జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-30

2
12

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఏకోనవింశే వర్షేథ దుష్కృతోద్భవ మద్భుతమ్।
దుర్భిక్షం క్షోభయామాస లోకం శోకాకులం మహత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 358)

[dropcap]క్రీ.[/dropcap]శ. 1344లో అల్లీశ్వరుడు అల్లాఉద్దీన్ పేరుతో కశ్మీరు సింహాసనం అధిష్ఠించాడు. జోనరాజు స్పష్టంగా చెప్పలేదు కానీ రాజతరంగిణిలో ఆయన రచించిన శ్లోకాలను బట్టి మూడవ సుల్తాను రాజ్యంలో ఇంకా భారతీయుల అధికారం సంపూర్ణంగా అంతం కాలేదని అర్థమవుతుంది. సుల్తాన్ అల్లాఉద్దీన్ కొడుకు రాకుమారుడి   ఇద్దరు ప్రధాన సహచరుల పేర్లు ప్రస్తావిస్తాడు జోనరాజు. రాకుమారుడు  ఓ రోజు వేటకు వెళ్ళాడు. అతనితో పాటు వేటకు వెళ్ళినవారు ఉదయశ్రీ, చంద్ర డామరుడు. ఇద్దరూ ఇస్లామేతరులే. దీన్ని బట్టి రాజ్యం ఇస్లామీయుల చేతిలోకి వెళ్ళినా, రాజ్యంలో ఇస్లామేతరులు కీలకమైన పదవులలో ఉండేవారని తెలుస్తుంది. కానీ ఇది ఎంతో కాలం కొనసాగదనీ, కశ్మీరులో మతమార్పిళ్ళ వల్ల పెరుగుతున్న ఇస్లామీయుల సంఖ్య తెలుపుతుంది. అప్పటికి ఇంకా సయ్యద్ అలీ హమదాని కశ్మీరులో అడుగుపెట్టలేదు!

సుల్తాన్  తనయుడు  వాకృష్ట అడవిలో వేటకి వెళ్ళినప్పుడు, అరణ్యంలో ఓ గుహలో యోగినులను చూశాడు. అతనితో ఉన్న ఉదయశ్రీ, చంద్ర డామరులు కూడా యోగినులను చూశారు. తమని చూసి యోగినులు ఎక్కడ అదృశ్యమయిపోతారనని భయపడ్డారు. వారికి యోగినులను చూడాలని, వారితో మాట్లాడాలని ఉంది. వారు తమ గుర్రాలు దిగి నెమ్మదిగా, నిశ్శబ్దంగా యోగినులను సమీపించారు. యోగినుల నాయకురాలు దూరం నుంచే రాకుమారుడిని  చూసింది, గుర్తు పట్టింది. రాకుమారుడి  కోసం మంత్రించిన సురాభాండం పంపించింది. రాజు తనకు కావల్సినంత తాగాడు. మిగిలింది చంద్రకు ఇచ్చాడు. తనకు కావల్సినంత తాగి, చంద్ర మిగిలిన దాన్ని ఉదయశ్రీకి ఇచ్చాడు. ఉదయశ్రీ కూడా తృప్తిగా తాగేడు. కానీ అశ్వపాలకుడికి ఇవ్వటం మరిచిపోయాడు.

ఎదుటివారి చర్యల ద్వారా భవిష్యత్తును గ్రహించగలిగిన యోగిని, వారి భవిష్యత్తు చెప్పింది. “నీ రాజ్యం అఖండ కాలం సాగుతుంది. నీ ఐశ్వర్యంలో కొంత భాగం చంద్ర అనుభవిస్తాడు. జీవించినంత కాలం ఉదయశ్రీకి ఎలాంటి లోటు ఉండదు. కానీ ఈ అశ్వపాలకుడు మాత్రం త్వరలో మరణిస్తాడు” అని చెప్పింది యోగిని. ఆమె చెప్పినట్టే అశ్వపాలకుడు మరణించాడు. భవిష్యత్తు చెప్పిన తరువాత ఇతర యోగినులతో పాటు యోగిని అదృశ్యమయి పోయింది.

జోనరాజు చెప్పిన ఈ యోగినుల కథ అనేక చర్చలకు దారితీసింది. ఎందుకంటే, కశ్మీరు చరిత్ర రచయితలకు జోనరాజు తన రచనలో లల్లేశ్వరి గురించి కాని, హమదాని గురించి కానీ ప్రస్తావించకపోవటం తీవ్రమైన అసంతృప్తిని కలిగించింది. హమదాని కానీ, లల్లేశ్వరి కానీ కశ్మీరు సమాజంపై తిరుగులేని ముద్ర వేసినవారు. కశ్మీరు ఇస్లాంమయం అవటంలో, అంతవరకూ ఎంతో కొంత సహనం ప్రదర్శించిన ఇస్లామీయులు సంపూర్ణ అసహనం ప్రదర్శించి, కశ్మీరు నుంచి ఇస్లామేతరులను తరిమికొట్టటంలో ప్రధాన పాత్ర పోషించినవాడు హమదాని. కశ్మీరులో పెరుగుతున్న ఇస్లాం మత విస్తరణకు, ఛాందసానికి అడ్డుకట్ట వేసి, కశ్మీరులోని భారతీయులలో ధర్మావేశాన్ని జాగృతం చేసి, దైవభక్తిని, ధర్మ రక్షణ దీక్షను రగిలించాలని ప్రయత్నించినది లల్లేశ్వరి. ఆమె వల్ల ‘శైవం’ కశ్మీరులో నిలిచింది. ఆమె ప్రభావంతో నేడు దేశంలోని ఇతర ప్రాంతాల లోనే కాదు, ప్రపంచం లోని ఏ ప్రాంతంలో కూడా లేని విధంగా ఇస్లాంలో ‘ఋషి’ వ్యవస్థ ఏర్పడింది. ఇది కశ్మీరుకే ప్రత్యేకమైన ఇస్లాం రూపం. ఈ సామాజిక, ధార్మిక పరిణామాలను మరో సందర్భానికి వదిలి ముందుకు సాగాల్సి ఉంటుంది. లల్లేశ్వరి గురించి, హమదాని గురించి జోనరాజు ప్రస్తావించలేదని బాధపడుతున్న చరిత్ర రచయితలకు ఈ యోగిని ఉదంతం ఆశలు కలిగించింది. ఈ యోగినులు లల్లేశ్వరి అనుచరులని, యోగినుల నాయకురాలు లల్లేశ్వరి అని కొందరు తీర్మానించారు. తమ పుస్తకాలలో రాసి స్థిరపరచాలని ప్రయత్నించారు. కానీ లల్లేశ్వరి గురించి తెలిసిన వారికి ఈ యోగిని ఉదంతం శైవంలో తాంత్రిక పద్ధతులను పాటించే యోగినులను సూచిస్తుంది. లల్లేశ్వరి  యోగిని – తాంత్రిక యోగిని కాదు. వీరు తాంత్రికులని, మంత్రించిన మద్యాన్ని రాజుకు ఇవ్వటం నిరూపిస్తుంది. లల్లేశ్వరి తన జీవితకాలంలో మద్యం ముట్టలేదు. దాని సేవనాన్ని వ్యతిరేకించింది కూడా. కాబట్టి ఈ యోగినులకు లల్లేశ్వరికి సంబంధం లేదని, వీరు వేరే అని నిశ్చయంగా చెప్పవచ్చు. అయితే ఆ యోగినిని లల్లేశ్వరిగా ప్రచారం చేసిన పర్షియన్ రచయితలకు సుల్తాన్ మద్యం సేవించటం మింగుడు పడలేదు. ఇస్లాంలో మద్యపాన సేవనం నిషిద్ధం. అందుకని యోగిని సుల్తానుకు పాలు  ప్రసాదంగా అందించిందని రాశారు పర్షియన్ రచయితలు. కానీ జోనరాజుకు ఇటువంటివి తెలియదు కాబట్టి విన్నది విన్నట్టు రాశాడు.

జోనరాజు ఎలాంటి ఒత్తిళ్ళ నడుమ, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటూ రాజతరంగిణి రచనను కొనసాగించాడో తరువాత రచించిన రెందు మూడు శ్లోకాలు నిరూపిస్తాయి.

అలిచారతమోమగ్నాన్ జంతూనుద్ధర్తుమీశ్వరాః।
సంభవన్తి ప్రజాపుణ్యైః ప్రవాశోత్కర్షహేత్వః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 345)

అల్లాఉద్దీన్ కశ్మీరంలో అమలులో ఉన్న ఓ సాంఘిక దురాచారాన్ని అరికట్టాడని జోనరాజు రాశాడు. సంతానం లేకుండా భర్తను కోల్పోయిన శీలం లేని స్త్రీకి, తన మామగారి ఆస్తిలో వాటా పొందే దురాచారాన్ని అల్లాఉద్దీన్ అరికట్టాడని రాశాడు జోనరాజు. అంటే, భర్త పోయిన తరువాత సత్ప్రవర్తన ఉంటేనే భర్త ఆస్తిలో వాటా లభిస్తుందన్న మాట. ఆమె ప్రవర్తన సక్రమంగా లేకపోతే ఆస్తిలో వాటా ఉండదు. ఇదీ అల్లాఉద్దీన్ ఏర్పాటు చేసిన నియమం. కశ్మీరు సామాజిక జీవితంపై ఈ నియమం ఎంతో ప్రభావం చూపించింది. ‘సత్ప్రవర్తన లేని భర్త కోల్పోయిన స్త్రీ’ అన్నది రాను రాను ‘సంతానం లేక భర్తను కోల్పోయిన స్త్రీ’ గా చలామణీ అయింది. ఇప్పటికీ కశ్మీరు సామాజిక జీవనంలో ఈ నియమం పాటిస్తారు. ‘డోగ్రా’లు కూడా ఈ నియమం పాటిస్తారు.

అల్లాఉద్దీన్ పాలన కాలంలో కరువు కాటకాలతో  కశ్మీరు అల్లకల్లోలమయింది. దాంతో అల్లాఉద్దీన్ తన రాజధానిని జయపీడపురానికి మార్చాడు. శ్రీరింఛనపురంలో యాత్రికుల కోసం వసతి గృహం నిర్మించాడు. ఇది ప్రధానంగా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి కశ్మీరు వచ్చే యాత్రికుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గృహం. ఇంతకు ముందు, అల్లాఉద్దీన్ సామాజిక సంస్కరణ సమయంలో రాసిన శ్లోకం, ఇప్పుడు కరవు కాటకాలను చెప్తూ రాసిన శ్లోకాల నడుమ జోనరాజు హృదయం దాగి కనిపిస్తుంది.

యోగినుల వరం పొందిన తరువాత – ప్రజల పుణ్యాలను అనుసరించి వారికి రాజు లభిస్తాడు. అలాంటి రాజు రాజ్యాన్ని ఐశ్వర్యవంతం చేస్తాడు. అన్యాయపు అంధకారంలో మునిగిన ప్రజలకు న్యాయం వెలుతురుని అందిస్తాడు అని రాశాడు జోనరాజు. దీన్ని బట్టి అల్లాఉద్దీన్ గొప్ప పాలకుడని, అతడు ప్రజల పుణ్యం కొద్దీ రాజు అయి కశ్మీరుకు ఐశ్వర్యాన్ని అందించి, సుఖశాంతులను ఇచ్చాడని కొందరు పర్షియన్ రచయితలు రాశారు. కానీ రెండు శ్లోకాల తరువాత, ముఖ్యంగా, అల్లాఉద్దీన్ అమలు పరిచిన సామాజిక సంస్కరణల తరువాత కరువును ప్రస్తావిస్తూ అంతకు ముందు రాసిన శ్లోకాలకి పూర్తిగా విరుద్ధమైన అర్థం ఇచ్చే శ్లోకాన్ని రాశాడు. కశ్మీరులో కనీ వినీ ఎరుగని తీవ్రమైన కరువు కాటకాలు సంభవించాయి. మనుషుల పాపాలు ఈ రీతిలో ప్రజలను బాధించాయి అంటాడు జోనరాజు.

రెండు శ్లోకాల ముందు ప్రజల పుణ్యాన్ని అనుసరించి వారికి సుఖాశాంతులను, ఐశ్వర్యాన్ని ఇచ్చే రాజు లభిస్తాడని అన్న జోనరాజు, రెండు శ్లోకాల తరువాత ప్రజల పాపాలు వారిని కరువు కాటకాల రూపంలో పట్టి బాధిస్తాయని అంటున్నాడు. ప్రజలను ఐశ్వర్యవంతులను చేసిన రాజు, ప్రజల పాపాలు కరువు కాటకాలై పీడిస్తున్నప్పటి రాజూ ఒక్కడే. ఇందులో ఏది సత్యం? ఏది నిజం? తరచి చూస్తే, అప్పటిది మాత్రమే కాదు, ఇప్పటి భారతీయుల మనస్తత్వంలోని లక్షణం ఒకటి తెలుస్తుంది.

జోనరాజు సుల్తానులను విమర్శించలేడు. వారి దోషాలను ప్రస్తావించలేడు. వారిని పొగడటం తప్ప, విమర్శించలేడు. అందుకని అల్లాఉద్దీన్ ప్రజల అదృష్టం కొద్దీ రాజయ్యాడు అన్నాడు. పైకి పొగడ్తలా కనిపించినా, శ్లేష ధ్వనిస్తుంది జాగ్రత్తగా గమనిస్తే. ఆ వ్యంగ్యం మరింతగా అర్థమవుతుంది, ప్రజల పాపాలు కరువు కాటకాలై పీడిస్తాయన్న శ్లోకం అర్థం చేసుకుంటే. భారతీయ ధర్మంలో ప్రజలకు ఎలాంటి కష్టం సంభవించినా దోషం రాజుది. ఇస్లాం పాలనలో ప్రజలకు మంచి జరిగితే గొప్పదనం రాజుది. ప్రజలకు చెడు జరిగితే అది వారి పాపఫలితం. ఈనాటికి ఇదే రకమైన తర్కం కొనసాగుతోంది. భారతీయ సమాజంలో ‘చెడు’కు భారతీయ ధర్మం, తత్వం, జీవన విధానాలు కారణాలు. భారతీయ సమాజంలోని మంచికి, ఔన్నత్యానికి విదేశీ దోపిడీదార్లు, విదేశీ పాలకులు కారణం. జోనరాజు ప్రదర్శించిన ఈ రకమైన ఆలోచనా విధానం భారతీయ సమాజంలో స్థిరపడి కొనసాగుతుండటం శోచనీయమైన విషయం. ఈనాటికి కూడా చరిత్ర రచయితలు ఏదైనా ప్రాచీన కట్టడం గొప్పగా కనిపిస్తే అది గ్రీకుల సంపర్కంతో కట్టినదనో, అరబ్బుల సాన్నిహిత్యం వల్ల వెలసినదనో తీర్మానిస్తారు తప్ప, భారతీయుల మేధా ఫలితం అన్న మాట రానీయరు. ఒకవేళ ఎవరైనా దానిపై ఎవరి ప్రభావం లేదు, ఇది భారతీయుల మేధా ఫలితం అన్నారంటే, ‘అన్నీ వేదలలో ఉన్నయష’ నుంచి మొదలుపెట్టి రివాంఛిస్టు, ఫాసిస్టు వరకూ ఉన్న పడికట్టు పదాలన్నీ వాడి దూషిస్తారు. ఈ రకమైన ఆలోచనా విధానానికి బీజం వెయ్యేళ్ళ క్రితం పడింది, ఈనాడు అది దేశం శరీరమంతా వ్యాపించిన విష వృక్షం అయి, శాఖోపశాఖలుగా విస్తరించింది.

పన్నెండేళ్ళ ఎనిమిది నెలల, పదమూడు రోజులు కశ్మీరంపై రాజ్యాధికారం నెరపిన అల్లాఉద్దీన్ క్రీ.శ.1356లో చైత్ర మాసంలో మరణించాడు. అతనికి ఇద్దరు కొడుకులు. వారిలో పెద్దవాడు సుల్తాన్ శహబుద్దీన్ పేరుతో కశ్మీరు పాలన బాధ్యతలు స్వీకరించాడు. ఈయనకే  యోగినులు అఖందకాలం పాలిస్తాడని భవిష్యవాణి చెప్పింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here