జీవితమొక పయనం-14

0
11

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఒకరోజు పిల్లలందరూ ఉదయం అల్పాహారం తిని ఎవరి తరగతులకు వాళ్లు వెళ్లిపోతారు. తరగతులు కూడా మొదలవుతాయి. రాఘవ వంటశాలలో ఉండి, మధ్యాహ్నపు వంటకు కావలసిన సరుకులన్నీ వంటమాస్టరుకు ఇచ్చి. రోజువారీ జమాఖర్చుల్ని రాసే రిజిష్టరును ముందుపెట్టుకుని స్టాకు పరిశీలిస్తూంటాడు. ఈలోపు ఓ వ్యక్తి వచ్చి, వెంకటయ్యని ఏదో అడిగితే, అతను రాఘవని అడగమంటూ పంపుతాడు. అతను రాఘవ దగ్గరకి వచ్చి పదిమందికి అల్పాహారం కావాలని అడుగుతాడు. లేదని చెప్తాడు రాఘవ. సరే, మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయించమంటాడు. ప్రధానాచార్యులతో మాట్లాడమంటాడు రాఘవ. అతను వెళ్ళి ప్రధానాచార్యులతో మాట్లాడి, రాఘవ వద్దకు వచ్చి – తమకు కూడా భోజనాలు సిద్ధం చేయించమన్నారని చెప్తాడు. సరేనని, మధ్యాహ్నం పిల్లలందరూ భోజనం చేసి వెళ్లాక మీరు రండి అని చెప్తాడు రాఘవ. తాము రాలెమనీ, తాము ర్యాడికల్స్ అనీ, సిద్ధం చేసి ఉంచితే, ఇద్దరమొచ్చి తీసుకెళ్తామని చెప్తాడతను. కాసేపు అతనితో చర్చిస్తాడు రాఘవ. అతను వెళ్ళిపోయాకా, ప్రధానాచార్యుల గదిలోకి వెళ్ళి ఎందుకు ఒప్పుకున్నారని అడిగితే, ఆయన కారణం వివరిస్తారు. మధ్యాహ్నం భోజనాలయ్యాకా, రాఘవ ఒంటరిగా వేపచెట్టుకింద నిలబడుంటే, రాజారావొచ్చి – మధ్యాహ్నం వాళ్ళకి భోజనాలు తీసుకువెళ్ళేటప్పుడు తాను వెళ్తానని, తనకి ఎప్పటినుండో అన్నలని కలవాలని కోరిక అని ఒత్తిడి చేస్తాడు. ఏమనలేకపోతాడు రాఘవ. అనుకున్నట్టే వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళతో పాటు రాజారావు కూడా మంచినీళ్ళ బకెట్లు, స్టీలు గ్లాసుల్ని తీసుకుని వెళ్తాడు. సాయంత్రం బడి అయ్యాకా, రాఘవ రహస్యంగా కలుస్తాడు రాజారావుని. అక్కడ తను చూసిన విషయాలను రాజారావు రాఘవకి చెప్తాడు. మర్నాడు ఉదయం రాఘవ పాఠం చెబుతుండగా, గుమస్తా వచ్చి, ప్రధానాచార్యులు పిలుస్తున్నారని చెప్తాడు. ఆయన గదిలోకి వెళ్ళగానే, అక్కడ రాఘవరెడ్డి కనబడతారు. మిమ్మల్ని కలవడానికి వచ్చారని చెప్పగానే, ఆయనని వెంటబెట్టుకుని బయటకు నడుస్తాడు రాఘవ. రాఘవ ఇక్కడికి వచ్చాకా, ఇంటికి ఉత్తరం రాయలేదని, తల్లిదండ్రులు కంగారు పడ్డారని, తన చిరునామాకి ఉత్తరాలు రాశారని చెప్పి, రాఘవ పేరిట ఉన్న సీల్ విప్పని కవర్‍ని అందించి, ఇంత నిర్లక్ష్యం తగదని రాఘవని మందలిస్తాడు రాఘవరెడ్డి. తండ్రి రాసిన ఉత్తరం చదువుకుని, జవాబు రాస్తాడు. మర్నాడు సాయంత్రం ఊర్లోకి వచ్చి పోస్టు డబ్బాలో ఉత్తరం పడేసి, తమ పాఠశాల కార్యదర్శిని కలుద్దామని వెళ్తాడు దారిలో చిన్న ఊరేగింపు ఎదురవుతుంది. అందులో ఓ పాప, ఓ బాబు చక్కని బట్టలలో అలంకరించి కనబడతారు. ఆ విషయాన్ని కార్యదర్శితో ప్రస్తావిస్తే, ఆ పిల్లలిద్దరికీ పెళ్ళి చేస్తున్నారని ఆయన భార్య అంటుంది. ఈ కాలంలోనూ బాల్యవివాహాలా అని రాఘవ ఆశ్చర్యపోతాడు. – ఇక చదవండి.]

27. హడలెత్తించిన వార్త

[dropcap]మ[/dropcap]రుసటిరోజు ఉదయం మైదానంలో పిల్లలు యోగాసనాలు వేస్తుండగా ప్రధానాచార్యుల నుండి రాఘవకు పిలుపొచ్చింది.

రాఘవ గబగబా ఆయన గదిలోకెళ్లాడు.

“రాఘవగారూ, మనం అనుకున్నంత పనీ అయ్యింది.” ఆందోళనగా అన్నారాయన.

“ఏమైందండీ?” కంగారుగా ప్రశ్నించాడు రాఘవ.

“ఈ వార్త చదవండి!” అంటూ తన చేతిలోని వార్తాపత్రికను ముందుకు చాపారు ప్రధానాచార్యులు.

“పేరుమోసిన భూస్వామి హత్య!.. పలానా గ్రామానికి చెందరిన మోతుబరి రైతు, భూస్వామి అయిన గంగిరెడ్డిని నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. తర్వాత ఆయన శవాన్ని ఒక మర్రిచెట్టు కొమ్మకు వ్రేలాడదీశారు. హత్య జరిగిన తీరును బట్టి ఇది ఒక తీవ్రవాద చర్యగా పరిగణిస్తున్నారు. ఈ హత్యను, ఈ ప్రాంతంలో చాలాకాలం నుండి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న తీవ్రవాదుల దుశ్చర్యగా అనుమానిస్తున్నారు. పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపి కేసును దర్వాప్తు చేస్తున్నారు.” ఇదీ వార్తా సారాంశం.

“ఇందులో ఏముంది ఆచార్యజీ విశేషం. ఎవరో ఎవరినో హత్య చేశారు. అంతేగా! దానికి మీరు కంగారు పడుతున్నారెందుకు?”

“నిన్న పదిమందికి భోజనం కావాలని వచ్చారే ర్యాడికల్స్‌, వాళ్ల పనే ఇది! అనుమానం లేదు.”

“ఆ..” ఆశ్చర్యంగా నోరు తెరిచి ప్రధానాచార్యులనే చూస్తూ ఉండిపొయ్యాడు రాఘవ.

“ఆ పనిమీదే వచ్చి, చీకటి పడేంతవరకూ ఇక్కడే మకాం వేసి, ఇంత ఘాతుకానికి పాల్పడ్డారన్నమాట.”

“నాకెందుకో వాళ్లు ఇంత పని చేసుంటారంటే నమ్మబుద్ధి కావటం లేదు. అందరూ చదువుకుంటున్న కాలేజీ విద్యార్థులేనట.”

“తీవ్రవాదుల్లో వీళ్లొక విభాగం. వీళ్లు చేసే పనులు పక్కవాళ్లకు కూడా తెలియనంత రహస్యంగా ఉంటాయి. ఇక మనల్ని ఆ భగవంతుడే కాపాడాలి.” ఉస్సూరుమంటూ కుర్చీలో వెనక్కి వాలి అన్నాడు ప్రధానాచార్యులు.

“ఎందుకలా అనుకుంటున్నారు.”

“పోలీసులు వీళ్లని అనుమానించి ట్రేస్‌ఔట్‌ చేస్తూ వచ్చారంటే.. వాళ్లు ఇక్కడికొచ్చిన విషయమూ, వాళ్లకు మనం భోజనం పెట్టిన విషయమూ అన్నీ బయటపడతాయి. అప్పుడిక మనం ఏం సాకులు చెప్పినా ప్రయోజనముండదు. ఏం జరుగుతుందో ఏమో, భగవంతుడా?” అని ఎంతో భయభ్రాంతులకు లోనయ్యారు ప్రధానాచార్యులు.

“ఆచార్యజీ మీరేం కంగారు పడకండి. వాళ్లు ఇక్కడికొచ్చిన విషయం ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా మనలో ఇద్దరు ముగ్గురికే. మనమంతా ఒకేమాట మీద నిలబడదాం. మనల్ని ఎన్ని రకాలుగా అడిగినా మనకు తెలియదనే చెబుదాం.”

“అలాగే! కానీ వాళ్లు మొదట నన్నూ, ఆనక మిమ్మల్నీ గుచ్చిగుచ్చి అడుగుతారు. తారుమారుగా తిప్పించి మళ్ళించి ప్రశ్నిస్తారు. ఏదో విధంగా విషయాన్ని రాబట్టటానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు.”

“కానీ.. మనం ధైర్యంగా అన్నిటికీ ఏమీ తెలియదనే చెబుదాం.”

“ఔను, ముందు వెళ్లి ఆ వంటమాస్టరు వెంకటయ్యను ఇలా పిలుచుకు రండి!” కుర్చీని ముందుకు లాక్కుని కూర్చుంటూ చెప్పారు ప్రధానాచార్యులు.

రాఘవ గబగబా వెంకటయ్య దగ్గరికి వెళ్లి “ప్రధానాచార్యులు పిలుస్తున్నారు రండి.” అంటూ అతణ్ణి వెంటబెట్టుకుని మళ్లీ ప్రధానాచార్యుల గదికొచ్చాడు.

“వెంకటయ్యా, మనకొక పెద్ద ప్రమాదమే వచ్చి పడిరది. నిన్న మనం అన్నం పెట్టామే వాళ్లు ఏదో దురాగతం చేసినట్టున్నారు. పోలీసులు ఎంక్వయరీ పేరుతో ఇక్కడికి వచ్చినా రావచ్చును. వాళ్లు ఎన్ని ప్రశ్నలడిగినా ఎన్ని రకాలుగా అడిగినా మనకు ఏమీ తెలియదనే సమాధానం చెప్పాలి. సరేనా? ఆ అంకయ్యకూ, అతని భార్యకూ కూడా ఈ విషయమే చెప్పూ!” అంటూ అతణ్ణి పంపించేసి దీర్ఘంగా నిట్టూర్చాడు.

‘తాము సరే, ఆ రాజారావు ఏకంగా వాళ్లను కలిసి, మాట్లాడి మరీ వచ్చాడే. అతణ్ణి కూడా హెచ్చరించాలి.’ అనుకుని రాఘవ, ఆయన నుండి సెలవు తీసుకుని గది బయటికొచ్చాడు.

రాజారావు కోసం చూశాడు.

అతను దూరంగా నిలబడి కానుగ పుల్లతో పండ్లు తోముకుంటున్నాడు.

అతని దగ్గరికెళ్లి.. “రండి, స్నానానికి వెళదాం.” అంటూ ఇద్దరూ నీటితొట్టె దగ్గరికి బయలుదేరారు.

“రాజారావుగారూ, మనకో పెద్ద సమస్య వచ్చి పడింది. నిన్న ఇక్కడికొచ్చి మనల్ని భోజనం అడిగారే, ఆ రాడికల్సే ఇక్కడికి సమీప గ్రామపు భూస్వామిని హత్య చేశారని ప్రధానాచార్యులు అనుమానిస్తున్నారు. అందుకని ఇక్కడికి పోలీసులొచ్చి ఎంక్వయరీ చేస్తే మనకు తెలియదనే చెప్పాలి. లేకపోతే మనకు ప్రమాదమట. మీరు ఇంకెవరికీ ఈ విషయం చెప్పలేదు కదా?!..” అతని ముఖంలోకి అనుమానంగా చూస్తూ ప్రశ్నించాడు రాఘవ.

“చెప్పానే! పిల్లలకు చెప్పలేదు కానీ, మన మిత్రులకు చెప్పాను.” అని చావు కబురు చల్లగా చెప్పాడు.

రాఘవ తల పట్టుకున్నాడు. ఐదు నిమిషాలు ఆలోచించి..”సరే, వాళ్లనూ హెచ్చరిద్దాం పదండి. ఈ విషయం కానీ మన ప్రధానాచార్యులకు తెలిసిందంటే పాపం, ఆయన మరింత భయపడిపోతారు.” ఉసూరుమంటూ అన్నాడు రాఘవ.

రాజారావు ఎవరెవరికి చెప్పాడో, వాళ్లందరినీ ఏకాంతంగా కలిసి హెచ్చరించాడు రాఘవ.

సమయం గడుస్తున్నకొద్దీ వాళ్లల్లోనూ ఆతృత క్రమంగా పెరగసాగింది.

కానీ వాళ్లు భయపడ్డట్టుగా ఆ సాయంత్రం వరకూ ఎవరూ ఎంక్వయరీకంటూ రాకపోయేసరికి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

28. గురిపెట్టిన తుపాకీ

డబ.. డబ.. డబ.. డబ..మంటూ.. ఎవరో తలుపు తడుతున్న శబ్దం లీలగా వినిపించింది రాఘవకు.

మంచి నిద్రలో ఉన్న అతనికి గబుక్కున మెలకువ వచ్చింది. కాసేపటికి మళ్లీ తలుపు తడుతున్న శబ్దం వినిపించింది.

చెయ్యిచాచి చేతి గడియారం తీసుకుని సమయమెంతో చూశాడు. 2.20 ని॥ కావస్తోంది.

‘ఈ సమయంలో ఎవరు తలుపు తడుతున్నారబ్బా?’ అనుకుంటూ పడకమీద నుంచి లేచి కూర్చున్నాడు.

ఈసారి వెంటనే మరింత గట్టిగా తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది. “ఎవరూ?..” అంటూ లేచి తలుపు దగ్గరికి వెళ్లాడు. బయటి నుండి ఎటువంటి మాటలూ వినబడలేదు. కానీ మళ్లీ తలుపు తడుతున్న శబ్దం వినిపించింది.

తలుపు గెడియ తియ్యగానే విసురుగా ఇద్దరు వ్యక్తులు లోపలికి జొరబడ్డారు. వాళ్లెవరో చీకట్లో సరిగ్గా కనిపించలేదు.

రాఘవ వెంటనే లైట్‌ స్విచ్‌ వేశాడు. చమక్కుమని లైట్లు వెలిగాయి. వచ్చినవాళ్లు ఎవరాని చూశాడు.

ఎవరో బలిష్ఠంగా, ఎత్తుగా ఉన్నారు. ముఖానికి మఫ్లర్‌ చుట్టుకుని ఉన్నారు. కళ్లూ ముక్కూ నోరూ మాత్రం బయటికి కనిపిస్తున్నాయి.

వాళ్ల చేతుల్లోని మెషీన్‌ గన్లను చూసి వణికిపోయాడు రాఘవ. వాళ్లల్లో ఒకడు రాఘవ గుండెకు గన్‌ను గురిపెట్టి ఏదో అడిగాడు. రాఘవకు ఏమీ అర్థం కాలేదు. మళ్లీ గట్టిగా అడిగాడతను.

అతను హిందీలో అడుగుతున్నాడు. రాఘవకు హిందీలో ఏం చెప్పాలో తెలియటం లేదు.

“మే హిందీ మాలూమ్‌ నై..” అని తడబడుతూ చెప్పాడు.

“వాట్స్‌ యువర్‌ నేమ్‌?” అని కరకుగా వినిపించాయి మాటలు.

“మై నేమ్‌ ఈజ్‌ రాఘవ.” గుండెను చిక్కబట్టుకుని గుటకలు మింగుతూ చెప్పాడు.

ఈలోపల మరో వ్యక్తి బయటి నుండి లోపలికి వస్తూ, “ఇక్కడ మీరేం చేస్తుంటారు?” అని తెలుగులో అడిగేసరికి కాస్త ధైర్యం వచ్చింది రాఘవకు.

“నేను ఈ పాఠశాలలో టీచరుగా పనిచేస్తున్నాను సార్‌. ఇది రెసిడెన్షియల్‌ స్కూల్‌. మేము ఇక్కడే పిల్లలకు పాఠాలు చెబుతూ వాళ్లతోపాటే స్టే చేస్తాం సార్‌. వాళ్లకు తోడుగా వాళ్ల మధ్యే పడుకుంటాం సార్‌.” అని చెప్పాడు.

ఈలోపు మొదట వచ్చిన ఇద్దరు వ్యక్తులు అక్కడ పడుకున్న ఒక్కో విద్యార్థినీ నిశితంగా పరిశీలిస్తున్నారు.

పదవ తరగతి పిల్లలు ముఖానికి అడ్డుగా కప్పుకున్న దుప్పటిని తొలగించి మరీ చూస్తున్నారు. పదవ తరగతి పిల్లలు కాస్త ఒడ్డూ పొడవుగా బలిష్ఠంగా ఉండటంతో వాళ్లను మరీ గుచ్చి గుచ్చి చూస్తున్నారు.

“మిస్టర్‌, ఇలా దగ్గరికి రండి. ఇక్కడికి దగ్గరలోని ఒక గ్రామంలో బాగా రాజకీయ పలుకుబడి కలిగిన ఒక మోతుబరి రైతును ఎవరో హత్య చేశారు. అది తీవ్రవాదుల పనేనని మేము అనుమానిస్తున్నాం. వాళ్లు ఆయనను హత్య చెయ్యటానికి ముందు ఇక్కడికొచ్చారనీ, మీరు వాళ్లకు భోజనం పెట్టారనీ మా ఎంక్వయరీలో తేలింది. అది వాస్తవమేనా?” కటువుగా ప్రశ్నించాడతను.

“సార్‌, మేము ఇక్కడ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలకు మాత్రమే భోజనాలు పెడతాం. ఇంకెవరికీ బయటివాళ్లకు పెట్టం. ఎప్పుడైనా ఒక్కోసారి గొఱ్ఱెలు కాసేవాళ్లు వచ్చి తినటానికి ఏమైనా మిగిలి ఉంటే పెట్టమని అర్థిస్తుంటారు. అలాంటప్పుడు వాళ్లకు మాత్రమే అదీ ఏమైనా మిగిలి ఉంటేనే పెడతాం. లేదంటే లేదనేస్తాం. కానీ అపరిచితులకు మాత్రం మేమెప్పుడూ పెట్టం. ఇది సత్యం. కావాలంటే మీరు మా హెడ్మాస్టర్‌ను కూడా అడగండి.” అని వినయంగా బదులిచ్చాడు.

“వీళ్లందరూ ఈ హాస్టల్‌ విద్యార్థులేనా?” చేతిలోని గన్‌తో అక్కడ నిద్రపోతున్న విద్యార్థులను చూపిస్తూ అడిగాడతను.

“అవును సార్‌, వీళ్లందరూ మా స్టూడెంట్లే. ఆ పొడవుగా ఉన్నవాళ్లు టెన్త్‌క్లాస్‌ చదువుతున్నారు.”

ఈలోపు బయట నుండి “ఓర్నాయనో, నా మొగుణ్ణి సంపేతున్నార్రో దేముడో..” అని వెర్రిగా అరుస్తున్న అంకయ్య భార్య గొంతు గట్టిగా వినిపించింది. రాఘవ గదిలోని వాళ్లెవరినీ పట్టించుకోకుండా వేగంగా బయటికి పరుగెత్తాడు.

బయట ప్రధానాచార్యుల ముందు ఇద్దరు గన్‌మ్యాన్లు నిలబడి మాట్లాడుతున్నారు. ఆమె తమ గదినుండి అరుస్తూ పరుగెత్తుకుంటూ ప్రధానాచార్యుల దగ్గరికొచ్చి గట్టిగట్టిగా అక్కడున్న పోలీసుల్ని చూస్తూ శాపనార్థాలు పెట్టసాగింది.

ఇద్దరు పోలీసులు అంకయ్య చేతులు వెనక్కు విరిచి పట్టుకుని చీకట్లోకి లాక్కెళ్లారట.. అదీ ఆమె భయానికి కారణం.

“భయపడకమ్మా, మీ ఆయన్ను వాళ్లేం చెయ్యరు. ఏదో అడగటానికి తీసుకెళ్లుంటారు. అంతే. నీ భర్తకు ఏం కాదులే.” అని ఆమెను ఓదార్చాడు ప్రధానాచార్యులు. వాళ్లను చూసి కుక్కలు అదే పనిగా గట్టిగా మొరుగుతున్నాయి.

ఈలోపు అంకయ్య చీకట్లోనుండి మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. మొగుడు క్షేమంగా వచ్చేసరికి ఆమె నోరు మూతబడింది.

అన్ని నిలయాల్లో లైట్లు వెలుగుతున్నాయి. అన్ని చోట్లా వాళ్లు చెక్‌ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతిదాన్నీ క్షుణ్ణంగా అణువణువునా గాలిస్తున్నారు.

వచ్చినవాళ్లు దాదాపు ఒక పాతిక మంది వరకూ ఉంటారు. వాళ్లను చూస్తుంటే పోలీసుల్లా లేరు. ఎందుకంటే పోలీసులు ఇంత యాక్టివ్‌గా ఉండరు. పైగా వచ్చినవాళ్లెవరికీ తెలుగు రాదు.

గంటన్నరసేపు వాళ్లు అక్కడే మకాం వేశారు. టీచర్లందరినీ విచారించారు. కానీ పిల్లలెవరినీ డిస్టర్బ్‌ చెయ్యలేదు.

ఉదయం ఐదు గంటలు అయ్యుంటుంది. వంటమాస్టరు వెంకటయ్య మగ్గు తీసుకుని బహిర్భూమికి వెళ్లినట్టున్నాడు.

ఇద్దరు పోలీసులు వంటశాల దగ్గర నిలబడి చీకట్లోకి పరీక్షగా చూస్తున్నారు.

రాఘవకెందుకో అనుమానం వచ్చి వంటశాల దగ్గరకెళ్లాడు.

వెంకటయ్య ఆ చీకట్లో పని పూర్తిచేసుకుని సరసరమంటూ నడిచి వస్తున్నాడు. అతని కాళ్లు కింద ఎండిన ఆకులు నలుగుతున్న శబ్దం వినిపిస్తున్నాయి. గరగరమంటూ వస్తున్న శబ్దాన్ని వాళ్లు ఎవరో శత్రువు అడుగుల శబ్దంగా భావించారు.

అతణ్ణి ఒక పోలీసు గమనించినట్టున్నాడు. అనుమానంతో ‘ఎవరు నువ్వు?’ అని ప్రశ్నించాడు. అతని మాటలు వెంకటయ్య విన్నాడో లేడో మరి, ఏం సమాధానం చెప్పకుండానే ముందుకు నడిచి వస్తున్నాడు.

దాంతో కోపం ముంచుకొచ్చింది ఆ పోలీసుకు. తుపాకీని వెంకటయ్య వైపుకు గురిపెట్టి “ఠైరో..” అన్నాడు గట్టిగా.

అయినా వెంకటయ్య ఆగకుండా ముందుకు వస్తూనే ఉన్నాడు. ఆ పోలీసు వెంకటయ్యవైపు తుపాకీని గురిపెట్టాడు.

రాఘవకెందుకో భయం వేసింది. “సార్‌, ప్లీజ్‌ స్టాప్‌ ది షూటింగ్‌ సార్‌. హి ఈజ్‌ అవర్‌ స్టాఫ్‌. హి ఈజ్‌ అవర్‌ స్కూల్‌ కుక్‌. హి ఈజ్‌ వర్కింగ్‌ హియర్‌ ఫర్‌ టెన్‌ ఇయర్స్‌..” అంటూ వంటమాస్టరు వైపు చూస్తూ.. “వెంకటయ్యా, ముందుకు రాకు. అక్కడే ఆగు. ఆగమంటూంటే..” అని గట్టిగా అరిచాడు.

దాంతో వెంకటయ్య అక్కడే ఆగిపొయ్యాడు.

పోలీసు అతని దగ్గరికెళ్లి తుపాకీని తిప్పించి మడమతో గట్టిగా ఒక్క దెబ్బ కొట్టాడు. తర్వాత అతణ్ణి మెడబట్టుకుని ముందుకు వంటశాల వరకూ తోసుకొచ్చాడు. అప్పటి వరకూ తుపాకీ వెంకటయ్య వైపే గురి పెట్టే ఉంచాడు.

“ఏంటి వెంకటయ్యా, ఆగమంటే ఆగాలిగా. ఎందుకు ఆగకుండా ముందుకు వస్తున్నావు. వాళ్లకు ఏమాత్రం అనుమానం కలిగినా ముందూ వెనకా ఆలోచించకుండా కాల్చి పడేస్తారు. తర్వాత మీరు చచ్చి ఊరుకుంటారంతే! బుద్ధి ఉండఖ్ఖర్లా. ఠైరో అంటే అక్కడే ఆగాలిగా..” అని అతణ్ణి బాగా కోప్పడ్డాడు రాఘవ. అప్పటికే వెంకటయ్య గడగడమని వణికి పోతున్నాడు.

కొంతసేపటికి ఆ పోలీసు తుపాకీని కిందికి దించి వెంకటయ్యను చెడామడా తిట్టిపోస్తున్నాడు. అన్నిటికీ మౌనం వహించాడు వెంకటయ్య. అతని కోపం క్రమేపీ తగ్గింది. అతణ్ణి వెళ్లమన్నట్టుగా సైగచేశాడు.

దాంతో వెంకటయ్య గబగబా వంటశాలకొచ్చి నేలమీద నీరసంగా కూలబడిపోయాడు.

మెల్లమెల్లగా.. తూర్పున సూర్యుడు ఉదయించసాగాడు. క్రమంగా ఆకాశమంతా వెలుతురు పరుచుకోసాగింది. ఆ వచ్చిన వాళ్లు పాఠశాల ముందున్న గుట్టమీదికెళ్లి నిలబడ్డారు.

అప్పుడు గమనించారు ఉపాధ్యాయులందరూ. పాఠశాల మైదానంలో రెండు జీపులు ఆగి ఉన్నాయి. మైదానానికి ప్రారంభంలో ఉన్న హరిజనవాడ దగ్గర హరిజనులు గుంపులు గుంపులుగా నిలబడి పాఠశాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

తనతో మాట్లాడిన పోలీసాఫీసరు ప్రధానాచార్యుల దగ్గరికొచ్చి.. “చూడండీ, మా ఎంక్వయరీలో భాగంగానే ఇక్కడికి రావలసి వచ్చింది. మా అనుమానాలు మాకున్నాయి. అవి ఏ మాత్రం బలపడినా మళ్లీ మేము ఇక్కడికొస్తాం. మీకు మేమిచ్చే సలహా ఒక్కటే. మాకెప్పుడూ నిజమే చెప్పండి. అలాగే ఇకమీదట ఇక్కడికి ఎవరొచ్చినా వాళ్లెవరైనా సరే, వాళ్లకు మీరు భోజనాలు పెట్టటం వంటి కార్యక్రమాలు పెట్టుకోకండి. తెల్సిందా? అలాగే, మీకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారటంటే దయచేసి దగ్గరున్న స్టేషన్లో తెలియపరచండి. తెల్సిందా?..” అంటూ వాళ్లు అక్కడ నుండి కదిలారు.

కొంతసేపటికి మైదానంలో ఉన్న వాహనాలన్నీ కదిలి ఊళ్లోకి వెళ్లాయి.

వచ్చినవాళ్లు సి.ఆర్‌.పి.ఎఫ్‌కు చెందిన పోలీసులని తర్వాత తెలిసింది. కానీ వాళ్లు వెళ్లిపోయినా, వాళ్లు చేసిన హడావిడికి ఆచార్యులందరూ మామూలు స్థితికి రావటానికి చాలా సమయమే పట్టింది.

వంటశాలలో అడుగుపెట్టిన రాఘవ పాదాలమీద పడిపొయ్యాడు వెంకటయ్య.

“ఆచార్జీ.. ఇయ్యాల మీరే కనక లేకపొయ్యుంటే గిక్కడ నా శవం పడుండేది. మీరే నన్ను కాపాడారు.” అంటూ చేతులు జోడించి నమస్కరించాడు.

“ఛ..ఛ.. ఏంటిది వెంకటయ్యా! లే లే..” అంటూ వెంకటయ్య భుజాలను పట్టుకుని పైకి లేవనెత్తాడు రాఘవ.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here