలేని దుస్థితి దాపురించటం ఎంత బాధాకరం..’’ అంటూ ఇంకేదేదో సణుక్కుంటూ వంటింట్లోకెళ్లింది నీరజ.

‘చెట్టంత ఎదిగిన బిడ్డలు ఇంట్లో నుండి వెళ్లిపోవటమంటే ఎవరికైనా బాధే మరి. కానీ అలా వెళ్లిపోవటం వాళ్లకు సరదా ఏం కాదు. ఏ సమస్యలు వాళ్లను చుట్టిముట్టాయో, ఏ పరిస్థితులు వాళ్లనలా పారిపొయ్యేటందుకు పురికొల్పాయో ఎవరికి తెలుసు?..

పాతికేళ్ల క్రితం తానూ ఇలాగే ఇంట్లో నుండి వెళ్లిపొయ్యాడు.

అప్పుడున్న పరిస్థితుల్లో తనకు అలా ఇల్లొదిలిపెట్టి వెళ్లిపోవటం తప్ప మరో మార్గం లేకపోయింది. మరేమీ ఆలోచించకుండా తాను ఇంటి నుండి బయటపడ్డాడు.’

ఆనాటి జ్ఞాపకాలు అతణ్ణి ఒక్కసారిగా చుట్టుముట్టాయి.

అప్పటి సంఘటనలు ఒకదాని వెంట ఒకటి.. వరుసగా.. అతని కళ్లముందు కనిపించసాగాయి..

2. చివరి ఉత్తరం

చిత్తూరు,

08-05-1992.

‘‘నాన్నకు..

రాఘవ రాస్తున్న ఉత్తరం.

నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను. నా గురించి వెతక్కండి. పోలీసు రిపోర్టూ ఇవ్వకండి. ఎందుకంటే నేనేమీ చిన్నపిల్లాడి లాగా తప్పిపోనూ లేదు, నన్నెవరూ ఎత్తుకెళ్లనూ లేదు. నాకు నేనుగా ఇష్టపడే వెళ్లిపోతున్నాను కనక పోలీస్‌ రిపోర్టిచ్చి నలుగురిలోనూ నవ్వులపాలు కాకండి. ఒకవేళ నా మాటను కాదని మీరు రిపోర్టిచ్చి, పోలీసులు నన్ను వెతికి పట్టుకుని ఇల్లు చేర్చినా.. ఆ కోపంతో నేను మళ్లీ వెళ్లిపోతాను. ఈసారి వెళ్లిపోయానంటే.. మళ్లీ ఈ జన్మకు తిరిగి రాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిమీదో కోపంతోనో, అలిగో, ఆవేశంతోనో వెళ్లిపోవటం లేదు. అసలు నాకు ఎవరిమీదా కోపం లేదు. నా కోపమంతా నామీదే! నాకు ఈ జీవితమంటేనే విరక్తి కలిగి వెళ్లిపోతున్నాను. నావల్ల ఎవరికీ ఆవగింజంత కూడా ఉపయోగం లేనప్పుడు ఇంట్లో ఉండటం వృథా అనిపించింది. ఎందుకూ పనికిరానివాడు ఇంట్లో ఉన్నా ఒక్కటే, వీధిలో ఉన్నా ఒక్కటే అని భావించే వెళ్లిపోతున్నాను. ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలియదు. కానీ, వెళ్లినచోట ప్రయోజకుణ్ణయితే మాత్రం తప్పకుండా ఇంటికి తిరిగొస్తాను. రాలేకపోతే నన్ను మర్చిపోండి. అసలు నేను పుట్టలేదనే అనుకోండి. తమ్ముడొక్కడే పుట్టాడనుకోండి. వాడు పోటీ పరీక్షలకు బాగానే ప్రిపేరవుతున్నాడు. గెజిటెడ్‌ ఆఫీసరు అయి తీరుతాడు. మిమ్మల్ని తప్పక సంతోషపెట్టగలడు. వాణ్ణి బాగా చూసుకోండి. ఇదే నేను మీకు రాస్తున్న చివరి ఉత్తరం!’’ ఇట్లు.. మీ కుమారుడు, రాఘవ.

రాయటం పూర్తిచేసి, ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ను మడిచి, దాని కొసను నాలుకతో అతికించాడు. దానిమీద తమ ఇంటి చిరునామాను రాశాడు.

చివరిసారిగా ఆ కవరును ఒకసారి చూసుకుని, దాన్ని చేతిలో పట్టుకుని పైకి లేచాడు రాఘవ.

ఎడమచేత్తో సూట్‌కేస్‌ను పట్టుకుని ఆ రైల్వేస్టేషన్‌లో పోస్ట్‌బాక్స్‌ ఎక్కడుందాని వెతుక్కుంటూ ముందుకు కదిలాడు.

ఒకచోట పోస్ట్‌బాక్స్‌ కనిపించేసరికి అక్కడ ఆగి, మరో ఆలోచన ఏదీ లేకుండా చేతిలోని ఉత్తరాన్ని పోస్ట్‌ చేశాడు.

మళ్లీ వెనక్కు తిరిగి ఇందాక తను కూర్చున్న చోటికే వచ్చి రాతి బెంచీమీద కూర్చున్నాడు.

సూట్‌కేసును ముందు పెట్టుకుని వచ్చీ పోయే మనుషుల్ని చూస్తూ కూర్చున్నాడు.

‘ఏమిటో ఈ ప్రయాణం? తను దీన్ని అస్సలు ఊహించలేదు. జీవితంలో తానింత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. నిరుద్యోగిగా అవమానాల పాలౌతూ ఏం చెయ్యాలో తెలియక నిరాశా నిస్పృహలలో కూరుకుపోతున్న సమయంలో.. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుందని ఏ మాత్రం ఊహించలేదు. ఈ ప్రయాణం తన సమస్యకొక పరిష్కారాన్ని సూచిస్తే అంతకన్నా కావలసింది ఇంకేమీ ఉండదు!’ అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు రాఘవ.

తల తిప్పి ఎదురుగా కనిపిస్తున్న రైళ్ల రాకపోకల పట్టికమీద దృష్టిని నిలిపాడు.

అతను వెళ్లవలసిన ‘హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు అరైవల్‌ టైమ్‌నూ, అది ఏ ప్లాట్‌ఫామ్‌ మీదికొస్తుందో దాని నెంబర్‌నూ మరోసారి చదివాడు. ఆ రైలొచ్చి ఆగే ప్లాట్‌ఫామ్‌ అదే! కానీ రైలు రావటానికి ఇంకా పావుగంట సమయముంది.

క్రమంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువకాసాగింది. చూస్తూండగానే ఆ ప్లాట్‌ఫామ్‌ నిండుగా మనుషులు చేరిపోయారు. తమ కుటుంబ సభ్యులతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో ప్రయాణించేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒంటరి ప్రయాణికుడు తానొక్కణ్ణేనేమో అనిపించింది అతనికి. తమతమ లగేజీలతో అక్కడక్కడా కూర్చుని, కొందరు నిలబడి మాట్లాడుకుంటున్నారు.

తమ ఊరికి దగ్గరలోని రాయవేలూరు పక్కనే ఉన్న కాట్పాడి జంక్షన్‌ అది! చాలా పెద్ద జంక్షన్‌. దూర ప్రాంతాల నుండి ఎన్నో రైళ్లు ఆ జంక్షన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు కొన్ని వందలమంది ప్రయాణీకులు అక్కడికి వచ్చిపోతుంటారు.

ఇంతలో తాను వెళ్లవలసిన ‘హిమసాగర్‌ ఎక్స్‌ప్రెస్‌’కు సంబంధించిన ప్రకటన వెలువడిరది.

ఆ రైలు ఉత్తరాదిన కాశ్మీరు నుండి బయలుదేరి దక్షిణ భారతదేశానికి చివరనున్న కన్యాకుమారికి చేరుకుంటుంది. ‘ఎంత చక్కగా దానికా పేరు పెట్టారు’ అనుకున్నాడు రాఘవ.

రైలు ప్రకటనతో ప్రయాణీకులలో కదలిక మొదలైంది. రైలు వచ్చే దిక్కుకేసే అందరి కళ్లూ చూస్తున్నాయి.

అయదు నిమిషాల తరువాత రైలు కూత పెట్టుకుంటూ స్టేషన్‌లోకి ప్రవేశించింది. అది చాలా పెద్ద రైలులా ఉంది. పూర్తిగా ఆగటానికి కొన్ని నిమిషాలు పట్టింది. కానీ గుమ్మాల దగ్గర వ్రేలాడుతున్న మనుషుల్ని చూడగానే గుండె గుభేలుమంది రాఘవకు. అందులోకి ఎక్కటం ఎలా? రిజర్వేషన్‌ చేయించుకున్నవాళ్లు తమతమ భోగీలను వెతుక్కుంటూ పరుగెడుతున్నారు. అతను మామూలు టిక్కెట్టు కొనుక్కున్నాడు. జనరల్‌ కంపార్టుమెంటులోనే ఎక్కాలి. వేరే కంపార్టుమెంటులోకి ఎక్కినా టి.సి. దించేస్తాడు.

సూటుకేసును గట్టిగా పట్టుకొని జనరల్‌ కంపార్టుమెంటును వెతుక్కుంటూ గబగబ ముందుకు నడిచాడు. అన్ని కంపార్టుమెంట్ల దగ్గరా జనం లోపలికి ఎక్కటానికి తోసుకుంటున్నారు. రెండుచోట్ల ఎక్కటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఒకపక్కన రైలు బయలుదేరుతుందేమోనన్న కంగారు మొదలైంది రాఘవలో. ఎలాగైనా సరే రైల్లోకి ఎక్కి తీరాలన్న పట్టుదలతో ప్రయత్నించసాగాడు. కానీ గుమ్మం దగ్గర అడ్డుగా ఉన్నవాళ్లు అతనికి అస్సలు దారివ్వటం లేదు. చేతిలో సూట్‌కేస్‌తో ఎక్కటానికి చాలా ఇబ్బందిగా అనిపించింది రాఘవకు.

ఇంతలో.. ఎవరిదో చెయ్యి ముందుకొచ్చి సూట్‌కేసును ఇవ్వమన్నట్టుగా సైగచేసింది. రాఘవ ఇంకేమీ ఆలోచించలేదు. చేతిలోని సూట్‌కేసును ఆ చేతికి అందించాడు. ఆ వెంటనే అదే చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కుంది.

‘హమ్మయ్య! రైల్లోకి ఎక్కేశాం. ఇక అది ఎప్పుడు బయలుదేరినా ఇబ్బంది లేదు’ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు రాఘవ.

3. ఉద్యోగ ప్రకటన

కంపార్టుమెంటు లోపలికి వచ్చి తనకు సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడు రాఘవ. లోపల ఇసకేస్తే రాలనంతమంది జనం క్రిక్కిరిసిపోయి ఉన్నారు. దాదాపు ఒకరికొకరు రాసుకుంటూ సీట్లల్లో కూర్చుని ఉన్నారు. అక్కడేకాదు.. పైన సామాన్లుపెట్టే చోటా, కింద నేలమీదా అన్నిచోట్లా మనుషులు ఆక్రమించేశారు. అడుగుతీసి అడుగు పెడదామన్నా వీలు కావటం లేదు. కూర్చోవటానికి సీటు కాదు కదా, కనీసం నిలబడి ప్రయాణిద్దామన్నా వీలయ్యేటట్టులేదు.

ఇంతలో రైలు బయలుదేరింది. ‘ఎక్కడో ఒకచోట ఇంత జాగా చూసుకుని కూర్చుంటే సరిపోతుంది. తర్వాత గమ్యస్థానం చేరేంతవరకూ పైకి లేచే పనుండదు’ అనుకున్నాడు రాఘవ.

ఎలాగో సందు చేసుకుంటూ లోపలికి అతికష్టమ్మీద అడుగులు వేస్తున్నాడు. ఒకచోట ఎదురెదురు సీట్లమధ్యన నేలమీద కొంత ఖాళీస్థలం కనిపించింది. అక్కడికి వెళ్లటానికి దారివ్వమన్నట్టుగా రిక్వెస్ట్‌ చేసినా నిలబడ్డవాళ్లు వీలుకాదన్నట్టుగా ముఖం పక్కకు తిప్పుకున్నారు. కింద కూర్చున్నవాళ్లు అక్కడ ఖాళీ లేదనీ, అతణ్ణి వెనక్కు వెళ్లిపొమ్మనీ చేత్తో సైగచేశారు.

ఎవరో అతని సూటుకేస్‌ను మాత్రం అందుకొని సీటుకిందికి తోశారు. దాంతో రాఘవ ఉన్నచోటనే నిలబడాల్సి వచ్చింది. గంటకుపైగా నిలబడేసరికి అందరిలోనూ ఇందాకటి చురుకుదనం కాస్త తగ్గినట్టుగా అనిపించింది. అందరూ కొంత కుదురుకున్నట్టున్నారు. రాఘవ మెల్లగా కదిలి సీట్లమధ్య ఖాళీగా ఉన్న చోటులో కెళ్లి కూర్చున్నాడు. ఇప్పుడు అతనికి ఎవరూ అడ్డుచెప్పలేదు.

కాళ్లు దగ్గరకు మడిచి చుట్టూ చేతులువేసి కూర్చున్నాడు. ఇబ్బందికరంగానే ఉంది. కానీ తప్పదు, ఏం చేద్దాం?

కంపార్టుమెంటంతా ఒకటే గోలగోలగా ఉంది. ఏవేవో భాషల్లో మాట్లాడుకుంటున్నారు. ఒక్కటీ స్పష్టంగా అర్థంకావటం లేదు. అందరూ రకరకాల వేషభాషల్లో కనిపిస్తున్నారు. ఉత్తరాది నుండి రైలు వస్తుండటంతో ఎక్కువమంది హిందీలో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. రాఘవకు హిందీ రాకపోవటంతో ఎవరితోనూ మాటలు కలపక మౌనంగా కూర్చున్నాడు.

అప్పుడప్పుడు రైలు ఏదో స్టేషల్లో ఆగుతోంది. మళ్లీ బయలుదేరుతోంది. ఏ స్టేషన్‌ వస్తోందో, ఏ స్టేషన్‌ దాటుతోందో, ఏమీ తెలియటం లేదు.

‘ఒకటి మాత్రం నిజం! తాను మధ్యలో ఎక్కడా దిగాల్సిన పన్లేదు. రైలు చివరగా ఏ స్టేషన్‌లో ఆగిపోతుందో అక్కడే తాను దిగాలి. కనుక ఏమాత్రం కంగారు పడకుండా నిశ్చింతగా ఉండొచ్చు.’ అనుకున్నాడు రాఘవ.

రైలు ఏదో స్టేషన్లో ఆగింది. కానీ ఎందుకో అది వెంటనే బయలుదేరలేదు.

బహుశా ట్రైన్‌ క్రాసింగో, లేదూ ఏదైనా టెక్కికల్‌ ప్రాబ్లెమో ఏర్పడి ఉండొచ్చు.

రెడ్‌ సిగ్నల్‌ అలాగే ఉండిపోవటంతో రైలు ఆ స్టేషన్లోనే అర్ధగంటకు పైగానే ఆగిపోయింది. చాలామంది ప్రయాణీకులు ప్లాట్‌ఫారమ్‌ మీదికి చేరి మాట్లాడుకుంటున్నారు. కొందరు అటు ఇటు తిరుగుతున్నారు.

కంపార్టుమెంటులో మనుషులు కాస్త పలచబడటంతో హమ్మయ్య అనుకుంటూ.. కాళ్లు చాపుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాడు రాఘవ. వంగి సీటుకిందున్న సూట్‌కేస్‌ను బయటికి లాగి దాని తాళం తెరిచాడు. సూట్‌కేస్‌ను తెరవగానే పైన్నే ఒక కవరు కనిపించింది. అది ఎంతో ముఖ్యమైన కవరు. అడుగున పెడితే మళ్లీ తియ్యటం కష్టమవుతుందని దాన్ని పైనే పెట్టాడు.

కవరును చేతిలోకి తీసుకుని పైన రాసున్న చిరునామాను చదివాడు.

జె.రాఘవ, వీనస్‌ క్లబ్‌, వేలూర్‌ రోడ్డు, చిత్తూరు..

అది అతని ఇంటి చిరునామా కాదు! అతను రోజూ వెళ్లి గడిపే క్లబ్‌ చిరునామా. ఆ చిరునామాకే వచ్చింది కవరు. ఆ క్లబ్‌లో అతను సభ్యుడు కాడు. కొంతమంది రిటైర్డ్‌ ఉద్యోగులు కలిసి ఆ క్లబ్‌ను నడుపుతున్నారు. రిటైర్డ్‌ ఉద్యోగులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, కొందరు ప్రైవేటు ఉద్యోగులూ అందులో సభ్యులుగా ఉన్నారు. ఆ సభ్యులు సాయంకాలాల్లో అక్కడ కలుసుకుని క్యారమ్స్‌, చెస్‌, అలాగే ఓ గదిలో పేక కూడా ఆడతారని అంటారు. ఆ గదిలోకి రాఘవ ఎప్పుడూ వెళ్లలేదు. అలాగే క్లబ్‌ కాంపౌండ్‌ లోపల టెన్నికాయిట్‌, బ్యాడ్‌మింటన్‌ కోర్టులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడ టోర్నమెంట్లు కూడా జరుగుతుంటాయి.

సాయంకాలాల్లో ఉద్యోగులు క్యారమ్స్‌ ఆడుతుంటే రాఘవ వెళ్లి కొంతసేపు దాన్నీ, మరికొంతసేపు చెస్‌ ఆటనూ దీక్షగా గమనిస్తుంటాడు. ఆదివారాల్లో, సెలవుదినాల్లో ఆ క్లబ్బు ఉద్యోగులతో నిండిపోయి ఒకటే సందడిగా గోలగోలగా ఉంటుంది.

ఒక్కో క్యారమ్‌ బోర్డు దగ్గరా మనుషులు గుంపులు చేరిపోయి ఆటను గమనిస్తుంటారు. అక్కడ ఆడుతున్నవాళ్లు పీల్చే సిగరెట్ల పొగతో, తాగి పడేసిన సిగరెట్‌ ముక్కలతో, టీ గ్లాసులతో చిందరవందర గందరగోళంగా ఉంటుంది.

అక్కడికి రాఘవ రోజూ వెళుతుంటాడు. అయితే అతనొక ప్రేక్షకుడు మాత్రమే. రోజూ సాయంకాలాల్లో ఎక్కువభాగం అక్కడే గడుపుతుంటాడు. అక్కడికి ఉదయం అన్ని దినపత్రికలూ వస్తాయి. మొదట వాటిని చదవటానికే రాఘవ ఆ క్లబ్‌కు వెళ్లేవాడు. బయట వరండాలో దినపత్రికలు పడుండేవి. నేలమీద గోడకు ఆనుకొని కూర్చుని ప్రతి పేపర్‌నూ క్షుణ్ణంగా అక్షరం వదలకుండా చదివేవాడు. క్రమంగా అక్కడికి వెళ్లటం అలవాటైపొయ్యంది. దాదాపు అక్కడున్న వాళ్లందరూ అతనికి పరిచయస్థులే.

అప్పుడప్పుడు మనుషులు తక్కువైనప్పుడు రాఘవను క్యారమ్స్‌ ఆడటానికి పిలిస్తే వెళ్లి ఆడుతాడు. అలాగే ఎవరైనా పిలిస్తే చదరంగం కూడా ఆడుతాడు. ఆ రెండిరటిలో అతనికి క్యారమ్స్‌ అంటేనే చాలా ఇష్టం.

ఒకరోజు ప్రముఖ దినపత్రికలోని ఒక ప్రకటన అతణ్ణి బాగా ఆకర్షించింది. దాని సారాంశమిది! ‘‘గ్రాడ్యుయేట్లు కావలెను. సేవా భావంతో ఉపాధ్యాయులుగా పనిచేయుటకు డిగ్రీ చదివినవాళ్లు కావలెను. ఏ డిగ్రీ అయినా సరే, ప్యాస్‌ అయి ఉంటే చాలు. తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలోని గిరిజన ప్రాంతాలలోనూ, మారుమూల కుగ్రామాలలోనూ, అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ పనిచేయుటకు ఆసక్తిగల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగులకు తగిన వసతి, భోజన సౌకర్యమూ కల్పించబడును. జీతభత్యాలంటూ విడిగా ఏమీ ఇవ్వబడదు. అభ్యర్థులు ముందుగా మూడువారాల పాటు మేమిచ్చే ఆధ్యాత్మిక, యోగా శిక్షణ శిబిరంలో పాల్గొనవలసి ఉంటుంది. అందుకు సమ్మతమైనవాళ్లు మాత్రమే ఈ క్రింది చిరునామాకు తమ బయోడాటాను పంపగలరు. ఇట్లు, వివేకానంద కేంద్ర, వివేకానందపురం, కన్యాకుమారి (జిల్లా) 629 702, తమిళనాడు.’’

ఈ ప్రకటన రాఘవను బాగా ఆకర్షించింది. అప్పటికే అతను బి.కాం. డిగ్రీని పూర్తిచేసి ఏడెనిమిదేళ్లుగా ఉద్యోగం ఏదీ రాక ఖాళీగా ఉంటున్నాడు. గ్రూప్‌ 4, రైల్వే సర్వీస్‌ కమీషన్‌, ఎస్‌.ఎస్‌.సి., బ్యాంక్‌ పరీక్షల వంటివి రాస్తున్నా ప్రయోజనం లేకపోతోంది. పోనీ ఏదన్నా ప్రైవేట్‌ ఉద్యోగం చేద్దామన్నా వాళ్లిచ్చే జీతాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. చేయించుకునే పని మాత్రం బోలెడంత ఉంటోంది. దాంతో సరైన ఉద్యోగం కోసం అతను ఎదురుచూస్తున్నాడు. రోజులు గడిచేకొద్దీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం అతనిలో క్రమంగా సడలిపోసాగింది. ఈ పరిస్థితుల్లో చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ చాలీచాలని జీతంతో అవస్థలు పడేదానికన్నా ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలన్న ఆలోచన అతనిలో బలపడసాగింది.

అంతేకాకుండా ఏ పనీపాటా లేకుండా ఉత్తినే ఊరు తిరుగుతున్నాడన్న ఇరుగుపొరుగువాళ్ల చులకనైన మాటలు అతను భరించలేకపోతున్నాడు. తెలిసినవాళ్లు, బంధువులు మాట్లాడే ఎత్తిపొడుపు మాటలు అతణ్ణి బాగా కృంగదీస్తున్నాయి. పలానా ఆయన కొడుకు బెంగుళూరులో పనిచేస్తున్నాడు, మీవాడేం చేస్తున్నాడు? పలానా ఆయన కూతురికి గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది, మీ వాడికి రాలేదా?.. ఇలాంటి మనసును గాయపరిచే మాటలు అతను ఏమాత్రం సహించలేకపోతున్నాడు. అలాంటి మాటల్ని వినేదానికన్నా ఎటైనా దూరంగా వెళ్లిపోయి ఏ హోటల్లోనో పనిచేసి బ్రతుకుదామన్న ఆలోచనలు అతనిలో బలపడసాగాయి. లేదూ ఏ గొప్పోళ్ల ఇంట్లోనో పనివాడుగానైనా చేరిపొయ్యి అక్కడే జీవితమంతా ఉండిపోవాలన్న కోరిక కూడా బలంగా అతణ్ణి కమ్మేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆ ప్రముఖ దినపత్రికలో వచ్చిన ప్రకటన అతణ్ణి ఆలోచనలో పడేసింది. ఆ ప్రకటనను ఆసక్తిగా చదివాడు. మళ్లీ మళ్లీ చదివాడు. జీవితంలో ఒక మనిషిక్కావలసిందేమిటి? తినడానికి తిండీ, ఉండటానికి చోటు! తనకు అది చాలు! ఈ రెండూ ఇస్తున్నవాళ్లు ఏడాదికోసారైనా కట్టుకోవటానికి బట్టలివ్వక పోతారా ఏంటీ? అంతేకాదు ఏ ఉత్తరాది ప్రాంతానికో వెళ్లి బ్రతకాలంటే హిందీ తప్పక తెలిసుండాలి. తనకు హిందీ రాదు. అదే తమిళనాడు అయితే సుమారుగా తమిళం మాట్లాడగలడు. ఏదో కాస్త ఇంగ్లీషు కూడా వచ్చు కనుక మెయింటెయిన్‌ చెయ్యవచ్చు. కనుక ఇదే బెటర్‌ అనుకొని ఒక నిర్ణయానికి వచ్చేశాడు.

ఒక తెల్లకాగితంలో శుభ్రంగా తన బయోడాటాను రాసి చిరునామా స్థానంలో తమ ఇంటి చిరునామాను కాక వీనస్‌ క్లబ్‌ చిరునామా రాసి పోస్ట్‌ చేశాడు.

ఒకరోజు అతనికి, కన్యాకుమారికి రమ్మని ఉత్తరమొచ్చింది. అంతే! తన సర్టిఫికెట్లన్నీ తీసుకుని మూడు జతల బట్టలు సర్దుకుని.. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోనుండి బయటపడ్డాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here