ఝుం… ఝుం…

0
7

[dropcap]రా[/dropcap]మారావు బాగా చెట్లూ, మొక్కలూ ఎక్కువగా వున్న స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టాలనుకున్నాడు. పక్కనంతా పంట పొలాలున్నాయి. కొద్ది దూరంలో పండ్ల తోటలూ వున్నాయి.

“ఎటు చూసినా చెట్టూ చేమా వున్నాయి. పురుగు పుట్రా వస్తాయి. ఇక్కడ ఇల్లు కట్టే ఆలోచన మానుకో” అని చాలా మంది సలహా ఇచ్చారు.

“కాదు కాదు. నేనిక్కడే ఇల్లు కడతాను. ఈ చెట్లు ఈ పచ్చదనం కోసమే నేను ఈ స్థలాన్ని కొనుకున్నాను” అని చెప్పాడు. అనుకున్నట్లుగానే అక్కడే ఇల్లు కట్టాడు. ఇల్లు పూర్తయింది.

ఆ రోజు గృహప్రవేశం. కిటికీ తలుపులు, బార్లాగా తెరిచివుంచారు.

“అబ్బ మంచి గాలి వీస్తున్నది. చల్లగా హాయిగా వున్నది” అని అందరూ మెచ్చుకుంటున్నారు. వాళ్ల మాటలు విని రామారావు దంపతులు బాగా సంతోషపడుతున్నారు. ఇంతలో గాలి రివ్వున వీస్తున్నట్లుగా శబ్దం వచ్చింది. ఒకరిద్దరు ఆ శబ్దం విన్నా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కొత్త ఇంటి హాల్లో పెట్టినటువంటి అందమైన షాండిలియార్‌ను వెలిగించారు. అందులో బల్బులు వరుసలు వరుసలుగా పేర్చివున్నాయి. అవి రెండు నిముషాలకొకసారి రంగులు మారుతూ వెలుతురును చిమ్ముతున్నాయి. వాటి వంక అందరూ ఆసక్తిగా చూసే సమయంలో మరోసారి ఝుమ్మన్న మోత దగ్గరగా వినపడింది.

‘ఏంటీ మోత?’ అనుకునేలోగానే ‘ఝుం…. ఝుం…’ అంటూ శబ్దం చేస్తూ తేనటీగలు గుంపుగా వచ్చాయి. తెరిచివున్న కిటికీ తలుపులులో నుంచి స్వేచ్ఛగా ఎగరుకుంటూ లోపలికి వచ్చేశాయి. ఒక పెద్ద ముసురులాగా వచ్చి హాలంతా కలియదిరిగాయి. ఆ తర్వాత కిటికీ పైగా గోడ మీద వాలి ఒక చోట కుప్పగా చేరాయి. చూస్తూ వుండగానే చిన్నకుప్ప కాస్తా పెద్దగా తేనపట్టు లాగా వేలాడ సాగాయి.

“అమ్మో తేనటీగలు. కొంపదీసి కొండీగలు కాదు కదా, ఇవి కుడితే చాలా ప్రమాదం” అనుకుంటూ బంధువులందరూ లేచి హాల్లోంచి ముందు వరండాలోకొచ్చేసారు. ఇంకొందమంది అయితే ఇంకా దూరంగా పోవటానికి చూస్తున్నారు.

అది చూసి రామారావు దంపతులు చాలా బాధపడ్డారు. ఇల్లు కట్టేటప్పుడు కూడా ఎప్పుడూ రాని తేనటీగలు ఇప్పుడెక్కడ నుండి వచ్చాయ వారికర్థం కాలేదు. తేనటీగల ఝుంకారం మాత్రం ఆగకుండా వినపడుతూనే వున్నది. వీటినిక్కడ నుండి ఎలా వెళ్లగొట్టలా అన్న ఆలచనలో రామారావున్నాడు.

“నిప్పుసెగో, పొగో చూపించండి, అవి వెళ్లిపోతాయి” అని ఎవరో సలహా ఇచ్చారు.

పెద్దకండువాను తీసుకుని తల మీదగా కప్పుకున్నాడు రామారావు. చేతి గుప్పిడ నిండా అగరువత్తుల్ని వెలిగించి పట్టుకున్నాడు. వాటి నుండి పొగా, చిన్న మంటా రాసాగింది. దానిని తేనెపట్టు దగ్గరగా తీసుకెళ్ళాడు. ఆ పొగ వాసన తగలగానే రాణీ ఈగ పసికట్టేసింది. అది అన్నింటి కంటే ఆకారంలో కూడా పెద్దగా వుంది.

“పదండి పోదాం. ఈ చోటు విడిచి పెట్టిపోదాం. లేకుంటే ఇబ్బంది పడతాం” అంటూనే ఝుమ్మంటూ నాదం చేస్తూ ఎగిరి వెళ్లింది.

“వస్తున్నాం రాణీ ఈగ” అంటూ దాని కంటే కాస్త చిన్న సైజులో వున్న పోతుటీగలు బయలుదేరాయి.

“మేమూ వస్తున్నాం” అంటూ చిన్న ఈగలూ బయలుదేరాయి. అవన్నీ కలిసి వచ్చేటప్పుడు ఎలాంటి రొద వినపడిందో మరలా అలాగే రొద చేసుకుంటూ ఎగిరిపోయాయి.

‘అమ్మయ్య’ అనుకున్నారు కొత్త ఇంటిలోని వాళ్లు.

***

రాణీ ఈగ ఎగురుతూనే మాటలు మొదలు పెట్టింది. నేనసలు ఆ చిన్న రాణీని చంపేసి వుందును. బలమైన నా కొండెంతో ఆ చిన్న రాణి మైనపు గదిని పొడి పొడి చేసే దాన్ని. పోతుటీగలూ, మీ కూలీ ఈగలూ అందరూ కలిసి నన్ను ఆపివేశారు. అలా ఆపకపోతే ఈ పాటికి చిన్న రాణీ చచ్చివుండేది. మన పాత చెట్లనే మన తేనెపట్టు వుండేది. అదేమో హాయిగా అక్కడే వున్నది. మనమందరం కలిసి ఇలా అగచాట్లు పడుతున్నాం. మీ మాట విని పెద్ద రాణీని అయిన నేనే ఇలా బయటకొచ్చేసాను. నాతో పాటు మీరూ వచ్చారు. మనందరం కలిసి మళ్లీ మంచి పెద్ద తేనె పట్టు పెడదాం…” అన్నది.

“అవును. మహారాణీ, మేమంతా కలిసి ముప్పైవేలకు పైగానే వున్నాం. మీరూ పోతుటీగలూ, కలిసి పెట్టిన గుడ్లును మేం జాగ్రత్తగా కాపాడుతాం. ఆ గుడ్లల నుంచి వచ్చిన లార్వాలను కంటికి రెప్పలాగా చూస్తాం. ఆ తర్వాత వాటికి ఆహారం తినిపిస్తాం. అవి పెరిగే కొద్దీ మేం మరింత కష్టపడతాం. మీరన్నట్లుగానే ఆడవారైన మీరు, మగవారైన పోతుటీగలూ, మా కూలీ ఈగల్లోనూ ఆడవే ఎక్కువ వున్నాయినుకోండి, అందరం కలిసిమెలిసి వుందాం. పెద్ద తేనేపట్టును కడదాం. ఏ తేనెపట్టులోనైనా జరిగేది ఇదేగా రాణీ. మనదంతా ఒక కుటుంబం. ఆ కుటుంబానికి సరిపోయే ఆహారాన్ని సంపాదించుకొచ్చేది మేమేగా” అన్నాయి కులీ ఈగలు.

“అవునవును. పూలలో పుప్పొడి బాగావున్న వాటిని చూసుకుని దాంట్లో వున్న అల్ట్యుమిన్‌ను తీసుకోవటం వలన అది మన జాతికి మంచి ఆహారమవుతుంది. అలా ఎంచుకునే తెలివితేటలన్నీ మీవే గదా చిన్న ఈగలు. ఆ తర్వాత ఆ ఆహారం ద్వారానే గదా మైనాన్ని స్రవించి మైనపు గదులు కడతారు. ఇదంతా మీ శ్రమే. శ్రమ పడుతున్నారని మిమ్మల్ని కూలీగలు అనటానికి నాకు నోరు రావటం లేదు” అన్నది పోతుటీగ.

పోతుటీగ మాటలకు రాణీ ఈగ నవ్వుతూ “అంతేనా ఆ తర్వాత మనం పెట్టిన గుడ్లను జాగ్రత్తగా చూస్తాయి. ప్రతి గదిలోకి తిరిగి ప్రతి లార్వాకు ఆహారం పెడతాయి. అన్నింటికీ పాలలాంటి చిక్కటి ద్రవాన్ని తాగిస్తాయి. అన్ని మైనపు గదులనూ శుభ్రం చేస్తాయి. కొంత మంది పోగుచేసి తచ్చిన పూల తేనెను జాగ్రత్తగా అందుకుని అన్నిటికీ సమానంగా పంచుతాయి. ఇంకా ఎంత జాగ్రత్తగానో తేనెపట్టును కాపలాకాస్తాయి. అంది రాణీ ఈగ మెచ్చుకోలుగా.

“మీరు మాత్రం కష్టపడటం లేదా రాణీ. మరో రాణీ ఈగను తయారు చేయాలి. పోతుటీగలనూ మాలాంటి కూలీ ఈగలను సంబాళించాలి. మా గదిలో పెరిగే లార్వాకు మరింత ఎక్కువ బలవర్ధమైన పాల పదార్ధాన్ని ఇస్తాం. అప్పుడది పెరిగి పెద్ద ప్యూపాగా పెరుగుతుంది. పువ్వు పువ్వూ తిరిగి మకరందాన్ని తాగుతాం. తిరిగి వచ్చి ఆ మకరందాన్ని మన మైనపు గదుల్లో విడిచిపెడతాం. ఆ మకరందమే గదమ్మా తర్వాత తర్వాత చిక్క బడి స్వచ్ఛమైన తేనెగా మరేది. మేం మరింత మందిని వెంట బెట్టుకుని వెళ్లి మరిన్ని పూలల్లోని మకరందాన్ని తాగి వస్తాం. పాత తేనెపట్టును మంచి ఇంకా బ్రహ్మాండమైన తేనె పట్టును, తయారు చేద్దామమ్మా. అలా చేయటం మా బాధ్యత అమ్మా” అన్నాయి కూలీ ఈగలు.

“మీరెంత విశ్వాసపరులో నాకు తెలియదా? చిన్నరాణిని నా కొండంతో పొడవనీయకుండా అడ్డుకున్నారని కోపం వచ్చింది. అదంతా ఇప్పుడు మర్చిపోయాను. మన తేనెపట్టుల్లోని తేనె చాలా స్వచ్ఛమైనది. మనం మానవులకు తేనె నందిస్తున్నాం. ఇంకా చాలా ఉపయోగాలు చేస్తున్నాం. అదేంటంటే మనమంతా ఒక పువ్వు మీద నుండి మరో పువ్వు మీదకు వాలతాం. అలా వాలినప్పుడు మన శరీరానికంటుకున్న పుప్పొడి మరో పువ్వుకంటుకుంటుంది. దాని వలన పరాగసంపర్కం జరుగుతున్నది. దీని వలన మంచి విత్తనాలు ఏర్పడుతున్నయి. పంటలో అభివృద్ధి జరుగుతున్నది. మన జాతి తక్కువైతే పంటల అభివృద్ధి కూడా తగ్గిపోతుంది తెలుసా?” అన్నది రాణీ ఈగ.

“ఇవన్నీ మాకు తెలియవు రాణీ! ఏదో మీరు చెప్పిన పనులు చేయటమే గాని” అన్నవి కూలీ ఈగలు.

“అంతే కాదు రాణీ ఇది వరకు మనం చెట్లు కొమ్మల మీద, లేదా చెట్ల తొఱ్ఱలలోన, పాత ఇంటి గోడల సందులలోన తేనెపట్లు పట్టే వాళ్లం. కాని ఈ నాటి మానవులు మన తేనె పట్ల ఎక్కువగా పెంచటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కృత్రిమంగా ముసురు తయారు చేసి దాని దగ్గరకు మనల్ని ఆకర్షించాలని చూస్తున్నారు. నేలలో గుంటలు తవ్వి ప్రయత్నిస్తున్నారు. చెక్క పెట్టెల్లో చట్రాలు పెట్టి వాటిల్లో ఖాళీ తేనె తుట్టలు పేరుస్తున్నారు. ఆ తుట్టల్లో పంచదార పాకమో, కాస్త తేనె చిలకరించ మనకు ఎరవేస్తున్నారు. మనం పువ్వు పువ్వుకూ తిరిగి స్వచ్ఛమైన మకరందాన్ని తాగి కమ్మని తేనెను తయారు చేసి వుంచుతున్నాం. బుద్ధిలేని మానవులు ఆ తేనెను పిండుకుని దాంట్లో బెల్లపు పాకమో, మరొకట, మరొకట కలుపుతున్నారు. అంతే కాకుండా అచ్చంగా తుక్క బెల్లాన్ని పల్చని పాకంగా చేసి నానారకాల రసాయనాలు కలిపి బజార్లో తేనె అని అమ్ముతున్నారు. అది తాగిన జనం రోగాల బారిన పడుతున్నారు. అంతా నాశనం చేసేస్తున్నారు” అన్నదో పోతుటీగ బాధగా.

“ఇది వరకటి రోజుల్లో ఆయుర్వేద వైద్యులందరూ తమ మందుల్లో మన తేనెనే కలిపి రోగులకిచ్చేవారు. ఎంత మంచి రోజులు అవి. పుట్టినది మొదలు పిల్లలకు ఎన్న సందర్భాలలో మన తేనెనే, నాకించి వాళ్లను బలిష్టులుగా తయారు చేసేవారు. ఇప్పుడంతా మార్పే. తేనె బదులు ఇండీషను బుడ్డిలు నుంచి తీసిన నీటిని తాగిస్తున్నారు. ఎక్కడ చూసినా కల్తీయే కనపడుతున్నది. తినే దాంట్లోనూ, తాగే దాంట్లోనూ అంతా కల్తీ చేసుకుని వాళ్ల జీవితాలే కల్తీ మయం చేసుకుంటున్నారు” అన్నది రాణీ ఈగ.

“అవునవును. రాణీ మీరు చెప్పింది నిజం. మేం ఆ తోటా ఈ తోటా తిరుగుతూ ప్రపంచాన్ని చూస్తున్నాం. మానవులు ఒక నాటికి వాళ్లే తెలుసుకుంటారు. మనం మాత్రం మంచి చోటు చూసుకుని తేనెపట్టు పెట్టుకుని ఎప్పటిలాగే శ్రమిద్దాం. శ్రమపడటం మన బాధ్యత. మేలు చెయ్యటం మన కర్తవ్యం కూడాను” అన్నవి కూలీ ఈగలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here