జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-21

3
11

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ధీరి వాసీత్తద్దా కోటాదేవి సర్వాధికారిణీ।
రాజా దేహ ఇవాత్యర్థం తదాదిష్టం సమాచరత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 225)

[dropcap]ఇ[/dropcap]క్కడి నుంచి జోనరాజ రాజతరంగిణిలో కోటరాణి అధ్యాయం ప్రారంభమవుతుంది. భారతదేశ చరిత్రలో విశిష్టమైన మహిళ కోటరాణి. కశ్మీరంలో అవసాన దశలో ఉన్న భారతీయ రాజుల పాలనను నిలబెట్టాలని శాయశక్తులా కృషి చేసి, ఆరిపోయే ముందు దీపం ఒక్కసారిగా వెలిగినట్టు, భారతీయ ధర్మ ప్రభను వెలిగించాలని ప్రయత్నించిన చిట్టచివరి భారతీయ రాణి కోటరాణి. ఇలాంటి మహాద్భుతమైన వ్యక్తిత్వం కల మహిళలు ప్రపంచంలోనే అరుదు. ఇలాంటి పరమాద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మహిళలు భారతదేశానికే ప్రత్యేకం!

రింఛనుడి మరణం తరువాత కశ్మీరుకి రాజ్యాధిపతి ఎవరన్న సమస్య వచ్చింది. షాహమీరుకు తాను రాజ్యం చేయగలడన్న ఆత్మవిశ్వాసం లేదు. రాజ్యాధికారం పై ఆశ ఉంది. కానీ తన సామర్థ్యంపై విశ్వాసం లేకపోవటంతో అతడు వెనుకడుగు వేశాడు. రాజ్యాధికారం నెరపే సామర్థ్యం కోటరాణికి ఉంది. కానీ కోటరాణి రాజ్యాధికారం స్వీకరించటానికి ఇష్టపడ లేదు. ఇక్కడే కోటరాణి గొప్పతనం తెలిసేది.

కోటరాణికి పాలనా సామర్థ్యం ఉన్నదన్నది రింఛనుడికి ఆమె పాలనలో చేసిన సహాయం నిరూపిస్తుంది. బౌద్ధుడయిన రింఛనుడిని భారతీయ ధర్మం స్వీకరించేలా ప్రేరేపించింది కోటరాణి. కానీ అతనికి శైవం స్వీకరించే అర్హత లేదని దేవస్వామి శైవం ఇచ్చేందుకు తిరస్కరించాడు. దాంతో చివరిదశలో రింఛనుడు ఇస్లాం స్వీకరించి సుల్తాన్ సద్రుద్దీన్ అయ్యాడు. వారి కుమారుడు ‘హైదర్’ అయ్యాడు. కానీ కోటరాణి మాత్రం కోటరాణిగానే మిగిలిపోయింది. ఆమె ఇస్లాం స్వీకరించలేదు. ఇది గమనార్హం. భారతీయ ధర్మం పట్ల కోటరాణికి ఉన్న తీవ్రమైన అభిమానం భవిష్యత్తులో కశ్మీరులో జరిగే అనేక సంఘటనలకు కేంద్ర బిందువు అయింది. జోనరాజు స్పష్టంగా రాయలేదు.  చరిత్ర రచయితలు  విస్మరించిన సంఘటన, కోటరాణి స్వయంగా రాజ్యాధికారాన్ని స్వీకరించి పాలించగల శక్తి ఉండీ, తన సంతానం హైదర్‍ను సింహాసనంపై కూర్చుండబెట్టి, తాను రక్షకురాలిగా రాజ్యం చేసే వీలుండి కూడా రాజ్యాధికారాన్ని వదులుకున్న సంఘటన – కశ్మీరు చరిత్రలో అత్యద్భుతమైన, అతి కీలకమైన సంఘటన!  ఈ సంఘటనకు ఎవరూ అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జోనరాజు చాలా నర్మగర్భితంగా, ఏమీ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడకుండానే, ఈ సంఘటన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునే ఆధారాన్ని రాజతరంగిణిలో పొందుపరిచాడు.

లవణ్యైః కులనాథత్వాద్ రింఛనే ప్రతిఘాదపి।
అవ్యాహత ప్రవేశాశో మతిమాన్ష షమేరకాః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 222)

తమ కులనాథుడైన రింఛనుడిని వ్యతిరేకించే లావ్యణ్యులు షహమేరుడిని వ్యతిరేకించలేదు.

సమం శ్రీ కోటయా దేవ్యా మూర్తయేవ జయశ్రియా।
తదోదయన దేవం తం కశ్మీరాక్ష్మమలంభయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 223)

కశ్మీర రాజుగా ఉదయన దేవుడిని నిర్ణయించారు. కశ్మీర రాజ్యంతో పాటు కోటరాణిని కూడా ఉదయన దేవుడికి అర్పించారు.

కోటరాణిని రింఛనుడు వివాహమాడేడు. ఆమెకు రింఛనుడి వల్ల హైదర్ అన్న సంతానం కలిగింది. నిజానికి రింఛనుడి మరణం తరువాత రాజ్యం దక్కాల్సింది అతని తనయుడు, వారసుడు అయిన హైదర్‍కు. కానీ రాజ్యం దక్కింది ఉదయన దేవుడికి. ఉదయన దేవుడు కశ్మీరు రాజు సూహదేవుడి సోదరుడు. కశ్మీరుపై మంగోలు దుల్చా దాడి చేసినప్పుడు  కశ్మీరులోని  ధనాన్నంతా మూటగట్టి దుల్చాకి సమర్పించి, కశ్మీరుపై దాడి చేయవద్దని అభ్యర్థించే బాధ్యత సూహదేవుడు ఉదయన దేవుడికి అప్పజెప్పాడు. ఉదయన దేవుడు సమర్పించిన ధనాన్ని స్వీకరించాడు దుల్చా. కానీ కశ్మీరుపై దాడి చేశాడు. ఇది ఉదయన దేవుని బాధించింది. అతడు దుల్చాను, కశ్మీరాన్ని వదిలి గాంధారం చేరుకున్నాడు. ఈ గాంధారాన్ని కాబుల్ నది దిగువ ప్రాంతంగా గుర్తించారు.

గాంధారం నుండి ఉదయనుడు  లావణ్యులను, లదాఖ్ వీరులను రెచ్చగొట్టి, కశ్మీరు సింహాసనాన్ని కబళించిన రింఛనుడిపై తిరుగుబాటుకు ప్రోత్సహించాడు. ఆ తిరుగుబాటు సమయంలో తగిలిన గాయం వల్లనే రింఛనుడు ప్రాణాలు కోల్పోయాడు. అంటే ఉదయనుడికి రాజ్యాధికారంపై కన్ను ఉన్నదన్న మాట. రింఛనుడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ఉదయన దేవుడు. అలాంటి ఉదయన దేవుడు ‘షాహమీర్’ రాజు అయినా ఊరుకోడు. పోరాటం సాగిస్తాడు. అతనికి లావణ్యుల మద్దతు ఉంది. కశ్మీరంలో శక్తిమంతులైన వారు లావణ్యులు. రింఛనుడు ఇస్లాం స్వీకరించటంతో అతడికి భౌట్టుల మద్దతు కూడా పోయి ఉంటుంది. ఇలాంటి సమయంలో ‘హైదర్‍’ని సింహాసనంపై కూర్చోబెడితే, రింఛనుడి పైని క్రోధం ‘హైదర్’పై ప్రతిబింబిస్తుంది. హైదర్ బాలుడు. అతడి ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. కాబట్టి ఈ పోరాటాలకు బాలుడు హైదర్‍ని దూరంగా ఉంచటం మంచిది. షాహమీర్‍కు సింహాసనంపై కన్ను ఉన్నా రింఛనుడు ప్రాణాలు కోల్పోయిన వైనం, అతడిపై తిరుగుబాట్లు చెలరేగిన వైనం షాహమీర్‍కు భయం కలిగించి ఉంటుంది. ఇంకా బలం సమీకరించుకోకముందే సింహాసనం కోసం అర్రులు చాచకూడదన్న భావనను కలిగించి ఉంటుంది. అందుకని షాహమీర్ వెనుకడుగు వేసి ఉంటాడు.

మరో కోణం లోంచి చూస్తే, కోటరాణి రింఛనుడి భార్య. రింఛనుడు ఇస్లాం స్వీకరించి సుల్తాన్ సద్రుద్దీన్ అయినా, కోటరాణి మతం మారలేదు. బహుశా, మతం మారటం వల్ల కూడా ప్రజలలో రింఛనుడి పట్ల వ్యతిరేకతను తీవ్రం చేసి ఉంటుంది. ‘హైదర్‍’ను సింహాసనంపై కూర్చుండబెడితే సింహాసనం ఇస్లామీయుడి పరం అవుతుంది. ‘హైదర్‍’ను సింహాసనంపై కూర్చుండబెట్టి తాను రాజ్యం చేసినా, రాజ్యం ఇస్లాం పరం అవుతుంది. షాహమీర్ పక్కనే పొంచి ఉన్నాడు, ఏ మాత్రం పొరపాటు జరిగినా, రాజ్యం కబళించేందుకు. పైగా ఇస్లామీయుడి భార్యగా ఎంత ప్రయత్నించినా కోటరాణి ఆ ముద్ర నుంచి తప్పించుకోలేదు. కాబట్టి ఇస్లామేతరుడు రాజు కావాలి. ఇస్లామీయుడి భార్యగా తన పై పడిన ముద్ర చెరిగిపోవాలంటే, ఆమె భారతీయుడిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. సూహదేవుడి సోదరుడు, కశ్మీర రాజ్యం పొందే ‘హక్కు’ కలవాడు అయిన ఉదయన దేవుడికి కశ్మీర సింహాసనం అధిష్ఠించే ఆహ్వానం అందింది. కశ్మీర సింహాసనంతో పాటుగా కోటరాణి అతడిని వరించింది. అతడి భార్య అయింది. అంటే  ఇస్లామీయుల పాలనలోకి వెళ్ళే కశ్మీరును మళ్ళీ భారతీయుల పాలనలోకి లాగిందన్న మాట కోటరాణి. భవిష్యత్తులో జరిగే పరిణామాలు కోటరాణి దేశభక్తిని, ధర్మభక్తిని మరింత స్పష్టం చేస్తాయి. కోటరాణి రాజకీయ చతురతకు అద్దం పడతాయి. ఈ సంఘటలను వర్ణిస్తూ జోనరాజు కోటరాణిని ‘మూర్తయేవ జయశ్రియా’ అని వర్ణించాడు. ‘జయశ్రీ’ అంటే విజయలక్ష్మి, విజయానికి దేవత. ఓ వైపు షాహమీరు రాజ్యాన్ని ఉదయనుడికి కట్టబెట్టాడని చెప్తూ, మరో వైపు కోటరాణిని ‘విజయ దేవత’ అనటంలో అసలు మర్మం దాగుంది.

షాహమీరు రాజ్యాన్ని ఉదయ దేవుడికి కట్టబెట్టడం వల్ల కోటరాణి ఏ విధంగా ‘విజయ దేవత’ అయ్యిందని ఆలోచించాల్సి ఉంటుంది. అసలు విషయం బోధ పడుతుంది. తరువాత జరిగిన పరిమాణాలను ఆధారం చేసుకుని విశ్లేషిస్తే, షాహమీరుకు సింహాసనంపై కాదు, కోటరాణిపై కూడా ‘కన్నుం’దని తెలుస్తుంది. ‘హైదర్‍’ను సింహాసనంపై కూర్చుండబెట్టి, కోటరాణిని వివాహమాడటం ద్వారా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని ‘షాహమీరు’ పథకం వేసి ఉంటాడన్న ఆలోచన కలుగుతుంది. అతడి పథకాన్ని దెబ్బ తీసేందుకు కోటరాణి ఉదయన దేవుడిని వివాహమాడేందుకు సిద్ధపడి ఉంటుంది. తరువాత జరిగిన సంఘటనలు ఈ ఆలోచనకు బలమిస్తాయి. ‘షాహమీర్’ రాజ్యాన్ని హస్తగతం చేసుకునే లోగా, కోటరాణి ఉదయన దేవుడిని కశ్మీరుకు రప్పించి, రాజ్యాధికారం స్వీకరింపజేసి, తనను అర్పించుకుని ఉంటుంది. ఉదయన దేవుడు భారతీయ ధర్మానుయాయి. అతడి భార్య అవటం వల్ల కోటరాణికి అంటిన ‘పర ధర్మం స్వీకరించిన వాడి భార్య’ అన్న ముద్ర పోతుంది. ‘షాహమీరు’ కశ్మీరుకు చెందినవాడు కాదు. ఉదయన దేవుడు రాజు అవటం వల్ల కశ్మీరుకు చెందనివాడు రాజవటం తప్పిపోయింది, తాత్కాలికంగా! షాహమీరుకు రాజ్యంపై ఆశ ఉండి కూడా ప్రస్తుత పరిస్థితులలో తాను అంత శక్తిమంతుడు కాదు కాబట్టి స్వచ్ఛందంగా పోటీ నుండి వైదొలగి ఉదయనుడికి మద్దతు నివ్వటం వల్ల షాహమీర్ రాజ్యాన్ని ఉదయనుడికి అప్పజెప్పాడని రాశాడు జోనరాజు. షాహమీరుకు రాజ్యం దక్కకుండా, రాజ్యం ఇస్లామీయుల హస్తగతం కాకుండా తన వంతు రాజకీయం నెరపి, విజేతగా నిలిచినందు వల్ల ‘విజయలక్ష్మి’ అయింది కోటరాణి. అంతకన్నా ఎక్కువ స్పష్టంగా రాయలేడు జోనరాజు. రాజ్యం ఇస్లామీయుల హస్తగతం కాకుండా అడ్డుపడి విజయం సాధించింది కోటరాణి అని స్పష్టంగా రాయలేడు. కానీ జరిగిన దానిలో షాహమీర్ పాత్ర, కోటరాణి పాత్రలను స్పష్టం చేసే విధమైన విశేషణాలను వాడేడు. వారిద్దరి నడుమ సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని సూచనప్రాయంగా ప్రతిబింబించాడు. కానీ కోటరాణి తనపై ఉంచిన గురుతరమైన బాధ్యతను ఉదయన దేవుడు గ్రహించలేదు. ఆమె అతడిపై ఉంచిన విశ్వాసాన్ని అతడు వమ్ము చేశాడు. దాన్ని సూచిస్తూ తరువాత శ్లోకం రాశాడు జోనరాజు.

రాజ్యలక్ష్మీర్మహాదోలా గుణబద్ధా గరీయసీ।
రింఛనోన్భై పదః గత్వా రాజాధః పరమాశ్రయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 224)

రాజ్యలక్ష్మి చంచలమైనది. ఆ రాజ్యలక్ష్మి కోసం శక్తికలవారు, అర్హులైన వారు ప్రయత్నిస్తారు. అలాంటి రాజ్యలక్ష్మి ఉత్తమ స్థాయి వాడయిన రింఛనుడిని వదిలి తక్కువ స్థాయి వాడయిన ఉదయన దేవుని వరించింది. ఉదయన దేవుడు అంత అర్హత కల రాజు కాదని, కశ్మీర రాజు విలువ, ఉదయన దేవుడు రాజవటం వల్ల దిగజారినట్లయిందనీ సూచిస్తున్నాడు జోనరాజు.

షాహమీరు కశ్మీర రాజయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. రాజ్యం కోసం యుద్ధం చేయకుండా ఉదయన దేవుడికి రాజ్యాధికారం కట్టబెట్టాడు. బదులుగా ఉదయన దేవుడు ‘క్రామరాజ్యం’పై అధికారాన్ని షాహమీర్ కొడుకులు ‘జం షారా’, ‘అల్లీ షార’లకు కట్టబెట్టాడు. దీన్ని బట్టి చూస్తే, ‘షాహమీర్’‍కు రాజ్యాధికారంపై ఆశ ఉందని, పోరాటానికి అతడి కొడుకులు సిద్ధంగా ఉన్నారనీ, కానీ లావణ్యులతో పాటు, లదాఖ్ రాజవంశీయుల మద్దతే కాకుండా, కోటరాణి మద్దతు కూడా ఉన్న ఉదయన దేవుడిని బహిరంగంగా వ్యతిరేకించటం మంచిది కాదని గ్రహించిన షాహమీర్ తాత్కాలికంగా వెనుకడుగు వేశాడు అని అర్థం అవుతోంది. ప్రతిగా అతని కొడుకులిద్దరికీ మంచి పదవులు లభించాయి. షాహమీర్ వెనకడుగు వేయటంతో కోటరాణి శక్తిమంతురాలయ్యింది. ఉదయన దేవుడికి రాజ్యాధికారంపై ఆశ ఉంది కానీ, రాచకార్య నిర్వహణ భారంపై ఆసక్తి లేదు. దాంతో రాజ్యం పగ్గాలు కోటరాణి చేపట్టింది. ఇక్కడే కోటరాణి రాజకీయ చతురత తెలుస్తుంది.

‘హైదర్‍’ను సింహాసనంపై కూర్చుండబెట్టి, అతని తరఫున రాజ్యం చేస్తే ‘షాహమీర్’‍కు లోబడి ఉండాలి. రాజ్యం ఇస్లాం మయం అవుతుంది. అదే, ఉదయన దేవుడిని రాజుగా నిలిపి, అతడి పేరు మీద పాలన చేస్తే, కోటరాణికి స్వేచ్ఛ ఉంటుంది. షాహమీర్‍ను అదుపులో పెట్టవచ్చు. కశ్మీరుకు పట్టిన ఇస్లామీయుల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అందుకే కోటరాణి, ఉదయన దేవుడికి రాజ్యం కట్టబెట్టడమే కాకుండా అతడిని వివాహం చేసుకుని రాణి అయింది.

ధీరి వాసీత్తద్దా కోటాదేవి సర్వాధికారిణీ।
రాజా దేహ ఇవాత్యర్థం తదాదిష్టం సమాచరత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 225)

ఆ సమయంలో కోటరాణి సర్వశక్తిమంతురాలయింది. ‘సర్వాధికారిణీ’ అన్న పదం వాడేడు జోనరాజు. రాజు దేహం అయితే, దాని చైతన్యం కోటరాణి అయింది. ఈ శ్లోకాన్ని ఇంతకు ముందు రాజ్యం ఉదయన దేవుడికి అప్పగించినటువంటి శ్లోకంతో పోలిస్తే, కోటరాణి రాజకీయ చతురతనే కాదు, ధర్మభక్తి, దూరాలోచనలు తెలుస్తాయి. భారతీయ రాజులు హ్రస్వదృష్టితో తాత్కాలిక లాభాలపై దృష్టి పెట్టారని, వారికి రాజ్యంపై తప్ప, ఇతరాలపై ఆసక్తి లేదని వ్యాఖ్యానించే చరిత్ర రచయితలకు కోటరాణి గురించి తెలియదు. ధర్మాన్ని నిలపటం కోసం, కశ్మీరు ఇస్లాం సుల్తానుల వశం కాకుండా ఉండటం కోసం, స్వంత కొడుకు ‘హక్కు’ను కూడా, అతడు ఇస్లామీయుడవటంతో  పక్కన పెట్టింది. ద్వితీయ వివాహం చేసుకుంది. రాజ్యంపై పట్టు సంపాదించింది. రాజు బలహీనుడు, అధికారం రాణిది. దాంతో లావణ్యుల లాంటి వారికి ధైర్యం వచ్చింది. రింఛనుడు వీరి నడుమ అనైకమత్యం సృష్టించి అదుపులో పెట్టాడు. సూర్యుడున్నప్పుడు అణగి ఉండి, సూర్యాస్తమయం కాగానే ఆకాశంలో కనిపించే తారల్లా, రింఛనుడు మరణించగానే, లావణ్యులు ప్రాధాన్యం వహించసాగారు అంటాడు జోనరాజు. కోటరాణి అధికారంలో ఉన్న రాజు ఆస్తులపై లావణ్యులు దాడులు చేశారు.

ఉదయన దేవుడు లావణ్యులను ఏమీ అనలేదు. వారి స్థావరాలపై, వారున్న ప్రాంతాలపై దాడులు చేయలేదు. వేద పరిజ్ఞానం ఉన్నవాడిలా, ఆయన సమయమంతా స్నానాలు చేయటం, పూజలు చేయటంపైనే దృష్టి పెట్టాడు. ఉదయన దేవుడు అత్యంత ధార్మికుడు. సమయమంతా పూజలలోనే గడిపేవాడు. ఒక సన్యాసిలా దుస్తులు వేసుకునేవాడు ఉదయన దేవుడు. గుర్రాల మెడల్లో గంటలు కట్టించాడు. ఎందుకంటే, గుర్రాలు కదిలినప్పుడల్లా గంటలు శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దానికి గుర్రాల దారిలో ఉన్న జీవులు అప్రమత్తమై, గుర్రాల కాళ్ళ క్రింద పడి నలగకుండా తప్పించుకుంటాయని వాటి మెడల్లో గంటలు కట్టించేవాడు. తన ఖజానాలో ఉన్న ఆభరణాలన్నీ విష్ణువుకు అర్పించాడు రాజు. ఆ ఆభరణాలతో విష్ణుదేవుడికి కిరీటం, మెడలో హారాలు చేయించాడు. రాజ్య కార్య భారమంతా కోటరాణికి అప్పజెప్పి, ఉదయన దేవుడు పూజలలో గడిపాడు. అంతా సవ్యంగా సాగుతున్నదనుకున్న సమయంలో కశ్మీరంపై ఉపద్రవం వచ్చి పడింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here