నాని భుజాన మోసిన “జెర్సీ”

0
8

[box type=’note’ fontsize=’16’] “కొసమెరుపు కోసం అని చెప్పి, చెప్పాల్సిన కథను నొక్కేసి, ఆ ఖాళీలను బోలు కథలతో నింపడం, సెంటిమెంటు పేరుతో లాజిక్‌ను పూర్తిగా విస్మరించడం నిరాశ పరుస్తుంది” అంటున్నారు పరేష్. ఎన్. దోషి ‘జెర్సీ’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య బాగా చర్చలో వచ్చిన చిత్రం జెర్సీ. నాని వుండడం మూలాన నేను యెలానూ చూడదలిచాను. అలాగే చూశాను. దీని చర్చకు ముందు క్లుప్తంగా కథ చెప్పుకుందాం.

36 యేళ్ళ వయసున్న అర్జున్(నాని) FCI ఉద్యోగి. వొక అవినీతి ఆరోపణ మీద సస్పెండ్ అయి, ఇంట్లోనే టీవిలో క్రికెట్ చూసుకుంటూ వుంటాడు సోమరిగా. నాలుగేళ్ళ కొడుకు నాని (రోనిత్). భార్య సారా (శ్రధ్ధా శ్రీనాథ్) హొటెల్ తాజ్ బంజారాలో రెసెప్షనిస్ట్ గా పని చేస్తూ ఇల్లు సంసారాన్ని నెట్టుకొస్తూ వుంటుంది. (సస్పెన్షన్లో వున్న ఉద్యోగికి ఆ కాలమంతా సబ్సిస్టెన్స్ పే అని మూడొంతుల జీతం ఇస్తారు. ఆ విషయం యెక్కడా చెప్పలేదు. అది మనం వూహించుకుంటే, అదీ, ఆమె జీతం రెండు కలిపి సంసారాన్ని లాక్కొస్తున్నట్టు.) పదేళ్ళ క్రితం అర్జున్ ప్రేమలో పడి, తల్లిదండ్రులను యెదిరించి పెళ్ళి చేసుకున్నా తన భర్త ప్రస్తుత వైఖరి ఆమెను కఠినంగా మారుస్తాయి. అలాగని ప్రేమ పూర్తిగా చావలేదు, కాని జీవితంలో కష్టాలకు, భర్త నిర్లక్ష్యవైఖరికి విసుగెత్తిపోతుంది. కొడుకు క్రికెట్ ప్రాక్టీస్‌కు వెళ్తుంటాడు. అతని మనసు క్రికెటర్లు వేసుకునే జెర్సీ మీద పడుతుంది. తన పుట్టినరోజుకి బహుమతిగా ఇప్పించమని తండ్రిని అడుగుతాడు. కనుక్కుంటే దాని ఖరీదు 500 (1980 లలో అది పెద్ద మొత్తమే) అని తెలుస్తుంది. అప్పుగా ఇవ్వనంటాడు దుకాణందారు. రెండు రోజుల్లో పుట్టినరోజు. మిత్రుల దగ్గరా అప్పు పుట్టదు. అలాంటిదే చవకది కొనమన్న స్నేహితుడికి తన మనస్సాక్షి ఒప్పుకోదంటాడు. వో చారిటీ మేచ్ లో ఆడే అవకాశం అనుకోకుండా వస్తుంది. ఆ డబ్బుతో కొనొచ్చు అనుకుంటే అది చారిటీ మ్యాచ్ కాబట్టి డబ్బు రాదు. భార్య పర్సు లోంచి తీయబోతూ పట్టుబడి మాటలు పడతాడు. చివరికి పుట్టినరోజున ఇవ్వనే లేకపోతాడు.

ఈ లోగా ఆ చారిటీ మ్యాచ్ లో తండ్రి ఆటను, జనాల చప్పట్లను చూసిన కొడుక్కి తండ్రి హీరో లా కనిపిస్తాడు. కొడుకు కళ్ళల్లో ఆ మెరుపు, మాటల్లో ఆరాధనా భావన చూసి తను యెలాగైనా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకుంటాడు. అతన్ని అసిస్టెంట్ కోచ్‌గా జేరి జీవితంలో స్థిరపడమంటూ వుంటే, రిటైర్ కావాల్సిన వయసులో ఆడతాననడం మిత్రుడైన అస్సిస్టెంట్ కోచ్ (సత్యరాజ్) కి మింగుడు పడదు. కానీ పట్టు బట్టి సాధించి, ఆడి తన నైపుణ్యాన్ని ప్రపంచానికీ, భార్యా బిడ్డలకీ చాటుతాడు. ఆ చివరి మ్యాచ్ వోడినా అతని నైపుణ్యం ప్రపంచం దృష్టికి రావడమే కాదు, వొక పుస్తకంగా కూడా ప్రకటితమై హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది.

వొక మంచి ఆటగాడుగా మెచ్చి అతని ప్రేమలో సారా పడ్డ రోజుల్లో యేం జరిగింది? యెంత బాగా ఆడినా, రకరకాల పాలిటిక్స్ కారణంగా అర్జున్ ఇండియా తరఫున ఆడడానికి సెలెక్ట్ కాడు. ఆ ఆవేశంలో నాకు క్రికెట్ వద్దే వద్దు అనుకుని పెళ్ళి చేసుకుని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. కాని అదే మనిషి నైరాశ్యానికి లోనై పనీ పాట మానేసి ఇంట్లో కూచోవడం వల్ల సారా అర్జున్ ల మధ్య సంబంధాలు పలచబడతాయి.

ఈ చిత్రంలో నాకైతే నాని నటన తప్ప చెప్పుకోతగ్గది యేమీ కనబడలేదు. అందునా నిడివి మరీ యెక్కువ, సహనాన్ని పరీక్షిస్తూ. మనకున్న మంచి నటులలో వొకడు నాని అని సంతోషించాలా, లేక అతన్ని ఆ తమిళులు తీసుకెళ్ళిపోతే బాగుండు అని కోరుకోవాలా అర్థం కాదు. ఇక్కడ యెలాగూ అతనికి తగ్గ సినెమాలు రావట్లేదు, మరో పక్క తమిళనాట మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇంటర్వెల్ తర్వాత లేచి వెళ్ళిపోవాల్సిన వాణ్ణి చివరిదాకా చూశాను అంటే నాని నే కారణం. పాటలు వినబడతాయి కాని అర్థం కావు. చాయాగ్రహణం పర్లేదు. దర్శకత్వం అసంతృప్తికరంగా వుంది.

Spoiler alert మనకి ఓ హెన్రి అని మంచి కథకుడు వున్నాడు. చాలా విస్త్రుతంగా వ్రాసిన అతని కథలలో వొక సమాన గుణం కొసమెరుపు. అయితే కేవలం ఆ కారణంగానే అతను గొప్ప కథకుడు కాలేదు. అతని కథనం, శైలి, కథలో కనిపించే జీవితం అన్నీ సమానంగా ఆకర్షిస్తాయి. Cop and the Anthem, Maggie’s gift లాంటి కథలు తీసుకుంటే ఆ కొస మెరుపు అదనపు విలువ. అది వదిలేసి చూసినా కథ మొత్తం జీవితంలో వో శకలం (Slice of Life) లా మన ముందు నిలుస్తుంది. ఈ సినెమా కొచ్చేసరికి వొక విషయాన్ని కొసమెరుపు కోసం దాచి కథ అల్లడం వల్ల దర్శకుడు కొన్ని విషయాలు దాయాల్సి వచ్చింది. మరి దాని కారణంగా యేర్పడే ఖాళీలను పూడ్చడానికి కొడుకు పుట్టినరోజు, బహుమతి కోరిక వగైరాలతో నింపి సెంటిమెంటలైజ్ చేశాడు. జరిగింది యేమిటంటే క్రికెట్ చురుగ్గా ఆడుతున్న రోజుల్లోనే అర్జున్ కి ఆరోగ్య సమస్య వచ్చి పరీక్షలు చేయించుకుంటే అతని హృదయానికి సంబంధించి వ్యాధి వున్నదనీ, అతను శారీరికంగా యెక్కువపాటి శ్రమకు లోనైతే ప్రమాదం కాబట్టి అతనికి క్రికెట్ ఆట శత్రువు లాంటిదనీ తెలుస్తుంది. ఇక మనసు చంపుకుని సారా తోడు చాలనుకుని వో ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడతాడు. అయితే ఈ విషయాన్ని ఆమెనుంచి దాస్తాడు. ఆమె కూడా అంత తేలికగా కట్టుడు కథ (స్పోర్ట్స్ లో రాజకీయాలు నచ్చవన్నది) నమ్మేస్తుంది. ఇక్కడ కొంత మింగుడు పడదు కథ. అవినీతి ఆరోపణ మీద సస్పెండ్ అయిన అర్జున్ ఖాళీగా వుంటూ టీవీలో క్రికెట్ చూస్తుంటాడు. ఆ సమయంలో అతనికి రెండు విధాలా ఫ్రస్ట్రేషన్ వుంటుంది. కాని కొసమెరుపు కోసం విషయాన్ని దాచిన దర్శకుడు అది ప్రకటించలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ అన్నా పదేళ్ళు ( లేదా నాలుగా? గుర్తులేదు) అలాగే కొనసాగుతుందా? మనిషి సర్దుకుని వేరే ప్రయత్నాలు చేయడా? ఇవి నమ్మబుధ్ధి కావు. ఇక క్రికెట్ ఆట వదిలి పదేళ్ళ తర్వాత మళ్ళీ అతను ఆ స్థాయిలో ఆడడం అంటే మామూలు చిత్రాలలో హీరో యేకకాలంలో 30 మందితో ఫైట్ చేసి తరమడం కంటే తక్కువ కామెడీ కాదు. కొడుక్కి జీవితాంతం దగ్గరుండి చూసుకోవడం, కొడుకు దృష్టిలో వొక హీరోగా మిగిలి అతన్ని సంతోష పెట్టడం మధ్య అతను రెండో దాన్ని యెంపిక చేసుకోవడం కూడా “హీరోగిరి” కాదు. మూస చిత్రాలకు భిన్నంగా తీస్తున్నాననుకుంటూ మళ్ళీ మూస చిత్రమే తీశాడు దర్శకుడు గౌతం. అంటారు కదా వొక్క అబధ్ధం దాయడానికి వెయ్యి అబధ్ధాలు ఆడాల్సి వస్తుందని. అలాగే వొక కొసమెరుపు కోసం అని చెప్పి చెప్పాల్సిన కథను నొక్కేసి, ఆ ఖాళీలను బోలు కథలతో నింపడం, సెంటిమెంటు పేరుతో లాజిక్ ను పూర్తిగా విస్మరించడం నిరాశ పరుస్తుంది. తన ఆరోగ్య పరిస్థితి తెలిసి విషయం అర్థం చేసుకుని తనపై ఆధారపడ్డ సారా ని దృష్టిలో పెట్టుకుని అతను తీసుకున్న నిర్ణయం అతని మానసిక పరిపక్వతకు నిదర్శనం. అయితే కొడుకు అమాయక, సాధారణ కోరికకు అంత విలువ ఇవ్వడం, మరో పక్క భార్య తర్వాతి నెలలో కట్టాల్సిన స్కూల్ ఫీజు కోసం అట్టే పెట్టిన డబ్బును కాజేయాలనుకోవడం అతి కాక మరేమిటి. వొక నిజమైన బాధా సందర్భానికి కంట తడి పెట్టుకుంటాం గాని మరి ఇలా ప్రతి చిన్న దానికీనా? కొడుకు మీద ప్రేమ వున్న తండ్రి ఆ కొడుకు బాగోగులకోసం ప్రత్యేకంగా పడ్డ శ్రమ గాని త్యాగం కానీ యెక్కడా కనబడవు. ఆటలో ప్రాణాలు కోల్పోయి కొడుకుని తండ్రిలేని అనాథను చేస్తాడు. ఆ సారా కష్టపడి కొడుకును ప్రయోజకుడిని చేస్తుంది. నిజమైన హీరో ఆమెనే ఈ లెక్కన. ఆమె భర్త తో సంబంధాలు చెడడం చూపించినా అది కన్విన్సింగ్ గా లేదు, యెందుకంటే ఆమె అతన్ని పిచ్చిగా ప్రేమించి, తల్లిదండ్రులనెదిరించి చేసుకుంది. అలాంటిది అతన్ని అర్థం చేసుకోవడంలో పొరబడటం, అతన్ని దారిలోకి తేలేకపోవడం లాంటి జరగగల ప్రయత్నాలేవీ మనకు తెర మీద కనబడవు. విచిత్రమే.

ఈ చిత్రానికి యేకైక బలం నాని నటనే. కాసేపు అతను మన చిత్రసీమలో వున్నందుకు మనల్ను మనం వీపు చరుచుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here