జోక్స్!!… చెప్పేదెలా?… వినేదెలా?

48
10

[dropcap]“న[/dropcap]వ్వు నాలుగు విధాలా చేటు”

… అది ఒకప్పటి మాట!

 “నవ్వు నాలుగు విధాలా మేలు”

… అది ఈనాటి మాట!

ఒకప్పటి మాటను ప్రక్కన పెట్టి, ఈనాటి మాట గురించి తెలుసుకుందాం…

***

ఒకటి: నవ్వు నాలుగు విధాలా మేలు… ఏ విధంగా?

  1. ఎవరైనా నవ్వినప్పుడు వారి ముఖంలో రక్త ప్రసరణ సరైన రీతిలో జరుగుతుంది. అందువలన ముఖ వర్చస్సు పెరుగుతుంది. ముఖం తేజోవంతంగా వెలుగుతుంది. అందాన్ని ఇనుమడింప జేస్తుంది. పైబడుతున్న వయస్సును తెలియకుండా చేస్తుంది.
  2. నవ్వుతున్న ముఖంతోనే మనసులోని ఆనందం, సంతోషం ఎదుటి వారికి తెలుస్తుంది. ఆ నవ్వుతోనే ఇతరులచే ఆకర్షించబడతారు. వారి మనసులను గెలవగలుగుతారు. శత్రువు కూడా నవ్వుతున్న ముఖాన్ని చూసి శాంతిస్తాడు.
  3. మధ్యమధ్యన జోకులు చెప్తూ సంభాషణ చేసే వారిని, ప్రసంగించే వారిని, ప్రేక్షకులు, శ్రోతలు చాలా గౌరవిస్తారు. వారి మాటల పట్ల మోజు పెంచుకుంటారు. వారు చెప్పిన విషయాలను ఆమోదిస్తారు కూడా.
  4. అంతెందుకు… నవ్వు ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో తెలుసుకోవాలంటే, ఈ క్రింది వాక్యం చదవండి…

యు ఆర్ నాట్ ఫుల్లీ డ్రెస్డ్, అన్‌లెస్ యు వేర్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్”

అంటే…

“మీరు ఎంత ఆధునిక దుస్తులు ధరించినా… ఎంత విలువైన ఆభరణాలతో అలంకరించుకున్నా, మీ ముఖంపై అందమైన చిరునవ్వు లేకపోతే… మీరు సంపూర్ణంగా తయారైనట్లు కాదు…” అని వివరించవచ్చు.

***

రెండు: మనం నవ్వకపోతే నష్టం ఏంటి?

  1. నవ్వడం… ఒక భోగం… నవ్వించడం… ఒక యోగం… నవ్వలేకపోవడం… ఒక రోగం…
  2. నిజమే… ముఖం పైన నవ్వు లేకపోతే జీవకళ వుండదు.
  3. మిత్రులు గాని, బంధువులు గాని నవ్వకుండా వుండే వారితో కలిసిమెలిసి వుండటానికి ఇష్టపడరు. వారిని చూసి భయపడుతారు కూడా.
  4. అందుకే… ప్రతి ఒక్కరూ ఎప్పుడూ నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించాలి. అలాగని కృత్రిమంగా నవ్వకూడదు. నవ్వు సహజంగా రావాలి. అప్పుడే అది నిజమైన నవ్వు. ఆశించదగ్గ నవ్వు.
  5. నవ్వు యొక్క లాభాలను పొందడానికి కొంత మంది ‘లాఫింగ్ క్లబ్స్’‌లో కూడా సభ్యులుగా చేరతారు. దినంలో కొద్ది సమయం విధిగా నవ్వడానికి కేటాయిస్తారు.
  6. అభివృద్ధి చెందిన కొన్ని పాశ్చాత్య దేశాల్లో నవ్వులతో జబ్బులు కూడా నయం చేస్తున్నారట! ఆ ప్రక్రియను ‘లాఫింగ్ థెరపీ’ అని పిలుస్తారు.

***

మూడు: నవ్వడానికి, నవ్వించడానికి మనకు అందుబాటులో ఉన్న మార్గాలెంటి?

  1. సినిమాల్లో, సీరియల్స్‌లో, నాటకాల్లో హాస్య నటీనటులు, హాస్య సన్నివేశాల్లో నటిస్తూ మనల్ని నవ్విస్తారు.
  2. స్కిట్స్, మిమిక్రి, మైమ్, వెంట్రిలాక్విజమ్, మొదలైన ఆధునిక ప్రక్రియలతో మనల్ని నవ్విస్తారు కొందరు.
  3. జోక్స్ చెప్పి మనల్ని కడుపుబ్బ నవ్విస్తారు మరి కొందరు.

***

ఇకపై మిగతా మార్గాలను ప్రక్కన బెట్టి, జోక్స్‌తో నవ్వించడం, నవ్వడం గురించి ఎక్కువగా తెలుసుకోనేందుకు ప్రయత్నం చేద్దాం.

***

నాలుగు: జోక్స్ చెప్పే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?

  1. జోక్స్ చెప్పే వ్యక్తి, చెప్పడం మొదలు పెట్టే ముందే… “జోకులనేవి కేవలం నవ్వుకోడానికి మాత్రమే… ఎవరినీ బాధ పెట్టడానికి గాని, అవమాన పరచడానికి గాని కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు…” అని వినే వారికి విన్నవించుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం.
  2. సభలో మన ఎదురుగా కూర్చున్నవారు… పిల్లలా… పెద్దలా… లేక ఇద్దరూ వున్నారా? స్త్రీలా… పురుషులా… లేక ఇద్దరూ వున్నారా? వీటితో పాటు, కులం, మతం, ప్రాంతం… వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని, సభలో, ఆ సమయంలో ఎలాంటి జోకులు చెప్పాలి, అని నిర్ణయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకుంటే, ఎవరి విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు భంగం వాటిల్లకుండా చూసుకుని, జోక్స్‌ని ఎంపిక చేసుకుని చెప్పాలి.
  3. చెప్పే జోక్ వినేవారికి అర్థమయేట్లు, అవసరం అనుకుంటే కొంచెం ఉపోద్ఘాతం చెప్పి అయినా సరే, వివరంగా చెప్పాలి. అప్పుడే వినేవారికి ఆ జోక్ సారాంశం పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడే వారు ఆనందంతో హాయిగా నవ్వగలుగుతారు.
  4. జోక్ చెప్పినప్పుడల్లా… ప్రేక్షకుల/శ్రోతల యొక్క స్పందన ఎలా వుంది… అని గమనించాలి. ఆశించినంతగా వుంటే సరి… లేకపోతే… ఇంకోసారి మరలా ఆ జోక్ మరెక్కడైనా చెప్పాల్సి వస్తే, ఆ చెప్పే విధానాన్ని, అవసరమైన మేరకు మార్పు చేసుకోవాలి. అంటే… ప్రతి జోక్‌కి సభికుల యొక్క స్పందనని గమనిస్తూ, ఆ జోక్‌ని, ఇంకా బాగా ఎలా చెప్పవచ్చు అని అధ్యయనం చేయాలి. ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగాగలి.
  5. సందర్భానికి తగ్గట్లు, చెప్పే జోక్స్‌ని ఎన్నుకోవడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదాహరణకు : బడిలో విద్యార్థులకు చెప్పేటప్పుడు, తరగతి గదుల్లో జరిగే సంఘటనల ఆధారంగా జోక్స్ చెప్తే బాగుంటుంది. క్రీడా మైదానంలో క్రీడాకారులకు జోక్స్ చెప్పేటప్పుడు, క్రీడలు, క్రీడాకారులు, ప్రేక్షకులకు సంబంధించిన విషయాలతో జోక్స్ చెప్పాలి. అలాగే, గుడి, ఆసుపత్రి, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎగ్జిబిషన్‌లకు సంబంధించిన జోక్స్‌ను ఆయా సందర్భాలను బట్టి చెప్పవచ్చు. అలాగే, బహుమతులు, విరాళాలు, ఇలా చెప్పుకుంటే, జాబితా చాలా పెద్దదే అవుతుంది. ఆ సందర్భానికి తగ్గ జోకులు చెప్పగలిగితే, ఆశించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తుంది.
  6. వేదిక మీద జోక్స్ చెప్పే వ్యక్తి, తన హోదాను, సమాజంలో తన స్థాయిని, అలాగే జోక్స్ వింటున్న వారి హోదాలను, సమాజంలో వారి స్థాయిలను పూర్తిగా ప్రక్కన పెట్టాలి. కేవలం తను ఎదుటి వారిని నవ్వించడానికి మాత్రమే, ఆ సమయంలో వేదికపై వున్నానని గుర్తెరగాలి. అప్పుడే జోక్స్ చెప్పే వ్యక్తి తను చెప్పే జోకులకు న్యాయం చేకూర్చగలుగుతాడు. అందర్నీ సునాయాసంగా నవ్వించగలుగుతాడు.
  7. జోక్స్ చెప్పే వ్యక్తి, ఆ రోజు సభలో, సందర్భానికి తగ్గట్లు, ఏయే జోకులు చెప్పాలో నిర్ణయించుకుని, వాటి జాబితాను తయారు చేసుకోవాలి. ఇక ఆ జోకులను ఎంత బాగా చెప్పాలో ముందుగానే అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేసేటప్పుడు ముఖ కవళికలను, హావభావాలను, శారీరక కదలికలను, పదాల ఉచ్చారణను, నిశితంగా గమనిస్తూ అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. జోక్స్ చెప్పే వారైనా మరే ఇతర కళాకారుడైనా, తన ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించడంలో విజయం సాధించాలంటే అభ్యాసం తప్పనిసరి. అందుకే అంటారు… ‘అభ్యాసం కూసు విద్య’… అని.
  8. జోక్స్ వినేవాళ్ల అంచనాలు చాలా ఎక్కువగా వుంటాయని, చెప్పే వాళ్లు నిరంతరం గుర్తుంచుకోవాలి. ఒకసారి నేను ఒక సభలో జోక్స్ చెబితే, చాలా మంచి స్పందన లభించింది. అందరూ ఆనందించారు. అభినందించారు కూడా. అప్పుడే ఆ సభలోంచి ఒక వ్యక్తి వేదిక పైకి వచ్చి, “జోక్స్ బాగానే నవ్వించాయి. కాని… మరీ పొట్ట చెక్కలయ్యేంతగా నవ్వి, క్రిందపడిపోయి దొర్లాడే అంత గొప్పగా లేవు.” …అని చెప్పాడు. అప్పుడు నా కర్థమయింది. జోక్స్ వినేవాళ్ళ అంచనాలు ఎంత ఎత్తున ఉంటాయో… అని. అది దృష్టిలో పెట్టుకుని జోక్స్ చెప్పేవాళ్లు, తమ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. అప్పుడే విజయాలను సొంతం చేసుకోగలుగుతారు… జోక్స్ చెప్పే వాళ్ళు.
  9. జోక్స్ చెప్పే వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోకులు కోసం అన్వేషించాలి. పత్రికల్లో చదివిన జోక్స్, కార్టూన్స్, సినిమాల్లో చూసే హాస్య సన్నివేశాల ఆధారంగా మనకు అనువైన రీతిలో జోక్స్‌ని తయారు చేసుకోవాలి.

ఇంకో ముఖ్యమైన విషయం: కధలుగాని, నాటకాలుగాని, నవలలు గాని, ఆ మాటకొస్తే, జోక్స్ గాని… ఆకాశం నుండి రాలిపడే వర్షపు నీటి బొట్లలా, వాటంతటవే మన దగ్గరకు రావు. మనమే వాటి కోసం వెతుకోవాలి. వెతుక్కోవడం మంటే, ఎక్కడికో వెళ్ళి వెతుక్కోనవసరం లేదు. మన దైనందిక జీవితంలో, మన ఇంట్లో, మన స్నేహితుల ఇళ్లల్లో, మన బంధువుల ఇళ్ళల్లో, మన వీధిలో, మన చుట్టూ వున్న సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనల నుండి జోక్స్‌ని తయారు చేసుకోవచ్చు. అందుకు కావలసినదల్లా సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన, సంఘటన పట్ల సునిశితమైన పరిశీలన. అప్పుడు జోక్స్‌కి కొదవే వుండదు. పైగా అలాంటి జోకులు కొత్తదనంతో, సహజంగా గుణకరంగా, ఉపయోక్తంగా , అందరికీ నచ్చేవిగా, అందరినీ నవ్వించేవిగా ఉంటాయి. ప్రయత్నిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ వుండదు.

  1. జోక్స్ చెప్పే వాళ్లు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం…

జోక్స్‌ని మూడు విభాగాలుగా చూడడం..

మొదటిది: జోక్ చెప్పేటప్పుడు, దాంట్లో కర్తగా ఎదుటి వారిని మాత్రమే తీసుకోవడం… అంటే… ఎదుటి వారిపై జోకు చెప్పడం…

ఇది… ‘అధమం’ …

రెండోది: జోక్ చెప్పేటప్పుడు, దాంట్లో కర్తలుగా తనను, ఎదుటి వారిని కలిపి తీసుకోవడం… అంటే… కేవలం ఎదుటి వారి పైనే కాకుండా, తనను కూడా కలుపుకుని జోక్ చెప్పడం…

ఇది… ‘మధ్యమం…’

మూడోది: జోక్ చెప్పేటప్పుడు… దాంట్లో కర్తగా తనని మాత్రమే తీసుకోవడం అంటే… తనపైన తానే జోకు చెప్పడం.

ఇది… ‘ఉత్తమం…’

ఇక్కడ ఎదుటివారు అంటే… ఇతరులు, వారి కుటుంబ సభ్యులు… తను… అంటే… జోక్స్ చెప్పే వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు… అని గ్రహించాలి. ఇక అసలు విషయానికొస్తే…

⦁ ఎక్కువగా ఉత్తమ విభాగానికి చెందిన జోకులు చెప్పాలి.

⦁ తక్కువగా మధ్యమ విభాగానికి చెందిన జోకులు చెప్పాలి.

⦁ సాధ్యమైనంత వరకు, తప్పనిసరి పరిస్థుతుల్లో తప్ప అధమ విభాగానికి చెందిన జోకులు చెప్పకపోవడమే మంచిది.

ఎ. జోక్స్‌ని మరో రెండు విభాగాలుగా చూడవచ్చు…

మొదటిది: ఈ రకమైన జోకులు, అన్ని సందర్భాలలో సందర్భోచితంగా నిర్భయంగా, నిరభ్యంతరంగా చెప్పవచ్చు. అవి ‘క్లీన్ జోక్స్…’ దోషరహితమైనవి.

రెండోది: ఈ రకమైన జోకులు, దాదాపుగా, పది మందిలో చెప్పదగినవి కావు. సెక్స్ కార్యకలాపాలను ఆధారంగా చేసుకుని చెప్పే జోకులు ఈ కోవకు చెందుతాయి. సాధారణంగా జోక్స్ చెప్పేవాళ్ళు, ఈ రకానికి చెందిన జోకులను అసలు చెప్పకుండా ఉండటమే శ్రేయస్కరం. అవి ‘డర్టీ జోక్స్’… దోష సహితమైనవి. వీటి విషయంలో జోక్స్ చెప్పే వాళ్ళు, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా వుంది.

***

ఐదు: జోక్స్ వినేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి నియమాలు పాటించాలి?

  1. ముందుగా జోక్స్ వినేవాళ్ళు, “జోకులనేవి కేవలం నవ్వుకోడానికి మాత్రమే… ఎవరినీ బాధ పెట్టడానికిగాని, అవమాన పరచడానికిగాని కాదు” అని అర్థం చేసుకోవాలి. విని ఆనందించాలి. అంతే!
  2. ముందుగా జోక్స్ వినేవాళ్ళు, వేదికపై నిల్చుని తమకు జోక్స్ చెప్పే వ్యక్తి కేవలం తమను నవ్వించడానికి, తమను ఆనందపరచడానికి వేదికపై ఉన్నారని మాత్రమే గుర్తెరగాలి. ఆ వ్యక్తి హోదా చిన్నదా, పెద్దదా, సమాజంలో అతని స్థాయి తక్కువా, ఎక్కువా అనే ఆలోచనకు తావివ్వకుండా, ఆ వ్యక్తిపై గౌరవ భావం ఏర్పరుచుకోవాలి. అక్కడున్న వారిలో అతి కొద్దిమంది మాత్రమే చేయగల సేవ, వేదిక పైన వున్న వ్యక్తి మన కోసం చేస్తున్నాడనే విశ్వాసం వినేవారు పెంపొందించుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి చెప్పే జోకులను అర్థం చేసుకోగలరు, ఆనందించగలరు. తత్ఫలితాన్ని చవిచూడగలరు…
  3. ఒక వ్యక్తి జోక్ చెప్తున్నప్పుడు, వినేవారు చాలా శ్రద్ధగా, మనసు పెట్టి వినాలి. ఎందుకంటే, ఆ జోక్‍లో ఏ ఒక్క పదం వినలేకపోయినా, ఆ జోక్‌ని వినేవారు అర్థం చేసుకోలేరు. నవ్వలేరు. తద్వారా ఆశించిన ఫలితం పొందలేరు. ఉదాహరణకు ఈ జోక్ చూడండి:

ప్రతి రోజూ ఆఫీసు నుండి సాయంత్రం అరు గంటలకు ఇంటికొచ్చే భర్త, ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకే ఇంటి కొస్తే ఆశ్చర్యపోయిన భార్య ఇలా అడుగుతుంది.

“ఏంటండీ! రోజూ సాయంత్రం ఆరుగంటలకు ఇంటికొచ్చే మీరు, ఈ రోజేంటి నాలుగు గంటలకే వచ్చారు… ఏంటి విశేషం?”

“ఆ! ఏం లేదు… ఈ రోజు మా ఆఫీసరు గారికి, నా పైన బాగా కోపం వచ్చింది. ఆ కోపంలో… ‘గో.. టూ… హెల్’ అన్నారు.. వెంటనే ఇంటి కొచ్చా!”

చూశారుగా! ఈ జోకులో హెల్ అనే మాటను వినలేకపోయారునుకోండి… ఆ జోక్‌ను ‌సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. నవ్వలేరు. ఆనందించలేరు. అందుకే జోక్స్‌ను వినే వాళ్ళు శ్రద్ధగా వినాలి.

  1. జోక్ చెప్పే వ్యక్తి జోక్ చెప్పడం మొదలెట్టి కొంచెం చెప్పగానే, కొంతమంది వినేవాళ్ళు ఆ జోక్‌ను ఇంతకుముందే విన్నట్లు గుర్తుకొచ్చి, ఈ జోక్‌ను ఎప్పుడో విన్నామని పెదవి విరుస్తారు. కాని… ఇక్కడో విషయం గమనించాలి. ఒకే జోక్‌ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చెప్తారు. కాస్తాకూస్తో మార్పు కూడా చేస్తుంటారు. వినేవారు… ఇంతకు ముందు విన్నదానికి భిన్నంగా, ఇప్పుడు వినబోయేది ఇంకా బాగుంటుందని విశ్వసించి వినాలి. అంతే కాని, వినకుండా వుండకూడదు. వినాలి, ఆనందించాలి. కొంతమంది… ఈ జోక్ మేము ఎప్పుడో విన్నామని, ఆ ప్రక్కన ఈ ప్రక్కన వున్న వాళ్లకు చెప్తూ… వారి ఆనందానికి కూడా ఆటంకం కలిగిస్తుంటారు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే… అవతలివారు ఆ జోక్‌ని అంతకు ముందు వినలేదేమో!
  2. జోక్స్ వినేవారు, ఆ జోక్ నచ్చితే, అంతే బాగా నవ్వాలి… ఆనందించాలి… అంతే గాని, నవ్వితే ప్రక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని నవ్వడం మానేయకూడదు. కొంతమందైతే… కుడి ప్రక్కన వాళ్ళు, నవ్వుతున్నారా… ఎడమప్రక్కన వాళ్ళు నవ్వుతున్నారా… ముందున్నవారు నవ్వుతున్నారా… వెనుకున్నవారు నవ్వుతున్నారా… అని నిర్ధారించుకున్న తరువానే వాళ్ళు నవ్వుతారు. అదీ కృత్రిమంగా…

కొంత మందైతే… హాయిగా నవ్వాలనిపించినా… నవ్వకుండా… ఆ నవ్వును తమలోనే అణిచి పెట్టుకుంటారు. వారికి అసలు విషయం తెలియదు పాపం.

ఆ మధ్య శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో తేలిన విషయం… అలా అణిచిపెట్టుకున్న నవ్వు… అలా… అలా… క్రిందకు జారి పిరుదులను వెడల్పు చేస్తుందట! అలాంటి దుష్పరిణామం బారిన పడకుండా వుండాలంటే, వచ్చే నవ్వును అణచి వేయకూడదు. హాయిగా నవ్వాలి… ఆనందించాలి…

  1. జోక్స్ విని ఆనందించిన విన్నవారు, తమ సంతోషాన్ని వెలిబుచ్చాలి. నవ్వుతూ చప్పట్లు కొడుతూ జోక్స్ చెప్పిన వారిని అభినందించాలి, ఉత్సాహపరచాలి. ప్రొత్సహించాలి, మెచ్చుకోవాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే, వినేవారి మెచ్చుకోళ్ళు, ఆ జోక్స్ చెప్పే వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వారి యొక్క నైపుణ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు దోహద పడతాయి. అలాగే… చప్పట్లు కొట్టేవారి రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు! అలా చప్పట్లు కొట్టేటప్పుడు, అర చేతిలో, చేతి వ్రేళ్ళలో ఉండే నాడీ మండల వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. తద్వారా శరీరంలోని నాడీ మండల వ్యవస్థ మొత్తం ఉపయుక్తంగా ప్రభావితమవుతుంది. ఎనలేని ఉపయోగం కలుగుతుంది. ఆ మాటకొస్తే, ఏ కళాకరునికైనా, ప్రేక్షకులు లేదా శ్రోతలనుండి చప్పట్ల ద్వారా అభినందనలు లభిస్తే, ఆ కళాకారుని సంతోషానికి, ఆనందానికి అవధులుండవు.

అందుకే… జోక్స్ చెప్పే వారిని కూడా హృదయపూర్వకంగా అభినందించాలి… వినేవారంతా…

  1. జోక్స్ వినేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. వివరాల్లోకి వెళ్తే…

జోక్స్ విని నవ్వే వాళ్ళ నవ్వుల్లో అనేక రకాలుంటాయి.

మందహాసము, ధరహాసము, అట్టహాసము, వికటాట్టహాసము…

అలాంటివి చాలా వున్నాయి. వాటన్నింటిలో, అత్యంత ప్రమాదకరమైనవి రెండు రకాలు.

మొదటిది – బాదుడు నవ్వు… అంటే… కొంతమంది జోక్ విని నవ్వేటప్పుడు, ఆ ప్రక్కన ఈ ప్రక్కన ఉన్నవారి భుజాలపై తమ చేతులతో బాదుతుంటారు. ఆ బాదుడుకు తట్టుకోవడం చాలా కష్టంగా వుంటుంది. సాధ్యమైనంత వరకు అలాంటి వారి ప్రక్కన కూర్చోకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది.

రెండోది – జల్లు నవ్వు… అంటే… కొంతమంది జోక్ విని నవ్వేటప్పుడు వారి నోటి నుండి తుంపర్లను వర్షపు జల్లు మాదిరిగా, ఆ ప్రక్కన ఈ ప్రక్కన వున్నవారిపై చిందిస్తూ వుంటారు. ఆ తుంపర్లు ముఖం పైన పడుతుంటే చాలా ఇబ్బందికరంగా వుంటుంది. ఆ బాధ వర్ణనాతీతం. అందుకే… అలాంటి వారి ప్రక్కన కూర్చోకుండా అత్యంత జాగ్రత్తపడాలి.

***

మరి జోక్స్ చెప్పడం గురించి, వినడం గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా!

మరింకేం…

మంచి మంచి జోక్స్ చెప్పి, అందర్నీ కడుపుబ్బ నవ్వించండి!

శ్రద్ధగా జోక్స్‌ని విని నోరారా నవ్వండి!!

ఆల్ ది బెస్ట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here