జోలపాటలో ఊయలలూగే అమ్మదనం!-2

1
11

[నంద్యాల సుధామణి గారు రచించిన ‘జోలపాటలో ఊయలలూగే అమ్మదనం!’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగము.]

3.జోలపాట

ఇంకా నిద్రపోకుంటే.. అమ్మకు కోపం వస్తుంటుంది. ఊచీ ఊచీ చేతులు నొప్పిపెడుతుంటాయి. తన బహిఃప్రాణమైన తన బిడ్డయినా సరే.. రెండు దెబ్బలు వేయాలన్నంత విసుగు వస్తుంది.

– “రావెరావే పిట్ట రతనాల పిట్టా..

కోల తేవే పిట్ట చిన్నోడి(చిన్నమ్మ)ని కొట్టా.. (చిచ్చీ.. హాయీ)” అని కర్ర తెమ్మని రత్నాలపిట్టను పురమాయిస్తుంది.

“బూచివాడా రారా బుట్టల్లుకోనీ..

బుట్టలోని పిల్లవాడిని మాకిచ్చిపోరా.. చిచ్చీ హాయీ”

“నువ్వు నిద్రపోకుండా సతాయిస్తుంటే బూచివాడొచ్చి బుట్టలో ఎత్తుకుపోతాడు చూడు..” అని బెదిరిస్తుంది.

 కానీ, ‘బుట్టలో మా బాబును ఎత్తుకొని పోరా’ అని మాటవరసకు కూడా అనలేదు. ‘నీ బుట్టలో వున్న మా పిల్లవాడిని మాకిచ్చిపోరా’ అంటుంది.. మాట మార్చి.

ఇంతలో పుట్టింటి దగ్గర్నుంచి జాబు రాలేదే.. అందరూ ఎట్లా వున్నారోనని గుర్తొస్తుంది అమ్మకు.

 – “చిలకల్లు చెలరేగి

జీడికొమ్మెగురూ..

హంసల్లు చెలరేగి అరటి కొమ్మెగురూ.. మా

చిన్నోడు చెలరేగి మామ భుజమెగురూ.. చిచ్చీ.. హాయీ..”

..అని తన వాళ్లెవరైనా వస్తే బాగుండుననుకుంటుంది. తన అన్నదమ్ములు వచ్చి తన పిల్లవాడిని భుజాన వేసుకుని తిప్పితే చూడాలనుకుంటుంది.

ఇంతలో ‘పిల్లవాడికి (పిల్లకూ) సంవత్సరం లోపల పుట్టు వెంట్రుకలు తీయించాలి కదా.. తిరుపతికెప్పుడో ప్రయాణం కట్టాలి..’ అని గుర్తొస్తుంది. తిరుపతి వేంకటేశ్వరుడూ గుర్తొస్తాడు.

-“కొండా కొండా యేవూరి కొండా..

మెండుగా వెలసినా తిరుపతీ కొండా.. చిచ్చీ హాయీ..”

-“వెంకటప్పని కొండ వెలి సుండవలెనూ..

మాకు మా అబ్బాయి (అమ్మాయి) కలిగుండవలెనూ.. చిచ్చీ హాయీ”

– వెంకటేశుని కొండ వెలిసుండ వలెనూ..

ఎప్పటికి పుట్టిల్లు కలిగుండ వలెనూ..చిచ్చీ..హాయీ..”

అని తన పుట్టింటి గురించి కూడా ఒక అప్లికేషన్ పెట్టేసుకుంటుంది దేవుడికి.

 – “పొద్దు పొద్దున లేచి ఎక్కుదుము కొండా..

మొక్కుదుము మా పాలి వెంకటప్పనికీ.. చిచ్చీ హాయీ..”

ఇంతలో శ్రీరంగనాథుడు గుర్తొచ్చాడు. తిరుపతినీ, శ్రీరంగాన్నీ కలిపేసింది. “స్త్రీల పాటల్లో దేశకాల పరిస్థితులు తరచుగా తారుమారు అవుతుంటాయనీ, రాముడికి లాలిపాట పాడుతూ కృష్ణుణ్ని తీసుకొచ్చేస్తారనీ, అయితే ఈ తరతమభేదాలు వారికి పెద్దగా పట్టవనీ..” స్త్రీల పాటల గురించి చెబుతూ, ఒకచోట ఆరుద్రగారు వ్యాఖ్యానించి, వెటకారం చేసి వున్నారు కదా.. అది అసత్యమేమీ కాదని ఈ నుడుగు పాడిన తల్లి నిరూపించింది.

– “ఊరు మంచిదమ్మ ఉభయ కావేరీ..

వాడ మంచిదమ్మా వైష్ణవుల వాడా..

అప్ప మంచీవాడు తిరు వేంకటప్పా..

అమ్మ మంచిదమ్మా అలి వేలుమంగా.. చిచ్చీ..హాయీ..”

ఉభయకావేరుల మధ్యలో నెలకొన్న రంగనాథుడిని, తిరుపతిలోని వేంకటప్పడిని కలిపేసింది లేదా రంగనాథునిపై వేంకటేశుడిని సూపర్ ఇంపోజ్ చేసేసింది ఈ తల్లి.

– “అలివేలు మంగమ్మ ఆట కూటమునా..

అడిగి తెచ్చూకుందు ఐదువ తనమూ..

కోరి తెచ్చూకుందు కొంగు బంగారూ.. చిచ్చీ.. హాయీ..”

తిరుపతికెళ్లి స్వామినీ, అమ్మవారినీ యేమేమి కోరాలో నిర్ణయించేసుకుంది ఆ తల్లి.

– “కొండా కొట్టీ గోధుమ్మ విత్తీ..

కోసెవారూ లేక కొండ కొరబాయే..

కోయరా పెద్దన్న వెండి కొడవండ్లా..

కోయరా చిన్నోడ బంగారు కొడవండ్లా.. (చిచ్చీ హాయీ)”

ఈ తల్లి కొండమీది అడవులను నరికి, వ్యవసాయం చేస్తే కోసుకోలేనంత ఫలసాయం వస్తుందని సూచిస్తున్నది. అంటే పోడు వ్యవసాయం గురించి చెబుతోంది. బహుశః ఈ పాటను పాడిన తల్లి కాలానికి అలా చేసేవారేమో! అప్పట్లో చిక్కగా వున్న అడవులను కొద్దిమేర తొలగించి, ఊళ్లు యేర్పాటు చేసుకొని, పొలాలు తయారు చేసుకునేవారు. ఇప్పుడూ కొందరు అదే చేస్తున్నారు కదా!

అలాగే వ్యవసాయం గురించి, పెళ్లిళ్లు చెయ్యడం గురించి ఉయ్యాలలోని కొడుకుకు జాగ్రత్తలు చెబుతుంది చూడండి ఈ తల్లి.

“ఊరి ముందరి చేను కొనబోకురన్నా..

ఊరిలోన వియ్యమూ అందబోకన్నా.. చిచ్చీ.. హాయీ”

“ఊరి ముందర చేను దొంగలా పాలూ..

ఊరిలోని వియ్యమూ మాటలా పాలూ..చిచ్చీ హాయీ..”

జీవితసత్యాలను ఉగ్గుపాలతో రంగరించిపోయడమంటే ఇదే కదా!

4. జోలపాట

ఇంతలో ‘వెల్లాల’లో వెలసిన ఆంజనేయుడు గుర్తొచ్చాడు అమ్మకు. ఆ అమ్మ పుట్టిల్లు అటుపక్కనే ఉన్నట్టుంది. అందుకే..

– “వస్తూను పోతూను నీకు మొక్కేము

వరమియ్యర వెల్లాల ఓ ఆంజనేయా.. చిచ్చీ హాయీ”

– “నీకు మొక్కిన మొక్కు నిక్కమ్ము లైతే నీకు నిమ్మపండ్ల సేవ చేయింతూ..

నీకు మొక్కిన మొక్కు పక్వమ్ములైతే

నీకు పనసపండ్ల పందిరేయింతూ..

పండు తిని నీళ్లు తాగ చెరువు తవ్వింతూ..

నీళ్లు తాగి పండుకోను అరుగు లేయింతూ.. చిచ్చీ హాయీ..”

అబ్బా! ఈ ఇంతి ఎవరో గానీ.. రాజకీయ నాయకుడి లాగా ఎడాపెడా హామీలు గుప్పించేస్తోంది కదా!

‘పోనీలే.. తల్లిమనసు కదా. యేదో ఇస్తానని మాట అన్నది చాలు. అదే ఇచ్చినంత కద్దు..’ అని ఆ అంజనీపుత్రుడు కూడా నవ్వేసుకుని వుంటాడు.

‘పండ్లు అర్పిస్తుందట.. అందునా రాయలసీమలోనే దొరకని పనసపండ్లు ఎక్కడినించి తెప్పిద్దామనుకుందో యేమో మహాతల్లి! పండ్లు తిని నీళ్లు తాగడానికి ఏకంగా చెరువే తవ్విస్తుందట! కడుపు నిండితే రెప్పపడుతుంది కదా.. అందుకే నీళ్లు తాగి పండుకోవడానికి అరుగులు వేయిస్తుందట! అరుగుల మీద పడుకోవడం అలనాటి తెలుగు సంస్కృతి. దేవుడికి ఏ పట్టె మంచమో చేయిస్తానని చెప్పలేదు ఆ తల్లి. అరుగు మీద పండుకోవడమే హనుమంతునికి పెద్ద వైభోగమని భావించింది. అంటే ఆనాటి వాళ్లు అల్పసంతోషులని, నిరాడంబర జీవితాలను గడిపిన వారనీ మనకు అర్థం అవుతుంది. ఇప్పటికీ అరుగుల వైభవాలను పల్లెటూళ్లలో చూడవచ్చు.

(ఒకసారి శ్రీశ్రీ గారు కర్నూలు జిల్లాలోని కోవెలకుంట్ల అనే వూరికి వచ్చారట యేదో సభ నిమిత్తం. నిర్వాహకులు వచ్చేసరికి ఆలస్యమైనట్టుంది. ఆయన నంద్యాలలో రైలు దిగి, బస్టాండుకు వచ్చి యేదో అరుగు వుంటే, ఉత్తరీయాన్ని తలకింద పెట్టుకుని అరుగు మీద పడుకుని వున్నారట!

కార్యకర్తలు వచ్చి ఆయనను చూసి, ‘అంతటి మహాకవి అలా సామాన్యుని లాగా అరుగుమీద పడుకున్నాడే’ అని ఆశ్చర్యపడి, ఆయనకు క్షమాపణలు చెప్పుకొని, ఆయనను కోవెలకుంట్ల బస్సు ఎక్కించి ఊరికి తీసుకెళ్లారట! అదీ పాతకాలం వాళ్ల నిరాడంబరత్వం!)

– ఇప్పుడు లాలిపాట పాడుతున్న తల్లి మనసు అహోబిలం వైపు మళ్లింది. భర్త యేదో పని మీద పట్నానికి వెళ్లినట్టున్నాడు. మనసులో యేదో బెంగగా వుంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని లాలిపాటలోనే అహోబల నారసింహుడిని ప్రార్థిస్తోంది.

-“చీకటీకోనలో ఓ నారసింహా..

చిక్కుబడినా వేళ దిక్కు నీవయ్యా..

భయము తోచిన వేళ బంధువు డవయ్యా..

ఆపదల వేళలో కాపాడవయ్యా!

మా పిల్లలందరూ నీ దాసులయ్యా..

మావారిని రక్షింప నీ భారమయ్యా..

నీకు సేవలు జేయ నా భారమయ్యా.. ..చిచ్చీ హాయీ”

తన వాళ్ల బాగు కోసం తాను ఎంత కష్టానికోర్చి అయినా సేవలు చేయడానికి తల్లులు ఎప్పుడూ సిద్ధమే!

ఇంతలో భర్త తనకు కొత్త ముక్కెర, కమ్మలు చేయిస్తానన్న విషయం గుర్తుకొచ్చిందేమో.. ఇలా పాడుతోంది.

– “అక్కరలు గలవాడు అహోబలేశుడూ..

ముక్కెరలు చేయించె ముద్దు చెంచితకూ.. చిచ్చీ హాయీ..”

– “మక్కువలు గలవాడు మల్లికార్జునుడూ..

భవరేండ్లు (కర్ణాభరణాలు) చేయించె భ్రమరాంబకూనూ.. చిచ్చీ హాయీ..”

 ఆ ఇల్లాలు రాయలసీమకు చెందిన సామాన్యగృహిణి కావడం వల్ల ముక్కెరలతోటి, కమ్మలతోటీ తృప్తి చెందింది.

5. జోలపాట

ఆంజనేయుడికి సేవలయ్యాయి.. ఇక మహా నందీశ్వరుడు, మల్లికార్జునుడూ గుర్తొచ్చినారు ఆ తల్లికి.

“మహనందీశ్వరా.. మల్లికార్జునుడా

మనసునందు ఇవ్వరా మామిడీ పండూ..

మనసునందిస్తేను మరచిపోయేము

ఇవ్వరా మా ఇంట జడల పాపడినీ.. చిచ్చీ హాయీ”

ఈ బిడ్డను పెంచలేక సతమత మవుతోంది గానీ, మరో బిడ్డ అదీ శివుడి లాంటి ‘జడలపాపడు’ కావాలట! ‘కన్నమ్మకే వాపీ.. తిన్నమ్మకే వాపీ..” అని వూరికేనే అన్నారా? చాలామంది పిల్లలున్న తల్లికి ఇంకా పిల్లలు కావాలనే కాపీనం వుంటుందట! రకరకాలు చేసుకుని తినే అమ్మకు ఇంకా కొత్తరకాలు చేసుకుని తిందామనే కోరిక వుంటుందట!

అంతేగాక ఇందులో మరో మర్మం కూడా వుంది. మహా నందీశ్వర స్వామి లింగాన్ని గోవు తొక్కడం వల్ల, లింగంపై గోవు పాదముద్ర వుంటుంది. మహా యోగులు స్వామి లింగ స్వరూపానికి పూజచేసి, లోపల చెయ్యి పెడితే, వాళ్ల ప్రాప్తానుసారంగా పండ్లు, రుద్రాక్షలు వంటివి దొరికినట్టు ఆ దేవాలయ చరిత్రలో వుంటుంది.

తానెటూ అలాంటి ఫలాన్ని భౌతికంగా పొందలేదు కాబట్టి, మనసులో దర్శనమిచ్చి మామిడి పండు నివ్వమని, మామిడి పండు లాంటి జడలపాపణ్ని ఇవ్వమనీ కోరుతోందీ ఇల్లాలు.

-”ఊరికీ ఊయ్యాలలమ్మ వచ్చినవీ..

కొమాళ్లు (కొమార్తెలు) గల తల్లి కొనవె ఉయ్యాలా..

పాలు పోసి కొనవే పసిడివుయ్యాలా..

నేయి పోసి కొనవే వెండివుయ్యాలా.. చిచ్చీ.. హాయీ”

అప్పట్లో వుండే వస్తుమార్పిడి పద్ధతిని సూచిస్తోంది ఈ నుడుగు. లేదా పాలు, నెయ్యీ అమ్మిన డబ్బుతో ఉయ్యాల కొనమని సూచన కూడా కావచ్చు. పసిడి.. వెండి.. తల్లుల ఉత్ప్రేక్షలు మరి! తమ పిల్లలు బంగారు ఉయ్యాలలోనో, అధమపక్షం వెండిఉయ్యాలలోనో ఊగాల్సిన వాళ్లని ఆమె ప్రగాఢ విశ్వాసం!

ఒక తల్లి సంప్రదాయబద్ధమైన తన పుట్టినింటి గురించి గొప్పగా ఎట్లా చెప్పుకుంటోందో చూడండి.

– “పొద్దున్నే మా ఇల్లు పుణ్యతీర్థమ్మూ..

తెల్లవారి స్నానాలు.. దేవతార్చనలూ

వార్చేటి సంధ్యలూ.. హోమగుండాలూ..

నోమేటి నోములూ.. పారాయణాలూ..

వచ్చేటి బావలూ..తొలగేటి అక్కలూ..

పనిచేయ మరదండ్లు..ప్రభులు తమ్మూలూ.. చిచ్చీహాయీ”

ఆమె పుట్టినింట్లో నిత్యాగ్ని హోత్రాలూ, పూజలూ, వ్రతాలు, దేవతార్చనలూ.. అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతాయట! ఆమె తల్లి బహుసంతానవతి. ఉమ్మడి కుటుంబం కూడానేమో.. అందుకే కొత్తల్లుళ్లు.. బావలు వస్తూ పోతూ వుంటే, అక్కలు తప్పుకొని తిరుగుతారట! తమ్ముళ్లు ఊళ్లేలుతూ వుంటారట! మరదళ్లు ఇంట్లో పనులు చక్కబెడతారట!

6. జోలపాట

ఇక రాముడిని, సీతమ్మను తలచు కోకుండా లాలిపాట సాగనే సాగదు. రాముడు, సీత అంతగా మమేకమై పోయారు జనజీవనంలో.

 – “శ్రీరామ రఘురామ శృంగారరామా..

చారువిక్రమ రామచంద్ర రఘురామా..

తాటకాంతక రామ కారుణ్య రామా!

రావణాంతక రామా రాజా రామా! చిచ్చీ హాయీ..”

– రామురామనియేవు రాముదలచేవూ..

రామేమి కావలెనె రాఘవుల సీతా.. చిచ్చీ హాయీ..”

– “రాముడూ తన పతీ లక్ష్మన్న మరిదీ..

భరతశతృఘ్నులూ చిన్నమరదూలూ.. చిచ్చీ హాయీ..”

– “పుట్టినింటికి సీత పురుషునికి రంభా..

పులి వంటి రామునికి భూషణము సీతా.. చిచ్చీ హాయీ..”

– “పట్టపూ రాణియైన సీతమ్మ తల్లీ..

పవళించు రామునీ యేమనీ లేపూ.. చిచ్చీ హాయీ..”

– నీలమూర్తీ లెమ్మీ.. నిజమూర్తీ లెమ్మీ..

సత్యమూర్తీ లెమ్మి నిద్ర మేల్కొమ్మి

జలకమాడగ రారా జనకులల్లూడా.. చిచ్చీ హాయీ..”

– “చిట్టి ముత్యము పుట్టె సీత కడుపునా..

స్వాతి వానా కురిసె సముద్రమ్ము లోనా.. చిచ్చీ హాయీ”

ఇలా రాముడూ, సీతా గురించి రకరకాలుగా వర్ణిస్తూ పాడుకున్నారు ఆ తల్లులు. తద్వారా రామాయణాన్ని ఉగ్గు పాలతో, లాలిపాటతో రంగరించి పిల్లలకు పట్టేశారు.

జోలపాటలో ఈ విధంగా మాతృహృదయంలోని వివిధ ఆకాంక్షలు, ఆశీస్సులు, ఆశలు, కోరికలు వెల్లువెత్తాయి. నేటి తల్లులు కూడా ఈ పాటలను అమ్మల నుంచీ, అత్తలనుంచీ నేర్చుకుంటారనీ, ప్రతి ఇల్లూ లాలిపాటలతో ప్రతిధ్వనించాలనీ ఆశిద్దాం!

ఃఃఃఃఃఃఃః

కొసమెరుపు

నేను నా మనవరాలు నాలుగేళ్ల దాన్ని పక్కన పడుకోబెట్టుకుని నిద్రపుచ్చుతున్నాను. లాలిపాట యేదో పాడుతున్నాను.

“అమ్మమ్మా! అమ్మ కొన్న కొత్త కాఫీకప్స్ (ఆటబొమ్మలు.. కొంచెం పెద్దసైజువి) వున్నాయి కదా! నేను వాటితో ఆడుకోను.” అన్నది.

“ఎందుకే?” నా ప్రశ్న.

“ఆ సెట్ చాలా బాగుంది అమ్మమ్మా! నేను పెద్దయ్యాక మా ఇంట్లో వాడుకుంటా. మళ్లీ అప్పుడు కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ కదా?” అన్నది.

“ఓసి నీ జాగ్రత్త దొంగలు ఎత్తుకుపోనూ! అప్పటికి మీ అమ్మ మళ్లీ కొంటుందిలే.. ఇప్పుడు హాయిగా ఆడుకో!”

“లేదు అమ్మమ్మా! మనీ వేస్ట్ కదా! నేను దాచిపెట్టుకుంటాలే!” అని తన కబోర్డ్‌లో పెట్టుకుని వచ్చి పక్కన పడుకుంది.

 “అమ్మమ్మా! అమ్మ లాగా నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుడితే యేం పేర్లు పెట్టాలి?” అని అడిగింది.

“ఓసి పిల్లా! ఎన్ని ప్లాన్లున్నాయే నీ పొట్టలో..” అని మనసులో అనుకుంటూ “నువ్వే చెప్పు యేం పేర్లు పెడతావో!” అన్నాను.

“సితార, సునయన.. అని పెడతాను అమ్మమ్మా!” అంది. అవి దాని ఫ్రెండ్స్ పేర్లు.

“సరేలే!” అని నిద్రలోకి జారుకున్నాను.

ఇంతలో హాల్లో పెద్దగా నవ్వులు వినిపించి కళ్లు  తెరిచాను. పిల్ల పక్కన లేదు.

నా కూతురు పగలబడి నవ్వుతూ గదిలోకి వచ్చి, “అమ్మా! నీ మనవరాలిని చూస్తివా.. దానికెన్ని ఫ్యూచర్ ప్లాన్స్ వున్నాయో! నేను, మా ఆయనా మా బెంగుళూరు ఫ్లాట్ అమ్మేద్దామని అనుకుంటూ మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడొచ్చిందో ఈ పిల్ల తెలియదు. ‘నాన్నా! బెంగుళూరు ఫ్లాట్ అమ్మేయకండి. పెద్దయ్యాక నేను, నా హస్బెండ్, మా పిల్లలూ అక్కడ వుంటాములే!’ అన్నదమ్మా! ఎన్ని ఆలోచనలు చేస్తోందో చూశావా? చూస్తే నాలుగేళ్లు లేవు!” అని నవ్వడం మొదలుపెట్టింది. నేనూ నవ్వాను.

నాలుగేళ్ల పిల్లకు తనకో భర్త, ఇల్లు, పిల్లలు, వాళ్లకేం పేర్లు పెట్టాలి, కాఫీకప్పులను ఇప్పటినించే ఎట్లా భద్రపరచుకోవాలి.. ఇన్ని ప్లాన్లు వున్నాయంటే, ఈ ఆడపిల్లల మనసును దేవుడు ఏ పదార్థంతో తయారుచేశాడా..? అని ఆలోచనలో పడ్డాను.

అవును. ఆడపిల్లలు అమ్మవారి అంశలు! శివుడు స్థాణువై వుంటే లోకాలన్నీ చక్కబెట్టేది అమ్మవారే కదా! మరి, లౌకిక సంసారం బాధ్యత అంతా ఈ అమ్మదే కదా!

“లాలిపాట పాడడానికి ఇంకో అమ్మ సిద్ధం అవుతోంది. అయితే చదువులు, ఉద్యోగాలు, కెరియర్, డబ్బు సంపాదన ఈ గోలతో ఈ కాబోయే అమ్మల అమ్మతనం ఆవిరికాకుండా చూడు తండ్రీ!” అని దేవుడికి దండం పెట్టుకున్నాను.

పిల్ల నా పక్కన పడుకుని “జో అచ్యుతానంద పాడు అమ్మమ్మా..” అంటోంది. తానూ తన బొమ్మను తెచ్చుకొని, పొట్టమీద పడుకోబెట్టుకుని ‘జో.. జో’ అని జోకొట్టుతోంది. “పడుకోవే.. తొందరగా..” అని దానికి దుప్పటి కప్పి, ‘జో అచ్చుతానంద..’ అని పాడుతోంది.

లాలిపాట మరో తరానికి తరలివెళ్తోంది. లాంగ్ లివ్ జోలపాట!

“జోలపాటకు వెయ్యేళ్లు.. ఈ అమ్మలకు వెయ్యేళ్లూ.. ఉయ్యాలకు వెయ్యేళ్లు.. ఊగేటి పాపలకు వెయ్యేళ్లూ..” నేను కొత్త నుడుగు కట్టి పాడుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

నిద్రలో ఎవరో లాలిపాట పాడుతున్నారు. “లాలీ లాలీయనీ ఊచేరా.. వనమాలీ.. మాలీ యనీ ఊచేరా..”

మెలకువ వచ్చి చూస్తే నా కూతురు ఇంకా నిద్రపోని తన కూతురును ఒళ్లో వేసుకొని అలనాడు త్యాగరాజు రామునికి పాడిన జోలపాటను పాడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here