[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
శ్రీ దేవ స్వామినం శైవీం దీక్షాం యాచన్నరాధిపః।
నాన్వగ్రాహి స జాట్టత్వాతేనా పాత్ర తృశంకయా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 193)
[dropcap]చ[/dropcap]రిత్ర రచయితలు ఏ రకంగా నిజాలను వక్రీకరించి, అసత్యాలను సత్యాలుగా ప్రచారం చేశారో, జోనరాజ రాజతరంగిణి మూలాన్ని చదువుతూ, దాని ఆధారంగా చరిత్ర రచయితలు చేసిన తీర్మానాలను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఈ విశ్లేషణ చేసే ముందు ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది రచయితగా జోనరాజు హృదయం!
జోనరాజు భారతీయ ధర్మానుయాయి. పండితుడు. సృజనాత్మక రచయిత. అతడు నివసిస్తున్నది జైనులాబిదీన్ పరిపాలిస్తున్న కశ్మీరులో. అప్పటికే కశ్మీరు ఇస్లామీయుల పాలనలోకి వెళ్ళి వంద సంవత్సరాలవుతోంది. జైనులాబిదీన్ తండ్రి సికందర్ బుత్‌షికన్ ఇస్లామేతరులను క్రూరంగా హింసించినవాడు. అతని కొడుకు జైనులాబిదీన్ రక్షణలో ఉంటూ, కశ్మీరు చరిత్రను రాస్తున్నాడు జోనరాజు. నిష్పాక్షికంగా చరిత్రను రాయలేడు. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేడు. ఎందుకంటే, ఇస్లామీయులకు తమ మతానికి సంబంధించిన వారి పొగడ్తలు తప్ప ఇతరుల గొప్పతనం నచ్చదు. ఇది పర్షియన్లు రాసిన ఏ చరిత్రకు సంబంధించిన గ్రంథం పరిశీలించినా స్పష్టమవుతుంది. కాబట్టి, జోనరాజు రాజతరంగిణి రచనలో పాటించాల్సిన అత్యంత ప్రధానమైన సూత్రం, ఎట్టి పరిస్థితులలోనూ భారతీయ రాజుల గొప్పతనాన్ని ప్రదర్శించకూడదు. ఇస్లామీయుల గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని అధికంగా చూపించాలి. భారతీయ రాజుల చేతకానితనాన్ని, నైచ్యాన్ని ప్రదర్శించాలి. అలగయితేనే, జోనరాజు మెడ మీద తల నిలుస్తుంది. కానీ జోనరాజు ప్రధానంగా భారతీయుడు. సనాతన ధర్మానుయాయి. తన చుట్టూ జరుగుతున్న సంఘటనల లోని అంతరార్థం గ్రహించినవాడు. భవిష్యత్తులో పొంచి ఉన్న ప్రమాదాన్ని అర్థం చేసుకున్నవాడు. ఏ రకంగా భారతీయ రాజుల హ్రస్వదృష్టి, చేతకానితనాలు కశ్మీరును ఇస్లామీయుల పాలనలోకి నెట్టాయో అర్థం చేసుకున్నవాడు. కశ్మీరీ రాజులు, ప్రజలు చేసిన పొరపాట్లు ఏ రకంగా కశ్మీరును ఇస్లామీయుల పరం చేశాయో అర్థం చేసుకుని భవిష్యత్తు తరాలకు నిజానిజాలు వివరించే అవకాశం రాజతరంగిణి రచన ద్వారా తనకు లభించిందని అర్థం చేసుకున్నవాడు. ఈ కోణంలో జోనరాజు రాజతరంగిణిని విశ్లేషిస్తే చరిత్ర రచయితలు రాజతరంగిణిని అర్థం చేసుకుని విశ్లేషించిన విధానానికి సంపూర్ణంగా భిన్నమైన రీతిలో రాజతరంగిణి అర్థమవుతుంది.
జోనరాజు ఆరంభంలో సూహదేవుడిని పొగిడాడు. రెండవ అర్జునుడిలా కశ్మీరు సరిహద్దులను కాపాడేడు అని పొగిడాడు. మంగోలు దుల్చా దాడికి రాగానే ‘చెడ్డరాజు’ అని సూహదేవుడిని విమర్శించాడు. చివరికి ‘రాక్షసరాజు’ అన్నాడు. సూహదేవుడిని రింఛనుడు జయించగానే, రింఛనుడిని ‘సురత్రాణ’ అని పొగిడాడు. రింఛనుడి వల్ల మళ్ళీ కశ్మీరంలో సంబరాలు ఆరంభమయ్యాయన్నాడు. ఇక్కడే పైకి కనబడే పదాల అర్థాల నీడలో ఒదిగిన జోనరాజు హృదయం గ్రహించాల్సి ఉంటుంది. ‘సూహదేవుడు’ రాక్షసుడు కాడు. అర్జునుడు అని పొగిడిన వాడిని కొన్ని శ్లోకాల తరువాత రాక్షసుడు అని దూషించటం అనౌచిత్యం. కానీ జోనరాజు రాజతరంగిణిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. రామచంద్రుడితో కలిసి కశ్మీరును అదుపులోకి తెచ్చి శాంతి సాధించాలని సూహదేవుడు ప్రయత్నించాడు. ఒక స్థాయి విజయం సాధించాడు కూడా. కానీ దుల్చా రంగప్రవేశం చేయటంతో పరిస్థితి అదుపు తప్పిపోయింది. సూహదేవుడు స్వతహాగా భీరువు కావటంతో కశ్మీరు వదిలి పారిపోయాడు.
ఈ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరు వచ్చి చేరిన కిరాయి వీరులు, నైతిక విలువలు లేనివారు రాజు లేని కశ్మీరును దోచుకున్నారు. రింఛనుడు, షాహమీరు ఇలాంటివారు. వీరిని జోనరాజు ఆరంభంలో నీచులుగానే వర్ణించాడు. కశ్మీరు మాంసఖండంపై కన్నేసిన గ్రద్దతో రింఛనుడిని పోల్చాడు. కశ్మీరీ ప్రజలను బానిసలుగా అమ్మేసి ధనవంతుడయిన ధూర్తుడు రింఛనుడు అన్నాడు. అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి మార్గాన్నయినా అనుసరించేవాడు రింఛనుడు అని రాశాడు. కానీ రాజ్యాధికారం సాధించగానే రింఛనుడు సురత్రాణుడయ్యాడు. కశ్మీరు ప్రజల సంబరాలకు కారకుడయ్యాడు. సూహదేవుడు రాజ రాక్షసుడయ్యాడు. ఇక్కడే ఈనాటికీ భారతీయుల మనస్తత్వాన్ని పట్టి పీడిస్తున్న ఓ ప్రధానమైన లక్షణాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
నిజం చెప్తే భరించలేని బలవంతుడయిన శత్రువుకు ఆనందం కలిగించే అబద్ధం చెప్పటంలో లౌక్యం ఉంది. ఆ అబద్ధం చెప్పటంలో భాగంలో తనను, తనవారినీ తక్కువ చేసుకున్నా ఫరవాలేదు. కానీ బలవంతుడికి ఏది వింటే ఆనందం కలుగుతుందో అదే చెప్పాలి. అందువల్ల తన ప్రాణాలు నిలవటమే కాదు, బలవంతుడి అనుగ్రహం తనపై ప్రసరిస్తుంది కూడా. కానీ అలా చెప్పటంలో జోనరాజు లాంటి వారు అబద్ధాల రంగురంగు దుస్తుల లోపల చేదు నిజాలను నిక్షిప్తం చేశారు. పైపైన చూస్తే అబద్ధాల రంగులు కనిపిస్తాయి. ఆ రంగులను దాటి చూస్తే అసలు నిజం కనిపిస్తుంది. కానీ, వేల సంవత్సరాలుగా, బలవంతుడు వినాలనుకున్న ఆబద్ధాన్నే చెప్పటం అలవాటయిన ప్రజలు కొన్నాళ్ళకు ఆబద్ధాన్నే నిజమనుకుని నిజాన్ని విస్మరించారు. నిజం చెప్పటం నేరంగా భావించి, బలవంతుడు వినాలనుకున్న నిజాన్నే , అది తమను ఎంతగా దిగజార్చి చూపేదయినా సరే, ఆ అబధ్ధాన్నే నిజాన్ని దాచిపెట్టి మరీ చెప్పటానికి అలవాటుపడ్డారు. ఇది సమకాలీన సమాజంలో అడుగడుగునా కనిపిస్తుంది.
కశ్మీరీ ప్రజలను బానిసలుగా అమ్ముకుని ఐశ్వర్యవంతుడయిన రింఛనుడు కశ్మీరీ ప్రజల భాగ్యవిధాత అయ్యాడు. అలాంటి రింఛనుడిని జోనరాజు అతిగా పొగడి, అతని పాలనను మెచ్చుకోవటం వెనుక ఉన్న కారణం రాజతరంగిణిలో జోనరాజు చెప్పని విషయాన్ని తెలుసుకుంటే అర్థమవుతుంది.
రాజతరంగిణిలో జోనరాజు రింఛనుడి పాలన గొప్పతనాన్ని వివరించే సంఘటనలు పొందుపరిచాడు.
రింఛనుడి పాలన వల్ల కశ్మీరంలో చీకటి రోజులు తొలగిపోయాయి. అందువల్ల ప్రజలు గతంలోలా పండుగలు పబ్బాలు గడుపుకోవటం ఆరంభించారు. కశ్మీరంలో అంతవరకూ అల్లకల్లోలం సృష్టించిన లావణ్యులు రింఛనుడి శక్తికి భయపడి దీపాలలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. తనను వ్యతిరేకించే లావణ్యుల నడుమ రింఛనుడు కుట్రల ద్వారా భేదాభిప్రాయాలు సృష్టించాడు. లావణ్యుల ఐకమత్యాన్ని దెబ్బతీశాడు. లావణ్యులనే ముళ్ళ అడవిపై స్వేచ్ఛగా, ఆకాశంలో విహరించే పక్షిలా, విహరించాడు రింఛనుడు, వారి మధ్య విభేదాలు సృష్టించి. ఎవరికి బహుమతులిచ్చి సత్కరించాలో, రించనుడికి తెలుసు. కానీ తనను వ్యతిరేకించిన వారిని ఎలా శిక్షించాలో కూడా రించనుడికి తెలుసు. మంత్రి కొడుకయినా, స్నేహితుడి సంతానమైనా దుష్టులను నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాడు రింఛనుడు. దుష్టులను క్షమించేది లేదు ఎట్టి పరిస్థితులలో. అలా ప్రజలను చక్కగా పాలించాడు రింఛనుడు. ధనవంతులు, శక్తిమంతులు అయిన శత్రువులను నాశనం చేసిన తరువాత, తనని తాను రాజుగా ప్రకటించుకుని రింఛనుడు ఆచ్ఛోడ సరస్సుకు వెళ్ళాడు.
‘టుక్క’ అనే లదాఖి సోదరుడు టిమి, ఒక గ్రామ మహిళ నుంచి బలవంతంగా లాక్కుని పాలు త్రాగాడు. అది అతడి నేరం. ఆ గ్రామ మహిళ రింఛనుడికి ఫిర్యాదు చేసింది. తాను అలాంటి పని చేయలేదని టిమి అన్నాడు. కానీ రింఛనుడు ‘టిమి’ పొట్ట కోయించాడు. పొట్టలో పాలు కనిపించాయి. ఇది ఆ గ్రామ మహిళకు సంతోషం కలిగించింది అంటాడు జోనరాజు.
రింఛనుడు లదాఖ్‌కు చెందినవాడు. టిక్క లదాఖ్ రాజవంశానికి చెందిన వాడు. ఈ నిజం ఆధారంగా రింఛనుడు టిమ్మిని పొట్ట చీల్చి చంపటం వెనుక రాజకీయం ఉండి ఉంటుందని ఊహిస్తున్నారు. రింఛనుడు కశ్మీరు అధికారం చేపట్టాడు. కానీ అతని అధికారాన్ని అందరూ ఆమోదించలేదు. చరిత్ర రచయితలు కశ్మీరీ ప్రజలు మానసికంగా దిగజారి, ఎవరు అధికారానికి వచ్చినా పట్టించుకోలేని నిస్సహాయ, నిస్తేజ, నిర్వేద స్థితిలో ఉన్నారని తీర్మానించారు కానీ, రింఛనుడి గురించి జోనరాజు రాసిన విషయాలను విశ్లేషిస్తే, చరిత్ర రచయితల తీర్మానాలలో తొందరపాటుతో పాటు, ఏదో ఒక అలోచనకు మద్దతు నివ్వాలన్న ఆత్రం కనిపిస్తుంది.
దుల్చా కశ్మీరును వదలి వెళ్ళగానే ‘కిష్త్‌వార్’ ప్రాంతానికి చెందిన ‘గద్ది’ జాతి వారు కశ్మీరుపై దాడి చేశారు. సూహదేవుడు రాజ్యం వదిలి పారిపోయాడు ఆ సమయానికి. ఆ సమయంలో రామచంద్రుడు పూనుకుని ‘గద్ది’లను కశ్మీరు నుంచి తరిమివేశాడు. రామచంద్రుడి శక్తి ఈ సంఘటన ద్వారా రింఛనుడికి అర్థమయింది. అందుకని యుద్ధంలో రామచంద్రుడిని గెలవటం కష్టమని గ్రహించి, మాయోపాయంతో రామచంద్రుడిని ఓడించాడు రింఛనుడు. అలాంటి రింఛనుడిని, మామూలుగా నైతిక విలువలకు, ఉత్తమ ప్రవర్తనకు ప్రాధాన్యం ఇచ్చే జోనరాజు గొప్పగా వర్ణించటం అనౌచిత్యం. కానీ జోనరాజు రింఛనుడిని పొగిడాడు, సూహదేవుడిని తక్కువ చేస్తూ.
మరో సందర్భంలో, ఇద్దరు గుర్రాల యజమానులు, తమ సమస్య పరిష్కారం కొసం రింఛనుడి దగ్గరకు వస్తారు. వారి రెండు గుర్రాలు ఒకే సమయంలో జన్మనిస్తాయి. రెండు పిల్ల గుర్రాలు ఒకే రకంగా ఉంటాయి. వాటిలో ఒక పిల్ల గుర్రాన్ని పులి ఎత్తుకుపోతుంది. ఆ మిగిలిన పిల్ల గుర్రం నాదంటే, నాదని కొట్లాడుతూ ఆ ఇద్దరూ తీర్పు కోసం రింఛనుడి దగ్గరకు వస్తారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఆ పిల్ల ఏ గుర్రానికి చెందినదో గుర్తించలేకపోతారు. చివరికి ఓ పడవలో రెండు గుర్రాలను, పిల్లను నదిలోకి తీసుకువెళ్ళి, పిల్ల గుర్రాన్ని నీళ్లలోకి తోస్తారు. ఆ పిల్ల గుర్రాన్ని రక్షించేందుకు నీళ్ళలోకి దూకిన గుర్రం దాని అసలు తల్లి అని తీర్మానించి, తన తెలివిని, విచక్షణను ప్రదర్శించి అందరి మన్ననలందుకుంటాడు రింఛనుడు.
ఈ రెండు సంఘటనలు రింఛనుడి గొప్పతనాన్ని, ప్రజలకు న్యాయం చేయాలన్న అతని దీక్షని నిరూపించేందుకు జోనరాజు రాయటంలోనే రింఛనుడి పట్ల జోనరాజు అభిప్రాయం తెలుస్తుంది. పాలు తాగేడో లేదో తెలుసుకునేందుకు పొట్ట కోసి చూడటం ఏ రకంగానూ విజ్ఞత కాదు. తెలివి కాదు. మూర్ఖత్వం, క్రౌర్యం. లదాఖ్ లో రింఛనుడి వ్యతిరేకులున్నారు. వారు రింఛనుడికి సమస్యలు సృష్టిస్తున్నారు. వారి అడ్డు తొలగించుకునేందుకు రింఛనుడు ‘ఆచ్ఛోడ’ సరస్సుకు విహారానికి వెళ్లాడు. అక్కడ ఏదో ఓ చిన్న నేరాన్ని ఆధారంగా చేసుకుని శత్రువుని చంపటం ద్వారా తనను వ్యతిరేకించేవారి అడ్డు తొలగించుకున్నాడు రింఛనుడు. ఈ సంఘటన రింఛనుడి గొప్పతనాన్ని, తెలివిని కాదు , అతది అధికార దాహాన్ని, క్రౌర్యాన్ని, ఎలాంటి హింసకయినా తెగించి అధికారాన్ని నిలుపుకునే తత్వాన్ని నిరూపిస్తుంది. అలాగే గుర్రాల సంఘటన లాంటి సంఘటనలు రింఛనుడి గురించే కాదు, పలువురు సుల్తానులు, రాజుల గురించి కూడా ఉన్నాయి. విరాట పర్వంలో విరాటరాజు సమస్యను మారువేషంలో ఉన్న ధర్మరాజు కూడా ఇలాగే పరిష్కరిస్తాడు. కాబట్టి, రింఛనుడి గొప్పతనాన్ని ప్రదర్శించేందుకు ప్రచారంలోకి వచ్చిన కల్పిత కథ ఇది అనిపిస్తుంది. అంటే, నిజానికి జోనరాజు చెప్పినంత చెడ్డవాడు సూహదేవుడు కాడు, జోనరాజు పొగిడినంత గొప్పవాడు రింఛనుడు కాదు అన్నమాట. అలాంటప్పుడు జోనరాజు సూహదేవుడిని ‘రాజరాక్షసుడు’ అని, రింఛనుడిని ‘సురత్రాణ’ అని పొగడటానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్న వస్తుంది. ఇది అర్థం చేసుకునేందుకు ఆధారం కూడా రాజతరంగిణిలో పొందుపరిచాడు జోనరాజు.
రింఛనుడు గొప్పవాడు. కశ్మీరంలో మళ్ళీ పూర్వ ప్రశాంత కాలం వచ్చినదని ప్రజలకు నమ్మకం కలిగించాడు. ‘తస్మినాజ్మి జోనమంస్త కృతం యుగమివాగతం’ అంటాడు జోనరాజు. పిల్ల గుర్రం అసలు తల్లిని గుర్తు పట్టడంలో రింఛనుడు చూపిన విచక్షణతో ప్రజలు మళ్ళీ కశ్మీరంలో గతించిన స్వర్ణయుగం తిరిగి వస్తోందని భావించారని వ్యాఖ్యనించాడు జోనరాజు. చెప్పింది కట్టుకథ. దాని ఆధారంగా ప్రజలు కశ్మీరుకు స్వర్ణయుగం వచ్చేసిందని భావించారని రాయటం మరీ హాస్యాస్పదం. ఇలా స్వర్ణయుగం వచ్చిందని రాసిన తరువాత శ్లోకం (193వ శ్లోకం) లోనే జోనరాజు శ్రీ దేవస్వామి దగ్గరకు వెళ్ళి తనకు శివమంత్రం బోధించమని, అంటే, శైవమతంలోకి స్వీకరించమని అభ్యర్థించాడు అని రాస్తాడు జోనరాజు.
ఈ సంఘటనను విశ్లేషిస్తూ ‘Culture and Political History of Kashmir’, Vol 2లో పి.ఎన్.కె. బన్‍జాయ్ “Having usurped the throne he (Rinchan) wanted further to strengthen his position by adopting the religion of his subjects. Calling Shri Devaswami, the religious and spiritual head of Saivas, he begged him, in all humility to admit him to the Hindus fold” అని రాశాడు. అంటే, రాజ్యాధికారం సాధించిన తరువాత, తన పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవటానికి తాను పాలిస్తున్న ప్రజల మతాన్ని స్వీకరించాలని నిశ్చయించుకున్నాడన్న మాట రింఛనుడు.
“Even after establishing peace and order in the country, Rinchan did not feel secure. It appears that he was anxious to remove the stigma that he has gained to the throne by fraud. Therefore, he made an attempt to identify himself with the country and the people, to understand and follow their customs, religion and traditions, as one of them. To begin with, he expressed a desire to follow the Saiva cult because it was the most popular form of Hindu religion” అని వ్యాఖ్యానిస్తాడు ‘A History of Muslim Rule in Kashmir’ అనే పుస్తకంలో ఆర్.కె. పార్ము.
జోనరాజు రాసింది ఒకే వాక్యం ‘శ్రీ దేవ స్వామినం శైవీం దీక్షాం యాచన్నరాధిపః’ అని. శైవదీక్ష ఇప్పించమని శ్రీ దేవస్వామిని నరాధిపుడు, అంటే రాజు రింఛనుడు యాచించాడు, అభ్యర్థించాడు. ఈ ఒక్క వాక్యం ఆధారంగా ఇద్దరు చరిత్ర రచయితలు రెండు రకాల వ్యాఖ్యలు చేశారు. ఒకాయనేమో ‘మోసం వల్ల రాజ్యాధికారాన్ని పొందిన అపవాదును తుడిపేందుకు, తాను పాలించే ప్రజలలో ఒకడయిపోయేందుకు వారికి సన్నిహితుడయ్యేందుకు, వారి సంప్రదాయాలు, మతం, సంస్కృతులను అర్థం చేసుకునేందుకు మతం మారాలనుకుంటున్నాడు’ అని తీర్మానించాడు.
ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. మళ్ళీ కశ్మీరుకు స్వర్ణయుగం వచ్చిందని భావిస్తున్నారు. అలాంటి రింఛనుడికి ప్రజలను అర్థం చేసుకుని, వారిలో ఒకడిగా గుర్తింపు పొంది, వారి మతం అనుసరించేందుకు తన మతాన్ని వదిలి, ప్రజల మతాన్ని స్వీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యాధికారం ఉంది. తన వ్యతిరేకులను మట్టు పెట్టే శక్తి ఉంది. అలాంటి వాడు, ప్రజల మెప్పు పొందేందుకు తన స్వమతాన్ని వదిలి ప్రజల మతాన్ని స్వీకరించాల్సిన అవసరం ఏముంది? ప్రజలు రాజును ‘సురత్రాణ’ అని పొగుడుతూ, కశ్మీరుకు శాంతి నిచ్చినవాడిగా భావిస్తుంటే, శైవం ఇప్పించమని అభ్యర్థించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడే చరిత్ర రచయితల ‘దృష్టి’ చరిత్ర రంగును, రూపును ఎలా రూపాంతరం చెందిస్తుందో, భారతీయ చరిత్రను భారతీయుల ‘దృష్టి’తో విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏమిటో స్పష్టమవుతుంది. భారతీయుల ‘దృష్టి’ గ్రహించే ఆధారాన్ని వదలటంలో జోనరాజు చూపిన నైపుణ్యం తెలుస్తుంది.
(ఇంకా ఉంది)