జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-32

1
11

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]సు[/dropcap]ల్తాన్ శహబుద్దీన్ జైత్రయాత్రను వివరించిన తరువాత జోనరాజుకు సందేహం వచ్చింది. తాను రాసినదంతా చదివి భావి తరాల వారు అంతా కల్పితం, కట్టుకథ అని అనుకుంటారేమోనన్న భయం జోనరాజుకు కలిగింది. అందుకని అంతా కట్టుకథ అనుకుంటారు, నన్ను పొగడ్తల రాజు అనుకుంటారు అన్న భయం వ్యక్తపరిచాడు.  బహుశా, జోనరాజు కాలానికే కల్హణ రాజతరంగిని లోని అత్యద్భుతమైన విషయాలను అప్పటి ప్రజలు కల్పనలనీ, అతిశయోక్తులనీ కొట్టి పారేస్తున్నారేమో!

జోనరాజు కాలానికి కశ్మీరీ ప్రజలకు శాంతి సౌఖ్యాలు, ఐశ్వర్యాలు అంటే తెలియని పరిస్థితి వచ్చింది. తమ గతం గొప్పదంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. భారతీయ రాజుల నుంచి కశ్మీరం ఇస్లామీ సుల్తానుల వశం అయిన తరువాత, జోనరాజు కాలం వచ్చేసరికి ‘సికందర్ బుత్‌షికన్’ వల్ల కశ్మీరులో కేవలం 13 పండితుల కుటుంబాలు అంటే ఇస్లామేతర కుటుంబాలు మిగిలాయి. వీరిని కూడా మతం మార్చటమో, తరిమి వేయటమో జరిగి ఉండేది కానీ ‘సికందర్ బుత్‌షికన్’ మరణం తరువాత జైనులాబిదీన్ రాజవటం వల్ల అది ఆగింది. జైనులాబిదీన్ పరమత సహనం వల్ల కశ్మీరు వదిలి పారిపోయిన పండిత్ కుటుంబాలు మళ్ళీ కశ్మీరు తిరిగి వచ్చాయి. కాబట్టి, సంపూర్ణంగా ఇస్లాంమయం అయిన తరువాత ఇస్లామేతరుల గొప్పతనం ఒప్పుకునే ప్రసక్తి లేదు. వారి గొప్పతనానికి చిహ్నమైన దానిని దేన్నీ బ్రతకనిచ్చే వీలు లేదు. కట్టడాలను కూల్చటం, నగరాలు, పల్లెల పేర్లు మార్చటం, గతంతో సంబంధం తెంపడం ఇస్లాం ఆధిక్యతను స్పష్టం చేసే అంశాలు. అందుకే ఇస్లామీయులు ఆధిక్యం సంపాదించిన ఏ ప్రాంతం కూడా తన అసలు పేరుతో మనలేదు. ఇస్లామీ పేరుతోనే ప్రచారానికి వచ్చాయి. ఇది భారతదేశంలోనే కాదు, ఇస్లామీయులు ఆధిక్యం సాధించిన ఏ దేశంలోనైనా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో బమియన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్లు పేల్చేయటం, ఇప్పటికీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో మందిరాలు, ప్రాచీన కట్టడాలు దాడులకు, కూల్చివేతలకు గురికావటం ఈ నిజానికి నిరూపణలు. ప్రాంతాల పేర్లు మార్చటం, కట్టడాలు కూల్చటం, మత మార్పిళ్లు, వారి ఆధిక్యతకు నిదర్శనాలు. ఇలాంటి పరిస్థితులలో కశ్మీరుకు ప్రాచీన చరిత్ర ఉందని, గొప్ప రాజులు అతి గొప్పగా రాజ్యం చేశారనీ ఆమోదించే పరిస్థితులు జోనరాజు నాటికి లేవని అనుకోవటం సమంజసం అవుతుంది. కాబట్టి, ఈనాడు ప్రాచీన కశ్మీర రాజుల గొప్పతనం ఒప్పుకునే స్థితిలో సమాజం లేదు. కొన్నాళ్లకు శహబుద్దీన్ గొప్ప పనులను కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదన్న ఆశాభావాన్ని జోనరాజు వ్యక్తపరుస్తున్నాడు. ఆశాభావం ఎందుకంటే, కల్హణ రాజతరంగిణి, జోనరాజ రాజతరంగిణిలు చదువుతుంటే, అడుగడుగునా ‘ఏదీ శాశ్వతం కాదు, భవిష్యత్తులో అసంభవం అన్నది ఏదీ లేదు’ అన్న భావనలు కనిపిస్తూంటాయి. భారతీయ రాజులకు కాలం చెల్లింది. ఇస్లామీయుల యుగం నడుస్తోంది. భవిష్యత్తులో వీరికి కాలం చెల్లిపోతుంది. అప్పుడు వీరి గొప్ప పనులూ విస్మృతిలో పడతాయి అన్న ఆలోచన జోనరాజు శ్లోకంలో కనిపిస్తుంది.

శహబుద్దీన్‌ను లలితాదిత్యుడితో పోల్చటం వెనుక ఒక ఆలోచన, ఒక పథకం కనిపిస్తుంది. ఇది కల్పిత రచయితలు ఇప్పటికీ వాడుతున్న పద్ధతి. జోనరాజు శహబుద్దీన్ గొప్పతనాన్ని చెప్పేందుకు అతడిని లలితాదిత్యుడితో పోల్చాడు. వెంటనే ఎవరీ లలితాదిత్యుడు అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు లలితాదిత్యుడి గొప్పతనం గురించి తెలుసుకుంటాడు పాఠకుడు. ఆ రకంగా లలితాదిత్యుడి పేరు పదిమందికీ తెలుస్తుంది. భారతీయ రాజులు గొప్పవారు కాదు అంటే లలితాదిత్యుడు గొప్పవాడు కాకుండా పోతాడు. లలితాదిత్యుడిని గొప్పవాడు కాదంటే, శహబుద్దీన్‌ని కూడా గొప్పవాడు కాదనాల్సి ఉంటుంది. దాంతో శహబుద్దీన్ గొప్పతనం పోల్చి నిలిపేందుకయినా లలితాదిత్యుడు గొప్పవాడని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా సమాజంలో లలితాదిత్యుడి పేరు నిలుస్తుంది. పర్షియన్ రచయితలు శహబుద్దీన్ గొప్పతనం చెబుతారు. పరిశోధకులు ఒక పుస్తకంలోని రిఫరెన్స్ ద్వారానో, ప్రస్తావన ద్వారానో మరో రచయిత గురించి తెలుసుకునేట్తు శహబుద్దీన్‌ను లలితాదిత్యుడితో పోల్చటం వల్ల భావితరాలకు లలితాదిత్యుడి గురించి తెలిసే వీలు కలుగుతుంది. గత చరిత్రను తరువాత తరాలకు సజీవంగా అందించే ప్రయత్నాలలో ఇదొక ప్రయత్నం.

ఆంగ్ల రచయితలు తమ రచనలను ప్రాచీన కవుల నుంచి ఉదహరిస్తూ ఆరంభిస్తారు. ఏదో ఒక రకంగా ఆ కవులు, వారి కావ్యాలను సజీవంగా ఉంచే విధానం అది. తెలుగులో విశ్వనాథ సత్యనారాయణ తన ప్రతి రచనలో ఇలాంటి అనేకానేక అంశాలను, సంస్కృత శ్లోకాలను పొందుపరుస్తారు. దాంతో ఆ నవల చదివిన వారికి భారతీయ సంస్కృతి, సంప్రదాయలతో పాటు ప్రాచీన తాత్విక చింతన, వాఙ్మయాలతో పరిచయం కలుగుతుంది. ఆసక్తి కలవారు ఆ విషయమై పరిశోధిస్తూ ముందుకు సాగుతారు. విశ్వనాథ వారి రాజతరంగిణి ఆధారిత  కాశ్మీర రాజవంశ నవలలు చదవడం వల్ల రాజతరంగిణి గురించి తెలిసింది. కల్హణుడి రాజతరంగిణి పై ఆసక్తి కలిగింది. కల్హణుడి రాజతరంగిణివల్ల  కశ్మీరుకు చెందిన ప్రాచీన పురాణం నీలమత పురాణం గురించి తెలిసింది. అలా తవ్వుకుంటూ పోతే, జోనరాజు, శ్రీవరుడూ, ప్రజ్ఞాభట్టు, శుకుల రాజతరంగిణిలు పరిచయమయ్యాయి. ఈ రచన సాధ్యమైంది. కేవలం పాఠ్యపుస్తకాల ద్వారా విజ్ఞాన విస్తరణ, సమాచార పంపిణీ సాధ్యం కాదు. సృజనాత్మక రచయితల రచనలు ఆ పనిని సమర్థవంతంగా, అత్యంత ఆకర్షణీయంగా చేస్తాయి. అందుకే జోనరాజు శహబుద్దీన్‌ను లలితాదిత్యుడితో పోల్చటం. అలా పోల్చటం వల్ల పర్షియన్ రచయితలు లలితాదిత్యుడి గురించి తెలుసుకున్నారు. తమ రచనల్లో లలితాదిత్యుడిని ప్రస్తావించారు. దాంతో, లలితాదిత్యుడి ఉనికిని ఒప్పుకోక తప్పలేదు ఆధునిక చరిత్ర రచయితలకు. అయినా సరే, కల్హణుడు రాసినట్టు లలితాదిత్యుడికి చైనా రాజు తలవంచాడని నమ్మలేదు. టాంగ్ వంశపు రాతలలో లలితాదిత్యుడు సామంతరాజు అన్నట్టు ఉంది కాబట్టి కల్హణుడు తప్పు రాశాడని తీర్మానించారు. ఎంతయినా అబద్ధం చెప్పేది మనవాళ్ళే కదా, పరాయి వాడు చెప్పేది నిజం! బానిస మనస్తత్వానికి చక్కటి ఉదాహరణ.

ఇంతకీ శహబుద్దీన్‌తో లలితాదిత్యుడిని పోల్చటం సబబా అంటే కాదనిపిస్తుంది. కానీ లలితాదిత్యుడి లాగే శహబుద్దీన్ ఉత్తర ప్రాంతాల వైపు దాడికి వెళ్లాడు. అఫ్ఘనిస్థాన్ దాకా గెలిచాడు. లలితాదిత్యుడు ఇంకా ముందుకు వెళ్ళాడు. తూర్పు వైపు కొన్ని ప్రాంతాలు గెలిచాడు శహబుద్దీన్. నేపాల్, ప్రాగ్జోతిషపురాలను గెలిచాడు లలితాదిత్యుడు. శహబుద్దీన్ సట్లెజ్ నది వరకూ వచ్చాడు. లలితాదిత్యుడు వింధ్య పర్వతాలను దాటి కర్నాటక వరకూ గెలిచాడు. అంటే, ఒక విస్తృతమైన భారతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడన్న మాట లలితాదిత్యుడు. శహబుద్దీన్ అలా ఏమీ చేయలేదు. కానీ లలితాదిత్యుడితో పోల్చటం వల్ల శహబుద్దీన్ స్థాయి పెరిగింది. లలితాదిత్యుడు భావితరాలకు సజీవంగా అందే వీలు చిక్కింది.

జోనరాజు ప్రకారం శహబుద్దీన్ గెలుచుకున్న దేశాలు నగరాల పేర్లు: ఉదభాండపురం, సింధు, గాంధార, శింగా, గజని, అష్టానగర, పురుశరీర, నగరాగ్రహార, హిందుఘోష. ఇవన్నీ ఉత్తర ప్రాంతాలు.

దక్షిణాన శతద్రు వరకూ  గెలిచాడు.

ఇప్పుడు శహబుద్దీన్ పోరాడిన జాతులు, వీరుల ప్రస్తావనను తీసుకుంటే ఆయా జాతులు ఉండే ప్రాంతాలను భౌగోళికంగా గుర్తించే వీలు చిక్కుతుంది.

ఉత్తరాన పారశీక జాతులపై దాడి చేశాడంటాడు జోనరాజు. పురాణాల ప్రకారం ఇండస్, ఓక్సస్ నది (మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్థాన్‍ల నడుమ ఉన్న ఆమాదార్య అనే నది) నడుమ ప్రాంతం. ఈ దారిలో ఉన్నవే ఉదభాండపురం, సింధు, గాంధారలు. ‘అటాన్’ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఉదభాండపురం. ‘సింధు’ అని జోనరాజు వాడిన ప్రాంతాన్ని ‘నీలాబ్’ అనే ఎగువ ఇండస్‍కు చెందిన ప్రాంతంగా గుర్తించారు. జోనరాజు ప్రస్తావించిన ‘శింగా’ను జమ్మూకు చెందిన ‘చింగా’ ప్రాంతంగా భావిస్తున్నారు.

జోనరాజు ప్రస్తావించిన ‘అష్టనగర’ ప్రాంతం పెషావర్‍కు చెందిన ఎనిమిది నగరాలుగా భావిస్తున్నారు. పురుషపురను పెషావర్‍గా గుర్తించారు. శహబుద్దీన్ గెలుచుకున్నట్టుగా చెప్పిన నగరాగ్రహారను ఆధునిక ‘జలాలాబాద్’ లోని ‘నంగ్నాహార్’గా గుర్తించారు. హిందుఘోషను, హిందుకుష్ పర్వతాలుగా భావిస్తున్నారు. శతద్రు అంటే ఆధునిక సట్లెజ్ నది. జోనరాజు ప్రస్తావించిన ‘ఉదకృతి’ని మంగోలు దోపిడీదారుగా భావిస్తున్నారు. ‘ఫిరోజ్ షా’ ఢిల్లీ సుల్తానుగా ఉన్నప్పుడు ఢిల్లీ పై దాడి చేసి కొల్లగొట్టి వెళ్తున్న ఉదకృతి దారిని శహబుద్దీన్ అడ్డుకున్నాడంటున్నాడు జోనరాజు. శహబుద్దీన్ గెలుచుకున్న ‘సుశర్మపుర’ రాజు తల దాచుకున్న మాతాదేవి (వజ్రేశ్వరి దేవి) మందిరం వల్ల ఈ ప్రాంతం కంగ్రా లోయ ప్రాంతంగా గుర్తించారు. అయితే జోనరాజు రాజతరంగిణిని సరిగా అర్థం చేసుకోలేని పర్షియన్ రచయితలు ‘ఉదకృతి’ని, ‘సుశర్మపుర’ రాజునూ ఒకరిగా భావించి అనువదించారు. ఈ తప్పును తరువాత రచయితలు కొనసాగించారు. ఇప్పటికీ ఈ తప్పు కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా శహబుద్దీన్ గెలుచుకున్నట్టు జోనరాజు చెప్తున్నదంతా నిజమేనని పరిశోధనల వల్ల చరిత్రకారులు నిర్ణయించారు. కానీ పర్షియన్ రచయితలు తమ రచనలలో శహబుద్దీన్ – బదక్షణ్, ఖురాసాన్, హిరత్ లతో సహా పలు మంగోలుల ప్రాంతాలను గెలిచాడని రాశారు. వీటికి ఎలాంటి నిరూపణలు లేవు. పైగా, మంగోలులు అంత సులభంగా శహబుద్దీన్‌కు లొంగి అతడికి దారి ఇచ్చి ఉంటారనీ నమ్మే వీలు లేదు. శహబుద్దీన్ సామ్రాజ్యం అంటూ ఓ బ్రహ్మాండమయిన చిత్రపటం తయారు చేశారు పర్షియన్ రచయితలు. అయితే, తమ గొప్పతనం గురించి ఎదుటివారు ఎన్నెన్ని నమ్మలేని అద్భుతాలు చెప్పినా నమ్ముతాం కానీ, మన గురించి మనవారు ఉన్నది ఉన్నట్టు చెప్పినా, దానిని కట్టుకథ, నమ్మశక్యం కానిది అని కొట్టిపారేస్తాం.

ఇలా జైత్రయాత్ర సాగిస్తూ సైన్యంతో కలిసి ప్రయాణిస్తున్న సుల్తాన్ ఒక రోజు ఓ అందమైన అప్సరస లాంటి అమ్మాయి గురించి విన్నాడు. లేడి కళ్ళను పోలిన కళ్ళు కలిగిన ఆమె పొందు కోసం తపించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here