జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-12

0
7

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ప్రక్షాళ్య వైరిరక్తేన పితృద్రోహ రజోవలమ్।
శేషేనేకారిభీత్సాగాత్కశ్మీరాన్యన్ధుభిః సహ॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 152)

[dropcap]క[/dropcap]శ్మీరానికి గడ్డు దినాలు ప్రారంభమయ్యాయి. కశ్మీరు సంపూర్ణంగా రూపాంతరం చెందేందుకు పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలిస్తున్నాయి. దుర్బలులు, బుద్ధిహీనులు, శక్తిశూన్యులు అయిన రాజులు ఒకరొకరుగా గద్దె నెక్కడంతో, కశ్మీర సింహాసనానికి ఉన్న శక్తి, పవిత్రతలు ఆవిరైపోయాయి. శివాంశజుడు కశ్మీరరాజు అన్న భావన స్థానాన్ని – అవకాశాన్ని అందిపుచ్చుకుని కుట్రలు చేసి, ఏదోలా సింహాసనాన్ని దక్కించుకున్న వాడే రాజు అనే రోజులు వచ్చేశాయి.

మంగోలుల సైన్యాధికారి ‘దుల్చా’ కశ్మీరంపై దాడికి వచ్చాడనగానే, అతడిని ఎదుర్కునే బదులు, కశ్మీర రాజు ప్రజలపై పన్నులు పెంచేసి, ధనాన్ని ‘దుల్చా’కు సమర్పించాడు. అంత బలహీనమయ్యాడు కశ్మీర రాజు. రాజు సమర్పించిన ధనాన్ని స్వీకరించి మరీ, కశ్మీరాన్ని కొల్లగొట్టడం ప్రారంభించాడు ‘దుల్చా’. అందిన దాన్ని అందినట్టు దోచుకున్నాడు. గ్రామాలను బూడిద చేశాడు. ముసలివాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎదిరించినవారిని హతమార్చాడు. బందీలుగా దొరికిన పురుషవీరులను బానిసలుగా చేసుకున్నాడు. స్త్రీలను, పిల్లలను, పశువులను కట్టి తోలుకెళ్ళినట్టు వెంట తీసుకెళ్ళాడు. వారందరినీ మతం మార్చి బానిసలుగా అమ్మేసి డబ్బు చేసుకున్నాడు.

మనం యూరోపియన్లు, అమెరికన్లు నల్లవారిని ఎత్తుకుపోయి బానిసలుగా అమ్మివేయటం గురించి చదివి చాలా బాధపడతాం. అణచివేతకు తిరుగులేని ఉదాహరణలుగా చూపి ఆ సాహిత్యాన్ని  తమ   సిద్ధాంతం ప్రకారం అన్వయించి, అనువదించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలోని అణచివేతతో పోల్చి మన వ్యవస్థ పట్ల, అసహ్యాన్ని, జుగుప్సనీ కలిగించాలని ప్రయత్నిస్తారు మేధావులు అనేకులు.  కానీ ఎవరూ అంతగా ప్రస్తావించని విషయం ఏమిటంటే, భారతదేశంపై దాడి చేసిన, అరబ్బులు, ఇస్లామీయులు, మంగోలులు ఎంతెంతమంది భారతీయులను ఎలా హింసించి, నీచంగా, పశువుల కన్నా ఘోరంగా వ్యవహరిస్తూ వారిని తమ తమ దేశాలలో బానిసలుగా మార్చి అణచివేశారన్న విషయం. భారతీయులపై జరిగిన అత్యాచారాలు, అకృత్యాల గాథలు, హింసల వేదనల కథలు మనం ప్రస్తావించుకోం. ఇవి ఇతర దేశాలలో వారిపై జరిగిన అత్యాచారాలకు, అకృత్యాలకూ ఏమీ తీసిపోవు. కానీ, బయటివి కనిపించి, మనవి కనపడకపోవటం విషాదం.  ఇస్లామ్ ఆవిర్భవించిన తరువాత ఇస్లామ్ సూత్రాలను అనుసరించి, ఇస్లామీయులు బానిసలుగా వుండకూడదు కాబట్టి ఇతరులను బానిసలుగా మలచటం ఒక దైవ కార్యం అయింది.  మహమ్మద్ బిన్ ఖాసిం పదివేల కన్నా పై చిలుకు భారతీయులను బానిసలుగా పట్టుకుపోయాడు. అరబ్బు చరిత్ర రచయిత అల్-ఉల్బె ప్రకారం మహమ్మద్ గజనీ లక్షల సంఖ్యలో భారతీయ యువకులను బానిసలుగా మార్చాడు. తన పన్నెండవ దాడిలో అసంఖ్యాకులను బానిసలుగా పట్టుకుపోవడంతో బానిసల ధర ఎంతగా పడిపోయిందంటే, ఒక్కో బానిసను ఒకటి రెండు దీనారాలకే అమ్మేయాల్సి వచ్చింది. డిమాండ్‌ను మించిన సప్లయి అన్నమాట. ‘అయిదు లక్షల అందమైన పురుషులు, యువతులు బజారులో అందుబాటులో ఉన్నార’ని యూరోపియన్లు రాశారు. తూర్పు బెంగాల్ నుండి లక్షల సంఖ్యలో బానిసలను ఢిల్లీ సుల్తానులు ఎగుమతి చేసేవారు. ఈ పద్ధతిని ఆపాలని జహంగీరు ప్రయత్నించాడు. గుజరాత్, మాల్వా, దక్కన్  రాజ్యాలలో మహిళా బానిసలను పట్టుకోవటం యుద్ధ లక్ష్యాలలో ప్రధానమైన లక్ష్యాలలో ఒకటి. కర్నాటక పై దాడిలో అల్లాఉద్దీన్ బహమాన్ మందిరాలలో దైవానికి అంకితమైన దేవదాసీలను బానిసలుగా చేసుకున్నాడు. చరిత్రకారులు కూడా తమ   ఆఫ్రికా దేశాల ప్రజలను బానిసలుగా మలచిన వైనం గురించి లోతుగా పరిశోధనలు చేశారు కానీ, భారతీయులను బానిసలుగా ఎత్తుకుపోయిన అంశం గురించి విస్తారంగా శోధించలేదు. ప్రపంచ చరిత్రలో భారతీయులను బానిసలుగా మలచటం, అధ్యయనం చేయాల్సిన అంశం. యుద్ధంలో గెలిచి, ప్రజలను ఎత్తుకుపోవడం ఒక పద్ధతి అయితే, తాము గెలిచిన రాజ్యాలపై అధికారం చలాయిస్తూ ప్రజలను పరోక్షంగా బానిసలుగా మార్చటం మరో పద్ధతి. ఇప్పటికీ, ఆ బానిసత్వం మన మనస్సులలోంచి పోలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా అయిన అలవాటు మరి!

గతంలో మంగోలులు భారత్ పై దాడులు చేసినా, వారు కశ్మీరులోకి ప్రవేశించలేదు. కానీ ‘దుల్చా’ కశ్మీరులో ప్రవేశించటమే కాదు, అల్లకల్లోలం చేశాడు. అకాండతాండవం చేశాడు. గుళ్ళను నేలమట్టం చేశాడు. దేవతా విగ్రహాలను ముక్కలు ముక్కలు చేశాడు. దాదాపుగా ఎనిమిది నెలలు కశ్మీరంలో ‘దుల్చా’ కరాళ నృత్యం కొనసాగింది. రక్తపుటేరులు పారించాడు. ‘దుల్చా’ వెంట ఉన్న సైనికులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఎవరన్నా లెక్క లేదు. ఏమన్నా గౌరవం లేదు. ఎదుటివాడు మనిషన్న భావన లేదు. మానవత్వం అస్సలే లేదు. ‘దుల్చా’ ఇలా విశృంఖలంగా దోపిడులు, హింసలు జరుపుతున్న సమయంలో, కశ్మీరు పైకి మరో ఉపద్రవం ‘రింఛను’డి రూపంలో వచ్చి పడింది. ‘దుల్చా’ దోచుకుని వెళ్ళిపోయాడు. రింఛనుడు మాత్రం దోచుకుని స్థిరపడిపోయాడు. కశ్మీరు రాజయ్యాడు. జోనరాజు రింఛనుడి నేపథ్యాన్ని ప్రస్తావించాడు. చరిత్రకారులు అతడి నేపథ్యాన్ని పరిశోధించి వెలికితీశారు.

‘రింఛన్’ లదాఖ్ ప్రాంతానికి చెందినవాడు. వాకటాన్య తెగకు చెందినవాడు. కాలమాన్యులది రాజవంశం. వీరికీ వాకటన్యులకూ నడుమ వైరం నెలకొంది. ఈ ‘వాకటన్యులు’ ఎవరు అన్న విషయంలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కానీ   History of Western Tibet అన్న పుస్తకంలో ‘వాకటన్యులు’ ‘మల్బే’ ప్రాంతానికి చెందినవారని తీర్మానించారు. ఈ అభిప్రాయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. కాలమన్యులను జోనరాజు భట్టులన్నాడు వాకటన్యులు ‘వాక్’ అనే కోట నిర్మించారని ఊహిస్తున్నారు. వాకటన్యులకు, కాలమన్యులకు నడుమ చెలరేగిన వైరంలో మోసంతో వాకటన్యులను కాలమన్యులు మట్టుబెట్టారు. కానీ రాకుమారుడు రింఛన్ ప్రాణాలతో తప్పించుకున్నాడు. రింఛన్‍ను తెలివైనవాడిగా, వీరుడిగా పరిగణించేవారు. అతడు ప్రాణాలతో తప్పించుకుని వ్యాలులు, టుక్కులతో చేతులు కలిపాడు. వారందరి సహాయంతో కాలమన్యులను దెబ్బతీయాలని పథకం వేశాడు రింఛనుడు.

తాను తినటానికి తిండి లేక, సహాయం చేసేవాడు లేక దుర్భర దారిద్ర్యంలో మ్రగ్గుతున్నానని కాలమన్యులకు కబురుపెట్టాడు. తనను వారి సేవకుడిగా స్వీకరించి తన ప్రాణాలు కాపాడమని వేడుకున్నాదు. నిరాయుధుడిగా, నిస్సహాయంగా ఉన్న తనను రక్షించమని అభ్యర్థించాడు. అది నిజమని నమ్మారు కాలమన్యులు. నిజానికి రింఛనుడు, అతడి సమర్థకులు నది ఒడ్డున ఇసుకలో ఆయుధాలు దాచి, కాలమన్యుల కోసం ఎదురుచూస్తున్నారు. మానవులలో సింహం లాంటి రింఛనుడు నది ఒడ్దున ఇసుకలో ఆయుధాలు కప్పిపెట్టి కాలమన్యుల రక్తం తాగేందుకు ఎదురుచూస్తున్నాడని వర్ణిస్తాడు జోనరాజు.

రింఛనుడి వలలో పడ్డారు కాలమన్యులు. వారు  రింఛనుడి ఏడ్పులన్నీ నిజమని నమ్మారు. నిరాయుధులుగా రింఛనుడిని కలవడానికి వచ్చారు. రింఛనుడి పని సులభం చేశారు. నిరాయుధులుగా వచ్చిన కాలమన్యులపై విరుచుకుపడ్డారు రింఛనుడు, అతని సమర్థకులు. నిప్పుల్లాంటి గొడ్డళ్ళతో గడ్డిని నాశనం చేసినట్టు కాలమన్యులను రింఛనుడు, వ్యాలులు నాశనం చేశారని వర్ణిస్తాడు జోనరాజు. అలా వారి రక్తంతో తన తండ్రిని మోసం చేసి చంపిన నేరానికి ప్రతీకారం తీర్చుకున్నాడు రింఛనుడు. అయితే, లదాఖ్ నిండా కాలమన్యుల సమర్థకులున్నారు. వారు తనని ప్రాణాలతో వదలరని రింఛనుడికి తెలుసు. అందుకని, తన సమర్థకులతో, ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరం పారిపోయి వచ్చాడు రింఛనుడు. రింఛనుడు కశ్మీరం చేరేసరికి ‘దుల్చా’ దోపిడి, అకృత్యాల పర్వం అవిశ్రాంతంగా సాగుతోంది. లేని అవకాశాన్ని సృష్టించగల నేర్పు ఉన్న రింఛనుడు అందిన అవకాశాన్ని  వదులుతాడా? ‘దుల్చా’తో చేయి కలిపి, కశ్మీరంపై తన స్నేహితులతో కలిసి విరుచుకుపడ్డాడు రింఛనుడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here