జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-15

0
12

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

శ్రీ రించన సురత్రాణో భుజవాతాయనే మహీమ్।
వ్యరిశ్రమదథ శ్రాన్తాం దౌః స్థ్యాహుః స్థితి విప్లవైః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 174)

[dropcap]క[/dropcap]శ్మీర దేశంలో ఉన్న పురుషులను, బలశాలులందరినీ దుల్చా తన వెంట బంధించి తీసుకువెళ్ళాడు.  అందువల్ల  కశ్మీరులో పోరాడే శక్తి ఉన్న వారెవరూ లేని పరిస్థితి నెలకొంది. దాంతో రించనుడికి ఎదురు అన్నది లేకుండా పోయింది. కశ్మీరు రాజును పట్టిన గ్రహణం లాంటి దుల్చా వెళ్ళిపోయినా, అస్తమిస్తున్న సూర్యుడి వెలుతురు ప్రసరించకుండా అడ్డుపడే ఎత్తైన పర్వతంలా కశ్మీరును చీకటితో నింపే రించనుడు, రాజుకు అడ్డుగా నిలిచాడు. అది చూసిన ప్రజలకు కశ్మీరుపై సూహదేవుడి ఆధిపత్యం నశించిందని స్పష్టమయింది. బలహీనమైన రాజు, బలహీనమైన ప్రజలతో ఉన్న కశ్మీరాన్ని తన అధికారంలోకి తెచ్చుకునేందుకు రించనుడు, మాంసఖండం పైకి దూకేందుకు సిద్ధంగా ఉన్న గ్రద్దలాగా ఉన్నాడు. అయితే, రించనుడికి కశ్మీర సింహాసనానికి నడుమ అడ్డుగా ఉన్నాడు రామచంద్రుడు.

రించనుడు ప్రాణాలు అరచేత పెట్టుకుని వచ్చినప్పుడు అతడికి ఆశ్రయమిచ్చి, ఉద్యోగాన్నిచ్చినవాడు రామచంద్రుడు. లోహార కోట అధిపతి. అందుకని అతడిని ‘కోటరాజు’ అంటారు. రాణి ‘కోటరాణి’. కశ్మీరు చరిత్రలో అత్యద్భుతమైన వ్యక్తిత్వం ‘కోటరాణి’ది. భారతీయ చరిత్రలో అత్యంత విశిష్టమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉండవలసిన మహిళ కోటరాణి. కానీ, ఆమె గురించి అంతగా ఎవరికీ తెలియదు. చరిత్ర పుస్తకాలలో ఆమె ప్రసక్తి రాదు. ఆమె గురించి పరిశోధనలు అంతగా జరగలేదు. ‘కోటరాణి’ ఒకరకంగా విస్మృతిలో పడిన విశిష్టమైన మహిళ. ఇకపై కశ్మీరు చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది కోటరాణి. ఒక్క మాటలో చెప్పాలంటే, కశ్మీరుపై భారతీయుల అధికారం, ఆరిపోయే ముందు ఒక్కసారిగా గుప్పుమని వెలిగిన వెలుగు   కోటరాణి. భారతీయుల అధికారాన్ని కశ్మీరంపై కొనసాగించేందుకు చివరి పోరాటం జరిపిన వ్యక్తి ‘కోటరాణి’. సూహదేవుడు అధికారానికి వచ్చిన తరువాత పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను రామచంద్రుడికి అప్పగించాడు. ఆ బాధ్యతను రామచంద్రుడు తన శక్తి కొలది నిర్వహించాడు. కశ్మీరును శక్తిమంతం చేసేందుకు కిరాయివీరులను కశ్మీరుకు ఆహ్వానించి వారికి ఆశ్రయం ఇచ్చాడు. ‘దుల్చా’ కశ్మీరుపై దాడి చేసినప్పుడు సూహదేవుడు ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయాడు. కానీ రామచంద్రుడు కశ్మీరంలోనే ఉండి దుల్చాతో పోరాడేడు.

ఈ సమయంలో ఢిల్లీలో అంతర్యుద్ధం సాగుతోంది. జూలై 9, 1320న ఢిల్లీ సుల్తాను ముబారక్ షా (1316-20) హత్యకు గురయ్యాడు. అతని తరువాత ‘ఖుస్రౌ  ఖాన్’ సింహాసనాన్ని చేపట్టాడు.    అల్లావుద్దీన్ ఖిల్జీ మాల్వాపై చేసిన దాడిలో ఇతడు బందీగా చిక్కాడు. ఇస్లాం మతానికి మార్చి అతడిని బానిసగా చేశారు. అతడు సుల్తాన్ ముబారక్ షా  స్వలింగ సంపర్క భాగస్వామి.  డిల్లీ సుల్తాన్ అయిన తరువాత ముబారక్ షా అతడికి ఖుస్రౌ ఖాన్ అన్న పేరునిచ్చాడు. దేవగిరిని, ఓరుగల్లును గెలిచింది ఇతడే. ప్రతాపరుద్రుడిని బందీ చేసిందీ ఇతడే. యుద్ధాలలో గెలవటంతో, ముబారక్ షా కు వ్యతిరేకంగా కుట్ర పన్ని, అతడిని హత్య చేసి తానే డిల్లీ సుల్తాన్ అయ్యాడు,  నసీరుద్దీన్ అన్న పేరుతో.   అతడి పాలన స్థిరంగా లేదు. ఢిల్లీ సామ్రాజ్యం కోసం సంకుల సమరం సాగుతోంది. నసీరుద్దీన్ రెండు నెలలు మాత్రమే సింహాసనంపై వుండగలిగేడు.  దాంతో ఢిల్లీ చేరి తన అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు దుల్చా. చలికాలంలో కశ్మీరులో గడపడం ప్రమాదకరం అని గ్రహించి, ఢిల్లీకి ‘బనిహాల్ పాస్’ మీదుగా ప్రయాణం అయ్యాడు. కానీ బనిహాల్ పాస్ వద్ద మంచు తుఫానులో చిక్కుకుని దుల్చా, అతని సైన్యం, వెంట బందీలుగా ఉన్న 50,000 మంది కశ్మీరీయులు దుర్మరణం చెందారు.

దుల్చా కశ్మీరును వదిలి వెళ్ళిన తరువాత కశ్మీరంలో పరిస్థితిని చక్కదిద్దాలని రామచంద్రుడు ప్రయత్నించాడు. కానీ రించనుడు, షాహమీర్‍లు కశ్మీరులో నెలకొని ఉన్న అల్లకల్లోల పరిస్థితిని గమనించారు. అలసి, నిర్వీర్యులై, భీతిభ్రాంతులై ఉన్న కశ్మీరీ ప్రజలను, సరైన నాయకత్వాన్ని అందించి ప్రజలలో విశ్వాసాన్ని కలిగించలేని రాజు అసమర్థతని వీరిద్దరూ అర్థం చేసుకున్నారు. రక్షణ లేని నిస్సహాయ యువతిలా ఉన్న కశ్మీరును దోచుకోవటంతో సంతృప్తి పడలేదు రించనుడు. నిస్సహాయ యువతిపై అధికారం చలాయించాలని అనుకున్నాడు. అయితే, కశ్మీరమనే నిస్సహాయ యువతిపై అధికారం సాధించేందుకు రించనుడికి అడ్డుగా రామచంద్రుడు నిలిచాడు. రామచంద్రుని యుద్ధంలో గెలవడం అసాధ్యం అన్నది రించనుడికి తెలుసు. రించనుడిది కశ్మీర ప్రజలను బానిసలుగా అమ్మి సంపాదించిన ఐశ్వర్యం. బలహీనులను, నిస్సహాయులను నిర్దాక్షిణ్యంగా దోచుకోవటం వల్ల వచ్చిన శక్తి అతడిది. కానీ రామచంద్రుడిది అసలైన శక్తి. ధర్మబలం అతడిది. కశ్మీరాన్ని దుష్టుల నుండి  కాపాడి సుస్థిరత్వాన్ని అందించాలన్న తపన అతని ఐశ్వర్యం. అందుకని రామచంద్రుడిని యుద్ధంలో ఓడించడం కుదరదని అర్థం చేసుకున్న రించనుడు, కుట్రలు, మాయోపాయాలతో కశ్మీరును గెలవాలని నిర్ణయించుకున్నాడు.

రామచంద్రుడి దుర్భేద్యమైన లోహార కోటలోకి బట్టల వ్యాపారుల వేషాల్లో తన సైనికులను పంపించాడు. గతంలో కూడా, తన తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కూడా రించనుడు ఇలాంటి మాయోపాయాలే ఉపయోగించాడు. ఇప్పుడూ అదే పని చేశాడు. లోహార కోట లోకి మారువేషాలలో భౌట్ట యోధులు ప్రవేశించారు. వారి సంఖ్య గణనీయంగా పెరిగిన తరువాత ఒక రోజు వారు కోటలోని వారిపై తిరగబడ్డారు. అనూహ్యంగా సంభవించిన ఈ పరిణామాలను కోటలోని వారు అర్థం చేసుకునే లోగా భౌట్ట యోధుల కత్తులు, తేనెను తాగినట్టు రామచంద్రుడి సైనికుల రక్తం తాగాయి. రామచంద్రుడు మరణించాడు. సూహదేవుడు రాజ్యం వదిలి పారిపోయాడు. కోటలో ఉన్న ‘కోటరాణి’ రించనుడి పాలపడింది.

రామచంద్రకులోద్యాన కల్పవల్లీం స రించనః।
వక్షః స్థితే మహాబాహుః కోటాదేవీమ్ మరోపయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 179)

రామచంద్రుడి ఉద్యానవనంలో కల్పవల్లి లాంటి ‘కోటరాణి’ని మహాబాహుడైన రించనుడు తన వక్షస్థలంపై ప్రతిష్టించు   కున్నాడు. ‘కోటరాణి’ రామచంద్రుడి కూతురు. కొడుకు రావణ్ చాంద్. రించనుడు తెలివైనవాడు. రామచంద్రుడిని మాయోపాయంతో చంపి రాజ్యాన్ని కైవసం చేసుకోవటం పట్ల ప్రజలలో ఆగ్రహం కలుగుతుంది. రామచంద్రుడి సంతానాన్ని చంపితే ఆ ఆగ్రహం కట్టలు దాటవచ్చు. అందుకని రించనుడు రాజ్యాన్ని కబళించిన తరువాత రామచంద్రుడి సంతానాన్ని ఎంతో గౌరవప్రదంగా చూశాడు. రామచంద్రుడి కూతురిని వివాహమాడాడు. దాంతో రామచంద్రుడి అల్లుడయ్యాడు. రామచంద్రుడి వారసుడిగా, అతడి మరణం తరువాత సింహాసనాన్ని అధిరోహించాడు. ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలుండవు. అలాగే, రామచంద్రుడి కొడుకును గతంలో, సూహదేవుడు కశ్మీర రాజుగా ఉన్నప్పుడు రామచంద్రుడు ఏ పదవిలో ఉన్నాడో, ఆ సైన్యాధ్యక్ష పదవిని రావణ్ చంద్‍కి అప్పజెప్పాడు. ఇక్కడే మనకు రించనుడి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే వీలు కలుగుతుంది.

రించనుడిది మామూలు తెలివి కాదు. ఎలా సాధించాడనే దాని కన్నా అనుకున్నది సాధించటం అతని లక్ష్యం. మార్గం కాదు, గమ్యం ముఖ్యం అతడికి. తండ్రిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకున్న పద్ధతి, రామచంద్రుడిని ఓడించిన విధానం రించనుడి వ్యక్తిత్వానికి చక్కటి నిదర్శనాలు. అవకాశం దొరకగానే కశ్మీరీ ప్రజలను బానిసలుగా అమ్మి ధనం సంపాదించటం, ఆ ధనంతోనే సైన్యాన్ని సమకూర్చుకుని కశ్మీరుపై అధికారాన్ని సాధించటం, అతడి వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని చూపుతాయి. రించనుడు లదఖ్‍కు చెందినవాడు. బౌద్ధం అతని మతం. హింసను త్యజించిన శాంతి మతం. కానీ రించనుడి ఏ చర్యలో కూడా ‘శాంతి’ కనబడదు. కశ్మీరు అధికంగా సనాతన ధర్మానుయాయులు ఉన్న దేశం. బౌద్ధుల సంఖ్య అతి తక్కువ. అప్పటికి కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా ఉంది. అరబ్బు దేశాల నుంచి వచ్చిన వారు, కిరాయి సైనికులుగా వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు, వ్యాపారులు.. ఇలా ఇస్లామీయులు కూడా కశ్మీరంలో స్థిరపడ్డారు. సూహదేవుడి పాలానా కాలంలో తుర్కిస్తాన్‍కు చెందిన ముసావి సయ్యద్ ‘బుల్బుల్ షాహ’ కశ్మీరానికి వచ్చాడు.

మూసావి అనేది ఇంటి పేరు లాంటిది. ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ కుటుంబానికి చెందిన అల్-ఇమామ్ ముసా అల్-కాదిమ్ ఇబ్న్ జఫార్ అస్సాధిఖ్ అనే అత్యంత గౌరవం పొందే విశిష్టమైన అరబ్బు కుటుంబానికి చెందిన వారని అర్థం. వీరి పేర్లకు ముందు గౌరవ సూచకంగా ‘సయ్యద్’ అన్న పదం ఉంటుంది. ‘సయ్యద్’ అన్నది మహమ్మద్ ప్రవక్త వారసులలో ఆరవ తరానికి చెందిన ‘మూసా-అల్-కదిమ్’ కుటుంబానికి చెందినవారని సూచిస్తుంది. ‘మూసా-అల్-కదిమ్’ సమాధి ఇరాన్‍కు చెందిన బాగ్దాదులో ఉంది. ‘బుల్బుల్ షాహ’ బాగ్దాదులో చాలా కాలం జీవించాడు. ఈయన సూఫీలలో సుహ్రవర్ది సాంప్రదాయానికి చెందిన ‘షాహ నియామత్ ఉల్లాహ్ ఫార్సి’ శిష్యుడు. ఈయన కశ్మీరు ప్రజలపై ఎంతో ప్రభావం చూపించాడు. ఈయన వల్ల కశ్మీరుకు తొలి మహ్మదీయుడు రాజు అయ్యాడు. ఇదంతా భవిష్యత్తులో!

రించనుడు, రామచంద్రుని చంపగానే సూహదేవుడు అతడితో పోరు సలపకుండానే కశ్మీరు వదిలి పారిపోయాడు. సూహదేవుడి వ్యక్తిత్వంలో ఈ భీరుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. మంగోలు దుల్చాతో యుద్ధం తప్పించేందుకు కశ్మీరు ప్రజలపై పన్నులు విధించి ధనం సేకరించి దుల్చాకు అప్పగించాడు. ధనం తీసుకుని దుల్చా యుద్ధానికి వస్తే, కశ్మీరు వదిలి  పారిపోయాడు. ఎక్కడ రామచంద్రుడు తన సింహాసనాన్ని కబళిస్తాడో అన్న భయంతో రించనుడిని, షాహమీరును రామచంద్రుడికి వ్యతిరేకంగా ఉపయోగించాడు. రించనుడు రామచంద్రుడిని చంపగానే అతడిని ఎదిరించే బదులు రాజ్యం వదిలి పారిపోయాడు. ఇలాంటి భీరువు, బలహీనుడు, దూరదృష్టి లేని రాజు కీలక సమయంలో అధికారంలో ఉండడం కశ్మీరానిదే కాదు భారతీయుల దురదృష్టం!

రించనుడు రాజవటంతో సూహదేవుడు కశ్మీరాన్ని వదిలిపోయిన సందర్భంలో జోనరాజు ఓ శ్లోకం రాశాడు.

శ్రీ రించన భయాద్రాజా నగరం త్యక్తో వాంస్తతః।
విప్రశాపాగ్ని దగ్ధానాం కుతః స్యాదుదయాంకురః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 170)

రించనుడి భయంతో రాజు నగరం వదిలి పారిపోయాడు. విప్రుల శాపం  వంశాన్ని  అగ్ని బూడిద చేసినట్టు బూడిద చేస్తుంది. అంతే కాదు, విప్రుల శాపం ఎంత శక్తివంతమైనదంటే, ఆ  వంశ  బీజం మొలకెత్తేందుకు అణువంత స్థలం కూడా లభించదు.

సూహదేవుడు కశ్మీరంలో ప్రజలను హింసించాడు. బ్రాహ్మణులు అతడి చర్యలను వ్యతిరేకించారు. అతడు  పన్నులు విధించి పీడించటాన్ని నిరసించారు. ప్రాణత్యాగాలు చేశారు. పలువురు కశ్మీరం వదిలి వెళ్ళిపోయారు. ఆగ్రహంతో శపించారు. ఆ శాప ఫలితంగా సూహదేవుడు దిక్కులేనివాడయ్యాడు. రాజ్యం వదిలి అడవుల్లో, గుహల్లో నివసించాల్సిన స్థితికి దిగజారేడు. శత్రు సైన్యం సూహదేవుడి సైన్యాన్ని నాశనం చేసింది. సూహదేవుడి సైనికుల శరీరాల నుండి కారిన రక్త ధారలు బ్రాహ్మణుల కంటి నుండి కారిన కన్నీటి ధారలను తుడిచి, కళ్ళను పొడిగా చేశాయి అంటాడు జోనరాజు. చివరికి ‘నా’ అనేవాడు లేక, గుహలలో జీవిస్తూ సూహదేవుడు మరణించాడు. రాజ్యాన్ని రక్షించాల్సిన రాజుఅయినా, రాజ్య నాశనానికి కారకుడయిన రాక్షసుడిలాంటి సూహరాజు పాలన పంతొమ్మిది సంవత్సరాల మూడు నెలలు, ఇరవై అయిదు రోజులు సాగింది అంటాడు జోనరాజు. ఈ సందర్భంగా రెండు విషయాలను మనం గమనించాల్సి ఉంటుంది.

బ్రాహ్మణుల శాపాగ్ని వలన సూహరాజు నాశనం అయ్యాడు. అతని వంశం అంతమయింది. బాగానే ఉంది. కానీ బ్రాహ్మణుల శాపం వలన నష్టపోయింది ఎవరు? బ్రాహ్మణులతో సహా సమస్త కశ్మీరం, కశ్మీరీ ప్రజలు, భారతీయులంతా ఈ శాపాగ్ని దుష్ప్రభావాన్ని అనుభవించాల్సి వస్తోంది. ఎందుకంటే, బ్రాహ్మణుల శాపాగ్నిలో సూహదేవుడు బూడిదయ్యాడు. ఆ బూడిదను తొక్కుకుంటూ వెళ్ళి రాజ్యాన్ని చేపట్టిందెవరు? కశ్మీరు ప్రజలను బానిసలుగా అమ్మి ఐశ్వర్యవంతుడయినవాడు, కశ్మీరును మాంసఖండంలా భావించి, గ్రద్దలా దాన్ని దోచుకుని, పీక్కు తినేందుకు అధికారాన్ని అందుకున్నవాడు రించనుడు! ఇందువల్ల నష్టం సమస్త భారతీయులది. ఇలాంటి శాపాగ్ని వల్ల లాభం ఏమిటి? ఆగ్రహం ధర్మమైనది  అయితే, శాపం వల్ల లోకకళ్యాణం జరుగుతుంది.  అధర్మాగ్రహం వల్ల  అనర్ధంవాటిల్లుతుంది. కశ్మీరంలో  బ్రాహ్మణాగ్రహం వల్ల జరిగింది అనర్ధం!!!

జోనరాజు తన రచనలో సూహదేవుడిని ‘రాజా రాక్షసో’ అన్నాడు. అంతే కాదు, భయంతో నక్కలా సూహదేవుడు ‘ప్రమండల’ గుహలలో దాక్కున్నాడని తిరస్కార భావంతో వర్ణించాడు. పాపాత్ముడు యుద్ధంలో వీరమరణం ఎందుకు పొందుతాడు? భీరువులా, నక్కలా గుహలో తలదాచుకుని జంతువులా మరణిస్తాడన్నాడు. సూహదేవుడిని జోనరాజు విమర్శించిన తీరును, వాడిన పదజాలాన్ని పరిగణనలోకి తీసుకుని కొందరు సూహరాజు రాక్షసుడని వర్ణించారు. కానీ నిజానికి సూహదేవుడు అంత ఘోరమైన రాజు కాదు. బలహీనుడు, భీరువు కావచ్చు కానీ క్రూరుడు, దుష్టుడు కాడు. పైగా రించనుడు అధికారానికి రాగానే రించనుడిని ‘సురత్రాణుడ’ని వర్ణించాడు జోనరాజు. రించనుడు రాజు కాగానే కశ్మీరంలో దుర్దినాల చీకటి తొలగిందని, ప్రజలు మునుపటిలా మళ్ళీ సంబరాలలో మునిగిపోయారని, పందుగలు చేసుకున్నారనీ జోనరాజు వర్ణించాడు. జోనరాజు ఈ వర్ణనను ఆధారంగా తీసుకుని చరిత్ర రచయితలు ‘సూహదేవుడు’ దుష్టుడని, రించనుడు అధికారానికి వచ్చి కశ్మీరీ ప్రజల కష్టాలను తొలగించాడనీ, రించనుడు గొప్ప రాజు అనీ తీర్మానించారు.

‘The advent  of Rinchan marks the birth of a new and revolutionary order in the history of Kashmir’ అంటాడు ‘A History of Muslim Rule in Kashmir’ అన్న పుస్తకంలో R. K. Parmu. ఈ వ్యాఖ్య కన్నా ముందు చేసిన వ్యాఖ్య ఈ వ్యాఖ్య ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తుంది.

‘The Hindus as a whole seemed so much demoralised and dispirited socially, culturally and administratively that they accepted anyone who usurped  the throne and be their King. They simply looked unconcernedly.’ అంటే కశ్మీరులోని హిందువులు సాంఘికంగా, సాంస్కృతికంగా, పాలనా పరంగా ఎంతగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారంటే, ఎవడు అధికారాని వచ్చినా పట్టించుకునే స్థితిలో లేరు. ఎవరు రాజయినా ఆమోదించే స్థితిలో ఉన్నారన్న మాట. అ సమయంలో రించనుడు రాజవటం కశ్మీరీ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు దారి తీసిందని చరిత్ర రచయితలు తీర్మానించారు. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ తీర్మానాలను, వ్యాఖ్యలను విశ్లేషిస్తే, చరిత్ర రచయితల దృష్టి తెలుస్తుంది. జోనరాజు హృదయం అవగతమవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here