జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-27

3
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

స్వంరూపం చిదచిర్భి రేఖారభితో వ్యంజస్మయం నిర్మితైర్యస్సోన్మీలతి దేశకాల కలనాకల్లోలితం తన్మహః।
ఆత్మ వాస్తు శివోస్తు వాస్త్యథ హరిః సోప్యాత్మాభూరస్తువా బుద్ధ వాస్తు జినోస్తు వాస్త్యథ పరస్తస్మై నమః కుర్మహే॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 308)

[dropcap]క[/dropcap]శ్మీరుపై భారతీయుల అధికారం అంతరించి ఇస్లామీయుల పాలన ఆరంభమయ్యే సందర్భంలో జోనరాజు రచించిన శ్లోకం ఇది.

కోటరాణి కశ్మీరం నుంచి రాలిపడిన తారలా అదృశ్యమైపోయింది. ఆమె కొడుకులు ఇద్దరినీ షాహమీరు జైలు పాలు చేశాడు. దాంతో కనీసం, కోటరాణికి, రింఛనుడికి జన్మించిన వాడు కూడా రాజు అయ్యే అవకాశం లేకుండా పోయింది. గమనిస్తే, తన భార్యను, పిల్లవాడిని రింఛనుడు షాహమీరుకు అప్పగించాడు – జాగ్రత్తగా కాపాడమని. కానీ షాహమీరు, రింఛనుడి భార్యతో ఒక రాత్రి గడిపి హతమార్చాడు. అతడి కొడుకుని జైలు పాలు చేశాడు. చంపించి ఉంటాడన్నది నిస్సందేహం. అలాంటి షాహమీర్ ఇప్పుడు కశ్మీరుపై అధికారం సాధించాడు. చరిత్ర పుస్తకాలు రాసిన రచయితలు షాహమీరును ఎంత పొగడాలనుకున్నా ఈ విషయంలో అతడిని విమర్శించక తప్పని పరిస్థితి. కానీ విమర్శను కూడా పొగడ్త స్థాయిలో చేయటం గమనార్హం.

“Shahmir cannot be forgiven for his disloyalty, treachery and deceit, and must be severely censured. But in politics nothing succeeds like success” [History of Muslim Rule in Kashmir, Page No.107].

రాజతరంగిణిలో షాహమీర్ ‘కురుషాహ ‘ వారసుడు. ఆయనకు కశ్మీరు రాజుగా అయినట్టు  కల రావటంతో అదృష్టం పరీక్షించుకోవాలని కశ్మీరు వచ్చాడు. రాజాశ్రయం లభించింది. చక్కని పదవి లభించింది. నెమ్మదిగా అల్లుకుపోయాడు. కల నిజమయింది. కశ్మీరు రాజు అయ్యాడు. రాజతరంగిణి ప్రకారం షాహమీర్ గురించి తెలిసినది ఇంతే. అయితే, కొందరు చరిత్ర రచయితలు షాహమీర్ మత ప్రచారకుడని, మత ప్రచారం కోసం కశ్మీరులో అడుగుపెట్టాడని, అందుకు అవకాశం చూసి రింఛనుడి  మతం మార్చాడని అంటారు. అలా కశ్మీరుపై సుల్తానుల పాలన ఆరంభమవటంలో తన వంతు పాత్ర పోషించాడు షాహమీర్. ఖుతుబుద్దీన్ మహమ్మద్ బిన్ మసూద్ బిన్ ముస్సలా-అల్-షిరాజీ రాసిన ‘తర్జుమా-ఇ-ఇఖ్లిదాస్’ ప్రకారం యూక్లిడ్ రాసిన గణిత శాస్త్ర పుస్తకాన్ని అనువదించమని ‘అమీర్ షా’ అతడిని అభ్యర్థించాడు. షిరాజీ క్రీ.శ. 1312లో మరణించాడు. జోనరాజు ప్రకారం షాహమీర్ 1313-14 సంవత్సరాల నడుమ కశ్మీరు వచ్చాడు. ఖుతుబుద్దీన్ షిరాజీ ప్రస్తావించిన ‘అమీర్ షా’నే జోనరాజు ప్రస్తావించిన ‘షాహమీర్’ అని కొందరు భావిస్తారు. అమీర్ షా ‘ముకిర్-బిన్-తాహిర్’ వంశానికి చెందినవాడు అంటారు. ఎందుకంటే, ఈ ‘తాహరజా’, ‘కురుషాహ’ వంశానికి చెందినవాడు. జోనరాజు ప్రకారం షాషమీర్ ‘కురుషాహ’ వంశానికి చెందినవాడు, కురుషాహ కు ఇద్దరు కొడుకులు, వారిలో పెద్దవాడు తాహరజా అని జోనరాజు రాశాడు  కాబట్టి ‘అమీర్ షా’, ‘షాహమీర్’లు ఒకరే అని తీర్మానిస్తారు.

అయితే అబుల్  ఫజల్ ప్రకారం పాండవ మధ్యముడు అర్జునుడు, షాహమీర్ పూర్వీకుడు. నిజాముద్దీన్ అహ్మద్ ‘తబాకత్’లో ‘షాహమీర్’ పూర్వీకుడు అర్జునుడని తీర్మానించి గుర్షసప్, నెర్రోజ్ వంటి వారు కూడా షాహమీర్ పూర్వీకులని ప్రకటించాడు. ‘గుర్షసప్ అలీ’ అన్నది అల్లావుద్దీన్ ఖిల్జీ మరో పేరు. కానీ పర్షియన్ రచయితలు రాసిన గుర్షసప్ ఇరాన్‍కు చెందినవాడు. కశ్మీరు చరిత్ర రాసిన పర్షియన్ చరిత్ర రచయితలు నిజాముద్దీన్ రాసిన దాన్ని మక్కీకి మక్కి రాసేశారు. ఇలాంటి అనేక అంశాలను ఆధారం చేసుకుని ‘షాహమీర్’, ఇరాన్‍కు చెందినవాడని స్థిరపరిచారు. ఖుతుబుద్దీన్ షిరాజీ ‘షాహమీర్’ను ‘మాస్ఫకరీ ఇరాన్’ (ఇరాన్ రత్న) అనటంతో, ‘షాహమీర్’ ఇరాన్ నుంచి కశ్మీరు వచ్చాడని స్థిరపరిచారు. కానీ ‘బహరిస్తాన్-ఇ-షాహీ’ ప్రకారం షాహమీర్ ‘స్వాట్’ ప్రాంతంలోని బహరిస్తాన్‍కు చెందినవాడు.    షాహమీర్ ‘ఇరాన్’కు చెందినవాడని పర్షియన్ రచయితలు నిరూపించాలని తపన పడితే, భారతదేశంలో పుట్టి పెరిగిన పర్షియన్ రచయితలు షాహమీర్ భారత్ లోనే పుట్టినవాడని నిర్ధారించాలని ప్రయత్నించారన్న మాట. అయితే, ‘షాహమీర్’ ఇరాన్ వాడని నిర్ధారించినా, కశ్మీరుకు చెందినవాడని నిరూపించినా, సమస్య మరింత జటిలమవుతుందని గ్రహించిన అధునిక చరిత్ర రచయితలు, ఈ విషయానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

జోనరాజు మాత్రం తరువాత షాహమీరు పూర్వీకుల గురించి చెలరేగే వివాదాల స్పృహ లేకపోవడంతో అతడు ‘కురుషాహ’ రెండవ సంతానమని, అతడి అన్న తాహరాజు’ అని రాశాడు. షాహమీర్ తన బంధువులు, స్నేహితులతో కల్సి శక సంవత్సరం 1235లో కశ్మీరు వచ్చాడని,  కశ్మీర రాజు  అతడిని ఆదరించాడని రాశాడు.

షాహమీర్ మత ప్రచారకుడని, అతడి ప్రోద్బలంతోనే బుల్‍బుల్ షా కశ్మీరులో అడుగుపెట్టాడని అంటారు. బుల్‍బుల్ షానే రింఛనుడిని ఇస్లాం మతంలోకి మార్చింది. ఆధునిక చరిత్ర రచయితలు ‘షాహమీర్’ మత ప్రచారకుడు కాదని నిరూపించాలని ప్రయత్నిస్తారు.

“But Shahmir was not himself a Muslim missionary. No doubt, he appears to have had long contact and association with Bulbul Shah, who was a missionary. He appears to have been a cultural Muslim refugee who entered the valley independently or with a party of Muslim refugees and made it his future home.” [Cultural History of Kashmir]

అయితే, వీరు షాహమీర్ ముస్లిం ‘రెఫ్యూజీ’ ఎందుకయ్యాడో, ఎలా అయ్యాడో వివరించలేదు. అసలు ఇరాన్ వదిలి కశ్మీరంలో ఆశ్రయం పొందాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కూడా చెప్పరు. జోనరాజు రాజతరగిణిలో, శాహమీర్ రాజవంశానికి చెందినివాడని రాశాడు. వలసవచ్చినవాడని రాయలేదు. ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయివచ్చిన వాడనీ రాయలేదు.  కాబట్టి శాహమీర్ రెఫ్యూజీ అని భావించటం పొరపాటు.

కశ్మీరులో ఇస్లాంను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టిన వ్యక్తి బుల్‍బుల్ షా. ఇతని అసలు పేరు సయ్యద్ షర్ఫ్-ఉద్-దిన్ అబ్దుల్ రహమాన్ షా. ఈయన సుహ్రవర్దీ సూఫీ. ఈయన ప్రభావంతో కశ్మీరులో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇస్లాంను స్వీకరించారు. జోనరాజు రాజతరంగిణిలో మాత్రం ఈయన ప్రసక్తి రాదు. ఈయన ప్రసక్తే కాదు, రాజతరంగిణిలో జోనరాజు ఆ కాలం లోని మత సంబంధ విషయాలను ప్రస్తావించని లౌక్యం ప్రదర్శించాడు. బుల్‍బుల్ షానే కాదు, లల్లాదేవి ప్రసక్తి కూడా జోనరాజు రాజతరంగిణిలో రాదు.

రాజు అయిన తరువాత షాహమీర్ తను పేరును ‘సుల్తాన్  శంసుద్దీన్’గా ప్రకటించుకున్నాడు.

‘షాహమీర్’ రాజు అయి కోటరాణిని, ఆమె కుమారులను నిర్బంధించాడన్న విషయం చెప్తూ ఒక చక్కటి శ్లోకం రాశాడు జోనరాజు. ఈ శ్లోకం చదివితే జోనరాజు మానసిక స్థితిని, చరిత్ర రచనలో అతని దృష్టిని ఊహించే వీలు కలుగుతుంది. మన కర్మల ఫలితాలు ప్రతి దిక్కున కనిపిస్తాయి. వాటి వల్ల మనకు తెలివి అయినా వస్తుంది లేదా మూర్ఖుల్లా మిగులుతాము. కర్మదేవత అయిన ఆత్మకు, శివుడికి, హరికి, బ్రహ్మకు, బుద్ధుడికి, జినుడికి నేను ప్రణమిల్లుతాను. శ్లోకం చివరలో జోనరాజు ప్రదర్శించినది వ్యంగ్యమో, విషాదమో, ఆవేశమో, ఆక్రోశమో అర్థం కాదు. కానీ మొత్తానికి ఎంత నిష్పాక్షికంగా ఉంటూ, సుల్తానులు మెచ్చే చరిత్ర రాయాలని ప్రయత్నించినా, కశ్మీరుపై ఇస్లామీయుల అధికారం స్థిరపడటం జోనరాజును బాధించిందని స్పష్టమవుతుంది.

కర్మ ఫలితంగా కశ్మీరు భారతీయుల చేజారిపోయిందని జోనరాజు భావించటం వెనుక రాజ్యం ఇస్లామీయుల చేతికి చిక్కటానికి దారితీసిన సంఘటనల ప్రభావం ఉందన్నది తప్పనిసరి. ఇస్లామీయులు అధికారానికి వచ్చిన తరువాత, జోనరాజు కాలం వరకూ జరిగిన సంఘటనలను గమనిస్తే, కశ్మీరు ప్రజలు ఆరాధించి, పూజించే ఏ దైవం కూడా  కశ్మీరులో నిలవలేదని తెలుస్తుంది. అందుకే ఆత్మకు, శివుడికి, హరికి, బ్రహ్మకు, బుద్ధుడికి, జినుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు జోనరాజు. ఈ వీరందరికీ, సరిగ్గా, కశ్మీరు సుల్తానుల పాలనలోకి సంపూర్ణంగా జారుకుంటున్న సమయంలో నమస్కారం పెట్టటం పలు రకాల ఆలోచనలకు తావిస్తుంది. ఈ ఒక్క శ్లోకంతో పలు రకాల ఆలోచనలు  కలిగిస్తాడు  జోనరాజు.

సుల్తానుల పాలనలో వారి దైవాన్ని తప్ప మరో దైవాన్ని నమ్మటం నేరం. వారంతా కాఫిర్‍ల పేరిట వివక్షకు గురవుతారు. ఇకపై గతంలోలా జోనరాజు ప్రస్తావించిన దైవాలు ఎవరికీ పూజలు అందవు. గౌరవం ఉండదు. అందుకని చివరిసారిగా అదుకోండి ‘నమస్కారం’ అంటున్నట్లనిపిస్తుంది. వీరికి ఇక కశ్మీరులో మనుగడ లేదు. కాబట్టి కశ్మీరు వదిలి వెళ్ళీపొతున్న వీరందరికి వీడ్కోలుగా నమస్కరిస్తున్నట్లు తోస్తుంది. ఇంతమంది ఉన్నారు, కానీ కశ్మీరు ఇస్లాం మయం కాకుండా ఏ ఒక్క దైవం ఆపలేకపోయాడు. కాబట్టి ‘ఇక దయచేయండి, ఓ నమస్కారం’ అన్నట్లు అనిపిస్తుంది. ‘ఇంతమంది ఉండీ ఏం చేయలేకపోయారు’ అన్న ఆక్షేపణ ‘నమస్కారం’ అనటంలో కనిపిస్తుంది. నిస్సహాయ ఆక్రోశం కనిపిస్తుంది. ఇకపై ‘భవిష్యత్తు శూన్యం, మీకు నమస్కారం’ అన్న  నిరాశ భావన  కలుగుతుంది. చివరిసారి మనస్ఫూర్తిగా, స్వేచ్ఛగా దైవ నామస్మరణ చేస్తున్న భావన కలుగుతుంది. కశ్మీరులో అత్యంత వైభవం అనుభవించిన ఈ దేవలతంతా అణగిపోయి, ఒకే దైవ పాలన మిగిలిందన్న భావన కలుగుతుంది.  భారతీయ దేవతలకు భారతదేశంలోనే మనుగడలేని పాడుకాలం దాపురించిందన్న ఆలోచన ధ్వనిస్తుంది. ఎక్కడినుంచో వచ్చిన దైవం ఇంతమంది దేవతలపై ఆధిక్యం సాధించాడన్న ఆశ్చర్యం కనిపిస్తుంది.  ఈ రకంగా ఈ ఒక్క శ్లోకంతో జోనరాజు పలు విభిన్నమైన భావనలను  కలిగిస్తాడు. కశ్మీరుపై ఇస్లామీయులకు అధికారం చిక్కినప్పటి నుంచి, జోనరాజు రాజతరంగిణి రచించిన కాలం వరకూ జరిగిన సంఘటనలను తెలుసుకున్న తరువాత, మళ్ళీ వెనక్కు వచ్చి, భారతీయుల అధికారం అంతరించి కశ్మీరుపై విదేశీయుల అధికారం ఆరంభమయిన సందర్భంగా రచించిన  ఈ శ్లోకాన్ని చదివితే, అప్పుడు జోనరాజు రచించిన  ఈ శ్లోకాన్ని, దాని వెనుక ఉన్న ఆవేదన, ఆవేశాలను, నిస్సహాయ ఆక్రోశాన్ని మరింతగా అర్థం చేసుకోగలుగుతాం.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here