జీవితాన్ని ప్రేమించగలిగితే..!

0
11

[dropcap]అ[/dropcap]ర్ధరాత్రి ఒకటిన్నర కావస్తుంది. లోకమంతా నిద్రమత్తులో జోగుతుంటే నా కన్రెప్పలు మాత్రం బరువుగా, మగతగా రాని నిద్రతో దాగుడుమూత లాడుతున్నాయి. స్తబ్ధుగా నా చుట్టూ ఆవరించిన చీకటి.. ఫ్యాను గాలి చల్లదనాన్ని తట్టుకోలేక పోతుంది నా శరీరం. కాలు ఎంతసేపు అలానే మడచి పెట్టానేమో నరాలు మెలిపెడుతున్న బాధ. నా అవస్థ చూసి నాకే దుఃఖం వేసింది. పూడుకుపోతున్న గొంతుతో బలహీనంగా మా ఆవిడ్ని నిద్రలేపసాగాను. ఊహూ, నా మాటలు ఆవిడకు విన్పిస్తేగా! విశ్రాంతిలేని శరీరాన్ని మరచి, అలసిన మనస్సుతో ఆవిడ గాఢ నిద్రావస్థలో ఉంది. పాపం, తాను మాత్రం ఏం చెయ్యగలదని? నిత్యం ఆవిడకు దినచర్య మొదలయ్యేది నా పనులతోనే. నాకు ప్రతి రాత్రి భయానకమే! కళ్ళు మూసుకుంటే చాలు, గడిచిన గతం తాలూకు నీడలు, భవిష్యత్తు గురించి బెంగ. మరెన్నో అర్థం పర్థం లేని ఆలోచనలతో రాత్రిళ్ళు అలా ముగుస్తాయి. తనకు పాపం కొన్ని గంటలైనా రెస్టు ఇవ్వాలిగా.. దినమంతా దాకిరితో ఒళ్ళు పులిసి పోతుందామెకు. తెల్లారగానే “మూత్రానికి వెళ్తారా? లేదా బాటిల్ పట్టమంటారా?” అంటుందామె నిస్సిగ్గుగా. నేను కొంచెం సేపు తటపటాయించి ఇంత చిరుచీకటిలో బాత్రూంకు ఆమె నన్ను చేయిపట్టి బలంగా లాగుతూ తోలుకుపోయి తిరిగి తీసుకువచ్చేసరికి అదొక తతంగం. ఎందుకులే.. రోజులానే బాటిల్ పెట్టమంటాను. నాకున్న వ్యాధి వలన ఏ పనిని స్వంతంగా చేసుకోలేని అశక్తుడిని. ఒంట్లో కదలికలు మందగించిన మందభాగ్యుడ్ని.

***

ఇంట్లో ఆవిడ రోజులాగే “మీరు ఆ మందు బిళ్ళలు వేసుకోగానే కొద్దిసేపు ఉన్న కదలికలతో మీ స్నానం, పూజ చేసుకోవచ్చుగా” అంది. నేను అతిప్రయత్నం మీద తట్టుకుంటూ తట్టుకుంటూ వెళ్లి నాలుగు చెంబులు మీద గుమ్మరించుకొని వస్తాను.

***

అప్పుడప్పుడు వణుకుడు ఎక్కువైతే బాత్రూంలో అలానే నిల్చుంటాను. పనిలో మునిగిన మా ఆవిడ మధ్యలో వచ్చి చూసి నాకు పొడి లుంగీ కట్టించి, నెమ్మదిగా చేయిపుచ్చుకొని తీసుకొచ్చి కుర్చీలో కూర్చుండ బెడుతుంది. కాఫీ, టిఫిను అదొక ప్రహసనం. నీళ్ళు పారబోసుకోవడం, టాబ్లెట్లన్ని చెల్లా చెదురై కిందపడటం, ఏదైనా తింటుంటే అన్ని పైన పడేసుకోవటం. మా ఆవిడ గొంతులో మళ్ళీ నిస్సహాయతతో కూడిన చికాకు. ఇంటిపని, నన్ను చూసుకోవడంతో దినమంతా ఆవిడ బిజీనే. దానికితోడు తనకు బి.పి., షుగరు. ఈ రెండు చాలు తన ఒంట్లో సత్తువ తోడెయ్యటానికి. నలబై ఏళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి, ఎనిమిదేళ్ళ క్రితమే రిటైరయ్యాను. అయినప్పుడే పొడసూపిన వ్యాధి తాలూకు లక్షణాలతో సతమతమవుతూ ఫైళ్ళు, లెటర్లను వేగంగా రాయలేకపోయేవాడిని. నాకు తోడుగా ఒక సహాయకుడ్ని నియమించుకొని ఎలాగోలా పదవీవిరమణ కాలం వరకు నెట్టుకొచ్చాను. నా వంశవృక్షం బాగా చదువుకొని పరాయి దేశంలో ఉద్యోగాలు వెలగబెడుతున్నారు. ఎప్పుడో వారికి సెలవులు ఉన్నప్పుడు అలా చుట్టపు చూపుగా రావటం, ఉన్న నాలుగురోజులు వాళ్ళ పనులమీద తిరగడానికే సరిపోయేది. “గ్రాండ్ పా, ఏదో మాట్లాడతారు. కాని మాకు అర్థం కాదు” అంటారు మనువరాళ్ళు షికాయతుగా. వాళ్ళతో ఆడుకోవాలని, కొడుకులతో కాసేపు గడపాలని చిన్నచిన్న కోరికలు నాలో.. వాళ్ళు నన్ను ఎన్నో హాస్పిటల్స్‌కు తిప్పారు పాపం! వ్యాధి తగ్గుదల లేదు. రానురాను ముదిరి ఒక కట్టె బతుకుగా.. అవిటి శిలగా ఉన్నన్నినాళ్ళు నా వాళ్ళకు బరువుగా బతకాలేమో? మెదడులో డోపమైన్ రసాయనం తగ్గుదల మూలంగా పార్కిన్సన్ వ్యాధి నన్ను కబళించి వేయసాగింది. నాలో అంతులేని ఆవేదన!

***

జీవితం ఇక నిరర్ధకమన్న దిగులు. మా ఆవిడ మైసూర్‌కు చెందిన శ్రీవైష్ణవురాలు. ఎక్కడో చదివినట్లు గుర్తుకు రావడంతో.. ఉత్తర భారతీయుల తర్వాత దక్షిణాదిలో మైసూరువారు మహా అందంగా ఉంటారట. నలభై అయిదేళ్ళ నా వివాహం అయ్యాక నేను పనిచేసే చిన్నచిన్న పల్లెల్లో కందిలు, ఎక్కాబుడ్డి వెలుగులో నాతో కాపురం చేసిన సహధర్మచారిణి. మడీ, ఆచారంలో నిష్ఠాగరిష్టురాలు. ఆచార్య తనియ చదువుకొని మంత్రతీర్థం పుచ్చుకోనిదే పచ్చిగంగ కూడా ముట్టదు. “ఈ రోజు ఆండాళ్ తిరునక్షత్రం. విగ్రహాల పులికాపు చేసుకోవాలి. మీకు టిఫిను, కాఫీ అయ్యాక పూజ మొదలెడతాను” అంది నిక్కచ్చిగా. టిఫిన్ అయ్యాక ఒక్కసారిగా నాకు వణుకుడు ఎక్కువైంది. కుర్చీలోనుండి ఉన్నపళంగా ఎలా జారిపడ్డానో ఏమో తెలియదు. పన్ను గాటు పడి క్రింది పెదవి చిట్లింది. తను పూజ ముగించుకొని వచ్చి నన్ను చూడగానే కంగారు పడింది. “మీకు బంధు ప్రీతి ఎక్కువ. మొన్న మీ చిన్నాన్న మనవాడి పెళ్ళికి వెళ్లకుంటే ఏం పోయె? అక్కడ మీరు తినడానికి ఎంత అవస్థ పడ్డారు? అందరూ ఏదో రకంగా చూడటం, ఎందుకిలా? ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేయడం నాకు ఎంతలా తలకొట్టేసినట్లైంది. అందర్ని చూసి ఏదో మాట్లాడాలనుకోవడం, కారుతున్న చొంగ, మీరు.. మీ అవతారం.. అప్పటినుండి ఈ జబ్బు ఇంకా ముదిరినట్టుంది. నేనేం చేయను? ఎంతకని కంటికి కాపలాగా మిమ్మల్ని చూడాలి? పోనీ ఎవర్నైనా ఇంట్లో పనివాళ్ళను పెట్టుకుందామా? అంటే వారు నమ్మకస్థులో? కాదో? ఇద్దరం అశక్తులం. ఉన్నకాస్త నగలు, డబ్బు ఎత్తుకెళ్ళి, మనల్ని ఎవడైనా చావబాదితే? పోనీ కొడుకుల దగ్గరకైనా వెళ్లి ఉందామా అంటే వాళ్ళ సణుగుడు భరించలేం. వారు ఇక్కడికి ఇప్పుడే వచ్చేట్లు లేరు. హే! పెరుమాళ్ళు మాకు ఎందుకీ శిక్ష? ఇవన్నీ చూడలేక ముందే నేను పోవాలి. ఎందుకొచ్చిన పాడుజన్మ. ఎక్కడో పుట్టి పెరిగిన నన్ను ఇక్కడకు తీసుకొచ్చారే. నేనేం పాపం చేసుకున్నానో?” అంటూ ఆవిడ సన్నగా రోదించసాగింది. ఏడవద్దు మరి! వయసులో తనకీ, నాకూ రెండేళ్ళ తేడా. మా ఇంట్లో ఇంత గోల జరుగుతున్నా, పక్కవాడికి చీమ కుట్టినట్లైనా లేదు. ఎంతైనా అపార్ట్‌మెంట్ బతుకులాయే. మూసిన తలుపులు వెనుక ఎవడి ప్రపంచం వాడిది. ఒక పరిధిలో మగ్గిపోతున్న వాళ్ళం. ఇంకా ఎన్నేళ్ళని నా వాళ్ళని బాధపెట్టాలి. ఈరోజు రాత్రే నేను ఇల్లు వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? నాకెవరైనా పట్టెడన్నం పెడతారా? ఒకరి సహాయం లేనిదే కాలకృత్యాలు సైతం తీర్చుకోలేని వాడిని. నాకిదేం విపరీత బుద్ధి. నా మనస్సు నా ఆధీనంలో లేదు. వెళ్లిపోవాలి.. అంతే..! ఇంట్లోని ఛీత్కారాలకు, అవమానాలకు దూరంగా ఎక్కడికైనా.. కొడుకుల పేరిట సన్నని అక్షరాలతో వణుకుతూ రాయటం మొదలుపెట్టాను. “చిరంజీవులకు ఆశీస్సులు. నేను చనిపోతే నా కర్మకాండలు, అంత్యక్రియలు బాగా చేయండి. అమ్మ వట్టి అమాయకురాలు. ఆమెను బాగా చూసుకోండి. రామానుజ తిరువడిగళ్ళే శరణం” ఆ లేఖను నా మందుల డబ్బాకింద మడతపెట్టి ఉంచాను. కొన్ని అత్యవసర మందులను కవర్‌లో వేసుకొని తలుపు తీసుకొని నెమ్మదిగా బయటపడ్డాను. ఇంకా పూర్తిగా తెలవారలేదేమో.. చిరుచీకట్లు తొలగలేదు. దగ్గర్లోని గుడికి వెళ్దాం అనుకోని నడకసాగించాను. నా అదృష్టం బాగుంది, గుడి పూజారి అప్పుడే ఆలయం తలుపులు తెరుస్తున్నాడు. అతడు నన్ను చూడలేదు. మెల్లిగా గోడలు పట్టుకుంటూ నడుచుకుంటూ లోనకు చేరుకున్నాను. చల్లని పంపునీళ్ళతో ముఖం కడుక్కొని సేద తీరాను. చెప్పొద్దూ.. ఈరోజు చాలా గర్వంగా ఉంది, నాకు స్వేచ్ఛ దొరికిన ఆనందం. మా ఆవిడ్ని చూడగానే ఆ మాటలకే నాకు వణుకు పుట్టేది. ఎక్కడికి తీసుకెళ్లమన్నా తీసుకెళ్లదుగా.. తగిన శాస్త్రి అయ్యింది. ఏం చేస్తుందో, నాకొరకు వెదుక్కుంటుందో? లేక పీడా వదిలిందని సంతోషిస్తుందో? తెలియదు. ఈ రోజునుండి ఆవిడకూడా స్వేచ్ఛగా ఉండొచ్చు. తనకిష్టమైన పూజ, ఉపవాసాలతో ఎంతసేపైనా స్తుతిమాల చదువుకోవచ్చు. మధ్యమధ్యలో నా కాపలా బాధ తప్పింది. ఇన్నేళ్ళలో అవిడని అర్థం చేసుకున్నది ఇదేనా? అని హెచ్చరించసాగింది నా మనస్సు. ఐనా, డోంట్ కేర్! ఏదో కక్షసాధింపు భావన నాలో బలపడసాగింది. నాకు పెద్దగా దైవభీతి, పాపభీతి రెండూ లేవు. పైగా మాంసాహార ప్రియుడ్ని. మొదట్లో ఆవిడకు తెలియకుండానే తినేవాడ్ని.

***

కొన్నాళ్ళయ్యాక నాకిష్టమైన మాంసాహార రుచుల్ని ఇంటికి తెచ్చుకొని తినవాణ్ణి. ఆరోజు పెద్ద రామరావణ యుద్ధమే జరిగేది. “నా యిష్టం.. నీకొరకు నేను నోరు కట్టేసుకోవాలా?” అనేవాణ్ణి బింకంగా. ఎందుకో వార్ధక్యంలోకి వచ్చాక మా ఇద్దరి మధ్య తగాదాలు పెరిగిపోయాయి. ఆవిడకు అస్తమానం నామీద అరవడం, చాతగాని తనంతో సణుగుడూ, చీటికి మాటికి నామీద విరుచుకు పడటం ఇవన్నీ తప్పినందుకు లోలోన ఎంత ఆనందిస్తుందో..! ధ్వజస్తంభం పక్కన అర్చన టికెట్లు చింపుతున్న ఉద్యోగికి కాస్త ఎడంగా కూర్చున్నాను. తెల్ల లుంగీ, పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న మధ్య వయస్కుడతను. కాసేపయ్యాక నా దగ్గరికి వచ్చి, “ప్రసాదం తీసుకొస్తాను. తినండి” అన్నాడతను. అతనిచ్చిన పులిహోర, చక్కెర పొంగలి రెండూ కొద్దిగా తిన్నాను. నా అవస్థ అతనికర్థమైంది. “మీ ఇంట్లో దిగబెట్టాలా?” అంటూ నా చేయి పుచ్చుకొని నిలబెట్టాడు. స్టీల్ రెయిలింగ్‌ని పట్టుకొని కదలికలు ప్రారంభమయ్యాయి. ఇంక నడవొచ్చు.. గుడి మూసేస్తారేమో? ఎక్కడికి వెళ్ళాలి? నెమ్మదిగా రాతిగడప దాటుకొని వీధి మలుపు దగ్గర నిలబడ్డాను. రోడ్డుపై మహావేగంగా వెళ్తున్న వాహనాలు.. ఈ ప్రపంచంలో ఒంటరిగా నేను.. అందరూ ఉన్నా సమూహంలో ఏకాకిని నేను. చొంగ కారుతున్న చెక్క మొహం, మాటలు మాట్లాడే నాథుడే లేడు. మళ్ళీ ఇంటికి వెళ్లి ఏం ఉద్ధరించాలని.. పొద్దస్తమానం కుర్చీకి అలంకారంగా కూర్చొని కూర్చొని పిరుదులపైన పుండ్లు లేచాయి. అవి విపరీతంగా దురదపెడుతూ కదలాలంటే మహా ఇబ్బందిగా ఉండేది నాకు. ఆఫీసులో నలబై మంది సిబ్బందిని గడగడలాడించిన సిన్సియర్ స్ట్రిక్టు ఆఫీసరుగా పేరుపొందిన నేను ఇప్పుడిలా మా ఆవిడముందు బేలగా, నిస్సహాయుడిగా మిగిలిపోవడం.. నా అహాన్ని దెబ్బతీసే మాటలు ఆవిడ ఎన్నో అంటున్నా మౌనంగా భరించటం.

***

కాస్త ఆయింట్మెంట్ పూయడానికి కూడా మహా బెట్టుచేసే ఆవిడ విపరీత ధోరణి నాకేమాత్రం నచ్చడం లేదు. నిజం చెప్పొద్దూ! తను నాకోసం వెదుక్కుని వెదుక్కుని చావాలి. ఇరుగుపొరుగులకు తన గోడు వెళ్ళబోసుకుంటుందేమో! అందరూ ఆవిడ అరుపులకు, తిట్ల పురాణానికి జంకే ముసలాడు ఇల్లొదిలి పారిపోయాడు అనుకుంటూ గుసగుసలు పొతే వాటిని వింటూ తను గుడ్లనీరు కక్కుకోవాలి. లేకపోతే ఏంటి? ప్రతిరోజు శ్లోకాలన్నీ చెదివే నోరుతోనే నాకు శాపనార్థాలు పెడుతుందా? రోడ్డు ప్రక్కన నుంచున్న నన్ను దాటుకుంటూ ఎంతోమంది వెళ్లిపోతున్నారు. ఫుట్‌పాత్ పైన కూర్చున్న భిక్షగాళ్ళు, పిచ్చివాండ్ల వంక చూశాను. ఇల్లు, ముంగిలీ లేకున్నా హాయిగా ఉన్నారు. ఎక్కడెక్కడో తిరుగుతారు. ఎక్కడైనా నిద్రిస్తారు. రేపటి గురించి దిగులు లేదు. వాళ్ళెంత నిబ్బరంగా ఉన్నారు. పార్క్ వైపు దృష్టి సారించాను. చిక్కగా పరుచుకున్న పచ్చదనం, ఎత్తైన చెట్లు గాలికి తలలూపుతున్న పూలమొక్కలు.. ఆ ప్రక్కనే ఉన్న బండివాడి వద్దకు నెమ్మదిగా చేరుకున్నాను. డబ్బులివ్వబోతుంటే ఐదువందలకు చిల్లర లేదన్నాడు. “ఉంచండి సార్! ఫర్లేదు” అన్నాడు సానుభూతిగా. నడుస్తుంటే మందగించిన నరాల కదలికలు, శిలా విగ్రహంలా అడుగుతీసి అడుగువెయ్యలేక పార్క్ పక్కనే ఆగిపోయాను. చుట్టూరా జనం! కొంతమంది నన్ను చూసి నవ్వుకుంటూ, మరికొంతమంది నన్నసలే లెక్కచేయకుండా మందుకు కదిలి వెళ్ళసాగారు. వాళ్ళలో నా వయస్సువారు. నాకన్నా చిన్నవారు ఎంతోమంది.. చలాకీగా నవ్వుతూ, తుళ్ళుతూ, బయట అమ్మే బుగ్గలు కొనుక్కుంటూ పార్క్ లోకి ప్రవేశిస్తున్న జంటలు.. వారి పిల్లలు.. అయ్యో! నన్ను పక్కకు కదిపేవారే కరువయ్యారు. ఒక పడుచు పిల్ల బైక్ మీద వెళ్తున్న తన ప్రియుడికి బై చెబుతూ హఠాత్తుగా నాకు డాష్ ఇచ్చి అంతే వేగంగా వెళ్ళిపోయింది. అంతే డామ్మని విద్యుత్ స్తంభానికి నా తల బలంగా కొట్టుకుంది. అక్కడే కూలబడ్డాను. నా చుట్టూ చెల్లా చెదురైన మరమరాలు, ఎగిరిపడ్డ మందుల కవరు, చిల్లర పైసలు.. కళ్ళు బైర్లు కమ్మసాగాయి. ఎవరో ఒక సీనియర్ సిటిజన్ నా వద్దకు పరిగెత్తుకుంటూ రావడం మాత్రం మసకగా కన్పించింది. వెల్లకిలా పడిపోయిన నా చుట్టూరా జనం.. వారి మాటలు “ఎవరో ముసలాయన.. మూర్ఛ వ్యాధి ఉందేమో! చొంగ కారుతుంది. ఇంట్లోవారు లేరో ఏమో పాపం! ఇలా వీధులు పట్టుకు తిరుగుతున్నాడు. ఇవాళ రేపు గట్టిగా ఉన్న వృద్ధులకే పట్టెడన్నం పెట్టేవారు లేరు. ఇలాంటి వ్యక్తులకు నిత్యం సేవ చేయాలంటే ఎవరివల్ల మాత్రం ఏమవుతుంది?” వారి మాటలకు నా తల కొట్టేసినట్లైంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్లు, కాలు కదపలేక పోయాను. నుదురు చిట్లి కొద్దిగా రక్తస్రావం కాసాగింది. ఇందాక నేను చూసిన ఆ వృద్ధుడెవరో కాని, చేయిపట్టుకొని పైకి లేపుతూ సాయమందించాడు. తన కర్చీఫ్‌తో దెబ్బను గట్టిగా అదిమిపట్టి ఆటోను పిల్చాడు. నన్ను మెల్లిగా మరో ఇద్దరి సహాయంతో లేవదీసి మెల్లిగా ఆటోలో కూర్చోబెట్టారు. కళ్ళు మూసుకున్నాను నేను. గుడ్డెద్దు చేలో పడ్డట్లు జరుగుతున్న సంఘటనల పట్ల నిమిత్తమాత్రుడినై ఉండాలేమో! నా పక్కన కూర్చున్న పెద్దాయనది నా వయస్సే! ఉంటుంది కాబోలు, మనిషి దృఢంగా, ఎర్రగా, ఎత్తుగా ఉన్నాడు. నరాల వ్యాధి దాపురించి నేనేమో ఇలా! అప్పుడప్పుడు ఎవరికైనా జీవితం సారహీనంగా, నిర్లిప్తంగా, నిరుత్సాహభరితంగా అన్పించొచ్చు కాని ఇవే భావనలని జీవితాంతం మోయాలంటే కష్టమే! నా పార్కిన్సన్ జబ్బు మూలంగా ఎంతమందిని ఇబ్బందిపెడుతున్నాను. ప్రతి చిన్నపనికి మా ఆవిడపై ఆధారపడటం అప్పుడప్పుడు నామోషిగా, బిడియంగా అన్పిస్తుంది. పూజ, అనుష్ఠానం చేయడంలో తన సహాయం తప్పనిసరి! అసలు ఎందులో తన సహాయం అవసరం లేదో నిర్ణయించుకోలేకపోతున్నాను. తిరుచూర్ణం రంగరించి బొట్టుపుల్లతో ఒకే రేఖగా చటుక్కున పెట్టుకోలేని నిస్సహాయుణ్ణి.

***

ఆ ఎర్రని బొట్టునీళ్ళు క్రింద చుక్కలుగా ఒలకడం, నా ఫాలభాగంపై పక్కకు తొణికిన నామం, నా మొహంగాని, ఇవన్నీ చూసి ఆవిడ ఏదో ఒకమాట అనడం, నా గుండె గునపాలు గుచ్చినట్లు బాధపడటం రోజూ జరిగేదేగా. ప్రతిదానికి అరవడం, పెద్దగా నోరుచేసుకోవడం, ఈమధ్య మరీ శృతిమించింది. దౌర్భాగ్యపు బ్రతుకు. ఆవిడ మోచేయి కింద పడిగాపులు గాయడమేనా? నా దినచర్య ఇక.. నుదుటి నొప్పి ఇప్పుడు బాగా తెలుస్తుంది. కణతలు అదురుతున్నాయి. నరాలు చిట్లుతున్నట్లుగా ఒకటే సలపరింత! పక్కనున్న పెద్దాయన భుజం చుట్టూ చేయివేసి గట్టిగా పట్టుకున్నాడు. ఒక సాంత్వన, ఊరట ఏదో లభించినట్లైంది. ఆటో వీధిమలుపు తిరుగుతూ సరీగ్గా దేవాలయంకి కాస్త ఎడంగా ఉన్న హాస్పిటల్ ముందు ఆగింది. మెల్లిగా నడిపించి చక్రాల కుర్చీలో కూర్చుండబెట్టారు. ఇంతలో ఏదో గలాటా! ఎవరో ముసలావిడ స్పృహతప్పి పడిపోయిందట. ఎమర్జన్సీ అంటూ అక్కడికే స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్నారు. నొప్పిని అదిమిపట్టి చూద్దును గదా! పచ్చని చేయికి బెల్లం రంగు మట్టిగాజులు, అరిగిపోయిన పాత రాగి ఉంగరం, అది మా ఆవిడే! రోజూ నాకు నామం పెట్టేటప్పుడు ఆ గాజులకంటిన తాళింపు చమురు వాసన గుర్తెరిగినవాడ్నే! నేను ఒలకబోసిన ఆహార పదార్థాలను తుడిచేటప్పుడు వాటి ధ్వని లయానుగుణంగా విన్నవాడ్నే.. నాకెందుకో గుండె ఉగ్గబట్టినంత ఉద్వేగంగా ఉంది. ఆవిడకేమై ఉంటుంది? వచ్చినవారు “పాపం! పెద్దావిడ, తన భర్త చెప్పకుండా ఎక్కడికో వెళ్ళాడట. అతనో జబ్బు మనిషి. అతణ్ణి వెదుకుతూ ఈ మహాతల్లి తనకు తెల్సిన వాళ్లకు వాకబు చేద్దామని రోడ్డు దాటుతుంటే బైక్ ఢీ కొట్టింది. అయినా, అతనో పిచ్చి వెధవగాని, ఈ వయస్సులో ఏం చేయగలమని బయటకు వెళ్ళాడు? ఎవరికీ అక్కరలేని తన బ్రతుకును అంతం చేసుకుందామనుకున్నాడా? లేక ఆవిడ్ని ఏడిపించి, మళ్ళీ తిరిగివద్దామనుకున్నాడా? తెలియదు. కాని ఈ వయస్సులో ఈమెకు ఇదేం కష్టం. అతనికేం పోయేకాలం..” వినలేకపోయాను. నిస్సహాయంగా కన్నీళ్లు వచ్చాయి. గాయం నొప్పిని భరించలేకపోతున్నాను అనుకొని నన్ను ట్రీట్మెంట్‌కి పక్కగదిలోకి మళ్ళించారు. రక్తం అవసరమని అనుకోగా విన్నాను. మెల్లిగా నాకు కట్టుకట్టిన డాక్టర్ కేసి కృతజ్ఞతగా చూస్తూ, ఆవిడ మా ఆవిడేనని అస్పష్టంగా గొణిగాను. అవసరమైతే నా రక్తం ఇచ్చి ఆవిడను కాపాడమని అర్థించాను. కుర్ర డాక్టర్ నవ్వాడు. నా అదృష్టం కొద్ది నాకెప్పుడు హిమెగ్లోబిన్ తగ్గదు. ఆవిడే ఉపవాసాలు, నోములంటూ అర్ధాకలితో జీవించే బడుగుజీవి. తెల్లారి లేచింది మొదలు, రాత్రి పొద్దుపోయే వరకు వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తే అరిగిపోయిన గంధపు చెక్కలా సన్నబడరూ మరి! మడి బట్టలు ఆరేయటం, తులసిమాలలు సిద్ధం చేసుకోవడం, పెరుమాళ్ళకు మధ్యాహ్నం నైవేద్యం, వీటి మధ్యలో నా తిండితిప్పలు పాపం! ఎందుకో జాలేసింది. నలభై ఐదేళ్ళ గృహస్త జీవితంలో ఎన్నెన్నో మైలురాళ్ళు. ప్రతి గమ్యాన్ని నాతొ జాగ్రత్తగా దాటించి, చివరకు వానప్రస్థంలో ఇలా ఒంటరి, దిక్కులేని పక్షిలా.. స్ట్రెచర్ పై ఆమె చెదిరిన రూపాన్ని ఊహించుకోలేక పోతున్నాను. ఏదో అపరాధ భావన నన్ను నిలువెల్లా కలచివేయసాగింది. ఆ దేవుడే తన వయస్సు తెలుసుకోవాలని నాకే బుద్ధి పుట్టించాడా? నేను లేని ఆవిడ ఎలా జీవితాన్ని నెట్టుకొస్తుందని నేను ఇల్లొదిలాను? ఏం సాధిస్తానని? ఏదో మూలన అలాంటి పిచ్చివాడిగా మారిపోతానేమో? లేదా రోడ్డు ప్రక్కన అనామక శవంలా మిగిలిపోతానేమో? నాలో సన్నగా వణుకు, దడ, నిశ్శబ్దంగా బాటిల్ లోకి ఎక్కుతున్న రక్తం.. మా ఆవిడ జీవధారలా, ఆమెలో నూతనోత్తేజం నింపడానికి, మళ్ళీ బతికినన్నన్నాళ్ళు నాకు తిట్టుకుంటూ ఐనా సపర్యలు చెయ్యొద్దూ..! నవ్వుకున్నాను.

***

వానప్రస్థంలో కొత్త బతుకుముడి ఏదో మా ఇద్దరినీ బంధించసాగింది. ఓడినా నేను గెలిచినందుకు సంతోషంగా ఉంది. నా అర్ధభాగం తొందరగా కోలుకోవాలని మా మధ్య కురుస్తున్న చీకటి వాన అదృశ్యమవాలని.. ఇది మనసుకు జరుగుతున్న చికిత్సలా.. ఒక్కో సంఘటనలు కలలా కరుగసాగాయి. ఉబ్బిన కనుగుడ్లను పక్కకు కదిలిస్తూ, ఆవిడను సానుభూతిగా చూశాను. ఎందుకో మోములో జీవితేచ్ఛ లేదని అన్పించింది. బలహీన స్వరంతో ఆవిడను లేపసాగాను. ఈ రాతి దేహపు చాకిరికై మళ్ళీ తన దినచర్య మొదలవుతుందా? లేదా తను పూజించే రాతిబొమ్మను వెదుక్కుంటూ వెళ్లిపోయిందా? ఒక గాఢమైన శూన్యంలో స్తబ్ధుగా.. అచేతనావస్థలో.. నేను! ఈ రాత్రి ఇలా.. కలలా.. ముగిసిపోతూ.. చిరుచీకట్లో అస్పష్టంగా.. నన్ను లేపుతూన్నది మళ్ళీ ఎవరో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here