జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-38

1
9

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ప్రజాపాప వినాశేన తతో యవన దర్శనే।
బాలస్యేవ మృది క్షోణిపత్ రుచిరవద్దత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 572)

[dropcap]ఇ[/dropcap]క్కడి నుండి సికందర్ బుత్‌కిషన్ చరిత్ర ఆరంభవుతుంది. జోనరాజు ఎవరి ఆశ్రయంలో ఉండి రాజతరంగిణి రచిస్తున్నాడో, ఆ జైనులాబిదీన్ తండ్రి సికందర్. కాబట్టి, సికందర్ గురించి ఏం రాసినా జోనరాజు చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సికందర్‍ను పొగిడినట్టుండాలి, విమర్శించినట్టుండకూడదు. అతడిని విమర్శించినా, జైనులాబిదీన్‍ను స్తుతించినట్టుండాలి. ఈ కత్తి మీద సామును జోనరాజు చాలా జాగ్రత్తగా, చమత్కారం, వ్యంగ్యాలను ఊతగా తీసుకుని సాగాడు.

సికందర్ తండ్రి ఖుతుబ్-ఉద్-దీన్ మరణించినప్పుడు సికందర్ బాలుడు. అతని మేనమమ ఉద్దకుడు సహాయంతో రాణిని ఒప్పించి, బాలుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు. తను చక్రం తిప్పటం ఆరంభించాడు. సికందర్ ఇంకా పిల్లవాడు కాబట్టి ఉద్దకుడు చెప్పినట్టు ఆజ్ఞలు జారీ చేసేవాడు. సికందర్‍తో ఆజ్ఞను ఇప్పించుకుని, మోసంతో శాహకుడి కొడుకు మహ్మదాను తన స్వంత కూతురును, కాల్చి చంపాడు. ఈ సంఘటన ద్వారా మనకు శాహకుడు మహమ్మదీయుడని తెలుస్తుంది. ఉద్దకుడు ఖుతుబుద్దీన్ భార్య రాణి ‘సుభట్టా’కు సోదరుడు కాబట్టి హిందువనీ తెలుస్తుంది. అతడి కూతురు, శాహకుడి కొడుకు మహమ్మాదాని పెళ్ళి చేసుకుంది. ఎందుకని, కూతురిని, అల్లుడిని మోసంతో కాల్చి చంపాల్సి వచ్చిందో జోనరాజు వివరించలేదు. కానీ, ఈ సంఘటన తరువాత రాసిన శ్లోకాలు కారణాన్ని ఊహించే వీలు కల్పిస్తాయి.

తిమింగలం తన సంతానాన్ని తినేస్తుంది. తేనెతుట్టకు నిప్పు పెట్టినప్పుడు ఆ మంటల్లో కాలిపోయే తేనెటీగ, తన స్వంత తల్లినే నాశనం చేస్తుంది. దురాశ వల్ల జ్ఞానం నశిస్తుంది. చివరికి అందరం నశించవలసిన వారమే అని తెలిసి కూడా దురాశతో జనులు దుష్ట కార్యాలను నెరపుతారు అని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు. ఈ శ్లోకాన్ని బట్టి ఏదో ఒక దశలో రాజ్యాన్ని కబళించాలన్న ఆశ ఉద్దకుడికి ఉన్నదేమో అనిపిస్తుంది.

ఈ శ్లోకం ఆధారంగా జరిగిన సంఘటనలను మరో కోణం లోంచి చూస్తే, కశ్మీరుపై సుల్తానుల పాలనను అంతమొందింప చేయటానికి జరిగిన చివరి పోరాటం ఇది అనిపిస్తుంది. పర్షియన్లు రచించిన కశ్మీరు చరిత్రలో రాణి శోభ, సోదరుడి సహాయంతో, సోదరుడి కూతురిని, అల్లుడిని చంపించిందని రాశారు. రాణి శోభ ముస్లిం కాదు. ఆమె కొడుకు సికందర్ ముస్లిం. ఆమె సోదరుడు ఉద్దకుడు ముస్లిం కాదు. కానీ అతని కూతురు మహమ్మదాను వివాహం చేసుకోవడంతో ముస్లిం అవుతుంది. కాబట్టి, రాజ్యార్హత ఉన్న ఇస్లామీయులందరి అడ్డు తొలగితే, కశ్మీరుపై మళ్ళీ హిందూ రాజుల జెండా ఎగురవేయాలన్న ఆలోచనతో ఈ హత్యలు జరిగేయని పర్షియన్ రచయితలు తమ చరిత్ర గ్రంథాలలో రాశారు.

పర్షియన్ రచయితల వివరణను విశ్లేషిస్తే, ‘దురాశతో తిమింగలం తన సంతానాన్ని భోంచేస్తుంది. తేనెటీగ తల్లిని నాశనం చేస్తుంది. ఇన్ని దుష్టపు పనులు చేసినవారు చివరికి అగ్నికి ఆహుతి అవుతారు’ అనటం వెనుక రాణి, ఉద్దకుడు చేస్తున్న పని ‘అసాధ్యం’ అన్న భావన కనిపిస్తుంది. జోనరాజు సుల్తానుల అండలో ఉన్నాడు కాబట్టి, సుల్తానులకు వ్యతిరేకంగా, అదీ, ‘కాఫిర్’లు జరిపే కుట్రను సమర్థించలేడు. దీన్ని ‘దురాశ’ అని అనటంలో తన భావాలను పొందుపరిచాడనిపిస్తుంది. తరువాత జరిగిన సంఘటనలు ఈ ఆలోచనను బలపరుస్తాయి.

శ్రీ శోభాయా మహాదేవ్యాః శ్లాఘ్యా లక్ష్మీరభూత్రరామ్।
క్ష్మాం హేమలింగైర్ఘ్యాం పుణ్యలింగైర్యా స్వైర మండయత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 544)

‘మూర్ఖులు దురాశతో దుష్ట కార్యాలు నెరపుతారు. కానీ చివరికి వారు అగ్నిలో దగ్ధమైపోతారు’ అన్న జోనరాజు, తరువాత శ్లోకంలోనే శోభాదేవి ఐశ్వర్యాన్ని ప్రశంసిస్తున్నాడు. ఆమె ఐశ్వర్యం శ్లాఘనీయం అన్నాడు. ఆమె ఆకాశాన్ని తన సత్ప్రవర్తనతో శోభాయమానం చేస్తే, భూమిని బంగారు లింగంతో అందంగా మలచిందని అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే, పర్షియన్ రచయితలు భావించినట్టు, రాణి, ఆమె సోదరుడు కలిసి రాజ్యాన్ని సుల్తానుల నుంచి తప్పించాలని చివరి ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది.

 శాహకుడి కొడుకు మహమ్మదాను తాను చంపించాడు కాబట్టి అతడి సోదరుడు ‘హయబత్’ వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని భయంతో ఉద్దకుడు విషప్రయోగంతో హయబత్‍ను చంపించాడు. శాహకుడికి వ్యతిరేకంగా తాను చర్యలు చేపట్టేకన్నా ముందు తన మెడను తన కత్తి తోనే నరుక్కుంటానని వాగ్దానం చేసి శాహకుడిని శాంతింపజేశాడు ఉద్దకుడు. అలాంటి వాగ్దానాలతో శాహకుడి విశ్వాసాన్ని చూరగొని, ఒకరోజు అతడిని హత్య చేశాడు. దుష్ట కార్యాలు చేసేవారిని, వారి దుష్ట కార్యాలే అంతం చేస్తాయి అని వ్యాఖ్యానిస్తాడు జోనరాజు.

తన బంధువులందరినీ ఉద్దకుడు మాయోపాయంతో సంహరిస్తుండటం సుల్తాన్ సికందర్‍లో భయం కలిగించింది. తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందన్న భావన కలిగించింది. కానీ తానింకా బాలుడే కాబట్టి, అంత శక్తిమంతుడు కాడు కాబట్టి, నెమ్మదిగా తన శక్తిని పెంచుకోవటం ప్రారంభించాడు సికందర్. దీన్ని బట్టి కూడా, ఒక పద్ధతి ప్రకారం ఉద్దకుడు సింహాసనం అధిష్ఠించేందుకు అర్హత ఉన్న వారందరినీ సంహరిస్తున్నాడనీ, చివరకు సికందర్‍ను సంహరించి, సింహాసనానికి తానొక్కడే వారసుడనని ప్రకటించి, రాజ్యాధికారం చేపట్టే ఆలోచనలో ఉన్నాడని ఊహించే వీలు కలుగుతుంది.

భౌట్టులపై విజయం సాధించాకా, కశ్మీరం తిరిగి వచ్చిన ఉద్దకుడు ఎవరు తనకు పోటీగా ఎదుగుతాడనిపిస్తే, ఏదో ఒక పథకం వేసి వారిని సంహరించేవాడు. రాణి శ్రీ శోభ సోదరుడు ఖుంజ్యరాజును సంహరించాడు. తనపై ఆధారపడిన నిమ్మకుడిని ‘ద్వార’ ప్రాంతంలో ఘర్ణణలు సృష్టించమని చెప్పి, గర్వంతో  సికందర్ను లెక్క చేయలకుండా  ‘హేలడామం’ వెళ్ళాడు. నిమ్మకుడు ఘర్షణలు సృష్టించాల్సిన ప్రాంతం బారామూల (వరాహమూల) లేక ‘హిర్పూర్’ (శూరపూర) అయి ఉంటుందని భావిస్తున్నారు.

శక్తిమంతుడైన సికందర్ తన సమర్థకులను వెంట తీసుకుని, ఉద్దకుడిపై యుద్ధానికి బయలుదేరాడు. లద్దరాజుతో సహా పలువురు శక్తిమంతులు సికందర్‍కు మద్దతుగా ఆయుధాలతో, సికందర్ వెంట తనపైకి యుద్ధానికి వస్తున్నారని ఉద్దకుడు తెలుసుకున్నాడు. తానూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. కానీ ఎవరి నాశనం అయితే రాసిపెట్టి ఉందో, వారు ఎంత తెలివైన వారయినా, వారికి వారి నీడలే దయ్యాల్లా కనిపించి భ్రమిస్తారు అంటాడు జోనరాజు.

ఉద్దకుడి సైనికులు యుద్ధానికి సిద్ధమై వచ్చారు. వితస్తకు ఆవల వారికి మహిషాలు కనిపించాయి. వాటిని చూసి అశ్వాలని భ్రమించారు. భయంతో వారు వెనుతిరిగి పారిపోయారు. సుల్తాన్ తన సైన్యంతో వారిని వెంబడించాడు. చివరికి ఉద్దకుడిని బంధించాడు. అయితే ఉద్దకుడిని చంపితే రాజ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న భయంతో అతడిని కారాగారంలో బంధించాడు.  తాను ఎంతో మందిని చంపించాడు కాబట్టి, ఎవరో ఒకరు చంపుతారన్న భయంతో, సుల్తాన్ తనపై ప్రసరింపజేస్తున్న కరుణ భావనను విస్మరించి, తన కత్తితో తన మెడను కోసుకుని మరణించాడు ఉద్దకుడు. దీనితో కశ్మీరును సుల్తానుల పాలన నుంచి తప్పించాలన్న చివరి ప్రయత్నం కూడా విఫలమయింది.

ఉద్దకుడి మరణంతో సికందర్ సర్వశక్తిమంతుడయ్యాడు. ఉద్దకుడు తనకు రక్షణగా ఉంచిన వారిని సంహరించాదు. గరుడుడు పాములను చంపినట్టు, సింహం నక్కలను సంహరించినట్టు, రాజు ‘పాలుల’ను సంహరించాడు అంటాడు జోనరాజు. ఈ ‘పాలులు’ అన్నవారు కశ్మీరుకు చెందిన ఇస్లామేతర తెగగా భావిస్తున్నారు చరిత్ర రచయితలు. వీరి అడ్డు తొలగటంతో రాజ్యం సురక్షితమైంది. రాజు శరీరం, మనస్సు, వ్యక్తిగత స్వేచ్ఛ అన్నీ, పంచాగ్నుల నడుమ తపస్సు చేసిన వాడికి ఫలితం లభించినట్టు రాజుకు లభించాయి.

ఇతర రాజుల గర్వం అణచటానికి సికందర్ యుద్ధానికి బయలుదేరాడు. ఇది ఇంద్రుడికి కూడా కలవరం కలిగించిందంటాడు జోనరాజు. సికందర్ శక్తి ప్రపంచాన్ని ఎరుపు రంగులోకి మార్చింది. కానీ దుఃఖిస్తున్న శత్రురాజుల భార్యల గోళ్ళను వర్ణరహితం చేసింది. ఈ సమయంలో మ్లేచ్ఛరాజు (తైమూర్) ఢిల్లీని కొల్లగొట్టి ఆభరణాలు, రక్షకుడు  లేని భర్తృరహితగా ఢిల్లీ అనిపించేట్టు చేశాడు. ఆ మ్లేచ్ఛరాజు తిరిగి వెళ్తూ కశ్మీర రాజ్యంవైపు చూడాలంటే కూడా భయపడ్డాడు. కశ్మీర రాజుకు రెండు ఏనుగులు బహుమతిగా ఇచ్చాడు. ఆ మదగజాల నుండి స్రవిస్తున్న మత్తజలం కశ్మీరు సరిహద్దులను నిర్ణయిస్తున్నట్టనిపించింది. హిమాలయ శిఖరాల్లా అనిపిస్తున్న ఆ ఏనుగులను చూసి, వింధ్య పర్వతాలు ఎదుగుతున్నాయనుకుని అగస్త్యుడికి ఆగ్రహం కలిగింది. వితస్త దాటేటప్పుడు తమ ప్రతిబింబాలని నీళ్ళల్లో చూసుకున్న ఏనుగులు, ఆ ప్రతిబింబాలని తమ పోటీదార్లుగా భావించాయి. గుండ్రంగా ఉన్న ఏనుగుల నుదురు అందంలో రాజు భార్యల వక్షోజాలను వెక్కిరిస్తున్నట్టున్నాయి. ఆ ఏనుగులను ఏనుగుల శాలలో బంధించారు. అది ఏనుగులకు విషతుల్యంలా అనిపించింది.

సహృదయుడైన రాజు అడిగిన వారందరికీ బంగారం పంచాడు. అప్పుడప్పుడు స్వచ్ఛందంగా కూడా బంగారం పంచేవాడు. ఎవరైనా బహుమతులు ఇచ్చే సమయంలో రాజు హస్తాలు కుంచించుకుపోయినట్టుగా అనిపించేవి. అందుకంటే, బహుమతులు స్వీకరిస్తూ వారు పొగిడే పొగడ్తలు అతడికి ఎంతో సిగ్గుగా అనిపించేవి. బహుమతులు ఇచ్చే ముందు రాజు తన చేతులను నీటిలో ముంచేవాడు. అలా నీరు కారుతున్న అతని చేతులు, నీటిలోని తామర పుష్పాల్లా అనిపించేవి. అతని బొటనవేలిపై గీతలు బార్లీ గింజల్లా అనిపించేవి. కానీ అవి నిరంతరం నీళ్ళలో ఉండటం వల్ల మొలకలు మొలిచేవి కావు. అంతే కాదు, నిరంతరం ఖడ్గాన్ని ధరించటం వల్ల కూడా బార్లీ గింజలు మొలిచేవి కావు.

ఇంతవరకూ జోనరాజు, సికందర్ గొప్పతనాన్ని చెప్పాడు. సికందర్ వీరత్వాన్ని ప్రశంసించాడు. దానగుణాన్ని శ్లాఘించాడు. ఇప్పుడు అసలు విషయాన్ని అతి సున్నితంగా చెప్తున్నాడు. ఇదెలాగంటే, ఒక శక్తిమంతుడి దౌష్ట్యాన్ని ప్రస్తావించే ముందు అతడిని పొగిడి పొగిడి మెల్లాగా చెడ్డ పనిని ప్రస్తావించినట్టన్నమాట. దౌష్ట్యం కూడా అతని దోషం కాదు. ప్రజల దురదృష్టం. వారి దౌర్భాగ్యం వల్ల రాజు దౌష్ట్యం ప్రదర్శిస్తున్నాడు తప్ప, రాజు దుష్టుడు కాదు. ఇది జోనారాజు రాజతరంగిణి రచనలో పాటించిన పద్ధతి.

ప్రజల పాపాల వల్ల రాజుకు యవనులంటే ఎంతో ప్రీతి కలిగింది. బాల్యం నుంచీ రాజుకు బురద అంటే ఎంతో ఇష్టం అంటాడు జోనరాజు. అంత వరకూ ‘మ్లేచ్ఛులు’ అన్న ఇస్లామీయులు ఇప్పుడు ‘యవనులు’ అయ్యారు. మ్లేచ్ఛులు అంటే, మంగోలులు అన్న అర్థంలో, ఢిల్లీపై తైమూర్ దాడిని వర్ణిస్తూ వాడేడు. ఇప్పుడు ‘యవనులు’ అని మ్లేచ్ఛుల నుంచి వేరుగా జోనరాజు చూపిస్తున్నాడు. కశ్మీరును ఇస్లాం మయం చేసి, కశ్మీరును సంపూర్ణంగా రూపాంతరం చెందించిన సూఫీలను ఉద్దేశించి వాడేడు జోనరాజు. చిన్నప్పటి నుంచీ సికందర్‍కు బురద అంటే ఇష్టం అట. ఇప్పుడు ప్రజల పాప ఫలితంగా యవనులంటే రాజుకు ఇష్టం ఏర్పడిందట. ఇక్కడి నుండి జోనరాజు కత్తి మీద సాము తీవ్రతరం అవుతుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here