జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-41

3
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ప్రత్యాహుతే తతస్తేజో విశేషే త్రిదశైర భూత్।
ప్రతిమానాం శిలాభావో మంత్రాణాం వర్ణమాత్రతా॥
(జోనరాజ రాజతరంగిణి 593)

[dropcap]ఇ[/dropcap]క్కడి నుంచీ రాజతరంగిణి పఠనం భారం అవుతుంది. భారం మనస్సులో, భారం హృదయంపై, భారం మెదడుపై, భారం శరీరంపై, భారం ఆత్మపై! ఇది అలవి కాని భరించలేని భారం. దుఃఖం, ఆక్రోశం, ఆవేదన, శోకం వంటివన్నీ మామూలు భావాన్ని తెలిపే పదాలు. కానీ జోనరాజ రాజతరంగిణి చదువుతూ, ఆ కాలంలో భారతీయుల మనస్సుల్లో చెలరేగిన భావాల తుఫానులను ఊహిస్తే, భూమ్యాకర్షణ శక్తి వెయ్యి రెట్లై, శరీర భారాన్ని పెంచి కదలలేని జడత్వాన్ని కలిగించినట్లవుతుంది. సర్వం మొద్దుబారిపోతుంది. ప్రపంచంలో ఏ జాతిపై, ఏ ధర్మంపై, ఏ మానవ సమూహంపై జరగనంత ఘోరమైన దాడి భారత జాతిపై జరిగింది. ఇతర ఏ జాతులూ ఆ దాడి స్వరూపాన్ని సూచన ప్రాయంగానైనా భావితరాలకోసం  ప్రదర్శించలేకపోయాయి. దాడులు జరిగిన వందల ఏళ్ళ తరువాత రచయితలు ఆయా సంఘటనలను ఊహిస్తూ రచనలు చేశారు. కానీ భారతదేశంలో జోనరాజ రాజతరంగిణి జరిగిన ఘటనల దుష్ఫలితాలకు ప్రత్యక్ష సాక్షి. చెలరేగిన తుఫాను తాకిడికి ఎగసిన ధూళి ఇంకా భూమిపై స్థిరపడక ముందే, ఆ దట్టమైన ధూళి నడుమ నిలచి, ఆ అనుభూతిని అక్షరాల రూపంలో కుదించి, ఆ అక్షరాలలో ఆవేశాన్ని, నిరాశను, దుఃఖాన్ని, ఆవేదనను, ఆక్రోశాన్ని పొందుపరిచి రచించిన రచన జోనరాజ రాజతరంగిణి.

మ్లేచ్ఛ ప్రభావంతో సుల్తాన్ సికందర్ మారిపోయాడు. యవనులకు లోబడిపోయాడు. మహమ్మదా అనే యువ జ్ఞాని ప్రభావంలో పడి అతడికి సేవకుడిగా వ్యవహరించాడు. ఇది కశ్మీరు ప్రజల పాప ఫలితం అన్నాడు జోనరాజు. ఇప్పుడు ఆ పాప ఫలితంగా సంభవించిన దురదృష్టాన్ని వివరిస్తున్నాడు. మహమ్మదా ప్రభావంలో సుల్తాన్ సికందర్, సికందర్ బుత్‍షికన్‍గా రూపాంతరం చెందడం వల్ల సంభవించిన దుర్భర, దురదృష్టకర, దుష్పరిణామాలను చెప్తున్నాడు జోనరాజు. ఈ శ్లోకాలు రచించే సమయంలో ఎన్ని వేదనల తుఫానులు జోనరాజు మనస్సులో చెలరేగాయో, ఎన్నెన్ని వేదనా వీచికలు అతని హృదయాన్ని వేయి వ్రక్కలు చేశాయో, ఎంత నిస్సహాయ ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలు అతడిని ఉక్కిరిబిక్కిరి చేశాయో ఊహించతరం కాదు. తమ మహిమలను ప్రదర్శించే దేవతలు ప్రజల పాపాల వల్ల మహిమలను ప్రకటితం కానీయటంలేదని చెప్పాడు. ఆ తరువాత, దేవతలు విగ్రహాల నుంచి తమ తేజస్సును విరమింపజేసుకున్నారు. దాంతో విగ్రహాలు కేవలం రాళ్లుగా మిగిలాయి. మంత్రాలు అక్షరాలుగా, శబ్దాలుగా మిగిలాయి.

‘ప్రతిమానాం శిలాభావో మంత్రాణాం వర్ణమాత్రతా’

ఈ శ్లోకం చదివిన తరువాత, దాని అర్థాన్ని జీర్ణించుకుని, దాని వెనుక ఒదిగిన జోనరాజు హృదయ వేదనను గ్రహించిన తరువాత ఎంతో సేపటికి కానీ తేరుకోలేము.

‘సికందర్ బుత్‍షికన్’ అదే పనిగా మందిరాలను ధ్వంసం చేస్తున్నాడు. విగ్రహాలను ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో దైవంపై విశ్వాసం పోతుంది. ‘దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎలుక తింటుంటే చూసి, తన నైవేద్యాన్ని రక్షించుకోలేని వాడు దేవుడేంటి?’ అని దైవంపై విశ్వాసం కోల్పోయిన వాళ్ళున్నారు. అంత సులభంగా దైవంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉన్నప్పుడు, తురుష్కులు, అదే పనిగా విగ్రహాలను ముక్కలు చేస్తూంటే, మందిరాలను నేలమట్టం చేస్తుంటే, ధర్మానుయాయులపై అత్యాచారాలు చేస్తూ వారిని వారి ధర్మం నుంచి, దైవం నుంచి దూరం చేస్తూంటే ఏమీ పట్టనట్టు అన్నీ చూస్తూ మౌనంగా ఉండి, అన్నీ భరిస్తున్న దైవాన్ని చూస్తే విశ్వాసం సడలటం ఇంకా సులభం!

ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసం అతని దైవం, అతని ధర్మం. భారతీయ ధర్మంలో దైవం కన్నా ధర్మానికి ప్రాధాన్యం. కానీ ఆ ధర్మాన్ని రక్షించేది దైవం. ధర్మాన్ని రక్షించటం కోసమే దైవం అవసరమైతే భూమికి వస్తాడు. అలాంటి దైవమే ధర్మంపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే, ఇక ధర్మాన్ని ఎవరు రక్షిస్తారు? అవసరమైనప్పుడు పనికిరాని దైవం వల్ల లాభం ఏమిటి? ఇలాంటి పలు భావనలు ఆనాటి సమాజంలో చెలరేగి ఉంటాయి. తాము పవిత్రంగా భావిస్తూ, రోజూ అర్చించే మందిరం ముక్కలు ముక్కలయి ఆ స్థానంలో మసీదులు వెలుస్తుంటే, తమ దైవ విగ్రహాల శకలాలను తొక్కుతూ మసీదుల్లో అడుగుపెడుతూంటే, ఆనాటి వారి హృదయాలు ఎంతగా విలవిలలాడిపోయి ఉంటాయో, వారెంతటి క్షోభను అనుభవించి ఉంటారో ఏ చరిత్ర పుస్తకం చెప్పదు. ఇలా సర్వనాశనం చేస్తూ, తమ ధర్మంపై కత్తి గట్టి, ధర్మ నిర్మూలనను ఓ పవిత్ర కార్యంలా, యజ్ఞంలా నిర్వహిస్తున్న వారి నడుమ బిక్కుబిక్కుమని బ్రతుకుతూ, వారి ఆశ్రయంలో ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తూ, అనుక్షణం తమను నశింపచేయటం పుణ్యకార్యంలా భావించే వారి పడగ నీడలో ఉంటూ, వారిని పొగుడుతూ జీవించే కవి మనస్సులో భయాలు, వేదనలు ఎలాంటివో ఎవరు ఊహించగలరు? ఇవేవీ చరిత్ర పుస్తకాలు చెప్పవు. చరిత్ర రచయితలకు ఇదంతా అనవసరం. ఇస్లామీయుల ఆశ్రయంలో ఉంటూ వారి అకృత్యాలను భావితరాలకు ఏకరువు పెడుతూ కూడ భావితరాల ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా రచనను సాగించటం ఎంత కష్టమో జోనరాజ రాజతరంగిణిలో ఈ సందర్భంగా వచ్చే ఒక్కో శ్లోకంలోని  ఒక్కో పదం చెప్తుంది. ముఖ్యంగా తాను నిరాశలు, నిస్పృహల వలయంలో జీవిస్తూ కూడా సృజనాత్మక కవిగా తన కర్తవ్యాన్ని నిర్వహించిన జోనరాజుకు ఎన్ని వేల  నీరాజనాలు అర్పించినా సరిపోదు.

శత్రువు  పవిత్ర దైవ విగ్రహాలను కూలగొడుతున్నాడు. అతడి ముందు దైవశక్తి నిస్తేజమై పోయింది. మంత్రాలు నిర్వీర్యమై పోయాయి. కానీ జోనరాజు ఇలా దైవశక్తి నిస్తేజమై, మంత్రాలు నిర్వీర్యమైపోవటం వల్ల నష్టం లేదనీ, తమ దైవాన్ని ఎవరూ తాకలేరని, భారతీయ ధర్మం అనంతకాలం సజీవమనేందుకు  ఒక తార్కిక వాదం చూపిస్తున్నాడు.

ప్రజల పాపం వల్ల దైవం తన తేజాన్ని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. దైవ తేజం లేని విగ్రహాలు రాళ్ళతో సమానం. అలాంటి రాళ్లను దుష్టులు ఎంతగా ముక్కలు చేసినా నష్టం ఏముంది? ఏమీ లేదు. దైవతేజం లేనిది విగ్రహమైనా రాయి అది. కాబట్టి, శత్రువు విగ్రహాన్ని విరగ్గొట్టి ఏదో సాధించానుకుంటున్నాడు కానీ రాళ్ళు విరగ్గొట్టి విర్రవీగుతున్నాడు, ఏదో సాధించానుకుంటున్నాడు. ఎంత మూర్ఖుడు శత్రువు! అతనెన్ని రాళ్ళను ముక్కలు చేసినా, దైవానికేమీ కాదు. ఎందుకంటే దైవమే తన తేజాన్ని ఉపసంహరించుకుంది.  ఇక దైవమే తన తేజాన్ని ఉపసంహరించుకున్నప్పుడు మంత్రాలలో శక్తి ఏముంటుంది? అక్షరాలు తప్ప మంత్రాలు ఏమీ కావు. కాబట్టి, శత్రువు మన దైవాన్ని అవమానించాడని, మన దేశంపై ఆధిక్యం సాధించాడని మనం బాధ పడాల్సిన అవసరం లేదు. మన దైవం ఎప్పుడో విగ్రహాలను వదిలి వెళ్ళిపోయాడు. ఇదీ జోనరాజు తర్కం. ఇలా మనసుకు నచ్చచెప్పుకున్నారన్న మాట ఆ కాలంలో. ఇలా తమ విశ్వాసం దెబ్బ తినకుండా కాపాడుకున్నారన్న మాట ఆ కాలంలో. ఇలా చేస్తూ విశ్వాసం సడలకుండా ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారన్న మాట.

పుణ్యక్షయేన కర్త్రూణాం కలి దోషేణ చోజ్ఞతాః।
గీర్వాణైః ప్రతిమాః సర్వా నిర్మకా భుజగైరివ॥
(జోనరాజ రాజతరంగిణి 594)

కలియుగ దుష్ప్రభావం వల్ల, పుణ్యం క్షయించి, పాపం పెరగటం వల్ల దేవతలు ప్రతిమలను వదిలి వెళ్ళారు, పాము కుబుసం విడిచినట్టు! కుబుసం పాము కాదు. పాముకు కుబుసం పనికిరానిది. అలాంటి పనికిరానిదాన్ని ఎవరేం చేసినా పాముకు పట్టిలేదు.  కుబుసాన్ని ఎంత అవమానించినా పాముకేమీ కాదు. పాము సురక్షితంగానే వుంటుంది.  కాబట్టి, దేవతలు లేని రాళ్ళను శత్రువు ఎంతగా నష్టపరిచినా, దైవానికి ఏమీ కాదు. ధర్మానికి ఏమీ కాదు. ఆ కాలంలో, ఇలాంటి ఆలోచనలు ఎంత సాంత్వన కలిగించి ఉంటాయో సామాన్యుడికి! పాము కుబుసం విడవటం పోలిక అద్భుతమైనది. కుబుసం పాము కాదు. పాము క్షేమంగానే ఉంది. ఏనాడో, అవకాశం చూసి అది పడగ విప్పుతుంది. జరిగింది అదే. తురుష్క తాకిడికి తాత్కాలికంగా విలవిలలాడినా, భారతీయ ధర్మం సరికొత్త రూపం ధరించి నిరంతరం పోరాటం సల్పి, సజీవంగా నిలిచి ఉంది. ఈ పోరాట సమయంలో రంగు రూపు రూపాంతరం చెందినా ధర్మం మౌలిక రూపం మారలేదు. స్వరూప, స్వభావాలు మారలేదు. ఆనాడయినా, ఈనాడయినా భారతీయ ధర్మంపై దాడి, పాముగా భ్రమిస్తున్న కుబుసం పైనే తప్ప, మూలమైన పాముని ఎన్నడూ తాకలేదు. భారతీయ ధర్మం సతత హరితం. సజీవమైన నదీ ప్రవాహం! భారతీయ ధర్మంపై జరుగుతున్న ఈ దాడికి కారణం కలియుగంలో క్షీణించే ధర్మపాలన. అంతే తప్ప, ధర్మంపై దాడి చేస్తున్న సుల్తానులది కాదు! ఈ మాట చెప్పటం వల్ల జోనరాజు ప్రాణం నిలుస్తుంది, ఇంకా అనేక చేదు నిజాలను భావితరాలకు అందించే వీలు చిక్కుతుంది.

రక్తే రాగం శుచౌ శాక్లచం మలినే మలినాం స్థితిమ్।
సంక్రాంత సతి గాహన్తే స్ఫటికానీవ భూభుజః॥
(జోనరాజ రాజతరంగిణి 595)

తనపై పడే కాంతి ఏ రంగులో ఉంటే స్ఫటికం ఆ రంగును ప్రతిఫలిస్తుంది. ఆ రంగులోకి మారినట్టు అనిపిస్తుంది. అలాగే రాజు చుట్టూ ఉన్నవాళ్ళు ఎలాంటి వారు అయితే రాజు ప్రవర్తన అలాగ మారుతుంది. అంతే కాని దోషం రాజుది కాదు. ఆరంభంలో సికందర్ చుట్టూ ఇస్లామేతరులు ఉండేవారు. అతని తల్లి హిందువు. అతడిని సింహాసనంపై నిలిపిన తల్లి సోదరుడు ఇస్లామేతరుడు. ఒక పద్ధతి ప్రకారం అతడు రాజ్యంపై ఇస్లామీయుల పట్టును సడలింప చేస్తూండటం సికందర్‍లో భయం కలిగించింది. ఈ సమయంలో యవనులు, మ్లేచ్ఛులు అతని చుట్టూ చేరారు. సికందర్‍కు యవనులంటే ప్రేమ కలిగింది. మహమ్మదాకు శిష్యుడయిపోయాడు. మహమ్మదా చెప్పినట్టు చేయడం మొదలుపెట్టాడు. ఫలితంగా సుల్తాన్ సికందర్, ‘సికందర్ బుత్‍షికన్’ అయ్యాడు. సుల్తాన్ ఇలా మారటంలో సుల్తాన్ దోషం ఏమీ లేదు. దోషమంతా అతని చుట్టూ చేరిన వారిదే. సుల్తాన్ స్ఫటికమంత  స్వచ్ఛమైనవాడు. అతని చుట్టూ ఉన్న వారిది ఏ రంగైతే, సుల్తాన్ ఆ రంగును ప్రతిఫలిస్తాడు. ఆ రంగులో కనిపిస్తాడు. అంతే తప్ప, సుల్తాన్ దోషం ఏమీ లేదు.

సికందర్ సంతానం జైనులాబిదీన్ ఆస్థానంలో జోనరాజు రాజతరంగిణి రచిస్తున్నాడన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, మత ఛాందసానికి గురయి, అత్యంత సంకుచిత భావానికి లోనై, భారతీయులపై అతి ఘోరమైన రీతిలో, క్రూరంగా, అమానవీయమైన అమానుషత్వాన్ని ప్రదర్శించిన సికందర్‍ను జోనరాజు ‘స్ఫటికం’తో పోల్చటం వెనుక ఉన్న బలహీనతలు, ‘లౌక్యం’ అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప సికందర్ స్ఫటికం అంత స్వచ్ఛమైనవాడు కాదు. కానీ భారతీయ చరిత్ర రచయితలు, స్ఫటికమన్న పోలికను ఉన్నదున్నట్టు అర్ధం చేసుకుని సికందర్ మంచివాడే, బ్రాహ్మణులు తమ కుత్సితత్వంతో అతడిని దుష్టుడిగా చిత్రించారని తీర్మానించారు. పర్షియన్ రచయితలు మాత్రం సికందర్ ను గొప్పవాడిగా పొగిడారు. ఇస్లాంను పెద్దఎత్తున కశ్మీరులో నిలిపినవాడని కొనియాడారు.

స్వయం బ్రాహ్మక్రియాద్వేషీ మ్లేచ్ఛైశ్చ ప్రతిబోధితః।
సూహభట్టః ప్రభుం జాతు దేవభంగార్థమై రయాత్॥
(జోనరాజ రాజతరంగిణి 596)

రాజు దోషం ఏమీ లేదు, దోషం అంతా చుట్టూ ఉన్నవారిదే అన్నాడు. ఆ చుట్టూ ఉన్నవారిలో ఒకడి గురించే రాశాడు జోనరాజు. ఆ ఒక్కడూ ఎవడు? ‘స్వయం బ్రాహ్మక్రియాద్వేషి’ అయినవాడు. ‘మ్లేచ్ఛైశ్చ ప్రతిబోధితః’ అయిన వాడు అయిన సూహభట్టు! భారతీయ ధర్మం వదలి ఇస్లాం స్వీకరించినవాడు. పరాయివాడెలాగో పరాయివాడు. వాడినేమనీ లాభంలేదు. కానీ, మనవాడే పరాయివాడికన్నా ఘోరంగా ప్రవర్తిస్తే ఏం చేస్తాం. దూషిస్తాం. శాపనార్ధాలు పెడతాం. జోనరాజు అదే చేశాడు. పైగా, దోశమంతా మతంమారిన మావాడిదే అనటంవల్ల, సుల్తాన్ కి కానీ, సుల్తాన్ చుట్టూవున్నవారికికానీ, ఎలాంటి అభ్యంతరలూ వుండవు.

సూహభట్టు బ్రాహ్మణుడు. కానీ మ్లేచ్ఛుల బోధనల ప్రభావంతో బ్రాహ్మణ ద్వేషాన్ని నేర్చినవాడు, వేద విధులను విసర్జించినవాడు సూహభట్టు. ‘మ్లేచ్ఛుల బోధనల ప్రభావంతో’.. అన్నది ఎంతో గోప్యంగా సూహభట్టు మతాంతీకరణను సూచిస్తుంది. సూహభట్టు మతం మారేడన్న మాట, మ్లేచ్ఛుల బోధనల ప్రభావం వల్ల.

బహరిస్తాన్-ఇ-షాహి, తారీఖ్-ఇ-హైదర్ మాలిక్, ఫతూహాల్-ఇ-కుబేరాపాయా వంటి పర్షియన్ గ్రంథాల వల్ల ఈ సూహభట్టు గురించి మరికొన్ని విశేషాలు తెలుస్తాయి. జోనరాజు సూహభట్టు మ్లేచ్ఛ బోధనల ప్రభావం లోకి వచ్చాడని రాశాడు. ఆ తరువాత సూహభట్టు రాక్షస ప్రవర్తనను వివరించాడు. ‘స్వయం బ్రాహ్మణ ద్వేషి’ అని వదిలేశాడు. కానీ సూహభట్టుకు సంబంధించిన ఇతర విశేషాలను పర్షియన్ రచయితలు రాశారు. మతం మారిన తరువాత కూడా జోనరాజు సూహభట్టును అతని ఇస్లామీయ నామంతో కాక, ‘సూహభట్ట’ అని పాత పేరుతోనే ప్రస్తావించటం గమనార్హం.

సూహభట్టు సికందర్ వద్ద ‘సిపాహ్ సాలార్’ అంటే సైన్యాధిపతిగా ఉండేవాడు. మీర్ సయ్యద్ మహమ్మద్ హమదానీ అనే సూఫీ ప్రభావంతో అతడు మతం మారేడు. మీర్ సయ్యద్ మహమ్మద్ హమదానీ అతనికి సైఫ్-ఉద్-దీన్ అన్న పేరును ఇచ్చాడు. సైఫ్-ఉద్-దీన్ అంటే అర్థం ‘మత ఖడ్గాన్ని ధరించినవాడు’. ‘సైఫ్’ అంటే కత్తి, ఖడ్డము, కృపాణము అని అర్థలున్నాయి. అంటే, ఖడ్గం ధరించి మత ప్రచారాన్ని కావించేవాడన్నమాట. హమదానీ పెట్టిన పేరుకు తగ్గట్టు వ్యవహరించాడు సూహభట్టు. ఈ సూహభట్టు, మ్లేచ్ఛుల ప్రభావంతో, ‘ప్రభుం జాతు దేవభంగార్థమై రయాత్’ – ఇతను, ప్రభువు సికందర్‌ను విగ్రహాలను పగులగొట్టటం వైపు మళ్ళించాడు, ప్రోత్సహించాడు. లేకపోతే, సికందర్ మంచివాడే. స్ఫటికం లాంటి వాడు! దోషమంతా సూహభట్టుదే.

సూహభట్టు ‘బ్రాహ్మక్రియా ద్వేషి’ అని అనటంలో జోనరాజు ఎంతో లోతైన ఆలోచనలు కలిగిస్తాడు. ‘బ్రాహ్మణ ద్వేషం’ అంటే ఒక వర్గంగా బ్రాహ్మణులపై ద్వేషం కాదు. అది బ్రహ్మద్వేషం. ‘బ్రహ్మ’ అన్నది భారతీయ ధర్మం. భారతీయ ధర్మ ద్వేషం సమాన్య పరిభాషలో బ్రాహ్మణ ద్వేషంగా పరిణమిస్తుంది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు భారతీయ ధర్మాన్ని ప్రత్యక్షంగా పాటించేవారు. ధార్మిక అంశాలు మూర్తీభవించినవారు. బ్రాహ్మణులను నాశనం చేస్తే ధర్మాన్ని నాశనం చేసినట్టు భావించటంలో పొరపాటు లేదు. బ్రాహ్మణులను ఒక వర్గంలా భావించనంత కాలం ఇది వర్తిస్తుంది. కానీ భారతీయ ధర్మాన్ని పాటించే వారంతా బ్రాహ్మణులు. వారి వారి స్వభావం, వృత్తిని బట్టి గుర్తింపు కోసం వేర్వేరు పేర్లతో పిలుస్తారు అన్న కోణంలో చూస్తే బ్రాహ్మణ ద్వేషం భారతీయ ద్వేషానికి పర్యాయ పదం అవుతుంది. అందుకే గమనిస్తే, కశ్మీరంలో  భారతీయులు అన్న పదానికి బ్రాహ్మణుడు, పండితుడు అన్న పదాలను పర్యాయ పదాలుగా వాడటం కనిపిస్తుంది. ఆధునిక సమాజంలో కశ్మీరీ పండితుడు అనగానే కశ్మీరీ హిందువు అని స్ఫురిస్తుంది తప్ప ‘బ్రాహ్మణుడు’ అన్న భావన రాదు. కశ్మీరీయులంతా కశ్మీరీ పండితులు. కశ్మీరీ హిందువు అంటే పండితుడు. మనం కశ్మీరీ పండితుడిని బ్రాహ్మణుడు అనుకుంటున్నాం. ఇక్కడ సూహభట్టు ‘బ్రాహ్మక్రియా ద్వేషి’ అన్నాడు జోనరాజు. ‘బ్రాహ్మక్రియా’ అంటే శాస్త్ర విహితమైన కర్మ. శాస్త్రానికి సంబంధించిన కర్మలను ద్వేషించినవాడు సూహభట్టు. అంటే భారతీయులందరినీ ద్వేషించిన వాడన్న మాట. ఎందుకంటే భారతీయులు ‘శాస్త్ర విహితమైన కర్మలు’  చేస్తూ నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటారు. అది వారి ధర్మం. ఆ శాస్త్ర విహితమైన కర్మలను ద్వేషించినవాడు సూహభట్టు. దీనికి కారణం మ్లేచ్ఛుల ప్రభావం.

విహాయ రాజ్య కార్యాణి ప్రజాభాగ్య విపర్యయాత్।
దేవానం ప్రతిమా భంగే రాజారజ్య దుహర్నిశమ్॥
(జోనరాజ రాజతరంగిణి 597)

దేవతలు వదలివెళ్ళటంతొ,  ప్రజల అదృష్టం  కూడా  ప్రజలను వదిలి పెట్టింది. ఎందుకంటే ప్రజలు బ్రాహ్మక్రియలను వదిలి మ్లేచ్ఛ పద్ధతుల మోజులో పడ్డారు. దాంతో ప్రజల భాగ్యం వారిని వదిలి పెట్టింది. అందువల్ల రాజు రాజకార్యాల పట్ల విముఖుడయ్యాడు. రాత్రింబవళ్ళు విగ్రహాలను పగులగొట్టటంలో అత్యంత ఆనందాన్ని అనుభవింటం ఆరంభించాడు.

అంటే కశ్మీరాన్ని దైవం వదిలి వెళ్లాడు. మంత్ర శక్తి వదిలి వెళ్ళింది. ప్రజలు ‘బ్రాహ్మక్రియ’లు వదిలి మ్లేచ్ఛ సంపర్కంతో మ్లేచ్ఛుల్లా మారిపోతున్నారు. దాంతో వారి అదృష్టం వారిని త్యజించింది. ఫలితంగా రాజు దుశ్చర్యల్లో నిమగ్నమయ్యాడు. ‘ప్రజా పుణ్యైః సంభవంతి మహీభుజః’ అన్నాడు కల్హణుడు. ప్రజల అదృష్టం కొద్దీ రాజు లభిస్తాడు. ప్రజలు మ్లేచ్ఛులవుతున్నారు. పాపాత్ములు అవుతున్నారు. కాబట్టి వారి రాజు కూడా రాజ్య కార్యాలు వదిలి మ్లేచ్ఛ కార్యాలపై పడ్డాడు. మ్లేచ్ఛులు, యవనులు మిడుతల దండుల్లాంటి వారు. కశ్మీరులో ధర్మాన్ని నాశనం చేసి కశ్మీరును సంపూర్ణంగా రూపాంతర మొందించి మ్లేచ్ఛమయం చేసినవారు. అలాంటప్పుడు రాజు కూడా మ్లేచ్ఛుడిలానే ప్రవర్తిస్తాడు. అతడు స్ఫటికం లాంటి వాడు. చుట్టూ ఎలాంటి వారుంటే, ఆ రంగులో కనిపిస్తాడు. ప్రజలు ఎలాంటి పాపాత్ములయితే, రాజు అలాంటి పాపక్రియలు చేస్తాడు. ఇందులో రాజు దోషం లేదు.

ఇన్నాళ్ళకి, కశ్మీరీయులు అసలైన ఇస్లాం పాలన రుచి చూస్తున్నారన్న మాట. రించనుడి తరువాత రాజులు ఇస్లామీయులయినా, అధిక సంఖ్యలో ప్రజలు భారతీయులు. కాబట్టి, రాజు ఎంత సంకుచిత భావన ప్రదర్శించాల్సి వచ్చినా, అధిక సంఖ్యాకులకు భయపడుతూ, జాగ్రత్త పడాల్సి వచ్చింది. వారిని రెచ్చగొడితే తమకు ప్రమాదం అన్న భయం, అభద్రతా భావన  సుల్తానులకు ఉండేది. కానీ సికందర్ పాలనా కాలం వచ్చేసరికి ఒక పద్ధతి ప్రకారం కశ్మీరు జనసంఖ్య లెక్కలు మారిపోయాయి. ఇస్లామీయుల సంఖ్య అధికమయింది. భారతీయుల సంఖ్య స్వల్పపై, అల్పమయింది. దాని పర్యవసానంగా ‘సికందర్ బుత్‍షికన్’ అనే భూతం సీసా లోంచి వెలికి వచ్చింది. కశ్మీరాన్ని భారతీయ ధర్మ రహితం చేయాలని కంకణం కట్టుకుంది. దాదాపుగా విజయం సాధించింది.

ప్రజాస్వామ్యంలోనే కాదు, రాచరికంలోనూ సంఖ్యాబలం ప్రాధాన్యాన్ని కశ్మీరు అనుభవించిన మారణహోమం నిరూపిస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here