జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-42

3
9

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పాపినాం పాపమూలోభూద్ భూభృతామనయద్రుమః।
హర్షదేవ తురుష్కూభూద్ యస్య ప్రాగంగ రాయితః॥
(జోనరాజ రాజతరంగిణి 599)

[dropcap]క[/dropcap]శ్మీరు పూర్తిగా ఇస్లామీయుల వశమయింది. ఇస్లామీయుల సంఖ్యాబలం పెరిగింది. రాజు మత ఛాందసుడయ్యాడు. ఇస్లామేతరుడన్న వాడు కశ్మీరులో మిగలకూడదని కంకణం కట్టుకున్నాడు. రాజు ప్రాపకం సంపాదించి, మెప్పు పొందేందుకు అతని చుట్టూ ఉన్న ఇస్లామేతర మంత్రులు కూడా ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన తరువాత తాము కొత్తగా పుచ్చుకున్న మతం పట్ల తమ నిజాయితీని నిరూపించుకుని సుల్తాన్ మెప్పు పొందేందుకు ఒకరిని మించి మరొకరు క్రూరంగా వ్యవహరించారు. ఇస్లామేతరులపై ఘోరమైన అకృత్యాలు నెరపారు. మందిరాలు ధ్వంసం చేశారు. వాటి స్థానే మసీదులు నిర్మించారు. కాఫిర్లను ఏరి వేశారు. వెంటబడి చంపారు. పన్నుల భారం పెంచి అణగదొక్కారు. ఎలాగయినా ఇస్లామేతరులను ఇస్లామీయులుగా మార్చాలని, మారకుంటే హతమార్చాలని కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంలో జోనరాజు తన కథనాన్ని ఆపి, అసలు కశ్మీరులో ఈ విషవృక్షానికి బీజం ఎప్పుడు పడిందో ఆలోచిస్తూ వివరించాడు.

పరిస్థితి దిగజారుతుంది. ఒక స్థాయికి చేరిన తరువాత, అసలీ పరిస్థితి ఇలా దిగజారటానికి కారణాలేమిటని వెనక్కి తిరిగి చూసి విశ్లేషించటం సాధారణంగా జరిగేదే. జోనరాజు అదే చేస్తున్నాడు.

కశ్మీరులో దుష్ట పరిపాలన అన్న విషవృక్షానికి బీజం తురుష్క హర్షుడి కాలం నుంచీ పడింది. కల్హణుడు హర్ష మహారాజును తురుష్క హర్షుడని అన్నాడు. హర్షదేవుడు తురుష్క మహిళ మోజులో పడి, తన ఆస్థానంలో కీలక పదవుల్లో తురుష్కులను నియమించాడు. తురుష్కుల సూచనలను పాటించాడు. దేవాలయాలను కొల్లగొట్టాడు. అప్పటికి కశ్మీరంలో తురుష్కుల సంఖ్య బహు స్వల్పం. అయినా సరే, వారి ప్రభ్వాంలో పడి, తురుష్కుల కన్నా ఘోరంగా ప్రవర్తించాడు హర్షుడు. భవిష్యత్తు దర్శనం చేసినట్టు కల్హణుడు “ఇక పై కశ్మీరం కశ్మీరంలా ఉండదు” అని తీర్మానించాడు. హర్షుడిని ‘తురుష్క హర్షుడ’ని సంబోధించాడు. ఆ తురుష్క హర్షుడు కశ్మీరంలో దుష్పరిపాలన అనే విషబీజాన్ని నాటినవాడు. లావణ్యులు ఆ విషవృక్షానికి ఆకుల వంటి వారు. మ్లేచ్ఛుల రాజు దుల్చా ఆ విషవృక్షానికి పుష్పం వంటి వాడు. మ్లేచ్ఛుల ప్రభావంతో రోజూ విగ్రహలను ధ్వంసం చేసే రాజులు ఆ విషవృక్షానికి ఫలాల  వంటి వారు.

ఈ శ్లోకాలు చదువుతుంటే, జోనరాజు ధైర్యానికి, చతురతకు హర్షధ్వానాలు చేయాలనిపిస్తుంది. ఎంతటి తెగువ, ఎంతటి తెగింపు. సత్యం చెప్పటంలో ఎంతటి నిక్కచ్చితనం అని ఆశ్చర్యపోతాం. అదీ, సుల్తాను తన పొగడ్తల కోసం కొనసాగించమన్న కశ్మీర రాజుల చరిత్ర రాస్తూ, అంతకు ముందరి సుల్తానుల ఆగడాలను ఇంత స్పష్టంగా విమర్శించటం, అలాంటి అకృత్యాలు జరిపిన వారిలో తాను ఏ సుల్తాన్ ఆశ్రయంలో ఉన్నాడో, ఆ సుల్తాన్ తండ్రి కూడా ఒకడన్న సత్యాన్నిగుర్తుంచుకుంటే జోనరాజుకు జోహార్లు అర్పించాలని అనిపిస్తుంది. ఈ జోనరాజ రాజతరంగిణియే లేకపోతే ఆధునిక ‘లౌక్య’ చరిత్రకారుల లౌకిక అలౌకిక సృజనాత్మక తీర్మానల క్రింద పడి ‘నిజం’ నలిగిపోయేది.

“సుల్తానులు మందిరాలను ధ్వంసం చేశారు” అనగానే, “భారతీయ రాజులు కూడా ధ్వంసం చేశారు” అని ఎదురు వాదన ఆరంభించేవారికి సమాధానం జోనరాజ రాజతరంగిణిలో లభిస్తుంది. మ్లేచ్ఛుల ప్రభావంతో విగ్రహాలు ధ్వంసం చేసిన రాజులు, విషవృక్షానికి ఫలాలు. విషవృక్షానికి బీజం తురుష్క హర్షుడు. అతనలా ప్రవర్తించటానికి కారణం తురుష్క ప్రభావం.  విగ్రహాలను ధ్వంసం చేసిన కొందరు భారతీయ రాజుల జాబితాలో జలౌకసుడిని కూడా చేరుస్తారు. జలౌకసుడు గొప్ప శివభక్తుడు. అతడు విగ్రహాలను, దేవాలయాలను ధ్వంసం చేయలేదు. ఆయన ఆరామాలను ధ్వంసం చేశాడు. కానీ ఆ తరువాత బంగారు పూత పూసిన ఆరామాలను నిర్మించి ఇచ్చాడు. కాబట్టి ఆయన ఆరామాలను ధ్వంసం చేయటం వెనుక ధర్మ ద్వేషం కాక, రాజకీయ కారణం ఏదో ఉండి ఉంటుందని భావించవచ్చు. తురుష్క రాజులు మందిరాలను కూలగొట్టి మసీదులు నిర్మించారు తప్ప, మళ్ళీ మందిరాలను నిర్మించలేదు. కాబట్టి జలౌకసుడిని ఈ జాబితాలో చేర్చటం, చరిత్ర రచయితలు తమ వాదనని బలపరుచుకునేందుకు, ఓ సంఖ్యను పెంచుకోవటం కోసం చేసిన ప్రయత్నమే తప్ప, సత్య దూరం అది.

దేవేంద్రమూర్తి భంగేచ్ఛాః యస్సాసీత్ తస్య భూభుజః।
మ్లేచ్ఛ ప్రేరణయా నిత్యం విప్లవః స ఫలాయతః॥
మార్తాండ  విజయేశాన చక్రభృతత్రి పురేశ్వరా।
భగ్నా యనాస్కో కో విఘ్నః శేష భంగేన కద్యతే॥
సురేశ్వరీ వరోహాది ప్రతిమా భంగకర్మణి।
అకంపత భయోవోర్వీ నాస్య సర్వంకషా తు ధీః॥
(జోనరాజ రాజతరంగిణి 600, 601, 602)

సికందర్ బుత్‍షికన్, సూహభట్టులు ధ్వంసం చేసిన మహత్తర విగ్రహాల జాబితాను ఇచ్చాడు జోనరాజు.

మార్తాండ, విజయేశ, ఈశాన చక్రభృత్, త్రిపురేశ్వర విగ్రహాలను ధ్వంసం చేశాడు. ఈ విగ్రహాలను ధ్వంసం చేయటం వల్ల రాజుకు కలిగిన దుష్ట ఫలాల గురించి ఎలా చెప్పాలి? సురేశ్వర, వరాహ విగ్రహాలతో సహా ఇతర విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పుడు భూమి కంపించింది. కాని దౌష్ట్యం నిండిన రాజు మాత్రం ఏ మాత్రం కంపించలేదు. ఏ మాత్రం చలించలేదు.

అతి గొప్ప వర్ణన ఇది. విగ్రహాలు ధ్వంసం అవుతుంటే భూమి కంపించింది. ప్రజల మనస్సులు అల్లకల్లోలమయ్యాయి. కానీ ఆ భూపాలకుడయిన రాజు మాత్రం చలించలేదు. అతని హృదయంలో జాలి, కరుణ, దయలు లేవు.

న పురం పత్తనం నాపిన గ్రామో న చ తద్ధనమ్।
యాత్ర సూహ తురుష్కేణ సురాగా రమశేష్యత॥
(జోనరాజ రాజతరంగిణి 603)

నగరం, పట్టణం, గ్రామాలలోని ఏ విగ్రహం కూడా తురుష్కుడయిన సూహభట్టు బారి నుంచి తప్పించుకోలేక పోయింది. ఒక్క ముక్కలో సర్వం చెప్పేశాడు జోనరాజు. ఇక్కడ జోనరాజు చెప్పకుండా సూచించిన విషయాన్ని మనం గమనించాలి. ‘సూహ తురుష్కేణ’ అన్నాడు జోనరాజు. కల్హణుడు తురుష్క హర్షుడు అన్నట్లు ‘తురుష్క సూహ’ అన్నాడు జోనరాజు. ఇక్కడ జోనరాజు సికందర్ పేరు చెప్పకుండా వదిలాడు. సూహభట్టు సేనాధిపతి మాత్రమే. రాజు అనుమతి లేకుండా ఏమీ చేయలేడు. ‘తురుష్క సూహ’ అనటంలో ‘తురుష్కుడైన సూహుడు’ అన్న భావం వచ్చేస్తుంది. అయితే, రాజు కానీ, సూహభట్టు కానీ మందిరాలను నేలమట్టం చేయటం, విగ్రహాలను ధ్వంసం చేయటంతో సంతృప్తి పడ్డారని ఊహించటం కష్టం. వారి అకృత్యాలకు భూమి సైతం కంపించింది. అలాంటప్పుడు ప్రజలు మౌనంగా ఉండటమో, శాంతంగా జీవించటమో కుదరదు. తమ దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే, ప్రతిఘటన కాకున్నా, కనీసం నిరసన అయినా వ్యక్తం చేయాలి ప్రజలు. ఆ నిరసన చెప్పక పోవటం వల్ల జోనరాజు, ఈ బలవంతపు మతాంతరీకరణను సూచ్యప్రాయంగా ప్రదర్శించినట్టవుతుంది. తర్వాతి శ్లోకాలలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాడు. కానీ మందిరాలను ధ్వంసం చేసే సందర్భంలో మతాంతరీకరణను ప్రస్తావించకపోవటం వల్ల ఆనాడు జరిగిన దారుణ మారణకాండను, అత్యాచారాలను చదువరి ఊహకు వదిలేశాడు జోనరాజు. ఎందుకంటే ఆ విషయం ప్రస్తావిస్తే ఒక బాధ, ప్రస్తావించకపోతే ఒక బాధ. కాబట్టి తరువాతి శ్లోకాలలో అతి సున్నితంగా ప్రస్తావించాడు. కానీ, ఆధునిక చరిత్ర రచయితలు అల్లిన కాల్పనిక కథల డొల్లతనాన్ని స్పష్టం చేశాడు జోనరాజు తెలిసో, తెలియకో.

కశ్మీరులో ప్రజలు స్వచ్ఛందంగా ఇస్లాంను స్వీకరించారని, ఎలాంటి ఒత్తిడి, బలవంతం, బెదిరింపులు, అణచివేతలు, అక్రమాలు లేకుండానే కశ్మీరీ ప్రజలు ఇస్లాం స్వీకరించారని చరిత్ర రచయితలు కొత్త కథను ప్రచారం చేస్తున్నారు. అగ్రవర్ణాల దౌష్ట్యం భరించలేక, అణచివేతలు సహించలేక, కులరహితమై, సర్వజన సమానమైన ఇస్లాంను – తక్కువ కులస్తులంతా రెండు చేతులా ఆహ్వానించి, స్వచ్ఛందంగా స్వీకరించారని ఓ కొత్త కథనాన్ని సృష్టించారు ఆధునిక ఇస్లామీ ప్రచార సమర్థకులు. దళిత బహుజనులంతా తమతో చేతులు కలపాలని, తామంతా అగ్రవర్ణాల దౌష్ట్యానికి గురైన వారం కాబట్టి, ఒకటై, అగ్రవర్ణ దురహంకారాన్ని అంతం చేయాలని ప్రచారం చేస్తున్నారు. ప్రజలను నమ్మిస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో ఈషణ్మాత్రమైనా సత్యం లేదనేందుకు తిరుగులేని ఋజువులు రాజతరంగిణిలోను, కశ్మీరు పర్షియన్ రచయితల రాతల లోనూ కనిపిస్తాయి.

కథా శేషీకృత సర్వగీర్వాణ ప్రతిమా గణే।
వ్యాధి ముక్త ఇవా నందం సూహభట్టో భజత్తతః॥
(జోనరాజ రాజతరంగిణి 604)

ఒకప్పుడున్న విగ్రహాలు ఇప్పుడు లేవు. కేవలం వాటి పేర్లు మాత్రమే మిగిలాయి. ఇలా విగ్రహాలను నామరూపాల్లేకుండా నాశనం చేయటం వల్ల సూహభట్టు – తనకు పట్టిన రోగం నుండి విముక్తడైనవాడు పొందేటి ఆనందం పొందాడు – అని అంటాడు జోనరాజు.

చరిత్రలో పలు సందర్భాలలో మతం మారిన వారు, అసలు  మతంలోని వారికన్నా ఎక్కువ క్రౌర్యాన్ని, ఛాందసాన్ని, దౌష్ట్యాన్ని ప్రదర్శించిన దాఖలాలు కోకొల్లలుగా లభిస్తాయి. మతం మారటంతోటే, తాము గతంలో పాటించిన మతం పట్ల, ఆ మతాన్ని పట్టుకుని వేలాడే వారి దీక్ష పట్ల, నిజాయితీ పట్ల కసి, క్రోధం, ద్వేషాలు తీవ్రమవుతాయి. ఈ తీవ్రత వారి చర్యలలో కనిపిస్తుంది. అందుకే ఈనాటికి కూడా భారతీయ ధర్మాన్ని తీవ్రంగా విమర్శించి, అత్యుత్సాహంగా  హేళన చేసేవారిలో కొత్తమతం పుచ్చుకున్నవారే అధికంగా వుండటం గమనించవచ్చు.

సూహభట్టు బ్రాహ్మణుడు. సుల్తాన్ వద్ద సేనాపతి. ఆరంభంలో బాగానే ఉన్నాడు. సుల్తాను ‘మహమ్మదా’ ప్రభావంలో పడి, ఇస్లాం మత ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అలాంటి పరిస్థితులలో సుల్తాన్ వద్ద ప్రాణాలతో కొనసాగాలంటే సూహభట్టు మతం మారక తప్పదు. మతం మారటంతో సరిపోదు. తాను పుచ్చుకున్న కొత్త మత పద్ధతుల పాలన పట్ల తనకున్న నీతి నిజాయితీలను నిరూపించుకోవాల్సి ఉంటుంది. సూహభట్టు అదే చేశాడు. తాను పుచ్చుకున్న కొత్త మతం ప్రకారం, ఇతర ధర్మానుయాయులు తమ మతం లోకయినా మారాలి, లేక ప్రాణాలు అయినా వదలాలి. తాను పుచ్చుకున్న కొత్త మతం ప్రకారం విగ్రహారాధన కూడదు. కాబట్టి విగ్రహాలను ధ్వంసం చేయాలి. ఇది అతడికి పట్టిన రోగం. విగ్రహాలను ధ్వంసం చేయటం ద్వారా ఆ రోగం నుంచి విముక్తి కలిగిన ఆనందం కలుగుతోంది సూహభట్టుకు. ఇంతకన్నా స్పష్టంగా – సుల్తానుల వద్ద ఉంటూ – భారతీయులకు పడుతున్న కొత్త రోగం, ఆ కొత్త రోగం నుంచి విముక్తి పొందే మార్గాన్ని జోనరాజు సూచించలేడు!

అపథ్యాశీవ బాలః స సామన్తా సహితస్తతః।
జనానాం జాతి విధ్వంసే సూహభట్టః కృతోద్యమః॥
(జోనరాజ రాజతరంగిణి 605)

చాలా ప్రధానమైన శ్లోకం ఇది. ‘అపథ్యాశీవ బాలః’. పథ్యం అంటే ఆరోగ్య హితమైన ఆహారం. ‘అపథ్యం’ అరోగ్యానికి అహితమైనది. అనారోగ్య కారకమైన ఆహారాన్ని స్వీకరించిన బాలుడి లాగా, సూహభట్టు సైనికుల తోడుగా జనుల జాతిని విధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. ‘జనానాం జాతి విధ్వంసే’.

ఈ శ్లోకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు “Suhabhatta tried to destroy the caste of the people” అని అనువదించారు. ‘Caste’  అనగానే ‘కులం’ అన్న అర్థం వస్తుంది. జనులను కులభ్రష్టులను చేయాలని ప్రయత్నించాడు అన్న అర్థం వస్తుంది. దాంతో “Jonaraja used caste to denote religion” అన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు (Walter Slaje). ఈ శ్లోకాన్ని Walter Slaje “Suha Bhatta made every effort to abolish the hereditary classes of society” గా అనువదించాడు.

‘జనానాం జాతి విధ్వంసే’ ని ‘కులభ్రష్టులుగా చేయటం’ అంటే అర్థం మారిపోయింది. ‘సమాజంలో వంశపారంపర్యంగా వచ్చే కులాలను నాశనం చేయాలని ప్రయత్నించాడు’ అనటం తోటే అసలు అర్థం సంపూర్ణంగా శీర్షాసనం వేసింది. జనులను క్రూరంగా, ఘోరంగా హింసిస్తూ, మెడపై కత్తి పెట్టి ‘చస్తావా? మతం మారతావా’ అనే క్రూరుడు,  దుష్టుడి లాంటి తురుష్క సూహభట్టు, ‘వంశపారంపర్యంగా వచ్చే కులవ్యవస్థను నాశనం చేసే’ ఆధునిక అభ్యుదయ సంస్కరణవాది అయిపోయాడు. దీని నుంచి ‘అగ్రవర్ణాల దౌష్ట్యం భరించలేక, ఇస్లాంను రెండు చేతులా స్వీకరించార’న్న తీర్మానం – ఇస్లాం కుల, వర్గ, వర్ణ భేదాలు లేని సమాజాన్ని స్థాపిస్తుందని, దాని పట్ల ఆకర్షితులై ఆత్మగౌరవం కోసం దళిత సమాజం ఇస్లాంను స్వచ్ఛందంగా స్వీకరించారని, చరిత్రను, సమాజాన్ని తప్పుదారి పట్టించే అసత్యం సత్యంగా చలామణీ అయ్యే వీలు కల్పించింది. సమాజంలో విద్వేషాలు సృష్టించి, సమాజాన్ని అగ్రవర్ణాలు, దళితులుగా చీల్చి, పబ్బం గడుపుకునే విధ్వంసపూరిత విష బీజాన్ని వృక్షంగా ఎదిగించే దౌష్ట్యానికి బీజం పడింది. ‘జనానాం జాతి విధ్వంసే’ అని జోనరాజు అన్నాడు. భారతీయ ధర్మం పాటించే వారందరినీ సమూలంగా నాశనం చేసి తమ మతంలో కలుపుకోవాలన్న దౌష్ట్యాన్ని సూచించే వాక్యం ఇది. దాన్ని శీర్షాసనం వేయించి, అసలు అర్థాన్ని మరుగున పడేసి, తాము చూడాలనుకున్న దృష్టికి తగ్గట్టు మార్చి, సమాజం దృష్టిని ప్రభావితం చేయటం స్పష్టంగా కనిపిస్తుంది లౌక్య చరిత్రకారుల లౌకిక అనువాదాలు, విశ్లేషణలలో.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here