జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-18

0
12

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

జ హౌ వ్యాలః కృతం రాజ్ఞా న స వ్యాలకృతం పునః।
మనో హి కాయికం హన్తి తత్కృతం న వపుః పునః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 195)

[dropcap]జో[/dropcap]నరాజు తన రాజతరంగిణిలో పొందుపరిచిన విషయాలలో చరిత్ర పరిశోధకులు విస్మరించిన వ్యక్తి వ్యాలరాజు. రింఛనుడు  శివ  దీక్ష ఇవ్వమని దేవస్వామిని అభ్యర్థిస్తాడు. శైవం స్వీకరించేందుకు రింఛనుడు అనర్హుడని దేవస్వామి తిరస్కరించాడని రాసిన తరువాత శ్లోకంలోనే జోనరాజు వ్యాలరాజు ప్రసక్తి తీసుకువస్తాడు. వ్యాలరాజు ఎవరో, ఏమిటో, కశ్మీరు చరిత్ర రాసిన వారెవరూ ప్రస్తావించలేదు. పట్టించుకోలేదు. రింఛనుడికి శైవదీక్ష ఇవ్వటానికి నిరాకరించటాన్ని గొప్ప నేరంగా, భారతీయ ధర్మానుయాయుల ఘోరమైన తప్పిదంలా ప్రకటించాలన్న ఆతృతలో వ్యాలరాజును సంపూర్ణంగా విస్మరించారు. ‘అనుజస్తమజో బంధుర్మంత్రీ సహచరః సఖా’ అని వ్యాలరాజుకూ రింఛనుడికీ నడుమ కల ఆత్మీయ అనుబంధాన్ని వర్ణిస్తాడు జోనరాజు. రింఛనుడికి సోదరుడి లాంటి వాడు, కొడుకు లాంటి వాడు, బంధువు లాంటి వాడు, స్నేహితుడు, సన్నిహితుడు, మిత్రుడు అయినటువంటివాడు వ్యాలరాజు అంటాడు జోనరాజు. అంతేకాదు, వ్యాలరాజు సత్యానికి ప్రాధాన్యం ఇచ్చేవాడంటాడు. ‘సత్యైక వ్రత నిష్ఠయా’ అంటాడు. అలాంటి వ్యాలరాజు, రాజు చర్యల ప్రభావానికి లోను కాలేదు కానీ, రాజు మాత్రం వ్యాలరాజు ప్రభావానికి గురయ్యాడని రాశాడు జోనరాజు. ఇక్కడ రింఛనుడు, వ్యాలరాజుల నడుమ ఉన్న సంబంధాన్ని అత్యంత సుందరంగా వర్ణిస్తాడు.

‘మనో హి కాయికం హన్తి తత్కృతం న వపుః పునః’

శరీరం వల్ల మెదడు ప్రభావితం కాదు, కానీ మెదడు ప్రభావం శరీరంపైన ఉంటుంది. అలా రింఛనుడి ప్రభావం వ్యాలరాజుపై లేదు కానీ, వ్యాలరాజు ప్రభావం రింఛనుడిపై ఉంది. అంటే, చరిత్ర రచయితలు రింఛనుడి పాలనను పొగిడి, రింఛనుడు కశ్మీర ప్రజలను ఉద్ధరించాడని పదే పదే ప్రస్తావించటం ద్వారా కశ్మీరులో మెరుగైన పాలన అందటం వెనుక ఉన్న వ్యాలరాజు ప్రస్తావనను మరుగున పరచారన్న మాట. శరీరం రింఛనుడు, మెదడు వ్యాలరాజు.

రింఛనుడి స్వభావం గొప్పది కాదు. అతడి ఉద్దేశాలు, లక్ష్యాలు గొప్పవి కావు. క్రూరుడు, ధూర్తుడు. కానీ రాజతరంగిణిలో హఠాత్తుగా రింఛనుడిని పొగడటం కనిపిస్తుంది. కారణం అతడిని వెనుక ఉండి నడిపిస్తున్న వ్యాలరాజు. భారతదేశ చరిత్ర రచనలో గమనించాల్సిన విషయం ఇది. భారతీయ రాజులను ఎవరినయినా మనం ‘గొప్పవారు’ అనుకుంటే, వెంటనే వారి గొప్పతనాన్ని మరొకరికి ఆపాదించటం, ఆ మరొకరి చేతిలో రాజు కీలుబొమ్మ అని అతని గొప్పతనాన్ని తగ్గించటం చూడవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు అనగానే, గొప్ప అంతా తిమ్మరుసు మంత్రిది అని కొట్టి పడేస్తారు. ఇలా దాదాపు ప్రతి రాజు గురించీ, అతని గొప్పతనాన్ని ఆమోదించక, మరొకరికి ఆపాదించటం కనిపిస్తుంది. కానీ భారతీయేతర రాజుల విషయంలో మాత్రం ఆ రాజుల గొప్పతనాన్ని ఆ రాజులకే వర్తింపచేయటం చూడవచ్చు. రింఛనుడి విషయంలో కూడా ఇదే జరిగింది.

రింఛనుడు ధూర్తుడని, శైవదీక్ష స్వీకరించేందుకు అనర్హుడని భావించి అతడికి శైవదీక్ష ఇచ్చేందుకు నిరాకరించాడు. రింఛనుడికి శివదీక్ష నిచ్చేందుకు ఎందుకు నిరాకరించారో జోనరాజు స్పష్టంగా రాశాడు. కానీ దానికి లేనిపోని అర్థాలు ఆపాదించి, భారతీయులు మూర్ఖులనీ, దూరదృష్టి లేనివారని, అహంకారులని తీర్మానించారు చరిత్ర రచయితలు.

“He was refused because tradition bound, visionless and unaccommodating Brahman chief priest (Devaswami) would not get the caste ‘polluted’ although he is responsible for getting it destroyed subsequently.” [A History of Muslim Rule in Kashmir by R. K. Parmu]

జోనరాజు రాసింది చదివితే, ‘దేవస్వామి సంప్రదాయం వల్ల బద్ధుడయి, దూరదృష్టి లేక, అసహనం ఉట్టిపడే బ్రాహ్మణ పూజారి’గా అనిపించడు. అర్హత లేదు కాబట్టి ఆమోదించలేదు. అంతే. అయితే, రింఛనుడి పనుల ప్రభావం లేకుండా వ్యాలరాజు రింఛనుడిని ప్రభావితం చేశాడన్న జోనరాజు వ్యాఖ్య చదివితే, రింఛనుడు ఎలాంటి ధూర్తుడయినా, వ్యాలరాజు తన ప్రభావంతో రింఛనుడి పాలన సక్రమంగా ఉండేట్టు చూశాడని అర్థమవుతోంది. చరిత్ర రచయితలు ఈ వైపు దృష్టి పెట్టలేదు.

కళానిధౌ రసమయే వ్యాలే భూలోక భాస్వతః।
మూర్ఛితా రుచుచ్ఛై త్సీద చ్చేద్య జగతాం తమః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 196)

కళానిధి, రసమయుడు, శాస్త్రాలలో నిష్ణాతుడు, చక్కని అభిరుచి కలవాడు అయిన వ్యాలరాజు ఘోరమైన, దుర్భేద్యమయిన అంధకారాన్ని నాశనం చేశాడు. ఎలాగయితే నీటిపై ప్రతిఫలించే వెన్నెల కిరణాలు అంధకారాన్ని భగ్నం చేస్తాయో అలాగ వ్యాలరాజు కశ్మీరంలో అంధకారాన్ని భగ్నం చేశాడంటాడు జోనరాజు. అంతే కాదు, దీనికన్నా ముందు శ్లోకంలో ప్రపంచానికి సూర్యుడి లాంటి వాడు రింఛనుడు. అతడి ఆలోచనలు వ్యాలుడిపై ప్రతిఫలించాయంటాడు. అంటే రింఛనుడు సూర్యుడయితే, వ్యాలరాజు చంద్రుడి లాంటి వాడు. చంద్రుడి వెన్నెల కిరణాలు నీటిపై ప్రతిఫలించి అంధకారాన్ని పారద్రోలుతున్నాయి. వ్యాలరాజు గురించిన శ్లోకాలు జాగ్రత్తగా విశ్లేషిస్తే రింఛనుడి పాలన సవ్యంగా ఉండటానికి, కశ్మీరు ప్రజలు పూర్వంలా మళ్ళీ సంబరాలు చేసుకునేందుకు కారణం అర్థమవుతుంది. అందుకు రాజుగా రింఛనుడికి ఖ్యాతి లభించినా, అసలు మెదడు వ్యాలరాజు అని బోధపడుతుంది. మెదడు కనబడదు. మెదడు నిర్దేశనంతో కార్యభారం నిర్వహించే శరీరం కనిపిస్తుంది. మన్ననలందుకుంటుంది. రింఛనుడి విషయంలో జరిగిందది. అంటే, అసలు గొప్పతనం రింఛనుడిది కాదు, వ్యాలరాజుది అన్నమాట. ఈ విషయం తెలుసు కాబట్టి, ధూర్తుడయిన రింఛనుడిని శైవంలోకి ఆమోదించలేదు దేవస్వామి. అత్యంత సున్నితంగా, నర్మగర్భితంగా జోనరాజు రాజతరంగిణిలో ఈ విషయాన్ని పొందుపరిచాడు. అందుకే, ధూర్తుడన్న రింఛనుడిని పొగిడాడు. గొప్పవాడన్నాడు. రింఛనుడు శరీరం అయితే వ్యాలరాజు మెదడు అన్నాడు. చెప్పీ చెప్పకనే గుట్టు కప్పిపెట్టినట్టే కప్పి విప్పి చెప్పాడు. చూడాలనుకున్నవారికి కనిపిస్తుంది. చూడాలనుకోనివారికి ఎంత ప్రయత్నించినా కనిపించదు.

రింఛనుడి గురించి ఇంతగా పొగడడం, అతడి మెదడు లాంటి వాడయిన వ్యాలరాజు ప్రస్తావనను విస్మరించటం, రింఛనుడికి శైవం ఇవ్వనందుకు దేవస్వామిని అహంకార బ్రాహ్మణుడని, దూరదృష్టి లేని గుడ్డివాడని పలురకాలుగా దూషించటం ఎందుకంటే తరువాత రింఛనుడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించి రింఛనుడు సుల్తాన్ సద్రుద్దీన్ అయ్యాడు. అలా, రింఛనుడు కశ్మీరులో తొలి ఇస్లాం పాలకుడయ్యాడు! జోనరాజు ఇస్లాం సుల్తాన్ పడగనీడలో సురక్షితంగా ఉన్నాడు. కాబట్టి, జోనరాజు ఇస్లాం పాలకుడయిన రింఛనుడిని దూషించలేడు. తరువాత కశ్మీరు చరిత్ర రాసిన పర్షియన్ల దృష్టిలో ఇస్లామీయులలో  తప్ప మరొకరిలో మంచి కనబడదు. గొప్ప తెలియదు. కాబట్టి జోనరాజుతో సహా తరువాత కశ్మీరు చరిత్ర రాసిన వారంతా రింఛనుడు కశ్మీరు సుల్తాన్ అవటం వల్ల కశ్మీరు ప్రజలకు శాంతి సౌఖ్యాలనిచ్చాడని, ప్రజలను ఉద్ధరించాడని రాశారు. అయితే, అతడు ఇస్లాం స్వీకరించే కన్నా ముందు శైవం స్వీకరించాలనుకుని భంగ పడ్డాడన్న నిజం రాజతరంగిణిలో ప్రస్తావించటంతో, రింఛనుడిని శైవంలోకి స్వీకరించకపోవటం ఘోరమైన చారిత్రక తప్పిందం అన్నట్టు  చిత్రించే వీలు చిక్కింది. భారతీయ ధర్మం కుల సంకుచితత్వంతో, పట్టుదలలు, అహంకారాలతో నిండి ఉందని వ్యాఖ్యానించి విషం చిమ్మే వీలు చిక్కింది. భారత సమాజంలోని చెడుకు బ్రాహ్మణులే కారణం అనటం ఆనవాయితీకాబట్టి, రింఛనుడిని శైవంలోకి ఆహ్వానించకపోవటం ఘోరమైన తప్పిదమయింది.

ఏదైనా ఒక సంఘటనను అది జరిగిన కొన్ని వందల ఏళ్ళ తరువాత విశ్లేషించటం, వ్యాఖ్యానించటం, వ్యక్తులను దోషులుగా నిలపటం చాలా సులభం. కాని ఆ సంఘటన సంభవిస్తున్నప్పుడు వర్తమానంలోని వారి మానసిక స్థితిని అంచనా వేసి వారి చర్యలలో మంచి చెడును విశ్లేషించి అవగాహన చేసుకోవటం కష్టం. రింఛనుడు శైవం స్వీకరించాలనుకున్నాడు. తిరస్కరించటంతో, తరువాత ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం ఎలా స్వీకరించాడో, ఎందుకు స్వీకరించాడో జోనరాజు స్పష్టంగా రాయలేదు. తరువాత రెండు మూడు వందల ఏళ్ళ తరువాత పర్షియన్ చరిత్ర రచయితలు ఊహించి రాశారు. ఆ ఊహను చరిత్రగా భావించి ఆమోదించారు చరిత్ర రచయితలు. జోనరాజుకు రింఛనుడు ఇస్లాం స్వీకరించినట్టు తెలియదని అనుకునే వీలు లేదు.

‘స కోటామతృకం వృద్ధియౌ స్వపుత్రం హైదరం దదౌ’

(జోనరాజ రాజతరంగిణి, 213)

“కోటరాణిని, స్వపుత్రుడైన ‘హైదర్’ను ‘షాహమీర్’ రక్షణలో ఉంచాడు రింఛనుడు” అన్న శ్లోకంలో ‘స్వపుత్రుడు హైదర్’ అనటం వల్ల రింఛనుడి కొడుకు ‘హైదర్’ అన్న విషయం జోనరాజుకు తెలుసుననీ, కొడుకు పేరు ‘హైదర్’ అవటం వల్ల రింఛనుడు మతం మారేడని, ఈ విషయం జోనరాజుకు తెలుసుననీ గ్రహించే వీలు చిక్కుతుంది. కశ్మీరు రాజుల చరిత్ర రచిస్తున్న జోనరాజు, రింఛనుడు మతం మారిన అత్యంత ప్రధానమైన విషయం, కశ్మీరు చరిత్రను సంపూర్ణంగా రూపాంతరమొందించిన  అతి ప్రధానమైన సంఘటనను ప్రస్తావించకపోవటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, రింఛనుడు ఎందుకు, ఎలా మతం మారేడన్న విషయం జోనరాజు పరిశోధనలకు అందలేదు. రింఛనుడు మతం మారేడన్నది నిజం. అతడి కొడుకు ‘హైదర్’ అన్నది కాదనలేని సత్యం. కానీ ఎలా, ఎందుకు మారేడన్నది తెలియదు. అందుకని జోనరాజు ఆ విషయం ప్రస్తావించలేదనుకోవడం సబబు అనిపిస్తుంది. ఏదో ఒక ప్రచారంలోవున్న కథను ప్రస్తావిస్తే సుల్తాన్ కు కోపంవస్తుంది. కాబట్టి తెలియని విషయాన్ని తెలియనట్టే వదిలేశాడు జోనరాజు. కానీ, రింఛనుడు ఇస్లాం మతం స్వీకరించటమన్న సంఘటన ఆధారంగా ఇస్లాం ఆధిక్యాన్ని ప్రకటించే వీలుచిక్కటంతో పర్షియన్ రచయితలు ఏ కథ చెప్తే  బాగుంటుందో ఆ కథ చెప్పారు. దానికి తమవంతు ఊహలను జోడించి చరిత్ర రచయితలు చరిత్ర రాశారు.

అసలు రింఛనుడు మతం మారాలని అనుకోవటం ఎందుకని ఆలోచిస్తే ఇద్దరు వ్యక్తులు కారణంగా కనిపిస్తారు. ఒకరు వ్యాలరాజు. రెండవవారు కోటరాణి. వ్యాలరాజు గురించి ప్రస్తావించుకున్నాం. రింఛనుడిపై అతని ప్రభావం విషయం ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా చెప్తాడు జోనరాజు. కాబట్టి శైవం స్వీకరించమని వ్యాలరాజు చెప్పి ఉంటాడనుకోవచ్చు. రింఛనుడంటే ప్రజలలో అసహ్యం ఉంది. అతడు కశ్మీరీయులని బానిసలుగా అమ్మేసి ఐశ్వర్యవంతుడయ్యాడు. ప్రజల మన్ననలందుకునే రామచంద్రుడిని మోసంతో చంపించాడు. రాజ్యాన్ని ఆక్రమించాడు. రామచంద్రుడి తనయ కోటరాణిని తన రాణిగా చేసుకున్నాడు. శత్రువు పొట్ట చీల్చి పాలున్నాయోమో చూశాడు. లావణ్యులకు నడుమ గొడవలు పెట్టి చీల్చాడు. ఈ రకంగా ప్రజల దృష్టిలో దుష్టుడిగా పేరుపొందిన రింఛనుడు రాజు అయ్యాడు. కాబట్టి, కోటరాణి భర్త అయ్యాడు కాబట్టి, అతడికి ఉన్న చెడ్డ పేరు తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా శైవం స్వీకరించి పాప ప్రక్షాళన చేసుకోమని వ్యాలరాజు, కోటరాణి అతడిని ఒప్పించి ఉంటారనుకోవటంలో ఔచిత్యం ఉంది. అలాంటి ధూర్తుడికి శైవం ఇచ్చి దౌష్ట్యానికి ప్రామాణికత నిచ్చి పవిత్రుడిని చెయ్యటం ఇష్టం లేక అతడికి శైవం ఇవ్వ నిరాకరించి ఉండవచ్చు. తప్పు లేదు.  తనపై విప్లవంలేవదీసిన వారితో రింఛనుడు వ్యవహరింఛిన విధానం చూస్తే అతడి అభ్యర్ధనను  తిరస్కరింఛటం సబబనిపిస్తుంది.    రింఛనుడికి శైవం ఇవ్వకపోవటం వల్ల పెద్ద నష్టం జరగలేదు. శైవం ఇవ్వ తిరస్కరించిన తరువాత రింఛనుడు మూడేళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. అతని తరువాత రాజ్యానికి వచ్చింది ఉదయదేవుడు. కాబట్టి, రింఛనుడికి శైవం ఇవ్వకపోవటం వల్ల ఘోరమైన అన్యాయం జరిగిందని, ఇది భారతీయుల సంకుచితత్వం అని, మూర్ఖత్వం అనీ వ్యాఖ్యానించడం అనౌచిత్యమే కాదు, అర్థరహితం కూడా. అయితే కశ్మీరులో ఇస్లాం రాజ్యం ఏర్పడి స్థిరపడటానికి కారకుడు షాహమీర్. ఈయనకు కశ్మీరులో ఆశ్రయం ఇచ్చి, కీలకమైన పదవినిచ్చి గౌరవించినది సూహదేవుడు. దుల్చా కశ్మీరుపై దాడి చేసినప్పుడు, ఓ వైపు నుంచి రింఛనుడు, మరో వైపు నుంచి షాహమీర్ కశ్మీరును దోచుకున్నారు. శక్తివంతులయ్యారు. వీరిద్దరిలో రింఛనుడు సుల్తాన్ సద్రుద్దీన్ అయ్యాడు. షాహమీర్ అతడి ఆంతరంగికుడయ్యాడు.

షాహమీర్ కశ్మీరులో అడుగుపెట్టే సమయానికే ఇస్లామీయుడయ్యాడు. కాబట్టి రింఛనుడికి శైవం ఇవ్వకపోవటంలో దూరదృష్టి రాహిత్యం, కుల సంకుచితత్వం, అహంకారం లాంటివి లేవు. కేవలం ఒక అనర్హుడికి, ధూర్తుడికి, దుష్టుడికి శైవం స్వీకరించే అర్హత లేదన్న భావనే తప్ప, మరొకటి లేదు. పైగా అప్పటికి కశ్మీరులో ఇంకా ఇస్లాం సంపూర్ణంగా వేళ్ళూనుకోలేదు. ఇస్లాం అధికారానికి వస్తే సమాజంలో సంభవించే పెను మార్పుల గురించి, రాజ్యంలో ప్రామాణికమయ్యే సంకుచిత భావనల గురించి సమాజంలో అవగాహన లేదు. అదీగాక, దేవస్వామి రింఛనుడిని శైవం లోకి ఆమోదించినా అతడు మూడేళ్ళలో మరణించిన తరువాత సంభవించిన సంఘటనలు  ఇస్లామీయుడె అధికారానికి వస్తాడని చూపిస్తున్నాయి.  ఎలాగో శాహమీర్  సుల్తాన్ అవుతాడు. కాబట్టి, రింఛనుడిని శైవంలోకి ఆమోదించకపోవటం వల్ల జరిగిన ఘోరం ఏమీ లేదు. కేవలం భారతీయ ధర్మాన్ని తక్కువగా చూపించాలన్న ఆలోచన, భారతీయ ధర్మం సంకుచితం  అనీ, భారతీయులు దూరదృష్టి లేనివారని నిరూపించాలన్న తపన తప్ప చరిత్ర రచయితల వ్యాఖ్యలలో అవగాహన కనిపించదు. దీన్ని అందిపుచ్చుకుని ఆధునిక చరిత్ర రచయితలు, సామాజిక కార్యకర్తలు నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయకుండా భారతీయ ధర్మంపై, సమాజంపై బురద చల్లుతున్నారు. విచ్ఛిన్నకరమైన విద్వేష విషపు భావనలు వెదజల్లుతున్నారు. సమాజాన్ని న్యూనతా భావనకు గురిచేస్తున్నారు.

రింఛనుడు ఇస్లాం స్వీకరించిన విధానాన్ని పర్షియన్ చరిత్రకారులు, ఊహించి వర్ణించిన విధానాన్ని గమనిస్తే, ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. చరిత్రను నిరూపితమైన ఆధారాల ద్వారానే విశ్లేషించాలన్న ఆలోచన బలపడుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here