జీవితమొక పయనం-2

0
12

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఉదయపు పనులన్నీ పూర్తి చేసి ఇంటికొచ్చిన రాఘవయ్య స్నానం, టిఫిన్ పూర్తిచేసి కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటుంటాడు. ఇంతలో అతనికి ఇంటి బయట ఏదో అలజడి వినబడుతుంది. అతని భార్య నీరజ బయటకు వెళ్ళి – ఆ అలజడికి కారణం కనుక్కుని వస్తుంది. తమ పొరుగింటి రామనాథం గారి అబ్బాయి సుధీర్ ఇల్లొదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెబుతుంది. ఎందుకని రాఘవయ్య అడిగితే, ఏమో ఏం పాడు పని చేశాడో అని అంటుంది. అతనికేం సమస్య వచ్చిందో అనుకుంటాడు రాఘవయ్య. పాతికేళ్ళ క్రితం తానూ ఇల్లొదిలి పారిపోయిన సంగతి గుర్తొస్తుంది. గతంలోకి వెళ్తాడు. జీవితంలో తన పరిస్థితులను తట్టుకోలేక, సరైన ఉద్యోగం లేని రాఘవ – చివరిసారిగా తండ్రికి ఉత్తరం రాసి ఇల్లు వదిలేస్తాడు. రైల్వే స్టేషన్‍కి వచ్చి జమ్మూ నుండి కన్యాకుమారి వెళ్ళే ‘హిమసాగర్ ఎక్స్‌ప్రెస్’ లో రద్దీగా ఉన్న జనరల్ కంపార్ట్‌మెంట్ ఎక్కుతాడు. ఒక గంట తర్వాత, నేల మీద కూర్చోడానికి స్థలం దొరుకుతుంది. తాను కన్యాకుమారికి ఉద్యోగం కోసం బయల్దేరాడు. తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలోనూ; హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలోనూ సేవా భావంతో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు డిగ్రీ చదివినవాళ్లు కావాలన్న ప్రకటన పేపర్లో చూసి దరఖాస్తు చేసి, ఇంటి అడ్రసు కాకుండా, ఓ క్లబ్ అడ్రస్ ఇస్తాడు. తనకి తమిళం వచ్చు కాబట్టి కన్యాకుమారి జిల్లాలో ఎక్కడైనా పనిచేయగలని భావిస్తాడు. అతని దరఖాస్తుకి జవాబుగా – కన్యాకుమారికి రమ్మని అతనికో రోజు ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం పట్టుకునే ఇప్పుడీ ప్రయాణం మొదలుపెట్టాడు. – ఇక చదవండి.]

4. దాది మా

[dropcap]రై[/dropcap]లు మళ్లీ బయలుదేరి, ఏదో స్టేషన్లో ఆగుతున్నప్పుడు ఏర్పడ్డ కుదుపులకు గానీ అతను ఆలోచనల్లోనుండి బయటపడలేకపొయ్యాడు. చేతిలోని కవరును సూట్‌కేసులో ఉంచి దానికి తాళంపెట్టి చుట్టూ చూశాడు.

అప్పటికే ఆ కంపార్టుమెంటులో ప్రయాణీకుల రద్దీ చాలా మటుకు తగ్గిపోయింది. నిలబడి ప్రయాణించేవాళ్లు ఇప్పుడక్కడ ఎవరూ లేరు. అందరూ ఎక్కడో ఒకచోట సర్దుకుని కూర్చునేశారు. రాఘవకు కూడా కూర్చోవటానికి సీటు దొరికింది. ఇప్పుడతను సుఖంగా, హాయిగా సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్నాడు.

రాత్రవుతున్నకొద్దీ ఒక్కొక్కరుగా తాము తెచ్చుకున్న ఆహారాన్ని ప్లేట్లల్లో పెట్టుకుని తినటం మొదలుపెట్టారు. చాలామంది చపాతీలు, పూరీలు, పరోటాలు ఏదో ఒకటి తింటున్నారు.

రాఘవకు కూడా ఆకలిగా ఉంది. కానీ అతను తినటానికి ఏమీ తెచ్చుకోలేదు. రైల్లో ఏదో ఒకటి అమ్మకపోరు, కొనుక్కుని తింటే సరిపోతుంది అనుకున్నాడు.

కానీ అతని దురదృష్టం.. చాలాసేపటి నుండి చిరుతిళ్లు, తినుబండారాలు అమ్మేవాళ్లు ఎవరూ ఆ కంపార్టుమెంటులోకి రాలేదు. ఏం చెయ్యాలో తెలియక మౌనంగా బయటికి చూస్తూ కూర్చున్నాడు. అతను కూర్చున్న కిటికీకి ఎదురుగా ప్లాట్‌ఫామ్‌మీద ‘త్రాగునీరు’ కుళాయి కనిపించింది.

ఆకలికి తట్టుకోలేని రాఘవ వెళ్లి ప్లాట్‌ఫామ్‌ మీదున్న కుళాయి తిప్పి కడుపు నిండుగా నీళ్లు తాగాడు. ఇప్పుడతనికి కాస్త ఉపశమనంగా అనిపించింది. నీళ్లతో ముఖం కడుక్కుని తుడుచుకుంటూ వచ్చి మళ్లీ తన సీట్లో కూర్చున్నాడు.

అతనికెదురుగా ఎవరో ఉత్తరాదివాళ్లు కుటుంబంతో సహా తీర్థయాత్ర చేస్తున్నారులా ఉన్నారు. ఒక పెద్దావిడ, ఆమె భర్తా, ఒక యువకుడూ, అతని భార్యా మొత్తం నలుగురు.. ఎదుటి సీట్లో వరుసగా కూర్చుని ఉన్నారు.

ఆ యువకుడు ఆ పెద్దావిడను ‘దాది మా..’ అని సంబోధిస్తున్నాడు. అతను ఏ పని చెయ్యాలనుకున్నా ఆ పెద్దావిడ అనుమతితోటే చేస్తున్నాడు. ఆవిడ చెప్పే మాటలను, ఆజ్ఞలను మిగిలిన ముగ్గురూ తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు. ఐదునిమిషాల క్రితం అతను ఫ్లాట్‌ఫామ్‌ మీదికెళ్లి కాసేపు గాలి పీల్చుకుని వస్తానన్నా ఆమె అనుమతించలేదు. దాంతో చేసేదేమీలేక అతను మౌనంగా బయటికి చూస్తూ కూర్చున్నాడు.

ఉన్నట్టుండి అతను రాఘవను ‘నీ పేరేమిటని’ అడిగాడు.

అతనేం అడుగుతున్నాడో రాఘవకు అర్థం కాలేదు. కారణం రాఘవకు హిందీ రాకపోవటమే. తర్వాత వచ్చీరాని ఇంగ్లీషులో రాఘవ తన పేరూ, ఊరూ, చదువుకున్న డిగ్రీ, నిరుద్యోగిగా తను ఇబ్బంది పడుతున్న విషయాలూ అంతా చెప్పాడు.

మొదట ఆ పెద్దావిడ తన మనవడు రాఘవతో అనవసరంగా మాట్లాడ్డం ఇష్టంలేనట్టుగా ముఖంపెట్టి వారించబోయింది. కానీ వాళ్లిద్దరి సంభాషణా మృదువుగా సాగుతుండటంతో ఆమె మరి దాన్ని నివారించలేకపోయింది.

ఆచి తూచి మాట్లాడుతున్న రాఘవకు ఒక ఆలోచన మెరుపులాగా కదిలింది.

తను ఉద్యోగం నిమిత్తం కన్యాకుమారికి వెళుతున్న విషయాన్ని దాచిపెట్టి, వాళ్ల ‘దాది మా’ అంగీకరిస్తే తానూ వాళ్లతోపాటు వస్తానని, వాళ్లింట్లో ఏదైనా పని ఇప్పిస్తే.. వాళ్ల దగ్గరే పడుంటానని, ఆ విషయాన్ని దాది మా కు చెప్పి సహాయం చెయ్యమని ఆ యువకుడితో చెప్పాడు.

కానీ ఆ యువకుడు ఆ విషయాన్ని దాది మా తో చెప్పటానికి తటపటాయించాడు.

దాంతో రాఘవే ఆమెతో చెప్పేందుకు తయారై.. ఆమెను ‘దాది మా’ అని సంబోధిస్తూ.. ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు. అతను చెప్పే విషయమేమో కానీ, ఒక అపరిచితుడు తనను దాది మా అని సంబోధించటమే నచ్చనట్టుగా ‘తనను అలా పిలవద్దని’ కసురుకున్నట్టుగా చెప్పి ఆమె ముఖం పక్కకు తిప్పుకుంది.

దాంతో రాఘవ నోరు మూతపడింది. కొంతసేపటికి ఆమె తన మనవణ్ణి ‘ఇందాకా రాఘవ ఏమన్నాడని’ అడిగినట్టుంది. తన మనవడు చెప్పింది విన్నాక ఆమెకు కోపం మరింత రెట్టింపైనట్టుంది. రాఘవను చూస్తూ ఏదో గొణగసాగింది. ఆమె తన ఆలోచనను తిరస్కరిస్తున్నట్టుగా అర్థం చేసుకున్నాడు రాఘవ. రెండుమూడుసార్లు ఆమె తనను చూస్తున్నప్పుడు దీనంగా ముఖంపెట్టాడు రాఘవ. కానీ ఆమె అతణ్ణి కరుణించినట్టు లేదు.

ఈలోపు రైలు మళ్లీ బయలుదేరిన విషయం గమనించలేదు రాఘవ. గంట తర్వాత ఇంకేదో స్టేషన్‌లో ఆగింది రైలు. రాఘవ ఆకలికి తట్టుకోలేక మళ్లీ మంచినీళ్లు తాగుదామని రైలు దిగాడు. ఈలోపు వెంటనే రైలు బయలుదేరింది. కానీ రాఘవ మాత్రం రైలెక్కలేదు. ఆ పెద్దామె చెప్పిన మీదట ఆ యువకుడు తలుపు దగ్గరికెళ్లి చూశాడు. రాఘవ కంగారుగా పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. ఆ యువకుడు తన చేతిని అందించి రాఘవను లోపలికి లాక్కున్నాడు. రాఘవ ఆ యువకునికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇద్దరూ తమ సీట్ల దగ్గరికి వచ్చేసరికి ఆ పెద్దామె రాఘవనుద్దేశించి గట్టిగట్టిగా ఏదో మాట్లాడసాగింది. బహుశా ‘రైలు బయలుదేరేలోపు పెట్టెలోకి రావాలని తెలీదా?’ అని అడిగినట్టు అర్ధం చేసుకుని, తను మంచినీళ్లు తాగటానికి వెళ్లానని సైగచేశాడు రాఘవ. అతని చొక్కామీద నీళ్ల తడి కనిపించి ఆమె ఇంకేమీ మాట్లాడకుండా ఉండిపొయ్యింది.

కొంతసేపయ్యాక వాళ్లు భోజనం చెయ్యటానికి తయారయ్యారు. సీటుకింద నుండి ఒక గుడ్డమూటను బయటికి లాగింది. దాని ముడిని విప్పి, అందులోని చపాతీలను ఒక్కో పేపర్‌ప్లేట్‌లో నాలుగేసి చొప్పున ఉంచి, దానిమీద కుర్మా పెట్టి ముగ్గురికీ ఇచ్చింది. వాళ్లు ముగ్గురూ తినటం మొదలుపెట్టారు. ఆ పెద్దావిడ మాత్రం వాళ్లతోపాటు తినలేదు. బహుశా వాళ్లు తిన్న తర్వాత తింటుంది కాబోలు. వాళ్లు తింటున్నంతసేపూ వాళ్లనే గమనిస్తూ, వాళ్లకేం కావాలో దాన్ని వడ్డిస్తూ, అప్పుడప్పుడూ రాఘవ కేసి తలతిప్పి చూడసాగింది. రాఘవ కిటికీలో నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు.

వాళ్ల ముగ్గురి భోజనమూ పూర్తయినట్టుంది. అందరూ ప్లేట్లు మడిచి ఒక కవరులో పెట్టి కిటికీలో నుండి బయట పడేసి వాష్‌ బేసిన్లో చేతులు కడుక్కొచ్చి తమ తమ సీట్లల్లో కూర్చున్నారు.

ఈలోపు ఒక ప్లేట్లో నాలుగు చపాతీలు, ఇంత కుర్మా పెట్టి తన మనవడికిచ్చి రాఘవకు ఇవ్వమంది ఆ పెద్దామె. అతను దాన్ని రాఘవ ముందుకు చాపి తీసుకోమన్నాడు. మర్యాదకోసం వద్దన్నాడు రాఘవ. నిజానికి అతనికి ఆకలి  దంచేస్తోంది. కడుపు ఖాళీ. కళ్లు తిరుగుతున్నట్టుగా కూడా ఉంది. ఆ దృశ్యాన్ని చూసి ఆ పెద్దావిడ రాఘవ కేసి కళ్లురిమి చూస్తూ.. “ఊ తీసుకో.. ఒఠి నీళ్లతోటే కడుపు నిండిపోతుందా? తీసుకుని తిను!” అని హిందీలో అనటంతో.. గభాలున ప్లేటును అందుకుని తినసాగాడు. తనూ ఒక ప్లేట్లో చపాతీలు పెట్టుకుని తినసాగింది. మధ్యలో కూర అయిపోయినా ఆమెను అడగటానికి మొహమాటపడి రాఘవ తింటుంటే, ఆ పెద్దావిడే లేచి రాఘవ ప్లేట్లో మరి కొంత కుర్మా వడ్డించింది.

ఆమె పెద్ద మనసుకు రాఘవ ఆనందంతో.. ‘దాది మా.. కృతజ్ఞతలు..’ అని చెప్పటం పూర్తికాక మునుపే, తనను అలా పిలవొద్దని మళ్లీ హుంకరించింది. దాంతో ఇంకేమీ మాట్లాడకుండా తల వంచుకుని తిని, లేచి వెళ్లి చెయ్యి కడుక్కొచ్చి కూర్చున్నాడు. ఆమె కూడా తినటం పూర్తిచేసింది. ఆ యువకుడు మంచినీళ్ల బాటిల్‌ను రాఘవ చేతికందించాడు.

దాన్ని తీసుకుని మంచినీళ్లు తాగి మళ్లీ అతనికి తిరిగివ్వబోయాడు. మంచినీళ్ల కోసం రైలు దిగి బయటికి వెళ్లొద్దనీ, దాన్ని అతని దగ్గరే ఉంచుకోమని దాది మా తనతో చెప్పిందని చెప్పాడతను. ‘దాది మా..’ అని ఏదో చెప్పబోయి మౌనంగా ఆ బాటిల్‌ను తీసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు రాఘవ.

ఆమె ప్రవర్తన రాఘవకు కొన్ని విషయాలను స్పష్టపరిచాయి. ఆమెకు ఎవరిమీదనైనా అధికారం చలాయించటమే తెలుసుననీ, తను చెప్పినట్టే అందరూ నడుచుకోవాలనీ, తన కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరూ తనను వరుస కలిపి పిలిస్తే సహించదనీ అతనికి బాగానే అర్థమైంది.

అదే సమయంలో తనపట్ల ఇంత అక్కరను కనబరుస్తోందంటే తనను వాళ్లతోపాటు తీసుకెళ్లే ఆలోచన ఆమె మనసులో ఉందేమోనన్న ఆశ రాఘవలో మొలకెత్తసాగింది.

ఏదేదో ఆలోచిస్తూ కూర్నున్నచోటే నిద్రలోకి జారుకున్నాడు రాఘవ.

మరునాడు ఉదయం.. ఇంకాసేపట్లో కన్యాకుమారి స్టేషన్‌ రాబోతుందనగా దాది మా కు చివరిసారిగా తన విన్నపాన్నీ, తన దీన స్థితినీ చెప్పుకోవాలని రాఘవ భావించాడు. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియక సతమతమవ్వసాగాడు.

రైలు స్టేషన్‌లో ఆగింది. అదే చివరి స్టేషన్‌. రైలు ఇక వెంటనే బయలుదేరదు. అక్కడే ఆగిపోతుంది. అందుకే ఆ పెట్టెలోని వాళ్లందరూ ప్రశాంతంగా, నిదానంగా తమతమ లగేజీలను కిందికి దించి పెట్టుకుంటున్నారు.

రాఘవ ఆశ చావక కావాలనే ఆలస్యం చెయ్యసాగాడు. వాళ్లు సర్దుకుని ఒక్కొక్కరుగా బయటికి వెళుతుంటే వాళ్ల వెనకే తన సూటుకేస్‌ను పట్టుకుని నడిచాడు. ఫ్లాట్‌ఫామ్‌ మీద ఆ పెద్దామెతో తన మనసులోని కోరికను చెబుదామనుకున్నాడు.

ఆ పెద్దామెతో మాట్లాడుదాం అనుకునేసరికి, “చూడూ, నువ్వు బాగా చదువుకున్నావు. ఏదో ఒకరోజు నీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. అంతవరకూ నీ ఆశలను సజీవంగా ఉంచుకో!” అని దాది మా అతనికి చెప్పమన్నదని ఆ యువకుడు తెలిపాడు.

చివుక్కున తలతిప్పి ఆమెవైపు చూశాడు రాఘవ. నవ్వుతూ అతణ్ణి ఆశీర్వదిస్తున్నట్టుగా చేతిని ఊపి ముందుకు కదిలింది ఆమె. వెనకే మిగతా ముగ్గురూ అనుసరించారు.

వాళ్లనే చూస్తూ అక్కడే నిలబడిపొయ్యాడు రాఘవ.

వాళ్లు కనుమరుగయ్యాక.. ‘ఊ.. ఇలాంటివన్నీ తనకు మామూలేగా! తను దేనికో ఆశపడ్డం. చివరకు ఆ ఆశ నెరవేరక  తనలో నిరాశను మిగల్చటం. దాంతో కొన్నాళ్లు కృంగిపోయి మనసును పాడుచేసుకోవటం.. అప్పుడు ఇదిగో ఈ దాది మా లాంటివాళ్లు కనిపించి ఇంకేదో కొత్త ఆశల్ని చిగురింపచెయ్యటం! మళ్లీ నిరాశ మిగల్చటం. ఇలాగే సాగుతోంది ఈ జీవితం! సాగనీ..’ అనుకుని దీర్ఘంగా నిట్టూరుస్తూ నేలమీదున్న సూట్‌కేస్‌ను అందుకుని వడివడిగా ముందుకు అడుగులు వేశాడు రాఘవ.

5. నలుగురు తెలుగువాళ్ళు

వివేకానంద కేంద్రం ముందు రిక్షా ఆగింది. తల బయటపెట్టి నేమ్‌బోర్డును సరిచూసుకుని రిక్షానుండి కిందికి దిగాడు రాఘవ. జేబులో నుండి డబ్బుతీసి రిక్షావాడికిచ్చి సూట్‌కేస్‌ను పట్టుకుని ముందుకు నడిచాడు.

గేటుదాటి కుడివైపునున్న ఎంక్వయరీ అని రాసున్న కౌంటర్‌ దగ్గరికెళ్లి తానెందుకొచ్చిందీ తమిళంలో చెప్పాడు.

అక్కడున్న యువతి, రాఘవ వివరాలను ఒక రిజిష్టర్‌లో నమోదు చేసుకుని, “మీరు చాలాదూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కనుక, ఇవ్వాళ మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. రాత్రి భోజనాలయ్యాక సరిగ్గా తొమ్మిదిగంటలకు యోగా హాల్లో జరగనున్న సమావేశానికి తప్పక హాజరుకండి!” అని ఆమె చక్కటి ఇంగ్లీషులో చెప్పింది.

ఇక మీదట ఇక్కడి వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి కాబోలు అనుకుంటూ, “ఓకే, ష్యూర్‌ మేడమ్‌!” అంటూ తల ఊపాడు రాఘవ. ఆమె అటెండర్‌ను పిలిచి, రాఘవను తాము అతిథుల కోసం ఏర్పాటుచేసిన గదుల దగ్గరకు తీసుకెళ్లమని చెప్పింది.

అటెండర్‌ ముందు నడుస్తుంటే అతని వెనకే వెళ్లాడు రాఘవ. అతను ఒక హాలు దగ్గరకు తీసుకెళ్లి లోపలికెళ్లమని చెప్పి వెళ్ళిపోయాడు.

సూట్‌కేస్‌తో మెట్లెక్కి, మూసి ఉన్న తలుపును ముందుకు తోశాడు.

లోపల విశ్రాంతి తీసుకోవటానికి విడివిడిగా మంచాలుంటాయని భావించిన రాఘవ, లోపలి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అది ఒక పెద్ద హాలు! అప్పటికే అక్కడికి చేరుకున్న కొందరు అతిథులు నేలమీద అక్కడక్కడా తమతమ సూట్‌కేస్‌లను గోడవారగా పెట్టి కూర్చొని ఉన్నారు. కొందరు నేలమీద దుప్పట్లను పరుచుకుని పడుకొని ఉన్నారు. ఆ హాలులో అలా సుమారు యాభైమంది వరకూ పడుకోవచ్చు.

ఖాళీగా ఉన్న చోటు చూసుకొని తన సూట్‌కేస్‌ను పెట్టి నేలమీద కూర్చోబోయాడు రాఘవ.

అంతలో.. కొంత దూరంలో ఉన్న ఒక వ్యక్తి, అక్కడికి ఫ్యాను గాలి సరిగ్గా రాదనీ, ఇటు తన పక్కకొచ్చి సూట్‌కేస్‌ను సర్దుకోమని హిందీలో చెప్పాడు. అదీ నిజమేననిపించింది. మళ్లీ లేచివెళ్లి అతను చూపించిన చోట తన సూట్‌కేస్‌ను పెట్టి, అతనికి థాంక్స్‌ చెప్పాడు రాఘవ. అతను చిన్నగా నవ్వి, రాఘవ వివరాలను అడగటంతో తన వివరాలను చెప్పాడు రాఘవ. అతని వివరాలూ అడిగి తెలుసుకున్నాడు.  అంతకుమించి వాళ్లమాటలు ముందుకు సాగలేదు.

మౌనంగా కాసేపు అలాగే విశ్రాంతిగా కూర్చుని ఆ హాల్లోని మనుషులను, పరిసరాలను గమనించసాగాడు.

ఈలోపు ఒకవ్యక్తి స్నానం చేసి తల తుడుచుకుంటూ తన చోటుకొచ్చి సూట్‌కేస్‌ తెరిచి బనియన్‌ తీసి తొడుక్కున్నాడు. రాఘవకు కూడా స్నానం చెయ్యాలనిపించినా, రాత్రంతా రైల్లో సరిగ్గా నిద్రలేక కునికిపాట్లు పడ్డ దుస్థితి గుర్తుకొచ్చింది. దాంతో విపరీతమైన నిద్ర ముంచుకొస్తున్నట్టుగా అనిపించి, అలాగే నిస్త్రాణగా సూట్‌కేస్‌మీదే వాలిపోయి నిద్రలోకి జారిపొయ్యాడు.

అలా ఎంతసేపు నిద్రపొయ్యాడో తెలియదు కానీ, ఎవరో తనను పట్టి కుదుపుతుంటే కళ్లు తెరిచి చూశాడు.

ఉదయం తనను ఫ్యాను కిందికి రమ్మన్న వ్యక్తి అతను. ఏంటన్నట్టుగా చూశాడు. అతని చేతిలోని అరిటాకులో నాలుగు పెద్దపెద్ద ఆలూ బోండాలున్నాయి. మరో చేతిలోని కప్పులో నుండి టీ పొగలు కక్కుతోంది. స్నాక్స్‌ ఇస్తున్నారనీ, వెళ్లి తెచ్చుకొమ్మనీ చెప్పాడు. అప్పటికిగానీ ఆకలి గుర్తుకు రాలేదు రాఘవకు. కానీ, స్నానం చెయ్యకుండా ఎలా తినటం? అని ఆలోచించాడు.. పద్ధతులు తర్వాత! ముందు ఏదో ఒకటి ఇంత కడుపులోకి వెళితే, శక్తి పుంజుకొని తర్వాత స్నానం అదీ ముగించవచ్చని లేచి ముఖం కడుక్కుని స్నాక్స్‌ ఇచ్చే చోటుకు వెళ్లాడు.

అక్కడున్న వ్యక్తి రాఘవకు ఒక ఆకులో నాలుగు పెద్దపెద్ద బోండాలు పెట్టిచ్చాడు. అక్కడే ఒక బెంచీమీద కూర్చొని వాటిని ఆవురావురుమని తిన్నాడు. ఇంకో రెండు బోండాలైనా తినాలనిపించింది. కానీ అడగటం బాగోదనకుని, దానితోపాటు టీ తాగితే సరిపోతుందిలే అనుకుని చెయ్యి కడుక్కుని టీ ఇస్తున్న చోటికి వెళ్లాడు. టీ తీసుకొచ్చి ఇందాకటి చోటే కూర్చుని తాగాడు.

ఇప్పుడు ఒంట్లో ఏదో నూతన శక్తి ప్రవేశించినట్టుగా అనిపించింది. చుట్టూ చూశాడు. రకరకాల చెట్లతో, తీగెలతో, పొదలతో ఎంతో మనోహరంగా ఉంది ఆ పరిసరాలు. చాలా చల్లగా కూడా అనిపించింది. అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా హాయిగా ఉందనిపించింది. ఉదయం ఉన్నంత వేడి ఇప్పుడు లేదనుకున్నాడు మనసులో.

తమ హాలుకు తిరిగొచ్చి సూట్‌కేస్‌ తెరిచి తువ్వాలు, సబ్బు తీసుకుని స్నానాల గదులకేసి వెళ్లాడు. చన్నీళ్లతో స్నానం చెయ్యటం అతనికదే మొదటిసారి. ఒంటిమీద మగ్గు నీళ్లు పోసుకోవటానికి చాలాసేపు తటపటాయించాడు. తప్పదు! ఇంకో మూడు వారాలపాటు తను చన్నీళ్లతోటే స్నానం చెయ్యాలి. ఎలాగైనా అలవాటు చేసుకోవల్సిందే.. అనుకుంటూ మొండిగా ఒంటిమీద చన్నీళ్లు గుమ్మరించుకున్నాడు. దాంతో సన్నగా వణుకు వస్తున్నా ఎలాగో నిగ్రహించుకుని స్నానం పూర్తిచేశాడు.

ఆ రాత్రి భోజనాలయ్యాక అందరూ యోగా హాల్‌కేసి నడుస్తుంటే రాఘవ కూడా వెళ్లాడు.

ఆ హాల్లో కుర్చీల్లాంటివేవీ కనిపించలేదు. అందరూ నేలమీదే కూర్చున్నారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నారు. దాదాపు అందరూ హిందీలోనే మాట్లాడుకుంటున్నారు. రాఘవ ఆ హాలును నలువైపులా పరిశీలిస్తూ కూర్చున్నాడు.

కొంతసేపటికి ఒక వ్యక్తి హ్యాండ్‌ మైక్‌తో ప్రత్యక్షమయ్యాడు. అతని మాటలు ఇంగ్లీషులో కొనసాగాయి:

“మిత్రులారా! వివేకానంద కేంద్రం తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. సువిశాలమైన ఈ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మీరందరూ ఎంతో అదృష్టవంతులని చెప్పాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో గర్వంగా కూడా ఉంది. వయసుతో నిమిత్తం లేకుండా యువకులు మొదలుకొని వృద్ధుల వరకూ ఇక్కడ కలుసుకోవటం మహదానందాన్ని కలిగిస్తోంది. నిజానికి మేము సేవాభావంతో పని చేయాలనుకునే నిరుద్యోగుల కోసం ప్రకటన ఇచ్చాం. కానీ అటువంటి వాళ్లు కేవలం 13 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన వాళ్లందరూ మేమిచ్చే యోగా శిక్షణలో పాల్గొనేందుకు రావటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఏది ఏమైనా మీరందరూ వేర్వేరు ప్రాంతాలలో, రాష్ట్రాలలో నివసిస్తూ యోగా నేర్చుకోవాలన్న ఎంతో గొప్ప ఆసక్తితో, ఆశయంతో.. మన భారతేశపు కొస ప్రాంతమైన ఈ కన్యాకుమారికి ప్రయాణమై రావటం అదృష్టమనే చెప్పాలి. ఇక్కడ మీరు గడపబోయే ఈ ఇరవైఒక్క రోజులు మీ జీవితంలో మరిచిపోలేని ఒక అనుభవంగా మిగిలిపోతుందని మా గట్టి నమ్మకం. మన దేశానికి సంబంధించినంత వరకూ భిన్నత్వంలో ఏకత్వమని ఎందుకంటారో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అవగతమవుతోంది. మనమందరం మరో మూడువారాలపాటు కలిసి ప్రయాణం చెయ్యబోతున్నాం. ఈ కలయిక కచ్చితంగా మీ జీవితంలో ఒక పెను మార్పును కలిగిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.

ఈ మూడు వారాల పాటు మీరు గడపబోయే ప్రతి క్షణమూ మీ కొత్త జీవితానికి గట్టి పునాది వేస్తుందని భావిస్తున్నాము. ఇక్కడ గడపబోయే కాలాన్ని మీరు చాలాకాలం, కాదు కాదు జీవితాంతం గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాము. ఎలాపడితే అలా జీవిస్తున్న మీరు, రేపటి నుండి ఒక క్రమ పద్ధతికి ఎలా అలవాటు పడనున్నారో మీరే చూడబోతున్నారు.

ఈ యోగా శిక్షణ శిబిరానికి దేశం నలుమూలల నుండి దాదాపు 109 మంది పాల్గొనటానికి వచ్చారు. ఎక్కువగా మధ్యప్రదేశ్‌ నుండి 27 మంది రావటం హర్షించదగ్గ విషయం.” అంటూ ఆ 27 మంది పేర్లను అతను చదువుతుంటే ఒక్కొక్కళ్లూ లేచి నిలబడి మిగిలినవాళ్లకు నమస్కరిస్తున్నారు. అలా ఒక్కొక్కరుగా అందరికీ పరిచయమవుతున్నారు.

“అలాగే ఒడిస్సా నుండి..” అంటూ తర్వాతి సంఖ్యను చెప్పాడు. అందరూ ఆసక్తిగా వింటున్నారు.

తమ రాష్ట్రంనుండి ఎంతమంది పాల్గొంటున్నారు, వాళ్లు ఎవరో తెలుసుకోవాలన్న ఆతృత రాఘవలో కనిపించింది.

“ఆంధ్రప్రదేశ్‌ నుండి నలుగురు వ్యక్తులు వచ్చారు”, అంటూ వాళ్ల పేర్లు చదివారు. రాఘవ వంతు వచ్చేసరికి లేచి నమస్కరించటమే కాక మిగతావాళ్లను గురించి చెబుతుంటే ఆసక్తిగా విన్నాడు. ఒకరు హైదరాబాదు నుండి వచ్చారు. ఆయన ప్రస్తుతం కాషాయ వస్త్రాలు ధరించి ఒక ఆశ్రమవాసిలా కనిపిస్తున్నాడు. మరొక వ్యక్తి వరంగల్‌ నుండి వచ్చాడు. ఆయన ఆజానుబాహుడుగా ఉన్నాడు. ఇక మూడో వ్యక్తికి దాదాపు రాఘవ వయస్సే ఉండొచ్చు, అతను శ్రీకాళహస్తి నుండి వచ్చాడు. అతనూ తనలాగే ఉద్యోగార్థియై వచ్చాడు కాబోలనుకున్నాడు రాఘవ. ఆ తెలుగువాళ్లు ముగ్గురినీ గుర్తుపెట్టుకున్నాడు. అలా అందరి పరిచయాలూ పూర్తి అయ్యాయి.

“మిత్రులారా, రేపటినుండి మీరు ఠంచనుగా ఉదయం 4.30 గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఈ యోగా హాల్లోకి రావలసి ఉంటుంది. చాలామందికి నిద్ర లేవగానే స్నానం చెయ్యటం అలవాటుగా ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్లు రేపటినుండి యోగా పూర్తయ్యాకే స్నానానికి వెళ్లవలసి ఉంటుంది. ఇకనుంచి అన్నీ ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి. అన్నింటికీ సమయం కేటాయించటం జరిగింది. ఏ సమయంలో ఏం చెయ్యాలో, ఎప్పుడు ఏఏ తరగతులుంటాయో అన్నీ తెలియజేసే టైమ్‌టేబుల్‌ను నోటీస్‌ బోర్డులో ఇప్పటికే అంటించటం జరిగింది. మీరు వాటిని గమనించి, సూచించిన ప్రదేశానికి మీరు సకాలంలో చేరుకోవలసి ఉంటుంది. ప్రస్తుతానికి సెలవు, శుభరాత్రి!” అంటూ ముగించాడు ఆ వ్యక్తి.

అందరూ గట్టిగట్టిగా మాట్లాడుకుంటూ ఆ హాలు నుండి బయటికి నడిచారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here