జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-35

0
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ఉత్పన్న చణ్పకం  దీప్త్యా కుర్వతీం వ్యోమ జాతుచిత్।
స్వప్నే శర్కరసూహాఖ్యా దృష్టివాన్ కాంచనీ పురీమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 481)

[dropcap]దు[/dropcap]ష్టుల మాటల ప్రభావంతో వీరుడైన మదనలావికుడు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నాడని సుల్తాన్ నమ్మాడు. సుల్తానుల ఆశ్రయంలో ఉన్న ఇస్లామేతరులందరూ ఇలాంటి కుట్రలను ఎదుర్కోవాల్సి రావటం సర్వసాధారణం. మదనలావికుడికి సుల్తాన్ స్వయంగా ఉన్నత పదవులు ఇచ్చాడు. అతడికి సుల్తాన్ ఇస్తున్న ప్రాధాన్యం నచ్చని దుష్టులు రాజుకు మదన లావికుడికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. “మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే అతడు మీతో సమానుడయ్యాడు. ఇప్పుడు మిమ్మల్ని మించి పోవాలనుకుంటున్నాడు” అని సుల్తాన్ మనసును పాడు చేశారు. దాంతో సుల్తాన్ మదనలావికుడిపై చర్యలు తీసుకోవాలనుకున్నాడు. కానీ మదన లావికుడి ధైర్యం, శౌర్యాలు సుల్తాన్ త్వరపడి ఏ చర్యనయినా తీసుకోవటంలో అడ్డు పడ్డాయి. మదన లావికుడికి సుల్తాన్ ఆలోచన అర్థమయింది. సైన్యంతో అతడు సుల్తాన్‍ను ఎదుర్కునేందుకు సిద్ధమయ్యాడు. ససైన్యంగా బయలుదేరిన సుల్తాన్ సింధునది పై ఉన్న వంతెను నాశనం చేశాడు. దాంతో మదనలావికుడు ఖడ్గనగరి వద్ద ఆగిపోయాడు.

అనుకున్న రీతిలో యుద్ధం సాగకపోవటంతో సుల్తాన్ వేటకని బయలుదేరాడు. కాసేపటికి అతను సైన్యానికి దూరమయ్యాడు. రాజు ఒక్కడే వేటకు వెళ్ళటం గమనించిన మదనలావికుడు రాజును అనుసరించాడు. వేట కోసం అడవిలో దూసుకు వెళ్తున్న సుల్తాన్‍కు సింహం ఎదురు పడింది. సింహం సుల్తాన్ పైకి లంఘించింది. సింహానికి, సుల్తాన్‍కు నడుమ ఘోరమైన పోరు సాగింది. చివరికి సింహం సుల్తాన్‍ను క్రింద పడేసి అతడి పైకి దూకింది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న మదనలావికుడు తన అశ్వం మీద నుంచి క్రిందకు దూకి, రాజుపై దూకుతున్న సింహాన్ని కత్తితో పొడిచి చంపేశాడు.  అప్పుడు సుల్తాన్‍కి మదనలావికుడి విధేయత అర్థమైంది. తన చుట్టూ ఉన్నవారు చెప్పినవన్నీ అసత్యాలని గ్రహించాడు. తన ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతా సూచకంగా మదన లావికుడికి బోలెడంత ధనాన్ని అర్పించాడు. కానీ, కశ్మీరులో మదనలావికుడు సురక్షితంగా ఉండలేడని సుల్తాన్ గ్రహించాడు. వివాహం నెపం మీద మదనలావికుడిని ఢిల్లీ పంపించాడు.

మదనలావికుడిలాంటి   సంఘటన బారతీయ చరిత్రలో పలు సందర్భాలలో కనిపిస్తుంది. భారతీయులు సుల్తాన్‍కు విధేయులుగా, విశ్వాసంగా ఉంటారు. వారి ధైర్య, శౌర్య, సాహసాలకు మెచ్చి సుల్తానులు వీరికి ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఉన్నత పదవులు అప్పచెప్తారు. కానీ ఇది రాజసభలో ఉన్న ఇస్లామీయులకు నచ్చదు. వారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తారు. అతడిపై రాజుకు చాడీలు చెప్తారు. రాజు వారి మాటలు నమ్మి ఆ వ్యక్తికి హాని తలపెడతాడు. కానీ ఆ వ్యక్తి అవసరమైనప్పుడు రాజు ప్రాణాలు కాపాడి తన విధేయతను నిరూపించుకుంటాడు. కొన్ని సందర్భాలలో అతని మరణం తరువాత రాజుకు నిజానిజాలు తెలుస్తాయి. ఇలాంటి సంఘటనలు ఒక విషయం స్పష్టం చేస్తాయి. భారతీయులకు రాజు మతంతో, ధర్మంతో సంబంధం లేదు. వాడు రాజు అయితే చాలు, వాడికి విధేయత ప్రకటిస్తారు. వాడి రక్షణ కోసం ప్రాణాలు అర్పిస్తారు. ఎందుకంటే, రాజు దైవ స్వరూపం కాబట్టి, అతడిని గౌరవించటం, రక్షించటం తమ ధర్మం అవుతుంది. రాజు బౌద్ధుడా, మ్లేచ్ఛుడా అన్నది అంత ప్రధానం కాదు. రాజు అవటమే ప్రాధాన్యం. ఇది భారతీయుల లక్షణం. ఢిల్లీలో సుల్తానుల పాలన వచ్చిన తరువాత, ఈ మార్పువల్ల సంభవించిన మార్పులను అర్ధం చేసుకోలేని కొందరు బ్రాహ్మణ పందితులు రోజూ బాబర్ కోట ముందు నిలబడి ఆశీర్వచనాలు పలికేవారు. రోజూ వచ్చి అడిగినా, అడగకున్న వినిపించే ఆశీర్వచనాలు బాబర్‍కు చిరాకు కలిగించాయి. ఫలితంగా ఒకరోజు రాజభటులు ఈ బ్రాహ్మణులను పట్టి మతం మారతరా? చస్తారా? అనడిగారు. వారిలో ఎందరు మతం మారారో, ఎందరు ప్రాణాలు విడిచారో తెలియదుకానీ, రాజు అన్నవాడు ధర్మ పాలన చేస్తాడని, మతంతో సంబంధంలేకుండా రాజును భారతీయులు గౌరవిస్తారనీ, రాజులు మారినా జీవన విధానాలు మారవని భారతీయులు నమ్మేవారు. ఇస్లామీయుల పద్ధతులు అలవాటయ్యేవరకూ, ఈ నమ్మకం కొనసాగింది.   అందుకే వారు రాజు మతం, ధర్మం వంటి విషయాలతో సంబంధం లేకుండా రాజుకు మద్దతు తెలిపారు. రాజ వ్యతిరేక చర్యలను దైవ ద్రోహంలా భావించారు. పలు సందర్భాలలో రాజును సమర్థిస్తూ, స్వీయ ధర్మ రక్షణ కోసం పోరాడే వారిని వ్యతిరేకిస్తూ పోరాడేరు కూడా. భారతీయుల మనస్తత్వంతో పరిచయం లేని వారికి ఇది, వింతగా, అర్థం లేనిదిగా కనిపిస్తుంది. కానీ ఇది ఓ లక్షణం. అందుకే రాజును వ్యతిరేకించి పోరాడిన పుష్యమిత్రుడిని, చాణక్యుడిని భారతీయులు ప్రత్యేకంగా చూస్తారు. దుష్టులయినా రాజకుటుంబీకులను సమర్థించిన రాక్షసమంత్రిని గౌరవిస్తారు.

‘శర్కరసింహ’ అనే వాడొకడికి ఓ రోజు ఓ కల వచ్చింది. ఆ కలలో అతడు స్వర్ణమయమైన పట్టణాన్ని చూశాడు. ఆకాశంలో చంపక పూలల్లా మెరుస్తోంది ఆ పట్టణం. ఆ పట్టణంలో అతడు ప్రతి ఇంట్లోకి వెళ్ళి చూశాడు. బయట బంగారంతో ధగధగ లాడిపోతున్నా, లోపల ఇళ్ళు మాత్రం శూన్యంగా ఉన్నాయి. అలా ఒక ఇంట్లోంచి మరో ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఓ ఇంట్లో అతనికి అత్యంత సౌందర్యంతో ప్రకాశిస్తున్న ఓ మహిళ కనిపించింది. ఒంటరిగా ఈ నిర్మానుష్య నగరంలో ఆమె ఎందుకని నివసిస్తోందో అతడు అడిగాడు. ఆమెకు ఇలా ఒంటరిగా నివసించటం భయంగా లేదా అని అడిగాడు. ఈ నగరం ఎవరిదనీ అడిగాడు. నగరంలో మనుషులు ఎందుకు లేరని ఆమె ఎదురుగా ఉన్న శరీరం ఎవరిదని అడిగాడు.

అతని ప్రశ్నలకు ఆ అందమైన అమ్మాయి సమాధానం ఇచ్చింది. తన ఎదురుగా ఉన్న శవం తన భర్తది అని చెప్పింది. అతను లేని నగరం చంద్రుడు లేని రాత్రి లాంటిది అయిందన్నది. ఆ నగరం గంధర్వులకు చెందినదని చెప్పింది. కశ్మీరును పాలించేందుకు రాజు, తన శరీరాన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడని, అతనితో పాటు మంత్రులు కూడా కశ్మీరు వెళ్ళారని చెప్పింది. ముల్లోకాలలో తమ రాజు ‘శాహవాదిన’ పేరుతో ప్రసిద్ధుడని చెప్పింది. భూమి మీద తన పని పూర్తి అయిన తరువాత రాజు తిరిగి తమ గంధర్వ లోకానికి వస్తాడనీ, తన శరీరంలో ప్రవేశిస్తాడనీ, అందుకని ఆ శరీరానికి కాపలాగా తాను ఒక్కర్తినే ఉన్నాననీ చెప్పిందామె. అంతే కాదు, ఇంకో మూడు నెలల్లో రాజు తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు భూమిని కదిలిస్తాడని కూడా చెప్పిందామె. ఇస్లామీయులు రాజ్యాధికారాన్ని సాధించటానికి  ప్రామాణికతనిస్తూ, వారి అధికారానికి జన సామాన్యంలో ఆమోదాన్ని సంపాదించే ప్రక్రియ ఇది.

అప్పుడు శర్కరసింహుడికి మెలకువ వచ్చింది. తాను కన్న కలకు ఆశ్చర్యపోతూ, మూడు నెలల్లో రాజు భూమి వదిలి వెళ్ళిపోతాడన్న సమాచారానికి బాధ పడుతూ అతడు ఆలోచించాడు. చివరికి తన కలను రాజుకు చెప్పాడు. అతడి కల విని రాజు విచారించలేదు. ఈ కల అబద్ధమైతే సమస్య లేదు. నిజమైతే, మరణం తరువాత తనకు మానవాతీత శక్తులు లభిస్తాయని సంతోషించాడు. కల నిజమైతే, మూడు నెలల్లో తనకు మరణం సంభవిస్తుందన్న మాట అతడిని బాధించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా తన కొడుకులకు కబురు పెట్టాడు, కశ్మీరం తిరిగి వచ్చేయమని. అయితే సుల్తాన్‍కు వైరాగ్య భావనలు కలిగాయి. తన ఆస్తిని పంచాడు. హిందుఖాన్‍కు బాధ్యతలు అప్పచెప్పాడు. లౌకిక సంవత్సరం 495, శుక్ల పక్షం ఎనిమిదవ రోజు సుల్తాన్ మరణించాడు. అంటే క్రీ.శ. 1373వ సంవత్సరంలో సుల్తాన్ మరణించాడు.

సుల్తాన్ మరణం తరువాత అతని సోదరుడు ‘హిందుఖాన్’ రాజ్యభారం స్వీకరించాల్సి వచ్చింది. తన కుమారులను కశ్మీరుకు రమ్మని మరణించే ముందు సుల్తాన్ కబురు పంపేడు కానీ, ఆ వార్త అందుకుని సుల్తాన్ కొడుకులు కశ్మీరు వచ్చేలోగానే సుల్తాన్ మరణించాడు. దాంతో సుల్తాన్ సోదరుడు హిందుఖాన్, లేక, ‘కుంభదీనా’ కశ్మీరు రాజయ్యాడు. తబాకత్-ఇ-అక్బారీ, తారీఖ్-ఇ-ఫరిష్తాల  ప్రకారం హిందుఖాన్ రాజ్యభారం స్వీకరించే ముందరి నామం ‘హిందాల్’. అందుకని జోనరాజు ‘హిందుఖాన్’ అని రాసి ఉంటాడు. అయితే రాజ్యభారం స్వీకరించిన హిందుఖాన్ ‘ఖుతుబుద్దీన్’ అన్న నామాన్ని స్వీకరించాడు. ఆ ఖుతుబుద్దీన్‍ను జోనరాజు ‘కుంభదీనా’ అన్నాడు. కాబట్టి ‘హిందాల్’ ను ‘హిందుఖాన్’ అనటంలో ఆశ్చర్యం లేదు.

రాజు అవుతూనే ఖుతుబ్-ఉద్-దీన్ అందరినీ ధనంతో కొనేశాడు. తన మాట ఇతరులు వినేట్టు చేసుకున్నాడు. సూర్యుడు అందరి హృదయాలను గెలుచుకునేట్టు ఖుతుబ్-ఉద్-దీన్ అందరినీ అదుపులోకి తెచ్చుకున్నాడు. ఈ రాజు మరీ శక్తిమంతుడు కాడు, మరీ బలహీనుడు కాదు.

శాహబుద్దీన తన జీవితకాలంలో  గూఢచారులను నలుదిశలా పంపించాడు సుల్తాన్. వారిలో  లోహారం వైపు వెళ్ళినవాళ్ళు లోహార రాజు శక్తిని చూసి బయపడి పారిపోయి వచ్చారు. చంద్రుడు దిగిపోయేటప్పుడు అన్ని గ్రహాలు తమ వెలుగును కోల్పోతాయి. అలాగే సూర్యుడు అస్తమిస్తే సూర్యబింబం వెలుతురు కనబడదు. అలా, లోహార రాజు శౌర్యం చూసి అందరూ భయపడ్డారు. దాంతో లోహార రాజును గెలిస్తే కానీ తనంటే ప్రజలకు భయం ఉండదని భావించిన ‘కుంభదీనుడు’, లోహారం పై యుద్ధానికి శక్తిమంతుడైన డామరుడు లోలకుడిని పంపాడు. లోలకుడు తన సైన్యంతో లోహారాన్ని నలువైపులా చుట్టుముట్టాడు. ఇక్కడ ఓ గమ్మత్తయిన శ్లోకం రాశాడు జోనరాజు.

ప్రాణాహి స్వామిభక్తానం మృగాయన్తే మహాత్మానామ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 469)

స్వామి సేవలో మహాత్ములు తమ  స్వీయ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు. డామరుడు లోలకుడి దాడిని లోహార రాజు తట్టుకోలేకపోయాడు. సంధి కోసమని బ్రాహ్మణులను లోలకుడి దగ్గరకు పంపాడు. అయితే, లోలకుడు ఈ బ్రాహ్మణులను గూఢచారులు అనుకున్నాడు. వారిని నిందించాడు, దూషించాడు.

తాము దైవాలుగా భావించే బ్రాహ్మణులతో అనుచితంగా వ్యవహరించి, వారిని లోలకుడు శిక్షించటం లోహరాజుకు ఆగ్రహం కలిగించింది. తన ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాము పోరాడినా, పారిపోయినా మరణం తప్పదని గ్రహించిన లోహార ప్రజలు, రాజు,  తమ క్షత్రియ ధర్మం పాటించారు. వారు రాళ్ళు విసురుతూ, బాణాలు ప్రయోగిస్తూ లోహార పర్వతం దిగి శత్రువులపై విరుచుకు పడ్డారు. వారు ఎంతగా పర్వతం దిగితే అంతగా వారి ఖ్యాతి ఆకాశాన్ని తాకింది. డామర లోలకుడు రాళ్ళు తగిలి మరణించాడు. తన దుశ్చర్యలకు ఫలితం అనుభవించాడు. పాపపు కర్మల ఫలితం నుంచి ఎవరు తప్పించుకోగలరు? శత్రువు విసిరిన రాళ్ళు డామర లోలకుడికి అంత్యక్రియలు జరగని లోటును తీర్చాయి. యవనుల్లా సమాధి శవాన్ని కప్పినట్టు అతడిని రాళ్ళు సమాధిలా కప్పాయి.

శత్రు కీర్ణ శిలా రాశిచ్ఛన్నో డామర లోలకః।
యవన ప్రేత సంస్కారాన్న విషద్యప్య పీయత॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 476)

ఎంతో అమాయకంగా కనిపించే ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే జోనరాజులో అంతర్గతంగా ఉన్న ఆవేదన, ఆవేశ , నిరాశలను గమనించే వీలు చిక్కుతుంది.

ఎంతో మంది ముస్లిం చరిత్ర రచయితలు జోనరాజు రాసిన ఈ లోలక ఉదంతాన్ని తమ చరిత్ర పుస్తకాలలో ప్రస్తావించలేదు. ప్రస్తావించిన వారు కూడా డామర లోలకుడు లోహారంపై విజయం సాధించినట్టు రెండు ముక్కల్లో రాసి వదిలేశారు.

“Soon after Qutb-ud-din sent his army against Punch.  The Punch garrison put up gallant resistance at the fort of Lohkot, but they were compelled to surrender.  The prestige  of Kashmir were vindicated. But in the action, Kashmiris lost their Commander-in-chief Lola Damara.”

(History of Kashmir under Muslim Rule, by R. K. Parmu)

ఈ యుద్ధాన్ని జోనరాజు విపులంగా వర్ణించాడు. జోనరాజు వర్ణించకపోతే లోహారంపై జరిగిన ఈ యుద్ధం గురించి తెలిసేది కాదు. ఈ యుద్ధం గురించి పర్షియన్ రచయితలు అంతగా ప్రస్తావించలేదు.

లోహార రాజు హిందువు అన్నది నిస్సంశయం. అతను బ్రాహ్మణులను పంపటం, వారికి జరిగిన అవమానాన్ని సహించక ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం కావటం లోహార రాజు హిందువు అనటాన్ని స్పష్టం చేస్తుంది. లోహార రాజుకు వ్యతిరేకంగా సుల్తాన్ ఆదేశాలను అనుసరించి వచ్చిన డామరుడు లోలకుడు కూడా హిందూ ధర్మావలంబి అన్నది తెలుస్తుంది. కానీ సుల్తాన్ పాలనలో ఉండటం వల్ల శత్రురాజు పవిత్రంగా భావించే దాన్ని అవమానించి ఆధిక్యం నిలుపుకోవటం అన్న లక్షణాల వల్ల అతడు సంధి కోసం వచ్చిన వారిని గూఢచారులుగా భావించి అవమానించాడు. ఏ రకంగా అవమానించాడో జోనరాజు రాయలేదు. కానీ ఆ కాలంలో బ్రాహ్మణులను గౌరవించటం పూర్తిగా పోలేదు. కాబట్టి, లోలకుడు వారిని బ్రాహ్మణుల వేషంలో ఉన్న గూఢచారులు అని భావించి అవమానించాడని జోనరాజు రాశాడు. కానీ తాము దైవంలా భావించే బ్రాహ్మణులను లోలకుడు అవమానించటం సహించలేని లోహార రాజు ప్రాణాలకు తెగించి సైతం పోరాడటం, ఆ కాలంలో ఇంకా బ్రాహ్మణుల ప్రతిష్ఠ తరగలేదని నిరూపిస్తుంది. అంతే కాదు, బ్రాహ్మణులను అవమానించటం   రాజు నమ్మే ధర్మాన్ని అవమానించటంగా, తద్వారా రాజును అవమానించటం, తమ ఆధిక్యతను నిరూపించుకోవటంగా లోలకుడు భావించాడని తెలుస్తుంది.

ఇదే మనస్తత్వం సమకాలీన సమాజంలోనూ కనబడుతుంది. భారతీయులు   పవిత్రంగా భావించే గ్రంథాలను దూషించటం, వారు ఆరాధించే వారిని దూషించటం, అభిమానించే వారిని అవమానించటం ద్వారా భారతీయ  ధర్మంపై, తద్వారా ,  భారతీయ ధర్మాన్ని అవలంబించే వారిపై  తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నామని అన్య మతస్తులు, నాస్తికులు, మేధావులు భావిస్తున్నట్టు  ప్రవర్తించటం ఈనాడూ అనుభవిస్తున్నాం. దీనికి ప్రతిగా ఆనాడు జరిగిందేమిటంటే, సంధికి సిద్ధమయిన ప్రజలు ప్రాణాలు లెక్కచేయకుండా యుద్ధానికి దిగారు. ఈనాడు సహనం, సమన్వయం ప్రదర్శించే వారు అసహనం ప్రదర్శించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హింసను వ్యతిరేకించేవారు హింసను ఆశ్రయించే పరిస్తితులు నెలకోంటున్నాయి.

ఆనాడు జరిగిన, జరుగుతున్న సంఘటనల  పట్ల జోనరాజు మనసులో ఉన్న భావాలు ఈ సంఘటనను చెప్పటంతో పాటే, రాళ్ళక్రింద పడి మరణించిన డామరుడు లోలకుడి మరణంపై వ్యాఖ్యానించిన విధానం స్పష్టం చేస్తుంది. డామర లోలకుడు, రాళ్ళ సమాధిలో ‘యవన ప్రేత సంస్కారం పొందాడు’ అని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. ‘యవన ప్రేత సంస్కారం’ అని అనటంలోనే జోనరాజు  ఆలోచన  తెలుస్తుంది. భారతీయులు శవాన్ని అగ్నికి అంకితం చేస్తారు. వారికి ప్రాణం లేని కట్టెపై ఎలాంటి మోహం లేదు. మరణించిన తరువాత అస్థికలను ‘గంగ’లో కలిపేస్తారు. ప్రాణాలు పంచభూతాలలో కలిసిపోయిన తరువాత శరీరం ఖాళీ అయిన సంచీ లాంటిది. దాన్ని పట్టుకుని వ్రేలాడాల్సిన అవసరం లేదు.  దాన్ని కాల్చేయటం శౌచం.  కానీ మ్లేచ్ఛ జాతులలో శవాన్ని పాతి పెట్టడం, పూడ్చటం, సమాధులు కట్టడం, వాటిని పూజించటం వంటి పద్ధతులున్నాయి. ఇదంతా భారతీయుల దృష్టిలో అశౌచం. ఎంత ప్రాణప్రదంగా ప్రేమించినవాడయినా శవంగా మారగానే ఎప్పుడు దహన సంస్కారాలు జరిపేయాలా అన్న తొందర ప్రదర్శిస్తారు. కానీ, మ్లేచ్చులు శవాన్ని భూమిలో పాతిపెట్టి దాన్ని దర్శిస్తారు. పూజిస్తారు. ఇది అశౌచాన్ని పోషించటమే.  పరోక్షంగా జోనరాజు ఈ పద్ధతులపై వ్యాఖ్యానిస్తున్నాడు. యవనులలా ప్రవర్తించిన డామరుడికి యవన ప్రేత సంస్కారం లభించిందని వ్యాఖ్యానించి, తన ఆవేదనను  తీర్చుకున్నాడు. వాల్టర్ స్లాజే అనువాదం ప్రకారం, ‘తనపై పడుతున్న రాళ్ళ క్రింద డామరుడు, నలుగుతున్న డామరుడు, అతని అపఖ్యాతి బరువు క్రింద సమాధి అవుతున్నట్లున్నాడు’. ఈ సందర్భంలోనే జోనరాజు చేసిన దుష్కర్మల ఫలితాన్ని అనుభవించక తప్పదు అని వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి జోనరాజు మనసులో జరిగిన, జరుగుతున్న సంఘటనల పట్ల ఎంత ఆవేదన, ఆవేశాలుండేవో  ఊహించే వీలు చిక్కుతుంది. సుల్తాన్‍పై కృతజ్ఞతతో పైకి స్నేహం, కృతజ్ఞతలు ప్రదర్శించినా, మనసులో ఇస్లామీయుల దుశ్చర్యల పట్ల ఎంతటి బాధ ఉన్నదో ఈ సంఘటన వర్ణన  స్పష్టం చేస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here