జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-36

2
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యశసేవ ప్రమీతానం పరదేశ నివాసినామ్।
మహతాం నహి జాతు స్సాద్విభవేన సుఖోద్రమః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 487)

[dropcap]త[/dropcap]న మరణానికి ముందు, తన ఇద్దరు కొడుకులను దేశం బయటకు పంపించాడు శాహవాదినుడు. మరణానికి ముందు స్వహస్తాలతో వారికి ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలలో ఇద్దరు కొడుకులను కశ్మీరుకు రమ్మని ఆహ్వానించాడు. వారిద్దరిలో పెద్దవాడు తెలివైనవాడు. అతడి పేరు హస్సన్. ‘హస్సనో రాజపుత్రః’ అంటాడు జోనరాజు. హస్సన్ గుణవంతుడు. అతడు తండ్రి ఉత్తరం అందుకుని, ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కోకుండా మహేంద్ర మండలం వరకూ వచ్చాడు. మహేంద్ర మండలం వద్ద అతడు తండ్రి మరణవార్త విన్నాడు. ముత్యాల చిప్ప నుండి ముత్యాలు వెలువడినట్టు అతడి కళ్ళ నుండి నీళ్ళు వెలువడ్డాయట. నీటి అంజలి ఘటిస్తున్నట్టున్నాయంటాడు జోనరాజు – ‘నివాపాంజలిమార్పయత్’.

మ్లేచ్ఛుల గురించి వర్ణిస్తున్న జోనరాజు భారతీయ పద్ధతుల ఉపమానాలు వాడటం గమనార్హం. ఇది కశ్మీరు రూపాంతరం చెందటంలో ఒక దశను సూచిస్తుంది. ప్రధానంగా ఇస్లామేతరమైన కశ్మీరులో పద్ధతులు వేరు. వారు వాడే ఉపమానాలు వేరు. కానీ గతంలో ఉన్నదానికి భిన్నమైన సంప్రదాయలు, పద్ధతులు కశ్మీరులో చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ గమ్మత్తయిన పరిస్థితి ఏమిటంటే, రాజుల ఆచారాలు, పద్ధతులు వేరు. అధిక సంఖ్యాకుల ఆచార, వ్యవహారాలు వేరు. దాంతో అల్ప సంఖ్యాకుల వాడయిన రాజు అధిక సంఖ్యాకుల పద్ధతులను మన్నించి, పాటించాల్సి వస్తుంది. పైగా, కశ్మీరులో ఇస్లాం, దేశంలోని ఇతర ప్రాంతాలలో లాగా, దోపిడీదారుల్లానో, గెలుపొందిన వారి మతం లాగానో అధికారం లోకి రాలేదు. రాజయిన బౌద్ధుడు ఇస్లాం స్వీకరించటంతో కశ్మీరులో అధికారం ఇస్లామీయులకు దక్కింది. ఆ తరువాత రాజ్యంలోని వాడే అయిన ఇస్లామీయుడు అధికారాన్ని హస్తగతం చేసుకోవటం ద్వారా కశ్మీరు ఇస్లామీయుల అధికారంలోకి సంపూర్ణంగా వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలలో లాగా ఇస్లామీయులు విజేతలు, భారతీయులు పరాజితులు అన్న భావన కశ్మీరులో నెలకొనలేదు. ఇది భవిష్యత్తులో కశ్మీరు ప్రజల మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది. కశ్మీరు సంపూర్ణంగా ఇస్లాం మయం అయి, ఛాందసాన్ని ప్రదర్శించటం, ఇంకా పూర్తిగా ప్రాచీన సంప్రదాయపు వాసనలు వదుల్చుకోని సంధి స్థితిని జోనరాజు రాజతరంగిణి ప్రదర్శిస్తుంది. అందుకే జోనరాజు రాజతరంగిణిలో పలు సందర్భాలలో సుల్తానుల చర్యలను పురాణ పోలికలతో పొగడటం కనిపిస్తుంది. ఇది, ఒక రకంగా ఇస్లామీయుల అధిక్యాన్ని ఆమోదించి, వారిని తమలో ఒక భాగం చేసుకోవాలన్న భారతీయుల ప్రయత్నంలో భాగం అనిపిస్తుంది. ఒక పరాయి వాడికి తమ సంప్రదాయంలో ఉత్తమమైన దానితో పోలికలు కల్పించటం ద్వారా, పరాయివాడిని తమ ప్రాబల్యం లోకి తీసుకురావాలన్న ప్రయత్నం – ఇస్లాం భారతదేశంలో వ్రేళ్ళూనుకున్న తరువాత భారతీయ పండితుల రచనలలో కనిపిస్తుంది. సుల్తానులను, పురాణ పురుషులతో పోల్చటం కనిపిస్తుంది. తండ్రి మరణ వార్త విని హస్సన్ కన్నీళ్ళు కార్చటాన్ని జోనరాజు వర్ణించటంలో కూడా ఇస్లామీయులకు భారతీయ సంప్రదాయ వర్ణనలు ఆపాదించటం కనిపిస్తుంది.

సోదరుడి రాజ్యం అతని సంతానానికి అప్పజెప్పకుండా, తనని తాను సుల్తాన్ ఖుతుబుద్దీన్‍గా ప్రకటించుకున్న ‘కుంభాదీనుడు’ హస్సన్‍ను ఆహ్వానించాడు. అతడికి ఓ ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి హస్సన్ కశ్మీర్ వైపు ప్రయాణం కొనసాగించాడు. “శాహవాదినుడు మనల్ని వదిలి వెళ్ళాడు. ఇంద్రుడితో ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని సేవకులమైన మనల్ని వదిలి ఆయన స్వర్గానికి వెళ్ళాడు. అప్సరసల పొందు కోసం స్వర్గం వెళ్ళిన రాజు అంత్యక్రియలకు, మీరు అందుబాటులో లేక, వేరే దేశంలో ఉండడంతో, మేము చేయాల్సి వచ్చింది. మరణించిన రాజు ఆజ్ఞను పాటిస్తూ, ఈ సింహాసన భారాన్ని తలపై మోస్తున్నాను. అనేక చిన్న రాజ్యాలను ఒక మాలలా దారంతో కుట్టినట్టు ఏకత్రితం చేశాడు మరణించిన రాజు. రాజాజ్ఞను పాటించి, వేరే దేశాలకు వెళ్ళటం, ఆయన కోరికను అనుసరించి వెనక్కు తిరిగి రావటం వల్ల పితృవాక్య పాలనలో శ్రీరామచంద్రుడిలా కశ్మీరుకు మంచి పేరు సంపాదించి పెట్టారు. స్వీయశక్తి వల్ల మీరెంతో గౌరవం పొందుతున్నారు. ఇంకా పొందుతారు. మీ ధైర్యం, మీ స్నేహితులతో, రాజాస్థానంలో ఉండే వారితో కలిసి ప్రజలను రక్షించటం మీ బాధను తగ్గిస్తుంది. ఎలాగయితే, మరణించిన వారికి ఎంత కీర్తి లభించినా, లాభం ఏమీ ఉండదో, అలాగే, ఎంత ఐశ్వర్యం ఉన్నా విదేశాలలో ఉన్నవాడికి ఆనందం ఉండదు. స్వర్గానికి వెళ్ళిన మీ తండ్రికి ప్రతిబింబం మీరు. మమ్మల్ని కలవండి. మమ్మల్ని చూడటం ద్వారా , మీ తండ్రి మరణ దుఃఖం ఉపశమిస్తుంది. మీ తండ్రిగారిని చూసినట్టే భావించుకుంటాం. ఇకపై విదేశంలో ప్రజలు మిమ్మల్ని చూపిస్తూ ‘అదిగో శాహవాదినుడి కుమారుడు’ అనే వీలుండదు. నాపై ఆధారపడిన వారెవరినీ మీరు సహాయం కోసం అభ్యర్థించనవసరం లేదు. కశ్మీరు ధనాన్ని తక్కువ అంచనా వేయవద్దు. భూభారాన్ని మోసే పన్నగం తన బరువును మేరు పర్వతంపై వేసినట్టు, రాజ్య భారాన్ని మీపై మోపి నేను విశ్రాంతిగా నా ఐశ్వర్యాన్ని అనుభవిస్తాను. నేను కశ్మీరు రాజుగా ఉన్నంత కాలం రాజు శాహవాదినుడు నన్ను ఎంత గౌరవించాడో, అంత గౌరవంతో మీరు కశ్మీరంలో ఉండవచ్చు. కాబట్టి మా ఆహ్వానాన్ని మన్నించి కశ్మీరంలో సుఖంగా ఉండండి. మమ్మల్ని నిరాశ పరచవద్దు. మీరు మా ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఉదయశ్రీ సలహా ప్రకారం వ్యవహరించే మీ తల్లి లక్ష్మి ఎంతో బాధపడుతుంది. నిరాశ చెందుతుంది.”

ఇదీ ఖుతుబుద్దీన్, తన సోదరుడి కొడుకు హస్సన్‍కు రాసిన లేఖ. ఇందులో ఎక్కడా హస్సన్‍కు రాజ్యం అప్పగిస్తానన్న వాగ్దానం లేదు. కానీ ఉత్తరం నిండా భారతీయ పురాణాల ప్రస్తావన ఉంది. హస్సన్ తల్లి లక్ష్మి. కాబట్టి, సుల్తాన్ భార్య అయినా, ఆమె సంతానం ఇస్లామీయుడు అయినా ‘లక్ష్మి’ భారతీయ ధర్మాన్ని అవలంబిస్తున్నదనుకోవచ్చు. అంటే, అప్పటికి కశ్మీరులో సుల్తాన్ భార్య మతం మారి తీరాలన్న సంకుచితం ఇంకా లేదన్న మాట.

రాకుమారుడు హస్సన్‍కి రాజులకు సలహాలిచ్చే వాళ్ళుంటారని తెలియదు. దాంతో అతడు ఖుతుబుద్దీన్ ఉత్తరం చదివి, కశ్మీరం వైపు ప్రయాణం ఆరంభించాడు. అయితే, అతడిని ఆకాశంలో నిండి గర్జించే మేఘాలు, కశ్మీరంలో అడుగుపెట్టనీయలేదు. అన్ని అడ్డంకులను దాటి కశ్మీరులో అడుగుపెట్టాడు హస్సన్. కానీ అప్పటికే, దుష్టులు రాజు మనసులో విషం నింపారు. అడవికి నిప్పు ఎలాంటిదో, ప్రపంచానికి దుష్ట మంత్రులు అలాంటి వారు. మొసళ్లు నీళ్ళను అల్లకల్లోలం చేసినట్టు, తమ స్వలాభం కోసం దుష్ట మంత్రులు రాజు మనసును అల్లకల్లోలం చేస్తారు. సుడిగాలి చెట్ల శాఖలను కుదిపినట్టు, రాజులనూ కుదిపివేస్తారు. హస్సన్ కశ్మీరులో అడుగుపెట్టినప్పుడు వీరు కుంభాదీనుడితో అన్నారు – “రాజు తన మంత్రుల కన్నా అధికమైన విజ్ఞానం కలవాడయినా, రాజు మంచి చెడులను నిర్ణయించుకోవటంలో దోహదం చేసేందుకు మంత్రులు మాట్లాడే అనుమతి ఉంది. మహా మహా సార్వభౌములైన ఇంద్రుడు, నలుగురు దిక్పాలకులు, ప్రపంచం నలుమూలలను పాలించే వారు కూడా తమ కుటుంబ సభ్యులతో ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోదరుడు నల్లటి విషనాగు లాంటి వాడు. అతని స్పర్శ సర్వనాశనకరం. కాబట్టి ఎవ్వరూ ప్రమాదానికి అతీతులు కారు. రాజకుమారుడు మీరు అందించిన ఐశ్వర్యంతో  సంతృప్తి పడి మీ ఆధిక్యాన్ని ఆమోదించడు. చల్లటి వస్తువులను తాకినంత మాత్రాన నిప్పు చల్లబడిపోదు. కాబట్టి, హస్సన్ ఒక్కడే ఉన్నాడనీ, ఒంటరిగా అతడు మీకు ఏమీ ప్రమాదం తలపెట్టడని, హాని కలిగించలేడని అనుకోవద్దు. సింహం ముందు ఏనుగుల గుంపు రాజు ఎంత? అయితే, మా మాట విని, హస్సన్‌కు హని తలపెట్టవద్దు. అతడికి రక్షగా శక్తివంతుడైన ఉదయశ్రీ ఉన్నాడు. కాబట్టి రాజా, హస్సన్‍పై మీరు ప్రత్యేకంగా కరుణ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అతడిని బహిష్కరించాల్సిన అవసరం లేదు. మీరు అతడిని ప్రత్యేకంగా చూస్తే, అతడికి గర్వం పెరుగుతుంది. బహిష్కరిస్తే, అతడు మీకు హాని తలపెట్టవచ్చు. వీరుడు కాబట్టి, మీరు  అతనికి అన్యాయం చేస్తే మిమ్మల్ని క్షమించకపోవచ్చు. బడబానలం సముద్రం నీటిని వేడి చేస్తుంది. కాబట్టి అతడిని బంధించండి. ప్రజల ఉద్విగ్నతలు తగ్గించండి. మీకు అతని వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో అని భయపడుతున్న వారందరికీ మీ చర్య వల్ల సాంత్వన లభిస్తుంది.”

నీరు కలుషితమైన నీటితో కలిస్తే త్రాగేందుకు అర్హతను ఎలా కోల్పోతుందో, అలా వీరి మాటలతో కలుషితమైన రాజు హస్సన్‍కు దూరమయ్యాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here